Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్కోర్సేసీ మాస్టర్‌పీస్ ‘ట్యాక్సీ డ్రైవర్’కి 50 ఏళ్ళు

[సంచిక పాఠకుల కోసం ‘ట్యాక్సీ డ్రైవర్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు శ్రీ పి.వి. సత్యనారాయణ రాజు.]

ప్రపంచ సినిమా అభిమానుల్లో దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ పేరు తెలియనివారు ఉండరు. 1967లో ఆయన మొదటి చిత్రం ‘హూజ్ నాకింగ్ ఎట్ ద డోర్’ విడుదలైంది. ఆయనకి అప్పుడు 25 ఏళ్ళు. ఆయన తాజా చిత్రం ‘వాట్ హ్యాపెన్స్ ఎట్ నైట్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఆయన చిత్రాలలో ఎక్కువగా కనిపించేది లోపాలున్న పాత్రలు (flawed characters). నిజజీవితంలో లోపాలు లేనివారు ఎవరూ ఉండరు. అలాగే ఆయన చిత్రాల్లో కూడా లోపాలు లేనివారు అరుదుగా ఉంటారు. ఆ లోపాలకి కారణం మానసిక వ్యాధి కావచ్చు లేదా తాము చేస్తున్నది ఎంత తప్పైనా అదే సరైనది అనుకునే స్వభావం కావచ్చు.

స్కోర్సేసీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మొదటి చిత్రం ‘ట్యాక్సీ డ్రైవర్’ (1976). ఆ చిత్రం విడుదలై ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. అమెరికా ఆధిపత్య ధోరణికి బలైపోయిన వారు ఇతర దేశాల పాలకులు, ప్రజలే కాదు, తమ సొంత సైనికులు కూడా. వియత్నాం యుద్ధంలో పోరాడి స్వదేశానికి తిరిగి వెళ్ళిన ఒక 26 ఏళ్ళ సైనికుడి కథ ‘ట్యాక్సీ డ్రైవర్’. అతని పేరు ట్రావిస్ బికిల్. దేశం కోసం సైన్యం పోరాడుతుంటే దేశాన్ని అవినీతి కబళించటం, ఒక సైనికుడు ఆ అవినీతిని చూసి రగిలిపోవటం మనం కొన్ని భారతీయ సినిమాల్లో చూశాం. అమెరికాలో అవినీతి కింది స్థాయిలో ఉండదు. అంతా పైస్థాయిలోనే. ట్రావిస్‌ని బాధించేది అవినీతి కాదు, మనుషుల నీతిమాలినతనం. కానీ దానిలో ఎన్నో కోణాలు ఉన్నాయి.

