[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన – టీచర‘మ్మ’ – అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
రాత్రి పనంతా అయ్యాక, రేపు డిగ్రీ క్లాసులో చెప్పవలసిన కవితను చదువుకుంటున్నాను. నేనో తెలుగు లెక్చరర్‌ని. అమ్మ గొప్పతనాన్ని, అమ్మలోని ఉపాధ్యాయినిని గురించి వివరించే కవిత ఇది. చదువుతుంటే నాకు కమలక్క గుర్తొచ్చింది.
నిజంగా, కమలక్కలో అమ్మ ఉంది. మంచి ఉపాధ్యాయిని ఉంది. తన కూతుర్నే కాదు ఎవరినైనా సొంతవాళ్ళలా ప్రేమించే అమ్మతనం ఉంది. కమలక్క పదవ తరగతి వరకే చదివింది. తనని డిగ్రీ చదివించి టీచర్ ట్రైనింగ్ చేయిస్తే మంచి టీచరు అయివుండేది. కాని, చదువు ఎక్కువైన కొద్దీ ఎక్కువ చదివిన వరుణ్ణి చూడాలని, పదవ తరగతితో ఆపేసి పెళ్లి చేసేశారు.
కమలక్క మా పెద్దమ్మ కూతురు. పెళ్లయ్యాక మా బావగారి ఉద్యోగరీత్యా అక్క బెంగళూరు వెళ్ళిపోయింది. వాళ్ళ కొక అమ్మాయి. అది ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నేను ఒక ప్రాజెక్టులో పనిచేయటానికి ఒక సంవత్సరం పాటు బెంగళూరులో ఉండవలసి వచ్చింది. ఆ కొత్త ప్రదేశంలో, మన భాష కాని ప్రాంతంలో హాస్టల్‌లో ఉంచటానికి మా అమ్మ వాళ్ళు ఇష్టపడలేదు. ఆ సమయంలో కమలక్క పెద్దమ్మ వాళ్ళింటికి వచ్చింది. పెద్దమ్మ వాళ్ళు, మేమూ గుంటూరులో ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళం అక్క అమ్మతో ‘నా దగ్గర ఉంటుంది పిన్నీ. పంపించండి. ఇది మంచి అవకాశం దానికి’ అని ఒప్పించింది.
ఇది చాలా ఏళ్ల కిందటి మాట. అప్పట్లో దూరాభారాలని పెద్దమ్మ గాని, అన్నయ్యలు గాని బెంగళూరు వెళ్లేవారు కాదు. తనే ఏడాది కోసారి వచ్చి పది రోజులుండి వెళ్ళేది. అక్కకు తన వాళ్లెవరైనా ఇంటికి వస్తే ప్రాణం లేచొచ్చినట్లుండేది. బావగారి అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అంతా బెంగళూరు, మైసూరుల్లో ఉండేవారు. అక్క వాళ్ళింటికి వాళ్ళందరూ తరచూ వచ్చేవారు. అందుకని నేను తన దగ్గరుంటే బాగుండుననుకుంది. నాకు కూడా హాస్టల్ అంటే భయం. అక్క దగ్గర ఉండటానికే ఇష్టపడ్డాను.
అప్పుడే చూసాను అక్కలోని అమ్మతనము. ఉపాధ్యాయ లక్షణం. వాళ్ళ అమ్మాయి హాసినిని దగ్గర కూర్చోబెట్టుకుని చదివించాలని ఆమె కోరిక. కూతురు స్కూలు నుంచి అయిదింటికి వచ్చేటప్పటికి పనంతా చేసుకుని, రాత్రి వంటకు కావలసినవి కూడా సిద్ధం చేసుకుని కూర్చునేది. పక్కన కూర్చుని హోమ్ వర్కులు చేయించేది. స్కూల్లో చెప్పిన పాఠాలని హాసినికి అర్ధం కానివి చదివి వివరిస్తూ చెప్పేది. ఇంత బాగా ఎలా చెప్పగలుగుతోంది అక్క!లెక్కలు, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ చెప్పేది. అక్కే టీచరైతే ఎంత బాగుండేది అనిపించేది. అనేదాన్ని కూడా. పొంగిపోయేది.
