Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-22

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[2001 సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటుంది. అనేక ప్రజాసంఘాలు ఏర్పడిన కాలం అది. అందులో ఒక భాగంగా అక్టోబరు నెలలో ‘తెలంగాణా రచయితల సంస్థ’ (తె.ర.సం.) ఏర్పడింది. ఆ సంస్థకు సిద్దార్థరాజ్‌రెడ్డి అధ్యక్షుడిగా వేణు ప్రధాన కార్యదర్శిగా, స్వామిని కార్యవర్గ సభ్యుడిగా తీసుకుంటారు. స్పృహ అనే పత్రికని ప్రారంభిస్తారు. ఉద్యోగుల సమాఖ్య దిన దినాభివృద్ధి చెందుతుంది. స్వామికి కొందరి వైఖరి నచ్చదు. ఉద్యమం పేరుతో వసూళ్ళకు పాల్పడం సొంత లాభం చూసుకునేవాళ్ళు ఎక్కువతారు. ఓ సమావేశానికి సినీనటి జయక్రాంతి హఠాత్తుగా వచ్చి, అడ్డదిడ్దంగా ప్రసంగిస్తుంది. అలా మాట్లాడద్దని స్వామి వారిస్తే, కోపగించుకుని విసవిసా వెళ్ళిపోతుంది. క్రొత్త సంవత్సరం రాబోతుంది కనుక తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య తరపున ఒక డైరీ తీసుక రావాలని కార్యవర్గం తీర్మానం చేస్తుంది. డైరీ రూపకల్పన, అందులో చేర్చాల్సిన వైతాళికుల ఫోటోలు పేర్లు స్వామి నిర్ణయిస్తాడు. స్వామి, పాండురంగం ఎంతో శ్రమించి, డైరీ నమూనా తయారుచేసి ప్రెస్‌కి ఇస్తారు. డైరీ ఆవిష్కరణ రోజున డైరీ ఓపెన్‌ చేయగానే, సమాఖ్య కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి కమలారెడ్డి బస్ట్‌సైజు రంగుల ఫోటో చిర్నవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది చింది. వైతాళికుల ఫోటోలన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చిన్న చిన్నగా ఉండడం చూసి స్వామికి బాగా కోపం వస్తుంది. సమాఖ్యలో రాజకీయాలు మొదలవుతాయి. స్వామికి విసుగొస్తుంది. ఉద్యమానికి తన వంతు సేవగా ‘ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల చరిత్ర’. అనే పుస్తకం రాసి ప్రచురిస్తాడు. అది అందరి ప్రశంసలు పొందుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-23: గోద్రా రైలు – గుజరాత్‌ గాయాలు

2002 ఫిబ్రవరి చివరి రోజులలో ఒక మైనార్టీ మతం వారి రక్తపుటేరులు, గుజరాత్‌ అంతటా ప్రవహించాయి. మారణహోమంతో గుజరాత్‌ తగులబడిరది. దేశవిభజన కాలం నాటి మత కల్లోలాలూ, ఇందిరా గాంధీ హత్యానంతరం డిల్లీలో మైనార్టీ మతమైన సిక్కులపై జరిగిన మారణహోమం, అత్యాచారాలు, హత్యలు, గృహదహనాలు మళ్లీ 2002లో గుజరాత్‌లో పునరావృతమయినాయి. రక్తసిక్త చరిత్ర మళ్లీ చర్విత చర్వణమైయ్యింది.

గుజరాత్‌లో గోద్రా ఒక చిన్న పట్టణం. అక్కడ రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. అది అహమ్మదాబాద్‌కు 127 కి.మీ.ల దూరంలో ఉంటుంది. 2002 ఫిబ్రవరి 27 వ తేదీ ఉదయం అయోధ్య నుండి అహమ్మదాబాద్‌ వెళ్లుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ స్టేషన్‌లో ఆగింది. ఆ రైలులో చాలామంది వి.హెచ్‌.పి. కార్యకర్తలు అయోధ్యనుండి అహమ్మదాబాదు వెళ్లుతున్నారు. ఆ గోద్రా పట్టణంలో ముస్లిం ప్రజలే ఎక్కువ జనాభా. జై శ్రీరాం అని నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు స్థానిక ముస్లింలకు వాగ్వివాదం, చిన్న ఘర్షణలు జరిగాయి. ఇంతలో ఒక పెట్టెలో మంటలు చేలరేగి అగ్నిప్రమాదం జరిగి అక్కడికక్కడే 59 మంది హిందువులు మరణించారు. ముస్లింలు భోగిని తగులబెట్టారని హిందువులూ, హిందువులు లోపల గ్యాసు స్టౌ మీద వంట చేసుకుంటుంటే మంటలు చేలరేగాయని ముస్లింలు ఆరోపణలు చేసుకున్నారు.

ఆ ఘటన జరిగిన ఒక గంటకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ అహమ్మదాబాద్‌ నుండి హెలీకాప్టర్‌లో వచ్చి కాలిపోయిన డబ్బాను, మృతదేహాలను పరిశీలించాడు. ఈ లోగా మృతుల బంధువులు శోకాలు పెడుతూ వచ్చారు. ఎటువంటి పంచనామాలు లేకుండా అక్కడి కక్కడే ఆ మృతదేహాలను వారి వారి బంధువులకు, కుటుంబాలకు అప్పగించారు. వి.హెచ్‌.పి. అధ్వర్యంలో మృతుల శరీరాలను ప్రదర్శిస్తూ వారి వారి సంబంధిత నగరాలలో రెచ్చగొట్టే ఊరేగింపులు ఉపన్యాసాలు జరిగాయి.

ముఖ్యమంత్రి మోదీ ఆ రైల్వేస్టేషన్‌లోనే జనాంతికంగా “ఈ సంఘటనకు రేపు రాష్ట్రమంతటా హిందువుల నుండి ప్రతిఘటన ఉంటుంది. అందులో పోలీసులు జోక్యం చేసుకోరాదని” ప్రకటన చేసాడు. ఆ మరునాడు సంఫ్‌ు పరివార్‌ సంస్థలన్నీ గోద్రా బందుకు పిలుపునిచ్చాయి. అధికార పార్టీ పిలుపు కావున పోలీసులు నిమిత్తమాత్రులైనారు.

రైలు పెట్టె దహనం జరిగిన కొన్ని గంటలలోనే గోద్రా పట్టణమే కాక మొత్తం అహమ్మదాబాద్‌ నగరాన్ని ప్రాంతాల వారిగా విభజించారు. ముస్లింలకు చెందిన ప్రాంతాలను, ఇళ్లను, దుకాణాలను, వ్యాపార సముదాయాలను ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకుని దుండగుల మూకలు గుంపులు, గుంపులుగా విడిపోయి దాడులకు, ఊచకోతలకు, దహనాలకు, అత్యాచారాలకు పాల్పడ్డారు. ఒక్కోగ్రూపు నాయకునికి ఒక సెల్‌ఫోన్‌ ఇచ్చి వారికి ఎప్పటి కప్పుడు సూచనలు అందచేసారు.

ముస్లిం వ్యతిరేక దాడులు గుజరాత్‌ రాష్ట్రంలో 151 పట్టణాలకు, 993 పల్లెలకు వ్యాపించాయి. 1272 మంది చనిపోయారు. అందులో 790 మంది ముస్లింలు 250 మంది హిందువులు ఉన్నారు. 228 మంది ఆ చూకి తెలియనందున వారు మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు లక్షమంది ముస్లింలు 40వేలమంది హిందువులు వారి నివాస స్థలాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఆ మారణకాండ జరిగిన కొన్ని రోజుల తర్వాత హైద్రాబాద్‌ నగరంలోని కవులు, కళాకారులు, రచయితలు, మేధావులూ ఒక ‘సమూహం’గా ఏర్పడి అహ్మమదాబాద్‌లోని శరణార్థి శిబిరాలను, బాధితులను కలవటానికి వెళ్లారు. అదంతా యాకూబ్‌ అనే కవి చొరవతో, ప్రయత్నాలతో జరిగింది. వారి వెంట గోవిందు వెళ్లి దగ్ధమైన ఇండ్లను, ఆస్తులను, పునరావాస శిబిరాలలో ఇంకా భయం నుండి కోలుకోలేని బాధితుల ఫోటోలను వందల సంఖ్యలో తన జీతం డబ్బులతో తీసాడు.

యాకూబ్‌ చాలా పట్టుదల కలిగిన కవి. ఆ గుజరాత్‌ ములాఖాత్‌కు కొనసాగింపుగా మతసామరస్యం కోసం నగరంలో అతి పెద్ద సభ జరిపాడు. లౌకిక శక్తులు, పార్టీలు, మత సామరస్యం కోరుకునే మేధావులందరూ ఆ సభకు వచ్చారు. గోవిందు తీసిన ఫోటోలతో, దినపత్రికలలో వచ్చిన వార్తా కటింగ్‌లతో ‘గుజరాత్‌ గాయం’ అని ఒక సావనీరును విడుదల చేసారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఆ సభ జరిగింది. ఆసభకు యుద్దనౌక ‘గద్దర్‌’ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారాడు.

అక్కడికి వెళ్లిన వారందరి ‘కన్నవి విన్నవి’ అనుభవాల సారాంశం ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

అహమ్మబాదులో ‘గుల్బర్గా సొసైటీ’ అను ఒక ముస్లిం పాంత్రం ఉంది. అది అప్పర్‌ క్లాస్‌ సొసైటీ. అక్కడ ఎహసాన్‌ జాఫ్రీ అను మాజీ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉంటున్నాడు. నగరంలో హింసాత్మక ఘటనలు ప్రారంభం కాగానే భయపడిన ముస్లింలు అన్ని ప్రాంతాల నుండి జాఫ్రీ నివసిస్తున్న గుల్బర్గా సొసైటీ ప్రాంతానికి పరిగెత్తుకుని వచ్చి ఆయనను కలుసుకుని కాపాడమని మొరపెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి, అధికారులకు, పోలీసు అధికారులకు అనేకసార్లు ఫోన్లు చేసారు. ఏమీ లాభం లేకపోయింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ముఖ్యమంత్రి మోడీ లైను కలిసింది. కాని జాఫ్రీ భార్య చెప్పిన ప్రకారం ‘ముఖ్యమంత్రి మోడీ జాఫ్రీని ఫోనులోనే అమర్యాదగా తిట్టాడు’.

మధ్యాహ్నం తర్వాత ముష్కరుల గుంపు గుల్బర్గా సొసైటీ కాలనీలోకి ప్రవేశించాయి. జాఫ్రీ ఇంటి క్రింది అంతస్తుకు నిప్పు పెట్టారు. అప్పుడు జాఫ్రీ ఆ దుండగులను ఎదుర్కొనే ఉద్దేశ్యంతో తన ఇంటిపై అంతస్తునుండి క్రిందికి దిగి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో ఆయన కూతురు తర్వాత కాలంలో పత్రికల వారికి, విచారణ సంఘానికి, కోర్టుకు ఇలా చెప్పింది.

“మా అబ్బాజాన్‌ ఇంటినుండి ఇవతలికి రాగానే ఆ బద్మాష్‌లు ఆయన కాళ్లు, చేతులు పొడుగు పొడుగు తల్వార్లతో నరికేసారు. తర్వాత తలను వేరు చేసారు. ఆ తలను ఒక త్రిశూలం లాంటి ఊచకు వ్రేలాడదీసారు. దాన్ని పట్టుకుని ఊరేగుతూ ‘జైశ్రీరాం’ ‘జై శ్రీకృష్ణ’ అని నినాదాలు చేసారు. తర్వాత ఆయన శరీరాన్ని వారే తగులబెట్టి బూడిద చేసారు.”

ఇది ఒక మాజీ పార్లమెంటు సభ్యుడికి లభించిన న్యాయం. ఇక మామూలు ప్రజల సంగతి ఊహించుకోవచ్చు. ఒకప్పటి తమ సహచర పార్లమెంటు సభ్యుడికి పట్టిన గతి తెలుసుకున్న మొత్తం పార్లమెంటు ‘షాక్‌’కు గురి అయ్యింది.

బిల్కీస్‌ భానోది మరొక విషాదగాథ. అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆమె ఐదు నెలల గర్భవతి. మూడు సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆమె గ్రామంపై ఇరవై, ముప్పై మంది దుండగులు మూకుమ్మడిగా మారణాయుధాలతో దాడి చేసారు. ఆమె కూతురితో సహా ఏడుగురిని అక్కడికక్కడే తల్వార్లతో, కత్తులతో నరికేసారు. బిల్కిస్‌భానోను, ఆమె తల్లిని, మరో ముగ్గురు స్త్రీలపై అత్యాచారాలు చేసారు. పదకొండు మంది తనపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేసినట్లు ఆమె తన వాగ్మూలంలో పేర్కొన్నది. ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.

తర్వాత కాలంలో ఆమె చేసిన పట్టువిడవని న్యాయపోరాటం వలన ఆమె కేసు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. చివరికి సీబీఐ విచారణ జరిగింది. గుజరాత్‌ హైకోర్టులో న్యాయం జరగదని భావించి కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేసారు. ఆ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ పదకొండు మందికి యావజ్జీవ శిక్షలు ఖరారు చేసారు.

ఆ కేసులో తర్వాత కాలంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తేనే కేంద్రం సైన్యాన్ని పంపిస్తుంది. కాని ముఖ్యమంత్రి మోడీ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. చివరికి రక్షణశాఖా మంత్రి జార్జి ఫెర్నాండేజ్‌ తన చొరవతో సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం విమానాశ్రయంలో దిగిన తర్వాత 34 గంటలపాటు బస్సుల కోసం నిస్సహాయంగా నిరీక్షించవలసి వచ్చింది. ఇదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం దురుద్దేశ వైఖరి. వాస్తవానికి అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయ నిరాకరణ.

అప్ఘానిస్తాన్‌ తాలిబన్లు బహిమియాన్‌లోని పురాతన బుద్ధుడి నిలువెత్తు విగ్రహాన్ని ధ్వంసం చేసినపుడు యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. అట్లనే ఒకప్పుడు టిబెట్‌లో రెడ్‌ గార్డులు బౌద్ధారామాల్ని ధ్వంసం చేసినప్పుడు కూడా నాగరిక ప్రపంచం దానిని తీవ్రంగా ఖండిరచింది. సరిగ్గా ఇటువంటి ఘటనలే గుజరాత్‌ అల్లర్లలో జరిగాయి. మతోన్మాదులు అహమ్మదాబాద్‌ నగరంలో ఉన్న నాలుగు వందల సంవత్సరాల క్రిందటి ‘వలీ’ సమాధిని కూల్చి నేలమట్టం చేసారు. ఆయన చనిపోయింది 1707లో ఆయన పర్షియన్‌, ఉర్దూ కవిత్వాలకు పునాదులు వేసిన వైతాళికుడు. అతని సమాధిని వారసత్వ కట్టడంగా ప్రజలందరూ భావిస్తారు. మతాలకు అతీతంగా కవులు, గాయకులు, కళాకారులందరూ దానిని ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు.

అటువంటి చారిత్రక సమాధిని నేలమట్టం చేసిన కొన్ని సంవత్సరాలకు అక్కడ హనుమాన్‌ దేవాలయం నిర్మించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌లలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది నరేంద్రమోడీ ఒక్కడే.

తర్వాత రక్షణశాఖా మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ గుజరాత్‌ను సందర్శించినపుడు ‘అల్లర్లలో స్వయంగా మంత్రులు, శాసనసభ్యులూ పాల్గొని పోలీసులు జోక్యం చేసుకోకుండా వారిని నివారించినట్లు’ ఆయన గ్రహించాడు. ఆ తర్వాత దేశప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి బాధితులను పరామర్శించటానికి గుజరాత్‌ వెళ్లి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న ముస్లిం శరణార్థులను కలిసి మాట్లాడాడు. ఒక బాధితుడు ప్రధానితో మాట్లాడుతూ తన తమ్ముడిని నిద్రలోనే నరికారని, తర్వాత యాసిడ్‌లో ముంచి సజీవంగా దహనం చేసారని చెప్పాడు. మరో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే యాభై మందిని ముక్కలు ముక్కలుగా నరికారని చెప్పాడు. అక్కడ గుమికూడిన ప్రజలందరూ ముఖ్యమంత్రిని మార్చాలని నినాదాలు చేసారు. ఒక యువకుడు చాలా ఆవేశంగా ప్రధాని వాజ్‌పేయి వెనక వినయంగా వొదిగి నిలుచున్న నరేంద్రమోడీని తన వ్రేలితో చూపిస్తూ “ఇతనే అసలైన హంతకుడు” అని గట్టిగా అరిచాడు.

నరేంద్రమోడీని మార్చాలని వాజ్‌పేయి అనుకున్నాడు కాని అద్వానీ ఒప్పుకోలేదు. అట్లా ఇద్దరి ప్రాణమిత్రుల మధ్య విభేదాలు మొదలైనాయి. తర్వాత కాలంలో అదే మోడీ అద్వానీని ఘోరంగా పరాభవించటంతో ఆయనకు తగిన శాస్తి జరిగింది. ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా’ అన్నట్లు అద్వానీకి జరగాల్సింది జరిగింది.

