[శ్రీ వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి గారు రచించిన ‘తరతరాలుగా మీకే గెలుపెలా సాధ్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“కాసిన్ని నీళ్ళు పోయమ్మా గొంతెండుకుపోతోంది” భవంతి ఎదురుగా నిల్చుని ఓ యువకుడు పిలిచాడు. ఎలాంటి జవాబు లేదు. ఈసారి గట్టిగా అరిచాడు.
కాసేపటికి భవంతి ముఖద్వారం తీసిన అలికిడైంది. “ఎందుకయ్యా అంత గట్టిగా అరిచావు? నీ అరుపుకు పెద్దయ్య మేల్కొన్నారు” ద్వారం తీసుకుని వచ్చిన యువతి దబాయించింది.
ఆ యువతి బయటకు వచ్చేసరికి ఆ యువకుడు దేనికోసమో వెతుకుతూ, భవంతి ఎదురుగా ఉన్న పశువుల కొట్టాల్లోకి పరికించి చూస్తున్నాడు.
“ఎవరూ పలకలేదు, అందుకే గట్టిగా పిలిచాను” అంటూ నసిగాడు యువకుడు. యువతి ఇచ్చిన చెంబును నోట కరుచుకుని చెంబులోని సగంపైగా నీళ్ళు తాగేశాడు.
చెంబులో మిగిలిన నీళ్ళను పారాబోయడమెందుకులే అనుకున్నట్లుంది. ఆ మిగిలిన నీళ్ళు తాగేసి యువతి వెనక్కి తిరిగింది. మిన్ను విరిగి మీద పడినట్లైంది.
అప్పుడే భవంతి ఆసామి ఊతకట్టెతో అక్కడికి వచ్చాడు. యువతీయువకులు చెంబు నోట కరుచుకుని నీళ్ళు తాగడం చూశాడు. పెట్రోల్ పోసిన మంటలా పెట్రేగిపోయాడు.
అతడి ఉనికి తన చొక్కాకున్న గురుగింజల కంటే పెద్దవి, బంగారు గొలుసుతో అనుసంధానించబడినవి అయిన బంగారు గుండీలే. అతడు వస్తున్న ఉనికి బంగారు పొన్ను కలిగిన చేతికర్ర టక టక శబ్దమే.
“ఆ మాదిగ నాకొడుక్కు వెండిచెంబుతో నీళ్ళిస్తావా? ఆ పదేల రూపాయల చెంబు నీ యమ్మా మొగుడు కొనిచ్చినాడా” భవనం ప్రతిధ్వనించేలా అరిచాడు.
నీళ్ళు తాగిన యువకుడిని చూస్తూ, “లమ్డీ కొడకా ఇది పెదరెడ్దోరి ఇల్లని తెలీదా? మీకు ఆడో గ్లాసు పెట్టిండేది కనపడ్లేదేమిరా తప్పుడ్నాకొడకా?” అంటూ గేటు బయట వైపు వేలాడదీసిన గ్లాసును చూశాడు. అంతటితో ఆగక, యువతీయువకుల అమ్మలక్కలను నోటితోనే రమించాడు.
యువకుడికి తల మొలేసినట్లైంది. ఐదువేళ్ళు గొంతువరకూ దూర్చి లాగిన విసురుకు బోక్కుమంటూ తాగిన నీళ్లన్నీ నట్టింటి ఎదురుగా బళ్ళున వాంతియిపోయాయి. ఆ కొంపలో తాగిన సింధువైన కడుపులో వద్దని తుపుక్కున ఊశాడు. ‘నీ నీళ్ళకు వడ్డీగా ఎంగిలి కూడా ఊసినా ఎదురుకో’ అన్నట్లున్నాయి ఆ యువకుడి చూపులు.
యువకుడి చూపుల్లోని కసిని, అతడి మాటలోని నిరసనను ఆసామి పట్టించుకోలేదు. యువకుణ్ణి వదలి యువతిపై చేలరేగి, “నా ఇంట్లో కనిపిస్తే మెడుతో కొడతా” అన్నాడు.
యువతి కోపాన్ని దిగమింగుకోలేకపోయింది. నాలుగడుగులు వెనక్కేసి చెంబును నట్టింట్లోకి కసితీరా విసిరింది. ఆ చెంబు దెబ్బకు నట్టింట్లోని సున్నము, బెల్లము, వేప బంక కలిపి చేసిన దేవుడి విగ్రహం చెంప పగిలి ముక్కలై చిల్లరమల్లరగా పడింది. “థూ! ముసలి ముండాకొడుకా!” అనేసి భవంతిలో వెనక వైపున్న గదిలోకెళ్ళి తన వస్తువులు సర్దుకుని ఆసామి నిలబడిఉన్న ఉన్న చోటు దాటుకుని మెయిన్ గేటు వైపు అడుగులేసింది.
తన వద్ద కూలికి పనిచేసే యువతే ఎదిరించి మాట్లాడడం ఆసామి తట్టుకోలేక పోయాడు. గట్టిగట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అరిచిన ఉద్వేగంలో భవంతి ముఖద్వారం ముందు పరచిన బేతంచెర్ల నల్లబండలపై దభీమని కూలిపోయాడు. నోటినుంచి నురగ కారడం మొదలైంది.
