Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తమ పిల్లల మనుగడ కోసం ఆత్మహత్యలు చేసుకునే ‘లెమింగ్స్’

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

మా గురించి మీకు తెలుసా? మమ్మల్ని ‘లెమింగ్స్’ అంటారు. మేము మీ యిళ్ళలో ఉండే చుంచు ఎలుకల్లా ఉంటాం. మాకు బుల్లి తోక ఉంటుంది. మా శరీరమంతా దట్టంగా వెంట్రుకలతో కప్పి ఉంటుంది. మా అమ్మ, నాన్నలు మా కోసం ప్రాణత్యాగం చేస్తారు. మేము ప్రత్యేకం దీనిని గురించి యిప్పుడు చెప్తాం.

మా అమ్మలు నాలుగేళ్ళకొకసారి గర్భం ధరిస్తారు. ఒకేసారి పదిమంది పిల్లలని కంటారు. సముద్రాలకి దగ్గరగా ఉండే చిట్టిపొట్టి మొక్కలని – మొక్కల వేర్లని వెతికి ఆహారంగా పెట్టి మమ్మల్ని పెంచుతారు.

ఒకేసారి పదిమంది పిల్లలం పుడతాం కాబట్టి హఠాత్తుగా మా జనాభా పెరిగిపోతుంది. కాబట్టి మాకు ఆహారపు కొరత ఏర్పడుతుంది. మా పెద్దవాళ్ళకి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అనే ఆలోచన ఎదురవుతుంది. వారందరూ కలిసి మమ్ముల్ని బ్రతికించడం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతారు. వారందరూ కలసి సముద్రంలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు. ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి మా జాతిలో పెద్దవారు ఆత్మహత్యలు చేసుకుంటూ-తమ పిల్లలమయిన మమ్మల్ని కాపాడుకోవడం వింతగా అనిపించడం లేదూ!

అవును ఇది అద్భుతమే! మా జాతి మనుగడకోసం ప్రకృతే ఈ అద్భుతాన్ని సృష్టించింది. ప్రకృతి సమత్యులతని సాధించడానికి తనకి తానే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందో చూశారా!

మీ మానవులలో కూడా కొంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారట కదా! పిల్లల వల్లనే అని వింటున్నాం. మీ మనుగడ కోసం అష్టకష్టాలు పడినవారి ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయండి. చేస్తారు కదూ!

Exit mobile version