గుజరాత్‌లో మారణకాండ జరుగుతున్న కాలంలోనే ఒకరోజు స్వామి పబ్లిక్‌గార్డెన్‌, నాంపల్లి పుట్‌పాత్‌పై నడుస్తుంటే ఒక ముస్లిం యువకుడు అతనిని ఆపి ‘సలాం వాలైకుం సాబ్‌’ అన్నాడు.

“వాలైకుం సలాం” అన్నాడు స్వామి.

“ఆప్‌ కైరియత్‌ సే హైనా సాబ్‌” అని ప్రశ్నించాడు.

అతన్ని గుర్తించక తెల్లముఖం వేసాడు స్వామి. అది గమనించిన ఆ యువకుడు.

“సాబ్‌ మీ రూప్‌లాల్‌ బజార్‌ ఇంటిని మేమే కొన్నాం. అప్పుడు నేను చాలా చిన్న పిల్లగాడ్ని. నన్ను మీరు గుర్తుపట్టరు కానీ మీరు నాకు బాగా తెలుసు”. అని స్వచ్ఛంగా నవ్వుతూ ఉర్దూలో మాట్లాడాడు.

స్వామి చాలా కలవరపడి ‘మా ఇల్లు ఎట్లుంది? బాగుందా?’ అని ఇంటిమీద ప్రేమతో, బెంగతో అడిగాడు.

‘అది చాలా మంచి ఇల్లుసార్‌ ఆ ఇంట్లో మేము చాలా బాగుపడ్డాం. అభివృద్ధి అయ్యాం.” అన్నాడు సంతోషంగా.

“శుక్రియా” అని స్వామి వెనక్కి తిరగగానే..

“సార్‌ మీరు ఎప్పుడంటే అప్పుడు మా ఇంటికి రావొచ్చు. ఎప్పటికీ అది మీ ఇల్లే” అన్నాడు.

ఆ మంచి మాట ఆ మానవత్వపు మాట వినగానే స్వామి కళ్లల్ల కన్నీళ్లు గుబగుబమని పొంగుకొచ్చాయి.

చీకట్లో చిరుదీపం. అంధేరీ రాత్‌ కే సితారే అంటే ఇట్లాంటి యువకులే కదా అనిపించింది.

“మతములన్నియు మాసిపోవును, మానవత్వమొక్కటే, నిలిచి వెలుగును” అన్న గురజాడ మాట గుర్తు చేసుకుంటూ ముందుకు కదిలాడు.

ఆ తర్వాత నరేంద్రమోడీ గుజరాత్‌లో పెద్ద ఆకర్షణ కల్గిన నాయకుడిగా మారి త్వరలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సంపాదించి మళ్లీ ముఖ్యమంత్రి ఐనాడు.

కాని 2004 పార్లమెంటు ఎన్నికలలో బిజెపీ ఘోరంగా ఒడిపోయి తగిన శిక్ష అనుభవించి కాంగ్రేసు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రధానమంత్రి అయినారు.

2004 ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒడిపోయి కాంగ్రేసు పార్టీ ఘన విజయం సాధించి వై.యస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఐనారు.

తెలంగాణా ఉద్యమం రోజు రోజుకూ బలపడుతుంది. తెలంగాణా సాధన సమితి 26 సీట్లను కాంగ్రేసుతో పొత్తు ద్వారా సాధించింది. 2004 ఎన్నికలకు ముందు తాము ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని కాంగ్రేసు ప్రకటించింది. కాని తెలంగాణా ప్రాంతంలో ఎన్నికలు ముగిసి రేపు ఆంధ్రాలో ఎన్నికలనగా రాజశేఖరరెడ్డి యూటర్న్‌ తీసుకున్నాడు. “తెలంగాణాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా” అని ఎద్దేవా చేసాడు అవకాశవాదంతో.. తెలంగాణా ప్రజలు ఛీ ఛీ అని అతనిని అసహ్యించుకున్నారు.

***

‘కాలంబు రాగానే కాటేసి తీరాలే’ అని గర్జించిన వాల్కెనో, అగ్నిపర్వతం చల్లారిందనీ ఇక లేదని ఆరిపోయిందన్న విషాదవార్త ఫోను ద్వారా స్వామికి అందింది. ఆంజల్యతో సహా పంజాగుట్టలోని నిమ్స్‌ దవాఖానాకు పెరిగెత్తాడు.

అప్పటికే అక్కడ చాలామంది జమఅయినారు. నాగిళ్ల రామశాస్త్రి, వరవరరావు, గద్దర్‌, జయధీర్‌ తిరుమలరావు, తెలంగాణా ప్రభాకర్‌ ఇంకా ఎందరెందరో విషాద వదనాలతో. నడుస్తున్న తెలంగాణా చరిత్ర హఠాత్తుగా ఆగిపోయినట్లు అందరూ మౌనంగా ఉన్నారు. ఆయన పార్థీవశరీరాన్ని ఆ సాయంత్రం తెలంగాణా ప్రభాకర్‌ ఇంట్లో పెట్టారు.

తెలంగాణా వైతాళికులలో ప్రజాకవి కాళోజి నారాయణరావ్‌ ముఖ్యుడు. తెల్లని మెరిసే గడ్డంతో ఇ.వి. రామస్వామి నాయకర్‌ లా కనిపించేవాడు. తెలంగాణా ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.

హన్మకొండలో జరిగే అంత్యక్రియలకు అందరూ వెళ్లారు. మొత్తం తెలంగాణా కదిలి వచ్చి నివాళులు అర్పించింది.

పట్టణంలో ఎక్కడ చూచినా బ్యానర్లు.

‘కాళోజీ నువ్వు చూడలేని తెలంగాణాను మేమైనా చూస్తాం’.

‘భగ భగ లాడే మంటలు చూడు

కాళోజీ రచనలు చూడు’.

ఆయన అంతిమ ఊరేగింపు ఆయన చదువుకున్న మర్కజీస్కూలు ముందుకు వచ్చేసరికి ఆ స్కూలు విద్యార్థులు, టీచర్లు ఆయనకు నివాళులు అర్పించారు. ఆ పిల్లలు చేతులూపుతూ వీడ్కోలు పలుకుతున్నారు వారిని చూస్తుంటే భవ్యిత్తు మీద భరోసా కలిగింది.

ఊరేగింపు ఆసాంతం పాటలు. పాటలు. పాటల పల్లకీలో ఆ ప్రజాకవి కాళన్నను ప్రజలు ఊరేగించారు. పాటల ప్రవాహం. ‘వందనాలు వందనాలన్నో’ అంటూ అగ్రభాగాన గద్దర్‌ కదులుతుంటే “పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల” అంటూ సంధ్యక్క, రజితలు ఆలాపిస్తుంటే, “బొమ్మా చక్కన, నిమ్మాచక్కన నీవు నడిపిన పోరూ చక్కన” అంటూ వల్లంపట్ల కీర్తి గానమాలాపిస్తుంటే ఒక ప్రజల మనిషి ‘మహాభినిష్క్రమణం’ ఇంత గొప్పగుంటదా అని చూసేవారు విస్తుబోయారు.

మన కాలం వీరుడతను. ఆ అంతిమయాత్ర వరంగల్లు వీధులల్ల ముందుకు సాగుతుంటే రాజులను కాదని కష్టాలను కోరి వరించిన బమ్మెర పోతన, కులాల మీద దండెత్తిన పాల్కూరికి సోమన, సమ్మక్క సారలమ్మలు, సర్వాయి పాపన్న, ఆంధ్ర మహాసభలు, ఆర్యసమాజం, గాంధేయవాదం, తెలంగాణా రైతాంగ పోరాటం, నక్సల్‌ బరీ వసంతకాల మేఘ ఘర్జనలు, పౌరహక్కుల ఉద్యమాలు అన్నీ అవన్నీ గుర్తుకొచ్చి వాటన్నింటి మేలు కలయికనే కాళోజీ మూర్తిమత్వం అనిపించింది.

‘పుట్టుక నీది చావు నీది. బ్రతుకంతా దేశానిది’ అని తానే అన్నట్లు చివరికి తన దేహాన్ని వరంగల్లు మెడికల్‌ కాలేజీకి దాన మిచ్చి రంతిదేవుడిని మించి పోయాడు. అట్లా తానొకడే నగ్న పాదాలతో నడుచుకుంటూ కాకతీయ మెడికల్‌ కాలేజీలోకి మాయమైనాడు.

అంత వరకూ అతని వెంట వచ్చిన జన సముద్రం నిశ్శబంతో గడ్డ కట్టుకపోయింది. రెండు నిముషాలు మౌనసంతాపం. గాలి కూడా సడిచేయని ఆ నిశ్శబ్దంలో దివి నుండి భువికి దేవతలు దిగి వచ్చి కాళోజీకి నివాళులు అర్పిస్తున్నట్లు భ్రాంతి కలిగింది. తర్వాత పోలీసు బ్యాండు విషాద సంగీతం. అది ముగియగానే గౌరవ సూచకంగా గాలిలోకి పన్నెండు తుపాకుల కాల్పుల చప్పుడు.

‘అల్విదా కాళోజీ అల్విదా’.

అధ్యాయం-24: దారి చూపే దీపస్తంభాలు

స్వామికి సాహిత్య గురువు సామల సదాశివ గారు.

ఒక జ్యోతి ఇంకో జ్యోతిని వెలిగించినట్లు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ ద్వారా సదాశివగారి పరిచయ భాగ్యం స్వామికి కలిగింది. ఇటు కాళోజీకి అటు జి. కృష్ణ గారికి ఇద్దరికీ సన్నిహిత స్నేహితుడు సదాశివగారు. ఆ ముగ్గురు ఒక త్రివేణీ సంగమం. ఆ త్రివేణీ సంగమం తీరాన కూచుని వారి మాటలు వినటమే ఒక గొప్ప ఎడ్యుకేషన్‌. కన్యాకుమారి చివరి కొనన నిలబడి మూడు సముద్రాల సంగమాన్ని సందర్శించిన అనుభూతి ఆ ముగ్గురిని కలిసినపుడు స్వామికి కలిగేది. అతని దృష్టిలో ఆ ముగ్గురు త్రిమూర్తులు ‘బోధ గురువులు’.

కాళోజీని చూస్తుంటే ఇ.వి.రామస్వామి నాయకర్‌ను చూస్తున్నట్లే అనిపించేది. ఇక జి.కృష్ణగారి సంగతి. రాంనగర్‌లో ఒక మూలన మూడుగదుల అద్దెఇంట్లో నవారుతో నేసిన ఒక కుక్కి మంచంలో తాటిచెట్టంత పొడుగున్న ఆయన గూని శరీరంతో, కేశసంస్కారం లేని జట్టు, గడ్డంతో, చమక్‌ చమక్‌ మని మెరిసే కండ్ల కాంతితో, ఉబ్బసం జబ్బు బాధిస్తున్నా లెక్కచేయక ఆయాసపడుతూనే “మీకొక తమాషా చెప్పనా” అని సంభాషణ ప్రారంభించేవాడు. ఆయన్ని చూస్తుంటే స్వామికి ‘రమణ మహర్షి’ని చూస్తున్నట్లే అనిపించేది. అతనొక నడుస్తున్న చరిత్ర. అతన్ని కలవడమంటే చేయిచాచి చరిత్రతో కరచాలనం చేయటమే. అతన్తో మాట్లాడటం అంటే చరిత్రతో ముఖాముఖంగా సంభాషించటమే.

స్వామి, ఆంజల్య అపుడపుడూ వెళ్లి ఆయన దగ్గర కూచునేవారు. ఆయనకు మధురఫలాలంటే మహా ఇష్టం. (సపోటా పండ్లు) వెతికెతికి ఆ పండ్లను పట్టుకెళ్లేవాళ్లు. ఆంజల్యను చూడగానే “అవ్వా వచ్చినవా” అని కొండంత ప్రేమతో నోరారా పలకరించేవాడు. ఆయన ముందు కూచున్న మరుక్షణమే “మీ కొక తమాషా చెప్పనా” అని మొదలుపెట్టేవాడు. ఇక ఆ సంభాషణ ఆ రాంనగర్‌ మూడు గదుల అద్దె ఇల్లు దాటి దేశదేశాల సరిహద్దులన్నీ దాటి ఆ పిమ్మట భూమండలాన్ని చుట్టి వచ్చేది. ఆయన తన ముచ్చట్ల మూటను విప్పితే మేలిమి ముత్యాల్లాంటి అనుభవాలు ఇట్లా దొర్లేవి:

“అప్పుడ్నేను మద్రాసులో ఒక దినపత్రికలో పనిచేస్తున్నాను. సాయంత్రం ఆరయ్యింది. ఇంటికెళ్ళే హడావిడిలో ఉన్నాను. ఇంతలో టెలిప్రింటర్‌లో ఫ్లాష్‌, ఫ్లాష్‌ అంటూ వరుసగా టైటిల్స్‌ రావటం ప్రారంభమయ్యింది. ఇదేందిరా దేవుడా ఇంటికెళ్ళే టైంలో అని నేను విసుక్కుంటూనే ప్రింటర్‌ వైపు చూశాను.

‘గాంధీజీ అసాసినేటెడ్‌, గాంధీజీ అసాసినేటెడ్‌’ అంటూ రిపీటెడ్‌గా ఆ రెండు పదాలే వస్తున్నాయి. మేం కొయ్యబారిపోయాం. మళ్ళీ వెంటనే ‘ది అసాసినేట్‌ ఈజ్‌ ఎ హిందూ’ అని వచ్చింది.

ఈలోగా మా గేట్‌ దగ్గర కాపలా వుండే ముస్లిం వాచ్‌మెన్‌ను ప్రజలు చితకబాదారు.

ఆ హిందూ అన్న పదం రాకపోతే ఆ వున్నపళాన ఎంత మంది ముస్లింల ప్రాణాలు పోయేవో!

ఇక నేను పెన్నూ పేపరు పట్టుకొని రోడ్డు మీదికొచ్చాను. కోడంబాకం వస్తావా అని ఒక ముసలి రిక్షావాణ్ణి పలకరిస్తే ‘నేనురాను, పెద్దాయన పోయాడుగా’ అంటూవాడు తన సంతాపాన్ని ప్రకటించాడు.

నెహ్రూతో సహా అనేక మంది పెద్దవాళ్ళను ఎన్నోసార్లు రిపోర్టు చేశాను. గాంధీజీని మాత్రం రిపోర్టు చేసే అవకాశమే రాలేదు. కాని గాంధీజీ చితాభస్మం తీసుకెళ్ళిన ప్రత్యేక రైలులో విజయవాడ నుండి కన్యాకుమారి దాకా వెళ్ళే అవకాశం లభించింది. రైలు పెట్టెలో ఆ కలశం పక్కన్నే నిలుచుని ‘వైష్ణవ జనతో’ అంటూ గొంతుపోయేలా భజనలు చేశాను.

నేను గుంటూరులో క్విట్టిండియా ఉద్యమ సందర్భంలో జైలు కెళ్ళాను. అపుడు ఒక అండర్‌ట్రయల్‌తో స్నేహమయ్యింది. మర్డర్‌కేసు. హత్య చేశానని తనే ఒప్పుకున్నాడు. కేసు విచారణలో ఉండేది. కొంతకాలం తర్వాత నేను విడుదలై విలేఖరిగా పని చేస్తున్నపుడు ఒక రోజు గుంటూరు జైలు సూపరింటెండెంట్‌ నుండి ఫోను వచ్చింది. ఫలానా రోజు గుంటూరు వచ్చి ఒక ఖైదీతో డిన్నర్‌ చేయాలని, ఇది ఆ ఖైదీ చివరి కోరికని, ఆ ఫోను సారాంశం.

వెళ్ళాను. ఆఖైదీ నా పాత స్నేహితుడే. తెల్లారితే ఉరిశిక్ష అమలు. చివరి కోరికగా అతనితో కబుర్లు చెబుతూ ఆ ‘లాస్ట్‌ సప్పర్‌’ ముగించాను.

దేశవిభజన కాలంలో ఢిల్లీలో కూడా పెద్దెత్తున మతకల్లోలాలు జరిగాయి. మారణహోమమే కాక అనేక మంది స్త్రీలు అపహరించబడ్డారు. ఢిల్లీలో గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష సాగించి ఇరువర్గాల వారిని సామరస్యానికి ఒప్పించారు. అందులో షరతుగా ఎత్తుకెళ్ళిన స్త్రీలందరిని వాపసు తీసుకరమ్మన్నాడు. ముస్లింలు ఎత్తుకెళ్ళిన హిందూ స్త్రీలు, హిందువులు ఎత్తుకెళ్ళిన ముస్లిం స్త్రీలు తీసుకురాబడ్డారు. ఎవరి స్త్రీలను వారు ఇళ్ళకు తీసుకెళ్ళండని గాంధీజీ అన్నారు. ముస్లింలు తమ స్త్రీలను తీసుకెళ్ళారు. కాని హిందువులు మాత్రం తమ స్త్రీలను తీసుకెళ్ళలేదు. అందులోని కొందరు స్త్రీలు సబర్మతీ ఆశ్రమంలో తమ శేషజీవితాన్ని గడిపారు.

