Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-20

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

 

[కాలం గడుస్తుంది. సమత ఇంజనీరింగ్ పాసయ్యి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. అమ్మానాన్నలు ఆమెను విదేశాలకు పంపిద్దామని అనుకుంటే సమత తమ్ముడి భవిష్యత్తు ఆలోచించి వద్దంటుంది. సమత ఫ్రెండ్ ఒకామ్మాయి ఆర్నెల్ల జీతం ఎదురిచ్చి హైదరాబాదులోనే ఓ కంపెనీలో చేరుతుంది. మనమూ అలా చేద్దాం అని తల్లి అంటే, త్రోసిపుచ్చుతుంది సమత. చివరికి ఆ అమ్మాయికి బెంగుళూరులో ఉద్యోగం వస్తుంది. ఏడాది గడిచాకా, సమతకి పెళ్ళి సంబంధాలు చూడ్డం ప్రారంభిస్తారు. కొన్ని సంబంధాలు వచ్చినా, కుదరవు. మిత్రుడు గోపాల్ రెడ్డి సమతని తన కోడలిని చేసుకుంటానంటాడు. ఆ ప్రస్తావన స్వామికీ, ఆంజల్యకీ నచ్చుతుంది. ఆరు నెలల తరువాత సమత హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ప్రస్తావన తెస్తే, తన కొలీగైన బ్రాహ్మల అబ్బాయిని ప్రేమించిన సంగతి చెబుతుంది. అనేక చర్చలు, సంశయాల తరువాత అబ్బాయి తల్లిదండ్రులను ఒప్పిస్తారు స్వామి, ఆంజల్య. సమత పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది. ఆర్థికంగా అన్ని ఇబ్బందులు తీరిపోయాయి కాబట్టి, ఇక  పై సంపాదన జోలికి వెళ్ళవద్దని భర్తకి గట్టిగా చెబుతుంది ఆంజల్య. తాను కూడా అప్పటికే నిర్ణయించుకుని ఉండడంతో స్వామి, నాన్‌ఫోకల్‌ సీట్‌కి మారాలనుకుంటాడు. పై అధికారిని కలిసి అభ్యర్థిస్తే, ఆయన తన వద్దే ఆఫీస్ మేనేజర్‍గా ఉండమంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-21: తెలంగాణా జంగ్‌ సైరన్‌

‘కదలనే కదలవు. ఒకసారి కదలాలి గానీ ఇక జగన్నాధ రథచక్రాలు వడి వడిగా ఆగకుండా ముందుకు కదులుతూనే ఉంటాయి.’

చరిత్ర ఒకోసారి జడంగా, గడ్డ కట్టినట్లు పైకి కనిపించినా లోలోపల మాత్రం అదొక పేలబోయే అగ్నిపర్వతం. లోపల కుతకుతా ఉడుకుతున్న లావాను కొందరే కనిపెట్టగలరు. వారు సిస్మోగ్రాఫ్‌ యంత్రాల లాంటివారు. పుడమి తల్లి పురుటినొప్పులు కొందరే పసిగట్టగలరు. ఆ కొందరిలో ఒకరు స్వామి.

1999 మే నెలలో జానపద గాయని, తెలంగాణా ఉద్యమ కళాకారిణి బెల్లి లలిత భువనగిరిలో ఘోరహత్యకు  గురి అయ్యింది. దాని వెనక పోలీసుల కోవర్టు అయిన మాజీ నక్సలైటు నయీముద్దీన్‌ హస్తం ఉందని స్పష్టంగా తెలిసి తెలంగాణా భగ్గున మండింది. ఆమె మరణంతో తెలంగాణా ఉద్యమ చైతన్యం పెద్ద మార్పుకు, మలుపుకు దారితీసి తెలంగాణా రచయితల కూటమి, తెలంగాణా విద్యావంతుల కూటమి, నిర్మాణాలకు దారితీసింది. తెలంగాణా ఉద్యోగుల సమాఖ్య కూడా అప్పుడే ఏర్పడింది.

