Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వీటు షాపులో హత్య

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘స్వీటు షాపులో హత్య’. రచన శ్రీ శేషగిరి పట్నాయక్.]

పోలీసు అధికారులకు అప్పుడప్పుడు గొలుసు కట్టు పరిష్కారాలు దొరుకుతు ఉంటాయి. అంటే ఒక కేసు పరిశోధనలు చేస్తుండగా మరో కేసు దోషి దొరుకుతుంటాడు. ఆ దోషి వలన రెండవ కేసు పరిష్కారం అవుతుంది. ఒక్కోసారి మూసివేయబడిన కేసులు (not found or closed case) కూడా అందులో ఉంటాయి.

అమీరుపేట ఏరియాకు పోలీస్ అధికారిగా రఘునందన బదిలీ మీద వచ్చి సంవత్సరం దాటింది. ఆయన విషయంలో అదే జరిగింది. రఘునందన ధైర్యం, నిజాయితీకి మారుపేరు.

డ్రగ్స్ కేసు ఒకటి చేధిస్తుండగా ఆ కేసులో దొరికిన వారిలో ‘లాలు’ ఒకడు. వయసు ఇరవై అయిదు సంవత్సరాలు. దర్యాప్తులో పోలీసులు మూసివేయబడిన అయిదు సంవత్సరాలు క్రితం స్వీట్ షాపు యజమాని దేవేంద్ర హత్య బయటకు వచ్చింది.

***

దేవి స్వీట్స్, అమీరుపేటలో మంచి పేరున్న షాపు. దేవేంద్ర ఆ షాపు యజమాని. అందరితో కలిసిపోయే వ్యక్తి. మంచితనానికి మారుపేరు. పేదవారి పెళ్లిలకు “డబ్బు లేదు అన్నా!” అంటే స్వీట్స్ ఉచితంగా ఇచ్చే మంచి గుణం ఆయనది.

భార్య పేరు భవాని. షాపుకు అయిదు కిలోమీటర్ల దూరంలో వారి ఇళ్లు. అబ్బాయి అమెరికాలో సాప్ట్‌వేర్ ఉద్యోగి. దేవేంద్రకు భార్య భవాని అంటే చాలా ఇష్టం.

ఈ మధ్య దేవేంద్ర అనసూయ వలలో పడ్డాడు. ఇప్పుడు దేవేంద్ర వయసు అరవై. ఈ వయసులో రెండవ భార్య అవసరము ఏమి వచ్చిందో తెలీదు. అందరూ ఆమె మందు పెట్టేసింది అంటుంటారు.

అనసూయ భర్త చనిపోయి ఓ రెండు సంవత్సరాలు దాటింది. భర్త చనిపోయిన సంవత్సరం తిరగక ముందే వాళ్ళ పాపకు పెళ్లి చేసి మంచిర్యాల పంపేసింది.

తను ఒక్కతే ఉండటం, స్వీటు షాపుకు తరుచు రావటంతో దేవేంద్రతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

అమీరుపేట షాపు రెండు కోట్లు విలువ చేస్తుంది. దేవేంద్ర కొడుకు అమెరికాలో బాగానే స్థిరపడ్డాడు ఆస్తిపరుడు.

ఈ మధ్య అనసూయ విషయం ఆ నోట ఈ నోట భవానికి తెలిసి నిలదీసింది. “ఇన్నాళ్లు జీవితంలో ఏమి తక్కువ చేసాను? ఎందుకు తప్పు త్రోవ?” అని ఏడ్చింది .

దేవేంద్ర దగ్గర జవాబు లేదు. నిజమే భవాని అంటే తనకి ప్రాణం, భవానికి కూడా తను అంటే ఇష్టం. ఇప్పటికి సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు.

అదీకాక భవాని వచ్చిన తరవాత తనకి కలిసి వచ్చింది. ఈ వయసులో భార్య కాకుండా వేరే సెట్ అప్ అని గుసగుసలు, ఆలోచిస్తుంటే సిగ్గుగా ఉంది దేవేంద్రకు. కాని ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. మనసు అనసూయ వైపు ఎక్కువ లాగుతుంది.

