Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీరం చేరిన నావ-23

[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]

[2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దుర్ఘటననీ, తదనంతరం జరిగిన మతకల్లోలాల పట్ల స్వామి తీవ్ర వేదనకి గురవుతాడు. అదే సమయంలో పాతబస్తీలో తమ ఇంటిని కొనుక్కున్న ముస్లిం కుటుంబంలోని వ్యక్తి కనబడి స్వామిని పలకరిస్తాడు. స్వామి అతన్ని గుర్తుపట్టడు. అతను తనను తాను పరిచయం చేసుకుని స్వామి ఎప్పుడైనా తమ ఇంటికి రావచ్చని ఆహ్వానిస్తాడు. 2004 లోక్‍సభ ఎన్నికలలో బిజెపి ఓడి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒడిపోయి కాంగ్రేసు పార్టీ ఘన విజయం సాధించి వై.యస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఉద్యమం బలపడుతూంటుంది. కాళోజీ మృతి చెందగా, మొత్తం తెలంగాణ కదలివచ్చి నివాళి అర్పిస్తుంది. తన సాహిత్య గురువు సామల సదాశివ గారిని తలచుకుంటాడు స్వామి. ఆయన తనకు నేర్పిన ఎన్నో విషయాల పట్ల స్వామి కృతజ్ఞతగా ఉంటాడు. స్వామికి బోధన్ బదిలీ అవుతుంది. స్వామి హైదరాబాదులో లేని కాలంలో, ఉద్యోగ సమాఖ్య కార్యకలాపాలలో అవినీతి వేళ్ళూనుతుంది. బోధన్‌లో తన వ్యక్తిగత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ‘సలాం హైద్రాబాద్’ అనే నవల రాస్తాడు. కొంతకాలానికి హైదరాబాద్‌కి బదిలీ, అది కూడా, మళ్లీ పాతస్థానంలోనే ‘మేనేజరు’గా అవుతుంది. ఉద్యోగ సమాఖ్యలో అవకతవకలు ఎక్కువవుతాయి. స్వామి బోధన్‍లో ఉండగా జరిగిన ఉద్యోగ సమాఖ్యలో జరిగిన ఓ ఎంపిక గురించి వివాదం రేగుతుంది. అనర్హుడిని అందలమెక్కించినట్టు స్వామి గుర్తిస్తాడు. భవిష్యత్తులో రాజకీయనాయకుడిగా ఎదగటానికి అతను సంస్థను వాడుకున్నట్టు గ్రహిస్తాడు. తెలంగాణా రచయితల సంస్థ వార్షిక మహాసభలు హైదరాబాదులో నిర్వహించాలని నిర్ణయిస్తారు. సంస్థ అధ్యక్షుడు, తెలంగాణా వాళ్ల తెలంగాణా సభకు ఆంధ్రావాళ్లు ఆహ్వాన సంఘంలో చేర్చాలని ప్రతిపాదిస్తే, స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. తన ఆప్తుడు వేణులో కొత్త కెరీరిజం పెరగడం చూసిన స్వామి విస్తుపోతాడు. వేణు తన పద్ధతిని సమర్థించుకుంటాడు. 2007 జనవరిలో వేనేపల్లి పాండురంగారావు పాలేరు వాగు నుండి మూసీ నది దాకా పాదయాత్ర నిర్వహిస్తారు. – ఇక చదవండి.]

అధ్యాయం-26: విమలాదేవి వృత్తాంతము

మేనేజరు పోస్టు స్వామికి సుఖంగానే ఉంది. అతనికి ప్రధాన అసిస్టెంటు సీతామహాలక్ష్మి.

ఉద్యోగుల సర్వీసు విషయాలు, సీనియారిటీ నిర్ణయాలు, సెలవులు గ్రాంటు చేయటంలో ఆమె నిష్ణాతురాలు. అట్లనే శారద. చాలా నెమ్మది అణుకువ గల మనిషి. జీతాల బిల్లులు చేయటంలో, పేఫిక్సేషన్స్‌ చేయటంలో సిద్దహస్తురాలు. మరొక సీనియర్‌ అసిస్టెంట్‌ పద్మావతి వీరందరూ క్రమశిక్షణా, పనిపట్ల నిబద్దులైన ఉద్యోగినులు. వీరే గాక కొంతమంది మగ ఉద్యోగులు కూడా ఉన్నారు. అందరూ కలిపి దాదాపు ఇరవై మంది వరకూ సిబ్బంది స్వామి క్రింద పని చేస్తుంటారు. పైన డివిజిన్‌ అధికారి వీరి పనులను పర్యవేక్షిస్తుంటాడు.

అసలు మతలబు ఏందంటే ‘పై ఆందానీకి’ ఇష్టపడని వారందరూ మేనేజరు ఆఫీసులో పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు. అందుకే ఈ డిపార్ట్‌మెంటులో మేనేజరు గారి ఆఫీసును శివాలయంతో పోలుస్తూ ఉంటారు. మేనేజరు అంటే ఏమీ ఆశించని సాక్షాత్తూ పరమశివుడు అన్నమాట. సిబ్బంది అంతా ఆయన చుట్టూ ఉండే ప్రమథగణాలు.

స్వామికి రోజులు సుఖంగా, ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. ఏవైనా సాంకేతిక సందేహాలుంటే ముగ్గురు మూలపుటమ్మలు సీతామహాలక్ష్మి, శారద, పద్మావతిలను సంప్రదించి వారి సలహాపైన్నే ఫైళ్లపై సంతకాలు చేస్తుంటాడు. అట్లాంటి దేవాలయం లాంటి ప్రశాంత వాతావరణంలో శ్రీమతి విమలాదేవి ‘రాజాంతపురంలో విషకన్యలా’ ప్రవేశించింది.

ప్రభాకర్‌ మేనేజర్‌ ఆఫీసులో మంచి ఉద్యోగి. తన పనేదో తను చేసుకుని ఎవరి అంటూ సొంటూ లేకుండా బ్రతికే అల్పజీవి. కొంచెం వర్ణనాత్మకంగా వివరించాలంటే ‘నికొలాయ్‌ గొగోల్‌ ఒవర్‌కోటు’ కథలోని గుమాస్తాలా అతను నిరంతరం తల దించుకుని పనిచేస్తుండేవాడు. అట్లాంటి ఆ జీవి ఒకరోజు ఆఫీసులోనే హఠాత్తుగా కుప్పకూలి హరీమన్నాడు. ఫస్ట్‌ ఇయర్‌ ఇంజనీరింగులో ఉన్న కూతురు, ఇంటర్‌ ఫైనల్‌ చదివే కొడుకూ ఉన్నారు. భార్య విమలాదేవి గృహిణి. కుటుంబం అన్యాయమైపోతుందన్న దయతో డివిజన్‌ అధికారి టెన్త్‌ మాత్రమే పాస్‌ అయిన ఆమెకు కారుణ్య నియామకం క్రింది క్లర్కు ఉద్యోగం ఇచ్చాడు. క్లర్కు ఉద్యోగానికి కనీసపు అర్హతలు ఇంటర్‌ పాస్‌ కావాలి. కావున రెండు సంవత్సరాలలోపు ఇంటర్‌ పాస్‌ కాకపోతే ‘రివర్షన్‌’ కండీషన్‌పై ఆమెకు ఉద్యోగం మేనేజరు ఆఫీసులోనే ఇచ్చాడు. ఆఫీసు పనికి క్రొత్త కావున పని భారం ఉండొద్దని చాలా లైట్‌ సీట్‌ కూడా ఇచ్చాడు.

ఇదంతా స్వామి మేనేజరుగా రాకముందే ఒక సంవత్సరం క్రిందటి కథ.

ప్రతి రోజు స్వామి ఆఫీసుకు వచ్చి సీట్ల కూచోగానే ముందు చేసే పని సిబ్బంది అటెండెన్సు రిజిస్టర్‌ను తనిఖీ చేయటం. ఎవరైనా ఒక నెలలో వరుసగా మూడు సార్లు లేట్‌గా వస్తే సగం దినం క్యాజువల్‌ లీవును కట్‌ చేయాలి. అందరూ సరిగ్గా ఉదయం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదుకు వెళ్లిపోతున్నారు. విమలా మాత్రం రోజూ ఒక గంట లేటుగా వచ్చి మళ్లీ సాయంత్రం ఒక గంట ముందుగానే వెళ్తుంది. అది గమనించి అటెండెన్సు రిజిస్ట్రర్‌లో ఎర్రపెన్నుతో టిక్కులు పెట్టి లీవులకు కోత పెట్టటం ప్రారంభించాడు. ఒకటి రెండుసార్లు ముఖతహాగా చెప్పాడు. టైం డిసిప్లిన్‌ పాటించాలని. కాని కుక్క తోక వంకర.

అంతవరకూ నాలుగు గోడల మధ్యల ఇంటిపనికి, వంటపనికి పరిమితమైన ఆమె తనకు హఠాత్తుగా దొరికిన స్వేచ్ఛతో పంజరం విడిచిన పక్షిలా రివ్వు రివ్వున ఎగరసాగింది. మహిళా సహోద్యోగులతో తక్కువ మగవారి సీట్ల ముందు ఎక్కువగా కనబడుతూ ‘కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లు’ వారి పనిని డిస్టర్బ్‌ చేస్తుండేది. ఇక ఇకలు, పక పకలు సరేసరి.

ఒకసారి సీతామహాలక్ష్మిని పిలిచి చెప్పాడు. ఒక సీనియర్‌గా ఆమెను కంట్రోల్‌లో పెట్టమని. ఆమె సరే అన్నది కాని ఆమెను అదుపులో పెట్టటం ఆమెకు అసాధ్యం అని తేలిపోయింది.

విమలా అట్లా శలభంలా చక్కర్లు కొట్టీ కొట్టీ చివరికి తన కంటే చిన్నవాడైన ఒక ‘బక్రా’ను తన వలలో వేసుకుంది. ఆ బక్రా పేరు ‘హనుమంతు’. ముగ్గురు మూలపుటమ్మల రిపోర్టు ప్రకారం అప్పటి వరకూ వాడు మంచి పిల్లగాడే బుద్దిమంతుడే కాని ఇదే వాడిని ‘సెడ్యూస్‌’ చేసింది.

సాయంత్రం నాలుగు కాకముందే ముందు ఆమె, కాసేపయినాక దాని వెనకే హనుమంతు ఆఫీసునుండి మాయమై వాడి స్కూటర్‌పై నగరంలో షికార్లు చేస్తున్నారని రిపోర్టులు వచ్చాయి.

సరే వాళ్ల ఏడుపేదో వాళ్లనే ఏడవనీ అని స్వామి, మిగతా సిబ్బంది మౌనం పాటించారు. చివరికి వాళ్ల వ్యవహారం శ్రుతి మించి రాగాన పడింది.

కొన్ని నెలలు గడిచాక ఒక ఉదయం పదకొండు గంటలకు ఒక గృహిణి మేనేజరు గదిలోకి ప్రవేశించి గొల్లున ఏడవటం ప్రారంభించింది. ఆ ఏడుపులకు సిబ్బంది అంతా పరిగెత్తుకొచ్చారు. ఆమె క్రింద పడబోతుంటే సీతామహాలక్ష్మి పట్టుకుని జాగ్రత్తగా కుర్చీలో కూచోబెట్టింది. గ్లాసులో నీళ్లు తెప్పించి తాగించింది.

ఆమె హనుమంతు భార్య.

ఆ ఏడ్పులార్పుల మధ్య అందరికీ క్లుప్తంగా బోధపడిన విషయమేమంటే – తోక లేని హనుమంతుడు కోతిలాగనే ఇంట్ల దుంకులాడి దూలాలు అందుకుంటున్నాడట. జీతం సగం మాత్రమే ఇస్తున్నాడట. విమలాదేవి ఇంట్లోనే అర్థరాత్రి దాకా ఉండి బాగా తాగి ఇంటికి వచ్చి ప్రశ్నించిన తనను కొడుతున్నాడట.. ఆమె దుఃఖ గాథ ఆపకుండా చెప్పింది.

“ఇది మీ ఇంటి పంచాయితీ కదా? మరి మమ్మల్ని ఏం చేయమంటావు?” అని శారద, పద్మావతిలు ఆమెను అడిగారు.

