Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-41

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

భక్త వాత్సల్య నిధయే

విష్ణుం భాస్వత్కిరీటాంగదవలయగణాకల్పహారోదరాంఘ్రి-

శ్రోణీభూషం సువక్షోమణిమకరమహాకుండలం మండితాంసం

హస్తోద్యచ్చక్రశంఖాంబుజగదలమలం పీతకౌశయవాసో

విద్యుద్భాసం సముద్యద్దినకరసదృశం పద్మహస్తం నమామి

(శ్రీనారద పాఞ్చరాత్రాంన్తర్గత విష్ణు సహస్రనామ స్తోత్ర – ధ్యాన శ్లోకం)

అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః।

విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః॥

  1. అప్రమేయః — ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు. కొలతలకందనివాడు. సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.
  2. హృషీకేశః — ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి. సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు – భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.
  3. పద్మనాభః — నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు – భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.
  4. అమరప్రభుః — అమరులైన దేవతలకు ప్రభువు
  5. విశ్వకర్మా — విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు – భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్థ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుడు సృష్టిరచన సాగించెను. కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. “సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు గలను/లేను” అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.
  6. మనుః — మననము చేయు మహిమాన్వితుడు. సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.
  7. త్వష్టా — శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు. బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.
  8. స్థవిష్ఠః — బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి. సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వమూర్తి.
  9. స్థవిరః — సనాతనుడు. సదా ఉండెడివాడు.
  10. ధ్రువః — కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు.

మేల్పత్తూర్ నారాయణ భట్టాతిరి ద్వారా మనకు అందిన శ్రీమన్నారాయణీయమ్ అత్యంత వైభవోపేతమైన భాగవత గ్రంథం. ఒక్కొక్కదానిలో 10-12 లేదా 13 శ్లోకాలు ఉండేలా నూరు అధ్యాయాలలో ఆయన శ్రీమహావిష్ణువు వైభవాన్ని వర్ణిస్తూ ఆ గ్రంథాన్ని రచించారు. దానిని ఎందుకు, ఏ పరిస్థితులలో రాసారు అన్నది జగత్ప్రసిద్ధమైన విషయం.

శ్రీమన్నారాయణీయాన్ని చదివిన వారికి, పారాయణ చేసిన వారికి వ్యాధులు తగ్గి ఆరోగ్యం మెరుగు పడటం అన్నది కూడా చాలామందికి తెలిసిన విషయమే. ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని వృద్ధులైన వారు నిష్టతో భక్తిగా మననం చేసుకుటుంటే వృద్ధాప్యపు బాధలు తగ్గి చివరి వరకూ కాలు చేయి ఆడుతుందనేది భవదీయుడు ప్రత్యక్షంగా చూశాడు.

అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే

త్వమిత్థముత్థాపిత పద్మయోనిః।

అనంతభూమా మమ రోగరాశిం

నిరుంధి వాతాలయవాస! విష్ణో!॥

పరమాత్మా! గురువాయూరుపుర నివాసా! విష్ణుమూర్తి! ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకోసం బ్రహ్మదేవుడిని ఆవిర్భవింపజేసావు. అటువంటి అనంతమైన మహిమలున్న దేవా! దయతో నా రోగములు అన్నింటిని పోగొట్టుము.

యువకులు ఈ శ్లోకాన్ని చదివితే అకాల మృత్యువు రాదని, వయసులో రాకూడని అనారోగ్యాలు దరిచేరవని కూడా చెప్తారు.

అంత గొప్ప మహిమ కలిగిన ఈ భాగవత రచనను చేసిన నారాయణ భట్టాతిరి ఆయన సమకాలికుడైన పూన్తనం నంబూతిరి రచన జ్ఞానప్పనను తిరస్కరించి హేళన చేస్తాడు. దానికి ఒక యువకుని రూపంలో వచ్చిన గురువాయూరప్పన్ నారాయణ భట్టాతిరికి అతని నారాయణీయమ్‌లో లోపాలున్నాయని చెప్పి కనువిప్పు చేస్తాడు. ఆ తరువాత నారాయణ భట్టాతిరి పూన్తనం ను ఆదరిస్తాడు. కానీ కాస్త అహంకారం ఆయనలో మిగిలి ఉంటుంది.