ముందుగా స్థూలంగా కథ చెప్పుకుందాం. ట్రావిస్ వియత్నాం యుద్ధం నుంచి అమెరికాకి తిరిగివెళతాడు. న్యూ యార్క్ నగరంలో ఒంటరిగా ఉంటాడు. యుద్ధం గురించిన జ్ఞాపకాలతో అతనికి రాత్రుళ్ళు నిద్రపట్టదు. రాత్రి పూట ట్యాక్సీ నడపటం మొదలుపెడతాడు. డ్రగ్స్ బానిసలు, వేశ్యలు తిరిగే సమయం అదే. అవన్నీ చూసి అతను మరీ కుంగిపోతాడు. మరో పక్క థియేటర్లో అశ్లీల చిత్రాలు చూస్తుంటాడు. ఇదిలా ఉండగా బెట్సీ అనే అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. ఆ అమ్మాయి కూడా ఇతని గంభీర ధోరణి చూసి ఆసక్తి కొద్దీ అతనితో డేట్‌కి వెళుతుంది. రెండో డేట్‌కి ఓ అశ్లీల చిత్రానికి తీసుకువెళితే ఏవగించుకుని వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. ఆమె ఒక రాజకీయనాయకుడికి అధ్యక్ష పదవి ప్రచారం చేసే కార్యకర్త. ఆ రాజకీయనాయకుడి ప్రభావంలో పడి ఆమె తన విలువ తెలుసుకోవటం లేదని భావించి అతను ఆ రాజకీయనాయకుడిని హత్య చేద్దామనుకుంటాడు. తుపాకీలు కొంటాడు. కానీ భద్రతా బలగాలను దాటుకుని వెళ్ళటం సాధ్యం కాక విఫలమవుతాడు. ఐరిస్ అనే ఓ పన్నెండేళ్ళ వేశ్య అతనికి తారసపడుతుంది. ఆమెని ఆ మురికికూపం నుంచి తప్పించాలని ఆమెకి సాయం చేయాలనుకుంటాడు. కానీ ఆమె తన దళారీ తనని ప్రేమిస్తున్నాడని, అదే చాలని అనుకుంటుంది. ఆమెని ఎలాగైనా కాపాడాలని ట్రావిస్ వ్యభిచారగృహం మీద దాడి చేసి దళారీని, అక్కడ ఉన్నవాళ్ళని చంపేస్తాడు. దాంతో అతను అమాంతం హీరో అయిపోతాడు. అతని పేరు దేశమంతా మారుమోగిపోతుంది. ఐరిస్ తన తలిదండ్రుల దగ్గరకి చేరుకుంటుంది. ఆమె తండ్రి ట్రావిస్‌కి కృతజ్ఞతలు చెబుతాడు. ఇదంతా జరిగాక ఒకరోజు బెట్సీ అతని టాక్సీ ఎక్కుతుంది. అతనితో మన్ననగా మాట్లాడుతుంది. కానీ అతను ఆమెని ఇంటి దగ్గర దింపేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఇది పైకి కనిపించే కథ. దీనికి ఎన్నో వ్యాఖ్యానాలు చేయవచ్చు. నాకు తోచినది ఈ వ్యాసంలో చెప్పబోతున్నాను. చిత్రంలో ట్రావిస్‌గా రాబర్ట్ డినీరో, బెట్సీగా సిబిల్ షెపర్డ్, ఐరిస్‌గా జోడీ ఫోస్టర్ నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. సినిమా అభిమానులు తప్పకుండా చూడవలసిన చిత్రమిది.

ట్రావిస్ తలిదండ్రులు వేరే ఊళ్ళో ఉంటారు. మరి ట్రావిస్ వియత్నాం నుంచి వచ్చి వారి దగ్గరకు వెళ్ళక ఒంటరిగా ఎందుకు ఉంటాడు? కాస్త ఆలోచిస్తే అతని మానసిక సమస్యలు యుద్ధం వల్ల మొదలయినవి కావని అనిపిస్తుంది. చిన్నప్పుడే అతనికి ఏదో దెబ్బ తగిలింది. బెట్సీ అతన్ని వదిలి వెళ్ళినపుడు అతను “ఆమె కూడా అందరి లాంటిదే. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంతే. వాళ్ళంతా ఒక సంఘం” అంటాడు. అతను యుద్ధభూమి నుంచి వచ్చాడు. బహుశా 20 ఏళ్ళ వయసులో యుద్ధభూమి వెళ్ళి ఉంటాడు. ఆ వయసులో అతనికి మోసం ఏ జరిగి ఉంటుంది? బహుశా తల్లి ప్రేమ దక్కలేదేమో. ఆమె ఏమైనా నీతిమాలిన పని చేసిందేమో. అసలు అందుకే అతను సైన్యంలో చేరిపోయాడేమో. ఈ రోజుల్లో మనం మన దేశంలో పిల్లలను చంపే తల్లుల గురించి వింటున్నాం. అమెరికా ఎప్పుడో అభివృద్ధి చెందింది కదా! పిల్లలని నిరాదరణకి గురిచేసే తల్లులు ఉండటం ఆశ్చర్యం కాదు. అదే అతని మానసిక సమస్యలకి నాంది అయిందని నా అభిప్రాయం. యుద్ధంలో చూసిన భయానక దృశ్యాలు అతన్ని కలవరపరిచాయి. సైన్యంలో చేరి తప్పు చేశానని అనిపించింది. పైగా అదేం ధర్మయుద్ధం కాదు, అమెరికా చేసేవి ఏవీ ధర్మయుద్ధాలు కావు. ఆభిజాత్యంతో చేసిన యుద్ధంలో తానొక పావునయ్యానని అతనికి అనిపించింది. రాజకీయనాయకుల మీద ద్వేషం అక్కడ పుట్టింది. సొంత ఊరికి వెళ్ళలేడు. చిన్నప్పుడే ప్రేమించని తల్లి ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటుందా? న్యూ యార్క్ లాంటి నగరంలో అయితే అతని మానాన అతను ఉండొచ్చు. బయటి ప్రపంచం సంగతి ఎలా ఉన్నా తనతో తాను ఉండటం అతనికి దుస్సాధ్యం అయింది. నిద్రపట్టక రాత్రి ట్యాక్సీ నడుపుతాడు. పురుగుల్లా బతికే మనుషుల్ని చూస్తాడు. అతని ట్యాక్సీలో కొందరు పెద్దమనుషులు వేశ్యలని ఎక్కించుకుని శృంగారం నెరపటం కూడా జరుగుతుంది. వాళ్లు దిగిపోయాక ట్యాక్సీని శుభ్రం చేసుకుంటాడు ట్రావిస్. ఇదంతా చూసి ‘ఎంత నికృష్టం!’ అనుకుంటాడు.

