Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-12

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[రెండు రోజుల తరువాత కేరీ వచ్చి స్వామి గదిలో కూర్చుంటాడు. మోహనరావు గారు మీతో మాట్లాడమన్నారు అని అంటాడు. ఆ విషయం కేరీతో చెప్పడానికి మొహమాటపడ్డానని స్వామి అంటాడు. తానెంతో కష్టపడి పైకొచ్చాననీ, స్వామి ఒప్పుకుంటే తమ బ్రతుకులు ఇంకొంచెం బాగుపడతాయని అంటాడు. ఎవరికీ పీడించవద్దని, వాళ్ళు సంతోషంగా ఇచ్చినది తీసుకోమని చెప్తాడు.  ఓ రోజు సాయంత్రం స్వామిని ఓ హోటల్‍కి రమ్మంటాడు కేరీ. అక్కడ, ఓ కవర్‍ని అందిస్తాడు. కేరీ అడిగిన మీదట, కోటప్ప కొండ ఉత్సవం గురించి చెప్తాడు. కంచికచర్ల, చుండూరు, కారంచేడు ఉదంతాలను వివరిస్తాడు. అలాగే విలియం కేరీ అనే పేరున్న బ్రిటీష్ అధికారి, సంఘ సంస్కర్త గురించి చెప్తాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తాడు. ఉదయ లేచాకా, ఆ కవర్‌ని ఆంజల్య చేతికిస్తాడు. అందులోని డబ్బుని  ఏం చేయాలో, దేనికి దేనికి వాడాలో నిర్ణయిస్తుందామె. స్వామి డ్రింక్ తీసుకోడం ఎక్కువవుతోందని అంటుంది. ఉద్యోగ బాధ్యతలలో కొన్నిసార్లు తప్పదని, అయినా తాను నియంత్రణలోనే ఉంటానని, కంగారుపడద్దని భార్యకి చెప్తాడు స్వామి. – ఇక చదవండి.]

అధ్యాయం-16: మాయా బజారులో మాయమవుతున్న మనిషి

ప్రధానమంత్రిగా పి.వి. నర్సింహారావుది మైనారిటీ ప్రభుత్వమే అయినా 1991 నుండి 1996 వరకూ ఐదు సంవత్సరాల పూర్తి పదవీ కాలం ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా కొనసాగింది’. రాజీవ్‌గాంధీ ప్రారంభించిన ‘నూతన ఆర్థిక సంస్కరణలను’ ఆయన ప్రచండ వేగంతో ముందుకు తీసుకపోయారు.

దీనికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఆయన తన పదవీబాధ్యతలు చేపట్టగానే దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారక ద్రవ్యం నిలువలు కేవలం పదిహేను రోజుల వరకే సరిపోతుంది. అప్పుడు తప్పనిసరిఐ ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండు’కు 47 టన్నుల బంగారాన్ని కుదువపెట్టవలసివచ్చింది. లేకపోతే అంతర్జాతీయ విఫణి వీధిలో భారతదేశ ‘వస్త్రాపహరణ పరాభవం’ తప్పనిసరిగా జరుగుతుంది. మరోపక్క ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ’ (ఐఎంఎఫ్‌) ఆర్థిక సంస్కరణలు చేపడితే గాని అప్పులు ఇవ్వనని మోరాయించి షరతులు పెట్టింది.

అప్పుడు అపర చాణుక్యుడైన పి.వి. గారు మేధోమథనం జరిపి ఆర్‌.బి.ఐ గవర్నర్‌గా ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక శాఖామంత్రిగా నియమించారు. ప్రాథమికంగా ఆయన ఆర్థిక శాస్త్రరంగంలో అపరమేధావి. గతంలో ఐఎంఎఫ్‌లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. సాధారణ రాజకీయ నాయకుల్లా కాక ఒక ఋషిలాంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే ‘గురుశిష్యులిద్దరూ’ ఆచితూచి మాట్లాడే మితభాషులే గాక ‘మౌన మునులు’. ప్రతిపక్షాల కాకి గోలలను లెక్క చేయకుండా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే పట్టువదలని విక్రమార్కులు. అసహాయ శూరులు.

‘సింగ్‌ ఈజ్‌ కింగ్‌’ అన్నట్లుగా సింగుగారు రాగానే ‘లైసెన్స్‌ కోటా రాజ్‌’ను రద్దు చేసి కార్పొరేట్‌ రంగానికి స్వేచ్చను ప్రసాదించాడు. రూపాయి విలువను తగ్గించాడు. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి వారికోసం రెడ్‌ కార్పెట్లు పరిచాడు. తుప్పు పట్టి కాలం చెల్లిన అవినీతికి ఆలవాలమైన ప్రభుత్వ రంగ సంస్థల విస్తరణను నిలిపివేశాడు. నెహ్రు కలలు కన్న సోషలిస్టు తరహా సమాజాన్ని పాత ఆర్థిక శాస్త్రపు భోషాణంలో దాచి పెట్టి దాని తాళం చెవిని ‘అమెరికా వాడు బిన్‌ లాడెన్‌ శవాన్ని సముద్రంలో పారేసినట్లు’ మన సింగు గారు అరేబియా సముద్రంలోకి విసిరి పారేసాడు. సోషలిస్టు భూతం సీసా నుండి మళ్లీ ఇవతలికి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

కమ్యూనిస్టులు, సోషలిస్టులు కలిసి ‘సింగు’ ప్రపంచ బ్యాంకు ఏజెంట్‌ అని దుమ్మెత్తి పోశారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా పవిత్ర భారతదేశం సాంప్రదాయాలు, భాష, సంస్కృతులు దెబ్బతింటాయని, మంటగలుస్తాయని ప్రపంచీకరణను వ్యతిరేకించింది.

