[డా. సి. భవానీదేవి రచించిన ‘తప్పిపోయిన తేదీలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అమ్మలో రూపుదిద్దుకున్నప్పటినుండి
రూపమేలేని నా లేత శరీరమంతా అల్లుకున్న కాలవృక్షం
క్షణక్షణం రేకులు రాలుస్తూనే ఉంది
ఘడియలు.. నిమిషాలు.. గంటలు.. సంవత్సరాలు
నరనరంలో అనూహ్య సంచలిత చిత్రాలు
నేను ఎదుగుతున్నకొద్దీ
అమ్మ.. నాన్నల రూపురేఖలు మారిపోయాయి
వాళ్ళ చూపు, మాట, నడక
వయస్సును పెంచుకుంటూ వృద్ధాప్యాన్ని ధరించింది
పండిపోయిన జుట్టంతా సుఖదుఃఖాల పడుగుపేకలు
ఆ వటవృక్షాల నీడలోనే మేమంతా
ఒక వికృతరాత్రి పెద్దతుఫాను రాబందు
నాన్న శరీరాన్ని ఎగదన్నుకుపోయింది
ఆయన కళ్ళుమాత్రం నాలోనే ఇంకిపోయాయి
ఒక నిరంకుశపు దురహంకారం
అమ్మ మమకారాన్ని మాయంచేసింది
అమ్మ చేతులు మాత్రం కట్టెల్లో కాలిపోకుండా
నావైపే చాపి పిలుస్తూనే ఉన్నాయి
వాళ్ళ నీడలో హాయిగా ఉన్నవాళ్ళమంతా
ఎవరెవరం ఏ తేదీల్లోకి తప్పిపోయామో..
మనసుమాటల్ని మరిచిపోయి
మొహాలపై నవ్వురంగుతో తిరుగుతున్నాం
నేను మాత్రం పెద్ద – చిన్న ముళ్లసంకెళ్ళలో
నిస్సహాయంగా.. నిరంతర బందీగా!