[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘తగవులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
తరువుల పెనుగులాటలు
అరణ్యాన్ని దహించే నిప్పుకూ,
జనుల జగడాలు
సంఘ శాంతిని హరించే ముప్పుకూ
కారణాలుగా మారి
కారకులనూ కష్టపరచడం తథ్యం!
ద్వేషాల ఆవేశాలతో రగిలే రాజ్యాలు
యుద్దాగ్నికి ఆజ్యాలుగా మారి
ఒకరినొకరు నష్టపరచడం యథార్థం!
రెండు పిట్టల పీకులాటలు పిల్లికీ,
రెండు దేశాల తగవు మరో దేశానికీ
మేలును కూర్చే ఘటనలు కావడం వాస్తవం!
కొన్ని పోరులు
ఉన్నతికి ఉచిత దారులు కావడం నిజం!
పట్టు వీడని ప్రయత్నాలకూ,
మనోబలాన్ని పరీక్షించే
పరాజయాలకూ మధ్యన
మాటి మాటికీ సాగే రణాలు
విజయానికి విలువైన కారణాలు!
ఘనా ఘనముల నడుమ ఘటిల్లే
రచ్చల రాపిడుల చేత
వసుధకు పచ్చందనాల కైసేత
సమకూరడం సత్యం!
అనేక సదాలోచనల
వాదులాటాల ఒరయిక వెంబడి
చక్కని నిర్ణయం వెల్లడి!
ఇది సూనృతం!
మతవాద వర్గాల కక్షలూ,
కులవాద కూటముల విద్వేషాలూ
సహనాన్ని కోల్పోయి
సదా ఘర్షించుకుంటూ
కలహాలకు కాల్దువ్వుతున్నట్లు
పాతాళంలోని నేల పలకలూ
నిగ్రహాన్ని కోల్పడి
నిత్యం జగడించుకుంటే
క్షితి గతి అస్తవ్యస్తం!
ప్రాణి జగతి ధ్వస్తం!
ఇది తథ్యం!
