Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-37

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

యశోదై ఇళం సింగమ్-2

అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే।

భక్తవాత్సల్య నిధయే నిత్యభోగాయ మఙ్గళమ్॥

చిత్తదృఙ్గ్మోహనాఙ్గాయ శ్రీమతే నన్దసూనవే।

రుక్మిణీ సత్యభామాభ్యాం నిత్యయుక్తాయ మఙ్గళమ్॥

జీవాతవే త్రిజగతాం దివ్యఙ్ఞాన ప్రదాయినే।

కృపాంబునిధయే నిత్యం గీతాచార్యాయ మఙ్గళమ్॥

(శ్రీ కాఞ్చీ ప్రతివాదిభయఙ్కర అణ్ణాన్ స్వామిభిరనుగృహీత శ్రీకృష్ణ మఙ్గళాశాసనమ్ – 1, 2, 9)

ఇక పరాశర భట్టర్ ఇచ్చిన వివరణలు చూద్దాము.

అనాదినిధనః

న విద్యేతే ఆదినిధనే అస్యేతి అనాదినిధనః – నిత్య యౌవనవంతుడగుటచే ఉత్పత్తి (పుట్టుక), జర (ముసలితనం) మొదలైన దోషాలు లేక నిత్యమూ ప్రకాశించే దివ్యమంగళ విగ్రహము (శరీరము) కలవాడు.

ఆయన పుట్టుకే మహిమాన్వితమైనది. శంఖచక్ర గదాపద్మములతో దేవకీదేవికి జన్మించాడు. ఆ దివ్యదేహుడే పసిబాలునిగా మారి వ్రేపల్లెకు తరలింపబడ్డాడు. ఆయన వయస్సు యౌవనంలో ఆగిపోయిందా అనే విధంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధ సమయంలోను, ఇప్పుడు భీష్మాచార్యులు ప్రకటిస్తున్న శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం విని ఆమోదిస్తున్నప్పుడు.. ఆయన యౌవనవంతుడే. వయసు జాడలు కనపడవు. ఆ శరీరానికి జరామరణములు ఉండవు.

అందుకే ఆయన అనాదినిధనుడు అని భట్టర్ గారు సెలవిచ్చారు.

దీనిని కొంతమంది భగవదాత్మ (పరమాత్మ) స్వరూపమునకు అని అనుకుంటారు కానీ, ఇక్కడ దేహ విషైకంగానే చూడాలి అని శాస్త్ర వచనం.

భారూపస్సత్యసఙ్కల్పః – ఛాందోగ్యోపనిషత్ 3.14.2 – కాంతి రూపుడై సత్య సంకల్పుడై

హిరణ్మయః పురుషః – అనేక ఉపనిషత్ లు – స్వర్ణమయమైన పురుషుడు

విద్యుతః పురుషాదధి – తైత్తిరీయ నారాయణ ఉపనిషత్ (6.1.8) – మెరుపు వంటి పురుషుని మీద

ఆదిత్యవర్ఞస్తమసః పరస్తాత్ – పురుషసూక్తము 20వ ఋక్కు – తమస్సునకు ఆవల సూర్యవర్ణుడై ప్రకాశించువాడు

సర్వకర్మా సర్వగన్ధః సర్వరసః – ఛాన్దోగ్యోపనిషత్ 3.14.2 – అన్ని కర్మలూ ఆయనే (సమస్త కర్మస్వరూపుడు), సమస్త గంధ స్వరూపుడు, సమస్త రస స్వరూపుడూ ఆయనే.

పురుషః పణ్డరీకాభః – వరాహ పురాణమ్ – తామరను బోలిన కాంతిగలవాడు

ఇలాంటి శృతి, స్మృతుల చేత భగవంతుడు ఆయనకు సహజమైన సౌందర్య యౌవ్వన గుణాలు కలిగి ఉండటం వల్ల తానే కోరి పరిగ్రహించిన నిత్యమైన రూపమున్నట్లు తేటతెల్లమౌతోంది.

విష్ణు పురాణం 1.2.1 చెప్పిన విధంగా సదైకరూప రూపాయ – ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే శరీరం కలవాడు. అంటే నిత్యయౌవనుడు.

శ్రీవత్సవక్షాః నిత్యశ్రీః – శ్రీవత్సమనే మచ్చ వక్షమునందు కలిగి, వక్షస్థలమునందు నిత్యము లక్ష్మిని కలిగి ఉండేవాడు.

న ఏవ భగవాన్ కాలః సర్వమాత్మవశం నయేత్ – కాల స్వరూపుడైన ఆ భగవానుడే సర్వమునూ తన వశముగావించును.

నాస్తివిష్ణోః పరంతత్వం తస్య కాలాత్పరా తనుః – విష్ణువును మించిన పరతత్వం లేదు. వాని శరీరము కాలాతీతము.

ఏ రకంగా చూసినా భగవానుడు శరీరము కలిగిన వాడుగా కూడా ఉంటాడు అని ఋజువవుచున్నది. త్రిగుణాలకు అతీతుడై ఉండటం వలన, జన్మాది దోషములు లేకుండుట వలన, ఆ పరాత్పరుడు నిత్యమూ ఒకే విధమైన దివ్య విగ్రహము కలిగి ఉండి, ఆ విధంగా ఉపాసించువారికి అట్లే దర్శనమిచ్చును.