అది నికృష్టం అనుకున్నవాడు అశ్లీల చిత్రాలు ఎందుకు చూస్తాడు? ఆ చిత్రాలు చూసేటప్పుడు అతనిలో ఉద్రేకం ఏమీ కనపడదు. అతను బండబారిపోయినట్టు అనిపిస్తుంది. అమెరికాలో 60వ దశకంలో లైంగిక స్వేచ్ఛ పెరిగింది. అశ్లీల చిత్రాలు కూడా పెరిగాయి. ఏదైనా మితంగా ఉంటే గొడవ లేదు. కానీ ట్రావిస్ లాంటి తాడూ బొంగరం లేని వారు అడ్డులేకుండా అశ్లీల చిత్రాలు చూస్తే కొన్నాళ్ళకి మనసు మొద్దుబారిపోకుండా ఎలా ఉంటుంది? పైగా బెట్సీని డేట్ మీద అశ్లీల చిత్రానికి తీసుకువెళతాడు. ఎంత మొద్దుబారిపోయినా మరీ అంత తెలివితక్కువ పని ఎందుకు చేశాడు? ఇక్కడ ఒక విచిత్ర మానసిక ప్రవృత్తి గురించి చెప్పుకోవాలి. కొంతమంది తమ పనులు తామే చెడగొట్టుకుంటారు (Self-sabotage). వారి అంతఃచేతన వారి చేత అలా చేయిస్తుంది. బెట్సీతో బంధాన్ని తనకి తెలియకుండానే విచ్ఛిన్నం చేసుకోవటానికే ట్రావిస్ ఆ పని చేశాడు. తనని ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు. ఈమె కూడా తనని వదిలిపోతే ఆ విషయం రూఢి అయిపోతుందని అతని లోపలి మనిషి భావన. అది అతనికే తెలియదు. ఇలా కూడా జరుగుతుందా? ‘అందరూ నన్ను మోసం చేసేవారే’ అనుకునేవారు తమకి తెలియకుండానే తమ దగ్గరకి వచ్చేవారిని ఏదోలా దూరం చేసుకుంటారు. ‘వారెలాగూ మోసం చేస్తారు కాబట్టి నేనే ముందు వారిని తరిమేస్తే మోసపోయే ఆస్కారం ఉండదు’ కదా అనుకుంటారు. ఇది చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు ఉంటుంది. మనసు చేసే వికృతాలు అన్నీ ఇన్నీ కావు.

