Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తాతయ్య తీపి గుర్తులు

[కాలచక్రం వెనక్కి తిరిగి, ముసలితనాన్ని మూటగట్టి పక్కన పడేస్తే ఎలా ఉంటుంది? కల్మషం లేని మనవళ్ల (జైత్ర, రుద్ర) చిరునవ్వుల తోటలో వికసించిన ఒక తాతయ్య మధుర జ్ఞాపకాల సమాహారమే.. ఈ ‘తాతయ్య తీపి గుర్తులు’ కవిత.]


~
“తాతా…” అంటూ జైత్ర, రుద్రల కేక విన్నాను,
నా మదిలో మ్రోగిన మురళీ నాదమనుకున్నాను!
వారితో గడిపే ప్రతి నిమిషం ఒక ఆటనుకుంటున్నాను,
వయసును దాచేసి సాగే పసిబాటంటున్నాను!

కొంటె మాటల తూటాలతో ఇల్లంతా అల్లరయిందన్నాను,
బుడిబుడి నడకలతో సాగే నవ్వుల వేటన్నాను!
దొంగా-పోలీస్ ఆటల్లో కావాలనే ఓడిపోయాను,
మనవళ్లు గెలిచి పోజులిస్తూ హంగామా చేస్తారన్నాను!

గుర్రమై నేను వారి ముందర నిలిచాను,
రాజకుమారుల్లా వీపుపై వారి స్వారీ చూశాను!
దెబ్బ తగిలిందని నటించాను,
ముద్దుగా ఊదుతుంటే నా ఆయువు పెరిగిందన్నాను!

ఆ చిరుచేతుల స్పర్శ తాకిన వేళ మురిశాను,
గుండెలో కదలాడుతున్న నా చిన్ననాటి లీలనుకున్నాను!
ఆ కల్మషం లేని చూపుల నిండా మునిగాను,
నాకు అమ్మ నాన్నల ప్రేమ పండగ గుర్తొచ్చిందన్నాను!

కాల చక్రంలో వెనక్కి తిరిగి చూశాను,
నన్నునేనే మరిచిపోయేలా వారి సంగతులుందన్నాను!
ముసలితనాన్ని మూటగట్టి పక్కన పడేశాను,
పిల్లాడినై వారి లోకంలోనే కలిసిపోయాను!

మళ్లీ జన్మ ఉందో లేదో తెలియకున్నాను,
ఈ జన్మకు లభించిన ఈ పరవశం చాలన్నాను!
మనవళ్ల కొంటె చేష్టల నడుమ బతుకుతున్నాను,
మళ్లీ పసివాడినైన ఈ క్షణాలే సుఖమనుకుంటున్నాను!

(“మనవళ్ల స్పర్శలో అమ్మనాన్నల ప్రేమను చూసుకుంటూ, వారి ముద్దులనే తన ఆయువుగా భావించే ఈ తాతయ్య పరవశం.. ప్రతి ఇంట్లో ఉండే కల్మషం లేని అనుబంధాలకు అద్దం పట్టాలి. ఈ జన్మకు ఈ పసివాడి బాటే పరమార్థం!”)

Exit mobile version