Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-65

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

సర్వశ్రేష్ఠః-4

శ్రీ గజేంద్ర ఉవాచ –

ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్।

పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి॥1

యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్।

యోఽస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువమ్॥2

యః స్వాత్మనీదం నిజమాయయాఽర్పితం

క్వచిద్విభాతం క్వ చ తత్తిరోహితమ్।

అవిద్ధదృక్సాక్ష్యుభయం తదీక్షతే

స ఆత్మమూలోఽవతు మాం పరాత్పరః॥3

కాలేన పంచత్వమితేషు కృత్స్నశో

లోకేషు పాలేషు చ సర్వహేతుషు।

తమస్తదాసీద్గహనం గభీరం

యస్తస్య పారేఽభివిరాజతే విభుః॥4

న యస్య దేవా ఋషయః పదం విదు-

ర్జంతుః పునః కోఽర్హతి గంతుమీరితుమ్।

యథా నటస్యాకృతిభిర్విచేష్టతో

దురత్యయానుక్రమణః స మావతు॥5

(గజేంద్ర మోక్షం నుంచీ గజేంద్రుడు అందించిన స్తుతి)

శ్రీమన్నారాయణుడు, శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, పరమపద పరివారము, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధాది వ్యూహమూర్తులు, బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు, సప్తర్షి, ప్రజాపతులు, వారి సంతానము, మనువు, ఇక్ష్వాకాది రాజులు, ఇలా వారంతా మన పురాణ పురుషులే కాదు, మన పూర్వీకులు కూడా.

పూర్వీకులు అంటే పూర్వం వారితో ఉన్నవారము అని అర్థము. ఇంకొకటి మన ముందువారు అని అర్థము. లేదా పూర్వము (అంటే గతంలో ఈ ఉర్విపై నివసించిన వారు అని కూడా).

కావున శ్రీమన్నారాయణుడు (కాలాతీతుడు) మొదలుకొని కల్పాల కొద్దీ వసించగలిగే బ్రహ్మ గారు, మన్వంతరాది దేవ, సప్తర్షుల వరకు వారి కాలప్రమాణమును బట్టి వారి వారి ఉనికి కొనసాగుతూనే ఉన్నది.

బ్రహ్మ గారు మొదట నలుగురు బాలురను సృష్టించారు. మానస పుత్రులుగా. వారే సనక సనందాదులు. వారు ప్రజాపతులు అవుతారని ఆయన ఆశించారు. సృష్టి కార్యములో నిమగ్నమై, భూమి ప్రధానముగా జీవ జాలమును సృష్టించమని ఆజ్ఞాపించారు. అయితే వారు మేము శ్రీమన్నారాయణుని ధ్యాస తప్ప వేరొకటి ఒప్పము. మాకు ఆయన లీలా వినోద ధ్యానమే ప్రధానము అని ఆయన మాటను సున్నితముగా తిరస్కరించారు.

దానికి కోపించిన పితామహుడు (బ్రహ్మ – అందుకే విష్ణుమూర్తిని ప్రపితామహః అని కీర్తించారు) వారిని ఎన్నటికీ ఆ బాలుర రూపములోనే ఉండమని శపించెను. వారికి అది శాపము ఏమాత్రమూ కాదని భావించి శ్రీమన్నారాయణ లీలా లోలురై ఊర్థ్వలోకాలలో తిరుగుతూ ఉన్నారు.

ఆ పైన బ్రహ్మ గారు తొమ్మిది మంది ప్రజాపతులని సృజించి సృష్టి కార్యములో భాగం కమ్మని ఆజ్ఞాపించారు. ఇంతకు మునుపు ఆ నలుగురు బాలురతో జరిగిన అనుభవంతో ఒక్కొక్కొరికీ ఒక్కొక్కరకమైన ఆకర్షణీయమైన బాధ్యతలను అప్పగించారు.

వారినే నవబ్రహ్మలు అని కూడా వ్యవహరిస్తారు.