భవాని అన్నట్లు అనసూయ కంటే భార్య అందంగా ఉంటుంది. పొడవు తగ్గ లావు, లావుకి తగ్గ సొగసు. ఇన్నాళ్లు అందంగా ఉన్న భవానిని కాదని అనసూయ వైపు ఎందుకు మనసు వెళ్ళింది? అంటే జవాబు లేదు.

అనసూయ నాలుగున్నర అడుగులు ఎత్తు, సన్నగా ఉంటుంది. మాటకారి గలగల మాటలాడుతుంది.

ఒకరోజు కస్టమర్‌గా వచ్చి జిలేబి కేజి తీసుకువెళ్ళింది. “సేఠ్ గారు! మీ లాగే జిలేబిలు కూడ తియ్యగా ఉన్నాయి” అంది.

మొదటిసారి అనసూయ అంత చనువుగా మాట్లాడేసరికి నవ్వి ఊరుకున్నాడు దేవేంద్ర.

రెండవసారి షాపుకు వచ్చినప్పుడు “రెండెకరాల పొలం అమ్ముతున్నాను తీసుకుంటారా?” అని అడిగింది. “ఎక్కడ?” అని అడిగితే “కామారెడ్డిలో” అంది.

“అక్కడ నాకేం పని నేను హైదరాబాద్‌లో ఉంటే” అన్నాడు.

“రియల్ ఎస్టేట్ ఎక్కడైన ఒక్కటే. అమెరికాలో అబ్బాయిలు అమీరుపేటలో ఫ్లాట్ తీసుకుంటున్నారు కదా, మీకైతే సగం రేట్‌కు ఇస్తాలెండి” అంది.

“నాకు స్పెషల్ ఏంటి?” అడిగాడు తను.

“మీరు నా బావగారు” అంటు గల గల నవ్వింది.

మొదట్లో ఆ అతి చనువు నచ్చకపోయినా భర్త చనిపోయిన ఒంటరి ఆడది అని జాలిపడ్డాడు. భర్త చనిపోయిన ఇన్నాళ్లు ఒంటరిగా ఉంది. మంచి కేరక్టర్. ఎవరితో చెడ్డగా బిహేవ్ చేయలేదు. అందరు “మంచి ఆవిడ, పాపం భర్త పోయారు” అనటం తన దృష్టిలో పడింది.

“ఈ వయసులో నేను ఎందుకు కావలసి వచ్చాను?” అని అడిగాడు దేవేంద్ర.

“నాకు చిన్నప్పుటి నుండి స్వీట్స్ అంటే ఇష్టం. మీకు ఫ్రెండ్ అయితే స్వీట్స్ ఫ్రీగా దొరుకుతాయి” అని నవ్వింది.

అనసూయ ఒంటరి అని కాసింత జాలి పడ్డాడు. తర్వాత ప్రేమగా మారింది. ఆ తరువాత దేవేంద్ర సొంత ఇంటికి వెళ్లటం తగ్గించేసాడు. ఇప్పుడు పూర్తిగా ఇల్లు మరచిపోయాడు.

అనసూయకు దేవేంద్ర ప్రపంచం, దేవేంద్రకు అనసూయ ప్రపంచం అయిపోయింది.

అనసూయ ఈ మధ్య షాపులో కూర్చోవటం మొదలు పెట్టింది, కాదని గట్టిగా చెప్పలేకపోతున్నాడు దేవేంద్ర.

స్వీటు షాపులో దేవేంద్రతో పాటు లడ్డులు చేసే లాలు అనే ఇరవై సంవత్సరాల యువకుడు, వాడికి తోడుగా లక్ష్మి వుంటారు. వారితో పాటు పకోడీ చేసే పానకాలు రెండు రోజులకు ఒకసారి వస్తుంది.

అనసూయ వచ్చిన నుండి భవాని రావటం తగ్గించేసింది. తగ్గించటం ఏమిటి? అసలు పూర్తిగా రావటమే లేదు.