ఒకసారి విజయవాడలో కొంతమంది మిత్రులం కలిసి హాయిగా వైన్‌ పుచ్చుకుంటూ రామాయణ కావ్యగానం చేస్తున్నాం. కొంతమంది కుర్ర భక్తులకు కోపంవచ్చి, ‘తాగుతూ రామాయణ కావ్యగానం చేస్తారా?’ అంటూ తన్నటానికి వచ్చారు. మరోసారి ఓ రిసర్చ్‌ స్కాలర్‌ రామాయణం గొప్పతనం చెప్పమంటూ మా ఇంటికి వచ్చాడు. ఒక పెగ్గు వేసుకుని ప్రారంభిస్తా అన్నాను. అంతే! కోపంతో వినకుండానే వెళ్ళిపోయాడు. విశ్వనాథ వారి కల్పవృక్షం, రంగనాయకమ్మగారి విషవృక్షం, రెండు పుస్తకాలు వేల కాపీలు అమ్ముడుపోయాయి. పబ్లిషర్సు నన్ను కూడా రాయమన్నారు. నేను రాయలేదు. చివరికి డబ్బులు పుచ్చుకొని లత రాసింది. అవి కూడా వేల కాపీలు అమ్ముడయ్యాయి. అంటే, తెలుగు నేలలో అటూ ఇటూ రెండువైపులా వేలసంఖ్యలో పూల్స్‌ రెడీగా ఎప్పుడూ అందుబాటులో వుంటారన్న మాట.

గద్దర్‌ను మొదటిసారిగా నేనే రిపోర్టు చేశాను. కొందరికది నచ్చలేదు. ‘వాడితో ఆ సావాసమేమిటి?’ అన్నారు. ఒక రోజు నేను అద్దె కట్టలేదని మా ఇల్లుగలాయన నా సామాన్లను వీధిలోకి విసిరేశాడు. ‘ఎక్కడికి వెళ్ళన్రా దేవుడా’ అని దిగులుపడుతుంటే గద్దర్‌ వచ్చి ‘అన్నా పదవే మా ఇంటికి పోదాం. లారీ తెస్తా, సామాను తీసుకుపోదాం’ అన్నాడు. గద్దర్‌ వాడొక గొప్ప మనిషి, గొప్ప మనస్సు.

నా చిన్ననాటి దోస్తు ఒకడు జట్కావాడిగా దర్శనమిచ్చాడు. అప్పటికే నేను జర్నలిస్టును. నన్ను ప్రేమతో జట్కాలో కూచో బెట్టుకుని మా ఇంటి దాకా వచ్చాడు. నేను డబ్బులివ్వబోతే ‘ఏం భే. నాకు డబ్బులిచ్చే అంత గొప్ప వాడివయ్యావా?’ అని తిట్టాడు. నన్ను ‘ఏం భే’ అని సంభోదిస్తూనే నా భార్యకు మాత్రం గౌరవంగా నమస్కారం చేసేవాడు. ఆమె ఎపుడన్నా డబ్బులిస్తే కళ్ళకద్దుకుని జేబులో వేసుకునేవాడు.

కొడుకు పదవతరగతి పరీక్ష ఫెయిల్‌ అయితే ‘ఒరే అబ్బీ ఏం పరవాలేదు. ఒక రిక్షా కొనిస్తాలే. అది నడుపుకుని బ్రతకొచ్చు’ అని భరోసా ఇచ్చాడట.” అట్లా ఆ మహానుభావుడికి తన జీవితమే తనకొక తమాషా.

తామరాకు మీద నీటిబొట్టులా జీవించి, గొప్పగొప్ప సంగతులన్నీ హాయిహాయిగా, సరదాసరదాగా చెప్పుతూనే ఒకరోజు ఆకాశం తలుపులు తెరుచుకుని అవతలి వైపుకు మాయమైనాడు.

తన మరణానికి వారం రోజుల ముందు స్వామితో జ్యోతికా రాయ్‌ పాడిన ‘జోగీ మత్‌ జా’ పాట మరోసారి వినాలనుంది అని తన ఆఖరి కోరిక చెప్పాడు. అది యాభై ఏండ్ల క్రితం నాటి చాలా పాత పాట. ఆ చివరి కోరిక నెరవేర్చాలన్న పట్టుదలతో స్వామి నగరమంతా జల్లెడపట్టి గాలించి ఆ క్యాసెట్‌ సంపాదించి సంతోషంతో రాంనగర్‌ చేరేసరికి ఆ ‘మాటల మాంత్రికుడు’ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన పాదాల చెంత ఆ ‘జోగీ మత్‌ జా’ను పెట్టి స్వామి తన చివరి నమస్కారం చేసాడు.

***

స్వామికి హఠాత్తుగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. వ్యక్తిగత, కుటుంబ జీవితంలో అదొక అసౌకర్యమే. అయినా వెళ్లి జాయిన్‌ కావటానికి సిద్దపడ్డాడు. వార్త తెలిసిన ముగ్గురు ఉద్యోగ సమాఖ్య నాయకులు పాండురంగం, రెడ్డి, చారిలు పరుగెత్తుకొచ్చి:

“అన్నా ఇదేందే? రోజురోజుకూ ఉద్యమం బలపడుతున్న ఈ టైంల నువ్వు లేకపోతే ఎట్లనే” అని పరేషాన్‌ అయ్యిండ్రు.

“ఏం పర్వాలేదు. ప్రతిరోజూ నేను మీ ముగ్గురితో ఫోన్లల్ల మాట్లాడుతనే ఉంటకదా” అని ఓదార్చిండు. అప్పటికే సెల్‌ ఫోన్లు వచ్చాయి.

“అన్నా మన పార్టీకి ఇంతమంది శాసన సభ్యులున్నరు. వాల్ల సహాయంతో సెక్రెట్రేరియట్‌ లెవల్ల పైరవీ చేసి ఆ ట్రాన్స్‌ఫర్‌ను ఆపేద్దామే” అన్నడు పాండురంగం బ్రతిమిలాడుతున్నట్లు.

“వొద్దు పాండురంగం. నా వ్యక్తిగత ప్రయోజనం కోసం మన ఉద్యోగ సంస్థను వాడుకోవటం, రాజకీయంగా పైరవీలు చేయటం నాకిష్టం లేదు” అని సూటిగా చెప్పాడు స్వామి.

ఉద్యోగ సమాఖ్యకు స్వామి బదిలీ నష్టమే అయినా అతని నిజాయితీ వలన ఆ ముగ్గురికి అతనంటే గౌరవం పెరిగింది.

కాళోజీ, జి.కృష్ణ ఇద్దరూ కాలయవనిక వెనక్కి వెళ్లిపోయిన తర్వాత సామల సదాశివగారితో స్వామికి సాన్నిహిత్యం పెరిగి బలపడిరది.

సామల సదాశివగారు హైద్రాబాద్‌ వచ్చి తన చిన్న కొడుకు ఇంట్లో ఉన్నాడని వార్త తెలిసి, వెళ్లి తన బోధన్‌ బదిలీ గురించి చెప్పాడు.

“సంతోషం స్వామీ. నీకు నమ్మకం లేదని నాకు తెలిసినా ఒక మాట చెప్పనా?”

“అదేంది సార్‌ చెప్పండి” అన్నడు వినయంగా.

ఆయన చాలా తీరికగా తన బట్టతలను అలవాటు ప్రకారం కుడి అరచేత్తో నిమురుకుంటూ “బోధన్‌కు చాలా స్థల మహాత్యం ఉంది స్వామీ! తొమ్మిదో శతాబ్దంలో పంప మహాకవి కన్నడంలో మహాభారతం అక్కడే రాసాడు. అంతే కాదు బుద్దుడికి సమకాలికుడైన ‘బావరి’ ఆ బోధన్‌లోనే జీవించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పటి బోధన్‌ను ‘అస్మక’ లేదా ‘అశ్వక’ రాజ్యం అని పిలిచేవారు. కొంతకాలం ఆ అస్మక రాజ్యం శాతవాహనుల రాజధానిగా కూడా ఉండిరది. ప్రాచీన కాలంలో బోధన్‌కు ఏక చక్రపురమని, బహుదాన్యపురమని కూడా పేర్లున్నాయి. ఆ బహుదాన్యపురమే బోధన్‌ అని లేదా బాదన కుర్తి అని ప్రజలు పిలిచేవారు. గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు. అతను రాసిన ‘ఇండికా’ గ్రంధంలో కూడా ‘అస్మక రాజ్యం’ ప్రస్తావన ఉన్నది.

ఇంకో మాట కూడా చెప్తాను విను. ‘భావరి’ తన ఏడుగురు శిష్యులను ఆ కాలంలో బుద్దుడిని కలిసి ఆ బోధనలేమిటో తెలుసుకోమని పంపాడు. వారు తిరిగి వచ్చి శాతవాహన రాజ్యంలో బౌద్దమత ప్రచారానికి కృషి చేసారు”. అని చెపుతూ కొంచెం దమ్ము తీసుకుని తన పాన్‌ తయారీ ప్రారంభించాడు.

సదాశివగారు చాలా కాలం టీచర్‌గా ఉద్యోగం చేసినందున ఏ విషయమైనా ఖుల్లంఖుల్లాగా అరటి పండు వొలిచి చేతిల పెట్టినట్లు చెపుతాడు. వినేవాళ్లకు ఓపికుండాలెగాని ఆయన గంటలు గంటలు మాట్లాడతాడు. తను తయారు చేసుకున్న పాన్‌ బీడా పుక్కిట బిగించి “ఇక అసలు సంగతి చెప్తా విను. నువ్వు నాస్తికుడివని నాకు తెల్సినా చెప్పటం నా ధర్మం” అన్నడు.

“అయ్యో మీరేం చెప్పినా అది నాకు చాలా విలువైన మాటనే సార్‌” అని బుద్దిమంతుడిలా అన్నాడు. “బుజుర్గ్‌ లోగోఁ కే సామ్నే అదబ్‌ సే బాత్‌ కర్నా” అన్న మర్యాద స్వామికి చాలా బాగా తెలుసు.

“బోధన్‌కు దగ్గరలోనే బాసర సరస్వతీ దేవాలయం ఉంది. అది చాలా చాలా మహిమ గల దేవాలయం. నువ్వు ఆ సరస్వతి ప్రభావిత ప్రాంతంలో ఉండబోతున్నవు కదా అక్కడ నీకు చాలా మేలు జరుగుతుంది.”

యాంత్రికంగా తల ఊపాడు ఆ నాస్తికుడు. దేవుడూ దయ్యాన్ని నమ్మక పోయినా పెద్దలను గౌరవించే సంస్కారం అతనికుంది.

జిల్లాలలో ఉద్యోగబృందం పట్టణప్రాంత ఉద్యోగబృందంలా కాక సమయపాలన, పని సామర్థ్యంలో చాలా మెరుగ్గా ఉంటారు. బోధన్‌లో ఉద్యోగం స్వామికి చాలా ప్రశాంతంగా గడిచింది. సత్రం భోజనం, మఠం నిద్ర అన్నట్లు ఒక హోటల్లో రూం నెలవారీ పద్దతిలో అద్దెకు తీసుకున్నాడు. స్థానిక మెస్‌ నుండి భోజనం రెండు పూటలా వచ్చేది. పది, పదిహేను రోజుల కోసారి హైద్రాబాద్‌ వెళ్లేవాడు. కుటుంబానికి దూరంగా ఉండటంతో బోలెడంత తీరిక సమయం దొరికేది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల చరిత్ర పుస్తకం బాగా పాపులర్‌ అయ్యింది. అప్పటికే రెండు, మూడు ముద్రణలు జరిగాయి. భవిష్యత్తులో నిలిచిపోయే ఏదైనా ‘సృజన’ చేయాలని ఆలోచించసాగాడు.

ప్రముఖ ఇంగ్లీష్‌ రచయిత ఖుష్వంత్‌ సింగ్‌కు స్వామి ఏకలవ్య శిష్యుడు. అతని రచన ‘డెల్హీ’ చాలా సార్లు చదివాడు. అట్లనే ప్రఖ్యాత రచయిత ‘అబ్దుల్‌ హలీం షరర్‌’ రాసిన ‘ప్రాచీన లక్నో’ తెలుగు అనువాదాన్ని కూడా చాలాసార్లు చదివాడు. ఆ రెండు పుస్తకాలు కూడా ఆ రెండు నగరాల చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబాలు. సునీల్‌ గంగోపాధ్యాయ్‌ రాసిన ‘దోస్‌ డేస్‌’ అనే కలకత్తా నగరానికి సంబంధించిన కాల్పనిక చారిత్రిక నవల కూడా స్వామిని ఆకర్షించింది. నాల్గువందల సంవత్సరాల చరిత్ర కల్గిన ‘పురానా షహర్‌ హైద్రాబాద్‌’ మీద తానెందుకు ఒక చారిత్రక నవల రాయకూడదు అన్న ఆలోచన బోధన్‌లో ఉన్నపుడే స్వామికి కలిగింది. పనిలో పనిగా 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని కూడా తన అనుభవాలు జ్ఞాపకాల ఆధారంగా రాస్తే వర్తమానంలో నడుస్తున్న ఉద్యమానికి ఉపయోగపడుతుందని నిర్ణయానికి వచ్చాడు. పుట్టుకతోనే తాను అసల్‌సిసల్‌ హైద్రాబాద్‌ పాతనగరం భూమి పుత్రుడిని కావున హైద్రాబాద్‌ మీద ఒక పుస్తకం రాసి నేల తల్లి రుణం తీర్చుకోవాలని ఆ జిమ్మేదారీ తన మీదనే ఉందని కూడా గ్రహించాడు.

ఆరు నెలలలోపలే స్వామి ‘మానస పుత్రిక’ జన్మించింది. దాని పేరు ‘సలాం హైద్రాబాద్‌’. హైద్రాబాద్‌లో దాని ఆవిష్కరణ ఒక ఉత్సవం ఒక పండగలా జరిగింది. హైద్రాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ‘సలాం హైద్రాబాద్‌’ నవల రావటం ఉద్యమానికి ఊపునిచ్చినట్లయ్యింది.

జీవితంలో కొన్ని కాకతాళీయాలు లేదా కొన్ని గమ్మత్తులు జరుగుతుంటాయి. నవలా రచన పూర్తికాగానే స్వామికి మళ్లీ హైద్రాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. అది కూడా మళ్లీ పాతస్థానంలోనే ‘మేనేజరు’గా. జీవితంలో ‘మిరాకిల్స్‌’ అంటే ఇవేనేమో!

పెద్దల మాట చద్దిమూట.

సదాశివగారు జోస్యం చెప్పినట్లే అయ్యింది. బాసర సరస్వతి ప్రభావిత ప్రాంతంలోనే ‘సలాం హైద్రాబాద్‌’ నవల పురుడు పోసుకుంది. తర్వాత కాలంలో అనేక పునర్ముద్రణలు పొందింది. స్వామికి రచయితగా పేరొచ్చింది. ఉద్యమానికి ఊతమిచ్చే పుస్తకాలు తర్వాత కాలంలో మరెన్నో రాసాడు.

***

వేతన శర్మలు ముగ్గురు కలిసి తమలో తామే గూఢుపుఠాణీ చేసి ఎవరినీ సంప్రదించకుండా గజిటెడ్‌ ఆఫీసర్ల విభాగానికి వెంకటేశ్వర గౌడ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆ సమయంలో స్వామి బోధన్‌లో ‘సలాం హైద్రాబాద్‌’ నవలా రచనలో నిమగ్నుడై ఉన్నాడు. తిరిగి హైద్రాబాద్‌ వచ్చేసరికి కార్యవర్గ సభ్యుల్లో కొందరు ఆ వార్తను స్వామికి అందించారు.

అప్పటికే కాలాతీతమయ్యింది. ఏమాత్రం జాగు సేయక వెంకటేశ్వర గౌడ్‌ ‘తెలంగాణా గజిటెడ్‌ ఆఫీసర్ల సంఘం’ అను కొంగ్రొత్త దుకాణాన్ని ప్రారంభించి ఎందుకైనా మంచిదని రిజిస్టరు కూడా చేయించాడు. ఒక అపార్ట్‌మెంటులో ఆఫీసు కూడా ఓపెన్‌ చేసి దానికో బోర్డు కూడా తగిలించాడు. అతను బాగా పై సంపాదన వచ్చే ఒక ప్రభుత్వ శాఖలో గజిటెడ్‌ ర్యాంక్‌ ఆఫీసరు. వేరే ప్రభుత్వ శాఖలో పనిచేసే తన సన్నిహిత మిత్రురాలు రజితను తన సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాడు. స్వామి హైద్రాబాద్‌ వచ్చేసరికి ఘనత వహించిన ఆ సంఘంలో వారిద్దరే సభ్యులు. తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని రాత్రికి రాత్రి క్రొత్త క్రొత్త సంఘాలు అంటే దుకాణాలు చాలా పుట్టుకొచ్చాయి. ఉద్యమ మార్కెట్‌లో చెలామణి కావటానికి ‘ఓం ప్రధమం’ కొత్త పేరుతో ఒక దుకాణం ప్రారంభించాలని ముందు చూపుగలవారు చాలా మంది రంగంలోకి ప్రవేశించిన కాలమది.

