Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తప్పెట చప్పుడు

[యం. రమేష్‌ కుమార్ గారు రచించిన ‘తప్పెట చప్పుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

దో శుభకార్యం జరుగుతున్నట్టు జనాలతో బ్యాంకు హడావుడిగా వుంది. బఫే భోజనానికి ప్లేటు పట్టుకుని లైన్లో నిలబడ్డట్టు కౌంటర్‌ల ముందు చేతిలో ఏవో ఫారాలు, పాస్ బుక్కులు పట్టుకుని నిల్చున్నారు చాలామంది. గంగాధరం గారు ‘లోన్స్’ అని రాసి వున్న సెక్షన్ దగ్గర కూర్చున్న ఉద్యోగి దగ్గరకు వెళ్లారు.

ఆయన్ని కూర్చోమని చెప్తూ “చెప్పండి.. ఏమిటి విషయం?” అడిగాడు ఆ ఉద్యోగి.

“నా ఇల్లు బ్యాంకు వాళ్ళు ఆక్షన్‌కు పెట్టారు బాబూ.. వచ్చేవారంలో వేలం వేసి అమ్ముతారట! నోటీసులు ఇచ్చారు..” భారంగా చెప్పారు గంగాధరం మాస్టారు.

అతడు మాష్టారి వివరాలు అడిగి సిస్టమ్‌లో చెక్ చేసిన తర్వాత “అవును సార్.. మీరు వాయిదాలు పూర్తిగా కట్టడం మానేశారు. నోటీసులకి వ్రాతపూర్వక సమాధానం కూడా ఇవ్వలేదు. అందువలన అప్పు తీసుకున్నప్పుడు మీరు హామీగా పెట్టిన ఇల్లుని వేలం వెయ్యాలని నిర్ణయించారు బ్యాంకువారు” చెప్పాడు.

“బాబూ.. ఆ ఇల్లు నా కష్టార్జితం. నా ముప్పై అయిదేళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో నేను సంపాదించుకున్న ఆస్తి అది ఒక్కటే! అసలేం జరిగిందో చెప్తాను. లోను తీసుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత పదిహేనేళ్ళ వ్యవధిలో మొత్తం లోను తీర్చేశాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బిటెక్ చదివిన మా అబ్బాయికి సరైన జాబ్ రాలేదు. ఏదో పైవేటు కంపెనీలో టెంపరరీగా చేస్తున్నాడు. అది అలా వుంచితే మా అల్లుడు మరో ఇద్దరు పార్ట్‌నర్స్‌తో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండేవాడు. స్థలాలను కొని లే అవుట్‌లు చేసి అమ్మేవారు. అయితే పెద్దగా లాభాలు వచ్చేవి కాదు. చిన్నవాటితో పనికాదని చెప్పి ఒక పెద్ద లే అవుట్ వేసి చాలామంది దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారు. తీరా వాళ్ళు కొన్న ఆ స్థలం కోర్టు వివాదంలో వుందని తర్వాత తెలిసింది. ఎవరికీ రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకపోయింది. ఈ విషయం తెలిశాక మిగతా ఇద్దరు పార్ట్‌నర్స్ మా అల్లుణ్ణి మోసం చేసి అడ్వాన్సులు తీసుకున్న సొమ్ముతో పరారయ్యారు. మా అల్లుడు అడ్డంగా దొరికిపోయాడు. ఎవరి డబ్బులు వాళ్లకి ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం కాకపోయినా కొంత మేరకైనా వాళ్లకి సెటిల్ చెయ్యవలసి వచ్చింది. మా అల్లుడు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డాడు. అతనికి కూడా స్థిరాస్తులంటూ ఏమీ లేవు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గతి లేదంటూ మా అమ్మాయి దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మాయి నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. ఇద్దరికీ ధైర్యం చెప్పి ఏదో ఒకటి ఆలోచిద్దామని చెప్పాను. బ్యాంకుకు వచ్చి కనుక్కుంటే ఇంటిని హామీగా పెట్టి లోన్ తీసుకుంటే ఎక్కువ ఎమౌంట్ వస్తుందని చెప్పారు. పెన్షన్ వస్తోంది కాబట్టి వాయిదాల ద్వారా తీర్చుకోవచ్చని అన్నారు. అదే విధంగా ఇల్లు హామీగా వుంచి లోన్ తీసుకున్నాను. అది చాలక బైట కూడా వడ్డీకి కొంత సొమ్ము తీసుకోవాల్సి వచ్చింది. సక్రమంగానే వాయిదాలు చెల్లిస్తున్నాను. అంతలో అనుకోని పరిస్థితులు వచ్చాయి. కంపెనీ లాస్ లోకి వెళ్ళడంతో మా అబ్బాయి ఉద్యోగం పోయింది.