నవ బ్రహ్మలు – నవ ప్రజాపతులు

పురాణాల ప్రకారం

  1. మరీచి
  2. అత్రి
  3. అంగిరసుఁడు
  4. పులస్త్యుఁడు
  5. పులహుఁడు
  6. క్రతువు
  7. భృగువు
  8. వశిష్ఠుడు,
  9. దక్షుఁడు

అనువారు నవ బ్రహ్మలుగా, నవ ప్రజాపతులుగా కీర్తి పొందారు. వారి ద్వారా సృష్టి రచనా కార్యం జరిగింది. అంటే అందరూ సృష్టి చేయటం మీదనే లేరు. పైన చెప్పినట్లుగా వీరికి వేర్వేరు బాధ్యతలు అప్పగించబడ్డాయి.

ప్రధానంగా మనం ఇక్కడ కశ్యప ప్రజాపతి గురించి తెలుసుకోవాలి.

మన పురాణాలలో అనేకమార్లు తారసపడే గొప్ప మహర్షి కశ్యపుడు. అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు కొన్ని చోట్ల పురాణాలు చెబుతాయి.

ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో

  1. దితి
  2. అదితి
  3. వినత
  4. కద్రువ
  5. సురస
  6. అరిష్ట
  7. ఇల
  8. ధనువు
  9. సురభి
  10. చేల
  11. తామ్ర
  12. వశ
  13. ముని

మొదలైనవారు దక్షుని కుమార్తెలు. ఆ దక్షుడు కూడా ఒక ప్రజాపతి. ఆయన కూతురే దాక్షాయణి, సతీదేవి. శంకరుని సతీమణి. ఆమె కథ మనకు తెలిసిందే. ఆ సందర్భంలోనే దక్షునికి మేక తల వస్తుంది.

కశ్యప ప్రజాపతికి చతుర్ముఖ బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

కశ్యపుని వంశవృక్షం

కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముని చేరింది. ఆ పైన కొన్ని వేల సంవత్సరాలు ఆ వంశీయులు పాలించారు.

కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద. వీరి మూలంగా దైత్యుల వంశం విస్తరించింది.

కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు.

కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు (ఆదిశేషుడు), కర్కోటకుడు, కాళీయుడు, పద్మ, మహాపాదుడు (మహాపద్మ), శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.

కొన్నిచోట్ల ఏకశిరః సర్పములు కద్రువ వలన వచ్చాయి, బహుశిరః నాగులు మరొకరి ద్వారా జన్మించారని చెప్పబడింది.

భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని అనే కాంత వలన అప్సరసలు జన్మించారు.

కశ్యప ప్రజాపతి మరీచికి కళవలన పుట్టినవాడు. శ్రావణ శుద్ధ పంచమి హస్తా నక్షత్రంతో కూడి ఉన్నపుడు కశ్యప మహర్షి జయంతిని ఆచరిస్తారు. వైశ్వానరుని కుమార్తెలలో ఇరువురిని కూడా పత్నులుగా స్వీకరించాడు.

అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడి వంశవృక్షం గురించి వేరొక రకమైన సమాచారం కూడా ఉన్నది.

మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయ అనే కాంత వలన వల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.

అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు:

  1. సుఖి
  2. సేని
  3. భాసి
  4. గృధి
  5. సుచి
  6. సుగ్రీవి.

వీరి వల్ల కూడా భూమి మీద సృష్టి జరిగింది.

వీరు కాకుండా కాశ్యపుని వంశంలో ఆవత్సర వల్ల ఇద్దరు – నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు.

వైశ్వానరుని కుమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవర్షి, విభండకుఁడు అను బ్రహ్మర్షి.

ప్రజాపతులలో మరొక ప్రముఖుడు.. దక్షుడు. ఆయన సాక్షాత్ శంకరునికి మామగారు. వారికి వైరము ఎందుకు కలిగినది అనే విషయాన్ని ప్రక్కన పెడితే దక్షుని గురించి క్లుప్తంగా చూద్దాము.