అది ఒకరోజు పూన్తనం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్నప్పుడు బయట పడుతుంది.

పూన్తనం నంబూతిరి ఒకరోజు శ్రీవిష్ణు సహస్రనామం చదువుతుంటాడు గురువాయూరప్పన్ ముందు కూర్చుని. ఆ సందర్భంలో నారాయణ భట్టాతిరి కూడా ఆ దగ్గరలోనే ఉంటాడు.

అప్రమేయో హృషీకేశః పద్మనాభోஉమరప్రభుః।

విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః॥

ఈ పైన ఇచ్చిన శ్లోకం దగ్గరకు వచ్చేసరికి పూన్తనం అకార లోపాన్ని సూచించే సంజ్ఞను విస్మరించి పద్మనాభో మరప్రభుః అని చదువుతాడు.

అప్పుడే ఆలయ ప్రవేశం చేస్తూ అది గమనించిన నారాయణ భట్టాతిరి నవ్వాడు.

ఈసారి ఆలస్యం కాలేదు. గురవాయూరప్పన్ స్వయంగా వచ్చాడు.

సౌమ్యమైన స్వరంలోనే.. “నీకు అర్థమే అయింది నారాయణ భట్టాతిరీ.”

భట్టాతిరి అవాక్కై నిలబడ్డాడు.

పద్మనాభోఽమరప్రభుః

అమర ప్రభుః – మృతి చెందని వారికి అనగా దేవతలకు లేదా అమరులకు ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే.

కానీ పూన్తనం పలికింది మరప్రభుః – అంటే మృతి చెందే వారికి ప్రభువు. అంటే చరాచర సృష్టిలో మృతి చెందే వారికి లేదా మరణించిన, స్తున్న, బోయే వారికి ప్రభువు.

“కాదా?” స్వామి అడిగాడు.

“అవును.”

“అంటే నీకు అర్థమే అయ్యింది.”

అప్పుడు తెలిసింది స్వామి మాటలకు అసలు అర్థం భట్టాతిరికి. అర్థమే అయ్యింది.. సగమే తెలిసింది.

మర అంటే మలయాళ భాషలో చెట్టు అని అర్థం. శ్రీమన్నారాయణుడు చెట్లకు మాత్రం ప్రభువు కాడా? పైగా ఆయన శ్రీకృష్ణావతారంలో మనకు అందించిన శ్రీమద్భగవద్గీతలో

“అశ్వత్థః సర్వవృక్షాణాం,” అని చెప్పుకున్నాడాయే!

సర్వమూ ఆయన విభూతియే కదా!

ఆ అప్రమేయుడు, హృషీకేశుడు, పద్మనాభుడు అమర ప్రభుడు మర ప్రభుడు కూడా.

ఈ మర ప్రభుకు సంబంధించి మరో గొప్ప విశేషం కూడా ఉంది.

ఈ పూన్తనం విషయాన్ని పురస్కరించుకుని 1995లో గురువాయూర్ ఉన్నికృష్ణన్ దేవాలయం దగ్గరలోనే కొన్ని పెద్ద టెర్రకోటా విగ్రహాన్ని పెట్టారు. దాని వెనుక కథను నేను నాలుగవ భాగంలో (అర్థ సంపూర్ణమ్ అనే నాలుగవ ఎపిసోడ్ లో సమయం వచ్చినప్పుడు చెప్తా అని అన్నాను. ఆ సందర్భం ఇదే.

గురువాయూర్ రైల్వే స్టేషన్ నుంచీ రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీవాల్సమ్ గెస్టుహౌజు దగ్గరలో రెండు విగ్రహాలు ఉంటాయి. అవి మరప్రభు, కేశవన్ అనే ఏనుగుది. గురువాయూర్ కేశవన్ కథ ఇక్కడ మనకు అనవసరం కానీ, ఆ కేశవన్ అనే ఏనుగు గురువాయూరప్పన్‌కు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఆ ఏనుగంటే కేరళ ప్రజలకు ఎంతో ప్రేమ, గౌరవం.