ఆర్ధిక సంస్కరణలకు పి.వి. గారి అండదండలతో సింగ్‌ నింగికెగిరిన రాకెట్‌లా దూసుకపోయారు.

వామపక్షాలు, సోషలిస్టులూ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్ పరివార్‌ శక్తులు ప్రపంచీకరణను వ్యతిరేకిస్తుంటే బిజెపి దాని ముఖ్య నాయకులైన వాజ్‌పేయి, అద్వానీలు మాత్రం సమర్థించారు. ఈ వైఖరి వలన కొంత కాలం అద్వానీ, శాశ్వతంగా వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌కు దూరమైనారు. వారిద్దరూ గాంధేయ సోషలిజాన్ని నమ్మటం కూడా సంఘ్ పరివార్‌ శక్తులకు నచ్చలేదు. నాగపూర్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులకు వీరిద్దరూ ఉదారవాద వైఖరి అవలంభిస్తున్నారన్న ఆలోచనతో బిజెపిలోకి కరుడు గట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. 1980 వరకు ఒకప్పటి జనసంఘ్ పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుమహాసభ, శివసేన నాయకుల ఆధిక్యత ఉండేది. 2002 నుండి పాత జనసంఘ్ వ్యూహాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అమలు పరిచింది. అట్లా వచ్చిన వారే నరేంద్రమోదీ, అమిత్‌షాలు.

1990 దశకం మధ్య నుండి దేశంలో, సమాజంలో, వ్యక్తుల జీవితాలలో వారి ఆలోచనలలో పెనుమార్పులు సంభవించాయి. తుఫాను గాలిలో చెట్లు మాత్రమే గాక చెట్ల కొమ్మలు వాటికున్న చిగురాకులూ చలించినట్లుగానే ప్రతి మనిషి, ప్రతి కుటుంబమూ సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ప్రభావాలకు గురైనారు. ఆర్థిక సంస్కరణలలో వచ్చిన మార్పులు ప్రతి ఇంటికీ ఇంటిలోని పడక గదికి, వంటింట్లోకి కూడా చొచ్చుకొచ్చాయి.

‘తొలి దశలో మనిషి తనకు అవసరం లేని వస్తువులను సృష్టిస్తాడు. మలిదశలో వస్తువులు తనకు అవసరమున్న మనుషుల్ని సృష్టించుకుంటాయి’. అన్న సిద్దాంతం ఆచరణలోకి వచ్చి నిజమే అయ్యింది.

దేశంలో టెలికాం రంగంలో సంస్కరణలు ప్రారంభమైనాయి. అనేక ప్రైవేటు సంస్థలు ఆ రంగంలోకి ప్రవేశించాయి. ఆ మార్పులు విప్లవాత్మకమైన పురోగతికి దారితీసాయి. 1995 నుండి మొదటి నాలుగేళ్ల కాలంలో మొబైల్‌ ఫోన్‌ను పది లక్షల మంది వాడగా, 2000-2004 కాలంలో ఆ సంఖ్య కోటి ఇరవై లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత గ్రామాలలోకి కూడా ప్రవేశించి పేద రైతులు కూడా వాటిని వాడటం మొదలుపెట్టారు. చివరికి నగరాల్లో అడుక్కునే వాళ్ల చేతుల్లో కూడా అవి కనబడసాగాయి. కంప్యూటర్లు, ఇంటర్‌నెట్లు రావడంతో సమాచార విప్లవం మొదలయ్యింది. ఒకప్పుడు ఒకే ఒక్క నలుపు తెలుపుల దూరదర్శన్‌ ఉండేది. అది రాగానే రేడియోలు, ట్రాన్సిస్టర్లు అటకెక్కాయి. దూరదర్శన్‌ స్థానంలో అనేక ప్రైవేటు చానెల్స్‌ వారి రంగుల టీవిలు రంగప్రవేశం చేసాయి. ఒకప్పుడు రేడియోలో ‘మమ్మీ మమ్మీ మాడ్రన్‌ బ్రెడ్‌’ ప్రచారం మరుగై ఇప్పుడు ఈ టీవిల వలన అవసరం, అనవరసమైన విలాసాల వినోదాల వస్తువులన్నీ ప్రజలను వస్తులోలత్వానికి గురిచేసాయి. మామూలు సాధారణ ప్రజలు కూడా రంగుల టీ.వి.లు, రంగుల సీనిమాల పుణ్యమా అని ‘రంగుల కలలు’ కనటం మొదలు పెట్టారు. ఒకప్పుడు ‘ఏరిండియా’ విమానమొక్కటే ఉన్నత వర్గాల వారికి అందుబాటులో ఉండేది. సగటు మనిషికి అదొక గగనకుసుమం. దాని స్థానంలో అనేక ప్రైవేటు విమాన సంస్థలు ప్రవేశించి దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా ‘ఆకాశ విహారాలు’ ప్రారంభించారు. పుష్పక విమానాలు సాధారణమైనాయి. అకసాన లోహవిహంగాలు పక్షుల్లా తిరగసాగాయి. ఐమాక్సులు, మల్టీఫ్లెక్సు సినిమా థియేటర్లు, బడా బడా షాపింగుమాల్స్‌లు విఫణి వీధులలో అభిసారికల్లా నిలిచి కొనుగోలు దారులకు వినియోగదారులకు కనుసైగలు చేసి రారమ్మని పిలువసాగాయి. వీటికి తోడు మెక్‌డోనాల్డులు, కెయఫ్‌సిలు, సైబర్‌కేఫ్‌లు, స్నూకర్‌లు, రెయిన్‌ డాన్సులు, బ్యూటీ కాంటెస్టులు, కౌన్‌బనేగా కరోడ్‌పతిలు, ఏండ్ల తరబడి సాగే ఆడవాళ్ల ప్రతీకారాల, ఏడుపురోగాల సీరియళ్లు, బూతు వీడియోలు, ఏటిఎంలు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు రాగానే అందరూ విశ్వ పౌరులయినారు. నాన్‌రోటీలు, జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలు, వరిఅన్నం స్థానంలో బర్గర్‌లు, పీజ్జాలు, స్పాగెట్టీలు రంగప్రవేశం చేసాయి.