బ్రహ్మ మానసపుత్రులలో ఒకడు, నవబ్రహ్మలలో ప్రముఖుడు దక్ష ప్రజాపతి ఈతని ధర్మపత్ని స్వాయంభువమనవు కుమార్తైన ప్రసూతి.

ప్రసూతి, దక్షప్రజాపతులకు 16 మంది పుత్రికలు

  1. శ్రద్ధ
  2. మైత్రి
  3. దయ
  4. శాంతి
  5. తుష్టి
  6. పుష్టి
  7. ప్రియ
  8. ఉన్నతి
  9. బుద్ధి
  10. మేధ
  11. తితిక్ష
  12. హ్రీ
  13. మూర్తి
  14. స్వాహాదేవి
  15. స్వధ
  16. సతి (ఉమ).

వారిలో 13 మంది ధర్ముని భార్యలు. ఇక్కడ 13 అనే సంఖ్యకు విశేషం ఉన్నది. సందర్భం వచ్చినప్పుడు చూద్దాము.

  1. శ్రద్ధ – పుత్రుడు శ్రుతము
  2. మైత్రి – పుత్రుడు ప్రసాదము
  3. దయ – పుత్రుడు అభయము
  4. శాంతి – పుత్రుడు సుఖము
  5. తుష్టి – పుత్రుడు ముదము
  6. పుష్టి – పుత్రుడు స్మయము (గర్వము, ఆశ్చర్యము)
  7. ప్రియ – పుత్రుడు యోగము
  8. ఉన్నతి – పుత్రుడు దర్పము
  9. బుద్ధి – పుత్రుడు అర్థము
  10. మేధ – పుత్రుడు స్మృతి
  11. తితిక్ష (ఓర్పు) – పుత్రుడు క్షేమము
  12. హ్రీ (సిగ్గు లజ్జ) – పుత్రుడు ప్రశ్రయము (అభిమానము, ఆప్యాయము, ప్రీతి)
  13. మూర్తి – సంతానం నరనారాయణులు. అగ్నిదేవుడు స్వాహా దేవిని స్వీకరించాడు.
  14. స్వాహాదేవి- పుత్రులు పావకుడు, పవమానుడు, శుచి స- పుత్రులు ఒక్కొక్కరికీ 15 మంది చొప్పున, 15×3, 45 మంది అగ్నులు. తాతలు, తండ్రులు కలిపి 49 మంది అగ్నులు, వారు 1. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, 3. సౌమ్యులు, 4. పితలు, 5. ఆజ్యపులు, 6. సాగ్నులు, 7. నిరగ్నులు అని ఏడు విధములు.
  15. స్వధా దేవిని పిత్రుదేవతలు (అధిపతి) స్వీకరించారు.

స్వధ- పుత్రులు వయన, ధారణి

     16 శివుని భార్య సతి (ఉమ). ఆమే తరువాతి జన్మలో హిమవంతుని పుత్రికగా పార్వతి అనే పేరుతో శివుని భార్య అయి గణపతికి, కుమారస్వామికి తల్లి అయినది.

ఇక్కడ ఇచ్చిన ప్రతి పేరుకూ, వారి వ్యక్తిత్వాలకు చాలా విశేషార్థాలు, తేలికగా అవగతమయ్యే వివరణలు కూడా ఉన్నాయి. ఈ పురాణ విజ్ఞానమంతా ఎన్నో సంకేతాలతో మనోవైజ్ఞానిక విశేషాలను తెలుపుతాయి.

ఉదాహరణకు కశ్యపుని వలన ఎన్నో జీవజాలాలు ఆవిర్భవించాయి. ఒక్కొక్క పత్ని వల్ల ఒక్కొక్క రకమైన లేదా వివిధ సంబంధం ఉన్న జీవులు (డేగలు, గద్దలు, రాబందులు) జన్మించాయి. వాటి వాటి జాతులన్నీ మైథున క్రియ ద్వారా పెంచబడి పోషింపబడుతున్నాయి.