స్వామి బోధన్‌ నుండి హైద్రాబాద్‌ రాగానే ‘త్రిమూర్తుల్ని’ కలవకుండా ముందు కొంత మంది కార్యవర్గ సభ్యుల్ని పిలిపించి ‘అసలు సంగతేందని’ విచారిస్తే స్వామి నగరంలో లేని ఈ అర్నెల్లల్లో నిజంగా చింతించవలసిన సంగతులు చాలానే జరిగాయని తెల్సింది.

వెంకటేశ్వరగౌడ్‌ పూర్వజన్మ వృత్తాంతంతో సహా అనేక సంగతులు బయటపడినాయి. ఆయన స్వస్థలం ఖమ్మం జల్లా. నేరచరిత్ర కల్గిన పేరు మోసిన ఒక శాసనసభ్యుడికి అతను జీపు డ్రైవరుగా పనిచేసేవాడు. ఆయన ప్రాపకంతో ఎట్టకేలకు పై అందానీ బాగా వచ్చే ఒక ప్రభుత్వ శాఖలో గుమాస్తాగా జీవితం మొదలుపెట్టి ‘అద్దాల మేడలలో నివసించే ఆఫీసర్ల లోగుట్టులన్నీ బహు బాగా ఎరిగిన వాడై వారిని బెదిరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, సంవత్సరానికోసారి ఆఫీసర్లు రాసే సంవత్సరానికోసారి ఆఫీసర్లు రాసే Annual Confidential Reports లలో Excellent, Extraordinary అని నివేదికలు రాయించుకుని అడ్డదారులలో ప్రమోషన్లు సంపాదించి అనతి కాలంలోనే గజిటేడ్‌ ర్యాంకు ఆఫీసరు అయినాడు. ఇబ్బడి ముబ్బడిగా ‘హరాంకా కమాయి’ సంపాదించి Money makes many things అన్న సత్యం గ్రహించిన వాడై ముగ్గురు త్రిమూర్తుల్ని రూకల గలగలలతో ప్రభావితం చేసి ‘కేకులో’ సింహభాగాన్ని ఈజీగా కొట్టేసాడు. అట్లా రెడీమేడ్‌ ఇన్‌స్టాంట్‌ కాఫీ లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని విభాగాల్లో పుట్టుకొచ్చారు.

‘అన్న హైద్రాబాదుకు వాపస్‌ వచ్చిండని’ తెలుసుకున్న త్రిమూర్తులు సంజాయిషీలు సిద్దం చేసుకుని వచ్చి కలిసారు.

“మన సంఘం ‘అటెండ్లర నుండి ఐఏఎస్‌ దాకా’ అని మీరే అన్నారు కదా. మరి ఈ వెంకటేశ్వరగౌడ్‌ ఎవరు? ఈ పదేండ్లలో ఎపుడూ కనబడని అతను హఠాత్తుగా ఎట్లా పుట్టుకొచ్చాడు? గజిటెడ్‌ ఆఫీసర్ల విభాగానికి అధ్యక్షుడిగా ఎందుకు ప్రకటించారు?” అని సూటిగా ప్రశ్నించాడు స్వామి.

తడబడిన పాండు “లేదన్నా గజిటెడ్‌ విభాగానికి సంబంధించిన బాధ్యత మాత్రమే ఇచ్చాం. కాని అతను ఏకంగా సపరేట్‌గా పేరు, బోర్డు, ఆఫీసు పెట్టి రిజిస్టరు చేస్తడని మేం ఊహించలేదు” అని నంగినంగిగా ఆకుకు అందని పోకకు పొందని జవాబులు ఇచ్చాడు.

ప్రతిదాన్ని తేలికగా హాస్యంగా తీసిపారేసే రెడ్డి “ఇసుంట రమ్మంటే ‘ఇల్లంతా నాదేనని’ అంటడని మేం అనుకోలేదన్నా” అని ఒక కుంటి సాకు చెప్పాడు.

తను కూడా ఏమన్నా మాటడకపోతే తన నాయకత్వానికే చిన్నతనమని భావించిన రంగాచారి “అన్నా మన దగ్గరేమో ఎప్పుడూ పైసలకు కరువు. మాటలు అందరూ మాట్లాడుతరు కాని జేబులకెల్లి ఎవడూ ఒక్క రూపాయి ఇవతలికి తీయడు. ఈ గౌడ్‌కు సిటీల మూడు, నాలుగు అపార్ట్‌మెంట్లు ఉన్నయ్‌. అండ్ల ఒకటి రెంటు లేకుండా మన ఉద్యోగ సమాఖ్య ఆఫీసుకు ఇచ్చిండు” అని నిస్సిగ్గుగా సమర్థించుకున్నడు.

“నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంతకు ముందు అతని మీద ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో ఎ.సి.బి. వారు అతని ఇంటి మీద దాడి చేసారని, ఉద్యోగం నుండి కూడా కొంత కాలం సస్పెండు చేసారని కూడా తెలిసింది” అన్నాడు స్వామి.

స్వామికి ఆ చిదంబర రహస్యం తెలియదని భరోసాతో ఉన్న ఆ ముగ్గురూ ఒకేసారి షాక్‌కు గురయ్యారు.

పాండురంగం గొంతు సవరించుకుని “నిజమే అన్నా కాని తర్వాత కాలంలో ఎసిబి కోర్టు ఆ కేసు కొట్టేసి అతనికి ‘క్లీన్‌ చిట్‌’ ఇచ్చింది కదా” అన్నాడు.

విలువలు లేని మనుషులు తెచ్చే రాబోయే తెలంగాణాలో నైతిక విలువల సంగతి ఎట్లుంటదో స్వామికి స్పష్టంగా ముందే తెలుసు.

“ఏ దునియా అగర్‌
మిల్‌ భీ జాయేతో క్యాహై
తుమారీ హై తుమ్‌ హీ
సంభాలో ఏ దునియా”

ప్యాసా సీన్మా చివరలో గురుదత్‌ పాట స్వామికి జ్ఞాపకం వచ్చింది.

ఆ తర్వాత కాలంలో వెంకటేశ్వర గౌడ్‌ ఇంతింతై వటుడిరతై అన్నట్లు, టి-జాక్‌ లో ప్రముఖ నాయకుడైనాడు. భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా ఎదగటానికి “ఆకాశానికి నిచ్చెనలు వేసుకున్నడు” జేఏసీ అనేది అతనికి ఆ నిచ్చెనలో ఒక చిన్న మెట్టు మాత్రమే.

అధ్యాయం-25: వెన్నముక లేని వింత జీవులు

“రచనలకు దగ్గరగా ఉండాలి. రచయితలకు మాత్రం దూరంగా ఉండాలి” అని చాలామంది పాఠకుల అభిప్రాయం. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. రచయితలు, కవులు, కళాకారులు ‘చందమామల్లాంటి’ వారు. దగ్గరికి వెళ్తే రాళ్లు, రప్పలు కనబడి నిరాశకు గురి అవుతాము. కళలకు, కవిత్వానికి, రచనలకు, ఉపన్యాసాలకు నిజమైన వ్యక్తిత్వాలకూ మధ్య ‘జమీన్‌ ఆస్మాన్‌’ ఫరక్‌ ఉంటుంది.

మనిషి సహజంగానో లేక సాధన ద్వారానో కవిగా, కథకుడిగా, కళాకారుడిగా రాణించవచ్చేమో కాని మంచి మనిషిగా ఉండటం అన్నింటి కన్నా గొప్ప సంగతి. రెండు ముఖాల మనుషులు వీళ్లల్లో ఎక్కువ మంది ఉంటారు.

శంకరరెడ్డి విప్లవ కవి. కాని ప్రభుత్వం ఇచ్చే అన్ని అవార్డులు మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. ఒక కళాశాలలో లెక్చరర్‌. కాలేజీకి వెళ్లి ఒకటి అరా క్లాసులు తీసుకుని ఆ మాత్రం కష్టానికే వేల రూపాయల యు.జి.సి. వారి జీతం జేబులో వేసుకుని కుర్ర కవుల వాహనం వెనుక ఆసీనుడై నగరంలో మూల కవితా గోష్ఠులు నిర్వహిస్తుంటాడు. పిల్ల కవులకు సూచనలు, మెలకువలు బోధిస్తూ ద్వారకాపీఠంలో శంకరాచార్యుడిలా ఆ శంకర్‌రెడ్డి, విప్లవ కవిగా భాసిస్తూ ఉంటాడు. ఆయన జిగ్రీ దోస్తు నూతన్‌. అతను ‘రాయని భాస్కరుడు’. ఒక తెల్లకాగితాన్ని నల్లకాగితంగా మార్చిన దాఖలాలు, అతని జీవితంలో లేకున్నా విదేశీ సాహిత్య సంస్థలతో దోస్తానాలు, లాబీయింగులు, ఈవెంటు మేనేజ్‌మెంట్లు చేయటంలో ఘటికుడు. ఒక ప్రాంతం నుండి వచ్చిన వీరు ఆ ప్రాంతం కవులను, కథకులను ఆకాశానికి ఎత్తుతుంటారు.

యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నపుడే సిద్దార్థరాజ్‌ రెడ్డి ఈ శంకరరెడ్డికి శిష్యపరమాణువు. కావున తను ప్రతి ఏటా జరిపే సాహిత్య సమావేశాలకు వీరిద్దరినీ విశిష్ట అతిథులుగా ఆహ్వానిస్తాడు. ‘ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటి వాయినం’ మాదిరి ఆ ఇద్దరు కూడా తమ ఆంధ్రా ప్రాంతంలో ఇతనిని ఆహ్వానిస్తూ గొప్ప తెలంగాణ కవిగా ప్రమోట్‌ చేస్తూ ఉంటారు.

ప్రతి దినం ఎవరో ఒక కుర్రకవి లేదా కవితాభక్తుడు గురుదక్షిణగా మెహఫిల్‌ ఏర్పాటు చేస్తాడు. రాత్రి పొద్దు పోయే వరకూ ‘ఎత్తిపోతల కార్యక్రమం’ చషకాల గల గలలు ఉంటాయి. అనుకోకుండా స్వామి ఒక మెహఫిల్‌కు హాజరైనాడు. అప్పటికే రెండు పెగ్గులు పట్టించి మూడో పెగ్గుతో హస్తభూషణుడైన విప్లవకవి శంకరరెడ్డి గ్రురమెక్కి ఊగుతున్న వాడిలా “ఈ రోజు ఈ మూడో పెగ్గు ఎందుకు తాగుతున్నానో మీకు ఏమైనా తెలుసా” అని జనాంతికంగా ప్రశ్నించాడు.

శిష్యులు (చేలాలు) ఎందుకు? ఎందుకు? అని ఘోషించారు.

“నిన్ననే ముగ్గురు సెంట్రల్‌ కమిటీ మెంబర్లను ఎన్‌కౌంటర్‌ చేసారు. ఆ దుఃఖం మరిచిపోటానికే ఈ మూడో పెగ్గు..”

‘ఔరా!’ అని అతని విప్లవ చైతన్యానికి మురిసి ముక్కలయినారు శిష్యపిపీలికాలు.

స్వామికి లేచి అతని పృష్ఠ భాగంపై ఈడ్చి తన్నాలనిపించింది.

ఇటువంటి అగ్రకులాల భద్రలోకుల విప్లవ కవులు రాసే కవిత్వాలు చదివి బడుగు బలహీన వర్గాల ఉడుకు రక్తం గల దుడుకు యువకులు అడవులల్లకు వెళ్లి అమరులవుతున్నారన్న సంగతి గుర్తుకొచ్చింది. సిద్దార్థరాజ్‌ రెడ్డి కవిత్వాభిమానులు ఇద్దరు అడవులకు వెళ్లి ప్రాణాలు బలిపెట్టిన సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది.

ఇక ఇతర కవులు వారి కవిత్వాల సంగతి చెప్పక్కర్లలేదు. అప్పులు సప్పులు చేసి జబ్బ బలంతో పుంఖానుపుంఖాలుగా కవిత్వ పుస్తకాలు వేసుకుంటారు. ఏ పుస్తకాల షాపు వాడూ ఈ కవిత్వాలను అమ్మకానికి పెట్టుకోడు. ఒకవేళ పెట్టుకున్నా ఒక సంవత్సరంలో పది కాపీలు కూడా అమ్ముడుకావు. అద్దె ఇళ్లల్లో గుట్టలు గుట్టలుగా వీరి కవిత్వ పుస్తకాలు పేరుకపోతుంటాయి. ఇంటిలోని పోరు, ఇల్లాలి పోరు ఇంతింత కాదయా అన్నట్లు ఆమె తిట్లూ దీవెనలు భరించలేక కనిపించిన ప్రతి వాడికి వాడు చదివినా, చదవకపోయినా కవితా కన్యలను కట్టలు, కట్టలుగా కన్యాదానాలు చేస్తుంటారు. అవన్నీ చివరికి చిత్తుకాగితాలు కొనుక్కునే దుకాణాలకు చేరుతాయి. సాధారణ ప్రజలకు ఈ కవుల ప్రతిభావిశేషాలు ఏమీ తెలియవు. కూపస్థ మండూకాల్లా కవుల గుంపుల్లోనే ఈ కవుల మనుగడ. ఎవరు ఎవరి కవిత్వాలను శ్రద్దగా చదవకున్నా ‘నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతా’ అన్న పద్దతిలో కవులుగా చలామణీ అవుతుంటారు. చాలా వరకు కవి కుల గుంపులన్నీ పరస్పర కుచమర్థనాలే.

వీరాస్వామి హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో తెలుగులో రీసెర్చి స్కాలర్‌. దళితుడు. పాలమూరు బిడ్డ. విప్లవోద్యమాలకు ఆకర్షితుడై నల్లమల అడవులలోకి వెళ్లి తుపాకీ పట్టాడు. అతను ఎన్‌కౌంటర్‌ అయినపుడు వయసు పాతికేళ్లు కూడా దాటలేదు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో అతని సంస్కరణ సభ, ముసలి తల్లి తండ్రులు వచ్చారు. కండ్ల నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు. మాట్లాడటానికి, గట్టిగా ఏడవటానికి కూడా శక్తిలేని గోసీ, గొంగడి మనుషులు. ఒక్కడే కొడుకు. వాళ్ల చిన్న ఊరుకు వాడొక్కడే బాగా చదువుకున్నవాడు. కుటుంబంలో మొదటి తరం అక్షరాస్యుడు.

వాడు ఏ టీచరో, లెక్చరరో అయితే ఆ నిరుపేద తల్లితండ్రుల కళ్లల్లో ఆనందదీపావళులు వెల్లివిరిసేవి. ముసలి వయసులో వాళ్లు కడుపు నిండా కూడు తినేవారు. ఊర్లో ఇంకో నలుగురు పిల్లలు వాణ్ణి చూసి విద్యావంతులయ్యేవారు. ఆ ముసలి అమ్మా నాయినలు ప్రెస్‌ క్లబ్‌ మెట్లు ఎక్కలేక అక్కడే గేటు దగ్గర పుట్‌పాత్‌ మీద కూచున్నారు. ఇస్త్రీ మడతలు నలగని విప్లవాభిమానులు సభకు కాలతీతమై పోతుందని హడావిడిగా మెట్లు ఎక్కి హాలు లోపలికి వెళ్లిపోతున్నారు. కాని వారి కటాక్ష వీక్షణాలు ఆ గోసీ గొంగడి ముసలి అయ్యా అమ్మల మీదికి ప్రసరించనేలేదు.

తెలంగాణా రచయితల సంస్థ వార్షిక మహాసభలు ఈసారి హైద్రాబాదులో జరపాలని కార్యవర్గం తీర్మానించింది. అప్పటికే వరంగల్‌, నల్లగొండ, నిజామాబాదులలో జరిగాయి. కావున ఈ సారి హైద్రాబాద్‌ నగరంలో జరిగితే అన్ని దినపత్రికలు, టీవీ చానెల్స్‌ దృష్టిని ఆకర్శించి సంస్థ ప్రజల దృష్టిలో హైలైట్‌ అవుతుందని కార్యవర్గ సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

సభకు ముందు సన్నాహక సమావేశం జరిగింది. ఎజెండాలో మొదటి అంశం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయటం. సంస్థలో ప్రతి విషయం నిర్ణయించటంలో సిద్దార్థరాజ్‌ రెడ్డిది ‘పెద్దన్నపాత్ర’. ఐక్యరాజ్య సమితిలో అమెరికా లాగ. వరుసగా మూడు సంవత్సరాల నుండీ అతనే మూజువాణి పద్దతిలో ఎన్నికవుతున్న అధ్యక్షుడు. ప్రతి అంతిమ నిర్ణయం ఆయనదే. మిగిలిన కుర్రకవులు, పిల్ల కవులు ఆయన ‘ఫత్వా’కు ఎదురుచెప్పరు. ఆయన చత్రచ్ఛాయలలో తామూ ఎంతో కొంత ఎదగవచ్చునని, ఆయనతో చక్రాంకితాలూ, ముద్రాంకితాలు వేయించుకుంటే వారి కవిత్వాలకు అది ఐ.యస్‌.ఐ. మార్కులా పని చేస్తుందని వారి ఆశ.