ఆ పరిస్థితిలో ఆసామిని వదలి వెళ్ళడం ఆమెకు మనస్కరించలేదు. వదిలేస్తే ఆసామి అక్కడికక్కడ గుండాగి చస్తాడు. లేదా పక్షవాతం పాలైపోతాడు. మనసులోని మలినాలను నోటితో వెళ్ళగక్కిన ఆసామి, కడుపులోని మలినాలను బట్టల్లో విసర్జించేశాడు. ఆసామికి బిపి, షుగర్ కొనకొమ్మల్లో ఉంటాయి. ఏ ఒక్కటి పెరిగినా కాడ నుంచి ఊడిన పూవల్లే రాలిపోతాడు.
యువతికి నర్సింగు వృత్తి ప్రమాణం “ఆ దేవుని ఎదుట నా జీవితాన్ని పవిత్రంగానూ, నా వృత్తిని నమ్మకగానూ చేస్తానని, నేను మానవజాతికి ప్రేమను పంచుతూ వారి రంగు, కులం, వర్ణం, మతం, దేశంలాంటి వానితో సంబంధం లేకుండా సేవచేయగలను” గుర్తొచ్చింది. ఆసామికి తెలివి వచ్చేవరకు ఉండాలని నిశ్చయించుకుంది.
తనొక్కతే ఆసామిని భవంతి లోపలికి చేర్చలేనని యువతికి తెలుసు. సాయంకోసం యువకుడి వైపు చూసింది. యువకుడు ఆసామిని చూసి ‘అంటరానివాణ్ణి తాకనన్నట్లుగా’ చూశాడు. యువతి కళ్ళలో కనబడ్డ అభ్యర్థనకు లొంగి ఆసామిని ఇంటిలోనికి తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టడానికి సాయంచేశాడు. ఆసామికి ఓ ఇంజక్షన్ ఇచ్చింది యువతి. వదురుతూనే ఆసామి నిద్రలోకి జారిపోయాడు.
యువకుడికి చెంబుతో నీళ్ళివ్వడంలో యువతి దోషమేమీ లేదు. నీళ్ళిచ్చిన చెంబు వెండిదని యువతికి తెలిసే అవకాశం లేదు. ఎప్పుడో ఏడాది ముందు ఆ చెంబును తోమినట్లుంది. అప్పటినుంచి వారానికో పదిరోజులకో నీళ్ళలో ముంచి తీయడమే తప్ప యేనాడు ఆ చెంబును బూడిదో, ముగ్గుపిండో వేసి తోమింది కాదు. అందుకే దాని వెండి రూపం మరుగున పడి మాసిన స్టీల్ చెంబులా కనబడుతున్నది. భవంతి లోపల సరైన వెలుగు లేకపోవడం కూడా కారణమే.
యువకుడు యువతికి మాట చెప్పి బయలుదేరబోయాడు.
“పాలేర్లు తినడానికెళ్ళారు. మధ్యలో లేపవలసి వస్తే ఇంత భారీకాయాన్ని నేనొక్కతిని లేపలేను, వాల్లొచ్చేదాక ఉండగొడదా” యువకుడు ఉంటాడనే నమ్మకంతో అడిగింది.
యువకుడికి ఆ భవంతి రాక్షససౌధంగా తోచినా, యువతి అభ్యర్థనను కాదనలేకపోయాడు.
కాస్తంత తెలివి రాగానే, “ఈ ముండను, ఆ నా కొడుకును కూసానికి కట్టేయండ్రా” అంటూ తనలో తనే వదిరాడు ఆసామి. ఉద్వేగంలో తిరిగి మంచంపై పడిపోయాడు. ఇంకో ఇంజక్షన్ ఇచ్చిందా యువతి. ఈ సారి మాగన్నుగా కన్నుమూశాడు. యువతీయువకులకు మరి కాసేపు ఆగక తప్పలేదు.
పాలేర్లు గేటు తీసిన చప్పుడుకు ఆసామికి మెలుకువ వచ్చింది. తననెవరు తాకారో, మంచంపైకి ఎవరు చేర్చారో, తన మలమూత్రాలను ఎవరు శుభ్రం చేశారో, బట్టలెవరు మార్చారో ఆసామికి గుర్తుకు రాలేదు. గుర్తు చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. యువతీయువకులు తన ఎదురుగా కుర్చీల్లో కూర్చొని కనపడ్డారు. అంతే కాలిరిగిన కోతి తన గాయాన్ని తనే కొరుక్కుని, గీక్కుని, నాక్కుని అరచినట్లు గట్టిగట్టిగా అరిచాడు.
“ఈ ముండను, ఆ నా కొడుకును కట్టేయమంటే ఏం చేస్తున్నార్రా తప్పుడు నా కొడుకుల్లారా?” అంటూ పాలేర్లను చూశాడు.
