Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తందనాలు-21

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

201
ఆరు బంగారమేగా
కోరుకుందురు అందరూ ఈ అంకెనే
తరుణులందరి ఆరవ ప్రాణం భర్తేగా
ఆరనే అంకె అన్ని విధాలా మంచిదనే భావన

202
ఏడు ఏడ్పు అంటారు అందరూ
ఏడు అడుగులు ఎలా పనికి వచ్చాయో పెళ్ళిలో
ఏడు అడుగులతో ప్రారంభమై
కడ దాక నడవ వలసిందేగా

203
ఎనిమిది కూడా ముఖ్యమైనదే
కాని పనులేమీ వుండవు ఈ అంకెతో
కొని తెచ్చుకునే నమ్మకాలూ తప్ప
కాన ఈ అంకె గూడా మహదానందమేగా

204
తొమ్మిది అన్నిటికన్నా ముఖ్యమైనది
నమ్మి ప్రారంభించ వచ్చు ఈ అంకెతో
తమ తమ జాతకాలు ఈ అంకెతో ముడి పడి ఉండవచ్చు
నమ్మకం ముఖ్యం

205
అన్ని అంకెలు మంచివే
కొన్నిమంచివి కాదనే ఆలోచనే తప్పు
అన్నిటికి దేని విలువ దానికే ఉంటుంది
అన్నిటితోనే అన్ని పనులు అవుతై

206
మరు జన్మ వున్నదో లేదో
మరు జన్మంటే వాళ్ళ పిల్లలే గదా
తరువాత వాళ్ళ పిల్లల పిల్లలు మరు జన్మే
పరంపర ఆ విధంగా సాగుతుంది

207
నిర్భీతి జీవితం యెంతో ఆనందం
కోరకుండానే బలం వచ్చు
కరుడు గట్టిన పనులైనా అలవోకగా సాధించవచ్చు
నిరాటంకంగా జీవితం సాగు

208
కోరుకున్నంతనే దేవుడు వరాలిస్తే
చేరుకోరు పనులు చేయుటకు
పరుల సొమ్ముకు ఆశించరు నరులు అందరూ
తిని, త్రాగి మత్తులో వుందురు

209
దేవుడే అన్నీ నియంత్రించిన నాడు
కావు ఇన్ని ఘోరాలు, నేరాలు ఇలలో
శవ రాజకీయాలిన్ని వుండవు
రావు ఇన్ని కేసులు పోలీసుల చెంతకు

210
పని చేయుటే ధ్యేయంగా
కాని పనులు చేయకుండుట
లేని పోని నిందలు ఇతరులపై రుద్దకుండుట
హాని చేయ కుండుటే మానవ లక్ష్యం కావాలి

Exit mobile version