అద్వానీ అంటే రథయాత్రలకు మారుపేరు అయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడి రథం లాగా అలంకరణలతో, లోపల తనుండటానికి ఎసి కారవాన్‌ అమర్చుకుని 1997లో అర్ద శతాబ్ది స్వాతంత్య్రానికి గుర్తుగా ‘స్వర్ణజయంతి’ పేరుతో పదిహేను వేల కి.మీ.ల యాత్ర ప్రారంభించాడు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అదొక రిహార్సల్‌. అనుకున్నట్లు గానే 1998 ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ రాకున్నా ఇతర పార్టీలతో కలిసి వాజ్‌పేయి ప్రధానిగా బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ఏ ప్రభుత్వాలు ఏర్పడినా ఆర్థిక సంస్కరణలు మాత్రం కొనసాగుతున్నాయి. అదొక ‘నెసెసరి ఇవిల్‌’.

డాక్టర్‌ అబ్దుల్‌ కలాం గారి అకుంఠిత దీక్ష వలన పోక్రాన్‌-2 అణు పరీక్షలు విజయవంతమై అగ్రరాజ్యాలతో పాటు ‘భారత్‌’ మరో అణ్వస్త్ర శక్తిగా అవతరించింది. బి.జె.పి చొరవ వలన డాక్టర్‌ కలాం గారు భారత రాష్ట్రపతి ఐనారు. ‘రైట్‌పర్సన్‌ ఇన్‌ ది రైట్‌ ప్లేస్‌’ అని యావత్‌ భారతావని సంతోషించింది.

శాంతి స్నేహభావాలకు పునాదిగా డిల్లీ నుండి లాహోర్‌కు బస్సుయాత్ర జరిగింది. స్వయంగా ప్రధాని వాజ్‌పేయి గారు ఆ బస్సులో ప్రయాణించారు.

కాని ఆ మైత్రి ఎక్కువ కాలం నిలవలేదు. కార్గిల్‌ యుద్దం వచ్చింది. ఆపరేషన్‌ విజయ్‌ అమలు చేసి భారత్‌ విజయాన్ని సాధించింది. ఆ విజయాన్ని పెట్టుబడిగా వాడుకుని బిజెపి 1999 పార్లమెంటు ఎన్నికలలో సంపూర్ణ మెజార్టీ సాధించి సుస్థిర ఫ్రభుత్వాన్ని ఏర్పరించింది. వాజ్‌పేయి మళ్లీ ప్రధాని ఐనారు.

‘ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు’ అంటూ కాంగ్రేసు పార్టీతో సహా అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రమంతా ‘విద్యుత్‌ సంస్కరణలకు’ వ్యతిరేకంగా చాలా రోజుల నుండి ఉద్యమం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్‌ బోర్డును మూడు ముక్కలుగా విడగొట్టి విద్యుత్‌ చార్జీలను పెంచటం వలన సాధారణ గృహ వినియోగదారులు, అన్ని పారిశ్రామిక సంస్థలే గాక వ్యవసాయరంగం లోని రైతులు ఆందోళనలకు దిగారు. చివరికి కాంగ్రెసు అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి అమరణ నిరహార దీక్షకు కూచున్నాడు.

కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు అనేక కారణాల మూలాన తెలుగుదేశం చంద్రబాబు పరిపాలనకు వ్యతిరేకంగా బలమైన వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతా వీస్తున్నాయి. తెలంగాణాలో ఊపిరి పోసుకుంటున్న సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం కూడా దానికి తోడయ్యింది. కవులు తమ ‘శరాలను’ కవితల రూపంలో ఎక్కుపెట్టారు.

ఆ రోజు ఫిబ్రవరి 28, 2000.

ఆ దినం రాష్ట్రమంతటా విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ఊరేగింపులు జరపాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. దగ్గరి జిల్లాల వాళ్లు హైద్రాబాదు చేరుకోవాలని, సచివాలయం నుండి ఎల్‌.బి. స్టేడియం వరకు ప్రదర్శన, ఊరేగింపులు జరపాలని పిలుపు నిచ్చాయి.

