[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
11
తమ శైలి బహు బాగున్నది
గమ్మత్తుగా మత్తు ఎక్కించేలా వుంది
నమ్మలేని పదాల పొందికతో
కమ్మని పాటలతో వొళ్ళు మైమరచి పోతుంది
12
బహు బాగున్నవి చమత్కార వాక్కులు
బాహ్య ప్రపంచం మెచ్చుకునేలా
అహ రహమూ వృద్ధి చెందుతూ వుండవలె
అహంకార పూరితమైనవి కానిచో
13
కంగారు లేకుండా పదాలను కూర్చి
రంగరించి రంగరించి వ్రాసిన పాటలు
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
పగలే వెన్నెలా అనే లాగా
14
నట శేఖరుడు వేదికమీదికి రాగానే
మీట నొక్కితే మిరిమిట్లు గొలిపే దీపాలు
చాటంతైంది ముఖం దీప కాంతిలో
కోటలు దాటినై చప్పట్లు
15
తన మన అనే భేదాలేల
మన మందరము క్షేమముగా ఉండాలి
కనుకనే అందరం కలసి మెలసి ఉండాలి
రానన్నవాళ్ళని వదిలేదిలేదు
16
గంగిరెద్దులు ఇంటిముంగిళ్లలో
వంగి వంగి దండాలు పెట్టిస్తున్నకామందు
రంగు రంగుల ముగ్గుల వాకిళ్ళలో
చెంగు చెంగున గంతులేసే గంగిరెద్దు
17
గోటితో తీసేదానికి చాకెందుకు
నోటితో తీసెయ్యకు పొరపాటున పళ్లూడగలవు
రోట్లో వేసి దంచకు
కంటితో చూసి మునివేళ్ళతో తీసేయ్
18
కపట వేష దారులు యెంత మోసకారులో
శాపాలు పెడతామని భయపెడతారు
గొప్పగా అభినయమూ చేసెదరు
తపస్సు చేసేస్తున్నట్లుగా
19
కంభం చెరువు విస్తీర్ణంలో చాలా పెద్దది
లంబం లోను అంతే
పంబ రేగి పోతుంది ఎడ్లకు దాని నీళ్లు తోడే సరికి
అంబా అని అరిచె చివరకు
20
కంద పద్యం వ్రాయుటలో పోటీ
వంద పద్యాలు వ్రాసినా చాలు విన సొంపుగా ఉండేట్లు
మందలో దూరి వ్రాస్తున్నట్లు నటిస్తే
రంధి తీర్చుకున్న వాడౌతాడు
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.