గాంధీగారి ఒకప్పటి స్వదేశీ ఉద్యమం ఎప్పుడో కనుమరుగై విదేశీమోజులు ముంచుకొచ్చాయి. మనుషులు అందులో కొట్టుకపోయారు. మనుషులు మాయమైనారు.

ఒకరోజు స్వామి బస్‌స్టాండులో నిలుచున్నాడు. ఇంతలో ఒక ఖాళీ ఆటో అతని ముందు ఆగి “ఆటో కావాలా సార్‌?” అని అడిగాడు. స్వామి ఆ మనిషిని చూసి ఉలికిపడ్డాడు. ఈ లోగా ఆటో సర్రున ముందుకు కదిలింది. స్వామి ‘ప్రకాష్‌’ అని గట్టిగా కేక వేసాడు.

ఇక తప్పదన్నట్లు ఆటో రోడ్డుకు ఒక ప్రక్కన ఆగింది. గబగబా అడుగులు వేస్తూ స్వామి ఆటో దగ్గరికి చేరుకున్నాడు.

“ప్రకాష్‌ నువ్వా” అని మరోసారి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.

అతను తల వంచుకుని ఆ సీటు మీద అట్లనే కూచున్నాడు.

“ఇదేమిటీ, ఇట్లా ఈ ఆటో ఏమిటి?”

“మా ‘ఆల్విన్‌ ఫ్యాక్టరీ’ పూర్తిగా మూసేసి చాలా కాలం అయ్యింది స్వామీ. చివరికి గతి లేక ఈ ఆటో నడుపుకుంటున్న.”

స్వామికి ప్రకాష్‌ చాలా బాగా తెలుసు. నెల నెలా వెన్నెల సమావేశాలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వచ్చేవాడు. కథలు చాలా బాగా రాస్తాడు. కొన్ని వారపత్రికలలో అతని కథలు అచ్చు కూడా అయినాయి అట్లా స్వామికి స్నేహితుడు.

అతను పాలిటెక్నిక్‌ పాస్‌ అయ్యి పటాన్‌చెరువుకు దగ్గరలో ఉండే ఆల్విన్‌ ఫ్యాక్టరీలో టెక్నిషియన్‌గా ఉద్యోగం చేసేవాడు. ఇద్దరు పిల్లలు, భార్య గృహిణి.

స్వామి ఆటోలో కూచుని “సరే ముందు ఏదైనా ఒక హోటల్‌ ముందు ఆపు. లోపల కూచుని మాట్లాడుకుందాం” అన్నాడు.

ఇద్దరూ దగ్గర్లో ఉన్న హోటల్‌కు వెళ్లి ఎవరూ లేని ఒక మూలలో కూచున్నారు. ఒకప్పుడు అందంగా బలంగా ఉండే అతను ఇప్పుడు కండ్లు, దవడలు గుంటలు పడి, ముఖమంతా పీక్కుపోయి తల వెంట్రుకలు ఊడిపోయి కొంచెం బట్టతలతో దీనంగా కనిపించాడు. వచ్చిన చాయలు తాగుతూ “ఇప్పుడు చెప్పు ప్రకాష్‌” అన్నాడు.