అక్క వంట బాగా చేసేది. వంక పెట్టటానికి వీలు లేకుండా చేసేది. అయినా సరే అత్తగారు, భర్త గారు ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ ఉప్పు చాల్లేదనో, ఉడక లేదనో అంటూ మాటలతో బాధ పెడుతూనే ఉండేవారు. ఇంట్లో ఆమె శ్రమకు గుర్తింపు లేదు. ఆమె లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు వాళ్ళకి. అయినా ఒక్క మెచ్చుకోలు మాట ఉండదు. అక్క ఏమీ పట్టించుకోనట్లు ఉండేది మౌనంగా. లోలోపల ఏం తుఫానులు చెలరేగేవో అప్పట్లో నాకు తెలియదు. కానీ, తను వాళ్ళకి సమాధానం ఏదైనా చెపితే బాగుంటుంది అనిపించేది. తన కూతుర్ని బాగా చదివించాలనేదే ఆమె తపన. హాసిని చదువులో కొంచెం వెనకబడే ఉండేది. కమలక్క చాలా సహనంతో ఒకటికి నాలుగు సార్లు చదివించి అర్ధమయ్యేట్లు చెప్పేది. కాని ఆమెకు ప్రతిరోజూ అలా తన కూతురుతో కూర్చోవటం కుదిరేది కాదు. వచ్చి పోయే ఇల్లు. చెప్పా పెట్టకుండా, ఉత్తరం పత్రం లేకుండా చుట్టాలు బిల బిలా దిగేసేవారు. కూతురు చదువు కుంటుపడేది. అక్క రోజులో ఎక్కువభాగం వంటింట్లోనే ఉండేది.
అలాంటప్పుడే ఆ సంవత్సరం హాఫ్ ఇయర్లీ పరీక్షలలో హాసినికి మార్కులు బాగా తక్కువ వచ్చాయి. టీచర్ తల్లిదండ్రులను రమ్మని కబురు చేసింది. బావగారు ఒక్కరే వెళ్లారు. టీచర్ “ఇంటిదగ్గర మీరు చదివించాలి. ఇక్కడ మేం చెప్పిందే చాలదు. మీ అమ్మాయి చదువులో చాలా వెనకబడి ఉంది. క్లాసులో శ్రద్ధ గా వినదు” అని కేకలేసింది.
బావగారు ఇంటికి వచ్చాక హాసినిపై బాగా అరిచారు. మర్నాడే ట్యూషన్ పెట్టేసారు. ఆ రోజు అక్క బాధ వర్ణనాతీతం. “నా కూతురికి చదువు చెప్పుకోలేని దుస్థితి నాది. రోజంతా చాకిరీనే. ఎంత చేసినా తరగని పని. విలువ ఇవ్వని పని. నా బతుకెందుకు” అంటూ ఏడ్చింది. నిజానికి ట్యూషన్ ఫీజు కట్టగలిగే స్థితి కాదు వారిది. అక్క అంత బాగా చదువు చెప్పటం తల్లీ కొడుకులు సహించలేక పోయారు.
బావగారు ఇంటికి వచ్చేటప్పటికి అక్క అత్తగారు చాడీలు చెప్పేది. “ఇంటిపనంతా పక్కన పెట్టి కూతురికి చదువు చెప్పే వంకతో పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది. ఇంటికెవరొచ్చినా ఈవిడ పెద్ద చదువుకున్న దానిలా వాళ్ళ ముందు మెహర్భానీ చూపిస్తుంది” అని సతాయిస్తూ ఉండేది. బావగారు అక్క మీద అరిచేవారు. “నీకు ఇంటిపనులు, అమ్మని బాగా చూసుకోవటం ముఖ్యం. దాని చదువుతో నీకు సంబంధం లేదు” అనేవారు. అక్క మనసు చాలా గాయపడేది.
నాకు వంట చేయటం అంటే ఇష్టం. ఆదివారం ఎప్పుడైనా నేను చేస్తానంటే ఎంత చక్కగా అక్క నా పక్కన నిల్చుని దేని తర్వాత ఏం వెయ్యాలో ఎలా చెయ్యాలో వివరంగా చెప్పి చేయించేది. నేను తన దగ్గర అక్కడి వంటలు చాలా నేర్చుకున్నాను. నాకు కన్నడ భాష నేర్పించింది. నేను తప్పులు మాట్లాడుతుంటే సరి చేసేది. “నీకు ఒక్క నెలలో వచ్చేస్తుందే. బాగా మాట్లాడుతున్నావు” అని ప్రోత్సహించేది.