వాడి కుటుంబ భారం నామీదే పడింది. దాంతో డబ్బుకి బాగా ఇబ్బంది అయింది. మా అల్లుడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరాడు. అతడికి వచ్చేది కుటుంబానికే చాలని పరిస్థితి. దాంతో అతడు బ్యాంకు లోన్ విషయంలో నాకేమీ ఇవ్వలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల వల్ల నేను బ్యాంకు వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగింది. వాయిదాలు కట్టకపోవడం వల్ల బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్టు మా అబ్బాయికి తీవ్రమైన సుస్తీ చేసింది. పేగుల్లో ఏదో సమస్య ఏర్పడి మేజర్ ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. వాడు కోలుకునేసరికి మూడు నెలలు పట్టింది. ఈలోపు మేము బ్యాంకు నోటీసుల గురించి మేము పట్టించుకోలేదు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని ఒకేసారి వాయిదాలు కట్టవచ్చులే అనుకున్నాము. తీరా చూస్తే బ్యాంకు వారు ఇల్లు జప్తు చేసి వేలం వేస్తున్నారని తెలిసింది. మాక్కాస్త సమయం ఇస్తే ఏదోఒకటి చేసి ఎలాగోలా డబ్బు కడతాము. దయచేసి ఈ వేలం పాట ఆపించండి బాబూ” ఆవేదనగా మొర పెట్టుకున్నారు గంగాధరం మాష్టారు.

“మీరు నోటీసులకి సమాధానమిచ్చి ఎంతో కొంత డబ్బు కడితే ఈ పరిస్థితి తప్పేది. ఇప్పుడైతే బ్యాంకు రూల్స్ ప్రకారం నడుచుకోవడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. ఒకసారి మేనేజర్‌ని కలవండి. ఏదైనా ప్రయోజనం వుంటే వుండొచ్చు” చెప్పాడు అతను.

గంగాధరం గారు మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన మొత్తం వివరాలన్నీ పరిశీలించి “ఈ స్టేజిలో ఆక్షన్‌ను ఆపడం కష్టం. అయినా నాకు ట్రాన్స్‌ఫర్ అయింది. సాయంత్రమే రిలీవ్ అవుతున్నాను. మరో రెండు మూడు రోజుల్లో కొత్త మేనేజర్ వస్తారు. మీరొక నాల్రోజుల తర్వాత వస్తే ఆయన్ని కలవచ్చు. మీ సమస్య ఆయనకి చెప్పండి” అన్నాడు. గంగాధరం గారు చేసేదేమీ లేక బైటకు నడిచారు.

***

నాలుగు రోజుల తర్వాత బ్యాంకుకు వచ్చిన గంగాధరం గారు కొత్త మేనేజర్‌ను కలిశారు. తన పరిస్థితి గురించి చెప్పబోతుండగా మేనేజర్ ఆపి “మీ మొత్తం వివరాలు, మీ ఇంటి పరిస్థితులతో సహా నాకు తెలుసు మాష్టారూ! లోన్ సెక్షన్ లో ఉద్యోగిని అడిగి ఆ వివరాలన్నీ తెలుసుకున్నాను. మీ ఫైల్ కూడా స్టడీ చేశాను. మీరు వస్తారని తెలుసు. మీ కోసమే ఎదురుచూస్తున్నాను” చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.

గంగాధరం గారు అయోమయంగా చూసి “నాకేం అర్ధంకావడం లేదు సార్.. నేను వచ్చి మిమ్మల్ని కలిసి ఏమీ చెప్పకముందే మీరు అన్నీ స్టడీ చేయడం..?” ప్రశ్నార్ధకంగా అడిగారు.