ఒకరోజు బెట్సీ ప్రచారం చేసే రాజకీయనాయకుడు ట్రావిస్ ట్యాక్సీ ఎక్కుతాడు. అప్పటికి బెట్సీ ట్రావిస్‌ని వదిలి వెళ్ళలేదు. ట్రావిస్ “మీకే ఓటెయ్యాలని నేను అందరికీ చెబుతున్నాను” అంటాడు. బెట్సీ మాయలో ఉన్నాడతను. ఆ నాయకుడు “ఈ దేశంలో నువ్వు కోరుకునే ఒక్క మార్పు ఏమిటో చెప్పు” అంటాడు. “ఈ నగరాన్ని మాత్రం శుద్ధి చెయ్యాలి. చుట్టచుట్టి డ్రైనేజీలో పారేసినా తప్పు లేదు” అంటాడు. ఆ నాయకుడు ఖంగు తింటాడు. మనకి ట్రావిస్ సంగతి తెలుసు కాబట్టి అతనలా మాట్లాడటం మనకి ఆశ్చర్యంగా ఉండదు. కానీ ఒక కొత్త వ్యక్తి అలా మాట్లాడితే ఎవరైనా అవాక్కవుతారు. కానీ ఓటరు మాటలకి ఖంగు తిని మారుమాటాడకపోతే వాడు నాయకుడెలా అవుతాడు? ఆ నాయకుడు వెంటనే తేరుకుని నాయకుల ధోరణిలో “అదంత తేలిక కాదు. మనమంతా కలిసి పెను మార్పులు చేయాలి” అంటాడు. ట్రావిస్ తెలివైనవాడు. అతనికి ఆ నాయకుడివి అన్నీ డొల్ల మాటలే అని తెలిసిపోతుంది. బెట్సీ వదిలి వెళ్ళిపోయాక ఆ నాయకుడి మీద పగ పెంచుకుంటాడు. ఆ రాకుమారిని గుప్పిట్లో పెట్టుకున్న ఒంటికన్ను రాక్షసుడు అతనే కదా మరి!

అశ్లీల చిత్రం నుంచి బెట్సీ వెళ్ళిపోయాక ట్రావిస్ ఆమెని మళ్ళీ కలవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. పూలగుచ్ఛాలు పంపిస్తాడు. ఆమె అన్నీ తిప్పికొడుతుంది. ఒకరోజు ఫోన్ చేస్తాడు. “నీకు అలాంటి సినిమాలు ఇష్టం ఉండదని నాకు తెలియదు. ఓరోజు డిన్నర్‌కి వెళదామా? పోనీ కాఫీ తాగడానికి వెళదామా? నేను పంపిన పువ్వులు అందాయా? నీకు మళ్ళీ ఫోన్ చేయవచ్చా?” అని అడుగుతాడు. అతని ప్రశ్నలన్నిటికీ ఆమె వద్దు, లేదు అనే సమాధానాలే చెబుతుంది. ఈ సన్నివేశంలో ఆమె కనపడదు, ఆమె గొంతు వినపడదు. ట్రావిస్ కనపడతాడు, కానీ అతను మాట్లాడుతుండగానే కెమెరా అతని మీద నుంచి చూపు మరల్చుతుంది. అతనికి ఎదురైన అవమానాన్ని చూపిస్తూ ఆతన్ని ఇంకా అవమానానికి గురి చేయటం ఎందుకని కెమెరా తిప్పినట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి మనతో చూపు కలపలేకపోతే మనం కూడా చూపు తిప్పుకుంటాం కదా, అలాగ. ఒకరోజు అతను బెట్సీ దగ్గరకి వెళ్ళి ఆమెని తిట్టి వచ్చేస్తాడు. “వీళ్ళంతా కలిసి నిన్ను నాశనం చేసేస్తారు” అంటాడు. చివరికి ‘ఆడవాళ్ళంతే ఇంతే’ అనుకుంటాడు.

