[వాణి వేమవరపు గారి ‘తన్మయత్వం’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]
కృష్ణా,
కలత నిదురలోన మేల్కాంచిన నేను,
కనులు ఎదుట నిలిచిన కన్నయ్యా, నిను గాంచినాను.
మధుర దరహాసన మెరయు ఆ మోమున,
పున్నమి చంద్రు నే ననుభూతి నొందినాను.
నీ అధర చుంబన మోందిన ఆ పిల్లనగ్రోవిన
తన్మయాన అనురాగాల రాగాల నేనాలకించినాను.
శిరమున దాల్చిన పింఛము పారవశ్యమున
పిల్ల తెమ్మరకు నాట్యమాడుట తిలకించినాను.
నిరతము నీ అడుగుకు సవ్వడి చేయు అందియలు
మురిపాన మురుయుట నే గమనించినాను.
ఇంతటి భాగ్యమును వాటికొసగితివి కరుణామయా,
కనుల కొస నుండైనను నీ చూపు
మా యందుంచు మురళీ మనోహర.