ఏ ఆహ్వాన సంఘంలోనైనా ప్రముఖులు, పెద్దలు ఉండటం సహజమే. సంస్థ అధ్యక్షుడు ప్రప్రధమంగా ఆహ్వాన సంఘంలో కవి శంకరరెడ్డి, నూతన్‌ పేర్లను సూచించాడు. ‘డూ డూ బసవన్న కవులు’ ఎవరూ తమకేమీ పట్టనట్లు మౌనంగా తలలూపుతున్నారు. స్వామి వేణు వంక చూసాడు. ఆయన ప్రధాన కార్యదర్శిగా సమావేశం మినిట్స్‌ బుక్కు రాసుకుంటూ ఉన్నాడు.

“ఆహ్వాన సంఘంలో శంకర్‌రెడ్డి, నూతన్‌ పేర్లా? ఇంతకూ ఎవరు ఎవరిని ఆహ్వానిస్తున్నారు? అని స్వామి సిద్దార్థరాజ్‌ రెడ్డిని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు అధ్యక్షులవారు నివ్వెరపోయాడు. తర్వాత ‘ధిక్కారము సైతునా’ లెవల్లో ఉద్రేకంతో గొంతు పెంచి “వాళ్లు ఆహ్వాన సంఘంలో ఉంటే తప్పేమిటీ” అని కీచు కంఠంతో ప్రశ్నించాడు.

అప్పుడు స్వామి చాలా ప్రశాంత స్వరంతో “చూడు రెడ్డి ఆంధ్రులు అన్ని రకాల, అన్ని రంగాలలో జరుపుతున్న పెత్తనానికి వ్యతిరేకంగా పని చేస్తున్న తెలంగాణా వాళ్ల తెలంగాణా సభకు ఆంధ్రావాళ్లు ఆహ్వాన సంఘంలో ఎట్లా ఉంటారు? ఆహ్వానం ఇంటి వాళ్లు పలకాలి కాని పరాయి వాళ్లు ఆహ్వానించటమేంది?” అని సూటిగా అడిగాడు.

ఊహించని ప్రశ్నకు ముందు తికమకపడి, అర్థం కాక వెంటనే కన్యాశుల్కం నవలలో అగ్నిహోత్రావధాన్లకు వచ్చినట్లు ఆగ్రహం వచ్చేసింది ఆయనకు. ప్రమధగణాలన్నీ నోర్లు విప్పకుండా ‘మిటమిట’ చూస్తున్నారు. వేణు కూడా మిన్నకున్నాడు. అక్కడున్న వాళ్లలో ఎవరూ, ఎప్పుడూ ఆయన్ని ఎదిరించే సాహసం కలలో కూడా చేయరు.

ఏ వివక్షకు, అహంకార పూరిత పెత్తనాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నమో, ఆ తెలంగాణా సంఘాలు, సంస్థలలో ఉన్న అహంకార ధోరణులను కూడా ఆ సంస్థలలోని సభ్యులు నిలదీసి ప్రశ్నించాలి కదా? ప్రశ్నించని వాడు, ధిక్కారస్వరం లేని వాడు కవి ఎట్లా అవుతాడు. రేపు తెలంగాణా వచ్చినా ఇవే పెత్తందారీ ధోరణులు ఉంటే తెలంగాణా తెచ్చుకుని ఏం లాభం? ఇదీ స్వామి ఆలోచన.

వారిద్దరి మధ్య చాలాసేపు వాగ్వివాదం జరిగింది. ముక్కంటి విశ్వనాథం అనే సీనియర్‌ కవి మాత్రం స్వామిని సమర్థించాడు. చివరికి అధ్యక్షుడు ఆంధ్రావాళ్ల పేర్లు ఉపసంహరించుకుని సమావేశం జరుగుతుంటే మధ్యలోనే సభా మర్యాద పాటించకుండా నిరసనగా వెళ్లిపోయాడు. ఇట్లాంటి వాళ్లుంటే భవిష్యత్తులో రాబోయే తెలంగాణ ‘ప్రజాస్వామ్య తెలంగాణాగా ఉంటుందా లేక అగ్ర కుల పెత్తందార్ల తెలంగాణాగా ఉంటుందా’ అని స్వామి దీర్ఘాలోచనలో పడిపోయాడు.

అనుకున్న ప్రకారం హైద్రాబాద్‌ నగరంలో సభ జరిగింది. ‘హైద్రాబాద్‌ నగర చరిత్ర సంస్కృతి’ గురించి స్వామి మాట్లాడాలని ముందే కార్యవర్గం నిర్ణయించింది.

స్వామి ప్రసంగిస్తుంటే సభ మొత్తం శ్రద్దతో వింటుంది. కడుపుమంట ఆపుకోలేని అధ్యక్షులవారు నిండుసభ మధ్యలో లేచి నిలబడి ‘ఏదో అభ్యంతరం తెలుపుతూ వాదనకు దిగాడు. మళ్లీ యథాప్రకారం విసవిసా నడుచుకుంటూ సభ నుండి వాకౌట్‌ చేసి వెళ్లిపోయినాడు.

స్వామి మాత్రం తనకు కేటాయించిన సమయంలోనే తన ప్రసంగం ముగించాడు. సభ జయప్రదంగా ముగిసింది.

ఒక వారం తర్వాత ‘సభ సమీక్షా సమావేశం’ జరిగింది. ఆ సమావేశానికి ముందే వేణు స్వామిని హెచ్చరించాడు. ‘అతను నోరు జారినా నువ్వు మాత్రం నోరు జారవద్ద’ని. అతని గుణం అందరికీ తెలుసు కాని ఎవరూ నోరు విప్పరు. అతనికి భయపడతారు అని కూడా అన్నాడు.

ఏ ఆశా, ఏ స్వార్థమూ లేని స్వామికి ఇప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడంటే ‘గడ్డిపోచతో సమానం’.

“ఒకరు ప్రసంగిస్తున్నపుడు అర్థాంతరంగా అడ్డుకోవటం, రభస చేయటం సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న నీవు వ్యవహరించే పద్దతి ఇదేనా రెడ్డి?” అని స్వామి సమీక్షా సమావేశంలో నిలదీసి ప్రశ్నించాడు.

‘అతని అహం దెబ్బతిని’ ఇగ ఈ వయసులో నీ నుండి నేను నీతులు నేర్చుకుంటా అని వ్యంగ్యంగా నిష్ఠురంగా అన్నాడు. నిజానికి స్వామి, అతని కన్నా రెండు సంవత్సరాలు పెద్ద.

“ఏ వయసులోనైనా ఎవరు మంచిగా చెప్పినా నేర్చుకోవలసిందే” అని గట్టిగా తగులుకున్నాడు ముక్కంటి విశ్వనాథం.

ఆ తర్వాత అతను, స్వామి కలిసి అధ్యక్షుడికి అందరి ముందు పట్టపగలే చుక్కలు చూపించారు. లౌక్యం గల వేణు మౌనం వహించాడు. మిగిలిన ఉపగ్రహాలు ఉలుకు, పలుకు లేక మొద్దు రాచ్చిప్పల్లా కూచున్నారు. వారందరూ తమ కవిత్వాల ద్వారా సమాజాన్ని సమూలంగా మార్చటానికి కంకణం కట్టుకున్నవాళ్లు. వారూ, వారు రాసే కవిత్వాల మీదా వైరాగ్యం, అసహ్యం కలిగాయి స్వామికి. ‘వెన్నెముక లేని వింత జీవులు’ అని మనస్సులో అసహ్యించుకున్నాడు.

ఆ తర్వాత కాలంలో నాలుగో మహాసభలకు ముందు స్వామి నల్లగొండ వెళ్లి వేణును కలుసుకొని “ఈసారి అధ్యక్షునిగా నువ్వు పోటీ చేయి ప్రధాన కార్యదర్శి పదవికి నేను చేస్తా” అని తన ఆలోచన చెప్పాడు.

కొంచెం ఆలోచించి “వొద్దు స్వామీ మనిద్దరం బద్నాం అయిపోతం” అన్నాడు వేణు. “మనం వోడిపోయినా ఫర్వాలేదు వేణూ అయినా పోటీ చేద్దాం” అన్నాడు స్వామి.

వేణు మౌన రాగం వెనుక మూగగా, పిరికిగా దాక్కున్నాడు.

అతని ‘రాజీతత్వం’ వెనుక ఉన్న రహస్యమేదో స్వామికి అపుడు అర్థం కాలేదు. భయం మొగమాటం అనుకున్నాడు. 1969 ఉద్యమం నుండి మూడు దశాబ్దాల పై నుండి కొనసాగుతున్న వారి గాఢ మైత్రిలో ఏదో అపశ్రుతి వినిపించింది స్వామికి.

‘మరి అతను అధ్యక్షుడిగానే కొనసాగుతూ నిన్ను ప్రధాన కార్యదర్శిగా ఉండమంటే?” అని ప్రశ్నించాడు స్వామి.

“అతను ఉండమంటే ఉంటా” అని నసుగుతూ చెప్పాడు.

ఆ మాట స్వామికి నచ్చలేదు.

నాలుగో మహాసభలకు ఒకరోజు ముందు ముక్కంటి విశ్వనాథం స్వామిని ఒంటరిగా కలిసి “ఈసారి సిద్దార్థరాజ్‌ రెడ్డిని తొలగిస్తున్నాం. నేను ఒక ప్లాన్‌ రెడీ చేసాను. తెర వెనుక దాదాపు అందరూ సిద్దంగా ఉన్నారు. మరి నువ్వు, ప్రధాన కార్యదర్శిగా ఉంటావా” అని సూటిగా అడిగాడు.

“సారీ నీ ఆలోచనకు నా మద్దతు ఉంది కాని నా ప్రియమిత్రుడు వేణు స్థానంలో, అతనిని తొలగించి నేను ఉండను” అని స్పష్టంగా చెప్పి తన స్నేహ ధర్మం నిలుపుకున్నాడు. నిజానికి స్వామి వ్యతిరేకత అధ్యక్షుడి మీదనే కాని ఫ్రధాన కార్యదర్శి మీద కాదు కదా. విశ్వనాథం చెప్పిన సంగతి వేణుకు స్వామీ తన జీవితంలో ఎపుడూ చెప్పలేదు.

స్వామి ఒంటరి వాడు ఐనాడని వేణు అనుకున్నాడు. కాని తెరవెనుక సంగతులు అతనికి తెలియవు.

ముక్కంటి ప్లాను విజయవంతంగా ముగిసింది. కానీ కొసమెరుపు ఏమిటంటే వేణును కూడా వారు ప్రధాన కార్యదర్శిగా తప్పించారు.

పరాభవం పొందిన సిద్దార్థరాజ్‌ రెడ్డి కొద్దిమంది తైనాతీలతో మరొక కొత్త ‘జేబు సంస్థ’ వెంటనే ప్రారంభించాడు. మార్కెట్లో చలామణీ కావటానికి ఏదో ఒక సంస్థ అవకాశవాదులకు నిరంతరం ఉండాలి కదా.

ఆ సంస్థ ద్వారా తర్వాత కాలంలో అతను అధికార పీఠాలకు చాలా దగ్గరయినాడు.

స్నేహాలు రకరకాలుగా ఉంటాయి. సరదా స్నేహాల మధ్య విభేదాలకు తావుండదు. సినీమాలు, షీకార్లు, కాలక్షేప కబుర్ల స్నేహాలు చేసే వారి మధ్యలో అభిప్రాయ బేధాలకు అవకాశం ఉండదు. అవన్నీ టైం పాస్‌ స్నేహాలు. కాని స్నేహితులనుకునేవారు ఒక విషయంపై లేదా ఒక ఉద్యమంలో ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నపుడు వారి వారి వ్యక్తిత్వాలు, ఆలోచనల, ఫలితంగా భిన్న భావాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. లక్ష్యం ఒకటే అయినా ఆలోచనల మధ్య అంతరాల వలన వాద వివాదాలు చోటు చేసుకుని అవి స్నేహాల మధ్య సంఘర్షణకు దారి తీస్తాయి.

విభేధాలు ఉన్నంత మాత్రాన విడిపోవటం సమంజసం కాదు అని స్వామి అభిప్రాయం.

రోజు రోజుకూ తెలంగాణా ఉద్యమం బలపడుతుంది. ఉద్యమం రెండు పాయలుగా ముందుకు సాగుతుంది. ఒకటి రాజకీయ ఉద్యమం. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటరీ పద్దతుల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి శాంతియుత పద్దతులు, రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవటం. రెండవది సాహిత్య, సాంస్కృతిక మేధోపర ఉద్యమం. ప్రజా చైతన్యాన్ని పెంపొందించి ఉద్యమానికి రాజకీయ ప్రక్రియకు అనుసంధానంగా పనిచేయటం. ఒకప్పుడు జాతీయోద్యమంలో సాహిత్య, సాంస్కృతిక సంఘ సంస్కరణల ఉద్యమాలు అంతస్రవంతిగానే కొనసాగినాయి.

నడుస్తున్న ఉద్యమం తీరు తెన్నులను మాట్లాడుకోవటానికి స్వామి ఇంట్లో వేణు, గోవిందు, పాశం యాదగిరి, శంకర్‌రావ్‌ దేశ్‌ముఖ్‌లు ఒక సెలవుదినం తీరికగా కలుసుకున్నారు. పాశం యాదగిరికి అటు జర్నలిస్టుల తోనూ ఇటు అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ సన్నిహిత స్నేహ సంబంధాలు ఉండటం వలన చాలా సమాచారం అతనికి ప్రతి నిత్యం చేరుతూ ఉంటుంది.

రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులపై అతనికి సదభిప్రాయం లేదు. పక్కా అవకాశవాదులని అతని అభిప్రాయం. 1969 ఉద్యమం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఉద్యమాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకపోవాలని అతని అభిప్రాయం. ఆ ఉద్దేశ్యంతోనే అతను ‘తెలంగాణా ఐక్యవేదికను’ స్థాపించి దానికి అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. అది తెలంగాణా అంతటా బలంగా పనిచేస్తుంది.

ముందు ‘తెలంగాణా ఉద్యోగుల సమాఖ్య’ పని తీరుపై చర్చ మొదలయ్యింది. స్వామి దానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. వేణూ, శంకర్‌రావ్‌లు దానికి ప్రధాన సలహాదారులు.

“స్వామీ! ఉద్యోగ సమాఖ్య నిర్మాణంలో మొదటినుండి నువ్వు ఒక చోదకశక్తిగా, నీ గత అనుభవాన్ని జోడిరచి పనిచేస్తున్నావు. అదిప్పుడు తెలంగాణా అంతటా వ్యాపించి బలంగా పనిచేస్తుంది. మంచి పరిణామమే కాని ఆ ముగ్గురు ముఖ్య నాయకులు పాండురంగం, జయపాల్‌ రెడ్డి, పుష్పాచారిలలో చాలా మార్పులు వస్తున్నాయి. నువ్వు గమనించావా?” అన్నాడు పాశం.

“ఏం మార్పులు” అని ఆశ్చర్యంతో విస్తుబోయాడు శంకరరావు. అతను చాలా సిన్సియర్‌, అభివృద్ధి భావాలు గల లౌకికవాది. ఏ పని అప్పగించినా కష్టపడి పనిచేసే నిజాయితీ కలవాడు. ప్రస్తుతం ఉద్యోగుల సమాఖ్య పనేగాక తెలంగాణా రచయితల సంస్థ మాసపత్రిక ‘స్పృహ’కు సంపాదక బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. స్థాయిలో పెద్ద ఉద్యోగమైనా అందరితో కలిసి మెలిసి పనిచేసే తత్వం అతనిది.

“ఆ ముగ్గురు ఉద్యోగ సమాఖ్య నాయకులు ప్రతి సంవత్సరం డైరీ, దాని ఆవిష్కరణ సభల సందర్భంగా చాలామంది రాజకీయ పార్టీల నాయకులను, శాసనసభ సభ్యులను కలుసుకుని పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తున్నారు. వాటి లెక్కా పత్రం గురించి మీకేమైనా అతా, పతా ఉందా?” అని పాశం స్వామీ, వేణూ, శంకరావులు ముగ్గురిని ఉద్దేశించి అడిగాడు.

“మేం ఆ డబ్బుల గొడవలు అంతగా పట్టించుకోలేదు. సమాఖ్య నిర్మాణం, దాని అభివృద్ధి మీదే ఇంత వరకూ దృష్టి పెట్టాం” అని ముగ్గురూ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నిజానికి కోశాధికారి ఏనాడు, ఏ మీటింగులో కూడా జమా, ఖర్చుల లెక్కలు చూపలేదు.