“ఏం లేదమ్మా. ప్రతినెలా వాడి జీతం డబ్బులు నా చేతికే ఇవ్వండి” అని మొత్తుకుంది.

స్వామి అటెండరు లక్ష్మిని పిలిచి “విమలను హనుమంతును ఇద్దర్నీ తీసుకరా” అని ఆదేశించాడు.

సీతామహాలక్ష్మి కిసుక్కున్న నవ్వి “వాళ్లిద్దరూ నాలుగు రోజులు లీవుపెట్టారు సార్‌. లీవుకు రేపే ఆఖరిరోజు” అన్నది.

“ఇద్దరూ కల్సి హానీమూన్‌కు పొయ్యుంటారు సార్‌” అని హనుమంతు భార్య మళ్లీ గొల్లుమన్నది. సిబ్బంది అంతా వచ్చే నవ్వు బలవంతంగా ఆపుకున్నారు.

స్వామి నిస్సహాయంగా ‘ముగ్గురు మూలపుటమ్మల’ వైపు చూసాడు ఈ కిరికిరీ మీరే పరిష్కరించాలన్నట్లు.

సీతామహాలక్ష్మి రవ్వంత సేపు ఆలోచించి “సరే ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్లు. మీ ఇంటి టెలిఫోను నంబరు నాకివ్వు. ఏ సంగతి నేను ఫోను చేసి నీకు చెప్తా” అని ఓదార్చింది.

పాపం ఆ అమాయిక ఇల్లాలు చీరె కొంగుతో ముక్కు చీదుకుంటూ కళ్లు తూడ్చుకుంటూ అందరికీ దండాలు పెట్టి వెళ్లిపోయింది.

స్వామి, సీతామహాలక్ష్మీ ఇద్దరూ కలిసి పెద్దసారు వారి చాంబరులోకి వెళ్లారు. స్వామి సంగతేందో క్లుప్తంగా వివరించాడు. దాంతో ఆయన ఉగ్రుడై కళ్లెర్ర చేసి:

“ఇద్దరి సస్పెన్షన్‌ ఆర్డర్లూ ప్రిపేర్‌ చేసి నాకు పంపండి. సంతకాలు చేస్తాను. పాపం భర్తపోయిన మనిషని జాలి తలచి ఆమెకు అర్హత లేకున్నా ఉద్యోగం ఇప్పిస్తే ఇవేం బద్మాష్‌ వేషాలు” అని మండిపడ్డాడు.

అప్పుడు సీతామహాలక్ష్మి సమయస్ఫూర్తితో వ్యవహరించింది.

“సార్‌ సస్పెండ్‌ చేస్తే హనుమంతు సగం జీతంతో వాడి పిల్లల చదువులూ, సంసారం, దెబ్బతింటాయి. దానికైతే తన జీతమే గాక భర్త పెన్షన్‌ కూడా వస్తది కాబట్టి దానికేం కాదు. పాపం వాడికే నష్టం” అన్నది.

“మరేం చేద్దాం” అన్నాడు ఆయన ఎటూ తోచక.

“హనుమంతు ప్రతినెలా జీతం వాడి భార్యకే అందిద్దాం సార్‌. వాడిని నయాన భయాన బెదిరించి మేమిద్దరం వప్పిస్తాం. మీరు అనుమతి ఇస్తే” అని వినయంగా అడిగి ఆయన కోపాన్ని తగ్గించింది.

“సరే” అన్నాడు ఆయన.

లీవు అయిపోయాక ‘ప్రేమ పక్షులిద్దరూ’ ముఖాలలో కొత్త కళతో ఆఫీసుకు వచ్చారు. ముందున్నది ముసళ్లపండుగ అని వారికి తెలియదు. ఆఫీసు సిబ్బంది అంతా రసవత్తర, ఉచిత, వినోదభరిత నాటకం, చూడబోతున్నట్లు చాలా ఉత్సాహంగ ఒళ్లంతా కళ్లు చేసుకుని నిరీక్షిస్తున్నారు.

సీతామహాలక్ష్మి ముసి ముసి నగవులతో స్వామి గదిలోకి వచ్చి “సార్‌ వాళ్లు వచ్చారు” అని అక్కడే నిలబడింది.

బెల్‌ మ్రోగించి అటెండరు లక్ష్మి రాగానే “వాళ్లిద్దర్నీ పిలుచుకురా” అని ఆదేశించాడు. ఆమాట కోసమే ఎదిరు చూస్తున్న లక్ష్మి ఉత్సాహంతో గాలిలో ఎగురుకుంటూ పోయింది.

అనుకోని ఆపదకు ఇద్దరూ గాభరా పడి ‘కొంప మునిగిందిరా దేవుడా’ అనుకుంటూ బిక్కముఖాలతో మేనేజరు దివ్యసముఖాన హాజరయినారు.

స్వామి తీక్షణంగా విమలను చూస్తూ “చూడమ్మా నువ్వింకా ప్రొబేషనరీ పీరియడ్‌లోనే ఉన్నావు తెలుసా” అని క్షణకాలం ఆగాడు.

అమాయకంగా ముఖం పెట్టి “అంటే ఏంది సార్‌?” అని వినయంగా సుద్దపూసలా అడిగింది.

“అంటే టెంపరవరీ. ఎప్పుడైనా నిన్ను ఉద్యోగం నుండి పీకెయ్యొచ్చు. లేదా ఆదిలాబాదుకో, శ్రీకాకుళానికో ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు” అన్నాడు కఠిన స్వరంతో.

“అయ్యో అయ్యో పిల్లలుగల దాన్ని సార్‌. ఒంటరిదాన్ని సార్‌” అని ఇంకా ఏమో అనబోయింది.

“షటప్‌ ఉద్యోగం కావాలంటే జాగ్రత్తగా ఉండు. వెళ్లు” అని గట్టిగా అరిచాడు.

‘బ్రతుకు జీవుడా’ అన్నట్లు విసవిసా నడుస్తూ భామాకలాపంలో సత్యభామలా వెళ్లిపోయింది.

హనుమంతుకు అప్పటికే పై ప్రాణాలు పైనే పోయాయి. శిరచ్ఛేదానికి సిద్దమైన వాడిలా తల పూర్తిగా క్రిందికి దించి చేతులు కట్టుకుని బుద్దిగా నిలుచున్నాడు.

“హనుమంతూ డొమెస్టిక్‌ వాయ్‌లెన్సు యాక్టు నీకు తెలుసా” అని ప్రశ్నించాడు.

“అదేంది సార్‌?” అన్నాడు.

“గృహహింస చట్టం క్రింద విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, పోలీసు డిపార్ట్‌మెంటుకు నీ భార్య ద్వారా కంప్లెయింట్‌ ఇప్పిస్తే ముందు అరెస్టు అవుతావు.”

“అయ్యో అయ్యో” అని ఇంకా ఏమిటో మాట్లాడబోయాడు.

“ఇంకా పూర్తిగా విను. నువ్వు లాకప్‌లో ఇరవైనాలుగు గంటలు లోపలుంటే నిన్ను ఉద్యోగం నుండి ముందు సస్పెండు చేయాల్సి వస్తది. తర్వాత “చంచల్‌గూడ జైల్లో చిప్పకూడు తిని చింకి చాప మీద పడుకోవాలి” అన్నాడు.

అప్పటికే వాడికి తన భార్య వచ్చి తనపై ఫిర్యాదు చేసిందన్న సంగతి అర్థమయ్యింది.

ఆ దెబ్బతో వాడు పూర్తిగా పానీ, పానీ ఐ జావకారిపోయాడు. జైల్లో చిప్ప కూడులో పాచి అన్నం తింటున్నట్లు, చింకి చాప మీద నిద్రరాక పొర్లుతున్నట్లు, మూసీ నది నుండి వచ్చిన దోమలు కుడుతున్నట్లు ఊహించుకుని వణికిపోయాడు.

“సారీ సర్‌ సారీ సర్‌” అని నీళ్లు నమలసాగాడు.

“సారీలు గీరీలు కాదు. విమెన్‌ ప్రొటెక్షన్‌కు ఫోన్‌ చేయమంటావా? వీళ్లందరూ ఆడవాళ్లు సాక్ష్యమివ్వటానికి రెడీ. లేక నీ జీతం ప్రతి నెలా నీ భార్యకు ఇవ్వాలా? రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకో” అన్నాడు.

“ఇదిగో సార్‌ విమన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఫోను నంబరు” అని చిన్న కాగితం ముక్క సీతామహాలక్ష్మి మేనేజరు గారికి సకాలంలో హనుమంతు ముందే అందించింది.

అప్పుడు ఆ తోకలేని హనుమంతుడు కాళ్ల బేరానికి వచ్చి రెండో షరతుకు ఒప్పుకున్నాడు.

కథ సుఖాంతమయ్యింది. కాని రెండు నెలల తర్వాత ఒక ఉదయాన్నే ఆఫీసుకు హనుమంతు భార్య ఫోను.

“నిన్న రాత్రి హనుమంతు విమలా ఇంట్లో తప్పతాగి స్కూటర్‌పై ఇంటికి వస్తుంటే లారీ క్రింద పడి చావు బ్రతుకుల్లో గాంధీ దవాఖానాలో ఉన్నాడు” అని చెప్పింది.

అప్పటికే ఆ వార్త తెలియని విమలా ఆఫీసుకు వచ్చి సీటులో ఆసీనురాలయ్యింది. ఆ వార్త క్షణాలలో ఆఫీసులో కార్చిచ్చులా వ్యాపించింది. అప్పుడు ఏ పరశురాముడు కూడా చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుని విమలకు శిరచ్ఛేదం చేయటానికి రాలేదు కాని దుర్వార్త విన్న ఆడవాళ్లంతా చెప్పులు చేతులల్లకు తీసుకుని విమలాపైకి దాడి చేసారు. అప్పుడక్కడ బీభత్సరస ప్రధాన దృశ్యం చోటు చేసుకుంది.

‘చమార్‌ కీ దేవతాకో చెప్పల్‌ కీ పూజా’ అని ఒక హిందీ సామెత. అంటే చెప్పులు కుట్టే వాడి దేవతకు పూజలో తీర్థ ప్రసాదాలు కాక చెప్పుదెబ్బలతో మాత్రమే పూజ కావాలట. నిగ నిగ లాడే చెంపలు చెప్పుదెబ్బలతో బూరెల్లా వాచిపోయాయి. జుట్టంతా చిందర వందర పిట్టగూడులా మారిపోయింది. చీరంతా చెదిరిపోయింది. గాజులు పటా పటా విరిగిపోయాయి. స్వామి అడ్డం వెళ్లినా లెక్క చేయక ఆ ఆడలేడీసులందరూ చిరతపులుల్లా ఆమెను చీల్చి చెండాడారు, చితకతన్నారు. మగవారంతా “మా తరపున ఇంకో దెబ్బ, మరో దెబ్బ” అని ఆడవారిని బుర్రకథ వంత కళాకారుల్లా ఉత్సాహపరిచారు. అటెండరు లక్ష్మి ఆమె వస్త్రాపహరణకు ప్రయత్నించగా సీతామహాలక్ష్మి బలవంతంగా అడ్డుపడి వారించింది. మగ ఉద్యోగులు లేకపోతే ఆ పని కూడా జరిగిపోయేది.

ఆ తర్వాత పొగరంతా అణిగి వొళ్లంతా హునమైన విమల లేచి కుంటుకుంటూ బయటికి వెళ్లిపోయింది.

స్వామితో సహా సిబ్బంది అంతా గాంధీ దవాఖానకు పరిగెత్తుకెళ్లారు. శోష వచ్చి క్రిందపడిన హనుమంతు భార్యను, గోడుగోడున ఏడుస్తున్న పిల్లల్ని ఆడవాళ్లంతా సపర్యలు చేసి ఓదార్చారు. స్వామి, సీతామహాలక్ష్మి డాక్టర్లను కలిసారు.

“సారీ అతని కుడికాలు మోకాలు దాకా నుజ్జు నుజ్జు అయ్యింది. తొడ దాకా ఆంప్యూటేషన్‌ వెంటనే చేయాలి. లేకపోతే పెద్ద ప్రాణానికే గండం అన్నారు.