ఆ రోజు ఉదయం స్వీట్స్ షాపును రోజు లాగే లాలు తలుపులు తెరిచాడు, తీస్తూ కెవ్వున అరిచాడు. వెంటనే దేవేంద్ర ఇంటికి పరుగెత్తాడు. దేవేంద్ర షాపులో చనిపోయి ఉన్నారని చెప్పగానే అందరూ పరుగున వచ్చారు. అందరు దేవేంద్రను చూసి ఘోల్లు మన్నారు.

అమెరికా నుండి రెండు రోజుల క్రితమే వచ్చాడు దేవేంద్ర వాళ్ల అబ్బాయి అరుణ్. షాపులో పనిచేసే లాలును ఇంటికి పిల్చాడు.

“ఎన్నాళ్ళు నుండి నాన్నగారి దగ్గర పని చేస్తున్నావు?” అని అడిగాడు.

“రెండు ఏళ్ళు గా” చెప్పాడు లాలు.

“షాపులో ఏమి చేస్తుంటావు?” అడిగాడు.

“లడ్డూ చేస్తూ ఉంటాను, షాపు తాళాలు కూడా నా దగ్గరే ఉంటాయి. సేఠ్ దగ్గర ఒక సెట్ ఉంటుంది. ఆ రోజు అనసూయ అమ్మగారు వచ్చారు అని, సేఠ్ నన్ను పంపించేశారు” చెప్పాడు లాలూ.

“విషయం ఇక్కడితో వదిలేద్దాం, పోలీసు వరకు వెళ్ల నివ్వవద్దు. గుండెపాటుతో నాన్నగారు చనిపోయారు అని చెప్దాము” అన్నాడు అరుణ్.

పోలీసు గొడవలు లేకుండా దేవేంద్రను దహనం చేశారు.

ఇది జరిగిన ఆరు నెలలకు పోలీసు స్టేషనుకు ఒక సందేశం వచ్చింది. దేవి స్వీటు షాపు యజమానిది హత్య అని ఆకాశరామన్న ఉత్తరం. దానితో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ కేసులో అనసూయా? అరుణ్? ఎవరు దోషులు అనేది కనిపెట్టాలి అని అప్పటి పోలీసు అధికారి అద్విత్ ప్రయత్నించాడు.

అరుణ్ అమెరికా నుండి వచ్చి, నాన్న అనసూయ వలలో పడ్డారని బాధతో నాన్న వ్యవహారం నచ్చక తండ్రిని చంపి ఉండాలి.

రెండవ ఆప్షన్ అనసూయ, దేవేంద్రను ఏదైన గొడవలో లేదా డబ్బు కోసం చంపి ఉండాలి.

ఇలాంటి క్రైంలో భవాని పాత్ర కూడ కొట్టి పారేయలేము. చివరిగా తల్లీ కొడుకుల పాత్ర కూడా ఆలోచించాలి.

అనసూయ మాయమైంది. లక్ష్మి షాపుకు రావడం మానేసింది.

అనసూయ కామారెడ్డిలో ఉంది అని తెలిసి కామారెడ్డి చేరాడు పోలీసు అధికారి అద్విత్. చుట్టూ పక్కల వీధిలో చాలా రోజులు ప్రశ్నించాడు. అనసూయ విషయాలు తెలిసాయి. అనసూయలో మునుపటి హుషారు లేదు. భయం భయంగా బ్రతుకుతుంది. భయము తప్ప అనుమానించాల్సిన విషయం ఏమి లేదు అని అర్థమయింది. తిరిగి అమీరుపేట చేరుకున్నాడు.

లక్ష్మి కోసం వెతికాడు పోలీసు అధికారి అద్విత్. దేవేంద్ర చనిపోవటంతో భయపడి రావడం లేదు తప్ప అనుమానించాల్సింది ఏమి లేదు అని తెలిసింది.

లాలు యువకుడు షాపుకి నమ్మిన బంటు. అందుకే దేవేంద్ర షాపు తాళాలు కూడా వాడికే ఇచ్చేవారు అని అర్థమయింది.