“ఇదంతా మన మన్మోహన్‌సింగ్‌ పుణ్యం సార్‌. వాడికి మా అందరి ఉసురు తగలకపోదు. నూతన ఆర్థిక విధానం, సంస్కరణల వలన హైద్రాబాద్‌లో చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఒక మా ఆల్విన్‌ ఫ్యాక్టరీనే కాదు, పి.పి. స్కూటర్స్‌, హెచ్‌ఎంటి వాచెస్‌ అండ్‌ బల్బుల ఫ్యాక్టరీ, రిపబ్లిక్‌ ఫోర్జ్‌, ప్రాగాటూల్స్‌, నిజాం సుగర్‌ ఫ్యాక్టరీ, వరంగల్‌ల ఆజంజాహీ బట్టలమిల్లు, సిర్పూర్‌కాగజ్‌ నగర్‌ ఫ్యాక్టరీ, రామగుండం ఫర్టిలైజర్స్‌ ఇంకా చిన్న చిన్న పరిశ్రమలెన్నో మూతపడ్డాయి. అందరం అన్నమో రామచంద్రా అని రోడ్డున పడ్డాం.

ఇట్లా అవుతుందని మేమేం కలగన్నామా. నాది పదేండ్ల ఉద్యోగం, జీతంపై భరోసాతో ఇండ్ల స్థలాలు కొనుక్కున్నాం, కొందరు అప్పులు చేసి ఇళ్లు కూడా కట్టుకున్నారు.

ఇన్‌స్టాల్‌మెంట్ల మీద ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం. చీటీలు నెల నెలా కడుతున్నాం. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇంగ్లీష్‌ మీడియం, ప్రైవేటు కాన్వెంటు స్కూళ్లలో చదివిస్తున్నాం. ఇంతలో భూకంపం వచ్చినట్లు మా బ్రతుకులన్నీ తలక్రిందులైనయి. అందరం రోడ్డున పడ్డాం. తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి కొంత మంది పిచ్చివాళ్లైనారు. ఇప్పుడు మా ఫ్యాక్టరీలో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. ఆల్విన్‌ కాలనీ ఇప్పుడు బొందల గడ్డలాగ కనబడుతుంది. కార్ఖానాలు బంద్‌ చేయకముందే అక్కడ పనిచేసే కార్మికులను బద్నాం చేసారు. పని ఎగ్గొట్టే సోమరిపోతులం అన్నారు. నష్టాలకు మేమే కారకులం అని నిందలు వేసారు. ఆల్విన్‌లో మా అసలు పని ‘బస్‌ బాడీ బిల్డింగ్‌’ నిర్మాణం పనులు. అవన్నీ ఆర్‌టిసి సంస్థ కోసం సరఫరా చేసేవారం.

మేం మా శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలని ఆ బద్నాంలను ఒక సవాల్‌గా తీసుకుని మేమందరం చందాలు వేసుకొని ముడిసరుకులు తీసుకొచ్చి ఉదయం నుండి ప్రారంభించిన పనిని సాయంకాలం పూర్తి చేసాం. ఒక కొత్త బస్‌బాడీని నిర్మించి పత్రికల వారికి ప్రజలకు చూపించి ‘మేం అసమర్థులం కాదని’ మమ్మల్ని మేం నిరూపించుకున్నాం. విశ్వామిత్రుడిలా ‘సృష్టికి ప్రతిసృష్టి’ చేసాం. కాని ఏమీ లాభం లేకపోయింది. ఎవరికీ మా మీద దయ కలగలేదు. మా ప్రతిభ అడివి కాచిన వెన్నలయి పోయింది.

అప్పుడు అందరం పెళ్లాం, పిల్లలతో కలిసి కట్టకట్టుకుని టాంకుబండులో దూకి చావాలని అనుకున్నం కాని మా పిల్లల ముఖాలు చూసి దిక్కులేని పక్షుల్లా అందరం తలో దిక్కుకు చెల్లాచెదురయ్యాం. ఇప్పుడు ఈ లేటు వయస్సులో ఏ కొత్త పని చేయలేం. ఇదిగో నేను ఇట్లా కిరాయకు ఈ ఆటో తీసుకుని నడుపుకుంటున్న. సుఖంగా ఒకప్పుడు ఇంట్లో ఉండే నా భార్య ఒక కుట్టు మిషను కొనుక్కుని జాకెట్లు కుట్టే పని చేస్తుంది. పిల్లల స్కూలు ఫీజులకు, చదువులకు చాలా కష్టమవుతుంది. ఇక వాళ్లను సర్కారీ స్కూళ్లల్లో చేర్పిద్దామనుకుంటున్న” అన్నాడు!

“మరి మీకు ట్రేడ్‌ యూనియన్లు, వాటి నాయకులు ఉంటారు కదా. వాళ్లేం చేస్తున్నట్లు?”