అందరూ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఆఫీసు సిబ్బంది అందరూ కలిసి చందాలు పోగేసి, తమ సోదరుడికే సహాయం చేస్తున్నట్లు భావిస్తూ ఆ మొత్తాన్ని హనుమంతు భార్యకు ప్రతినెలా అందచేసారు.

ఆ తర్వాత విమల నెలా, రెండు నెలలు ఆఫీసు ముఖం చూడలేదు. అవిటివాడైన హనుమంతు ఆర్నెల వరకూ లీవులోనే ఉన్నాడు. ఆ మొత్తం జీతం అతనికి అందేలా స్వామి సహాయం చేసాడు. ఆఖరికి జైపూర్‌ కృత్రిమ ప్లాస్టిక్‌ కాలుతో, చంకలో కర్రతో ఆఫీసుకు వచ్చాడు.

ఒకరోజు విమల తనద్దరి పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలతో సహా అందరి ఆడవాళ్ల కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగింది. జీతం లేక ఉప్పులు-ఉపోసాలు పడుతున్నామని దీనంగా ప్రార్థించింది. చెప్పులతో కొట్టిన ఆడవాళ్లే మళ్లీ సిఫార్సులు చేయటంతో ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు.

డ్రస్సులు వదిలి చీరలలో పమిటి నిండుగా కప్పుకుని ఆఫీసుకు టైం ప్రకారం, రావటం పోవటం మొదలుపెట్టింది.

కాని కత అంతటితో కంచికి వెళ్లలేదు. అనేక మలుపులు తిరిగింది.

***

కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్దానంతరం ద్వారకలోని యాదవకులంలో ముసలం పుట్టినట్లు ఇంతితై వటుడిరతయి అన్నట్లు పెరిగిన ‘తెలంగాణా ఉద్యోగుల సమాఖ్య’లో లుకలుకలు బయలుదేరినాయి. ‘పెరుగుట విరుగుట కొరకే’ అని శాస్త్రకారులు ఇందుకోసమే అన్నారేమో?

అందరూ కలిసి చేసిన సమిష్టి కృషి ద్వారా తెలంగాణాలోని అన్ని జిల్లాలలో ఉద్యోగ సమాఖ్య శాఖలు, వాటి మహాసభలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం డైరీ ఆవిష్కరణలు శరవేగంతో కొనసాగుతున్నాయి. దినపత్రికలు, టీవీ చానెళ్లు ఉద్యోగ సమాఖ్య కార్యక్రమాలకు నాయకులకు మంచి ఊతమిచ్చి ప్రచారం చేస్తున్నాయి. కాని పాండురంగం, రెడ్డి, చారి ముగ్గురు ముఖ్య నాయకులు రాచకొండ విశ్వనాధ శాస్త్రి కథ లోని ‘వేతనశర్మ’ల్లా మారిపోతున్నారు. రంగులు మార్చే అవకాశవాద, రాజకీయ నాయకులే వారికి ఆదర్శం. ఒకప్పుడు అమాయకంగా, బీదబీదగా వొంగి, వొంగి, నంగినంగిగా మాట్లాడివారు ఇప్పుడు పలుకులు నేర్చిన చిలకలయ్యారు. ఖడక్‌ ఇస్త్రీ ఖద్దరు బట్టలు తప్ప ఒకప్పటి సాధారణ దుస్తులలో అతి సాధారణంగా కనబడటం లేదు. తెలంగాణా రాగానే తాము ఏ ఏ ‘అందలాలు’ ఎక్కాలో ఇప్పటినుండీ కలలు కంటున్నారు. పకడ్బంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆ లక్ష్యంతో ఇప్పటి నుండే తెలంగాణా సాధన సంస్థ అధ్యక్షుడు సూర్యశేఖరరావుతో పాటు ఆ పార్టీ ఇతర నాయకులతోనే గాక ఎందుకైనా మంచిదని ముందుచూపుతో ఇతర పక్షాల పార్టీ నాయకులతోనూ తెరవెనుక సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నారు. తెలంగాణా మేధావుల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసరు కల్యాణ రాంరెడ్డితో రాసుకపూసుక తిరుగుతున్నారు. మేధావుల వర్గంలో చేరిపోయారు. ‘వాళ్లు ముగ్గురు బ్రతకనేర్చిన వాళ్లు’ అని స్వామికి కొంతకాలం తర్వాత తెలిసిపోయింది. అయినా తెలంగాణా సాధన లక్ష్యంతో అందరితో కలిసి పనిచేయక తప్పదని నిర్ణయించుకున్నాడు.

జయపాల్‌ రెడ్డి, రంగాచారి ఇద్దరూ కల్సి స్వామి ఆఫీసుకు ఒకరోజు వచ్చారు. ఖడక్‌ ఇస్త్రీ ఖద్దరు వేషధారులై. స్వామి చాయ్‌లు తెప్పించాడు.

తన ఖద్దరు షర్టును స్వామి చూస్తున్నాడని పసిగట్టిన చారి గిల్టీగా తనలో తానే ఫీలయ్యి, తనను తాను సమర్థించుకోక తప్పదని భావించి:

“ఏం లేదు సార్‌. చేనేత కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, వారిని ఆదుకోవాలనే సత్సంకల్పంతో ఇక ఈ నడుమ ఖద్దరే వేసుకుంటున్నా” అని సంజాయిషీ చెప్పాడు.

ఆ మాటలు విని లోలోపలే నవ్వుకున్నాడు స్వామి కాని పైకి మాత్రం “నీది చాలా దయార్ద్రహృదయం చారి” అనగానే కుంటివాడు ఏనుగెక్కినంత సంతోషపడ్డాడు ఆ అల్పసంతోషి.

జయపాల్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు కడపదాటవు. అతను తెల్లవెంట్రుకలకు నల్లని మసిబొగ్గులాంటి రంగు దట్టంగా వేసుకుని ముఖానికి ‘ఫేషియల్‌’ చేయించుకున్నాడేమో అది బాగా ఉడుకబెట్టిన కందగడ్డలా ఎర్రగా మారింది. నల్లని ఎర్రని రెండు రంగులతో పాపం అతను ‘భాగవతుల వేషం వానిలా’ కనబడుతున్నాడు.

“ఏం రెడ్డీ ముఖం బాగా ఉబ్బినట్టుంది” అన్నాడు. సంగతేందో తెలిసి కూడా.

“ఏం లేదన్నా మన ఉద్యోగ సమాఖ్య పనుల వల్ల పొద్దున పురుసత్‌లేదు రాత్రిపూట సరిగ్గ నిద్రలేదు. అందుకే నిద్రలేని కండ్లతో ముఖం ఉబ్బింది” అన్నాడు. ఉద్యోగ సమాఖ్యలోని కార్యకర్తల పుణ్యమా అని ప్రతి సాయంత్ర ‘మందు’ ఎత్తిపోతల కార్యక్రమాలు చాలా జోరుగా ఉంటాయి. పాపం అతనికి దుస్తుల సౌందర్యంపై మక్కువ ఎక్కువ. జిల్లాల పర్యటనకు వెళ్లినపుడు, రాత్రికి ఇంటికి తిరిగి వస్తామని తెలిసినా ఒక బ్యాగులో ఒక తెల్లని ఖద్దరు షర్టుతో బయలుదేరి అక్కడ వేదిక ఎక్కేముందు అర్జెంటుగా ఆ షర్టు మార్చుకుంటాడు. ప్రయాణంలో షర్టు మడతలు ఏ మాత్రం నలిగినా అతను సహించలేడు.

ఏ మీటింగ్‌లకు వెళ్లినా ఆ ఇద్దరూ ‘ఖాళీ తలకాయల’తో బయలుదేరుతారు. ఏదైనా ఒక అంశంపై చదివి, నోట్సు రాసుకుని, ప్రిపేర్‌ అయ్యి మీటింగులలో మాట్లాడటం వాళ్లిద్దరికి చాతకాదు కాని ఇస్త్రీ షర్టులతోనే నాయకుల మనిపించుకోవాలని వారి తాపత్రయం. లోకులు కూడా పై మెరుగులకే ప్రభావితం అవుతారు. నాయకులు కావటానికి మొదటి అర్హత ఖద్దరు షర్టులు.

“వాట్‌ ఈజ్‌ ఆన్‌ ది హెడ్‌ ఈజ్‌ నాట్‌ ఇంపార్ట్‌టెంట్‌ బట్‌ వాట్‌ ఈజ్‌ ఇన్‌ ద హెడ్‌ దట్‌ ఈజ్‌ ఇంపార్ట్‌టెంట్‌” అనేది స్వామి లాంటివాళ్ల తత్వం.

“ఏందీ? కృష్ణార్జునుల్లాగ ఇద్దరు కలిసి వచ్చారు?” అని నవ్వుతూ స్వామి అడిగాడు.

“ఏం లేదన్నా. పాండురంగం పనితీరు మా ఇద్దరికీ నచ్చటం లేదు” అన్నారు.

నిజంగా స్వామి ఆశ్చర్చపడి “ఎందుకూ, ఏమయ్యిందీ? మీరు ముగ్గురు త్రిమూర్తులే కదా సమాఖ్యను ప్రారంభించిందీ?” అన్నాడు.

“‘సమాఖ్య’ను స్థాపించాలని ఐడియా ఇచ్చింది మేమిద్దరమే అన్నా.”

“పోనీలే మంచి సలహానే కదా”

“మరి మాకు విలువ ఇవ్వకుండా తనొక్కడే వెళ్లి అందరు రాజకీయ నాయకులను కలుసుకుంటాడు. వాళ్లందరూ ఇతనొక్కడే ఉద్యోగ నాయకుడని అనుకుంటారు. మరి మేమేం కావాలి?”

“మరి మీరు కూడా వెంబడే ఉండండి”.

“ఉంటం కాని ఆయనెప్పుడు, ఎవర్ని, ఎక్కడ ఏ టైంల కలుసుకుంటడో ఇరవైనాల్గు గంటలు నిగరానీ పెట్టలేం కదా” అని రంగాచారి దీనంగా ముఖం పెట్టి వాపోయాడు.

“అయ్యయ్యో పెద్ద చిక్కే వచ్చి పడింది” అని స్వామి సానుభూతి చూపెట్టాడు ఓదార్చటానికని.

“ఉద్యోగ సమాఖ్య పనులకు ఆయన టైం ఇస్తలేడు. ఆ చాకిరంతా మేం చేయాలి. గట్టిగా అడిగితే ‘నాకు మేధావుల వేదిక బాధ్యతలు కూడా ఉన్నవ’ని చెపుతున్నాడు. ఆయనకు ఉద్యోగస్తుల కంటే మేధావుల వెంబడి ఉండటమే ఇష్టంగా ఉంది” అన్నాడు రెడ్డి.

“సరే. మరి నన్నేం చేయమంటారు?”

“ఏం లేదన్నా మీరు పాండురంగంకు గట్టిగా చెప్పాలే. ముగ్గురు కల్సి పనిచెయ్యాలె. ఆయన ఎవరి దగ్గరికి వెళ్లినా మమ్మల్ని కూడా వెంబడి పెట్టుకోవాలె. అని చెప్పండి” అన్నారిద్దరూ జంటకవుల్లా.

“అయ్యో. అదెంత పని. తప్పకుండా చెపుతాను. మీరు ఫికర్‌ చెయ్యక సమాఖ్య అభివృద్ధిపై దృష్టి పెట్టండి” అని వారిని ఉత్సాహపరిచి సాగనంపాడు.

ఒకరోజు పాండురంగంకు ఫోన్‌ చేసాడు. ‘కొంచెం పర్సనల్‌గా మాట్లాడాల’ని. ‘సరే అన్నా రేపు సాయంత్రం ఆఫీసు అయినంక ఆరు గంటలకు ఆబిడ్స్‌ తాజ్‌మహల్‌ హోటల్ల కలుద్దామ’ని మాట ఇచ్చాడు.

పాండురంగంది వీరిద్దరి కన్న విభిన్నస్వభావం. ఏ విషయంలోనైనా తొణకడు, బెణకడు. ఓపిక, శాంతం రెండూ అతని సుగుణాలు. తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ వాక్శుద్ధి ఉంది. చదివి విషయాలను కష్టపడి అర్థం చేసుకునే శక్తి ఉంది. ఎట్లాంటి దురలవాట్లు లేవు గాని తెలంగాణా వచ్చినంక రాజకీయాలలో ప్రవేశించి ఎదగాలనే కలలు మాత్రం బలంగా ఉన్నాయి. ఉద్యమంలో చాలా మందికి ‘టార్గెట్లు-కలలు’ ఉన్నాయి. అందులో పాండురంగం ఒకడని స్వామి సర్దుకుపోతున్నాడు.