ఇక ఈ మరప్రభు 52 అడుగులున్న టెర్రకోట శిల్పం. దాన్ని తయారు చేసింది శ్రీ పీవీ రామచంద్రన్. ఆయనకు ఆ శిల్పాన్ని తయారు చేయటంలో వేల మంది కళాకారులు సహాయం చేసారు. దీన్ని తయారు చేయటానికి మూడు నెలలు పట్టగా ఈ విగ్రహం ఆలోచన, ఇలా రూపుదిద్దుకోవాలనే కల కొన్ని సంవత్సరాలది.

ఈ విగ్రహ తయారీలో ఎన్నో ఆయుర్వేద మూలికలను కూడా వాడారట. వాటితో పాటూ, ఎర్రమట్టి, నెయ్యిని కూడా కలిపారట. ఆ స్వామి మహిమ వల్ల, ఈ ఆయుర్వేద మూలికల వల్ల, సహజంగా శ్రీమన్నారాయణీయమ్ పురుడు పోసుకున్న క్షేత్రం కనుక ఈ విగ్రహం మహిమాన్వితమైనదని చెప్తారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని నమ్మిక. భవదీయుడు గురువాయూరు వెళ్ళినా ఆ విగ్రహాన్ని దర్శించుకునే భాగ్యానికి నోచుకోలేదు.

ఈ విగ్రహం ఎలా ఉంటుందనేది చూడండి.

మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపేలా ఉంటుందీ విగ్రహం. భూమిలో మంచి లోతుగా పునాది ఉండటమే కాదు, విగ్రహం సూర్య తేజస్సుతో ఉండి చూసిన వారికి అంతులేని ఆనందాన్ని కలుగజేస్తుందని చెప్తారు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం..

అంత గొప్ప భాగవత గ్రంథం అయిన శ్రీమన్నారాయణీయమ్ రచించిన నారాయణ భట్టాతిరికి కలిగిన అహంకారం కూడా మానవ శ్రేయస్సుకు ఉపయోగ పడింది. ఆయన అలా పూన్తనాన్ని హేళన చేయటం తప్పే అయినా, అందుకు స్వయంగా గురువాయూరప్పనే మందలించాడు. ఆ పైన అతను ఆ పని చేయటం వల్లనే మరప్రభు కూడా ఆవిష్కృతమైనది. పూన్తనం పుణ్య విశేషం వల్ల ఆ స్వామి మనకు అందరకూ దర్శనమిస్తున్నాడు ఈ రోజు.

ఇంకా గొప్ప విశేషం..

అది ద్వైతమైనా, అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా భక్తి ప్రధానమని, అలా సరైన ధార్మిక భక్తిలో లీనమైన వారి తప్పులను కూడా స్వామి స్వయంగా సరిదిద్ది వారికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడని మనకు తెలిసి వచ్చింది. శ్రీ గురువాయూరప్పన్ స్వయంగా వందలమంది చూస్తుండగా ఇచ్చిన హామీ.

కనుక శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, స్కంధ, లేదా ఏ ఇతర వైదిక పద్ధతులు, సనాతన ధర్మం ప్రకారం ఆరాధించినా మనకు కలుగ వలసిన అంతిమ ఫలితం అంది తీరుతుంది. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ.

సనాతన ధర్మం ప్రకారం నాస్తికులైనా కూడా వారు వారి కర్మలలో నిజాయితీ ప్రదర్శిస్తే చాలు. చేరాల్సిన గమ్యం నేడు కాకపోతే రేపు చేరతారు.

God don’t like pretenders. But he/that universal-energy goes to any extent to help those display pure devotion to the universal cause or the universal energy.

(Image Source: Internet)

(సశేషం)

Exit mobile version