ఆసామి అనారోగ్య రోగిష్టే కాదు, వయసుడిగిన రోగిష్టే కాదు, అహంకార కులరోగిష్టని అర్థం చేసుకుంది యువతి. యువకుడి చేయి పట్టుకుని భవంతి బయటకు లాక్కుపోబోయింది. పాలేర్లిద్దరూ అడ్డుపడ్డారు.
బక్కపలచని వాడిని యువతి తొడల మధ్య తన్నింది. వాడు కుయ్ మనలేదు. స్కూల్లో నేర్చుకున్న అరకొర కరాటే ఇప్పుడు పనికొచ్చింది. యువకుడు ఈడ్చి కొట్టిన గుద్దుతో మరొకడి గూభగుయ్యిమంది. పాలేర్లు కూటికి జరక్క కూలికి చేరిన వారు. ఒకో దెబ్బకే నేలకొరిగారు.
***
నల్లమలకు దగ్గరలోని ఆత్నకూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో రెండస్తులతో విశాలంగా విస్తరించి ఉన్న ఆ భవంతిని చూడగానే అది తరాల నాటి యే పాలేగాడిదో అయి ఉంటుందనుకోవడం సహజం. బయటనుంచి భవంతిని చూసినవాళ్లకు గోడలకు వేసిన పచ్చి సున్నము, తలుపూ దాలముందరాలకు, పైకప్పుకు వేసిన ఎర్రచంధనం తీర్లను చూస్తే అమెరికా ప్రసిడెంటు వైట్ హౌస్ కుదించి కట్టినట్లుగా తోస్తుంది. భవంతికి చుట్టూ ఆరడగుల ఎత్తున రాతిగోడ ఉంది. గోడ పైభాగాన సీసా పెంకులు అతికించి ఉన్నాయి. గోడపై రెండున్నర అడుగుల ఎత్తున అమర్చిన ఇనుప తీగల ఫెన్సింగ్ ఏర్పాటుంది. పారుగోడ లోపల టేకుమాన్లు, టెంకాయచెట్లు, అశోకచెట్లు, సిరిగంధపు చెట్లున్నాయి. వాని మధ్యమధ్యలో విరగ్గాసిన రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లతో భవంతి వసంతమాళిగలా ఉంది.
ఒకప్పుడు ఆత్మకూరులో నివాసముండి సన్నాబన్నా ప్రజలను అవకాశం దొరికినప్పుడల్లా పీడించేవాడు ఆసామి. నల్లమల అడవుల్లో నక్సలైట్లు ఎక్కువుగా తిరిగేనాళ్లలో హైదరాబాదు పారిపోయాడు. రంగారెడ్డి జిల్లాలో మందుల తయారీకీ పనికొచ్చే ముడిసరుకు ఉత్పత్తి ఫాక్టరీ పెట్టాడు. ఫాక్టరీ వదిలే వ్యర్థాలతో నీరు కలుషితమైపోతున్నదని ఆ గ్రామ జనులు కోర్టులో కేసు వేశారు. నీటి శాంపిల్ పరీక్ష చేయించి ఫాక్టరీని మూసివేయించింది కోర్టు.
ఒకింటి సట్టి దేవి సంగటికట్టె దెబ్బతిన్న కుక్క కుయ్యో అంటూనే పక్కింటి సట్టిలో కూడా మూతి పెట్టినట్లు, ఆ ఫ్యాక్టరీ పెట్టిన మెషినరీ, నిలువు ఇనుపస్తంభాలు, పైన వేసిన జింకుషీట్లు, చుట్టూ వేసిన ఇనుపకంచె వాడి మెదక్ జిల్లాలో అదనపు ఖర్చులేకుండా మరోసారి ఫాక్టరీ పెట్టాడు. అక్కడ కూడా ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైదరాబాదు చుట్టూ మరో మూడుచోట్ల అదే ఫాక్టరీ పెట్టాడు. మేజిస్ట్రేట్ కోర్టులే కాదు, హైకోర్టు టూంబ్స్ కూడా ఆసామి డబ్బుకు, పలుకుబడికి తలొగ్గలేదు. గతాన్ని ఆకళింపు చేసుకున్న కోర్టు, పిచ్చికుక్క యే ఊర్లో కనబడినా తరిమి తరిమి కొట్టినట్లు హైదరాబాదు నుంచి ఆసామిని బహిష్కరించింది. అంతే ఉండూరు చేరాడు. ఆ పాటికి నక్సలైట్లు నల్లమల అడవులు దాటిపోయారు.
చట్టాలు మారినాయో, వ్యవస్థలు మారినాయో తెలీదు కానీ, కొవ్విన సానులు కాసులున్న విటుల దగ్గరకు చేరినట్లు, పాలకులు ఆసామి కొడుకు దగ్గరికి చేరారు. అవసరమైన పాలకులను కొనేసి కంపనీని రాష్ట్రంలో పెట్టాడు, విస్తరించాడు.
ఆసామి అనారోగ్యం గురించి నిత్యం విచారిస్తూ, అవసరమైనపుడు వచ్చిపోతుంటాడు కొడుకు.