ఇద్దరూ కలుసుకున్నారు. కాఫీ తాగినంక స్వామి వారిద్దరి అసంతృప్తిని పాండురంగంకు వ్యక్తపరిచాడు. ఓపికగా విన్న పాండురంగం తన అభిప్రాయం సావధాన చిత్తంతో చెప్పాడు.

“అన్నా వారిద్దరిదీ ఈర్ష్య, అసూయ, జెలసీ, పోటీ మనస్తత్వం. వీటి వల్లే వాళ్లిద్దరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. వివరంగా చెపుతా మీరు అర్థంచేసుకోండి:

చారికి ఒక్క ఇంగ్లీషు ముక్క చదవటంరాదు రాయటం రాదు. ‘నమస్య’లను అధ్యయనం చేసి జ్ఞానం పెంచుకోవాలన్న కోరిక అతనికి ఏ కోశానా లేదు. సమావేశాలలో ఉపన్యాసాలు కాదు కదా కనీసం ‘ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్సు’ చెప్పాలన్నా అతనికి కాళ్లు వణుకుతాయి. నోటి నుండి ఒక్క మాటా ఇవతలికి రాదు. తెల్లషర్టు వేసుకుని చిన్న చిన్న పైసల పైరవీలు ఈ మధ్య చేస్తున్నాడు.

మనకు ఎంతోమంది ఉద్యోగస్తులు వారి వారి సమస్యలపై మనల్ని కలుస్తున్నారు. వారు చెప్పేవన్నీ విని మన సమాఖ్య తరపున రిప్రజెంటేషన్స్‌ తయారు చేయాలి. నేనొక్కడ్ని అన్ని రాయలేను కదా. రెడ్డికి చెప్తే ఆయనకి ఒపిక తక్కువ. హడావుడిగా తప్పుడు తడకలతో రాసి పారేస్తాడు. అందులో బోలెడన్ని గ్రామర్‌ మిస్టేక్స్‌, స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ ఉంటాయి. అధ్యక్షుడిగా వాటి మీద నేను గుడ్డిగా సంతకం చేస్తే వాటిని చదివిన ఆఫీసర్లు సమాఖ్య అధ్యక్షుడికే ఇంగ్లీష్‌ రాదని నవ్వరా? ఇగ నా ఇజ్జత్‌ ఏమైనా ఉంటదా? చివరికి రాత్రి పూట నిద్ర త్యాగం చేసి అవన్నీ నేనే రాసుకుంటా. అది కూడా ఆ ఇద్దరికీ జెలసీనే.

ఈ మధ్య టీ.వి.ల వాళ్లు సమస్యలపై నా అవగాహన, వ్యక్తీకరణ చూసి చర్చావేదికలకు నన్ను ఆహ్వానిస్తున్నారు. అది కూడా వారి అసూయకు ఒక కారణం. దానికి నేనేం చేస్తాను. వాళ్లు కూడా తమ ప్రతిభ పెంచుకుంటే వాళ్లను కూడా పిలుస్తారు కదా!

ఇదే కాక తెలంగాణా మేధావుల వేదిక వాళ్లు కూడా నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. అందులో నా తప్పేమీ లేదు కదా. వారిద్దరికి ఆ టాలెంట్సు ఉంటే వాళ్లను మాత్రం ఒద్దంటారా?

సరే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తప్పుకుంటాను. వారిలో ఎవరైనా ఒకరు ఆ బాధ్యత తీసుకోమనండి” అని ముగించాడు.

ఆ ఇద్దరూ బరువూ, బాధ్యతలను మోయలేరని స్వామికి స్పష్టంగా తెలుసు.

కొన్ని నెలల తర్వాత ఆ ముగ్గురు చెప్పని ఇంకో అసలైన కారణం వేరే వారి ద్వారా స్వామికి తెలిసింది.

‘చందాల దందాలలో వచ్చిన మనస్పర్థలు, అనుమానాలు’.

***

2001లో తెలంగాణా సాధన సంఘం స్థాపనకు ముందు సూర్యశేఖరరావు తనకు ఏ కోర్కెలు, ఏ స్వార్థం లేదని, నా కొడుకు, కూతురు విదేశాలలోనే స్థిరపడ్డారని ఇగ ఇక్కడుండేది మేమిద్దరం మిఁయా – బీవీ మాత్రమే అనీ కాబట్టి నా శేషజీవితమంతా తెలంగాణా రాష్ట్ర సాధనకే అంకితం చేస్తానని వాగ్దానం చేయగా. యావత్‌ తెలంగాణా ప్రజలు మాయాబజార్‌ సీన్మాలో మాదిరిగా ‘హై హై నాయకా, జై జై నాయకా’ అన్నారు కాని 2008 సంవత్సరం వచ్చేసరికి, ప్రత్యేకరాష్ట్రం చేరువలోనే చేతికి చేరుతుందని పసిగట్టిన ఆయన పుత్రరత్నం, పుత్రికా రత్నం ఆఘమేఘాల మీద హైద్రాబాదుకు ఊడిపడగానే మాయాబజార్‌ సీన్మా మాయమై ‘రోజులు మారాయి’ సీన్మా శురువయ్యింది. ఇప్పుడు కొడుకూ, కూతురు చుట్టూ వందిమాగధులు, బాజాభజంత్రీగాళ్లూ, ఇబ్బడిముబ్బడిగా జమఅయ్యి ‘మళ్లీ హై హై నాయికా, జై జై నాయకా’ అని చిలకలపలుకుల స్తోత్రాలు వల్లె వేయటం ప్రారంభించారు. అట్లా యువరాజు, యువరాణే కాక, ఒకరిద్దరు సమీప దగ్గరి బంధువుల హవాకు కూడా ‘అరంగేట్రం’ జరిగింది.

యువరాజు పేరు కృష్ణారావు యువరాణి పేరు మమత.

‘క్యాస్ట్‌ ఈజ్‌ కెమికల్‌ రియాక్షన్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌’ అని రాజనీతి శాస్త్రజ్ఞుడు రజనీ కొఠారీ అన్నాడు. దానితో పాటు బ్లడ్‌ ఈజ్‌ కెమికల్‌ రియాక్షన్‌ ఇన్‌ స్టేట్‌ పాలిటిక్స్‌ అంటే బాగుండేదేమో!

ఉదయించే ఉదయభానుడిలా పుత్రరత్నం ప్రకాశించటం మొదలయ్యింది. ఆయన ఏ సభకు ‘ఉప్పుదేశాలు’ ఇవ్వటానికి ఏతెంచినా ‘చేలా’లు బుట్టెడు బుట్టెడు గులాబీరేకుల ‘పూలవర్షాన్ని’ కురిపించటం సర్వసాధారణమయ్యింది. పాపం ఆయన లెక్కకు మిక్కిలిగా ముసి ముసి నగవులతో సంతోషించాడే తప్ప. “ఇది తప్పు” అన్న పాపాన పోలేదు. రాజకీయాలలోకి ఆయన ప్రవేశం దొడ్డిదారిన కాక, ఏకంగా రాజమార్గాన ఎర్రతివాచీలు పరిచి గులాబీ పువ్వులతో స్వాగతం పలకటం జరిగింది. ఆక్సిడెంటల్‌ లీడర్లు కొంతమంది ఉంటారు కదా!

పూలబాటల మీద ఆయన అనాయాసంగా ప్రవేశించిన కాలంలోనే తెలంగాణా అనేక జిల్లాలో విద్యార్థి, యువజనులు, ఆడపిల్లలతో సహా లాఠీ దెబ్బలకు, రబ్బరు తూటాలకు గురి అవుతున్నారు. ప్రజలదేముంది ఏ కాలంలోనైనా, ఏ ఉద్యమంలోనైనా వారు అగ్గిపుల్లలా భగ్గున మండి, లిప్తకాలం వెలిగి మళ్లీ తెరవెనుక ఉన్న చీకట్లలో మాయమవుతారు. కనుమరుగౌతారు వారి సమాధుల పునాదుల మీద రాజకీయ నాయకులు ధగధగాయమానమైన తమ జీవితాలను నిర్మించుకుంటారు.

యువరాణి రూటు మాత్రం టోటల్‌గా సపరేటు రూటు. గుంపులో గోవిందా హమ్‌ కో నహీఁ చల్తా అని సోచాయించి, సోచాయించి ఒకానొక పవిత్ర దినాన అలగ్‌, సలగ్‌గ దుకాణం తెరిచింది. ‘ఆకృతి’ దాని నామధేయం. తన ఆశయాలు అల్లాటప్పా ఆశయాలు కావని తెలంగాణా చరిత్ర, సంస్కృతి, పండుగలు, సాంప్రదాయాలు అన్నింటినీ ‘గంపగుత్తగా’ నెత్తికెత్తుకుని ఉద్దరించటమే తన పవిత్ర ఆశయమూ మరియు ప్రధాన కర్తవ్యమని మరి మరీ నొక్కి నొక్కి వక్కాణించింది. అయితే ఆ సంస్థలో స్త్రీల కన్న పురుషులకే ప్రథమస్థానం. రాజే కాక రాణి కూడా తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు తెలంగాణాలోని అన్ని జిల్లాలలో, తాలూకాలలో, దాని శాఖలు వెంట వెంటనే శాఖోపశాఖలుగా రాత్రికి రాత్రి వెల్లివిరిసాయి, విస్తరించాయి. దాని కామె రాష్ట్ర అధ్యక్షురాలు. తెరవెనుక నాన్న, అన్న ఆశీర్వాదాలు ఎట్లాగూ ఉండనే ఉన్నాయి. అయితే తెలంగాణా కవులలోని ఒక పీఠాధిపతి, ఒక గాయకుడు ఆ సంస్థ పురుడు పోయటంలో మంత్రసానులుగా తెరవెనుక పనిచేసారని కవికుల కోకిలలు సణుక్కున్నాయి. గొణుక్కున్నాయి. ఏదేమైనా “దిల్లీ అబ్‌ దూర్‌ నహీఁ హై” అని ఆ కొంగ్రొత్త యువ నాయకురాలు ముందుకీ మున్ముందుకే, పోదాం పోదాం పై పైకి అనుకుంటూ అప్రతిహతంగా ముందుకు సాగిపోయింది. దూసుకపోయింది. పార్టీని స్థాపించేటపుడు సర్వసంగపరిత్యాగిలా మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు అనతి కాలంలోనే తన సామాజిక వర్గాన్నే కాక కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా ముఖ్య స్థానాలను అప్పచెప్పాడు.

ఉద్యమానికి ఊతంగా ఉంటుందని ఒక దినపత్రిక, ఒక టీ.వి. చానెల్‌ కూడా పార్టీ తరపున ప్రారంభమయినాయి. ఒకరోజు ఆ దిన పత్రిక చదువుతుంటే స్వామికి ఒక వార్త శరాఘాతంలా తగిలింది. “మమతగారి నాయకత్వాన ఉన్న ‘ఆకృతి’ సంస్థకు నల్లగొండ జిల్లా బాధ్యునిగా ‘వేణు’ గారు నియమించబడ్డారని. పొద్దు పొద్దున్నే తాగుతున్న చాయ్‌ చాలా చేదుగా మారింది స్వామికి.

చాలా సేపు కొయ్య బొమ్మలా కదలికలు లేకుండా కూచుండి పోయాడు.

“అస్లీ నక్లీ చెహరే దేకే

సౌ సౌ రంగ్‌ బదల్‌ తే దేకే”

(అనాడీ సీన్మా 1959)

***

బాబ్రీ మసీదుతో మొదలయిన రావణకాష్టం అంత త్వరగా దేశంలో చల్లారదని మళ్లీ రుజువయ్యింది. ఈ సారి ఉగ్రవాదపు పంజా హైద్రాబాద్‌ నగరంపై విరుచుకపడిరది. ఉగ్రవాదులు నగరం నడిబొడ్డులో ఉన్న కోఠీ-గోకుల్‌ చాట్‌ బండార్‌ను తమ టార్గెట్‌గా నిర్ణయించుకున్నారు. సాయింత్రం పూట అది గిరాకీలతో కిక్కిరిసి ఉంటుంది. 2007 ఆగస్టులో అతి శక్తివంతమైన బాంబును పేల్చారు. 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది గాయపడి వికలాంగులైనారు.

బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదని ఈ మతోన్మాదం మూలాలన్నీ దేశ విభజనలోనే ఉన్నాయని స్వామి తన మిత్రులతో తీవ్రంగా వాదించేవాడు.

***

ఒక రోజూ సీతామహాలక్ష్మి, శారద మేనేజర్‌ గదిలోకి వచ్చి “సార్‌ మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న మాట” అన్నారు.

“నేనేమనుకున్న ఫరవాలేదు కాని ముందు మీ మాట ఏమిటో చెప్పండి” అన్నాడు కించిత్తు హాస్యంగా.

“ఏం లేదు సార్‌. మీరు ఒక్కరే ఉన్నపుడు విమలను మీ గదిలోకి రానివ్వకండి. ఆమె రాగానే బెల్లుకొట్టి లక్ష్మినో లేదా మమ్మల్నో పిలవండి. ఆమె మళ్లీ వెళ్లేదాకా మేం మీ దగ్గరే ఉంటాం”

స్వామి బోలెడంతా ఆశ్చర్యపోయాడు. “అట్లెందుకు ఆమె ఏమైనా నా పై దాడి చేస్తదా? కత్తితో పొడుస్తదా? అన్నాడు.

“దాడి కంటే ఎక్కువ ప్రమాదమే ఉండొచ్చు సార్‌”

“అదేందో చెప్పండి” అన్నాడు చాలా ప్రశాంతంగా.

“సార్‌ మీరు చాలా అమాయకులు. ‘తెల్లవన్నీ పాలు, నల్లవన్నీ నీళ్లు’ అనుకునే రకం”.

“సరే. సరే. సంగతేందో సాఫ్‌, సీదాగా చెప్పండి”.

“ఆమె ఒక్కతే మీ రూంలో ఉంటే, తన జాకెట్‌ తనే చింపుకోవచ్చు. చేతికున్న గాజులు తనే పగలగొట్టుకోవచ్చు. తన కొంగు పూర్తిగా జారవిడిచి అందరూ ఆమె అరుపులకు ఏడుపులకు పోగవగానే మీరు ఆమె కొంగు పట్టిలాగి బలత్కారానికి ప్రయత్నించారని బద్నాం చేయవచ్చు.”

నిజంగానే ఆ సీను అప్పుడే క్షణం క్రితం జరిగినట్లు అందరూ తనను థూ, థూ అని అసహ్యించుకున్నట్లు స్వామికి చెమటలు పట్టి ముఖం బీతావహంగా పెట్టాడు.

ఆ ఇద్దరు మహిళామణులు స్వామి భయం గమనించిన వారై ఇంకొంచం భయపెట్టటానికి ముచ్చటపడి ఆ సీను వర్ణన ఇంకొంచెం కొనసాగించారు. ఎంతైనా ఆ తూ.గో. జిల్లా వాళ్లు మాటల పుట్టలు కదా.

“ఆమె క్యాస్ట్‌ ఏమిటో మీకు తెలుసు కదా. మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీన్‌ కేసు ఒకటి, అది సరిపోదన్నట్లు రేప్‌ చేయటానికి ప్రయత్నించారని మరొక కేసు, అనగా రెండు కేసులు మీ పై మోపితే ‘నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు’, ఆ వెంటనే సస్పెన్షనూ, తదుపరి మీ పేరు పేపర్లకు ఎక్కటమూ..”

“ఆపండాపండి. నేనేందో మీ అందరికీ తెలవదా? మీరందరూ ఉన్నారుగా అది అబద్దం అని సాక్ష్యం చెప్పటానికి” అని వారి నోళ్లు మూయించబోయాడు.

“అవన్నీ తర్వాత, కోర్టులో సార్‌. ముందు మీ అరెస్టూ ఆ తర్వాత శ్రీకృష్ణజన్మస్థానమూ, తెలుగు పేపర్లలో బాక్సు న్యూసులు. మీ భార్యమణి మిమ్మల్ని అపార్థం చేసుకుని గృహకల్లోలమూ..”

ఆ రోజు వారిద్దరూ మాంచి హాస్యరసపు ధోరణిలో ఉన్నట్టున్నారు. తనను పరేషాన్‌ చేయటానికి వీళ్లకొక ‘సాకు’ దొరికిందని ఊహించి

“సర్సరే. ఇగ మీరే చెప్పండి ఆ ఆపద నుండి నేనెట్లా గట్టెక్కాలో”

“ఏం లేదు సార్‌ ఆమె పగబట్టిన నాగినిలా మాకు కనబడుతుంది. భర్త ఉన్నపుడే ఆమె చాలా వేషాలు వేసిందట. అది మనసులో పెట్టుకునే ఆ మానవుడు పాపం కక్కలేకా, మింగలేకా భరించి భరించి తనలో తానే కుమిలి, కుమిలి హఠాత్తుగా బాల్చీ తన్నేసాడు.”

వినదగునెవ్వరు చెప్పిన పద్ధతిలో వింటున్నాడు స్వామి.

“కావున మీరెప్పుడు ఆ మాయలాడిని ఒంటరిగా మీ గదిలోకి రానివ్వకండి. మీ శ్రేయోభిలాషులుగా ఇదే మా సలహా.” అని తమ భయానక సీను వర్ణన ముగించారు.

స్వామి బెల్లు కొట్టగానే ‘లక్ష్మి’ ప్రత్యక్షమయ్యింది.

“చూడు లక్ష్మి నువ్వు నా గది ముందున్న బెంచి మీది నుండి ఎక్కడికీ కదలొద్దు. విమల ఎప్పుడు వచ్చినా, నేను బెల్లు కొట్టక పోయినా ఆమె వెంబడే నువ్వు లోపలికి రావాలి. యాదికుంచుకో” అని హెచ్చరించాడు.

విషయమేందో అర్థం కాని లక్ష్మి అయోమయంగా ముగ్గురి ముఖాలలోకి చూసింది.

“నేనంతా చెపుతాను కదా” అన్నట్లు సీ.మ.ల ఆమెకు కళ్ల భాషలో బోధపరిచింది.

ఒక నెల తర్వాత విమల ఒక కాగితం పట్టుకుని మేనేజరు గదిలోకి వచ్చింది. మేనేజరు అనధికార అంగరక్షకురాలు లక్ష్మి ఆమె వెనకే వచ్చి నిలుచుంది. ఆపత్కాలంలో మళ్లీ ఈ సారి నిజంగానే వస్త్రాపహరణకు ఉత్సాహపడుతూ.

“ఏందీ” అన్నట్లు చూసాడు.

“పదిరోజులు లీవు కావాలి సార్‌. ఇంటర్‌ పరీక్షలు రాయాలి. లేకపోతే రివర్షన్‌ కదా” అంది ప్రాధేయపూర్వకంగా.

“హాల్‌ టికట్‌ చూపిస్తేనే లీవు సాంక్షన్‌ చేస్తా”

“రేపు చూపిస్తా సార్‌” అని మరునాడు నిజంగానే హాల్‌ టికట్‌ పట్టుకొచ్చింది. చూసాడు. పరీక్ష సెంటర్‌ చిత్తూరు జిల్లాలోని పుత్తూరు. ఆ సరిహద్దు దాటితే తమిళనాడు లోని ‘తిరుత్తణి’ మొదలవుతుంది. ఆశ్చర్యపోయిన స్వామి.

“అంతదూరం ఎందుకు వెళ్తున్నావు. హైద్రాబాదులనే ఎందుకు రాస్తలేవూ” అని ప్రశ్నించాడు.

“అక్కడ మా అక్క ఉంటది సార్‌”.

స్వామికి తిక్కరేగింది. అయినా బయటపడక గొంతు మృదువుగా మార్చి

“చూడు విమలా. అబద్దం ఆడినా అతికినట్లుండాలే. తాడిచెట్టు ఎందుకు ఎక్కినవ్‌ రా అంటే దూడగడ్డి కోసం అన్నట్లు జవాబు చెప్పకూడదు. నిజం చెప్పు” అని మంచిగా, మెత్తగా అడిగాడు. ఆ గొంతులోని మార్దవానికి, ఐసై పోయింది ఆమె. సారుకు నా మీద దయ పుట్టుకొచ్చినట్లుందని ఉన్నది ఉన్నట్లు చెప్పింది.

“ఏం లే సార్‌. అక్కడ మాస్‌ కాపీయింగు జరుగుతది. నేనక్కడుంటే చాలు నా తరపున మరొకరు పరీక్ష రాస్తరు” అని అది అతి సాధారణ విషయంలా తన హుషారుతనం చూపిస్తూ మాట్లాడిరది. తన తెలివికి సార్‌ మెచ్చుకుంటాడని కూడా లోలోపల అనుకున్నట్లుంది. కాని ‘జ్యాదా హుషారీ జాన్‌ కో పరేషానీ’ అని ఆమెకు తెలియదు.

స్వామిలోని పూర్వాశ్రమ లెక్చరర్‌ గారికి ఒళ్లు భగ్గున మండింది. సరే దీని చావేదో దీన్ని చావని అనుకుని పదిరోజుల లీవు సాంక్షన్‌ చేసాడు.

తెల్లారి మధ్యాహ్నం స్వామికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంటర్‌ అడ్డదారులలో పాసు కావటానికి ప్లాను వేసిన ఆమె టెన్త్‌ కూడా అదే పద్దతిలో పాస్‌ అయి ఉండవచ్చు కదా అని. ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. ఇంటర్‌ కూడా పాస్‌ కాని బబితారెడ్డి గతంలో విద్యాశాఖామంత్రిగా పనిచేసిన సంగతి గుర్తుకువచ్చింది.

పద్మావతిని పిలిచి విషయం చెప్పకుండా విమల రిక్రూట్‌మెంటు ఫైలూ, ఆమె సర్వీసు రిజిస్టరు పట్టుకురా అన్నాడు.

తెచ్చి టేబుల్‌ మీద పెట్టి వెళ్లిపోయింది. ఓపికగా తనిఖీ చేసాడు. పుట్టిందీ, పెరిగిందీ హైద్రాబాదు. స్కూలు బోనఫైడ్‌ సర్టిఫికేట్ల ప్రకారం ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకూ ఒకే గవర్నమెంటు స్కూలులో చదివింది. టి.సి. వేరిఫై చేస్తే టెన్త్‌ ఫెయిల్‌ అని ఉంది. టెన్త్‌ పాసయిన సర్టిఫికేట్‌ మాత్రం అది బోర్డు ఆఫ్‌ సెకండరీ గుల్బర్గా, కర్నాటక రాష్ట్రం వారిది.

‘దాల్‌ మే కుచ్‌ కాలాహై’ అని అనుకున్నా తొందరపడలేదు స్వామి.

మధు ఆ ఆఫీసులో చురుకైన క్లర్కు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం.

వాడిని పిలిచి రహస్యమైన ‘గూఢచర్యం’ పని అప్పగించి మూడో కంటికి తెలియొద్దు అని గట్టిగా హెచ్చరించాడు.

‘చిత్తం మహాప్రభూ’ లెవల్లో ఆ రహస్య గూఢచారి శీఘ్రంగా నిష్క్రమించాడు.

మరునాడు మధ్యాహ్నం మధు తిరిగి వచ్చాడు. ఆ సర్కారీ స్కూలు హెడ్‌ మాస్టరు ఇంతకీ మీరెవరూ? అని పనికి రాని ఆ అదనపు పనినుండి ముందు తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అప్పుడు మధు తన ఐ.డి. కార్డు చూపించగానే లైను మీదికి వచ్చాడట. అప్పుడు పెద్ద గుమాస్తాను పిలిచి పాత దస్త్రాలన్నీ దుమ్ము దులిపి తిరగేసి, మర్లేసి, ‘ఖుద్దు మతలబు’ ఇవ్వమని హుకుం జారీ చేసాడట.