ఆరోజు హైద్రాబాదు ‘వికసించిన విద్యుత్తేజం’లా మారిపోయింది. ఉప్పెనలా ఊగిపోయింది. ఎర్రబావుటాల నిగనిగలతో వినీలాకాశం ధగ ధగ లాడింది. మువ్వన్నెల పతాకాలతో నింగి రెప రెపలాడిరది. కెరటాలు, కెరటాలుగా కదిలి వస్తున్న అశేష జన వాహినులు భయం, గియం విడు, నడు అంటూ త్రాచుల వలె, రేచుల వలె ముందుకే మున్ముందుకే కదులుతూ నింగీ, నేలా పిక్కటిల్లేలా నినాదాలు ఇస్తూ హోరెత్తుతున్న పోటెత్తుతున్న ప్రజాసముద్రాలు.

ఆ అపూర్వమైన అనుభవాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఆత్రుతతో, ప్రజలతో కలిసి కదం కదం కలిపి ఊరేగింపులో నడవాలన్న కోర్కెతో స్వామి, శంకర్‌ రావు దేశ్‌ముఖ్‌ ముందు వేసుకున్న ప్లాను ప్రకారం ఆఫీసులకు లీవులు పెట్టి సచివాలయం దగ్గర కలుసుకున్నారు. విద్యుత్‌శాఖలో అతను అసిస్టెంటు ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. కథలు, వ్యాసాలు రాస్తుంటాడు. ఊరేగింపులో కలిసి కదులుతుంటే పౌరహక్కుల సంఘం కార్యకర్త, అడ్వకేటు పురుషోత్తం రావు కూడా వారిని కలిసాడు. ఆ జన సమ్మర్థంలో విడిపోకుండా ముగ్గురు చేతులు పట్టుకుని ముందుకు నడుస్తున్నారు.

ఊరేగింపు లిబర్టీ చౌరస్తాకు రాగానే ఒకవార్త దావానలంలా వ్యాపించింది. ఖమ్మం పట్టణం శివారుగ్రామం ‘ముదిగొండ’లో ఉద్యమకారులపై పోలీసుల కాల్పులు. అక్కడికక్కడే ఇద్దరి వీరమరణం. అనేకులకు గాయాలు, చనిపోయిన వారి పేర్లతో ‘అమర్‌ హై’ అన్న నినాదాలు నింగిని తాకుతున్నాయి. ఊరేగింపు మొత్తం ఉద్రేకంతో ఊగిపోతుంది. ఆ ముగ్గురు స్నేహితులు బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ క్రింది చౌరస్తా చేరుకున్నారు. వంతెన పైనా క్రిందా పొటెత్తుతున్న జన సముద్రాలు. ఇంతలో వాటర్‌ క్యాన్లు రంగప్రవేశం చేసాయి. చాలా ఫోర్సుతో చిమ్ముతున్న నీళ్ల పైపులను పోలీసులు ప్రదర్శన కారులపై గురిపెట్టారు. ఆ జలతాడనం సరిపోదన్నట్లు అశ్వాలను అధిరోహించి లాఠీలు ధరించిన పోలీసులు ప్రజలపై విరుచుకుపడ్డారు. జన సమూహాలు ముళ్ల కంచెలపై నుండి దుముకుతూ రాళ్లు, రప్పలు తీసుకుని పోలీసులపై ఎదురుదాడులు ప్రారంభించారు. చౌరస్తాలో ‘ఎంబెసీ’ ఇరానీ హోటల్‌ ముందు నిలుచుని ఆ ముగ్గురు మిత్రులూ ఆ రణరంగాన్ని కళ్లారా చూస్తున్నారు. స్వామికి 1969 మేడే నాడు రాజ్‌భవన్‌ ఎదురుగా జరిగిన లాఠీచార్జీలు, పోలీసుకాల్పులు, తన కళ్ల ముందే, జెఫ్రీ గుండు దెబ్బ తగిలి రైలు పట్టాలపై నేల కొరగటం అన్ని జ్ఞాపకం వచ్చాయి.