“వాళ్లంతా దొంగలు సార్‌. వాళ్ల స్వార్థం కోసం మేనేజ్‌మెంటుతో తెరవెనక కలిసే ఉంటారు. మా ముందు మాత్రం మీటింగ్‌లలో వాళ్లను తిడతారు. ప్రతి నాయకుడికి రియల్‌ ఎస్టేట్‌ దందాలు, చిట్స్‌ బిజినెస్‌ ఉంటాయి. అండ్ల మమ్మల్ని ఇరికించారు. వారి మీద నమ్ముకంతో మేం కొన్కుకున్న భూములన్నీ కిరికిరీల పడ్డాయి. ఫ్యాక్టరీ మూసినా వాళ్లకేం ఫరక్‌ పడదు.”

స్వామి మనసు పానీ పానీ ఐపోయి, కొంచెం ఆలోచించాక ఇట్లా అన్నాడు.

“ప్రకాష్‌ పిల్లల్ని ఆ స్కూలు నుంచి మార్పించకు. వాళ్లను గట్టెక్కించేవి చదువులు మాత్రమే. ప్రతి నెలా వారి ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సుల ఖర్చులు నేను భరిస్తాను. అది నాకు ఏ మాత్రం ఇబ్బంది కాదు. ఇది నా ఫోన్‌ నంబరు. ప్రతి రెండవ తారీఖు నువ్వు నన్ను కలవాలి” అన్నాడు.

ప్రకాష్‌ రెండు కళ్లు తడితడి అయ్యాయి. భావోద్వేగంతో ఏమీ మాట్లాడలేక స్వామి రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. నరాల బలహీనంతో అవి వణుకుతున్నాయి.

***

ఆంజల్యకు విషయం వివరించాడు “ఏం ఫరవాలేదు” అని నిండుమనసుతో ఒప్పుకుంది.

ఒక సంవత్సర క్రితం బాగా పేరున్న ఒక దినపత్రిక హఠాత్తుగా మూత పడింది. దాని యజమాని సీనీరంగంలో లబ్ధప్రతిష్ఠుడు. ఒక రాజకీయ పార్టీకి చెందినవాడు. తర్వాత కాలంలో పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. యాజమాన్యం చేతులు మారాక ఆ దినపత్రికను హఠాత్తుగా మూతబడింది. రాజకీయ లక్ష్యాలను చేధించటానికి దినపత్రిక ఒక ఆయుధం.

చాలామంది జర్నలిస్టులు ‘అక్షరమో రామచంద్రా’ అని సడక్‌ మీదికి వచ్చేసారు. అందులో అమరేంద్ర ఒకడు. అతను స్వామికి బాల్య స్నేహితుడు, సాహిత్యం, కవిత్వంలో బాగా ప్రవేశముంది. అతని ఆర్థిక అవస్థలను గమనించిన స్వామి అప్పుడప్పుడు కలుసుకుని ముచ్చట్లు ముగిసిన తర్వాత అతని పాంటు జేబులో ఎవరూ చూడకుండా ఒక కవర్‌ చనువుగా పెట్టేసేవాడు. అతను చాలా ‘మొగమాటం’గా, ఎందుకన్నా అని అనేవాడు.

అతనిప్పుడు మరో దినపత్రికలో మంచి స్థాయిలోనే ఉన్నాడు. స్వామి ఒకసారి అతనిని తన ఇంటికి విందుకు ఆహ్వానించి తిరిగి వెళ్లేటప్పుడు ప్రకాష్‌ సంగతి చెప్పాడు. ‘కథలు’ బాగా రాస్తాడు సాహిత్యంలో తెలుగుభాషలో ప్రవేశముంది. ఏదైనా సబ్‌-ఎడిటర్‌ ఉద్యోగం చూడమని చెప్పాడు.

వారం తిరగక ముందే ప్రకాష్‌ ఆ దినపత్రికలో సబ్‌-ఎడిటర్‌గా జాయిన్‌ అయ్యి నీడ పట్టుకు ఫ్యాన్‌ కింద కూచుని ఆ టేబుల్‌వర్కును రిటైర్‌మెంటు వరకూ చేసాడు. అతని ప్రవృత్తికి తగిన వృత్తి అది. తర్వాత కాలంలో అతని ఇద్దరు పిల్లలు విదేశాలకు వెళ్లారని తెలిసింది.

1990 తర్వాత మాయాబజార్‌ జగన్నాటకం ప్రారంభమైనాక స్వామికి బాగా తెలిసిన రెండు పాత్రలు విషాదాంతంగా ముగిసాయి. స్వామి మనస్సు చాలా కలకలానికి గురయ్యింది. వీటన్నింటికిముందు జగత్‌కిలాడీ ఐన హర్షద్‌ మెహతా గురించి, మరొ కొంతమంది గురించి చెప్పుకోవాలి.