ఇక్కడొక ఆసక్తికర సన్నివేశం వస్తుంది. ఒకతను (పేరు జాన్ అనుకుందాం) ట్రావిస్ ట్యాక్సీ ఎక్కుతాడు. గమ్యం చేరాక మీటర్ (అప్పట్లో ట్యాక్సీలకి మీటర్లుండేవి. దూరాన్ని బట్టి మీటర్లో అద్దె పెరుగుతూ ఉంటుంది) ఆపకుండా కూర్చోమంటాడు జాన్. కనపడుతున్న బిల్డింగ్‌లో రెండో అంతస్తులో కిటికీ దగ్గర లోదుస్తులు వేసుకున్న ఒక స్త్రీ రూపం కనిపిస్తుంది. జాన్ “ఆమెని చూడు. ఆమె ఎవరో తెలుసా? నా భార్య. కానీ అది నా అపార్ట్‌మెంట్ కాదు. ఆ అపార్ట్‌మెంట్ ఎవరిదో తెలుసా? ఒక నిగర్‌ది (నల్లజాతి వారికి వాడే అవమానకర పదం). నేను ఓ .44 రివాల్వర్‌తో ఆమెని చంపేస్తాను. నేను ఉన్మాదిలా కనిపిస్తున్నానా? నీకు నేనంటే భయంగా ఉందా?” అంటాడు. ట్రావిస్ ఊపిరి బిగబట్టి ఉండిపోతాడు. పెరుగుట విరుగుట కొరకే అని డబ్బు ధారాళంగా వస్తుంటే మనుషులు పెడదారి పడతారు. ఇప్పుడు మన దేశంలో కూడా అక్రమసంబంధాలు పెరుగుతున్నాయి. జాన్ భార్య అక్రమసంబంధం పెట్టుకుంది. జాన్ జాతివివక్ష చూపిస్తూ ఒక నల్లజాతి వాడి కన్నా నేను తక్కువా అన్నట్టు మాట్లాడతాడు. ట్రావిస్‌కి ఈ సంఘటన ఒక ఉత్ప్రేరకంగా మారుతుంది. అవును, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నవారిని చంపినా తప్పు లేదు అనుకుంటాడు. కానీ తన దారి తప్పేమో అనే ఆలోచన కూడా వస్తుంది. తన తోటి ట్యాక్సీ డ్రైవర్‌తో “నాకేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయ్. ఏం చెయ్యాలి?” అంటాడు. అసలు విషయం చెప్పడు. ఆ మిత్రుడు “మన బతుకులింతే. ఊరికే ఆలోచించకు. ఎవరైనా అమ్మాయి దగ్గరకి వెళ్ళి జల్సా చెయ్” అని ఉచిత సలహా పారేస్తాడు. ఇంకా జుగుప్స కలుగుతుంది ట్రావిస్‌కి. చివరికి రాజకీయనాయకుడిని చంపాలనే నిశ్చయించుకుంటాడు. ఇంతకీ జాన్ పాత్ర పోషించినది ఎవరో కాదు, స్కోర్సేసీయే.

ట్రావిస్ బ్లాక్ మార్కెట్లో తుపాకీలు కొంటాడు. ఒకటి కాదు నాలుగు. వాటిని తన దుస్తుల్లో దాచుకుంటాడు. దాచిన ఒక తుపాకీ అవసరమైనపుడు వెంటనే చేతిలోకి వచ్చేలా స్ప్రింగులతో ఒక చిన్న ట్రాక్ లాంటిది తయారు చేసుకుంటాడు. దేహదారుఢ్యం పెంచుకుంటాడు. తుపాకీ కాల్చటం సాధన చేస్తాడు. తన తలిదండ్రులకి ఒక ఉత్తరం రాస్తాడు. “నేను బోలెడు డబ్బు సంపాదిస్తున్నాను. నాకు బెట్సీ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం ఆనందంగా ఉన్నాం. త్వరలో వస్తాను” అని రాస్తాడు. ఇదంతా అబద్ధమే. అంతకన్నా తన తల్లిని ఉడికించటానికి చేసిన ప్రయత్నం ఇది. ఒకరోజు నాయకుడు ప్రచారానికి వచ్చే చోటికి వెళతాడు. అక్కడ ఒక రహస్య భద్రతా ఏజెంట్‌ని గుర్తుపట్టి అతనితో మాట్లాడతాడు. “నేను కూడా రహస్య ఏజెంట్ అవుదామనుకుంటున్నాను. నేను ఆ పని బాగా చేయగలను” అంటాడు. ఇది తెలివి తక్కువ పనిలా అనిపిస్తుంది. అతని మానసిక స్థితి అలాంటిది. ఆ ఏజెంట్‌కి అనుమానం వస్తుంది. రాదూ మరి? “నీ అడ్రసు చెప్పు. ఏజెంట్ కావటానికి కావల్సిన సమాచారం నీకు పంపిస్తాను” అంటాడు. ట్రావిస్ మరీ దద్దమ్మ కాదు. తప్పుడు పేరు, అడ్రసు ఇచ్చి వచ్చేస్తాడు. మరోసారి ఇంకో ప్రచారసభకి ట్యాక్సీలో వెళతాడు. పోలీసు వచ్చి “ఇక్కడ ట్యాక్సీ ఆపకూడదు. పో” అంటాడు. ఇలా అతని ప్రయత్నాలు విఫలమవుతాయి.

