Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తండ్రికి కానుక

[బాలబాలికల కోసం ‘తండ్రికి కానుక’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

మీనయ్య ఒక జాలరి సముద్రంలోకి పడవమీద వెళ్ళి చేపలు పట్టి అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

మీనయ్య నాన్న రాజయ్య ఒకసారి తీవ్ర అస్వస్థతతకు గురై మంచం పట్టాడు.

తన తండ్రికి మంచి వైద్యం చేయించాలనీ ఆయనకు ఏదైనా మంచి కానుక ఇవ్వాలనీ మీనయ్య తలచాడు. ఆయన వైద్యానికి తగిన డబ్బు ఎలా సంపాదించలో తెలియక మీనయ్య బాధపడసాగాడు. అలా ఆలోచిస్తూ మీనయ్య ఒకరోజు సముద్రం మీద చేపలు పట్టేందుకు వెళ్ళాడు. అలా సాయంత్రం వరకు వల వేస్తుంటే వలలో ఒక భారీ చేప పడింది. అది ఒక అరుదైన చేప.

దానిని ఇంటికి తీసుక వెళ్ళి తన తండ్రికి చూపిస్తే ఆయన దానిని చూసి, “మీనయ్యా, ఇది చాలా అరుదైన చేప ఇరవై ఏళ్ళ క్రితం నేను ఇటువంటిదే పట్టి అమ్మితే అప్పుడే నాకు ఐదు వేలరూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతోనే నీవు సముద్రం మీదకు వెళ్ళే పడవను కొన్నాను. ఆ చేప వలన లభించిన పడవ వలన మనం హాయిగా బతుకుతున్నాం. ఇప్పుడు ఈ చేప ఇది ఇరవై వేలు చేస్తుంది. దీనిని మనరాజు గారికి బహుమతిగా ఇవ్వు ఆయన నీకు మంచి బహుమతి ఇస్తాడు. దీనిని కొనే ధనవంతుడెవ్వరూ మన ఊరిలో లేడు” అని వివరించాడు రాజయ్య.

“సరే నాన్నా నీవు చెప్పినట్టే చేస్తాను” అని చేపను తీసుక వెళ్ళి రాజు గారికి ఇస్తే వంటవాడిని పిలిపించి, “ఈ చేప తినడానికి పనికి వస్తుందా?” అని అడిగాడు.

వంటవాడు దానిని పరిశీలించి “మహారాజా ఇది చాలా అరుదైన చేప. మంచి ఆరోగ్యాన్ని కూర్చే ఎన్నో రసాయనాలు ఈ చేపలో ఉంటాయి. బయట బజారులో ఇది పద్దెనిమిది వేలు చేస్తుంది” అని వివరించాడు.

మీనయ్య అంత ఖరీదైన చేపను తనకు బహుమతిగా ఇస్తున్నందుకు రాజు సంతోషించి ముప్పై వేల రూపాయలు, వెండి పళ్ళెం బహూకరించాడు.

రాజుగారికి అనేక నమస్మృతులు తెలిపి డబ్బు, పళ్ళెం తీసుక వెళ్ళి తండ్రి రాజయ్యకు ఇచ్చాడు. వంటవాడు కొద్ది సేపటి తరువాత మీనయ్య ఇంటికి వచ్చి కోసిన చేపలో కొంత భాగం ఇచ్చాడు. మీనయ్య భార్య దానిని వండడానికి కోసింది. అందులో నుండి ఓ చిన్న వజ్రం బయట పడింది.

దానిని చూసి మీనయ్య, అతని భార్య, రాజయ్య ఆశ్చర్యపోయారు. దానిని దేవుడు ఇచ్చిందిగా భావించి దానిని అమ్మి, వారు మంచి ఇల్లు కట్టించుకుని మిగతా డబ్బుతో ఒక సత్రం, బడి రాజయ్య పేరు మీద కట్టించి నాన్నకు కానుకగా ఇచ్చాడు. ఆయనకు మంచి వైద్యం చేయించాడు.

చూసారా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఆప్యాయత ఉంటేనే అంతా మంచి జరుగుతుంది.

Exit mobile version