హర్షద్‌ మోహతా ఒక గుజరాతీ. బొంబాయిలో స్థిరపడిన ఒక స్టాక్‌బ్రోకర్‌, వ్యాపారవేత్త, 1992లో భారతప్రభుత్వం అతడిని ముప్పైవేల కోట్ల రూపాయల స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంలో అరెస్టు చేసి జైలులో పెట్టింది. అతడి మోసం వల్ల భారత స్టాక్‌మార్కెట్‌ కుప్పకూలి పోయింది. దానితో స్టాక్‌ ఎక్స్చేంజి, భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ బహిర్గతమైనాయి. 9 సంవత్సరాలు అతడి మీద కేసు నడిచి అతనికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించగా అతను జైలులోనే 47 సం.ల వయసులో గుండెపోటుతో మరణించాడు. అప్పుడు ఆ లోపాలు సవరించబడినాయి. కాని ఏం లాభం? సమాజంలోని పెద్ద పెద్ద వ్యాపార తిమింగలాలు బ్యాంకులకు కుచ్చుటోపీలు పెట్టి విదేశాలకు పారిపోయి దర్జాగా ఇప్పటికీ తిరుగుతున్నారు. వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసి ఇండియాకు రప్పించలేకపోతుంది.

ఆ కాలంలో నలుగురు కూడిన చోట స్టాక్‌మార్కెట్‌ చర్చలు కొనసాగుతుండేవి. చాలామంది తాము పొదుపు చేసిన సొమ్మును స్టాక్‌మార్కెట్‌ షేర్‌లలో పెట్టేవారు. దాని స్పెక్యులేషన్స్‌ లెక్కలు డొక్కలు గంటల తరబడి మాట్లాడుకునేవారు. నగరాల్లో ఎటు చూసినా ‘షేర్‌ఖాన్‌’ లే కనబడేవారు. ఆ చర్చల్లో పాల్గొనని వారందర్నీ అమాయకులన్నట్లు చూసేవారు.

తన బ్యాచ్‌మేట్‌ ఒకరిపేరు జైని సురేష్‌. అతను వైశ్యుడు. తమ బ్యాచ్‌మేట్లని వప్పించి స్టాక్‌ మార్కెట్టులో షేర్స్‌ కొనిపిస్తుంటాడు. అతను కూడా ఒక షేర్‌ఖాన్‌. ఒకసారి అతను కలిస్తే “ఈ ‘షేర్స్‌’ అంటే ఏమిటి భై” అని కొంచెం అమాయకంగానే అడిగాడు.

అప్పటికే వాడికి ‘మనీమదం’ తలకెక్కినట్టుంది. స్వామిని హేళనగా చూస్తూ “మీ లాంటి మేధావులకు ఈ పనికిరాని విషయాలెందుకు” అన్నాడు.

“అబ్బే ఊరికే తెలుసుకుందామని” నసిగాడు స్వామి.

“అంత ఈజీగా ఊరికే మేం చెబుతామా? ఒక సాయంత్రం బార్‌కు తీస్కపోయి తాగించి తినిపిస్తే అప్పుడు చెప్పుతాం, ప్రతిదానికీ ఒక ఫీజు ఉంటది” అని వాడు కన్నుగొట్టి కొంటెగా నవ్వాడు. వాడి వ్యాపార బుద్ది పోనిచ్చుకున్నాడు కాదు అని మనసులో వాడిని తిట్టుకున్నాడు.

“మీ ఇంటిపేరు జైని అని ఎందుకు వచ్చిందో తెలుసా?”

“నాకేం తెలుసు మా వైశ్యాస్‌లలో చాలామంది ఇంటిపేరు జైని అనే ఉంటది. గటువంటి పనికిరాని సంగతులు నా కెందుకు? టైం వేస్టు” అని నిర్లజ్జగా అన్నాడు.

“చెప్పు స్వామి నాకు తెలుసుకోవాలనుంది” అని అక్కడే నిలుచున్న మరో స్నేహితుడు అడిగాడు. అతను చరిత్రలో పోస్టుగ్రాడ్యుయేట్‌.

“ఒకప్పుడు మన దేశంలో జైనమతం బౌద్ధ మతం, వైశ్యులు, వ్యాపార వర్గాల వారి సహాయ సహకారాల వలన అభివృద్ది చెందాయి. వారు వ్యాపార నిమిత్తమై బండ్లమీద సరుకులు వేసుకుని దేశం నలుమూలలూ తిరిగేవారు. వారిని సార్థవాహులు అని కూడా అనేవారు. లోక సంచారం వలన వారికి లోకజ్ఞానంతోపాటు బౌద్ధ, జైన మతాల ప్రాముఖ్యత తెలిసింది. బౌద్ధ జాతక కథలలో వారి పేర్లు మనకు దొరుకుతాయి. మచ్చుకు ఒక పేరు సుదత్తుడు. శ్రావస్తి నగరంలో నేటి నేపాల్‌ సరిహద్దులలో ఉండేవాడు. గొప్ప వ్యాపారి. బుద్దుడికి సమకాలికుడు. బౌద్ధమతం పుచ్చుకున్నాడు. బద్ధుడు అతనికి ‘అనాథపిండకుడు’ అని కొత్త పేరు పెట్టాడు. అనగా ప్రతిరోజు అతను అనాథలకు భోజనం పెట్టేవాడు అని అర్థం.”

జైని సురేష్‌ కళ్లు, చెవులప్పగించి అట్లాగే బొమ్మలా నిలుచుని ఉండిపోయాడు.