ఆ చివరికి ఏతావాతా తేలిందేమంటే విమల పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో కాపీ కొడుతూ పట్టుబడినందున, ఇన్విజిలేషన్‌ చేస్తున్న మహిళా టీచర్‌పై దాడి చేసినందున, రెండు కారణాల, దుష్ప్రవర్తనకు గానూ ఆమె డిబార్‌ చేయబడిరదనీ, కావున టెన్త్‌ టి.సి.లో ఫెయిల్‌ అని రాసారని ఆసక్తికరమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి.

అప్పుడు స్వామికి టెన్త్‌ పాసయిన కర్నాటక సర్టిఫికేటు, ఇంటర్‌ పరీక్ష రాయబోయే హాల్‌ టికెట్టు తమిళనాడు సరిహద్దు ప్రాంతం అని జ్ఞాపకం వచ్చి ‘ఇది అంతరాష్ట్ర కేసు’ అని నిర్దారించుకున్నాడు. ఇక ఏ మాత్రం జాగుసేయక డివిజన్‌ అధికారిని కలిసి ‘గతంలోనే ఘన కీర్తిని ఆర్జించిన’ ఆమె గురించి మౌఖికంగానే వివరమైన నివేదిక అందజేసాడు.

“స్వామీ! ఇక ఈమెను వదిలిపెట్టవద్దు. దీని మూలాన్నే కదా హనుమంతు కాలు లేని వాడయ్యాడు. ఈ కేసును చాలా పకబ్బందీగా తయారుచేయి” అన్నాడు.

స్వామి సుదీర్ఘంగా ఆలోచించి కర్నాటక బోర్డు ఆఫ్‌ సెకండరీ వారికి ఒక డి.ఓ. (డమ్మీ ఆఫీషియల్‌) లెటరు రాసాడు. ఆ టెన్త్‌ పాస్‌ సర్టిఫికేట్‌ జిరాక్సు కాపీ జతచేసి ‘ఇది నిజమైన సర్టిఫికేటేనా? లేదా? లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వమ’ని ఆ లెటరులో రాసాడు. దానిని రిజిస్టరు పోస్టులో పంపినా ‘సర్కారీ దఫ్తర్‌’లు కావున ఏ చెత్తబుట్టలోకి వెళ్లినా వెళ్లవచ్చు లేదా నత్తనడక జవాబు వచ్చినా ఆర్నెల్లు దాటవచ్చునని శంకించి మళ్లీ మధు సీక్రెట్‌ ఏజెంటును పిలిచి పని అప్పగించాడు. డివిజన్‌ ఆఫీసులో ఉండే ప్రభుత్వ బొక్కసం నుండి కొంత రొఖ్కాన్ని కేటాయించి, ‘తిరుగుటపా-లేఖ’ తోనే రావాలని హుకుం జారీ చేసాడు.

రహస్య భటుడు ఆ లేఖ పట్టుకుని ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులతో గుల్బర్గాకు వెళ్లిపోయాడు.

దురాభారమనక అతి వ్యయ ప్రయాసలకోర్చి పరీక్షలు రాసి వచ్చిన విమల మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయ్యి “ధ్యాంక్యూ వెరీ మచ్‌ సార్‌” అన్నది.

“సరే వెళ్లి పని చూసుకో” అన్నాడు. అయినా ఆమె కదలలేదు. ఏమిటీ అన్నట్లు చూసాడు.

“ఏం లేదు సార్‌. ఇక నేను ఇంటర్‌ పాస్‌ అవుతున్నా కదా! నన్ను ఏదైనా సర్కిల్‌ ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్‌ చేయండి” అన్నది.

“ఎందుకు ఇక్కడ పనిభారం చాలా ఎక్కువగా ఉందా” అన్నాడు.

“అది కాదు సార్‌. పిల్లల చదువులు ఇంకా ఉన్నాయి. ఒంటరి దాన్ని. సర్కిల్‌కు వెళ్తే ఏవో నాలుగు డబ్బులు, వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటది” అని బ్రతిమిలాడిరది.

“సరే చూద్దాం వెళ్లు” అని పంపించాడు.

తెల్లారి సలహామండలి ముగ్గురు సభ్యులను పిలిచి “సర్కిల్‌ ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్‌ చేయమని బ్రతిమిలాడుతుంది. పాపం పంపిద్దామా” అని అడిగాడు. వారెవరికీ రాచకార్యం పై మధు గుల్బర్గాకు వెళ్లిన సంగతి చూచాయగా కూడా తెలియదు. అంతకు ముందు స్కూలుకు వెళ్లి సమాచారం సేకరించిన సంగతి కూడా తెలియదు.

ముగ్గురు ఒకేసారి కెవ్వున అరిచినంత పనిచేసారు.

“సార్‌ మీరు దాన్ని సర్కిల్‌ ఆఫీసుకు పంపిస్తే అక్కడ ఒకటో, రెండో కొంపలు కూలటం ఖాయం”. అని శారద ఉక్రోషంగా మొత్తుకుంది.

“అది, అక్కడ ఆర్నెల్ల లోపల సర్కిల్‌ ఆఫీసును తగలబెట్టెయ్యక పోతే నా పేరు పద్మావతి కాదు” అని పద్మావతి ప్రతిజ్ఞ చేసింది.

అప్పుడు సీ.మా.ల ఆలోచనాత్మకంగా “సార్‌ మీరు అన్యథా భావించకపోతే నాదొక చిన్నమాట” అన్నది.

చెప్పండి అన్నాడు.

“సార్‌ ఆమెను అక్కడికి పంపిస్తే అక్కడి వాళ్లు సుందోపసుందుల్లా పోటాడుకుని ఒకటో రెండో హత్యలు జరుగుతాయి” అన్నది.

మేనేజరు ఆలోచనలో పడిపోయాడు. ఈ డివిజన్‌ ఆఫీసుకు ఒక నేపథ్యం ఉంది. దీనికి వితంతువుల ఆఫీసని, స్త్రీ సంక్షేమ పునరావాస కేంద్రమని పడనివాళ్లు ‘నిక్‌నేమ్‌లు’ తగిలించారు. అది వాస్తవమైన సంగతే. ఒకప్పుడు సీతామహాలక్ష్మి భర్త ప్రభుత్వంలో ప్రముఖ ఇంజనీరు. మధ్య వయసులో ఆయన పోగానే కారుణ్యనియామకం క్రింద ఆమెకు ఈ ఆఫీసులోనే ఉద్యోగమిచ్చారు. శారద భర్త సన్యసించాడు. ఎక్కడున్నాడో ఎవరూ కనుక్కొలేకపోయారు. ఆమె యోగినిలా, నిప్పుకణికలా బ్రతుకుతుంది. పద్మావతి భర్త ఉండి కూడా లేనట్లే. నిర్వ్యాపారి. పైసా సంపాదనలేదు. మాలినీ రెడ్డి రికార్డు అసిస్టెంటు. ఆమె భర్తను నక్సలైట్లు సిద్దిపేటలో ఇన్‌ఫార్మర్‌ అని కాల్చేస్తే ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఆమెకు ఈ చిన్న ఉద్యోగం ఇదే ఆఫీసులో ఇచ్చారు. ఉమర్‌, శారద క్రింద అసిస్టెంటు. బ్యాంకు పనులు చూస్తుంటాడు. ఒకప్పుడు వాడి ‘అబ్బా’ సర్కిల్‌ ఆఫీసులో చప్రాసీ. పై ఆమ్‌దానీతో తాగి తాగి అల్లాకు ప్రియమైనవాడు కాగానే చిన్న వయసులో వాడికి కూడా ఇక్కడే కారుణ్య నియామకం. చివరికి అటెండరు లక్ష్మి. వాళ్లు మేతర్లు. ఆమె భర్త ఒక గవర్నమెంటు ఆఫీసులో స్కావెంజరు. వాడు కూడా తాగి తాగి టపా కట్టెయ్యగానే లక్ష్మికి కూడా కారుణ్య నియామకం ఇక్కడే జరిగింది. ఆ ముదనష్టపోడు పోయినంక ఇప్పుడే సుఖంగా ఉన్నా అని జనాంతికంగా అందరి ముందు ప్రటకన చేస్తుంది. వీళ్లందరి మధ్య కడివెడు పాలలో ఒకవిషపు చుక్కలా విమల ప్రవేశించి బుద్దిమంతుడైన హనుమంతుపై మత్తుజల్లి మాయచేసి లొంగదీసుకుని చివరికి వాడిని అవిటివాడ్ని చేసింది.

వాళ్లకు ఏ సంగతి చెప్పకుండా “సరే ఆలోచిద్దాం” అని పంపించివేసాడు.

రెండు రోజుల తర్వాత మధు సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చిన వాయుపుత్రుడిలా మహోత్సాహంతో సీల్డ్‌ కవర్‌ లెటరుతో ఆఫీసుకు వచ్చాడు. లక్కతో సీల్‌ చేసిన ఆ కాన్ఫిడెన్షియల్‌ కవర్‌ను స్వామి జాగ్రత్తగా ఓపెన్‌ చేసాడు. కేవలం రెండు లైన్ల మ్యాటర్‌ మాత్రమే ఉంది.

“మీరు పంపిన సర్టిఫికేట్‌ ఫోర్జరీ సర్టిఫికేట్‌. మేం దీనిని ఇవ్వలేదు. మాకు సంబంధంలేదు. మీరు వెంటనే ఫోర్జరీ 420 సెక్షను క్రింద పోలీసుకు రిపోర్టు ఇచ్చి సదరు క్యాండిడేటును సర్కారీ సర్వీసు నుండి డిస్మిస్‌ చేయవచ్చును.”

అప్పుడు యుద్ద ప్రాతిపదికన డివిజన్‌ అధికారి చాంబరులో ఒక అత్యవసర రహస్య సమావేశం జరిగింది. ఎందుకైనా మంచిది ఈ కేసు ఒక స్త్రీకి, ఆమె కుటుంబ సంక్షేమానికి సంబంధించినది కావున ‘అధికారి’ గారు ముగ్గురు మూలపుటమ్మలను కూడా ఆ సమావేశానికి పిలిచాడు. వాళ్లు ఆ ఆఫీసు వ్యవస్థకు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి లాంటివారు. అట్లా ఆ ఐదుగురు హై కమాండ్‌ సభ్యుల రహస్య సమావేశం ప్రారంభమయ్యింది.

అప్పటి వరకూ ఆ ముగ్గురు మహిళా సభ్యులకు తెలియని రహస్య సమాచార సేకరణ అంతా అధికారి గారు పూసగుచ్చినట్లు వారికి తెలియచేసారు. శ్రీమతి విమలాదేవి రహస్య వృత్తాంతమంతా తెలుసుకున్న ఆ ముగ్గురు ముందు షాక్‌కు గురయ్యి ఆ తర్వాత ఆశ్చర్యంతో కండ్లు పెద్దగా చేసుకుని, నోళ్లు వెళ్లబెట్టి మేనేజరు స్వామి వైపు చూసారు.

అధికారి గారు చాలా క్లుప్తంగా “ఇది ఫోర్జరీ 420 కేసు ఆపైన ఆఫీసులో మిస్‌కాండక్ట్‌ కేసు. దానికి తోడు ఆమె ఇంకా పొబేషనరీ పీరియడ్‌లోనే ఉంది. కాబట్టి నేను ఆమెను సర్వీసు నుండి తక్షణమే భర్తరఫ్‌ చేయాలి. అది సమస్య కాదు కాని ఆమె పిల్లలు అన్యాయమై పోతారనే నా బాధ. కాబట్టి ‘విమెన్‌ కొలీగ్స్‌’గా అంటే సహా స్త్రీ ఉద్యోగులుగా మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనే ఈ సమావేశానికి మీ ముగ్గురిని పిలిచాను” అన్నాడు.

అప్పుడు ‘నిప్పు కణిక’ శారద నోరు విప్పి “దాన్ని డిస్మిస్‌ చేయాలి సార్‌. మన డిపార్ట్‌మెంటు చరిత్రలో ఇలాంటివారు ఎప్పుడూ లేరు. దీన్ని ఇంటికి పంపకపోతే ముందు ముందు చాలా సమస్యలు వస్తే మళ్లీ మీకే సమస్య” అన్నది.