ఇదంతా జరుగుతూ ఉండగా ఒకసారి ఒక వేశ్య అతని ట్యాక్సీ ఎక్కుతుంది. ఆమె అమ్మాయిది చిన్న వయసు. ఒకతను వచ్చి ఆమెని లాక్కుపోతాడు. మళ్ళీ ఆ అమ్మాయి ట్రావిస్‌కి తారసపడుతుంది. నాయకుడిని హత్య చేయటం తేలిక కాదని తెలిశాక అతను ఆ అమ్మాయి మీద దృష్టి పెడతాడు. ఒక విటుడిలా ఆమె దళారీతో మాట్లాడతాడు. ఆ దళారీకి ముప్ఫై ఏళ్ళ లోపే ఉంటాయి. ట్రావిస్ బేరం మాట్లాడుకుని ఆ అమ్మాయి దగ్గరకి వెళతాడు. ఆమె పేరు ఐరిస్. పన్నెండు దాటి పదమూడో ఏడులో ఉంది. అతనితో ఎలాంటి లైంగిక చేష్టకైనా సిద్ధంగా ఉంటుంది. అతను ఆమెతో “నువ్విలాంటి పని చేయకూడదు. హాయిగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు నీది” అంటాడు. ఆమె మొదట చిరాకుపడుతుంది. తన దళారీకి తనంటే ప్రేమ అంటుంది. ట్రావిస్ అసహనం చూపిస్తే అతను అందరు విటుల్లా కాదని, అతని మనసు మంచిదని తెలుసుకుంటుంది. మర్నాడు అతన్ని ఒక రెస్టారెంట్లో కలుస్తుంది. అతను ఆమెని వేశ్యావృత్తి మానేయటానికి ఒప్పిస్తాడు. తానొక ముఖ్యమైన ప్రభుత్వ కార్యం మీద వెళుతున్నానని, మళ్ళీ కలుస్తానని అంటాడు. ఆ ప్రభుత్వ కార్యం ఏమిటంటే తాను చచ్చి అయినా ఆ రాజకీయనాయకుడిని చంపటం. తన డబ్బంతా ఐరిస్‌కి చెందేటట్టు రాసి “ఈ డబ్బు నీకు అందేసరికి నేను చచ్చిపోతాను” అని రాస్తాడు. ఆమెతో పరిచయం అతనికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె కోసం తాను చచ్చిపోవటానికి సిద్ధపడతాడు. ఏదో ఒక లక్ష్యం లేకపోతే మనిషి పిచ్చివాడైపోతాడు. అతను పెట్టుకున్న లక్ష్యం అది.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మానసికవైద్యులు పేషెంట్లని సాధారణంగా అడిగే ప్రశ్న “చిన్నప్పటి నువ్వు నీకు ఎదురుపడితే ఏం చెబుతావు?” అని. చిన్నప్పుడు వేదనపడిన వారికి ఇదో సాంత్వన కలిగించే ప్రక్రియ. చిన్నప్పుడు పెద్దల ప్రవర్తన అర్థం చేసుకోలేక ‘నేనంటే ఇష్టం లేకనే పెద్దలు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అనుకుంటారు పిల్లలు. కానీ పెద్దయ్యాక పెద్దల స్వార్థానికి చాలా కారణాలున్నాయని అర్థం అవుతుంది. కామానికి, ధనానికి పెద్దలు దాసులని తెలుస్తుంది. అప్పుడు చిన్నప్పటి తాను కనపడితే ‘నీ తప్పు లేదు’ అని చెప్పాలనిపిస్తుంది. ట్రావిస్ ఐరిస్‌ని కాపాడాలనుకోవటానికి ఇదో కారణం. ఆమెలో చిన్నప్పటి తనని చూసుకున్నాడు. ఆమెని ఈ కుళ్ళు ప్రపంచం నుంచి కాపాడితే తనకి కూడ సాంత్వన లభిస్తుందని అతని భావన.