“మాష్టారూ.. నన్ను గుర్తు పట్టలేదా?” అడిగాడు అతడు. మాష్టారు అతడి వంక తేరిపార చూశారు.

బాగా పరిచయమున్న మొహంలాగే అనిపిస్తోంది కానీ గుర్తు రావడం లేదు. ఆయన అవస్థను గమనించిన మేనేజర్ నవ్వి “నేను మాష్టారూ.. కిషోర్‌ను.. మీ ప్రియశిష్యుణ్ణి! ఫైల్ లో మీ ఫోటో చూడగానే గుర్తు పట్టాను. మీ లోన్ వివరాలు మొత్తం కనుక్కున్నాను. మీ కోసమే చూస్తున్నాను. చివరికి మళ్ళీ మనం ఇలా కలుసుకున్నాం” అన్నాడు.

గంగాధరం గారికి కిషోర్ గురించిన విషయాలన్నీ గుర్తుకువచ్చాయి. ఒక ఫ్లాష్ లాగా పాత జ్ఞాపకాలన్నీ ఆయన కళ్ళముందు తిరిగాయి.

***

“ఈరోజు కూడా కిషోర్ రాలేదా?” అటెండెన్సు తీసుకుంటున్న గంగాధరం మాష్టారు పిల్లల్ని అడిగారు.

“రాలేదు మాష్టారూ! ఊరి పండగలు జరుగుతున్నాయి కదండీ.. వాళ్ళ నాన్నతో కలిసి ప్రోగ్రామ్స్‌కి వెళ్తున్నాడండీ” సమాధానమిచ్చాడు వెంకట్. వాడిది కిషోర్ పక్క ఇల్లే!

మాష్టారు ఏమనుకున్నారో గానీ “సరే” అని అప్పటికి ఊరుకున్నారు.

***

కన్నయ్య ఎదురుగా దాదాపు పదిహేను మంది పిల్లలు కూర్చుని వున్నారు. వారంతా దాదాపు ఎనిమిది నుంచి పదిహేనేళ్ళలోపు వాళ్ళే! వాళ్ళలో కిషోర్ కూడా వున్నాడు. కన్నయ్య వాళ్లకి శ్రద్దగా ఏదో చెప్తున్నాడు. అతడు ఆ వూరిలో తప్పెటగుళ్ళు నేర్పించే గురువు. గంగాధరం మాష్టారు తమ ఇంటివైపే వస్తుండటం చూసి ఆయనకి ఎదురువెళ్ళాడు కన్నయ్య.

“ఇదుగో కన్నయ్యా.. పిల్లలకి నీ విద్య నేర్పిస్తున్నావు బాగానే వుంది. కానీ వాళ్ళు ఆ సాకు చెప్పి ఈ మధ్య తరచుగా స్కూలు ఎగ్గొడుతున్నారు. మీ అబ్బాయి కిషోర్ కూడా నాలుగురోజుల్నుంచి స్కూలుకి రావట్లేదు. వాడు ఈ సంవత్సరం టెన్త్ క్లాసు అన్న సంగతి నీకసలు గుర్తుందా? మంచి మార్కులతో పాసవుతాడనుకుంటే ఇలా ఎగ్గొడుతున్నాడు. ఆ విషయం కనుక్కోవడానికే నేనొచ్చాను” అన్నారు మాష్టారు.

“బాబూ.. మరేటనుకోకండి.. ఈ నాలుగురోజులూ నేనే నాతో పాటు ఆణ్ణి తీసుకెళ్తన్నాను. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఊరి పండగలు అవుతన్నాయి. ప్రోగ్రాం కోసం పిలుస్తన్నారు. అందుకే నాతో పాటు తిప్పుతున్నాను. రేపటి కాన్నుంచి మనూరి పండగ కూడా మొదలవుతాది. అంచేత మనూళ్ళో కూడా ఎల్లుండి రాత్రి ప్రోగాం వుంది. దానికోసవే ఇప్పుడు ఈల్లందరికీ ప్రాక్టీసు ఇద్దావని పిలిసాను. ఈ రెండురోజులు అయిపోతే అక్కన్నుంచి మానీకుండా పంపిత్తాను బాబూ..” అన్నాడు కన్నయ్య.

