Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తాతయ్య.. తాతయ్య.. కథ చెప్పు తాతయ్య..

[శ్రీమతి యం. ధరిత్రీ దేవి రచించిన ‘తాతయ్య.. తాతయ్య.. కథ చెప్పు తాతయ్య..’ అనే బాలగేయం అందిస్తున్నాము.]

తాతయ్య తాతయ్య కథ చెప్పు తాతయ్య
కథ వింటూ నేనూ బబ్బుంటా తాతయ్య
నిదురలోన నేనూ కలలెన్నో కంటాను
కలలన్నీ కథలల్లీ నీతోనే చెబుతాను ॥తాతయ్య॥

ఆకాశం చూపిస్తే చందమామ దిగివచ్చేను
తారలన్నీ తరలివచ్చి ముంగిట్లో వాలేను
చక్కనైన చుక్కలన్ని చూడు చూడు తాతయ్య
చుట్టుముట్టి నా చుట్టూ తిరిగేను తాతయ్య ॥తాతయ్య॥

అనగనగా ఓ రాజుకు ఏడుగురు కొడుకులు
ఏడుచేపలంటావు.. ఎండలేదు అంటావు
ఏడిస్తే ఒప్పుకోవు నవ్వాలీ అంటావు
ఆ నవ్వే నా వంటికి బలమెంతో అంటావు ॥తాతయ్య॥

కాకమ్మల చిలకమ్మల కబురులే చెబుతావు
సింహానికి చిట్టెలుకకు నేస్తం కట్టేస్తావు
నక్కబావ జిత్తులు.. ఎలుగుమామ ఎత్తులు..
నువు చెప్పని కథ ఏది.. నువ్వెరగని నీతి ఏది.. ॥తాతయ్య॥

అమ్మమ్మా అమ్మమ్మ కథ చెప్పు అమ్మమ్మ
కథ వింటూ నీఒడిలో బబ్బుంటా అమ్మమ్మ
నిదురలోన నేనూ కలలెన్నో కంటాను
కలలన్నీ కథలల్లీ నీతోనే చెబుతాను ॥అమ్మమ్మ॥

అమ్మచేతి గోరుముద్ద నాకెంతో కమ్మన
మీరు చెప్పు కథలేమో అంతకన్న తీయన
అమ్మకేమొ ఇంటి పనులు..
నాన్నకేమొ బయటిపనులు..
మా పిల్లలకేమో కరువాయెను కథలూ.. ॥అమ్మమ్మ॥

స్నేహితుల ఊసులేదు.. అటకెక్కాయ్ ఆటలన్నీ
సరదాలకు చోటు లేదు.. పోటీలతో కుస్తీలు
పాఠాలు.. పరీక్షలు.. ఇంకెక్కడి వినోదాలు..!
ఏంచేస్తాం.. మా చేతికి వచ్చేశాయ్ ‘సెల్ఫోన్లు’
అందుకే మీరంతా కదలాలీ కదలాలీ
కదిలివచ్చి చెప్పాలీ కథలెన్నో మా తోటి..
అమ్మమ్మలు.. నానమ్మలు రావాలీ రావాలీ
చెప్పాలీ చెప్పాలీ కథలెన్నో మాతోటి
మీరొస్తే చాలు మాకు.. మీకివే స్వాగతాలు
చెప్పేస్తాం సెల్ఫోన్లకు టాటాలూ.. బై బై లూ..
తాతయ్య తాతయ్య కథ చెప్పు తాతయ్య
కథ వింటూ నేనూ బబ్బుంటా తాతయ్య
అమ్మమ్మా అమ్మమ్మ కథ చెప్పు అమ్మమ్మ
కథ వింటూ నీ ఒడిలో బబ్బుంటా అమ్మమ్మ ॥తాతయ్య॥

Exit mobile version