ట్రావిస్ తన జుట్టు మోహాక్ స్టైల్లో కత్తిరించుకుని నాయకుడి ర్యాలీకి వెళతాడు. జనంలో కలిసిపోయి నాయకుడి దగ్గరకి వెళ్ళి అతన్ని చంపాలని అనుకుంటాడు. కానీ అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకుంటారు. అతని పారిపోతుంటే వెంటపడతారు. అతను తప్పించుకుంటాడు. కసిగా వేశ్యాగృహం దగ్గరకి వెళతాడు. అప్పటికే దళారీ ఐరిస్‌కి మాయమాటలు చెప్పి ఆమెని మళ్ళీ ఒక విటుడి దగ్గరకి పంపిస్తాడు. కోపంతో ట్రావిస్ దళారీని పొట్టలో కాల్చి వేశ్యాగృహంలోకి వెళతాడు. అక్కడ ఉన్న కాపలావాడిని కాలుస్తాడు. అతను ట్రావిస్‌ని గాయపరుస్తాడు. దళారీ కూడా వెంటపడి వచ్చి ట్రావిస్‌ని గాయపరుస్తాడు. ట్రావిస్ దళారీని చంపేస్తాడు. లోపలికి వెళ్ళి ఐరిస్ దగ్గర ఉన్న విటుడిని కాలుస్తాడు. కాపలావాడు లోపలికి వస్తాడు. అతను ముఖం మీద తుపాకీ పెట్టి కాలుస్తాడు. ఐరిస్ భయభ్రాంతురాలై వణుకుతూ ఒకపక్క నక్కి ఉంటుంది. చివరికి ట్రావిస్ తుపాకీతో ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు. కానీ తూటాలు లేక తుపాకీ పేలదు. పోలీసులు వస్తారు. అతన్ని అరెస్టు చేస్తారు.

అతను ఐరిస్‌ని విడిపించటానికే హత్యలు చేశాడని తెలిసి అతన్ని న్యాయస్థానం విడుదల చేస్తుంది. ఐరిస్ తలిదండ్రుల దగ్గరకి చేరుతుంది. వార్తాపత్రికలు ట్రావిస్‌ని ఆకాశానికి ఎత్తేస్తాయి. గాయాల నుంచి కోలుకుని ట్రావిస్ మళ్ళీ ట్యాక్సీ నడుపుతూ ఉంటాడు. ఒక రాత్రి బెట్సీ అతని ట్యాక్సీ ఎక్కుతుంది. “నీ గురించి పత్రికల్లో చదివాను” అంటుంది. “గోరంతలు కొండంతలు చేశారు. ఏమీ లేదు” అంటాడతను. రియర్ వ్యూ మిర్రర్‌లో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆమె చూపుల్లో ఒక రకమైన ఆరాధన ఉంటుంది. ఆమె ఇల్లు చేరుకున్నాక “ఎంత అయింది?” అని అడుగుతుంది. అతను ఒక చిరునవ్వు నవ్వి కారు నడుపుకుంటూ వెళ్ళిపోతాడు.