చూడండి: <<<మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయ అనే కాంత వలన వల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు>>>

ఇక్కడ గ్రహాలు అంటే planets కాదు. ఇవి కూడా పీడకశక్తులు. వ్యాధులు అంటే ఆ వ్యాధి కారకములు కూడా అని గ్రహించాలి. వ్యాధులను కలిగించేవి సూక్ష్మ క్రిములు అని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు.

బాక్టీరియా, వైరస్ మోదలైనవి కశ్యప సంతానమే.

అలెగ్జాండర్ ఒపారిన్ రాసిన ‘ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్’ పుస్తకం భూమిపై జీవం ఎలా ఉద్భవించి ఉండవచ్చు అనే ఆసక్తికరమైన పరికల్పనను లోతుగా పరిశీలిస్తుందని ‘జీవము నీవే కదా!’ అనే 61వ ఎపిసోడ్‌లో తెలుసుకున్నాము కదా.

అతని పరికల్పన ప్రకారం, ఆదిమ వాతావరణంలో ఉన్న కర్బనేతర అణువుల (inorganic matter) నుండి సాధారణ సేంద్రీయ (organic) సమ్మేళనాలు ఏర్పడ్డాయి. ఈ  సేంద్రీయ సమ్మేళనాలు, కాలక్రమేణా, కలిసిపోయి మరింత రసాయన ప్రతిచర్యలకు గురై మరింత సంక్లిష్టమైన అణువులను ఏర్పరుస్తాయి. చివరికి, ఈ సంక్లిష్ట అణువులు తమను తాము మొదటి సాధారణ జీవులుగా వ్యవస్థీకరించుకున్నాయి జీవ కణములుగా మారి.

జీవకణములు (biological cells) అణువులకన్నా పెద్దవి. అంటే పరమాణువులకన్నా కూడా పెద్దవని చెప్పవలసిన పని లేదు.

రష్యాకు చెందిన ఒపారిన్, బ్రిటన్‌కు చెందిన జె. బి. ఎస్. హాల్డైన్ ఈ సిద్ధాంతాన్ని స్వతంత్రంగా ప్రతిపాదించారు. దీని ప్రకారం మొదట భూమిపై జీవ రసాయనాలు (ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి కేంద్రకామ్లాలు) ఆవిర్భవించాయి. వీటి తర్వాత మాత్రమే జీవుల ఆవిర్భావం జరిగింది. (Refer to యజ్ఞాలలో వాడే హవిస్సులు)

ముందు భూమి ఏర్పడిన తరువాత మాత్రమే జీవజాలాల సృష్టి జరిగింది. దానికి ముందు దాని మీద క్రతువులు జరిగాయి. అంటే రసాయన చర్యలు. పైన తన మానస పుత్రులకు బ్రహ్మగారు అప్పగించిన పనుల్లో క్రతువులు నిర్వహించటం కూడా ఒకటి. యజ్ఞము అంటే మనం చూసే కేవల అగ్ని కార్యమనే కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం (ఆఁ సగమని కూడా – multiple facets లో ఒక facet అని) చేసుకుంటే పని.. లేదా productive activity అని కూడా.

భౌతిక శాస్త్రంలో పని లేదా Work ని బలము x స్థానభ్రంశం అని చెప్తారు. దానిని ఇలా సూచిస్తారు.

Work done W = Force.displacement (. అంటే dot product of vectors).

ఒక మనిషి వృత్తాకారంలో ఒకసారి పరిగెత్తి నాలుగు వందల మీటర్లు పరిగెత్తి ఎక్కడ ఉన్నాడో అక్కడికే వచ్చాడనుకుందాము. అతను పరిగెత్తిన దూరము (distance) 400 మీటర్లు. కానీ స్థానభ్రంశం 0 (సున్న).

