[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘స్వధర్మాచరణే కర్తవ్యం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్యయోగం లోని 31వ శ్లోకం ఈ క్రింది విధంగా వుంది.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోధ్యన్యత్క్షత్రియస్య న విద్యతే॥
“ఓ అర్జునా, క్షత్రియ పుట్టుక కలిగిన నువ్వు, ఒక యోధునిగా నీ కర్తవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నీ యొక్క క్షత్రియ స్వ-ధర్మమును అనుసరించి నీవు అన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు” అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్యోపదేశం చేసాడు.
స్వధర్మానికి భిన్నంగా ఉండేది పరధర్మం. దాన్ని ఎంత నిష్ఠతో ఆచరించినా అందులో ఎన్ని సుగుణాలు కనిపించినా ఎంతటి ఆకర్షణ ఉన్నా అది జీవన లక్ష్యాన్ని చేరడానికి సుఖకరం కాలేదు. తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్లుగా భ్రమింపచేయగలదేమో కాని, పరమమైన శ్రేయస్సును పరధర్మం ఇవ్వలేదు అని శాస్త్రం కూడా స్వధర్మం గురించి స్పష్టం చెసింది.
పరాయి ఇంటిలో ఉండవలసి వస్తే ఎవరికయినా ఆశించిన గౌరవం లభించదు. ఎందుకంటే పరాయి పంచన బ్రతకడం ఎంతవారికయినా దుఃఖమయమే, స్వధర్మం కూడా అలాంటిదే. అది మన ఇంటిలాంటిది. పరధర్మం ఇతరుల ఇంటివంటిది అని చాణుక్యుడు తన రాజనీతి శాస్త్రంలో స్పష్టం చేసాడు.
కష్టములకు కృంగిపోక, సుఖములు బడయునపుడు పొంగిపోక, నేను చేయు కర్మలకు నేను నిమ్మిత్త మాత్రుడను, సర్వం భగవదర్పణం అని భావించాలి.
అంతేకాకుండా స్వధార్మచరణ గురించి స్వధర్మంలో సుగుణాలు అంతగా లేకున్నా, పరధర్మంలో సుగుణాలు ఎన్ని ఉన్నా.. చక్కగా అనుష్ఠించే పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. ‘స్వధర్మాచరణలో మరణం సంభవించినా శ్రేయస్కరమే కానీ, పరధర్మం భయావహం’ అని ఉపదేశించాడు భగవానుడు.
అయోధ్యాకాండ తొలి సర్గలో స్వధర్మాచరణ గురించి మరొక మంచి శ్లోకం వుంది.
శ్లో:
కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే।
మన్యతే పరయా కీర్త్యా మత్స్వర్గఫలం తతః॥
శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశమునకు తగిన దయ, శరణాగతరక్షణము మున్నగు ధర్మములను ఆచరించుటలో గొప్ప ఆసక్తి గలవాడు. తమ కులమునకు విధింపబడిన క్షత్రియధర్మమును గౌరవముతో పాలించువాడు మరియు అహర్నిశలూ క్షత్రియా ధర్మాచరణ కోసం పాటుపడేవాడు (స్వధర్మాచరణ). ధర్మానికి, సత్పురుషులకు ఆపద సంభవించినప్పుడు అట్టి ఆపదకు మూలకారకమైన వారిని ఎదిరించి తుద ముట్టించి ధర్మ సంస్థాపన కోసమే కట్టుబడినవాడు శ్రీ రామచంద్రుడు.
సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయినా దానిని బాహ్యంగా ప్రదర్శించుట కంటే తాను పుట్టిన కులమగు ఇక్ష్వాకువంశపు ధర్మము ఆచరించుటయే గొప్ప అని భావించేవాడు. ఆ విధంగా తన ధర్మాన్ని ఆచరించడం వలన ఈ లోకములో కీర్తి ప్రతిష్ఠలు, శరీర పతనానంతరము స్వర్గము లభించునని అతని విశ్వాసము. అందుకే స్వధర్మాచరణనకే ప్రాధాన్యమునిచ్చేవాడు.