[డా. నూకరాజు బెందుకుర్తి రచించిన ‘టీ కప్పు – అస్తిత్వానికి ఒక వలయం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఒక చిన్న టీ కప్పు,
దానిలో విశ్వం ఇమిడిపోయింది.
పాలూ కాదు, టీ కూడా కాదు..
సమయం ద్రవరూపంలో మరిగింది.
వలయంగా ఉన్న కప్పు
ప్రారంభం లేని తర్కం,
ముగింపు లేని ప్రశ్న.
ఖాళీ అయినప్పుడే
దాని అర్థం తెలుస్తుంది.
ఒక సిప్..
గతానికి విరామం,
మరో సిప్..
భవిష్యత్తుకు ఆలస్యం.
వర్తమానం
రెండు పెదవుల మధ్య
తాత్కాలికంగా నిలుస్తుంది.
కప్పు చెబుతుంది:
“నేను నిండినప్పుడే కాదు,
ఖాళీ అయినప్పుడే ఉపయోగం.”
శూన్యతే సామర్థ్యం..
మెటాఫిజిక్స్ తల ఊపుతుంది.
చక్కెర కరుగుతుంది,
లాజిక్‌లా,
కానీ వేడి మిగులుతుంది..
అనుభవం ఎప్పుడూ
తర్కం కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది.
చివరికి
టీ చల్లారుతుంది,
కప్పు మిగులుతుంది.
మనిషి ఆలోచనలా
విషయం పోయినా
ఆకారం కొనసాగుతుంది.
ఒక టీ కప్పు
ఆహారం కాదు,
ఆశ్వాసం కాదు;
జీవితం తనను తానే
కొంచెం ఆలస్యం చేసుకునే
ఒక తాత్విక పరికరం.
