[బాలబాలికల కోసం ‘తంజావూరు సత్రం’ అనే కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]
ఒకరోజు సాయంత్రం వేళ మురళి, అతని స్నేహితుడు వెంకన్న రావిచెట్టుకింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ పక్కనే మురళి మనవడు జున్నుబాబు తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు.
అదే సమయంలో వారి ముందుగా కొంతమంది కొత్త వ్యక్తులు ఊరిలోకి వెళ్తుండటం చూసిన మురళి ఆశ్చర్యంగా,
“వెంకన్నా! ఇంతమంది చుట్టాలు ఎవరింటికి వెళ్తున్నారు?” అని అడిగాడు.
“మరి ఎవరింటికి వెళ్తారు? మీద వీధి అప్పలసూరి ఇంటికే! అతను ఎవరినీ కాదనలేడు. అందుకే అతని ఇల్లు ఎప్పుడూ బంధువులతో నిండిపోతూ ఉంటుంది” అన్నాడు వెంకన్న.
“అంతమంది ఎందుకు వస్తుంటారు?” అని అడిగాడు మురళి.
“అతని అన్నదమ్ముల పిల్లలు, మేనల్లుళ్లు, భార్య తరపు బంధువులు.. ఇలా ఎవరొచ్చినా నెలల తరబడి అక్కడే ఉంటారు. హాయిగా తిని, తిరిగి, కాలక్షేపం చేస్తారు. ఆ ఇంట్లో కష్టపడి సంపాదించేది అప్పలసూరి ఒక్కడే. మిగతావాళ్లు మాత్రం అతని మీదే ఆధారపడి ఉంటారు” అని చెప్పాడు వెంకన్న.
అది విన్న మురళి నవ్వుతూ, “అంటే అతని ఇల్లు తంజావూరు సత్రంలా తయారైందన్నమాట!” అన్నాడు.
ఆ మాటలు విన్న జున్నుబాబు వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి, “తాతయ్యా! తంజావూరు సత్రం అంటే ఏమిటి?” అని అడిగాడు.
మురళి చిరునవ్వుతో, “అది ఒక జాతీయం బాబూ! తంజావూరు తమిళనాడులోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అక్కడి సందర్శనీయ ప్రదేశాలను చూడటానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. అక్కడికి వచ్చే యాత్రికుల కోసం అప్పటి పాలకులు అనేక సత్రాలను నిర్మించారు. ఆ సత్రాల్లో యాత్రికులు ఉచితంగా భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవారు.
కాలక్రమేణా యాత్రికుల కంటే ఉచిత భోజనానికి అలవాటు పడి, ఎలాంటి పని చేయకుండా అక్కడే తిని కాలం గడిపేవారు ఎక్కువయ్యారట. అప్పటి నుంచి పని చేసేవారి కంటే ఇతరులపై ఆధారపడి జీవించే వారు ఎక్కువగా ఉన్న చోటును ‘తంజావూరు సత్రం’ అని పిలవడం మొదలైంది.
అందుకే ఒక ఇంట్లో కష్టపడేది ఒకరిద్దరే ఉండి, మిగతావాళ్లు వారి సంపాదన మీద ఆధారపడి తిని కూర్చుంటే, ఆ ఇంటిని ‘తంజావూరు సత్రం’ అంటారు” అని వివరించాడు.
వెంటనే జున్నుబాబు, “అంటే అప్పలసూరి ఇంట్లో కష్టపడేది అతనొక్కడే. మిగతావాళ్లంతా అతని మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి దాన్ని తంజావూరు సత్రం అంటారన్నమాట!” అన్నాడు.
“అవునురా! విషయం బాగా అర్థం చేసుకున్నావు” అని మురళి మనవడిని మెచ్చుకున్నాడు.
జున్నుబాబు ఆనందంగా తల ఊపాడు.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