“అదికాదు కన్నయ్యా.. బాగా చదివే వీణ్ణి పరీక్షల ముందు ఇలా తిప్పితే ఆఖరికి చదువులో వెనకబడిపోతాడేమో అని నా భయం అంతే! అర్థం చేసుకో!” అన్నారు మాష్టారు.

“మీ ఆరాటం నాకు తెల్దా బాబూ.. ఇది మా కుల విద్య. మా పూర్వీకుల దగ్గర్నుంచి నాకు వంటబట్టింది. చాలా తక్కువ వూళ్ళలోనే ఈ కళ ఇంకా బతికుంది. అలాటి ఊళ్లలో మా వూరు కూడా ఒకటి. మా ఊరోళ్ళు ఈ కళను నేర్పించమని జెప్పి పిలగాళ్ళను నా దగ్గరకు పంపుతున్నారు. పక్క వూళ్ళ నుంచి కూడా పిల్లలు వొస్తన్నారు. అలాటిది నేను గురువుగా వుండి నా కొడుక్కి ఈ కళ మప్పుకోకపోతే ఎలా బాబూ..” అన్నాడు కన్నయ్య.

“నేను కాదనడం లేదు కన్నయ్యా! జానపద కళల్ని తక్కువ చేసే ఉద్దేశ్యం నాకు లేదు. సరే పోనీ ఆ ప్రోగ్రామేదో అయ్యాక వాణ్ణి స్కూలుకి పంపు! పెద్ద పరీక్షలు దగ్గరికొస్తున్నాయి” అన్నారు మాష్టారు.

“అలాగే బాబూ.. తల్లి లేని పిల్లాడని సెప్పి మీరు ఆణ్ణి ఎంతో అభిమానంగా సూసుకుంటన్నారు. మొన్న పదో తరగతి ఫీజు కూడా సమయానికి నా దగ్గర లేకపోతే మీరే కట్టారు. ఇంకా ఆ డబ్బులు నేను మీకు ఇయ్యనేలేదు. నోటు పుస్తకాలు అయిపోయినా ఎంటనే మీరే కొనిస్తన్నారు. ఆడు బాగా సదువుతున్నాడని సెప్పి ఇంటికి పిలిసి కూడా సదువు సెప్తున్నారు. మీరు మామీద సూపిస్తున్న అభిమానం మర్సిపోలేం బాబూ..” కృతజ్ఞతగా అన్నాడు కన్నయ్య.

“మీవాడు బాగా చదవడమే కాదు.. బుద్ధిమంతుడు.. అందరి దగ్గరా వినయంగా వుంటాడు. అందుకే వాడంటే నాకు ఇష్టం.. సరే.. ఇక నేను వెళ్తాను” అంటూ బయల్దేరబోయారు మాష్టారు.

“బాబూ.. సిన్నమాట” సందిగ్ధంగా బుర్ర గోక్కుంటూ అన్నాడు కన్నయ్య.

ఏమిటన్నట్టు చూసిన మాష్టారితో “మరేం నేదు బాబూ.. ఎల్లుండి రాత్రికి మీరు కూడా మా తప్పెటగుళ్ళు ప్రోగాంకి రావాల. మా ఆటాపాటా సూడాల” అన్నాడు.

“అలాగేలే.. ఆరోజు వస్తాను” అంటూ కదిలారు మాష్టారు.

***

లయబద్దమైన డప్పుల శబ్దం, దానికి తగినట్టుగా గజ్జెల మోత వినిపిస్తోంది. అక్కడ దాదాపు పదిహేను మంది పిల్లలు వలయాకారంగా చుట్టూ చేరి నర్తిస్తూ పాడుతున్నారు. వారి గుండెల మీద రేకుతో గుండ్రంగా తయారుచేసిన తప్పెట వుంది. పాటకు అనుగుణంగా ఆ తప్పెట (డప్పు) మీద దరువులు వేస్తూ, వేగంగా నర్తిస్తూ, వంగుతూ లేస్తూ, గెంతుతూ హుషారుగా పాడుతూ ఆడుతున్నారు. వారి పాటకు, ఆటకు తగినట్టుగా గజ్జెలు కూడా మోగుతున్నాయి. వారంతా యూనిఫాం లాగా ఒకే రకమైన దుస్తులు ధరించి వున్నారు. నీలం రంగు నిక్కర్లు వేసుకుని, ఎర్ర రంగు బనియన్లు తొడుక్కుని వున్నారు. వాళ్ళ నిక్కర్లకు అటూ ఇటూ రెండు గజ్జెలు వేలాడదీయబడి వున్నాయి. కాళ్ళకు కూడా గజ్జెలు కట్టబడి వున్నాయి.