‘ఖలునకు నిలువెల్ల విషం కదరా సుమతి’ అన్నట్లు, ఆసామి తన కుల అహంకారాన్ని కళ్ళద్వార, నోటి ద్వార, మౌనం ద్వార వెళ్ళగక్కుతుంటాడు. కులాన్ని తిని, కులాన్ని అరగించి, కులం కొవ్వుపట్టి, కులరక్తం వొళ్ళంతా నింపుకుని, కులమలాన్ని విసర్జించ గలవాడు. వానితో పాటు వైద్యశాస్త్రం కనుగొన్న అనేక రోగాలు అసామిని ఆశ్రయించుకుని ఉంటాయి. అతడి సేవకు నలుగురు మనషులు – ఒకరు వండి పెట్టేందుకు, ఒకరు వైద్య సేవకు, ఇద్దరు కాపలాకు.
దయాగుణం, సేవాగుణం, విద్యాగుణం విచారించి ఓ యువతిని ఆసామి వైద్యసేవకు కొడుకు తనతో తీసుకొచ్చాడు.
“అదెవరు?” కొడుకుతో వచ్చిన యువతిని చూసి అడిగాడు.
“ఆ బిడ్డ నర్సు. ఆ ఉద్యోగం మాన్పించి నీ కోసం తీసుకొచ్చాను. నీకు రోజూ బి పి, షుగర్ టెస్టులు చేయాలి, షుగర్ ఇంజక్షన్లు వేయాలి, టాబ్లెట్లు టైం ప్రకారం ఇవ్వాలి. ఈడికి రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. మన కంపనీలో పనిచేసే ప్రొడక్షన్ సూపర్వైజర్ వెంకట్రామయ్యను బ్రతిమాలితే కూతుర్ని పంపాడు” జవాబిచ్చాడు కొడుకు.
“వెంకట్రామయ్య మాల్నాకొడుకు కదా?” దగ్గుతూ అడిగాడు.
“అతడి కూతురే” అన్నాడు కొడుకు.
“థూ! మాల ముండను ఇంట్లోకి తెస్తావా?” విసురుగా అన్నాడు ఆసామి.
“చదువుకున్న బిడ్డ, శుచీ శుభ్రం తెలిసింది. నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటుంది. పెద్ద డాక్టరుకున్నంత తెలివి కలది. నువ్వేదో కులం గిలం అన్నావంటే నేను బయలుదేరకముందే ఆ బిడ్డ హైదరాబాదు చేరిపోతుంది” తండ్రిని ఒప్పించాడు కొడుకు. ‘మాలముండ’నే మాట నోరుజారి వచ్చేసిన మాటలే అనుకుంది యువతి. ‘పెద్ద వయసు’లే అనుకొని ‘పెద్ద మనసు’తో మన్నించేసింది.
***
ఆ భవంతికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదిగ గేరిలోని ఒక ఇంట్లో రెండావులు, వాటి దూడలు నాలుగురోజుల ముందు పోయాయి. వాటి యజమాని వాటి కోసం చుట్టూ గుట్టల్లో, నీటి పాయల్లో, వెతకాల్సిన చోటల్లా వెతికాడు. వాటి ఆచూకీ తెలియరాలేదు. ఆ యజమాని కొడుకు కూడా తన ప్రయత్నం చేస్తూ ఆసామి భవనం ముందుకొచ్చి నీళ్ళడిగాడు.
ఆవులు ఆసామి భవంతికి దొంగతనంగా చేర్చబడి ఉంటాయని వాటి యజమాని నమ్మకం. ఆ భవంతిలోకి అప్పుడప్పుడు దొంగసొత్తు చేరడం ఆ చుట్టూ కొందరికైనా తెలుసు. ఆ భవంతిలోకి వెళ్లి ‘మా ఆవులు’ అనడం ఓ పెద్ద నేరంగా చిత్రించగల సమర్థుడు ఆసామి.
అట్టి భవంతిలో ఆవుదూడలను వెతికే మార్గం తోచక ఆవుదూడల యజమాని కొడుకు నీళ్ళడిగి, ఇచ్చిన నీళ్ళు తాగి, వాంతి చేసుకుని, ఆసామిని కొంపలోకి చేర్చి యువతితో పాటు బయటపడ్డాడు. యువకుడికి భవంతిలో ఆవుదూడల ఆచూకీ కానరాలేదు.
***
యువతీయువకులు కాసేపు నడిచాక నేదర మామిడితోట కనపడింది. ఆ రాత్రికి తోటలో గడపడానికి నిశ్చయించుకున్నారు.
కాస్తంత కుదురుకున్నాక, “ఈ చుట్టూ మిమ్మల్నెపుడు చూడలేదు, యే ఊరు మీది, ఈ కొంపలోకెలా చేరారు?” యువకుడు ప్రశ్నించాడు.
“మాది హైదరాబాదు. ఈ ముసల్నాకొడుకు కొడుక్కు అక్కడ పెద్ద మందుల ఫాక్టరీ ఉంది. మా అందులో మా నాయన పని చేస్తాడు. ముసలాడికి నర్సుగా నన్ను పంపమని మా అమ్మానాన్నలను ఒప్పించి నన్ను తీసుకొచ్చాడు” ఉక్రోశంగా చెప్పింది.