న భూతసంఘసంస్థానః దేహోఽన్య పరమాత్మనః । న తస్య ప్రాకృతా మూర్తిః మాంసమేదోఽస్థి సంభవా। – ఈ పరమాత్మకు దేహము ఉండును అని విదితమైనది కదా. ఆ దేహము పాంచభౌతిక దేహము కాదు. అంటే మాంసాదులచే ఏర్పడిన ప్రాకృత దేహము కాదు. ఈ విషయం స్పష్టం చేసుకోవాలి.

ఆఞ్జపైన విశ్వసృజోరూపం – జగత్కర్తకు రూపముండుట ఉచితమే.

ఆ పరమాత్మ తన అత్యున్నత సృష్టిగా మానవులను సృష్టింపజేశాడు. అందుకే మానవజన్మ దుర్లభము అని అంటారు. ఈ మానవుల దేహమునకు నమూనాలుగా ఆ పరమాత్మ సాకార రూపమున ప్రకటించిన రూపాదులను పోలి ఉండే విధంగా ఆ బ్రహ్మ గారు సృష్టించారు.

సూర్యమండలాంతర్వర్తిగా ఉండే పరమాత్మ (అంటే కాంతి రూపంలో ఉండే పరమాత్మ అని భావము) నిత్య శరీరము కూడా కలిగి ఉంటాడు.

ఇదంతా స్పష్టంగా

E = mC^2 అనే శక్తి నిత్యత్వ సూత్రం కు సరిపోలుతున్నది.

కాంతి రూపంలో ఉండే భగవచ్ఛక్తి సాకారముగా ఉండినపుడు విగ్రహమును చూపుతుంది. ఆ విగ్రహమే కాంతిగానూ మారుతుంది.

కనుక అవతారాల సమయంలో కూడా భగవచ్ఛరీరాలకు ఆద్యంతములు ఉండవు. లోకములో తెర నుండి వచ్చునట్లు ఆ పరమపదము నుంచీ వచ్చి పోతుంటాడు.

భుజైశ్చతుర్భిః సహితం మమేదం రూపం విశిష్టం దవి సంస్థితంచ।

భూమౌగతం పూజయతా ప్రమేయం సదాపి తస్మిన్ నివసాహి దేవాః॥

చతుర్భుజాలతో కూడిన నా దేహం విలక్షణమై స్వస్థలములో ఉండి ఇప్పుడు భూలోకమున అవాఙ్మనస గోచరమై ప్రకాశించును. ఓ దేవతలారా, నేను అలాంటి దేహమునే నివశించును.

సకల కారణ కారణమ్ అని కీర్తింపబడే శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదులకు కూడా విలక్షణమైన దేహమును కలిగి ఉండును.

దీనికి సంబంధించిన అద్భుతమైన వివరణ మనకు శ్రీ రామాయణములో దొరుకుతుంది. ఆ వివరము చూసి తరువాత నామమునకు వెళదాము.

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి మూర్చపోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. తరువాత తరువాత ఇలా అన్నాడు.

“నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేతా సంహరింపబడనివాడు, ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు? అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను,” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు.

ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపబోయేలోపల మహాపార్శ్వుడు అక్కడికి వచ్చాడు.

అతనిని చూసి ఏమిటన్నట్లు కనుబొమలు ఎగరేస్తాడు రావణుడు.

అప్పుడు అతను ఇలా అన్నాడు. “ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా దశగ్రీవా! నీకు పౌరుష ప్రతాపాలు ఉంటే యుద్ధం చేసి రాముడిని చంపు. అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం? అసలే సీత భర్త లేని సమయం చూసి దొంగతనంగా తెచ్చావన్న అపకీర్తి ఉండనే ఉన్నది నీ వీరత్వానికి మచ్చగా,” అన్నాడు.

అప్పుడు అహం దెబ్బతిన్న రావణుడు “రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను.” అలా అని అంతఃపురానికి వెళ్ళిపోయాడు.

మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు.

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని వానర ఱేడు సుగ్రీవుడు సంహరించాడు. మహాపాశ్వుడిని అంగదుడు చంపాడు.

అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా (వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని కొన్ని లెక్కలేనంత మంది రాక్షసులని వధించాడు.

‘తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఈ విభీషణుడు,’ అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో అతని చేతిని కొట్టాడు.

ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడిని లేపే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. అంతట ఆంజనేయుడు లక్ష్మణుడిని ఎత్తుకుని రాముని వద్దకు తీసుకు వెళ్ళాడు.

అప్పుడు రాముడన్నాడు “నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు “ అని బాధపడ్డాడు.

దేశేదేశే కళత్రాణి దేశేదేశే చ బాంధవాః।

తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః॥

అప్పుడు హనుమంతుడు ఓషధ పర్వతాన్ని తేవటం, సుషేణుడు ఆ ఓషధులను లక్ష్మణుడి ముక్కులో పిండటం, ఆ ఓషధుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళీ పైకి లేవటం జరిగాయి.

నిజానికి ఆ సమయంలో శక్తి వల్ల లక్ష్మణుడు మరణించకుండా ఉండటానికి కారణం (ఔషధాలు రావటానికి మునుపు) తాను విష్ణువు అంశను అని కాసేపు తమ మనసులో ఎఱిగి ఉండటం. ఆ కొంత కాలం వరకే. అందువల్ల ఆ శక్తి ప్రభావం లక్ష్మణుడి మీద వేగంగా ప్రభావం చూపలేకపోయింది. ఆ దేహము నిత్య దేహము. ఆ నిత్యత్వాన్ని ఇచ్చింది మటుకూ తాను కాస్త విష్ణ్వంశ అన్న ఎఱుకయే.

(సశేషం)

Exit mobile version