కనుక అతను చేసిన పని కూడా 0 (సున్న). ఎందుకు? అతను ఎంత బలము ఉపయోగించి పరిగెత్తినా జరిగిన స్థానభ్రంశము సున్నయే కదా.

అంటే యజ్ఞము జరగాలంటే స్థానభ్రంశము జరగాలి. అంటే ఏదోకటి జనించాలి లేదా సృష్టింపబడాలి. In simple words.. యజ్ఞము అంటే productive work. ఇంత కష్టపడ్డాను. ఈ పని కాలేదు అంటే అది యజ్ఞము కాదు. It is not productive work. శక్తి వృథా అయినది. అంతే. Wastage of energy.

ఇలాంటి క్రతువుల వలన భౌతిక ప్రపంచం రూపుదిద్దుకుని అభివృద్ధి చెందింది.

అంటే భూమి మీద ఆవిర్భవించిన తొలి జీవజాలం ఏక కణజీవులని మన పురాణాలు కూడా ప్రతిపాదించాయి. తరువాత బహుకణ జీవులు, బహుళ కణ జీవులు.. ఇలా!

చివరికి మానవులు వచ్చారు. వారి ఆది మనువుతో!

వివస్వానుడు మొదలైన వారు భూ జీవులు కాదు అని గ్రహించాలి.

అందుకే ముందు ప్రజాపతులు, తరువాత వివిధ రకాలైన ఇతర జీవులు, ఆ పైన మనువు. ఆయన ద్వారా మానవులు.

పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన ‘వైవస్వత మన్వంతరము’లో ఉన్నాము, ఈ మన్వతంతరానికి అధిపతి వైవస్వత మనువు.

దీనికి ఆధారం భగవద్గీతలో

శ్రీ భగవానువాచ॥

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్।

వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్॥4.1॥

నేను ఈ సనాతనమైన యోగ శాస్త్రమును (నేటి) సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి (వివస్వానుడి పుత్రుడు వైవస్వతుడు), మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.

ఇప్పటి వివరం చెప్పాడు. గత చరిత్ర కాదు. ఆ సమయానికి అర్జునుడికి అవసరం లేదు.

భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశ వృత్తాంతం ఉంది.

ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది.

ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది. వివస్వంతుని భార్య సంజ్ఞ. వారి పుత్రుడు సత్యవ్రతుడు లేదా వైవస్వతుడు. అతడే వైవస్వత మనువు అయ్యాడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.

ఈ మన్వంతరంలో భగవంతుడు కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.

ఇప్పటి సప్తర్షులు –

  1. కశ్యపుడు
  2. అత్రి
  3. వశిష్ఠుడు
  4. విశ్వామిత్రుడు
  5. గౌతముడు
  6. జమదగ్ని
  7. భరద్వాజుడు.

ఇంద్రుడు – పురందరుడు.

సురులు –

  1. వసువు
  2. రుద్రుడు
  3. ఆదిత్యుడు
  4. విశ్వదేవుడు
  5. నాసత్యుడు
  6. మరుత్తు

వైవస్వత మనువు భార్య శ్రద్ధ. శ్రద్ధ లేనిదే యజ్ఞము జరుగదు. అందుకే మనువుకు శ్రద్ధ తోడైంది. అందువలనే సృష్టి సక్రమంగా కొనసాగుతోంది.

వారికి తొమ్మండుగురు పుత్రులు –

  1. ఇక్ష్వాకుడు
  2. శిబి
  3. నాభాగుడు
  4. దృష్టుడు
  5. శర్యాతి
  6. నరిష్యంతుడు
  7. నభగుడు
  8. కరూషుడు
  9. ప్రియవ్రతుడు.

