[మైనంపాటి గోవింద రావు గారు రచించిన ‘తత్వమసి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
సత్యం అలియాస్ సత్యనారాయణ స్వామి ఇంటర్ పూర్తి చేసికొని డిగ్రీకి వచ్చాడు. సత్యం కుటుంబం మధ్య తరగతి కుటుంబం. తండ్రి కృష్ణమూర్తి, చిన్న గవర్నమెంట్ ఉద్యోగి. తల్లి శాంతమ్మ, ఇంటి ఇల్లాలు. సత్యానికి ఒక అక్క కూడా ఉన్నది. ఆమె పేరు విశాలాక్షి. ఆమెకు ఇటీవలే కొంత అప్పు చేసి పెండ్లి చేశారు. సత్యానికి ప్రపంచ వాసనలతో పాటు , కుటుంబ వాసనల అనుభవాలు కూడా రంగరించుకొని ఉండటం వలన తన కుటుంబ స్థితిని బట్టి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చేరాడు. ఉత్త డిగ్రీ చేరితే భవిష్యత్ ఏముంది అని సన్నిహితులు అడిగితే, ఎప్పుడో చివరి మెట్టు ఎక్కుతామని మొదటి మెట్టు మరిచిపోతే బొక్కబొర్లా పడతాము అని హాస్యోక్తిగా చెప్పేవాడు.
తన విద్యాబ్యాసం పూర్తి అయిన నాటికి తండ్రి కూడా రిటైర్ అయినాడు. వచ్చిన బెనిఫిట్స్ లో చాలా భాగం అప్పులు తీర్చి, నెల, నెల వచ్చే పెన్షన్‌తో జీవితం నెట్టుకొస్తున్నారు.
ఒక రోజు బయటకు వెళుతున్న సత్యంతో, తండ్రి కృష్ణమూర్తి, “ఒరే సత్యం ఇలా రా” అని పిలిచాడు.
వెళ్ళబోతున్న సత్యం, “ఏమిటి నాన్నా?” అంటూ వెనక్కు వచ్చాడు.
“కూర్చో”, అంటూ కుర్చీ చూపించాడు కృష్ణమూర్తి.
కుర్చీలో కూర్చొని “ఏమిటి నాన్నా?” అని మళ్ళీ అడిగాడు సత్యం.
“ఉద్యోగాలు దొరకటం కష్టంగా ఉంది. ఏమన్నా టెక్నికల్ కోర్స్ చెయ్యి, ప్రయోజనం ఉంటుందేమో?” అని కొడుక్కి చెప్పాడు కృష్ణమూర్తి.
ఆ మాట విని సత్యం నవ్వుతూ, “ప్రయోజనం ఏమోగానీ, యోజనాల దూరం వెళ్లినా ఈ బొజ్జ నింపుకోవటానికి పిడికెడు అన్నమే. మా ఫ్రెండ్ చిన్న స్కూల్ నడుపుతున్నాడు, అందులో టీచర్‌గా చేరమని అడిగాడు, అందులో చేరతాను” అని చెప్పాడు సత్యం.
“ఎంత ఇస్తారు?” అని తండ్రి అడగ్గా, “ఇంత అని చెప్పలేదు, అతను కూడా క్రొత్తగా స్కూల్ పెట్టాడు. ఊరికినే పని చేయించుకోడు” అని బదులిచ్చాడు సత్యం.
“నీ భవిష్యత్ కూడా చూసుకోవాలి కదా?” అని తండ్రి అడిగాడు.
“మీరు నా భవిష్యత్ గురించి అడుగుతున్నారు, నేను మన పరిస్థితిని గూర్చి ఆలోచిస్తున్నాను” అని సత్యం బదులిచ్చాడు.
“ఉషోదయం అంటే ఊపిరి పీల్చుకోవడం. అస్తమయం అంటే ఊపిరి పీల్చుకోకపోవడం. మా అస్తమయం కోసం నీ ఉషోదయాన్ని నిర్లక్ష్యం చేయవాక. తరువాత నిలబడాలన్నా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది” అని వేదాంత ధోరణిలో చెప్పాడు కృష్ణమూర్తి.
“నాన్నగారూ, వేదాంతంలోనే అనేక సిద్ధాంతాలున్నాయి. ఏ సిద్ధాంతమైనా ఆత్మారాముణ్ణి చల్లబరచడమే” అని నవ్వుతూ చెప్పాడు సత్యం.
కొడుకు మనస్సు ఎరిగిన తండ్రి , ఇంకా సంభాషణను పొడిగించడం ఇష్టం లేక “సరే, నీ ఇష్టం. ఉద్యోగ ప్రయత్నాలు ఆపవాక, గ్రూప్స్ కూడా ప్రిపేర్ కా” అని చెప్పాడు.
“సరే నాన్నగారు” అంటూ సత్యం బయటకు వెళ్ళాడు.