ఈ చివరి పేరాలో చెప్పిన కథ చిత్రంలో నిజంగా జరగలేదని నాకనిపించింది. వేశ్యాగృహంలో గాయపడిన ట్రావిస్ కొన ఊపిరితో ఉండగా ఊహించుకున్న కథే ఈ చివరి పేరా. హత్యలు చేసిన వాడిని కోర్టులు అంత తేలిగ్గా వదలవు. వదిలేసినట్టు ట్రావిస్ ఊహించుకున్నాడు. చివర్లో ఐరిస్ తలిదండ్రుల ఫోటో ఒకటి వార్తాపత్రికలో కనిపిస్తుంది. వాళ్ళు ముసలివాళ్ళు. పన్నెండేళ్ళ అమ్మాయికి ముసలి తలిదండ్రులు ఉండటం అరుదు. ట్రావిస్ తన తలిదండ్రులనే ఐరిస్ తలిదండ్రులుగా ఊహించుకున్నాడు. ఒక హీరోలాగ బయటపడిన ట్రావిస్ మళ్ళీ రాత్రి వేళ ట్యాక్సీ నడపటం అసమంజసం. అతనికి తాను చేసిన ఘనకార్యానికి సాంత్వన కలిగి నిద్రలేమి పోవాలి. అతని వచ్చిన ఖ్యాతికి ఎవరో ఒకరు ఏ చిన్న ఉద్యోగమో ఇవ్వకపోరు. కానీ అతను ఇంకా ట్యాక్సీ నడుపుతున్నాడంటే అది అతని ఊహే. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు కూడా అతని ఊహే. బెట్సీ ఆ వార్తలు చదవటం అతని ఊహే. ఆమె అతని ట్యాక్సీ ఎక్కటం అతని ఊహే. ఆమె తనని ఆరాధనగా చూసినా అతను ఆమెని పట్టించుకోకపోవటం అన్నిటి కన్నా పెద్ద ఊహ. అతను వేశ్యాగృహంలోనే గాయాలతో మరణించాడని నాకనిపించింది.

సమాజంలో కొందరు ఒంటరితనాన్ని భరించలేక సతమతమవుతూ ఉంటారు. ట్రావిస్‌కి బాల్యం ప్రేమరాహిత్యంతో గడిచింది. సైన్యంలో చేరి ఏదో సాధిద్దామనుకున్నాడు. అక్కడా నిరాశే. పైగా మానసికంగా కుంగదీసింది. ఇలాంటివారు ఒంటరిగా ఉంటే క్షోభ తప్పదు. హైదరాబాద్‌లో ఒక తల్లి ఒంటరితనం భరించలేక తన ఇద్దరు బిడ్డలని తీసుకుని రైలు కింద పడి చనిపోయిందనే వార్త చదివి మనం నివ్వెరపోయాం. అలాంటి వారు ఇతరులు ఉంటారు. అలాంటి వారిలో ట్రావిస్ ఒకడు. ఏదైనా స్వచ్ఛంద సేవ చేస్తే మనసుకి ప్రశాంతత ఉంటుంది. అమెరికాలో ఎప్పటి నుంచో సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటివి అందుబాటులోకి వచ్చాయి. తమ లాంటి ఇతరులతో కలిసి తమ బాధలను పంచుకోవటం ఈ బృందాల ముఖ్య ఉద్దేశం. నాలాగే ఇంకా ఉన్నారు అనుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుంది. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. అమెరికా లాంటి దేశాలు స్వార్థ ప్రయోజనాల కోసం సైన్యాన్ని యుధ్ధానికి పంపుతాయి. ప్రయోజనాలే తప్పయినప్పుడు సైన్యం ఆ తప్పులో భాగమయినట్టే. మరి సైన్యంలో చేరకూడదా? దీనికి సమాధానం తేలిక కాదు. అమెరికా ప్రజలు తమ రాజకీయ వ్యవస్థ గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మెజారిటీ ప్రజలే ఆధిపత్య కాంక్ష కలవారైతే పర్యవసానాలు అనుభవించకతప్పదు. అవి ప్రస్తుతం వ్యక్తిగత పర్యవసానాలే కావచ్చు. భవిష్యత్తులో దేశమంతా అనుభవించవలసి రావచ్చు.

Exit mobile version