మరి పాశం చెప్పింది కూడా ముఖ్యమే కదా. ఈ ‘డబ్బు జబ్బు’ ఉన్న వాళ్లు నిజాయితీగా ఉద్యమాల నెట్లా నిర్మిస్తారు అన్నాడు గోవిందు.

“ఉద్యమాలు అభివృద్ధి అవుతుంటే ‘సందట్లో సడేమియాలు’ చాలామంది పుట్టుకొస్తారు, చొచ్చుకొస్తారు” అన్నాడు వేణు.

“ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలపై పైరవీలు, డబ్బుల లావాదేవీలు చేస్తున్న సంగతి నా దృష్టికి వచ్చింది” అన్నాడు శంకరరావు.

“ఈ కోణం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు కాని ఒక సంగతి మాత్రం నేను గమనించాను” అన్నాడు స్వామి.

ఏమిటదీ అని అందరూ ఒకేసారి అడిగారు.

“ఆ ముగ్గురూ ఈ తరం పిల్లలు. మన కన్న పది, పదిహేను సంవత్సరాలు చిన్న వాళ్లు. ఆ తరానికి మన తరానికి ఒక ముఖ్యమైన తేడా ఉంది.”

“ఏం తేడా?” అడిగాడు గోవిందు.

“మనందరికీ 1969 ఉద్యమ నేపథ్యం ఉంది. ఆ ఉద్యమంలో విద్యార్థులుగా పాల్గొన్నాం. 370 మంది ప్రజల ప్రాణాలు మన కళ్ల ముందు పోయినాయి. ఆ తర్వాత వెంటనే నక్సల్‌బరీ ఉద్యమానికి, వామపక్ష పార్టీల ప్రభావానికి గురి అయినాం. గాంధేయవాద తరానికి చివరి వరకూ కొన్ని విలువలు ఎట్లా కొనసాగినాయో మన తరం కూడా నక్సల్‌బరీ తరానికి చెందిన వాళ్లం. మనలో ఇప్పటికీ కొన్ని విలువలు మిగిలిఉన్నాయి” అన్నాడు స్వామి.

“సారీ. నేను 1969 ఉద్యమం అప్పుడు చిన్నవాణ్ణి అందులో డైరక్టుగా పాల్గొనలేదు. కాని ఆ సంఘటనలు లీలగా జ్ఞాపకం ఉన్నాయి” అన్నాడు శంకర్‌రావు.

“కావొచ్చు; కాని నీవు ఇంజనీరింగు విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అమరుడు జార్జిరెడ్డి ప్రభావం కొనసాగుతుంది. అట్లా నీకు అభివృద్ధి కాముక, లౌకిక వాద ధృక్పధం విలువలు అబ్బినాయి కదా” అన్నాడు స్వామి.

“అదైతే నిజం” అని శంకరరావు ఒప్పుకుని తలూపినాడు.

“అందుకే మరి. మనందరికీ ఏవో కొన్ని విలువల నేపథ్యం ఉంది. కాని మన ముగ్గురి మిత్రులకు వేరే నేపథ్యం ఉంది”. అని ఆగాడు.

“అదేమిటో చెప్పు మరి” అన్నాడు వేణు.

“1990-91లో ఈ ముగ్గురు యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉన్నప్పుడు మండల్‌ కమీషన్‌ రిపోర్టుకు అనుకూలంగా, వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నడిచాయి. గ్రామాల నుండి వచ్చిన వెనుకబడిన వర్గాల విద్యార్థులుగా వీరు ఆర్‌. కృష్ణయ్య నాయకత్వంలో రిజర్వేషన్లకు అనుకూలంగా అందులో పాల్గొన్నారు. ఆ మాత్రం అనుభవం వారికుంది. ఆ నాటి రాజకీయ నాయకుల అవకాశవాదాన్ని వీళ్లు అర్థం చేసుకుని అవే అసలైన రాజకీయాలని నిర్ణయానికొచ్చారు. రెడ్డి చెప్పినట్లుగానే వీరు ‘ఇది అవసరాల యుగం’ అని గుర్తించారు.” అని చెప్పటం ముగించాడు స్వామి.

“ఇది చాలా ముఖ్యమైన గమనించవలసిన సంగతే. యూ.పి., బీహార్‌లలో గతంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ అధ్వర్యంలో నడిచిన సంపూర్ణవిప్లవంలో ఎదిగి వచ్చిన విద్యార్థి నాయకులు ఆ తర్వాత మండల్‌ కమీషన్‌లో పుట్టుకొచ్చిన విద్యార్థి నాయకులు తర్వాత కాలంలో రాజకీయ నాయకులుగా మారి అవినీతి నాయకులుగా ముద్రపడినారు. వారంతా వెనకబడిన కులాల వారే. ఉదాహరణ: బీహార్‌లో లల్లూప్రసాద్‌ యాదవ్‌” అన్నాడు పాశం.

ఈ కాలపు అవకాశవాదానికి ఈ తరంవారు ప్రతినిధులు. “వీరు ఆదర్శవాదులు కారు. ఆచరణవాదులు. మేధో జీవితానికి, పుస్తకాల అధ్యయనానికి, వ్యతిరేకులు. వ్యవహరిక జ్ఞానం, లౌకిక జ్ఞానం ఎక్కువే. కాని విలువలు, సంస్కారాల పరంగా మరుగుజ్జులు” అన్నాడు స్వామి.

“మరి మనకు ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ ఇట్లాంటి వాళ్లతో కల్సి పని చేసే ఖర్మ మన కెందుకు?”. నిరాశతో అన్నాడు గోవిందు. అతనికి లెఫ్ట్‌ రాజకీయాలతో సంబంధం లేకున్నా ఒక నిఖార్సయిన ఆర్య సమాజిస్టుగా నీతి, నిజాయితీలను ప్రేమిస్తాడు. విలువలకు కట్టుబడి ఉంటాడు. అతను తన స్వంత ఖర్చులతో ప్రతి ‘ఉద్యోగ సమాఖ్య’ సభల ఫోటోలు తీసి తన వంతు పాత్ర నిర్వహిస్తుంటాడు.

“తప్పదు” అన్నాడు శంకరరావు. “ఇదొక బూర్జువా ప్రజాతంత్ర ఉద్యమం. ఇందులో అన్ని రకాల వాళ్లను కలుపుక పోవాలి. మనం సాధించబోయే భౌగోళిక తెలంగాణా కేవలం మొదటి దశ మాత్రమే అది వచ్చాక మళ్లీ ప్రజాస్వామ్య తెలంగాణా కోసం అంటే బడుగు, బలహీన వర్గాల తెలంగాణా కోసం మనమందరం కృషి చేయాలి”. అని తను చెప్పటం ముగించాడు పాశం. అది నిజమే అని అందరూ ఒప్పుకున్నారు.

మధ్యాహ్నం లంచ్‌ తర్వాత చర్చ తెలంగాణా రచయితల సంస్థ పనితీరుపై మొదలయ్యింది. ఈసారి స్వామి సూటిగా వేణును ప్రశ్నించాడు.

“వేణూ! తెరసంలో సిద్దార్థరాజ్‌ రెడ్డి ఆధిపత్యధోరణిని నువ్వు గమనించి కూడా నోరు మెదపకుండా ఎందుకున్నావు? అతనూ, నువ్వు ఇప్పుడు పదవులలో లేకున్నా అతనితో నువ్వు ఇంకా సన్నిహితంగానే మెలుగుతున్నావు. బి.సి.లమైన మనం అగ్రకుల అహంకారాన్ని ఇప్పుడు ఎదిరించకపోతే రాబోయే తెలంగాణాలో కూడా వాళ్లకు మనం లోబడే ఉండాలా? మళ్లీ దొరల తెలంగాణాను భరిద్దామా? ”

వేణు మౌనం వహించాడు. వేణు మౌనాన్ని భరించలేకపోయాడు పాశం. అతను కూడా స్వామిలాగే ముక్కుమీద గుద్దినట్లుగానే సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడుతాడు.

“స్వామి ప్రశ్నించింది నిజమే వేణూ. ఒక తెరసంలోనే కాదు. రాజకీయపార్టీగా అవతరించి ముందుకు దూసుకపోతున్న “తెలంగాణా సాధన సంఘంలో (టిఎస్‌ఎస్‌) కూడా ఒక అగ్రకుల సామాజిక వర్గమైన దొరల పెత్తనం నడుస్తుంది. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే ప్రభుత్వాధికారాలను చేజిక్కించుకున్నాయి. ఈసారి ఈ కొత్త సామాజిక వర్గం వారి స్థానంలో రావటానికి ప్రయత్నాలు ప్రారంభించి ఉద్యమంలో అగ్రభాగాన పనిచేస్తున్నారు. వచ్చే తెలంగాణా దొరల తెలంగాణాగా మారే ప్రమాదం ఉంది. అందుకే మేం దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీల తెలంగాణా కోసం ఐక్యవేదిక ద్వారా ప్రత్నామ్యాయ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం”. అని సుదీర్ఘంగా చెప్పాడు పాశం.

“ఐక్యవేదిక ద్వారా ప్రజాస్వామిక తెలంగాణా సాధ్యమా? అది రాజకీయ పార్టీ కాదు కదా” అని వేణు తన సందేహం వెలిబుచ్చాడు.

“తక్షణం అంటే ఈ దశలో సాధ్యం కాదు. మన ప్రయత్నాలు, మనం పెంపొందించే చైతన్యం ద్వారా భవిష్యత్తులో తప్పక సాధ్యమే” అన్నాడు పాశం. “అటువంటప్పుడు ప్రస్తుతం ఉద్యమాన్ని నడిపిస్తున్న ఈ రాజకీయ పార్టీనే మనం నమ్మాలి వారు ఏ సామాజిక వర్గం నాయకులైనా వారితో మనం కల్సి పని చేయక తప్పదు” అని వేణు అన్నాడు.

నిజానికి వేణు నేపథ్యం స్వామి, పాశంలకు భిన్నమైనది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మూలబడిన తర్వాత అతను కొంత కాలం వామపక్ష ఉద్యమాల సానుభూతిపరుడే కాని కార్యరంగంలో చురుకుగా పాల్గొనలేదు. ఆ సిద్దాంతాల అవగాహన పూర్తిగా శూన్యం. ఎంతసేపూ సాహిత్యం, కవిత్వం చుట్టే అతను పరిభ్రమించాడు. మధ్య వయసు దాటినాక అతను కొంత కీర్తికాంక్షవైపు మొగ్గుతున్నాడు.

“తెలంగాణాలో సిద్దార్థరాజ్‌ రెడ్డి కవిత్వానికి, కవులకు, ‘కోస్తాకు చెందిన కవి శంకరెడ్డిలానే’ ఒక మూలవిరాట్టుగా ఉన్నాడు. కావున వేణుతో సహా ఇతర తెలంగాణా కవులందరూ అతని చుట్టూ చేరుతారు. పైగా తెలంగాణా సాధన సంఘం అధ్యక్షుడు సూర్యశేఖరరావు, రెడ్డికి మధ్య బలమైన పూర్వస్నేహ బంధం ఉంది. ఒకే కళాశాలలో కలిసి చదువుకున్నారట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే రెడ్డి ఏదో ఒక అందలం అధిరోహిస్తాడని అంచనాలు అందరికీ ఉన్నాయి. అట్లా ఉత్తరోత్తరా అతని అండదండలతో తాము ఒక ఉపగ్రహంలా వెలుగు వెలగ వచ్చనని వేణుతో సహా ఇతర కవిపుంగవుల ఆశ. నిజానికి కవి అనేవాడు. అన్నింటినీ ధిక్కరించి నిలబడిన పోతన లేదా ప్రజాకవి వేమనలా, కాళోజిలా ఉండాలని ఈ కవులు కలలో కూడా ఊహించరు. కాలానికి ఎదురొడ్డి నిలబడని వీరి కవిత్వాలు చివరకి చరిత్ర చెత్తబుట్టలో చేరుతాయని గమనించరు. వీరందరికి చరిత్ర, సామాజిక శాస్త్రాల అధ్యయనం పూర్తిగా శూన్యం. ఎంతసేపు తమ కవితలలో ఉపయోగించే అంత్యప్రాసలు వాటి ఆడంబర పదాల గురించే ఆలోచిస్తుంటారు. మొఘల్‌-ఏ-ఆజం సీన్మాలో ఒక సూఫీ కవి సత్యం కోసం షహెన్‌షా అక్బర్‌నే ఎదిరిస్తాడు. కవులు అట్లా ఉండాలి.” అని ఆగి దమ్ము తీసుకున్నాడు పాశం.

“పాశం చెప్పినదానికి నేను మరొక ముఖ్యమైన అంశం జోడిస్తాను. ప్రస్తుతం ‘తెలంగాణా సాధన సంఘం’ పార్టీలో ఏ సామాజిక వర్గం ‘దొరలు’ ఆధిపత్యం వహిస్తున్నారో అదే దొరలు 1970, 1980లలో ఉత్తర తెలంగాణా జిల్లాలలో బలమైన విప్లవోద్యమం నడుస్తున్నపుడు భయపడి తమ పొలాలను, గ్రామాలను ప్రాణభయంతో వదిలి హైద్రాబాదు పట్టణానికి పారిపోయి వచ్చారు. కాని వారేం నష్టపోలేదు. పైగా పట్టణాలలో రియల్‌ఎస్టేట్‌ బిజినెస్సులు, కాంట్రాక్టులు చేసి బాగుపడ్డారు. ప్రస్తుతం తెలంగాణా ఉద్యమంలో చొరబడి ఉద్యమ నాయకులుగా చెలామణీ అవుతూ గ్రామాలలో మళ్లీ తిరుగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్పకుండా ఈ వర్గం అధికారంలోకి వచ్చి కోల్పోయిన ఆ భూముల్ని మళ్లీ ఏదో ఉపాయంతో స్వాధీనపరుచుకుంటారు” అని జోస్యం చెప్పాడు స్వామి.

“నిజమే మాంసానికి అలవాటు పడిన క్రూరమృగాలు శాఖాహార జీవులు కాలేవు. కాని ప్రస్తుతం ఉద్యమంలో పనిచేస్తున్నవారు, ముఖ్యంగా మేధావులు చాలామంది ఒకప్పుడు విప్లవోద్యమంతో సంబంధాలు ఉన్నవారే కదా. వారు ఈ కోణం నుండి ఆలోచించటం లేదా?” అని గోవిందు కీలకమైన ప్రశ్న సంధించాడు.

“తెలియని వాళ్లకు తెలియచెప్పగలం కాని అన్నీ తెలిసిన వారికి ఏం చెప్పగలం. 1970, 1980లల్ల యువకులుగా ఎర్రజెండా క్రింద ‘గరం’గా ఉండెటోళ్లు. తుపాకులు పట్టుకొని దొరల గఢీలను కూలగొట్టి నోళ్లు, వారి పొలాలల్ల ఎర్రజండాలు పాతినోళ్లు మధ్య వయసు రాగానే ఉడుకుడుకు దూకుడు రక్తం చల్లబడి ఇప్పుడు మర్యాదస్తులల్ల కలిసారు. ఇక రేపు తెలంగాణా రాష్ట్రం రాగానే వీళ్లందరూ అధికార కేంద్రాల చుట్టూ తమ స్వార్థం కోసం ప్రదక్షిణలు చేస్తారు. ‘బొక్కిందే దక్కింది’ అన్నట్లు వీళ్లు మారకపోతే నా పేరు పాశం యాదగిరే కాదు”.

“మరి జయశంకర్‌ సార్‌కు ప్రొఫెసర్‌ కల్యాణ్‌రాం రెడ్డికి ఈ సూక్ష్మమైన సంగతులు తెలియవా?” ప్రశ్నించాడు శంకర్‌రావు.

“వారికి మనకన్న అన్నీ ఎక్కువగానే తెలుసుకాని నౌ ఆర్‌ నెవర్‌ అంటే ఇప్పుడు కాకపోతే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇక ఎప్పుడూ రాదు. కావున మధ్యేమార్గం ఆచరిస్తున్నారు. ‘తె.సా.సం’ పార్టీ స్వభావం వారికి తెలుసుకాని బలమైన ప్రజా ఉద్యమంతో పాటు తెలంగాణాను సాకారం చేసే రాజకీయ పార్టీ ఒకటి ఉండాలన్న ఉద్దేశ్యంతో ఓపికగా ఆ పార్టీకి మద్దతునిస్తూ పని చేస్తున్నారు. వారిద్దరినీ అంతగా శంకించవలసిన పనిలేదు” అన్నాడు స్వామి.

సాయంత్రం అయ్యేసరికి అందరూ చాయ్‌లు తాగి వెళ్లిపోయారు. వేణు కూడా బయలుదేరబోతుంటే స్వామి ఆపాడు.

“వేణూ నువ్వు నల్లగొండ వెళ్లేసరికి చాలా రాత్రి అవుతుంది. ఇక్కడే ఉండిపో రేప్పొద్దున్నే వెళ్లు” అని ఆపాడు. సరే అన్నాడు వేణు.