అప్పుడు పురుషోత్తం ముఖంలో చావుభయం స్వామికి కనిపించింది. మిగతా ఇద్దరి చేతులు పట్టుకుని ఇక్కడ మనం ఉండొద్దు అని అంటూనే ఉన్నాడు. కాని అంతలో తుపాకుల ఢాం ఢాం చప్పుళ్లు వినిపించాయి. ముగ్గురూ ఎంబెసీ హోటల్లోకి పరిగెత్తారు. సర్వర్లు చాకచక్యంగా షట్టర్లు క్రిందికి దించారు. లిప్తకాలం కాకముందే షట్టర్‌పై గుండ్ల వర్షం కురిసింది. పురుషోత్తం ముఖం నిండా చమటలు కారుతున్నాయి. అట్లా ఆ ముగ్గురు వెంట్రుక వాసిలో మృత్యుదేవత కౌగిలి నుండి తప్పించుకున్నారు. ఒక అరగంట తర్వాత షట్టర్లు లేవనెత్తారు. సరిగ్గా వాళ్లు నిలుచున్న స్థలంలోనే ఒక అభాగ్యుడు నిర్జీవంగా పడిఉన్నారు.

ఆ చౌరస్తా మొత్తం రాళ్లూ, రప్పలు, తెగిన చెప్పులు, రక్తపాతంతో గాయపడి నేలకూలిన వాళ్లతో ఒక రణరంగంగా కనబడిరది.

‘అంతంకాదది ఆరంభం’ అన్నట్లు తెలుగుదేశం, చంద్రబాబు పాలనకు, పతనానికి ఆరోజు పునాది పడింది. ఉద్యమకారుల రక్తాక్షరాలతో ఆ రోజు రక్తసిక్త చరిత్ర లిఖించబడిరది. పుడమి తల్లికి నేలపుత్రులు రక్తాభిషేకాలు చేయటం చరిత్రకు కొత్తకాదు కదా!

కొన్ని నెలల తర్వాత స్వామి ఆఫీసుపనిలో ఉన్నపుడు సెల్లుగొల్లుమన్నది. శంకర్‌రావు దేశ్‌ముఖ్‌. దాదాపు ఏడ్చుకుంటనే దుర్వార్త చెప్పాడు – ‘పురుష్తోతంను గొడ్డళ్లతో, తల్వార్లతో నరికి చంపేసారని. మొండెం నుండి తలను వేరు చేసారని’.

మెదడు మొద్దుబారింది. ఏమీ అర్థం కాలేదు. నమ్మలేని నిజం. షాక్‌ నుండి కోలుకున్న తర్వాత ఒక సంగతి బోధపడింది. మనిషి ‘పరేంగిత’ జ్ఞానానికి కొన్ని సంకేతాలు ముందే అందుతాయి. వాటిని అపశకునాలు అని కూడా కొందరు అంటారు. బషీర్‌బాగ్‌ చౌరస్తా కాల్పుల కన్న ముందే అతన్ని మృత్యుభయం వెంటాడుతుంది. కాని అది ఏ రూపంలో ఎప్పుడూ తనను కబళిస్తుందో ఊహించలేకపోయాడు. నిరంతరం వెంటాడుతున్న అతని మృత్యుభయానికి ఒక ఆధారం ఉంది. ఇంటికి పేరులేని ఫోన్‌కాల్స్‌ వస్తుండేవి. “నువ్వు హక్కుల ఉద్యమం నుంచి తప్పుకోకపోతే త్వరలోనే నిన్ను లేపేస్తామని. సి.యం పైన్నే కేసు వేసే మొనగాడివా?” అని బెదిరింపులు. “ఎవరు మీరు?” అని అడిగితే “గ్రీన్‌ టైగర్స్‌” అని ఫోను పెట్టేసేవారు.