తర్వాత సీ.మ.ల. “సార్‌ ఆమె పిల్లలు ఏమీ అన్యాయం కారు. ఆమె కూతురు ఇంజనీరింగ్‌ ఐపోయి ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుందట. హనుమంతు స్వయంగా చెప్పాడు. కొడుకు ఇంజనీరింగ్‌ రేపో, మాపో కంప్లీట్‌ అవుతుంది. దాని బ్రతుక్కు దానికి వచ్చే పెన్షన్‌ చాలు.” అన్నది కసిగా.

అప్పుడు పద్మావతి అందుకుంది. “సార్‌ మీరు దైవభక్తి, దయార్థహృదయం కల్గిన వారు. ఉద్యోగాలు ఇవ్వటమే గాని ఉద్యోగం నుండి తీసెయ్యటం మీకు బాధగానే ఉంటుంది. ‘పాపం’ తగులుతుందని భయం కూడా మీకు ఉండొచ్చుగాని పాపులను శిక్షించటం ధర్మమే కాని పాపం మాత్రం కాదు” అని ముగించింది.

ఆడవాళ్ల ఇంగిత జ్ఞానానికి ముగ్దుడైన అయిన “స్వామీ! డిస్మిస్‌ ఆర్డర్‌ ప్రిపేర్‌ చేయండి” అని ఆదేశించాడు. విమలాదేవి వృత్తాంతము చివరికి అట్లా ముగిసింది.

***

ఒకరోజు ప్రొద్దు ప్రొద్దుగాల్నే నల్లగొండ నుండి పెద్దాయన దేవులపల్లి క్రిష్ణమూర్తిగారు ఫోన్‌ చేసారు.

“స్వామీ ఒక నెల తర్వాత మన వేణు రిటైర్‌మెంటు. ఆ పదవీవిరమణ సందర్భంగా ఆయన మీద ఒక సావనీర్‌ తీసుకొస్తున్నాం. అందులో నీ వ్యాసం కూడా ఉండాలి. జల్దీ పంపాలె” అని ఆ ఫోను సారాంశం.

ఆ వార్త ఈ చెవి నుండి విని ఆ చెవితో వదిలిపెట్టేసాడు.

అంతటా ఉన్నట్లే ఈ నల్లగొండ జిల్లా “కౌ” లకు కూడా ఒక చిన్న దుకాణం ఉంది. దాని పేరు ‘విజయమిత్ర సాహిత్య, సాంస్కృతిక సంస్థ’ అని దానికో లేబుల్‌. చాలా సంవత్సరాల నుండి వేణు దానికి శాశ్వత అధ్యక్షుడు. జిల్లా అంతటా సభలు, సమావేశాలు, కవిత్వ పుస్తకాల ఆవిష్కరణలు ఆ సంస్థ తరపున జరుగుతుంటాయి. వేణు వాగాడంబర, పటాటోప ఉపన్యాసాలకు నచ్చి, మెచ్చిన ఆ జిల్లా ప్రజలు ‘సభా సామ్రాట్‌’ అన్న ‘గండపెండేర’ బిరుదాన్ని ఆయనకు ప్రసాదించారు. ఆయన ఆ బిరుదులను ఏ మాత్రం తిరస్కరించక వినయంగా స్వీకరించాడు. ప్రతి సాహిత్య సమావేశ కరపత్రంలోనూ ఆయన నామధేయం క్రింద ఆ ‘సభా సామ్రాట్‌’ అన్న విశేషణం తప్పని సరిగా ఉంటుంది.

నిజానికి చాలామంది కవులలాగా వేణు తెలుగు లిటరేచర్‌ లెక్చరర్‌ కాదు. రాజనీతి శాస్త్రం ఎం.ఏ. ఎంఫిల్‌. చేసాడు. దానిని దృష్టిలో పెట్టుకుని స్వామి:

“వేణూ మనిద్దరం అందరి లాగా భాషా పండితులం కాదు. రాజనీతి శాస్త్రం చదువుకున్నాం. కావున మనం ఈ ఉద్యమాన్ని కొత్త రాజకీయ కోణంతో విశ్లేషించి మాట్లాడితే సభికులను విద్యావంతులుగా, చైతన్యపరుల్నిగా చేసినట్లు ఉంటది” అని చాలాసార్లు చెప్పాడు.

కాని ఆయనకు తన ఉపన్యాసాలలో అంత్య ప్రాసలమీదా ఆంధ్రులను హేళనతో గేలి చేసే అపహాస్యం మీదనే మక్కువ ఎక్కువ. అవన్నీ వాగాడంబరమే (డెమోగాగి) తప్ప మరేమీకాదు. కావున వేణూ! మన ఉపన్యాసాలలో “దేర్‌ షుడ్‌ బి లైట్‌ రాదర్‌ దాన్‌ హీట్‌” అన్నా చెవికెక్కేది కాదు.

అత్యంత క్లిష్టాతి క్లిష్టమైన అంత్యప్రాసలతో, సమాసాలతో విశేషణాలతో ఆయన పొడుగుపొడుగు కవిత్వాలు విశ్వనాథ వారి ‘నారికేళ పాకంలా’ ఉండేవి. దాని బదులు ఆలోచనలు రేకెత్తించే ఉద్యమ వ్యాసాలు కొత్త కోణంలో రాయటం ప్రస్తుత అవసరం అని మెత్తగా చెపితే “లేదు స్వామీ వ్యాసాలు రాస్తే నా సృజనాత్మకత దెబ్బతింటుందని” చెప్పేవాడు. మూస కవిత్వాలలో సృజనాత్మకత ఏమిటో స్వామికి అర్థం అయ్యేదికాదు.

ఒక వారం తర్వాత మళ్లీ ‘దేవులపల్లి’ వారి ఫోను వ్యాసం కావాలని, మీ ఒకరిదే బాకీ, పెండింగ్‌ అని. స్వామికి చిర్రెత్తి:

“సార్‌ నాకు ఈ పదవీ విరమణ సభల మీదా సన్మానాల మీదా ఇష్టం లేదు. సావనీర్లు కూడా నచ్చవు. సగం సావనీర్లు ఫోటోలతో మిగతా సగం సావనీర్లు ‘ఇంద్రుడు చంద్రుడు’ అన్న పొగడ్తలతో నిండిపోతుంది ప్రతి ఒక్కరూ తమ తమ సావనీరు వేసుకోవటం ఈ మధ్య ఒక అంటురోగంలా వ్యాపిస్తుంది.. సారీ” అని నిష్కర్షగా చెప్పాడు.

దానితో దేవులపల్లి వారు “స్వామీ మీరిద్దరూ టీనేజ్‌ నుండి జిగ్రీదోస్తులు అన్నది అందరికి తెలుసు. అందరూ రాసి మీరొక్కరిదీ లేకపోతే మీ మధ్య ‘మిత్రబేధం’ వచ్చిందని అందరూ నవ్వుకోరా” అని సెంటిమెంటు మీద దెబ్బకొట్టాడు ఆ పెద్దాయన.

అప్పుడు స్వామి కొంచెం సేపు ఆలోచించి “సరే సార్‌ రాస్తాను. కాని వేణు గురించి వ్యక్తిగతంగా రాయను. కాని పదవీ విరమణ ప్రాముఖ్యత గురించి నా అభిప్రాయాలు రాస్తాను. మీకు నచ్చితే వేసుకోండి ఒక వేళ వేసుకోకపోయినా నేనేం బాధపడను” అని నిర్మొహమాటంగా చెప్పాడు.

“సరే పంపించండి” అన్నాడు ఆయన.

వారం రోజుల ముందే రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌ ఇన్విటేషన్‌ కార్డు పోస్టులో ఇంటికి వచ్చింది. అది చాలా అట్టహాసంగా, భారీగా ఉంది. వక్తల పేర్లు ఒక పాతిక వరకూ ఉన్నాయి. అందులో కొందరు రాజకీయ నాయకులు. ఆ కార్డు క్రింద ‘ఆకృతి’ సంస్థ సౌజన్యంతో అని ఉంది.

రెండు రోజుల ముందే వేణు ఫోను “తప్పక రావాలి స్వామీ” అని.

మర్యాదకు, ముక్తసరిగా సరే అన్నాడు కాని వెళ్లవద్దని మనసులో నిశ్చయించుకున్నాడు.

గమనించిన ఆంజల్య గట్టిగా క్లాసు తీసుకుంది:

“ఆయన అభిప్రాయాలు ఆయనవి. ఆయన సరదాలు ఆయనవి. నీకు ఇష్టం ఉన్న లేకపోయినా స్నేహధర్మంగా మనం ముగ్గురం వెళ్లాలి” అన్నది.

విషయం రాజాకు కూడా తెలిసినట్టుంది.

“డాడీ మనం వేణూ మామ ఫంక్షన్‌ కు వెళ్లకపోతే నేను నీతో మాట్లాడను” అని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు.

మొండి మనిషి మెత్తపడ్డాడు. సరే అని ఆ ఉదయం ముగ్గురు నల్లగొండ వెళ్లారు.

నల్లగొండలో బస్సు దిగి, ఫంక్షన్‌ హాలు చేరుకునే సరికి ఏదో పెద్ద పార్టీ మహాసభలు జరుగుతున్నట్లు వాతావరణం వైభవంగా ఉంది. వేణు నిలువెత్తు కటౌటు బొమ్మ రంగులలో. దారి పొడుగునా శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు. ఎత్తైన వేదిక మీద 70 ఎం.ఎం. పెద్ద ఫ్లెక్లీ. అందులో భార్యాభర్తల జంట ఫోటోలు.

ఉదయం తొమ్మిది గంటలకే సభ ప్రారంభమయినట్లుంది ఘనమైన అల్పాహారంతో. శుభాకాంక్షలు, ఆశీస్సులు, దీవెనలు మైకులలో వర్షిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో దంపతులను జంటగా ఉన్నతాసనాలో కూచోబెట్టి శాలువాల సన్మానాలు. పనిలో పనిగా వేణు అమ్మకు కూడా ఒక చిరుసన్మానం.

స్వామి, ఆంజల్య, రాజా కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఏమైనా మాట్లాడమని వేణు బలవంతం చేసాడు. తప్పేటట్టు లేదని స్వామి మైకు దగ్గరికి వెళ్లి. ‘రిటైర్‌మెంటు తర్వాత వేణు, ఆయన శ్రీమతి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవితం కొనసాగాల’ని తన శుభాకాంక్షలు క్లుప్తంగా చెప్పాడు.

ఉద్యోగ సమాఖ్య, రచయితల సంస్థ, మేధావుల వేదిక, తెలంగాణా సాధన సంఘం చోటా, మోటా నాయకులు, అభిమానులు, విద్యార్థి విద్యార్థినులతో హాలు కిటకటలాడింది. ఉపన్యాసాల హోరు, సందేశాల జల్లులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం వేళ అందరికీ షడ్రసోపేత భోజనాలు పంక్తులు పంక్తులుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సన్నివేశమూ, నిరంతరాయంగా వీడియోలలో రికార్డింగులు, ఫోటోల సెషన్స్‌ ఆగకుండా కొనసాగుతున్నాయి.

సాయంత్రం నాలుగు నుండి అసలైన సన్మాన సభా సన్నివేశం ఒకరికే కాక దంపతులిద్దరికీ. నిలువెత్తు పూలదండలు, అక్షింతలు, దీవెనలు, స్తోత్రాలు జరిగాయి. దంపతుల ‘మళ్లీ పెళ్లి’ సీన్మా కనులపండువుగా కొనసాగింది. ఆ మొత్తం కార్యక్రమానికి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ ‘యాంకర్‌’ ప్రముఖ కవయిత్రి శ్రీమతి భవానీ భాయి. వేదికలపై వెలిగిపోయే అవకాశం ఏ మాత్రం ఆమె వదులుకోదు. స్వామిని చూసి “సార్‌ వచ్చే సంవత్సరం మీ రిటైర్‌మెంటు ఫంక్షన్‌ కూడా ఇట్లనే చాలా గ్రాండ్‌గ జరగాలె. ఆ భారమంతా నేను చూసుకుంట. నాకు వదిలేయండి అన్నది. “ఓ తప్పకుండా” అని హామీ ఇచ్చి ఆమె నుండి తప్పించుకున్నాడు స్వామి.

పెద్దలు, ప్రముఖులు, కవులు, కళాకారులు, రచయితల సమక్షంలో ఒక క్రొత్త కవిత్వ పుస్తకం, ఒకటి కాక రెండు సావనీర్ల ఆవిష్కరణ జరిగింది. ఒక సావనీరు ‘విజయమిత్ర’ తరపున. రెండవది తను చదువు చెప్పిన కాలేజీ విద్యార్థినుల తరపున.