ఇద్దరూ ఫ్రెష్‌గా ముఖాలు కడుక్కుని తయారయ్యి బజారుకు బయలుదేరారు. కొద్దిగా చికెన్‌, ఓల్డ్‌ మాంక్‌ క్వార్టర్‌ రమ్‌ బాటిలు, కారా మిక్చరూ కొనుక్కుని ఇంటికి వచ్చారు. ఆంజల్య వంట పని మొదలుపెట్టింది.

ఇద్దరూ ముందు గదిలో తలుపులు వేసుకుని కూచుని రమ్‌ గ్లాసులల్ల పోసుకుని ‘సత్సంగ్‌’ ప్రారంభించారు. ప్రొద్దుటి సీరియస్‌ చర్చలన్నీ మర్చిపోయి తేలికవాతావరణం ఏర్పడింది.

నాలుగు రమ్‌ చుక్కలు చప్పరించిన తర్వాత వేణుకు మూడ్‌ వచ్చి ‘వేణూగానం’ మొదలుపెట్టాడు. “ఉమర్‌ఖయ్యాం ఏమన్నాడో తెలుసా?” అని ప్రశ్నించాడు.

“ఏమో ఆ ఉమర్‌ఖయ్యాం ఎవడో నన్నెపుడూ కలవలేదు. నాతో మాట్లాడలేదు” అన్నాడు స్వామి రవ్వంత హాస్యంగా.

వెంటనే రెండు చషకాలు గలగలమని చప్పుడూ చేస్తూ పకపకా నవ్వాయి.

“మధువును కొద్దికొద్దిగా చుక్కలు చుక్కలుగా చప్పరించాలి. అప్పుడు ప్రతి బిందువులో సింధువు దర్శనమిస్తుంది. ఉమర్‌ఖయ్యాం తన షాయరీలో ‘ఖుల్‌ఖులే మీనా’ అని ఒక పద ప్రయోగం చేసాడు. ‘మీనా’ అంటే అతి సన్నని పొడవైన మెడ గల ఒక గాజుకూజా. దానిని కొంచెం పైకి ఎత్తి క్రింద ఉన్న చషకంలోకి అంటే మధుపాత్రలోకి ఆ ‘మధిర’ను ధారగా బొట్లు బొట్లుగా జారవిడుస్తుంటే ఒక రకమైన గల గలల శబ్దం వినపడుతుంది. అతి సన్నని సెలయేరు ధ్వనిలా, దానిని అతను ‘ఖుల్‌ ఖులే మీనా’ అన్నాడు షర్షియన్‌ భాషలో.”

స్వామి కడుసంతసించి “వాహ్వా వాహ్వా” అని హృదయాంతరాళం నుండి మెచ్చుకుని “అందుకేనేమో అందమైన సొగసైన, పొడవైన మెడ కలిగిన స్త్రీలను పర్షియన్‌ కవిత్వంలో ‘సురాహీ గర్దన్‌’ అన్నారు. దానినే హిందీలో మీనాకుమారీ అన్నారు” అని స్వామి అందుకున్నాడు.

“యస్‌. ఇంకా ఏమన్నాడంటే..” అని రెండు గుక్కలు గొంతులోకి జారవిడిచి క్షణకాలం ఆగాడు వేణు.

“పేష్‌ కరో` ఫర్మాయియే” అని ఉమర్‌ఖయ్యాం నషాలో ఉర్దూలోకి వెళ్లిపోయాడు స్వామి.

“మధువును ఎప్పుడంటే అప్పుడు ఎవరితో బడితే వారితో ఇష్టం వచ్చినట్లు తాగకూడదు. ప్రియమైన వారి సన్నిధిలోనే నెమ్మదిగా నెమ్మదిగా కొద్ది కొద్దిగా తాగాలి”

“ఆ ప్రియమైన వారెవ్వరో సెలవిచ్చి కాస్తా పుణ్యం కట్టుకోండి కవివర్యా” అన్నాడు స్వామి. తాగిన ప్రతివాడూ మహాకవి కాళిదాసే కదా!

“మధుశాలను ఇష్టపడే కవులు, కళాకారులు. వీరితో కూచుంటే కవిత్వం, కళాహృదయం ఉత్తుంగ తరంగాలై గంగా ప్రవాహంలా పొంగిపొర్లుతుంది. వీరేగాక, సాధువులు, సత్పురుషుల సాంగత్యంలో తాగాలి.”

“వారు తాగరు కదా” అని అడ్డుపడ్డాడు స్వామి.

“అవును తాగరు కాని గంజాయి దమ్ముకొట్టి ‘భం భం’ భోలేనాధ్‌ అని అంటారు కదా? కవికి తాత్విక చింతన కూడా అవసరమే కావున వీరితో కూడా కలిసి వారు గంజాయి సేవిస్తే మనం మధువును సేవించాలి. ఉమర్‌ఖయ్యాం దృష్టిలో సాధువులంటే మానవీయ ధృక్పదం కల్గిన సూఫీ సాధువులు. ‘ఈశ్వర్‌` అల్లా తేరే నాం’ బాపతు. అందుకే సత్సంగ్‌ అన్న పదం పుట్టుకొచ్చింది.”

“బహుత్‌ ఖూబ్‌. బహుత్‌ ఖూబ్‌” అన్నాడు శ్రోత.

“ప్రియమైన వారి సన్నిధిలో ఇంకొకరు మిగిలిపోయారు” అని రవ్వంత సేపు ఆగినాడు ఆ కవిగారు మిగిలిన అమృత బిందువులను గ్లాసులలో నింపుతూ.

“ఆఖరికి ఆమాత్రం ‘సశేషం’ ఎందుకు? అది కూడా ఏమిటో సెలవివ్వండి” అని అప్పటికే గుర్రమెక్కిన శ్రోత ప్రాధేయపడినాడు.

“సుందరిమణుల సమక్షంలో! సొగసుకత్తెల సాంగత్యంలో!! వారితో కలిసి మధుపాన సేవనం చేయాలి” అని ముగించాడు ఉమర్‌ఖయ్యాం.

“అయ్యో హత విధీ. మనకీ జన్మలో ఆ భాగ్యం లేకపోయెనే” అని నాటకీయంగా వాపోయాడా శ్రోత.

నవ్వటం, నవ్వించటం వేణుకు చాలా ఇష్టమైన విషయం.

“సగటు మనుష్యులకు, ఆమ్‌ ఆద్మీలకు, అనగా ఎల్లయ్య పుల్లయ్యలకు ఆ ఉమర్‌ఖయ్యాంతో పనేముంది? పొద్దంతా కాయకష్టం చేసి పొద్దుగూకగానే ఆడా, మగా కలిసి కల్లు కంపౌన్లలో నేలమీద చతికిల బడి ‘మార్‌ ముంత – చోడ్‌ చింతా’ అంటారు. వారిదంతా సాదాసీదా ఫిలాసఫీ. చింత ఉన్న మనిషి త్వరలో చితికి చేరుకుంటాడు” కదా అన్నాడు స్వామి.

ఆంజల్య భోజనాలకు పిలిచింది. చికెన్‌ వేపుడే గాక పప్పుచారు కూడా చేసింది. స్వామి ఇంట్లో భోజనాలు చేసిన వారందరూ ఆ పప్పుచారు ప్రాశస్త్యాన్ని చాలా మెచ్చుకుంటారు. అట్లా స్వామి ఇంట్లో పప్పుచారు బహు ప్రాచుర్యం పొందిన వంటకం.

భోజనానంతరం ముందు గదిలో కూచున్నపుడు వక్క పలుకులు పంటి క్రింద కిటకిట లాడిస్తూ ప్రొద్దున అందరి ముందు చెప్పలేని తన మనసులోని మాటలను వేణు నెమ్మదిగా ఆవేశకావేశాలకు గురికాకుండా చెప్పసాగాడు.

“స్వామీ 1969 ఉద్యమం నుండి ఈనాటి వరకూ మనిద్దరిదీ నాలుగు దశాబ్దాల స్నేహం. ఇప్పుడు నా వయసు యాభైఏడు. ఇక వచ్చే సంవత్సరమే నా రిటైరుమెంటు. జీవితం ముప్పావువంతు పైన్నే గడిచిపోయింది. నీ గురించి నాకూ, నా గురించి నీకూ బాగా తెలుసు. ఈ ఉద్యమాలదేముంది మధ్యలో వస్తాయి మళ్లీ మధ్యలోనే పోతాయి మిగిలేది స్నేహం ఒక్కటే.

నా ప్రవృత్తి మొదటి నుండి సాహిత్యం, కవిత్వానికే పరిమితం. నీలాగా జీవితంలోని ప్రతి దశలో ప్రతి మలుపులో ఆదర్శాలతో కార్యాచరణకు వెళ్లే స్వభావం నాది కాదు. దానికి నా ఇంటి పరిస్థితులే కారణం. నా పదిహేనేళ్ల వయసులో నాన్న పోయినాడు. అమ్మ టి.బి. పేషంటు. ఇద్దరు తమ్ముళ్ల తర్వాత ఒక చెల్లెలు. అందరూ చిన్నవాళ్లే. అప్పటికి నా క్వాలిఫికేషన్‌ పదవ తరగతి పాస్‌ మాత్రమే. పెట్రోలు బంకులో లెక్కలు రాయటంతో వచ్చిన సంపాదనతో కుటుంబ బరువులు మోయటం ప్రారంభమయ్యింది. ఇవన్నీ నీకు తెలిసిన సంగతే కదా. ఈ పరిస్థితుల వలన సర్దుకపోవటం, రాజీపడటం, నలుగురితో గొడవలు పడకుండా మంచిగా ఉండటం అలవాటయ్యింది. స్నేహ్నాలు, సంబంధాలు తెగిపోకుండా కొనసాగటమే నాకు ఇష్టం.

ఇక నీ సంగతి నువ్వు సాహిత్యం ఇచ్చిన సంస్కారం, చైతన్యంతో రెండు పదుల వయసు నిండకుండానే వామపక్ష రాజకీయ సిద్దాంతాలకు, ప్రభావాలకు గురయ్యి కార్యాచరణ వైపు వెళ్లావు. చేస్తున్న ఉద్యోగం రాజీనామా చేసి పార్టీ పూర్తికాలం కార్యకర్తగా వెళ్లావు. కార్మిక రంగంలో పనిచేసావు. కాని నాయకుల ప్రవర్తనలోని వైరుధ్యాలను పొరపాటు సిద్దాంతాలను అర్థం చేసుకుని పార్టీని వదిలి లెక్చరర్‌గా వెళ్లావు. జీవితం స్థిరపడిరదన్న దశలో నీ ముక్కుసూటిదనంతో అక్కడా లెక్చరర్‌ సంఘాల గొడవలలో ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ నిరుద్యోగ కష్టకాలం ఎట్లా గడిచిందో నాకు తప్ప వేరెవరికి తెలుసు? క్రింద పడిన నువ్వు లేచి మళ్లీ జీవితంలో ఇప్పుడు స్థిరపడినావు. ఇద్దరం దాదాపు ఒకే ఈడు వాళ్లం కదా!

ఇంత సోది పురాణం నీకు ఎందుకు చెపుతున్నానంటే మనిద్దరి ప్రాథమిక స్వభావాలు పూర్తిగా విభిన్నం. నీలాగా నేనుండలేను. నీది నిష్కామ కర్మయోగం. ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా నమ్మిన దారిలో ముందుకు దూసుకపోతావు. ఫలితాల గురించి ఆలోచించవు, ఆశించవు. సర్దుకపోయే స్వభావం కాదు కాబట్టి నచ్చకపోతే వదిలిపెట్టి ఒంటరిగా మిగిలిపోతావు. దేనిని అయినా పరిత్యజించటం నీకు చాలా సులువు. నాకు అది సాధ్యం కాదు.

నేను పుట్టింది, పెరిగింది సికింద్రాబాద్‌ అయినా నల్లగొండలోనే ఎందుకు స్థిరపడ్డానో తెలుసా? ఈ నగరం ఒక పెద్ద మహాసముద్రం. నేను ఇక్కడే ఉంటే నా సాహిత్య జీవితానికి భవిష్యత్తు ఉండదు. ఇక్కడి ‘శతకోటి లింగాలలో నేనూ ఒక బోడిలింగం’గా మిగిలిపోతాను. అది నాకు నచ్చదు. పెద్ద చెరువులో చిన్న చేపగా ఉండటం కంటే చిన్న చెరువులో పెద్ద చేపగా ఉండటమే నాకు ఇష్టం. జిల్లాలో మనకు గుర్తింపు, గౌరవం ఎక్కువ. మన ప్రతిభతో అందరినీ ఆకర్షించవచ్చు. జిల్లాలో ఎక్కడ, ఏ సాహిత్య సమావేశాలు, సభలు జరిగినా మనల్ని ఆహ్వానిస్తారు. అది నాకు ఇష్టం. ఇప్పటికే మంచి వక్తగా నాకు పేరొచ్చింది.

ఈ సాహిత్యరంగంలో ఒక కవిగా ఏదో ఒకటి సాధించాలని, పేరు తెచ్చుకోవాలని నా కోరిక. నా ఆశయం. ఈ తెలంగాణా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యక్తిగత ప్రయోజనం పొందాలనే ‘ఒక లక్ష్యం’తో పని చేస్తున్నారు. సూర్యశేఖరరావు కనుసన్నలలోనే రెడ్డి మన తెలంగాణా రచయితల సంస్థను నడిపిస్తున్నాడు. అన్ని ప్రజాసంఘాల రిమోట్‌ కంట్రోల్‌ ఆ నాయకుడి చేతిలో ఉంది. తెలంగాణా వచ్చినంక, భవిష్యత్తులో రెడ్డి ఏదైనా ప్రముఖ స్థానం పొందవచ్చు. అందుకే నా ప్రయోజనం కోసమే నేను మౌనంగా ఘర్షణలకు దూరంగా ఉండదలచుకున్నాను” అని మాట్లాడటం ముగించాడు.

ఆ రాత్రి స్వామికి ఒక ఇంగ్లీషు సామెత గుర్తుకొచ్చింది – ‘క్యాట్‌ ఈజ్‌ కమింగ్‌ అవుట్‌ ఆఫ్‌ బ్యాగ్‌’.

వేణులో ‘కేరీరిజం’ మొదలయ్యిందని తెలిసి బాధపడ్డాడు.

ఏదో ఒక రంగంలో కలిసి పని చేస్తున్నపుడే కదా మనుషుల స్వభావాలు తెలిసేవి. లేకపోతే దూరపు కొండలన్నీ నునుపుగానే కనబడుతాయి. చాయ్‌`పానీ దోస్తానాలకు ఈ సమస్య ఉండదు. వేణు, స్వామిది విచిత్ర స్నేహబంధం. ఇతర విషయాలలో ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా స్నేహాన్ని కొనసాగించే విషయంలో మాత్రం వారిద్దరిదీ ఏకాభిప్రాయమే!

***

2007 నూతన సంవత్సరం ప్రారంభదినం. ఉదయం పది గంటలు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండ్ల గూడెం గ్రామానికి ఆనుకుని ఉన్న పాలేరు వాగు మీది వంతెన. చరిత్రకు సాక్షీభూతమైన వంతెన. మౌనమునిలా కాలాన్ని పరిశీలించే వంతెన. ఆంధ్రా సరిహద్దును దాటి తెలంగాణాకు ముఖద్వారం మాదిరిగా నిలిచిన అతి పురాతనమైన వంతెన. కాలానికి కట్టిన కత్తుల వంతెన. నెత్తుటి వంతెన. ఆ రోజు అక్కడి జాతీయ రహదారి నంబర్‌నైన్‌ మట్టి మనుషుల పాదముద్రలతో పులకించి పోయింది. పరవశించి పోయింది.

భాజా భజంత్రీలు, మేళ తాళాలు, తెలంగాణా నినాదాలు, బ్యానర్లు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు మరికొన్ని గులాబీ కండువాలు ఆ మట్టి మనుషులతో కలిసి కదం కదం కలిపి, భుజ భుజం కలిపి తెలంగాణా ఐక్యతను చాటటానికి అక్కడ గుమికూడినారు. సరిహద్దుకు అటు ఇటు ట్రాఫిక్‌జాం. రెండు వైపులా ‘ముసాఫిర్లు’ అక్కడ ఏం జరుగుతుందో అని కుతూహలంతో చూస్తున్నారు. అదొక ‘లగాన్‌’ టీం తమ రక్తంతో చెమటతో భూమిని దుక్కిదున్ని ఆరుగాలం కాయకష్టం చేసి ‘రాజనాలు’ పండిరచే రైతు బిడ్డల టీం. గోసి గొంగడి గాళ్ల దళం. ‘కఫన్‌’ మాదిరిగా తలలకు చుట్టుకున్న తలపాగాలు భుజాలకు వ్రేలాడే జోలె సంచులు. పాదాలకు కిర్రు చెప్పులు, ఆకు చెప్పులు, చేతి కర్రలకు ‘జై తెలంగాణ’ నినాదాలున్న శ్వేతకేతాలు. ఎవరు వారు? ఎచటివారు? ఎటు నుండి ఇటు కొచ్చినారు?