పురుషోత్తం హత్య జరిగిన మర్నాడు దినపత్రికలలో ఫోటోలు, అక్షరాలు అన్నీ రక్తమోడుతూ కనిపించాయి. హైద్రాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో తన ఇంటి నుండి ఉదయం పదకొండు గంటలకు సరుకులు కొనటానికి ప్రక్కనే ఉన్న దుకాణానికి బయలుదేరాడు. సరిగ్గా పోలీసుస్టేషన్‌ ముందే నలుగురు హంతకులు అతని పై గొడ్డళ్లు, తల్వార్లతో దాడిచేసారు. పదిహేడు సార్లు కత్తులతో శరీరాన్ని చిధ్రం చేసారు. చనిపోయిన తర్వాత తల్వార్లతో తలను మొండెం నుంచి వేరు చేసారు. ఆ హత్యాకాండలో మాజీ నక్సలైటు నయీం తో పాటు మిగిలిన ముగ్గురు పోలీసులు సివిల్‌ డ్రెస్సులలో ఉన్నారని పురుషోత్తం భార్య జ్యోతి తర్వాత కాలంలో కోర్టుకు తన వాంగ్మూలం ఇచ్చింది.

తెలంగాణాలో చాలా కాలం నుండి పోలీసులకు, నక్సలైట్లకూ మధ్య ప్రచ్ఛన్న యుద్దం ప్రారంభమయ్యింది. మధ్యలో చాలామంది పౌరహక్కుల నాయకులు, కార్యకర్తలు హతులైనారు. వరంగల్‌లో డాక్టర్‌ రామనాథంతో మొదలైన హత్యలు జాపా లక్ష్మారెడ్డి, బెల్లి లలిత, పురుషోత్తంతో కొనసాగి ఆ తర్వాత ఆజం అలీ, కనకాచారిలతో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రతి హత్యలో ప్రభుత్వంతో పెంచి పోషించబడిన ‘నయీం ముఠా’ పాత్ర అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. గ్రేహౌండ్స్‌ను సృష్టించిన వ్యాస్‌, ఐపియస్‌ అధికారితో సహా అనేకమంది పోలీసులు, ఆఫీసర్లు, చివరికి హోం మినిస్టరు మాధవరెడ్డి కూడా నక్సలైట్లు చేసిన దాడులకు గురైనారు.

ఎవరి రక్తం కారితేనేం? ఎవరి రక్తం పారితేనేం? ప్రతిప్రాణమూ విలువైనదే కదా? పోయిన ప్రాణాలు మళ్లీ రాలేవు కదా? అందుకే తెలంగాణా ఒక ‘శాపగ్రస్త భూమి’, ఒక ‘బలిదానాల నేల’.

***

కె. సూర్యశేఖరరావు (కె.యస్‌.ఆర్‌) తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణా రాష్ట్రసాధన తన ధ్యేయమని ప్రకటించాడు.

తన మొదటి సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ‘టాగోర్‌ ఆడిటోరియం’లో జరిగింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ బియ్యాల జనార్థనరావులు వచ్చారు. విద్యార్థులే కాక చాలామంది తెలంగాణా అభిమానులు హాజరైనారు. ఆడిటోరియం నిండిపోయింది. స్వామి సగం దినం సెలవుపెట్టి ఆ సభకు వెళ్లాడు. ఆ నిండైన సభను చూస్తుంటే మళ్లీ 1969 ఉద్యమం కొత్తగా పురుడు పోసుకున్నట్లు, మలి దశ ఉద్యమం ప్రారంభమైనట్లు స్వామి పసిగట్టాడు.