“నా బిఏ అయ్యాక కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ హైదరాబాదులో ఉండేవాడిని. ఆరునెలల క్రిందట జరిగిన గ్రూప్-I పరీక్ష పాసై ఉద్యోగం తెచ్చుకున్నాను. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను” యువతి అడగక ముందే తనేమిటో యువకుడు వివరించాడు.
దూరాబారం పోయి ఆవుదూడలను వెతకాలనే ఉద్దేశ్యంతో కావచ్చు, యువకుడి అమ్మ రెండు పూటలకు సరిపడేలా జొన్న రొట్టెలు కట్టించింది. “మేము మాదిగోళ్ళం. జొన్న రొట్టెలు తెచ్చాను. మీరు మా ఇంట్లో చేసిన రొట్టెలు తింటారా?” అనుమానంగా అడిగాడు.
“ఆకలి తీరిన వాళ్లకు కులపట్టింపులుండాలి గానీ, తీరని వాళ్ళకుండాలా?” యువకుడు పక్కన పెట్టుకున్న మూటను తనే అందుకుని విప్పింది.
మాట్లాడుకుంటూనే రొట్టెలు, చియ్యలు సద్ది మూటలోనే కలిపి తినేశారు. యువతిచే రెండెక్కువ చియ్యలు తినిపించాడు యువకుడు. ఎప్పుడో తన అమ్మమ్మ ఇంట్లో ఇంత రుచికరమైన చియ్యలు తినింది, మళ్ళీ ఇదే తినడం. తోటలోని బావిలో నీళ్ళు త్రాగేశారు.
యువతి తువ్వాలును పరుచుకుని పడుకుంది. యువకుడికి తనతో ఉన్న మరో తువ్వాలు ఇచ్చింది. ఆమె బట్టలనే ఇద్దరూ తలదిండ్లుగా అమర్చుకున్నారు.
అప్పటిదాక కొత్త పరిచయమైనట్లు ఒకరినొకరు చూసుకున్న యువతీయువకులు ఇప్పుడు పలకరింపుగా చూసుకున్నారు. వారిరువురిది చామనచాయే, యువతిది మొహంలో కొట్టొచ్చిన కళ, అందమైన శరీర సౌష్టవం. యువకుడిది శుభ్రమైన మొహం. అంతకు మించిన శరీర సౌష్టవం.
వయసు ప్రభావమో, చేతికి అందేంత దూరంలో పడుకున్నామనే బెరుకుతనమో, ఆ తోటలోని వాతావరణం కారణమో ఇద్దరికీ నిద్ర రాలేదు. నేదర మామిడి చెట్లు, అప్పుడప్పుడే పూస్తున్న మామిడి పూత, రాత్రైన నిద్రపోనివ్వని కోకిల పాట, ఎర్రటి నేలపై ముగ్గారబోసినట్లున్న వెన్నెల వారిని నిద్రకు దూరం చేస్తున్నాయి. తేనెలోలికే పువ్వు తుమ్మెదను ఆకర్షింపక పోదని ఇద్దరికీ తెలుసు. మనసు చేసే రొదనుంచి బయటపడడానికి ఏదొకటి మాట్లాడడం తప్ప మార్గం తోచలేదు యువతీయువకులకు.
“మీ ఇంటికి తీసుకుపోక నన్నిక్కడికెందుకు తీసుకొచ్చావు?” యథాలాపంగా అడిగిందా యువతి.
“అమ్మో! నిన్ను తీసుకుపోతే మా ఇంటి చుట్టూ పక్కల ప్రేమ పురాణం అల్లేయెచ్చు. ఈ బుట్టబొమ్మను యానించి ఎగేసుకొచ్చినావురా అని మా ఊరోల్లే నన్ను ఆట పట్టించొచ్చు, ఆసామి మనల్ని వెతుకుతూ మనుషుల్ని మా ఇంటికి పంపనూ వచ్చు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను” జవాబు చెప్పాడు.
“ఊళ్లకు ఇంత దూరంలో, ఈ అడవి ప్రాంతంలో ఇంత కొంపెందుకు కట్టాడో?” ఉబుసుపోకకు మరో ప్రశ్నఅడిగింది.
“పారబోసినా మిగిలి పోయేన్ని డబ్బులున్నవాళ్ళు ఎన్ని భవంతులైనా కట్టుకుంటారు. ముసలోడు ప్రకృతి పంచే గాలితో పాటు మందులు కలవని ఆహారం తింటే మరి కొన్నాళ్ళు బ్రతుకుతాడని చెప్పారట డాక్టర్లు. అందుకనే భవంతి చుట్టూ రసాయనాలు వేయకుండా పంటలు పండిస్తారు. ఆ భవంతే వీడి కొడుకు కుటుంబానికి వేసవి విడిది కూడా” యువకుడు జవాబు చెప్పాడు.