ఇక భార్య భవాని. హత్య జరిగిన రెండు నెలల వరకు స్వీట్ షాపు తీయలేదు. తర్వాత షాపు తెరిచారు. అప్పటినుండి రోజూ భవాని షాపులో కూర్చుండేది. అద్విత్‌తో ఆమె ఎవరి మీద అనుమానం లేదని కేవలం గుండెపోటుతో మరణించాడని చెప్పింది.

దేవేంద్ర కొడుకు అరుణ్ ఫోనులోనే “ఎవరి మీద అనుమానం లేదని, మిమ్మల్ని తప్పు త్రోవ పట్టించేందుకు ఆకతాయిలు హత్య అని ఫోన్ చేసి ఉండవచ్చు” అని చెప్పాడు.

ఎవరి పైన అనుమానం లేదు, పైగా ఎవరు కేసు ఫైల్ చేయలేదు అని కేసు మూసివేశాడు పోలీసు అధికారి అద్విత్.

***

రఘునందన ఇన్వెస్టిగేషనులో అసలు విషయం అయిదు సంవత్సరాలు తరువాత తెలిసింది.

లాలు షాపు నుండి రోజూ బయటకి వచ్చేటపుడు డబ్బులు ఇచ్చేవాడు దేవేంద్ర.

లాలు ఖాళీ సమయంలో ఎదురుగ ఉన్న షాపులో టీవీ చూడటం కోసం వెళ్లేవాడు.ఆ షాపు వాళ్లు ఖాళీ సమయంలో క్రికెట్ చూస్తుంటారు. అలా చూస్తూ బెట్టింగ్ చేస్తుంటారు. లాలు కూడ క్రమేణా బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు.

మొదట్లో ఇండియా మేచ్ గెలిస్తే ఏబై రూపాయలు మాత్రమే పందెం కాసేవాడు. ఆరు నెలలు తిరిగేసరికి ఏబై వేలు పందెం కట్టడం మొదలు పెట్టాడు.

మొదట్లో ఇండియా గెలుపు కోసం పందెం కట్టేవాడు, క్రమేనా దేశంతో సంబంధం లేకుండా జింబాబ్వే, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లకు కూడ పందెం కట్టడం మొదలు పెట్టాడు.

ఈ మధ్య గెలుపు కోసం కాకుండ బాల్‌కు పందెం, సిక్స్ లేదా ఫోర్ లేదా సింగిల్ లేదా వికెట్‌కు పందెం కట్టడం చేస్తున్నాడు.

ఇలా లక్ష వరకు గెలిచి రెండు లక్షలు వరకు పోగొట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ పేరు మంగమ్మ. ఆవిడ మంగళసూత్రం దొంగిలించి మార్వాడి షాపులో అమ్మేశాడు.

దేవేంద్రకు విషయం తెలిసి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. క్రమేనా ఈ విషయములో లాలుకు దేవేంద్రకు గొడవలు పెరిగాయి. లాలును పని నుండి తీసేద్దామని అనుకున్నాడు దేవేంద్ర.

ఒకరోజు “ఏబై వేలు కావాలి” అన్నాడు లాలూ.

“కుదరదు” అన్నాడు దేవేంద్ర. ఇద్దరు గొడవ పడ్డారు. దేవేంద్ర పీక నొక్కేసాడు లాలూ.

ఈ హత్య తనే చేసినట్టు డౌట్ రాకుండా, దేవేంద్ర ఇంటికి వెళ్ల్లి అనసూయ మీద ఎక్కువ డౌట్ క్రియేట్ చేశాడు. పైగా అరుణ్ కేసు పెట్టవద్దు అనటంతో తనను గుర్తించలేదు అనుకున్నాడు. ఒకవేళ కేసు పెట్టినా, అనసూయ లేదంటే అరుణ్ మీద పడుతుందని భావించాడు.

ఇదే క్రమంలో డ్రగ్ ఏజెంట్ క్రిష్ పరిచయం అయ్యాడు. వాడితో డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసు అధికారి రఘునందనకు చిక్కాడు లాలు.

Exit mobile version