తెలంగాణా ఉద్యమానికి భీష్మపితామహుడైన ఆచార్య జయశంకర్‌కు కె.యస్‌.ఆర్‌ వేదికపైన్నే, సభాముఖంగా పాదనమస్కారం చేయటం స్వామికి చాలా నచ్చింది. సాధారణంగా రాజకీయ నాయకులు గురువుల పట్ల అటువంటి మర్యాదను సభాముఖంగా ప్రదర్శించరు. రెండవది ఆయన స్వచ్చమైన తెలంగాణా పల్లె ప్రజల యాసలో ఉపన్యసించటం. ప్రజల నాడిని తెలుసుకుని, ప్రజల భాషలో మాట్లాడే, ప్రజానాయకుడని స్వామి గ్రహించాడు. 1969 ఉద్యమంలో ఏ నాయకుడు ఇంత స్వచ్ఛమైన తెలంగాణా యాస, భాషలలో మాట్లాడలేదు.

కె.యస్‌.ఆర్‌. ప్రసంగిస్తూ తన సగం జీవితం గడిచిపోయిందనీ, తనకిక ఏ స్వార్థమూ, ఏ కోరికలూలేవని, ఉన్న ఇద్దరు పిల్లలు, అంటే కొడుకూ, కూతురు పెళ్లిళ్లు చేసుకుని అమెరికాలో స్థిరపడినారని, ఇగ ఇక్కడుండేది ‘మిఁయా, బీవీ’ తామిద్దరమేనని, ఇక ఈ శేషజీవితమంతా తెలంగాణా, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అంకితం చేస్తానని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రశాంతంగా కళ్లు మూస్తానని, అదొక్కటే తన జీవిత లక్ష్యమని ఉద్వేగంగా ప్రసంగించాడు.

ఆయన మాటలలోని మాంత్రికశక్తికి శ్రోతలంతా నాగస్వరం ముందు తలలూపే నాగుపాములు అయిపోయారు.

టాగోర్‌ ఆడిటోరియం నూతన ఉత్తేజంతో, జై తెలంగాణా నినాదాలతో దద్దరిల్లి పోయింది. చరిత్ర ఒళ్లు విరుచుకుని ఒక కొత్త మలుపు తిరిగింది.

అరవై తొమ్మిది ఉద్యమ నాయకుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన టాంకుబండు ‘జలదృశ్యం’ భవనంలో ఏప్రిల్‌ నెలలో 2001 సం.లో ‘తెలంగాణా సాధన సంఘం’ (టిఎస్‌ఎస్‌) అనే క్రొత్త రాజకీయ పార్టీ స్థాపించబడింది. దాని అధ్యక్షుడు సూర్యశేఖరరావు (కె.యస్‌.ఆర్‌).

స్వామి ఒకరోజు మేనేజరు క్యాబిన్‌ రూముల కూచుని సిబ్బందికి సంబంధించిన సర్వీసు రిజిస్టర్లను పరిశీలిస్తుంటే అటెండరు లక్ష్మి వచ్చి “సార్‌ మీ కోసం ఎవరో ముగ్గురు వచ్చారు. మిమ్మల్ని కలవాలట” అన్నది.

“రమ్మను” అన్నాడు.

ముగ్గురూ వచ్చారు. స్వామి కన్న, పది, పదిహేనేండ్లు చిన్నవాళ్లు. బక్క పలచగా, చురుకుగా ఉన్నారు. సాధారణమైన మామూలు పాత దుస్తుల్లో కొంచెం బీదగా, అమాయకంగా కనబడుతున్నారు. కూచొమ్మని కుర్చీలు చూపించగానే ముగ్గురూ వినయంగా ఒదిగి కూర్చున్నారు. లక్ష్మి మూడు తెల్లని గాజు గ్లాసులల్ల మంచినీళ్లు తీసుకుని వచ్చింది. చెమటలు కారుతూ ఎండల పడి వచ్చారేమో గట గటా గ్లాసులు ఖాళీ చేసారు. లక్ష్మి వైపు చూసి మూడు చాయ్‌లు తెమ్మన్నాడు.

“సార్‌ నా పేరు పాండురంగం, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంటులో జూనియర్‌ అసిస్టెంటును. ఈయన జయపాల్‌ రెడ్డి పంచాయితీ రాజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంటు. ఆయన రంగాచారి ఫిషరీస్‌ శాఖ ఆఫీసుల జూనియర్‌ అసిస్టెంటు.