సత్యం టీచర్‌గా పని చేస్తూనే, తండ్రి మాట ప్రకారం గ్రూప్స్, బ్యాంకు పరీక్షలు వ్రాస్తూ ఉన్నాడు. చిన్న చిన్న ఇంటర్వ్యూస్‌కు కూడా హాజరుగుతున్నాడు.
అందరికి కావలసినది, ఎవ్వరికి దొరకని కాలం గడిచిపోతున్నది.
మొత్తానికి సత్యం ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకొంటూ తల్లితండ్రులతో సంతోషం పంచుకొంటూ కాలం వెల్లడిస్తున్నాడు.
ఒక రోజు, సత్యం అమ్మ శాంతమ్మ అతనితో, “మా అన్నయ్యకు తెలిసిన వారికి ఓకే ఒక ఆడపిల్ల ఉన్నదట, పాపం వాళ్ళు కూడా మన లాగే మధ్య తరగతి కుటుంబం, సంబంధాలు వస్తున్నాయి కానీ కట్నాలు లేక పోయినా ఆడంబరాలు ఆడుగుతున్నారుట, వీరు ఇవ్వలేక మౌనంగా ఉన్నారుట. అమ్మాయి ఫోటో కూడా చూపించాడు. పెద్ద అందగత్తె కాకపోయినా ముక్కు మొగము చక్కగా ఉన్నాయి” అని నర్మగర్భంగా చెప్పింది.
సత్యానికి అర్థం అయింది, చిన్నగా నవ్వుతూ, “అమ్మా నీ భావం అర్థమయింది, ఇప్పుడు ఉన్న మన పరిస్థితులలో ఇంకొక మనిషికి, ఆ మనిషి ద్వారా వచ్చే కుటుంబాన్ని పోషించే శక్తి నాకు లేదు, పెండ్లి అనే మాట మనం మర్చిపోదాం” అని చెపుతుండగా..
అప్పుడే వచ్చిన సత్యం తండ్రి, “ఒరే, నీవే అంటావు కదరా? చివరి మెట్టు కాదు, మొదటి మెట్టు గురించి ఆలోచించాలని. కాబట్టి మొదటి మెట్టు నీ పెండ్లి గురించి ఆలోచించు, నా పెళ్లినాటికి నా జీతం నీ జీతంలో పావు భాగమే, నేను ఈదలేదా సంసార భారం?” అని నవ్వుతూ అన్నాడు.
“ఆ రోజులకు, ఈ రోజులకు తేడా ఉన్నది నాన్నా” అన్నాడు సత్యం
“అబ్బా, ఏమిటో ఆ తేడా, ఈ రోజుల్లో సంవత్సరానికి 365 రోజులకు బదులుగా 465 రోజులు వచ్చాయా?, వారానికి పది రో జులు వచ్చాయా?” అని ఎకసెక్కంగా అంటూ.., “అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా కడుపు నిండేంత వరకే తినగలిగేది. ఉన్న రోజు కూర పప్పుతో తింటాము. లేని రోజు పచ్చడి మెతుకులతో తింటాము. అంతే కానీ భోగభాగ్యాలు లేవని, జీవితానందాన్ని వదులుకోకూడదు” అని చెప్పగా..
“అది కాదు నాన్నా”, అని సత్యం ఏదో చెప్పబోగా..
తల్లిదండ్రులిద్దరూ, జంధ్యాల సినిమాలోలా సుత్తి, స్తుతి, మెత్తని మాటలతో సత్యం మనస్సు మార్చి పెండ్లికి ఒప్పుకొనేటట్లు చేశారు.
పెండ్లి చూపులు, మాట్లాడుకోవటాలు అన్ని మమ అనిపించి, ఉన్నంతలో పెండ్లి వేడుకలు పూర్తి చేశారు ఇరువురి పెద్దవారు.
బంధం విలువలు పెంచుకోవటానికి, బంధనాల భోగాలు అనుభవించటానికి ఆధారము ఈ దేహమే కాబట్టి, గృహస్థాశ్రమము స్వీకరించి ఆనంద అనుభవాలను ఆస్వాదించాడు సత్యం. ఆ ఆనందానుభావాలకు గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు కలిగారు. ఒకరి పేరు సుచిత్, రెండవ వాని పేరు కళ్యాణ్. కానీ తన కర్తవ్య లక్ష్యం, తల్లితండ్రుల సుఖసంతోషాలను ఏనాడు మర్చిపోలేదు. భార్య స్థానంలో వచ్చిన కామాక్షి కూడా తన అంతరంగాలను ఎరిగి, చేదోడువాదోడుగా నిలిచింది.
పిల్లలు ఆరోగ్యముగా ఎదుగుతున్నారు, తల్లిదండ్రులు అనారోగ్యములతో బాధపడుతున్నారు. కానీ త్రాసులో ఎన్నడూ తేడాలు రానీయలేదు.