“మా మాదిగ గేరి అడవి వైపునున్న ఆఖరి ఊరు. మనముండే ఈ మామిడితోట నేలంతా మాదిగోళ్ళు కష్టపడి చదును చేసుకున్న బంజరే. వాళ్ళు చేసుకునే భూమిని ఇతడు ఆక్రమించుకుని మామిడితోట పెట్టాడు. తన అనుభవంలో ఉన్నట్టు పత్రాలు సృష్టించాడు. ఇప్పుడు పట్టా కోసం ప్రయత్నిస్తున్నాడు. మాదిగోళ్ళతో నేను పెట్టించిన పిటీషన్లతో ఇతడికి పట్టా రాలేదు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఈ గుట్టల మధ్య సొరవ ఏ రాష్ట్రం క్రిందకి వస్తుందనే నిర్ణయం విషయంలో కొంత గాబరా ఏర్పడింది. లేదంటే ఎప్పుడో పట్టా తన కుటుంబీకుల పేర్లతోనో, ఇంటి పాలేర్ల పేర్లతోనో సంపాదించేసేవాడు” ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడాడా యువకుడు.
మాటలు కొనసాగించాలి గనుక మరో ప్రశ్న వేసింది. “నాది మాల కులమని ఆ ముసిలోడికి వాడి కొడుకే చెప్పాడు. మరి నీది మాదిగ కులమని ముసలోడికెట్లా తెలుసు?” యువతి అడిగింది.
“ఈ చుట్టూ రెండు కిలోమీటర్ల దూరంలో మా మాదిగ గేరి తప్పా మరో ఊరు లేదు. అంతకు మించిన దూరం నుంచి మరొకరు ఇక్కడకు వచ్చే అవకాశం లేదు. అందుకే నాది మాదిగకులం అనుకొని ఉంటాడు, లేదా తనకు నచ్చని యే కులపు వాళ్ళనైన ‘మాదిగ’పదాన్ని ‘ఊతపదం’ చేసుకుని పిలవడం ఆసామికి కొత్తేమీ కాదు” జవాబిచ్చాడా యువకుడు.
“మనమే ఒకరికొకరికి అంటరానివాళ్ళమైపోయాం. ఇక ఇతరులకెలా అంటరానివాళ్ళం కాకుండా పోతాంలే?” మాట పోడిగించాడా యువకుడు.
మాల, మాదిగ కులాలకు వాళ్ళలో వాళ్లకు గల అంటరానితనం గురించి కాసేపు మాట్లాడుకున్నారు యువతీయువకులు.
ఎంతగా తర్కం చేసుకున్నా ఇద్దరికీ కనులు మూతపడడం లేదు. మాటలు దొర్లించడమొకటే మార్గం. “రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మీ ఇంటి నుంచి ఆ కొంప కాడికి వచ్చే లోపే నీళ్ళెలా దప్పికయ్యాయి? రొట్టెలెందుకు తెచ్చుకున్నావు?” ప్రశ్నించింది యువతి.
“మా ఇంట్లోంచి రెండావులు, వాటి దూడలు మాయమయ్యాయి. అవి ఆసామి కొంపకు చేరి ఉంటాయని మా నాయన అనుమానం. ఆ వెతుకులాటలో భాగంగానే నీళ్ళ కోసమంటూ ఆ కొంపకొచ్చాను. ఒక వేళ అక్కడ కనబడకపోతే ఆవుదూడలను వెతుకుతూ అడవిలోకి వెళ్ళడానికి రొట్టెలు కట్టిచ్చింది అమ్మ” జవాబు చెప్పాడు యువకుడు.
“మీ ఆవులెలా పోయాయి” అనడిగింది.
“పదేండ్లుగా ఆ ఆవులు మా ఇంట్లోనే ఉండేవి. ఒకటి పశావు, రెండోది మట్టిది. పశావుకు కంటిపులి ఉంటే, మట్టావుకు తోకముట్టె ఉంది. ఆ సుళ్ళు ఉండేవి ఏ ఇంట్లో పుడితే ఆ ఇంట్లో పోవాల్సిందే. అగ్గవగా అమ్ముతామన్నా ఎవరూ కొనరు. ఆ సుళ్ళున్న పశువులను ఇంటికి తెస్తే ఏదో అరిష్టం జరుగుతుందని నమ్ముతారు. మా ఇంట మడకామాను దున్నేవి, చల్లకు కూడా ఈ ఆవులే. రెండు రోజులైంది ఆ ఆవులు, దూడలు కనపడక” సమస్య వివరించాడు యువకుడు.
“పశావంటే తెల్లది, మట్టావంటే వొళ్ళంత పొడలుండేది కదా? ఆ రెంటికి దూడలు కూడా ఉన్నాయి?” యువతి ఉత్సుకతతో అడిగింది.
ఆవుల పోలికలు వినగానే, “ఎక్కడ చూశావు” అన్నాడు.
“ఆ ముసల్నాకొడుకు కొంపలోనే” ఉత్సాహంగా చెప్పింది. అనుమానమొచ్చి “అంత ఉన్నవాడు ఆవులు దొంగతనం చేయడమేంటి?” అంది.