సార్‌ ఈ రోజు సాయంత్రం మేము కొంతమందిమి ‘తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య’ పేరుతో మీటింగ్‌ పెట్టుకున్నాం. క్లుప్లంగా చెప్పాలంటే తెలంగాణా రాష్ట్ర సాధనే మా ధ్యేయం. కాని ఆ పొలిటికల్‌ డిమాండ్‌ పైకి చెప్పకుండా తెలంగాణా ఉద్యోగుల హక్కుల కోసం పనిచేద్దామని చెపుతం.”

“ఇది వరకే ‘తెలంగాణా ఎన్‌.జి.వోల సంఘం’ అని, ఒక పాత సంస్థ ఉంది కదా. మళ్లీ ఈ కొత్త సంస్థ ఎందుకు?” అని ప్రశ్నించాడు.

“లేదు సార్‌. అది ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి జేబు సంస్థగా పనిచేస్తుంది. అది నామ్‌ కే వాస్తే ఆర్గనైజేషన్‌”  అన్నడు జయపాల్‌రెడ్డి.

“సరే మంచిది. నేనెందుకు రావాలి. నాది గెజిటెడ్‌ ర్యాంకు కదా” అని ప్రశ్నించాడు స్వామి.

“లేదు సర్‌. మాది అటెండర్ల నుండి ఆఫీసర్ల దాకా. ఇంకేమన్న అంటే ఐ.ఏ.ఎస్‌. క్యాడర్‌ వాళ్లు కూడా ఇందులో చేరవచ్చు. టి.ఎన్‌..జి.వొ సంస్థకు మాకు ఇదే పెద్ద తేడా” అన్నాడు పాండురంగం.

“మరి నా గురించి మీ కెట్లా తెలిసింది” అడిగాడు స్వామి.

“మా ఒకరిద్దరు దోస్తులు మీ డిపార్ట్‌మెంటు ఎంప్లాయిస్‌. మొన్న ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా మీరు చాలా బాగా మాట్లాడరని, ధైర్యస్థులని వాళ్లు చెప్పారు” అని నసుగుతూ మాట్లాడాడు రంగాచారి.

ముగ్గురూ చాయ్‌లు తాగారు.

స్వామి కొంచెం సేపు ఆలోచించాడు. పిల్లలు ఏదో ఉత్సాహంగా ఉన్నారు. ఒకసారి వెళ్లి చూస్తే తప్పేముంది అనుకుని “సరే ప్లేస్‌ అండ్‌ టైం చెప్పండి” అన్నాడు.

అప్పుడు వాళ్ల ముఖాలు చాటంత అయినాయి. అడ్రసు చెప్పారు. “తప్పక రావాలి సర్‌” అని ఇంకోసారి రిక్వెస్టు చేసి వెళ్లిపోయారు.

ఆ సాయంత్రం సకాలంలో చేరుకున్నడు స్వామి. చిన్న హాలు. యాభై మంది వరకూ జమ అయినారు. అందులో కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు. యూనివర్సిటి తెలుగు డిపార్ట్‌మెంటు ప్రొఫెసరు సోమయ్య ఆ సమావేశానికి ముఖ్య అతిథి. అతనిది స్వామి వయస్సు. మిగతా అందరూ 1969 తర్వాత తరం వాళ్లు.

సమావేశ ఉద్దేశాన్ని పాండురంగం వివరించాడు. సోమయ్య కూడా మాట్లాడాడు. కాని విలువైన సమాచారం ఏమీ ఇవ్వలేదు. ఆయనకు లోతైన అవగాహన లేదని స్వామికి అర్థం అయ్యింది. ఆ తర్వాత జయపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, జి.వో. 610 పుట్టుకకూ కారణాలు చెప్పి దాని అమలు జరగలేదని, ఉల్లంఘనలు జరిగాయని, ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణా అంతటా, ముల్కీ నింబధనలకు వ్యతిరేకంగా చాపక్రింద నీరులా పాకి పోయారని దీనికి వ్యతిరేకంగా మనం పెట్టబోయే కొత్త సంఘం యాక్టివ్‌గా పని చేయాలని తన ఉపన్యాసం ముగించాడు.