“మన వరంగల్‌ కాకతీయ కాలంలో రాణులందరూ జైనమతం పుచ్చుకున్నారు. వారు తమ ధనంతో తమ రాజ్యంలో బోలెడన్ని జైన దేవాలయాలను నిర్మించారు. ఆలేరు దగ్గరి కొలనుపాక జైన దేవాలయం. హనుమకొండలో పద్మాక్షమ్మ గుట్టపైన జైన ఆలయం, ఆదిలాబాద్‌లో జైనద్‌్‌ దేవాలయం అలాంటివే.

ఆ కాలంలో వైశ్యశ్రేష్టులు, వ్యాపార వర్గాలవారు జైనమతం ఆచరిస్తూ తమ ఇంటి పేరు ‘జైని’గా మార్చుకున్నారు.

‘జిన’ అన్న పదం నుండి జైన అన్నపదం పుట్టింది. ఆ ఇంటిపేరు పద్దతే ఇప్పటికీ కొనసాగుతుంది.”

వరంగల్‌ వాసిఐన జైని సురేష్ ‘మిట్ట మిట్ట’ చూస్తూ అట్లనే నిలబడి పోయాడు బొమ్మలాగ.

“నేను చెప్పిన ఈ సంగతులన్నీ నువ్వు విన్నందుకు నేనేమీ ఫీజు వసూలు చేయను జైనీ” అన్నాడు స్వామి. ‘ఎంత ఉతికినా ఎలుకతోలు నలుపు నలుపే కాని తెలుపు కాదు కదా!’

స్వామికి బాగా తెలిసిన ఇద్దరు మిత్రుల జీవితాలు ఈ మార్కెట్‌ మాయాజాలంలో పడి చాలా విషాదంగా ముగిసాయి.

ఒకతను యాదగిరి రెడ్డి పాతనగరంలో స్కూలులో ఉపాధ్యాయుడు. సౌమ్యుడు. మంచివాడు పార్టీకి సానుభూతిపరుడు. స్వామి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నపుడు పార్టీ ఫండు కోసం అతని ఇంటికి వెళ్లేవాడు. టిఫిన్‌, టీ ఇవ్వడమే కాక ఫండ్‌ కూడా సంతోషంగా ఇచ్చేవాడు. తర్వాత ఆయనతో కాంటాక్టు తెగిపోయింది. మధ్యలో ఒకసారి కామన్‌ఫ్రెండ్‌ కలిసి ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఊళ్లో ఉన్న పొలాలు అమ్మి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడని ఖద్దరు బట్టలు, నల్లకళ్లద్దాలు, మెడలో బంగారు గొలుసు చేతివ్రేళ్లకు ఉంగరాలు ధరించి ఎ.సి. కార్లలో తిరుగుతున్నాడని, అతని దశ తిరిగిందని ఆ స్నేహితుడు చెప్తే స్వామి కూడా ఆశ్చర్యపోయాడు.

ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు దినపత్రికలో యాదగిరి రెడ్డి కుటుంబం ఆత్మహత్య అన్న వార్త కనబడిరది. ఫోటోలు కూడా వేసారు. అన్ని రూములలో ఉన్న ఫ్యాన్లకు కుటుంబ సభ్యులందరూ శవాలుగా వ్రేలాడుతున్న ఫోటోలు.

రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో మోసానికి గురై అప్పులబాధ భరించలేక అందరం ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసిన ఒక లేఖ ఆ ఇంట్లో దొరికిందట.

మరొక స్నేహితుడు రాంమోహన్‌. స్వామికి రెగ్యులర్‌ లెక్చరర్‌ ఉద్యోగం పోయిన తర్వాత ప్రతి ఆదివారం ఓపెన్‌ యూనివర్సిటీలో పార్ట్‌టైం లెక్చరర్‌గా డిగ్రీ విద్యార్థులకు క్లాసులు తీసుకునేవాడు. వారంతా ఉద్యోగస్తులు. ప్రమోషన్స్‌ కోసం ఒక డిగ్రీ తప్పనిసరి కావున వారు ఓపెన్‌ యూనివర్సిటీలో జాయిన్‌ అయ్యారు. రాంమోహన్‌ అక్కడ ఒక విద్యార్థిగానే పరిచయమై తర్వాత మంచి స్నేహితుడైనాడు. పరీక్షల రెండు రోజులకు ముందు స్వామి ఇంటికి వచ్చి మొత్తం సిలబస్‌ను మరోసారి పూర్తిగా ‘రివ్యూ’ చేయించుకునేవాడు. దానికి ప్రత్యేకంగా వద్దన్నా మళ్లీ ట్యూషన్‌ ఫీజు ఇచ్చుకునేవాడు. ఆ కష్టకాలంలో స్వామికి ప్రతి రూపాయి చాలా విలువైనదే.