ఆ పాదయాత్రకు, సారథ్యం వహిస్తున్నది వేనేపల్లి పాండురంగారావు. మిరియాలగూడెం మండలంలోని ‘ఆలగడప’ గ్రామం మాజీ సర్పంచ్‌. అతను ఏం చేసినా తనదంటూ ఒక సొంత ముద్ర ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఒక భాగమే “పాలేరు వాగు నుండి మూసీ నది దాకా” నడుస్తున్న జనయాత్ర, జైత్రయాత్ర.

ఇక ఆయనను అనుసరిస్తున్నది సుమారు 60, 70 మంది భూమి పుత్రులు. అలగడప వారు ఇంకా దాని చుట్టు ప్రక్కల వారు. పాలేరు వంతెన దగ్గర పాండురంగారావు ఉపన్యాసంతో పాదయాత్ర ప్రారంభమైంది. అది మామూలు ఉపన్యాసం కాదు. మూడు తరాల తెలంగాణా ప్రజల ఆత్మఘోష. సకల విధాల దోపిడీలకు, అన్యాయాలకు గురైన జీవుల వేదన. గుండె గొంతుకతో అతను ఉపన్యసించసాగాడు.

“యాభై అరవై సంవత్సరాల క్రింద మీరు ఖాళీ చేతులతో కట్టుబట్టలతో కల్లబొల్లి కబుర్లతో ఈ వంతెనను దాటి మా తెలంగాణా లోపలికి వచ్చారు. ఆ తర్వాత ఈ రోజు వరకూ ఈ వంతెన పై నుండే మీరు మా సిరిసంపదలను, భోగభాగ్యాలను మీ ఆంధ్రా ప్రాంతానికి తరలించుకుపోయారు. దానికి ఈ వంతెనే మూగసాక్షి. దాని క్రింది నుండి ప్రవహించేవి నీళ్లు కాదు, మా తెలంగాణా ప్రజల కన్నీళ్లు. మా కన్నీళ్ళ వల్లనే మీ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ ఉప్పుగా మారినాయి” అని వేనేపల్లి ఘోషిస్తుంటే ఆ ఉపన్యాసం వింటున్న వారి కండ్లల్లో కన్నీళ్లు గుబగుబమని పొంగుకొచ్చాయి. ఆవేశంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి. ‘జై తెలంగాణా’ నినాదాలతో మిన్నూ మన్నూ ఏకం అయినాయి.

పాదయాత్ర నల్లబండ్లగూడెం దాటి కోదాడకు చేరుకుంది. ప్రతి రోజు 20-25 కిలోమీటర్ల చొప్పున పది రోజులలో హైద్రాబాదు చేరుకోవాలని వారి ఆలోచన. సడక్‌ మీద కలిసిన ప్రతి ఒక్కరికి తమ పాదయాత్ర లక్ష్యానికి సంబంధించిన కరపత్రాలను పంచుతున్నారు. ప్రతి చిన్నా, పెద్ద గ్రామంలో నలుగురు కూడిన కాడ తెలంగాణా ఎందుకు కావాలో చిన్న చిన్న ఉపన్యాసాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ‘రోడ్లకు మా నమస్కారం’ అంటూ ఆ మట్టి మనుషుల పాదాలు చందన చర్చిత చల్లని ధూళి పరిమళాలతో పాదప్రక్షాళనం చేసుకుంటున్నాయి. తెలంగాణా కోసం ప్రార్థించే పాదాలు వారివి.

‘బాటలు నడిచి పేటలు దాటి’ అన్నట్లు మూడవ తారీకున ఆ పాదయాత్ర సూర్యాపేట చేరుకుంది. ఆ పాదయాత్రీకులకు ఘనంగా స్వాగతం పలుకుతూ సూర్యాపేటలో ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ రాత్రి అక్కడ నిద్రచేసి తెల్లరంగానే మళ్లీ ‘తెలంగాణా కారవాన్‌’ నకిరేకల్‌ వైపు పురోగమించింది. తోవ పొడుగునా వారిచ్చిన నినాదాలు సాదా సీదా నినాదాలే. సామాన్యులకు కూడా తెలంగాణా పోరాటం ఎందుకు జరుగుతుందో బోధపడేటట్టు!

ఆ సాయంత్రం కాకతీయుల కాలంలో నిర్మితమైన పానుగల్లు దేవాలయం దగ్గర ఆ మట్టి మనుషుల పాదయాత్రకు భాజా భజంత్రీలతో, మేళ తాళాలతో చెవులు గింగురుమనే నినాదాలతో, ఒడలు పులకరించే పాటలతో ఘనంగా ఎదుర్కోళ్ళు జరిగినాయి. నల్లగొండ పట్టణానికి సంబంధించిన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులంతా అందులో పాల్గొని ఆ జైత్రయాత్రను సాదరంగా పట్నంలోకి ఆహ్వానించారు. ఆ ఊరేగింపుతో నల్లగొండ పట్నంలోని పురవీధులన్నీ పులకరించిపోయాయి. తర్వాత ఫంక్షన్‌హాలులో బహిరంగ సభ జరిగింది. వేణు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఆయన తన అధ్యక్షోపన్యాసంలో “మట్టి మనుషుల పాదయాత్రీకులకు పేరు పేరునా పాద నమస్కారం చేస్తున్నాను” అని ప్రకటించగానే సభ యావత్తు కరతాళధ్వనులతో మారుమోగింది. జై తెలంగాణ నినాదాలు ఆకాశాన్ని అంటినాయి. చాలా మంది ఉత్తేజంగా ప్రసంగించినారు. ముగింపులో పాండురంగారావు, హృదయాలు ద్రవించి, మనుసులు ఆర్ధ్రమయ్యే రీతిలో ఉపన్యాసమిచ్చినాడు.

ఏడవ తారీఖు సాయంత్రం చిట్యాలలో ఒక బహిరంగసభ జరిగింది. ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ లాగా ప్రచారం సాగింది. చౌటుప్పల్‌, కొయ్యలగూడెం, కొత్తగూడెం, భూదాన్‌పోచంపల్లి, అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌ దాటి మట్టి మనుషులు యల్‌.బి.నగర్‌ చౌరస్తా దగ్గర పదో తారీఖు ఉదయాన పది గంటలకు నగర ప్రవేశం చేశారు.

పట్నమోల్లు పల్లెటూరు రైతుబిడ్డలకు తమదైన పద్ధతిలోనే ‘వెల్‌కం’ చెప్పారు. ఏమైతేనేం నగరంపై మట్టిమనుషుల ‘ముట్టడి’ ప్రారంభమైంది. ‘లగాన్‌ టీం’ దండయాత్ర నగరవీధులలో కదంతొక్కి మార్చ్‌ చేసింది. గోసి గొంగడి మనుషుల తలలకు చింపుల పేగుల తలపాగాలు. వడివడిగా నడిచే ఆ కిర్రు చెప్పులు, భుజాలకు వ్రేలాడే జోలెసంచులు, ‘జైతెలంగాణా’ శ్వేత కేతాలను ఎగురవేసే చేతి ఊతకర్రలు నగరవాసుల దృష్టిని ఆకర్షించాయి. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌ చౌరస్తాలు అడ్డుదొలిగి పక్కపక్కలకు వొదిగి ఆ భూమి పుత్రులకు దారినిచ్చి గౌరవించాయి. ఆ నినాదాలలో దాగిన వారి గుండె చప్పుళ్ళను జాగ్రత్తగా విన్నాయి. వారు పంచిన కరపత్రాలను చదివి అర్థం చేసుకున్నాయి.

ముస్లిం సోదరులు మలక్‌పేటలోని ఆజం ఫంక్షన్‌హాల్‌లో వారందరికి భోజనాలు ఏర్పాటుచేసి తెలంగాణా పట్ల తమ సంఫీుభావాన్ని తెలియజేశారు. నగర జన నీరాజనాలను అందుకొంటూ పాదయాత్ర సాయంత్రం మూడుగంటలకు బాగే ఆమ్‌ ఎదురుంగ ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంది.

పాదయాత్ర భారత సంస్కృతిలో ఒక భాగం. సాధువులు, సంత్‌లు, ఫకీర్లు, తత్వవేత్తలు పాదయాత్రల ద్వారానే తమ భావాలను ప్రచారం చేసి ఆనాటి సమాజం సంక్షోభ దశలో, సంక్లిష్ట దశలో ఉన్నప్పుడు దానికి మార్గనిర్దేశనం చేసేవారు. దానిని ముందుకు నడిపేవారు. గౌతమబుద్ధుడు, శంకరాచార్యుడు, వల్లభాచార్యుడు, రామానుజుడు, కబీర్‌, నానక్‌, సంత్‌ జ్ఞానేశ్వర్‌, కృష్ణ చైతన్య మొదలగు వారెందరో పాదయాత్రలను తమ ప్రచార సాధనాలుగా ఎంచుకున్నారు. జ్ఞాని అనేవాడు లోక సంచారి అయి తీరాలి. ఈ స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నిరంతరం సంచారమే మార్గం. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ పాదయాత్రలను ఒక పోరాటంగా, ఉద్యమంగా చేపట్టినాడు. ఆ తర్వాత సర్వోదయ ఉద్యమనాయకులు వినోభా భావే, జయప్రకాశ్‌ నారాయణ లాంటివారు దేశం నలుమూలలా పాదయాత్రలను నిర్వహించారు. చైనాలో లాంగ్‌మార్చ్‌ ద్వారానే చైర్మన్‌ మావో అధికారాన్ని సంపాదించినారు. కావున పాదయాత్రలు పురాతన ఆసియా నాగరికతకు, భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రత్యేకతలు. ఆ వారసత్వాన్ని ‘వేనేపల్లి’ ఈనాడు కొనసాగిస్తున్నాడు.

అలగడప తదితర గ్రామాల నుండి బయలుదేరిన ‘మట్టి మనుషులు’ అమరవీరుల స్థూపానికి పూలదండలు వేసి ఒక్కనిమిషం వారికి శ్రద్దాంజలి ఘటించారు. పిమ్మట “అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. సాధిస్తాం.” అని ప్రతిజ్ఞలు చేశారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా వారితో గొంతు కలిపారు. ఆ తర్వాత చరిత్రను లిఖించే అద్భుత క్షణాలు ప్రారంభమైనాయి. ఆ మట్టి మనుషులు తమ వెంట ఒక సంచిలో ‘అలగడప నేల మీది మట్టిని’ తెచ్చారు. వేనేపల్లి ఆ మట్టి సంచిని అందరికీ చూపిస్తూ “ఈ మట్టి నా పూర్వీకుల మట్టి. చెమట, రక్తం, కన్నీళ్ళతో తడిసిన మట్టి. ఈ మట్టిలోనే వారంతా పుట్టి పెరిగి తిరిగి ఈ మట్టిలోనే మట్టిగా మారినారు. అటువంటి ఈ మట్టిని ఆంధ్రుల వలసవాద పరిపాలన నుండి విముక్తి చేస్తాం. ఈ మట్టికి స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తాం. రాబోయే తరాల వాళ్ళందరూ ఈ మట్టిలో సుఖశాంతులతో జీవించాలి. వర్ధిల్లాలి” అంటూ ఉద్వేగంగా ప్రసంగిస్తూ సంచిలోని ఆ మట్టిని తన గుప్పిళ్లతో తీసుకొని తన నడినెత్తి మీద పోసుకుంటుంటే, ఆ మట్టిని తన ముఖానికి అద్దుకుంటుంటే అందరి కండ్లలో కన్నీటి ఊటలు ఉబికినాయి. గుండెలు గుబగుబలాడినాయి.

ఆయన ఇంకా ప్రసంగిస్తూ “మా పాదముద్రలలో మొత్తం మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అడుగుజాడలు ఉన్నాయి. వారందరూ మా వెంట ఉన్నట్లే. ఒక వేళ ఢిల్లీ పీఠం తెలంగాణా ఇవ్వకపోతే తెలంగాణా అన్ని దిక్కుల నుండి ఇటువంటి పాదయాత్రలెన్నో బయలుదేరి ఈ నగరాన్ని ముట్టడిస్తాం. అష్టదిగ్బంధనం చేస్తాం. తెలంగాణాను మేం సాధించుకుంటాం.

ఈ స్వామి అంశులస్వామి, యాదగిరిగుట్ట నర్సింహస్వామి. భద్రాచలం సీతారామస్వామి, పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా అయినాడు. నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్‌ నుండి విముక్తం చేయటానికే మేము తెలంగాణాను విముక్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. మాకు నీళ్లు కావాలె. ఇక భవిష్యత్తులో మా పిల్లలెవరూ ఇట్లా కావొద్దు.

ఒకవేళ మీరు తెలంగాణా ఇవ్వకపోతే మేం ‘సద్దాంలమౌతాం’. పోరాటాలు చేస్తాం. చిరునవ్వులతో ఉరికంబాలను ఎక్కుతాం. ప్రాణాలను అర్పిస్తాం.

వేనేపల్లి పాండురంగారావు తన ‘రక్తంతో రాగాలాపన’ చేస్తుంటే అతని మాట మంత్రంగా మారి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది. తెలంగాణా ఆశయానికి అందరినీ కట్టిపడేసింది. అంకితం చేసింది.

అమరవీరుల స్థూపం దగ్గర ఆలగడప మాజీ మస్కూరి 75 సంవత్సరాల జాన్‌ను “ఏం తాతా ఎట్లుంది యాత్ర” అని పలుకరించంగనే గొంతులో గురగురలతో “పెద్ద దొరలు రానిచ్చేటట్లులేరు నాయనా అయినా మేము నడుస్తనే ఉంటం. దీని అంతు చూసేదాకా. ఈ రోడ్డు మీద నా తనువు పోయినా పర్వలేదు. నడుస్తనే ఉంటం ఇవి భగవంతుడు ఇచ్చిన కాళ్లు ఆయనే మమ్ములను నడిపిస్తున్నడు” అని అన్నడు. అతన్ని చూస్తుంటే 1952 మొదటి తరం తెలంగాణా పోరాటానికి ప్రతినిధిలాగా కనిపించిండు. మూడుతరాల తెలంగాణా పోరాటం. మూడు దశల తెలంగాణా పోరాటం.

చివరికి ముగింపుగా ఆ పాదయాత్ర మంజిల్‌ ఔర్‌ మక్సద్‌ గవర్నర్‌ గారి నివాసం రాజ్‌భవన్‌. అయితే ఆయన లేరని తెల్సింది. అయినా పాదయాత్రీకుల ప్రతినిధి బృందం గవర్నర్‌ గారి ఓ.యస్‌.డి.ని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని “తెలంగాణ మాత్రమే కావాలని” సమర్పించింది. వేనేపల్లితో పాటు ప్రతినిధి బృందం సభ్యులు తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తుంటే ఆయన ఓపికగా విన్నారు. ఆఖర్లో చక్రాల కుర్చీలో వెంటవచ్చిన అంశుల స్వామిని ఎదురుగా ఉన్న ఆయన టేబుల్‌పై పండబెట్టారు. అతడిని చూసి ఆ అధికారి అవాక్కయినాడు, పరేషాన్‌ అయినాడు. “నాలాగా మరెవరూ కావొద్దు. మాకు మంచి నీళ్లు గావాలె, మాకు తెలంగాణా కావాలె” అని అంశులస్వామి రెండు చేతులెత్తి ఆ అధికారికి మొక్కిండు.

గవర్నర్‌ నివాసం నుండి అందరూ ఇవతిలికి వచ్చారు. ఇక వీడ్కోలు. ఇక ఆ మట్టి మనుషులకు వారు చేసిన పాదయాత్రకు “అల్విదా” చెప్పే క్షణాలు దగ్గరికి రానే వచ్చాయి.

లక్షల పాదముద్రలతో చరిత్రను లిఖించిన 275 కిలోమీటర్ల పాదయాత్ర ‘పాలేరువాగు నుండి మూసి నది దాకా’ ముగియబోతుంది.

“మరి మీ తిరుగుప్రయాణం ఎట్ల పాండురంగారావ్‌” అని స్వామి దిగులుగా అడిగాడు.

“ఏముంది ఆర్‌టిసి బస్సులలో” అన్నాడు చిర్నవ్వుతో.

“మా ఇంటికి వచ్చి అన్నం తిని రెస్టు తీసుకోవచ్చు గదా!”

“లేదు రేపు మాఊర్ల ఉండాలె. అక్కడ మిషన్లు పంచే పని ఉంది” అన్నాడు ఆ భూమి పుత్రుడు. అతని నేతృత్వంలో ఆ ‘లగాన్‌ టీం’ రోడ్డు దాటి వడివడిగా నడిచి పోతుంటే స్వామికెందుకో అకస్మాత్తుగా గాంధీగారి ‘దండియాత్ర’ దృశ్యం గుర్తుకొచ్చింది.

“చల్తె చలో, చల్తె చలో, చల్తె చలో
ఏ వక్త్‌కీ ఆవాజ్‌హై చల్తే చలో”..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version