ఎంత గొప్పవాడైనా, చూరుకు తలవంచాలి అన్న సంధాన, విధి నిర్ధారణ ప్రక్రియలో తల్లి గతించింది. చేయవల్సిన కార్యక్రమములు ఉన్నంతలో యథావిధిగా జరిపించి, తండ్రి బాధ్యతలను భార్యకు అప్పచెప్పి తన దైనందన కార్యక్రమములో మునిగిపోయాడు.
దాచుకొన్న డబ్బులతో పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారికి ఒక బాట ఏర్పరచటానికి తాను అలసిపోయినా, ఓటమిని తన దరిచేరకుండా నిరంతర కృషి చేసాడు.
కాల ప్రవాహములో విధి మరల చెడుగుడు ఆడింది. తండ్రి వయోభార రీత్యా పుణ్య లోకాలకు ఏతెంచాడు.
సమయానికి చేతిలో డబ్బులు లేవు, కార్యక్రమాలు ఎలా పూర్తి చేయాలో అర్థం కానీ పరిస్థితి. ఎవ్వరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల ఆలోచనలతో క్రిoదా, మీద పడుతుండగా భార్య కామాక్షి వచ్చి చిన్నగా, “ఏమండీ” అని పిల్చింది.
తల ఎత్తి, “ఏమిటి?” అని అడిగాడు.
“మీ పరిస్థితి నాకు తెలుసు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న బంగారం అమ్మి ఈ కార్యక్రమం ముగిద్దాము” అని నెమ్మదిగా చెప్పింది.
“నీ బంగారమా?” అని ఆశ్చర్యoతో ప్రశ్నించాడు.
“నాది కాదండి, మనది” అని ఆ పరిస్థితులలో కూడా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హాస్యాలాడుతున్న భార్యను చూసి ఖిన్నుడై పోయాడు.
“అది కాదు”, అని ఏదో చెప్పబోతుండగా..
“మీరు కృష్ణుడు కాదు, నేను అర్జునుడిని కాదు. ఇది గీత బోధించే సమయం కాదు, వెంటనే వెళ్లి పని పూర్తిచేయండి” అని, ఉన్న నగలు చిన్న బ్యాగ్‌లో పెట్టి సత్యం చేతికి ఇచ్చిoది.
సహజీవనం అంటే పడకలో తోడు కాదు, నడకలో తోడుంటము అని కామాక్షిని చూసి నేర్చుకోవాలని అనుకొంటూ, “ఇక్కడ పనులను మీ నాన్న గారిని చూస్తూ ఉండమను” అని చెప్పి నగల బ్యాగ్ తీసికొని బయటకు వెళ్ళాడు. నగలు అమ్మగా వచ్చిన డబ్బుతోనూ, స్నేహితుల సహాయముతో జరగవలసిన తంతు ముగించాడు.
అదృష్టదురదృష్టాల కవలల సాంగత్యములో, పిల్లలకు ఉద్యోగాలు వచ్చి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు. పిల్లలిద్దరికి పెళ్లిళ్లు చేసి బాధ్యత ముసుగులోనుంచి బయట పడ్డాడు.
చైతన్యం అనేది ఆరంభ అరుపులు, నిరాశ అంతాలు కాదు. ఆరంభ, అంతాల మధ్య సాగే ప్రయాణమే చైతన్యం. ఈ ప్రయాణములో చైతన్యం మూడు రకాల అవస్థలలో ఉంటుంది. అవి 1)మెలకువ (జాగరూకత) 2) కల (స్వప్నం), 3) సుషుప్తి (గాఢ నిద్ర).
ఇది నెరవేర్చుకొనటానికి వేదాలు, ఉపనిషత్తులు చదవనవసరం లేదు. దేశభక్తిని చాటుకొనుటకు ఎదుటి వాడి తల నరకనవసరం లేదు. ఎవరు సహాయం అందించలేదని నిరుత్సాహ పడనవసరం లేదు
పరిస్థితులను చూసుకొని, బాధ్యతలను మరువకుండా ఆత్మతత్వంతో మన కలల రూపాలను ఎన్నుకొని, జాగురూకతతో నెరవేర్చుకొని, ఇక ఏమిలేదు అని సుషుప్తిలో చైతన్యం పొందుతాడో వాడే తత్వమసి. ఇప్పుడు ఈ జీవికి స్తబ్ధత తప్ప జాగ్రదావస్థ, స్వప్నావస్థ లేవు. స్తబ్ధత అంటే అంటి, అంటని స్థితి. అందువలన సత్యం అనే జీవి తత్వమసి అయినాడు.
తానొవ్వక, ఇతరులను నొప్పించక గడిపే జీవితం దేశానికి వెలుగు నివ్వకపోయినా, మంటలలో తగలబెట్టటానికి ఆహుతి అయ్యే సమిధలు కాకుండా ఉండటమే దేశ ఋణ త్యాగం.
