Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్వేత వర్ణం

మనిషిప్పుడు నాతో వుండటం లేదు
ఎంత కాలం ఉదయాస్తమయాలై రాలిపోయినయో ఎరుక పడటం లేదు
నా తప్పుల కుప్ప లేమిటో ఆ మనిషి
చెరిగి పొయ్యలేదు
ఆ మనిషి నేరాల చిట్టాలను నేనేమీ చిత్ర గుప్తుడనై పేర్చలేదు
గొడవల గోడలు కట్టలేదు
ఎవరి చెంపలూ పగల్లేదు

సున్నితమైందేదో జారిపడిందేమో

ఆ మనిషట్లా వెళ్లిపోయే
ఏదో ఒక్కటి ఇక్కడే వొదిలేసినట్లు

ఆకాశం లాంటి నా మనసేదో ఇరుకైందేమో
నా మంచి మాటలు విషప్పురుగులై
కుట్టి పెట్టినవేమో
నా చల్లని నీడ పుట్టల మేడలా
భయం పుట్టించిందేమో

సమయాలనేకం అసూయపడేలాగ బ్రతికిన ముద్రలున్నయి
ఏ చెడుగాలి కూడా వీళ్ల సందులోంచి
వెళ్ల లేదన్నరంతా

అద్దంలో ముఖాన్ని ముద్దు చేసుకోవాలనిపించడం లేదు
తలుపు దగ్గర కుక్కపిల్ల పిలిచినా
పలకబుద్ది కావడం లేదు
ఆకలెక్కడికి వలస పోయిందో కబర్, పత్తా లేదు

ఎప్పట్లానే
ప్రపంచం దిక్కులేమీ తలకిందులు కాలేదు
సూర్యుడు చంద్రుడిగా
చంద్రుడు సూర్యుడిగా
పెనుమార్పులేమీ సంభవించలేదు
మనుషులు భూపటలం మీద ఉత్తుంగ తరంగాలై పయనిస్తున్నరు

నేను కోరుకున్న ప్రకృతి చిత్రం కూడా అదే

ఓ కొత్తటి దినాన కోయిల కూసింది
తెల్లవారితే వసంతం వస్తున్నదని
చిరుగాలేమో శ్వాసకు మల్లెపువ్వు నద్ది
పోయిందింతలో

నా మొబైల్ కీబోర్డు మీటలు
కొట్టుకుంటున్నయి గుండెల్లో

ఆ మనిషి వస్తున్నట్లు
ఎప్పటి, మునుపటి మనిషే అన్నట్లు

Exit mobile version