Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లులు – పిల్లలు

[శ్రీమతి హిమజ రచించిన ‘తల్లులు – పిల్లలు’ అనే కవితని అందిస్తున్నాము.]

వరూ నేర్పరు..
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక
వాళ్లు వెళ్ళిపోయే ఇంటి నిశ్శబ్దాన్ని
ఎలా భరించాలో, తట్టుకోవాలో..
అది గోడల మధ్య నిశ్శబ్దం కాదు,
మనసులోకి నెమ్మదిగా చేరే శూన్యం –

ఎదిగిన పిల్లలు
తమ రెక్కలు విప్పి ఆకాశాల్ని తాకుతారు,
దూరాలు దాటుతారు..
తల్లి ఒడిని మర్చిపోయినట్టే కనిపిస్తారు.
కన్న తల్లికి మాత్రం
వారి ప్రతీ అడుగు గుర్తుంటుంది,
వాళ్లిక “అమ్మా, ఇదెలా చేయాలి?”
అని అడగకపోవడం,
మీ సలహా లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం,
మీరు లేకుండానే జీవించడం మొదలుపెట్టినప్పుడు
అపుడే ఆ మౌనం.. హృదయాన్ని కెలుకుతుంది
అయినా నవ్వుతారు.. అదే కదా అమ్మలు కోరింది
వాళ్లంతట వాళ్ళుగా ఎగరాలని,
వారి స్వంత ఆకాశం వెతకాలనే కదా!
ఆ నవ్వు వెనుక..
ఒక చిన్న విరుపుని దాచుకుంటుంది హృదయం.

ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే
మాటల్ని దిగమింగడం నేర్చుకోవడం –
వాళ్లు తప్పు చేస్తున్నా చెప్పకుండా ఉండటం,
వారి సమాచారం అందకపోయినా
ఆతురతను అణచుకోవడం,
దూరాన్నుంచే వారిని ప్రేమించడం
జోక్యం లేకుండా, కేవలం నిశ్శబ్దంగా ప్రేమించడం.
చేసేదేం లేక చేతులు ముడుచుకొని
వణికే హృదయాన్ని అదుపులో పెట్టుకొంటూ
కొన్నిసార్లు అమ్మలు చెప్పుకుంటారు –
చాలాసార్లు పైకి చెప్పరు.
సరే, పరవాలేదనుకున్నా
లోపల మాత్రం కొంచెం దిగులు చీకటి పుడుతుంది.

ముందులా ప్రతి క్షణంలో
మీ భాగస్వామ్యం ఉండదిక
వారికి మీ అవసరం అంతగా ఉండదిక.
అయినా అమ్మలు
వాళ్లకి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేస్తూ,
వారి చిన్నప్పటి ఫోటోలను గుండెతో
తుడుస్తూ కాపాడుతూ
ప్రతి రాత్రీ వాళ్ల క్షేమానికై ప్రార్థిస్తూ..
ప్రపంచం వారిపట్ల మృదువుగా ఉండాలని
దేవుడిని కోరుకుంటూ…
తల్లి తనం ఎప్పుడూ దాగదు.
కేవలం రూపం మారుతుందంతే –
నీడలా ఆవరించి ఒక వేడుకోలు లోకి మారిపోతుంది.
ఇది ఎవరికీ కనిపించని ప్రేమ –
ఎదిగిన పిల్లల తల్లి అవ్వడం అంటే-
మీరిక వారి ప్రపంచ కేంద్రం కాదని ఒప్పుకోవడం
అదే ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉండటం..
కొన్ని ప్రేమలు ఎప్పటికీ వీడిపోవు –
వాడిపోయినా నిశ్శబ్దంగా మమకారంతో
వేచిచూడ్డం నేర్చుకుంటాయి.. ❤

కానీ అదే ప్రేమ తత్త్వం
వాళ్లను నిలబెడుతుంది,
ప్రపంచాన్ని నిలబెడుతుంది!!

Exit mobile version