అయితే ఆ పుత్రులు జన్మించడానికి ముందే వైవస్వతుడు పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో హోత మంత్రాలలో చేసిన పొరపాటు వన వారికి ‘ఇల’ అనే కుమార్తె కలిగింది. ఎందుకు కుమార్తె కలిగింది? That’s not accidental. It’s a cosmic action which was predestined.

స్త్రీ క్షేత్రము. క్షేత్రము లేనిదే బీజము నిరుపయోగము (మైథున సృష్టి వరకూ).

వశిష్ఠుని వరం వలన ఆ కుమారి ‘సుద్యుమ్నుడు’ అనే పురుషునిగా మారి, ప్రభువయ్యాడు. (కనుక వైవస్వత మనువునకు 10 మంది పుత్రులు అనవచ్చును).

కాని ఒక వనంలో ప్రవేశించినపుడు సుద్యుమ్నుడు పార్వతీదేవి చేత శాపగ్రస్తుడై స్త్రీగా మారి (gender fluidity), బుధునితో సంగమించి ‘పురూరవుడు’ అనే కుమారుని కన్నది. తండ్రి (తల్లి) అనంతరం పురూరవుడు రాజయ్యాడు.

అసలు ఇంత కార్యము జరుగటానికి మూలకారణంబెవ్వడు?

గజేంద్రుడు చెప్పాడు కదా!

ఉ.

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో! ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో! ఎవడు ఆదిమధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో! ఎవడు తనకు తాను పుట్టినవాడో! ఈ ప్రపంచానికంతటికీ అటువంటిప్రభువైనవానిని శరణు కోరుతున్నాను.

జగము అంటే ఈ ప్రపంచమంతా. ఎవ్వనిచే జనించున్ అంటే ఎవని వలన పుట్టినదో. లీనమై అంటే కలిసిపోయినదో. ఎవ్వని లోపల అంటే ఎవనియందు. ఉండున్ అంటే ఉండునో. ఎవ్వనియందు డిందు అంటే ఎవ్వనియందు నశించునో. ఎవ్వడు పరమేశ్వరుడు అంటే ఎవడు మహాప్రభువో. ఎవ్వడు మూలకారణంబు అంటే ప్రధాన కారణం ఎవరో. అనాది మధ్య లయుడు అంటే ఆది మధ్య అంతాలు తానై ఉన్నాడో. వానిన్ అంటే అటువంటివానిని. ఆత్మభవున్ అంటే తనకు తానుగా పుట్టినవానిని. ఈశ్వరున్ అంటే సర్వలోక ప్రభువును. నేనుశరణంబు వేడెదను అంటే నేను శరణు వేడుకొంటాను.

ఆయనే శ్రీహరి.

ఈ ప్రజ (జీవజాలము) అంతటికీ పతి (సృష్టించి, వృద్ధిక్షయములుకు కారణమై) కనుక ప్రజాపతి.

ఆయన జ్యేష్ఠుడు.

ఆ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు కనుకనే ఈ సమస్తమూ సక్రమముగా నడుస్తున్నది. లేకపోతే? ఇంట్లో పెద్ద (కొడుకు) సరైనవాడు కాకపోతే ఏమౌతుందో దుర్యోధనుడి ద్వారా తెలుస్తున్నది కదా. దీనికి పూర్తి విరుద్ధం శ్రీరాముడు, ధర్మరాజు. బలరాముడు పూర్తిస్థాయి శ్రేష్ఠుడు కాడు కానీ పక్కనే సర్వశ్రేష్ఠుడైన భగవానుడు ఉండటం వలన దారి తప్పలేదు. ఆయనకు దుర్యోధనుడి మీద కాస్త మమకారము మనకు తెలసినదే!

ఆ శ్రేష్ఠుడే ప్రజాపతిః.

ఈ సందర్భంలోనే పృథు చక్రవర్తి చరిత్రను తెలుసుకోవాలి. సందర్భం రాగానే చూద్దాము. Destroying of resources, recreation of resources గురించి తెలుస్తుంది.

(సశేషం)

Exit mobile version