“అతడి ధనమదం అలాంటి పనులు చేయిస్తుంది. వాళ్ళింట పాలు లేవంటే, పాల కోసం మా గేరిలోకి మనిషిని పంపేవారు. పాలు పిండి పంపితే తాగేవారు కాదు. మా గేరి నుంచి పాలిచ్చే ఆవును, దూడను వాళ్ళింటికి తోలుకుపోతే వాళ్ళే పాలు పిండుకునే వారు. మా గేరిలో ఎవరింట్లో మంచి పొట్టేండ్లు, మడకనొగలు, కాడిమాన్లు ఉన్నా ఆ ఇంటికి కొన్నైనా భాగంగా చేరిపోవలసిందే. వాళ్లకు లేక చేసే దొంగతనాలు కావవి. దొరతనపు మదపు చేష్టలు.”
ఆ యువతీయువకులు రాత్రంతా మేలుకునే ఉన్నారు. దగ్గరగా ఉండి కూడా అదుపు తప్పక పోవడంతో ఒకరిపై ఒకరికి సదభిప్రాయం ఏర్పడింది.
***
మరుసటి రోజు ఉదయం పది గంటలకు భవంతి ముందుకు మాదిగ గేరి మొత్తం గేటు లోపలికి చేరారు. మాదిగల భూములు ఆసామి ఆక్రమించి మామిడితోట పెట్టుకున్న రోజుల్లో కూడా అంతమంది కలసి రాలేదు. ఈ రోజు ఒక్కడు గుంపేసుకుని వచ్చాడు.
“ఏం రా, మాదిగ గేరంతా మా ఇంటి ముందుజచ్చింది?” ఆసామి ప్రశ్నించాడు.
“మాయావుల్ను దొంగతనంగా మీ కొంపకు తోలుకునేందుకు సిగ్గుగా లేదూ?” ఆసామి కళ్ళలోకి చూస్తూ యువకుడు ప్రశ్నించాడు.
“ఆవులు మావిరా, ఏ నా కొడుకు మీవని చెప్పింది?” గుడ్లురిమాడు ఆసామి.
“ఒకసారి మాదిగ చియ్య దెబ్బ పడితే ఆవులెవరివో గుర్తొస్తాయి” గుడ్లురిమాడు యువకుడు.
ఆసామికి కాళ్ళూచేతులు ఆడడం లేదు. నిన్న సాయంత్రం యువకుడి చేతిలో గూబ గుయ్యిమనిపించుకున్న పాలేరు యీ వ్యవహారంలోకి పోగూడదనుకున్నాడేమో వెళ్లి ఆవులను తాళ్ళతో సహా తోలుకొచ్చి యువకుడికి అందజేశాడు. ఆవులను తోలుకొచ్చిన వాడిని అడిగాడా యువకుడు, “ఆవుల్ని ఎవరు దొంగతనంగా తోలుకొచ్చారు?” అని.
మాదిగల సంఖ్య చూసి, “పాలిచ్చే ఆవులను పట్టుకురమ్మని ఆసామి చెప్తే పట్టుకొచ్చాం. అది మీ ఇల్లని మాకు తెలీదు. కాళ్ళు పట్టుకుంటాం, వదిలేయండి” అన్నాడు పాలేరు.
“ఆవుదూడలను దొంగతనంగా నీ కొంపకు తోలించుకున్న ఆసామీ! ఈ తప్పుకు నువ్వేం తప్పు కడతావు?” యువకుడు నిలదీశాడు.
ఆసామి త్రుళ్ళి పడి, “నేను తప్పు కట్టడమేందిరా మాదిగ నాకొడకా?” అన్నాడు.
ఇంతమంది మాదిగలు కలిసి ఇంటిపైకి వచ్చినా ‘మాదిగ నా కొడకా’ అన్న మాటతో, కులమదంలో నిండా మునిగిన వాడితో మర్యాదగా మాట్లాడడం తప్పనుకున్నాడు యువకుడు. “మా మాదిగలు యే తప్పు చేయనపుడే తప్పులు కట్టించినావురా, నువ్వు మా ఆవులను తోలుకొని తప్పుచేసి తప్పు కట్టకుండా తప్పించుకోవడానికి నువ్వేమన్నా మా నాయనకు పుట్టినావురా?” అన్నాడు యువకుడు.
యువకుడు మాట్లాడుతుండగానే జీపులోంచి ఆ ప్రాంతపు సి ఐ, మండలాధికారి భవంతి వద్దకు చేరారు. ఆ అధికార్లను తీసుకురమ్మని కొందరిని ఆ యువకుడే పంపాడు. ఆ అధికార్లతో యువకుడు తననుతాను పరిచయం చేసుకున్నాడు. గ్రూప్-1 ఆఫీసర్ ఉద్యోగ విషయమై పోలీసుల వెరిఫికేషన్ కొరకు రావడంతో ఆ వచ్చిన ఉద్యోగులిద్దరకి యువకుడి గురించి ముందే తెలుసు.