నా ప్రాజెక్ట్ పూర్తయి వచ్చేస్తుంటే కమలక్క కన్నీళ్లు పెట్టుకుంది. “నా కష్టం, నా బాధ పంచుకునే ఒక్క తోడువి వెళ్లిపోతున్నావే” అని బాధ పడింది. తనకి స్నేహితులెవరు లేరు. అక్క నన్ను నిజంగా మా అమ్మ లాగే చూసుకుంది. నేను మా ఊరు వచ్చేసిన తర్వాత ఉత్తరాలు రాసేదాన్ని. అక్కకు ఉత్తరం రాసే టైం ఉండదు రాసినా పోస్టు చేసేవాళ్ళుండరు. నాకు తెలుసు. అయినా ఎలాగో రాసేది. ఆమె ఉత్తరం కూడా ఎంతో ఆత్మీయంగా రాసేది. తనలో లేఖా రచన కళ కూడా ఉంది.
అప్పట్లో లాండ్ ఫోనే ఉండేది. మా ఎదురింట్లో నుంచి అక్క వాళ్ళ ఆడపడుచు ఇంటికి చేసేదాన్ని. అక్క అక్కడికి వచ్చేది. ఇద్దరివీ పరాయి ఫోన్లే. బాగుండదుగా! అరుదుగా చేసేదాన్ని. “నీ ఉత్తరం చదువుతుంటే నువ్వు మాట్లాడుతున్నట్లే ఉంటుంది అక్కా”, అంటే పొంగిపోయేది.
క్రమంగా ఉత్తరాలు తగ్గాయి. ఫోన్లు తగ్గాయి. అక్క కూతురి పెళ్ళికి నా కుటుంబంతో వెళ్ళాను. నన్ను చూసిన, అక్క కళ్ళలో ఆనంద భాష్పాలు చూసాను.
కాలం తన గర్భంలో ఎన్నో ఆనంద, విషాదాలను ఇముడ్చేసుకుంది. అక్క వాళ్ళమ్మాయి భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. అల్లుడికి అక్కడ పెద్ద ఉద్యోగం. అక్క ఆడపడుచు కొడుకే. ఇష్టపడి చేసుకున్నాడు. బావగారు చనిపోయారు. కూతురు తన దగ్గర ఉండమంటే అక్క ఇష్టపడలేదు.
బావగారు పోయాక, అక్కను మా ఇంటికి తీసుకువచ్చాను. తనకేదైనా ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండాలనుంది. అప్పుడే మాకు తెలిసిన, కాకినాడ దగ్గర ఉన్న ఊళ్ళో ఆశ్రమంలో చేర్చాం. మధ్య తరగతి వాళ్ళ స్తోమతకు తగినది అది. ఆ ఆశ్రమం వాళ్ళకి ఒక స్కూల్ ఉంది. ఒకటి నుండి పదవ తరగతి వరకూ. పిల్లలూ ఆశ్రమం లోనే ఉంటారు. అక్క అక్కడ చిన్న క్లాసులకి టీచరుగా చేరింది. సదాశయం, ఉత్సాహం ఉంటే వయసు అవరోధం కాదు. అక్క వయసు 70కి దగ్గర పడుతున్నా తను అనుకున్న విధంగా జీవించగలుగుతున్నందుకు, పాఠాలు చెపుతున్నందుకు ఉత్సాహంగా ఉంది. అక్కడ ఏదైనా సేవ చేసేవారు డబ్బు కూడా కట్టక్కరలేదు. టీచరుగా కాని, వార్డెనుగా కాని, వంటశాలలో గాని ఇలా సేవలు అందించేవారికి భోజనం, గది ఉచితం. అక్కకి వాళ్ళమ్మాయి ఎంతైనా డబ్బు పంపిస్తుంది కాని తను సున్నితంగా తిరస్కరిస్తుంది.
ఆ ఊరు వెళ్లాలంటే కొంచెం ప్రయాణం కష్టమే! డైరెక్టు బస్సులు, రైళ్లు లేవు రెండు మారి వెళ్ళాలి. ఫోనుకు సిగ్నలు ఉండదు. ఎప్పుడైనా అరుదుగా చేస్తుంది. ఏమైనా అక్క బోధన వల్ల మంచి విద్యార్థులు తయారవుతున్నారు. మంచి టీచరుగా అక్కకి అక్కడ పేరు ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు తన కోరిక తీరింది.
ఈ కవిత, ఇవాళ కమలక్కను బాగా గుర్తు తెచ్చింది. ఈ కవిత, అమ్మ పిల్లలాకెలా చదువు చెపుతుందో వివరించింది. మంచి కవిత. ‘అక్కతో నా స్వీయానుభవాలు జోడించి పిల్లలకు రేపు పాఠం బాగా చెప్పాలి’, అనుకుంటూ టైం వంక చూసి ‘అమ్మో! పన్నెండయ్యిందే’ అని టెక్స్ట్ బుక్ మూసి పడుకోవటానికి వెళ్ళాను.