లయబద్దంగా చేస్తున్న ఆ నృత్యానికి, వారు పాడుతున్న పాటకి డప్పుల దరువులు, గజ్జెల శబ్దం కూడా కలగలిసి ఒక హుషారైన దృశ్య రూపకం ఆవిష్కృతమౌతోంది. నృత్యం చేస్తున్న వాళ్ళలో కిషోర్ కూడా వున్నాడు. వాళ్ళ మధ్యలో కన్నయ్య నిలబడి వారితో పాటే ఆడుతున్నాడు.

గ్రామంలో రామాలయం ముందున్న స్థలంలో రాత్రి పూట ఆ తప్పెటగుళ్ళ ప్రదర్శన జరుగుతోంది. అందరూ చుట్టూ కూర్చుని చూస్తున్నారు. అటూ ఇటూ పెద్ద లైట్లు అమర్చుకున్నారు. ఆ వూరి గ్రామ దేవత పండగ ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న కార్యక్రమం అది! గంగాధరం కూడా ఒక పక్కగా కుర్చీలో కూర్చుని ఆ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

నీకు వందనమమ్మ.. లోకమాతవు నీవు

దబ్బవనములోన.. దాగుండినావు తల్లి

నిమ్మవనములోన.. నిలిచినావు తల్లి

 నీకు వందనమమ్మ.. లోకమాతవు నీవు

ఈ విధంగా వాళ్ళు పాడుతున్నారు. అది ఏం పాట? అని గంగాధరం మాష్టారు తన పక్కన కూర్చున్న వ్యక్తిని అడిగారు. గంగమ్మని తమ ఆరాధ్యదేవతగా వాళ్ళు కొలుచుకుంటారనీ, అది గంగమ్మ తల్లికి సంబంధించిన పాట అనీ అతను సమాధానమిచ్చాడు.

అదయ్యాక వాళ్ళు సారంగధర కథను తప్పెటగుళ్ళు ప్రదర్శనలో భాగంగా పాడారు. ఆద్యంతం క్రమశిక్షణగా అలుపు లేకుండా నర్తిస్తూ, పాట పాడుతూ, మధ్యమధ్యలో ఎగిరి దూకడం లాంటి రకరకాల విన్యాసాలు కూడా చేస్తూ చూపరులను ఆశ్చర్యపరిచేలా వారి ప్రదర్శన సాగింది. చివర్లో అంతా మానవ పిరమిడ్ లాగా ఒకరిపై ఒకరు నిలబడుతూ విన్యాసం చేసి చూపారు. గంగాధరం గారు కాసేపు చూసి వెళ్ళిపోదామని అనుకున్నా అద్భుతంగా సాగుతున్న వారి విన్యాసాలనూ, విద్యనూ, ప్రదర్శననూ అలా చూస్తూ వుండిపోయారు. అందరి కంటే మధ్యమధ్యలో కిషోర్ చేసిన విన్యాసాలు చాలా బాగున్నాయని ఆయన గమనించాడు. ప్రోగ్రాం పూర్తయ్యాక బృంద సభ్యుల్నీ, కన్నయ్యనూ ప్రశంసించారు. కిషోర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ “కిషోర్.. చాలా బాగా చేశావు. నువ్వు చదువులో కూడా ఇంత చురుగ్గా వుండాలన్నదే నా కోరిక. ఒక్క విషయం గుర్తుపెట్టుకో! ఏ విద్యలోనైనా నలుగురి కంటే ప్రత్యేకంగా వున్నవాడు ఎప్పుడూ గుర్తింపుకి నోచుకుంటాడు” అంటూ భుజం తట్టారు.