“ఈ కొంప యజమాని మా రెండావులను దొంగతనంగా తోలించుకుని కట్టేసుకున్నాడు. తోలుకొచ్చింది నీ పాలేర్లే. ఆ విషయం వాళ్ళే ఇంతమంది ముందు ఒప్పుకున్నారు.” చుట్టూ ఉన్న వారిని చూపాడు యువకుడు. “అదే విషయమై కేసు పెట్టడానికి కావలసిన కంప్లైంటు మా నాన్న రాశాడు, కంప్లైంట్ తీసుకోండి సార్” అనగానే యే మాత్రం సంకోచించకుండా సిఐ కేసు తీసుకున్నాడు. సిఐ ఆవుల, దూడల, పాలేర్ల ఫోటోలు తీసుకున్నాడు. ఆవులకున్న సుళ్ళను క్లోజ్ అప్‌లో ఫోటోలు తీసుకున్నాడు.
ఇదెలా? పేటపిల్లి, ఊరిపిల్లి, వీధిపిల్లి, ఇంటిపిల్లి, అడవిపిల్లి కలిసివచ్చాయని ప్రశ్నించుకున్నాడు. జవాబు దొరకలేదు. కట్టేసి కొడితే ఏ పిల్లైన తిరగబడుతుందనిగానీ, ఏదో ఒక రోజు పిల్లులన్నీ కలిసి వస్తాయని ఆసామి గ్రహించలేకపోయాడు. ఆసామి సామాజిక మెట్లన్ని దిగక తప్పలేదు.
“దొంగతనం చేసిందానికి ఏం తప్పు చెల్లిస్తావో చెప్పరా ఆసామి?” నిర్భయంగా అడిగాడు యువకుడు.
“మాదిగోల్ల భూములు వాళ్ళకిచ్చేసి క్షమాపణ చెపుతానని చెప్పరా ముసిలోడా” అన్నదా యువతి సలహా ఇస్తున్నట్లు.
“అలాగే చేస్తా”ననక తప్పలేదు ఆసామికి. మామిడితోట మొత్తం మాదిగలదేనని, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని, మండలాఫీసులో తనిచ్చిన కంప్లైంట్లన్నీ బుద్ధి పూర్వకంగా ఉపసంహరించుకుంటున్నానని రాసిన కాగితంపై సంతకం చేశాడు. సాక్షి సంతకాలు అక్కడికొచ్చిన ప్రజల్లోంచి నలుగురు చేశారు.
“జీవితం నేర్పిన పాఠాలను మరచిపోరాదు రెడ్డోరి ఆసామి. మేము మీకెంతటి అంటరాని వాళ్ళమో, బ్రాహ్మలకు మీరు అంతకుమించిన అంటరాని వాళ్ళని తెలుసుకో” అంటూ ఆవులను పట్టుకుని ముందుకు సాగింది యువతి. ఇరుకు వసారా నుంచి స్వతంత్రం దొరికిన లేగలు, ఆవులను నడిపిస్తున్న యువతిని దాటి గంతులేస్తూ దూసుకుపోయాయి.
***
ఇరువైపులా పెద్దల అంగీకారంతో పెళ్ళయ్యాక మొదటిరాత్రి సంబరం కోసం మామిడితోటకు ఈత చాప, దిండ్లు మోసుకుని బయలుదేరారు నవదంపతులు.
పక్కపక్కన నడుస్తూ, “మన బందుత్వాన్ని, మన చుట్టరికాన్ని ఏమని పిలుచుకోవాలి?” ప్రశ్నించింది యువతి.
“మనది భార్యాభర్తల బంధం, మన చుట్టరికం కష్టరికం” అన్నాడా యువకుడు. మాట పొడిగిస్తూ, “లేనోళ్ళు లేనోళ్ళు పెళ్ళి చేసుకుంటేనే కులసంకరణ. ఉన్నోళ్ళు తిన్న పులిస్తరాకులు చిట్లా గాలోచ్చినా ఊరిపై పడవు, పేదోళ్ళు తిన్నవైతే చిరుగాలికే ఊరిపై పడి సమాజసంకరణ జరిగిపోతుందని మాల, మాదిగ, ఎరుకల, యానాదుల్లాంటి వారికి నూరిపోసిన సిద్ధాంతం. దాన్ని మనం మార్చుకోగలిగాం” అన్నాడు.
“మా నాన్నను అడిగి పెళ్ళికి ఒప్పించగలననే ధైర్యం ఎక్కడిది” అంటూ అడిగింది యువతి.
“నువ్వు ముసలాడిని ఎదిరించినపుడు, ఆ కొంపలో పాలేరును కాలితో తన్నినపుడు, చేసుకుంటే నీ లాంటి యువతినే చేసుకోవాలనుకున్నాను. అడగ్గానే మీ అమ్మానాన్నలు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు” అన్నాడు. యువతి యువకుడి ఎదలో ఒదిగిపోయింది.
వీళ్ళు కళ్ళు తెరిచే సమయానికి ఇంటిముందు కళ్ళాపుజల్లి పండుగను ఆహ్వానిచ్చినట్లు, మాలమాదిగల కలయికను ఆహ్వానిస్తూ తూర్పున ఎర్రటి కళ్ళాపు జల్లుతున్నాడు సూర్యుడు.