అప్పుడు రాం మోహన్‌ తన జీవితగాథ అంతా చెప్పాడు. తను చాలా చిన్న పిల్లవాడిగ ఉండగానే తల్లితండ్రులిద్దరూ కాలం చేసారు. అమ్మమ్మ అతనిని పెంచింది. ఒకపూట భోజనం కూడా చాలా కష్టంగా ఉండేది. సైకిళ్ల పంక్చర్‌ చేసేవాడికి సహయకుడిగా, మీరాలం కూరగాయల మండీలో మూటలు మోసే కూలీగా, పత్తర్‌ గట్టీ బట్టల దూకాణంలో సేల్స్‌ బాయ్‌గా పనిచేస్తూ ముసలమ్మ బరువు బాధ్యతలు కూడా మోసేవాడు. ఎన్ని కష్టాలున్నా పండ్ల బిగువున సహించుకుంటునే చదువు మీద ఇష్టం కావున రాత్రిపూట నడిచే పాఠశాలలో చదువుకు చేరాడు. అట్లా హెచ్‌.ఎస్‌.సి. ప్రైవేటుగా పాస్‌ ఐనాక మున్సిపల్‌ ఆఫీసులో క్లర్కుగా జాయిన్‌ అయ్యి ఇప్పుడు సూపరిడెంట్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ చేతికి రాగానే ఆఫీసర్‌ ప్రమోషన్‌ గ్యారంటీ అట.

ఇప్పుడు అతని జీవితం చాలా సుఖంగా ఉంది. ఇల్లు, భార్యా, పిల్లలు చక్కటి సంసారం. మున్సిపల్‌ ఉద్యోగంలో పై ‘ఆమ్‌దానీ’ కూడా ఎక్కువే అని అతనే స్వయంగా చెప్పాడు.

బాల్యానుభవాలే మనిషి మనస్తత్వాన్ని నిర్ణయిస్తాయి. బాల్యంలో అనుభవించిన పరమ దరిద్రం తర్వాత కాలంలో ఎంత సంపాదించినా డబ్బు విషయంలో ఏహ్యభావంతో విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ వెదజల్లుతాడు లేదా దానికి పూర్తి విరుద్దంగా ప్రతిరూపాయి కూడబెట్టి మూటలు కడుతుంటాడు.

రాంమోహన్‌ ఈ రెండవ రకం. డబ్బు మీద కసితో, కాంక్షతో అతను షేర్స్‌ మార్కెట్‌లో దిగి ఆ బిజినెస్‌ చేస్తున్నట్లు అందులో బాగానే సంపాదిస్తున్నట్లు కూడా అతను చెప్పాడు.

చాలాకాలం తర్వాత దినపత్రికలో అతను అతని కుటుంబం మొత్తం విషం త్రాగి ఆత్మహత్యలు చేసుకున్నారని వార్త వచ్చింది. అయితే ఒక కూతురు మాత్రం ఎక్కడో హాస్టలులో ఉండి చదువుకుంటుంది కాబట్టి ఆమె మాత్రం బ్రతికిపోయింది. తర్వాత ఆ అమ్మాయి కూడా జీవితం మీద విరక్తితో ‘బ్రహ్మకుమారీల ఆశ్రమం’ లో చేరిసన్యాసిగా మారిందని, శ్వేత వస్త్రాలు ధరించి టి.వి. చానెల్స్‌లో జీవితం బుద్బుదప్రాయమని ఉపన్యాసాలు, ఉపదేశాలు ఇస్తుందని తెలిసింది. ఇంతకూ ఆమె వయసు పద్దెనిమిది లేదా పంతొమ్మిది మాత్రమే.

ఈ ఘటన తర్వాత చాలా రోజులు స్వామి తెలియని అశాంతితో ఎవరి మీదో తెలియని కోపంతో, కసితో అలమటించి పోయాడు. ఒకోసారి తన మీద తనకే కోపం వచ్చేది. ఎందుకన్నది అతనికే సరిగా తెలియదు ఒకప్పుడు అమెరికాలో బంగారం అన్వేషణలో మనుషులు గుంపులు గుంపులుగా బయలుదేరి పోటీ ఈర్ష్య అసూయలతో ఒకరినొకరు చంపుకునే వారు (గోల్డ్‌ రష్‌). ఇప్పుడు మనుష్యులలో ‘పచ్చనోట్ల పిచ్చి సంస్కృతి, విష సంస్కృతి’ వ్యాపిస్తున్న సంగతి స్వామి పసిగట్టాడు.

ఒకప్పుడు సమాజంలో ఇన్ని ఉద్రిక్తతలు, ఇన్ని అశాంతులు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, మోసాలు, కుట్రలు ఉండేవి కావు. మనుష్యులు, సామాన్య జీవనంతోనే సంతృప్తిగా ఉండేవారు. పక్షులు పరిమిత ఆహార అన్వేషణలో సుఖంగా ఉన్నట్లు!

స్వామికి ఎప్పుడు శ్రీ 420 సీన్మా చివరిసీనులో రాజ్‌కపూర్‌ అన్న మాటలు జ్ఞాపకం వస్తుంటాయి.

‘సునా థా ఏక్‌ జమానే మే ఆద్మీ బందర్‌ థా. లేకిన్‌ అబ్‌ రూప్యా కేలియే కుత్తా బన్‌ గయా.’

(మళ్ళీ కలుద్దాం)

 

Exit mobile version