***

పరీక్షలు జరిగి టెన్త్ క్లాసు రిజల్ట్స్ కూడా వచ్చాయి. కిషోర్ సెకండ్ క్లాసులో పాసయ్యాడు. గంగాధరం మాష్టారు ఈ విషయంలో అసంతృప్తిగా ఫీలయ్యారు. క్లాసులో మొదటి పదిమందిలో ఒకడుగా వుంటాడనుకుంటే చివరికి సెకండ్ క్లాసు రావడమేమిటని బాధ పడ్డారు.

“తెలివైన కుర్రాడివి అనవసరంగా చదువులో వెనుకబడిపోతున్నావేమో అని నా బాధ. నా కోరిక ఏమిటంటే నీ కళలో కూడా నువ్వు ప్రత్యేకమైన గుర్తింపు పొందాలి. అలాగని చదువుని నిర్లక్ష్యం చెయ్యెద్దు! కళ, విద్య రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. అందుకోసం ఇంకా ఎక్కువగా కష్టపడాలి! సరిగ్గా చెప్పాలంటే మిగతావారి కంటే రెట్టింపు కష్టబడాలి. అదొక్కటే నీ ముందున్న మార్గం!” అని కిషోర్‌ను పిలిచి చెప్పారు.

“నిజమే మాష్టారూ.. అనుకున్నంత బాగా చదవలేకపోయాను. ప్రదర్శనలతో అలసిపోవడం వల్ల అన్ని పాఠాల్ని పూర్తిగా రివిజన్ చేసుకోలేకపోయాను.. కానీ ఆ ప్రదర్శనలకు నా ఇష్టం తోనే వెళ్ళాను. అప్పటికీ నాన్న పరీక్షల ముందు ఇలా ప్రోగ్రాంలకు వస్తే ఇబ్బంది అవుతుందేమో.. వద్దు.. అన్నాడు. నేనే వినలేదు. ఏదేమైనా మీ అంచనాను నిలబెట్టలేకపోయినందుకు మన్నించండి.. ఇకపై మీ మాటలను గుర్తుంచుకుని చదువుని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా చూసుకుంటాను” అన్నాడు.

ఆ సంవత్సరం వేసవి శెలవుల్లో గంగాధరం మాష్టారికి మరో వూరు ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడితో కిషోర్‌కు, ఆయనకు మధ్య దూరం ఏర్పడింది.

***

బ్యాంకు మేనేజర్ కిషోర్ ముందు కూర్చున్న గంగాధరం గారికి అదంతా గుర్తుకు వచ్చింది.

“అయితే ఆ కిషోర్ నువ్వేనన్నమాట. బ్యాంకు మేనేజర్ అయ్యావు. చాలా సంతోషంగా వుంది! మరి తప్పెటగుళ్ళు ప్రాక్టీస్ ఏమైంది?” ఆసక్తిగా అడిగారు.

“అదే చెప్పబోతున్నాను మాష్టారూ.. మీ దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల తప్పెటగుళ్ళు కళలో కూడా పేరు సంపాదించుకున్నాను. ఆ రోజు మీరు చెప్పిన మాటే నాకు దారి చూపించింది. ఏ విద్యలోనైనా నలుగురి కంటే ప్రత్యేకంగా వున్నవాడే గుర్తింపుకి నోచుకుంటాడు అని మీరు చెప్పారు. ఆ మాట నా గుండెల్లో వుండిపోయింది. దాంతో ఈ కళలో కొత్త ప్రయోగాలు చేశాను. నాన్నకు ఓపిక తగ్గిపోయాక మా టీమ్‌కు నేనే నాయకత్వం వహించాను. ప్రదర్శన కోసం సొంతంగా కొత్త పాటల్ని, రూపకాలను తయారుచేశాను.