పాండురంగం స్వామిని మాట్లాడమని ఆయన్ని సభకు మంచి మాటలతో పరిచయం చేసాడు. ఒక గజిటెడ్‌ ఆఫీసరు సభకు రావటం అందరికీ సంతోషమైన సంగతి అని వివరించాడు.

స్వామి 1952 గైర్‌ ముల్కీ గో బ్యాక్‌ ఉద్యమం, 1969 ఉద్యమం క్లుప్తంగా వివరించి తెలుగుదేశం హయాంలో అనగా 1982 తర్వాత తెలంగాణాలో నీళ్లు, నిధులు, నియామకాల విశయంలో ఎట్లా అన్యాయాలు జరిగాయో, తెలంగాణా భాషా సంస్కృతులు, పండుగలు, ఆచార వ్యవహారాలు ఎట్లా అపహాస్యాలు, అవమానాల పాలైనాయో వివరించి ఈ కొత్త సంస్థ నిజాయితీగా, నిర్భయంగా తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయాలని ఉత్తేజపరిచాడు.

పుష్పాచారి తడబడుతూ అతి కష్టంగా వందన సమర్పణ చేయటంతో ఆనాటి సభ సంపూర్ణమయ్యింది.

“సార్‌. మమ్మల్ని ఇట్లాగనే ఎప్పుడూ గైడ్‌ చేయాలి” అని పాండురంగంతో సహా అందరూ స్వామిని కోరారు.

“సరే” అన్నాడు స్వామి.

ప్రతి నది పిల్ల కాలువగానే జన్మిస్తుంది. కాని తర్వాత కాలంలో అది విశ్వరూపం ధరిస్తుంది. ఈ కొత్త సంస్థ భవిష్యత్తులో ప్రముఖపాత్ర వహిస్తుందని ఆనాడు స్వామితో సహా ఎవరూ ఊహించలేదు.

***

ఒక ఆదివారం జులై 2001లో ఉద్యోగుల సమాఖ్య ‘రెండవ విస్తృత సమావేశం’ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. పాండురంగం దానికి అధ్యక్షత వహించాడు. వేదికపై రంగాచారి, జయపాల్‌ రెడ్డి, మోహన్‌రెడ్డి, స్వామి ఉన్నారు. చాలా డిపార్ట్‌మెంటుల నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, టీచర్లు వచ్చారు. మొదటి సెషన్‌ చాలా బాగా జరిగింది. చాలామంది క్రొత్త సమాఖ్య అవసరాన్ని బలపరిచారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రెండవ సెషన్‌లో సభ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. పాండురంగం అధ్యక్షుడిగా, స్వామి ఉపాధ్యక్షుడిగా, జయపాల్‌ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా రంగాచారి కోశాధికారిగా తాత్కాలిక కార్యవర్గం ఏర్పడిరది.

ఆ తర్వాత వెంటనే సంస్థ పేరును రిజిస్టర్‌ చేయించాలని, విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, అన్ని డిపార్ట్‌మెంటులలో శాఖలను ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాలు పర్యటించి ‘ఉద్యోగుల సమాఖ్య’ శాఖలను కార్యవర్గాన్ని జిల్లాల వారిగా నిర్మించాలని తీర్మానాలు చేసారు.

ఆ సభకు పత్రికా విలేఖరులు వచ్చారు. తెల్లారి అన్ని పేపర్లలో ‘తెలంగాణా ఉద్యోగుల సమాఖ్య’ కొత్త సంస్థ ఆవిర్భావ వార్తలు వచ్చాయి. ఉద్యోగులలో నూతన చైతన్యం మొదలయ్యింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version