సమాజానికి ఉపయోగపడే విధంగా వుండే కొత్త రూపకాలని తప్పెటగుళ్ళులో ప్రదర్శించడం ప్రారంభించాను. మద్యపానానికి అలవాటు పడి ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకోవద్దనీ, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం మొక్కలు నాటమనీ, గంజాయి లాంటి డ్రగ్స్ జోలికి పోయి నాశనం కావొద్దనీ.. ఇలా రకరకాల థీమ్స్ తయారుచేసి ఈ కళలో ప్రవేశపెట్టాను. తప్పెటగుళ్ళుకి ఆత్మ అయిన విన్యాసాలనీ, ఆటపాటల్నీ విడిచిపెట్టకుండా కొత్త రూపకాలని ప్రదర్శించాను. దాంతో నాకు, మా టీమ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే మీరు మరొక మాట కూడా చెప్పారు. చదువునీ, ఈ విద్యనీ సమన్వయం చేసుకోవాలి అన్నారు. నేను చదువుతో పాటు తప్పెటగుళ్ళు కళలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి అనుకుంటున్నప్పుడు రెట్టింపు కష్టబడాలి అని మీరు చెప్పినమాట పాటించాను. దాంతో ఈ కళని విడిచిపెట్టకుండా ప్రాక్టీస్ చేస్తూనే అర్ధరాత్రి వరకూ కష్టబడి చదవడం అలవాటు చేసుకున్నాను. డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షల్లో నెగ్గి బ్యాంకు క్లర్కుగా జాబ్ కొట్టగలిగాను. తప్పెటగుళ్ళు కళలో వచ్చిన గుర్తింపు వల్ల వేరే రాష్ట్రాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వచ్చింది. ప్రభుత్వ గుర్తింపు, అవార్డులు కూడా లభించాయి. మా సంస్థ కూడా గుర్తించి ఒక కళాకారుడు మా బ్యాంకులో పనిచెయ్యడం మాకు గౌరవం అని చెప్పి నాకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి మేనేజర్‌గా ప్రమోట్ చేసింది. ఆ రకంగా ఈ బ్రాంచికి మేనేజర్ గా వచ్చాను. ఇక్కడ మిమ్మల్ని కలిసే అదృష్టం కలిగింది” ఆనందంగా చెప్పాడు కిషోర్.

అదంతా విన్న గంగాధరం గారికి తన శిష్యుడి ఎదుగుదల, ప్రయోజకత్వం చూసి ఎంతో ఆనందం, గర్వం కలిగాయి.

అదేవిషయం చెప్తూ “కిషోర్.. నిన్ను చూస్తూంటే గర్వంగానూ, సంతోషంగానూ వుంది. ఇక నా విషయానికి వస్తే ఇప్పటి నా పరిస్థితి..” అంటూ ఏదో చెప్పబోయారు.

“మాష్టారూ.. నా ఎదుగుదలకి ముఖ్యకారణం మీరు! నేను విద్యార్ధి దశలో వున్నప్పుడు మీరు నాకెంత ఆసరాగా వున్నారో.. నా ఉన్నతి కోసం ఎంతగా తపించారో నేను మర్చిపోలేదు. ఇప్పుడు మీ ఋణం తీర్చుకునే సమయం వచ్చింది. ఇప్పటికే చెయ్యవలసింది చేశాను. మీ పరిస్థితి ఉన్నతాధికారులకు చేరవేసి ఇల్లు వేలం వేయకుండా కొంత గడువు సంపాదించాను. అందుకోసం హామీగా వ్యక్తిగతంగా నేను సంతకం చేశాను. అంతేకాదు.. మీ అబ్బాయి బిటెక్ చేశాడని విన్నాను. నాకు తెలిసిన ఒక కంపెనీలో ఉద్యోగం చూస్తాను. మీరు కాస్త కుదుటపడ్డాక ఎప్పటిమాదిరిగా వాయిదాలు కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మూడు నెలల వాయిదాలు అడ్వాన్సు రూపంలో నేనే కట్టేశాను. ఇంకా అవసరమైతే నేను సాయం చేస్తాను. మీరేమీ ఆలోచించకుండా నిశ్చింతగా వుండండి” చెప్పాడు కిషోర్.

గంగాధరం మాష్టారికి మనసు నిండా సంతోషం అలముకుంది. నోట మాట రాక ఆనందభాష్పాలు నిలిచిన కళ్ళతో తన శిష్యుడిని చూస్తూండిపోయారు. ఆనాటి తప్పెటగుళ్ళ ప్రదర్శనలో ఉత్సాహంగా ఆడుతున్న చిన్ననాటి కిషోర్ రూపం ఆయన కళ్ళ ముందు మెదిలింది. శ్రవణానందకరమైన తప్పెట శబ్దాలు మంగళకరంగా ఆయన గుండెలో మారుమ్రోగసాగాయి.

Exit mobile version