సంజె-చీకట్లు సరిగ్గా కమ్ముకోకముందే, జిలిబిలితారలు ఆకసాన తళుకుబెళుకులతో కులకకముందే ఆ ఫంక్షన్‌ హాలు మూల గదిలో ‘కౌ’లు కలాపోసకుల గౌరవార్థ నిమిత్తమై భారీ ఎత్తున ఎత్తిపోతల కార్యక్రమాలు, గ్లాసుల గలలలూ, ధూమపాన భగభుగలూ ప్రారంభమైనాయి. ఆ రహస్య పాన మందిరం అవతల షామియానాలలో అన్ని రకాల మాంసాహార, శాఖాహార విందుభోజనాలూ ‘నభూతో న భవిష్యత్తు’గా ఆ చల్లని ఆకాశం పందిరి క్రింద అర్ధరాత్రి వరకూ కొనసాగినాయి.

వేణు బొటాబొటి ఆర్థిక పరిస్థితి స్వామికి బాగా తెలుసు. మరి ఇదంతా ఎట్లా సాధ్యమయ్యింది. ఏదైనా మహాత్మ్యం జరిగి ‘అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం’ దొరికిందా అని తిరుగుప్రయాణంలో స్వామి ఆలోచిస్తుంటే చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఆ రిటైర్‌మెంటు ఆహ్వాన పత్రం క్రింది ఒక మాట ‘ఆకృతి’ సంస్థ సౌజన్యంతో అన్న వాక్యం.

అద్గదీ ఆ అల్లావుద్దీన్‌ అద్భుత దీపం కొత్తపేరు ‘ఆకృతి’ సంస్థ.

“దోస్‌ దోస్త్‌ న రహా

ప్యార్‌ ప్యార్‌ న రహా

జిందగీ హమే తేరా

ఏత్‌బార్‌ నా రహా”

(సంగం సీన్మా 1964)

***

నిత్య జ్వరపీడితుడైన స్వామికి మళ్లీ పీడకలలు రావటం మొదలయినాయి. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు బొంబాయి మహానగరంలోని ‘తాజ్‌’ హోటల్‌పై దాడి కూడా ఒక ముఖ్య కారణమే.

2008 సం॥ నవంబరు నెలలో పదిమంది లష్కరేతోయబా ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని కరాచీ నుండి సముద్రమార్గం ద్వారా చీకటిరాత్రి రహస్యంగా బొంబాయి నగరంలోకి ప్రవేశించారు. వారికి ఉగ్రవాద శిక్షణ పాకిస్తాన్‌లోనే జరిగింది. నవంబరు 26 నుండి 29 వరకు ఆ మహానగరం వారి దారుణ మారణ కాండ అతలాకుతులం అయ్యింది. ‘తాజ్‌ హోటల్‌’తో పాటు నగరంలోని అనేక కీలకమైన ప్రాంతాలలో వీరి దాడులు బాంబు ప్రేలుళ్లు కొనసాగాయి.

ఈ దాడులలో 173 మంది చనిపోగా 308 మంది గాయపడినారు. దుండగులలో తొమ్మిది మంది పోలీసు కాల్పులలో చనిపోగా కసబ్‌ అనే యువఉగ్రవాది పోలీసులకు బందీఐ ఆ దాడుల నేపథ్యం అంతా వెల్లడిచేసాడు. అతనికి ఉరిశిక్ష విధించబడి అమలు జరిగింది.

అధ్యాయం-27: వేతన శర్మల లీలా విలాసాలు

ఒకరోజు స్వామి ఆఫీసులో పని చేసుకుంటుంటే ‘భవానీ’ ఆఘమేఘాల మీద గాలి దుమారంలా ప్రవేశించింది. ఎండలో పడి వచ్చిందేమో ఆమె ముఖం బాగా కందిపోయి ఉంది.

అటెండరు లక్ష్మి ముందు ఆమెకు శీతలజలోపచారాలు చేసి ఆ పిమ్మట గరం గరం చాయ్‌ తీసుకొచ్చింది.

“ఇప్పుడు చెప్పు భవానీ ఇంతకూ నీ రాకకు కారణం బెట్టిది” అని హాస్యమాడినాడు.

“సార్‌ మీ మజాకులు కాసేపు ప్రక్కన పెట్టండి. మన ఉద్యోగ సమాఖ్య నాయకుల నిర్వాకం మీకు తెలుసా?” అని ఆందోళనతో ప్రశ్నించింది.

“ఏం సంగతి భవానీ? నీవు చెప్పంది నాకు ఎట్ల తెలుస్తది” అని ప్రశ్నకు ప్రశ్న సంధించాడు.

“మీరు మన ఉద్యోగ సమాఖ్యకు ఉపాధ్యక్షులు కదా? మీకు తెల్వకుండనే ముఖ్య నిర్ణయాలు అన్నీ జరుగుతున్నయా?”

“ఏం నిర్ణయాలు?”

“అదే ప్రభుత్వం వారిచ్చిన గోపన్‌పల్లి ల్యాండులో ప్లాట్ల సంగతి?”

“పేపరు వార్త మాత్రం తెలుసు. ఈ తెలంగాణా ఉద్యమ సందర్భాన ఉద్యోగులు, ఉద్యమంలో చేరకుండా వారిని ‘కుషామత్‌’ చేసి మభ్యపెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించబడిన టి.ఎన్‌.జివో. సంస్థకు హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వెనుక ఉన్న గోపన్‌పల్లి గ్రామంలో కొన్ని ఎకరాల భూమిని నామమాత్రం ధరకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చిందని ఆ స్థలాలకు మన ఉద్యోగ సమాఖ్యకు ఏమీ సంబంధం? మనం ప్రస్తుతం సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నం కాబట్టి ఆ ఇళ్ల స్థలాలతో మనకేం సంబంధం అని నేను మౌనంగా ఉన్న” అని ఆమెకు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. ఎందుకంటే ఉద్యోగ సమాఖ్యలో ఆమె మహిళా విభాగానికి అధ్యక్షురాలు.

“అయ్యో! అయ్యో! మీరింత నిర్లిప్తంగా, అంటీ అంటకుండా, ముట్టీ ముట్టకుండా ఉంటే ఎట్ల సార్‌. ఇట్లుంటే మీరేం నాయకులు? మీరేం ఉపాధ్యక్షులు? మీ మెత్తదనాన్ని అలుసుగా తీసుకుని తెరవెనుక వారాడుతున్న నాటకాలు మీకు ఏమీ తెల్వదన్న సంగతి ఇప్పుడు నాకు ఖుల్లంఖుల్లాగ తెలిసింది” అని అంగలార్చటం శూరూ చేసింది.

చాలాకాలం నుండి ఆమె స్వభావం గురించి, ఆమె ‘నస’ గురించి స్వామికి చాలా బాగా తెలుసు. కాని ఈ ‘భూభాగోతం’ ముచ్చటేందో వివరంగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో:

“తెర వెనుక ఎవరు ఏమి నాటకాలు ఆడుతున్నారో చెప్పరాదా భవానీ?” అని మెత్తటి స్వరంతో ప్రశ్నించాడు.

అప్పుడామె గాయపడిన ఆడపులిలా, తన వంతు వాటా తనకు దక్కలేదన్న అక్కసుతో, ఉక్రోశంతో పూర్తిగా బయటపడిరది తప్ప నైతికంగా అది తప్పుడు ధోరణి అని ఆమె కలలో కూడా అనుకోదు. ఆమె స్థాయి, సంస్కారం అలాంటిది.

“సార్‌. ఆ భూములు అగ్గువ, సగ్గువ, నామ్‌ కే వాస్తే ధరకు ప్రభుత్వం అధికారికంగా గుర్తించబడిన టి.ఎన్‌.జి.వోస్‌. సంస్థకు ఇచ్చింది. దాని నాయకులు ఆ భూమిని ప్లాట్లుగా విభజించి ఎక్కువ ధర నిర్ణయించి లాటరీ పద్దతి ద్వారా ఉద్యోగులకు అలాట్‌ చేస్తున్నారు. అదొక పెద్ద కుంభకోణం, వేలు, లక్షలు ఆ సంఘం నాయకుల జేబుల్లోకి పోతున్నయి. అంతా ‘గోల్‌మాల్‌ గోవిందం’ వ్యవహారం. ముందు ముందు ఆ భూముల ధర లక్షలు, లక్షలుగా పెరుగుతుంది అక్కడ మల్టీనేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డ్రిస్టిక్‌ రాబోతున్నాయి. అక్కడ భూమి బంగారం కన్న విలువైనది”. అని ఆగి దమ్ము తీసుకుని మంచినీళ్లు తెప్పించండి అని ఆయాసపడుతూ ఆగింది.

లక్ష్మితో క్రింద క్యాంటిన్‌, నుండి చల్లటి కూల్‌డ్రింకులు తెప్పించాడు. సమాచార సేకరణ చాలా ముఖ్యం అన్న ఆలోచనతో.

పాపం కూల్‌డ్రింకు కూడా ఆమెను శాంతింపచేయలేదు. ఆమె రగులుతున్న అగ్నిపర్వతంలా లోపల కుతకుతా ఉడుకుతున్న లావాలా ఉంది పొగలు కక్కుతూ బుసలు కొడుతూ:

“సార్‌ మన వాళ్లు ముగ్గురూ ‘మాయల మరాఠీలు’ టిన్‌జీవో నాయకుల్ని రహస్యంగా తెరవెనుక కలుసుకున్నారు. మాటామంతి జరిగింది”.

“మేమెప్పుడు మీకు పోటీ సంస్థ కాదు. మిమ్ములను ఎప్పుడూ విమర్శించలేదు. తెలంగాణా అన్ని జిల్లాలో మాకు శాఖలూ, సభ్యులు ఉన్నారు. మాది రిజిస్టర్డ్‌ సంస్థ కూడా అని సోది పురాణం ప్రారంభించారు. దానితో ఆ సంఘ నాయకులకు చిర్రెత్తింది.

“ఇంతకూ మీకు ఏం కావాలి?” అని అసహనంగా సూటిగా అడిగాడు ఆ సంస్థ అధ్యక్షుడు.

అప్పుడు మహాకాయుల ముందు మరుగుజ్జులా ఆ ముగ్గురు నీళ్లు నములుతూ నంగి నంగిగా “మేమూ మీ తోటి చిరుద్యోగులమే మాకు ప్రత్యేకంగా లాటరీ పద్దతి ద్వారా కాక డైరెక్టుగా అదే ప్రభుత్వం ధరకు కొన్ని ప్లాట్లు ఇవ్వాలి” అన్నారు.

అప్పుడా సంఘ నాయకులు పరిహాసంగా వంకర నవ్వు నవ్వి “ఎన్ని కావాలేమిటి?” అన్నారు.

ఒక ఇరవై చాలు అని ‘సంతలబేరం’ శురూ చేసారు. ముగ్గురు చోటా నాయకులు.

పాపం వాళ్లు ఆ వాక్యం పూర్తి చేయకముందే “చివరికి ఐదు ఊర్లు చాలు” అని పాండవులు అడగగా గొల్లు గొల్లున నవ్వి సూదిమొనంత నేల కూడా ఇవ్వమన్న కౌరవసభలా ఆ అధికార సంఘం నాయకులు పక పకమని నవ్వి చాలెంజ్‌గా..

“ఇవ్వకపోతే.. ఏం పీక్కుంటావ్‌ పీక్కోపో..” అన్నట్లు మాట్లాడినాడు ఆ బడా అధ్యక్షుడు. దాంతో ముగ్గురిలో ఇద్దరికి ముచ్చెమటలు కమ్మి నక్కిళ్లు కూలబడి, మూసుకపోయాయి. దిక్కు తోచక దిక్కులు చూసారు.

అప్పుడు సమాఖ్య అధ్యక్షుడు పాండురంగ చాలా ప్రశాంతంగా:

“మీరు చేస్తున్న అవకతవకలూ, లావాదేవీల లిస్టు వివరాలతో సహా మాదగ్గరుంది. అది కూడా మీ లోపల ఉన్న వాళ్లే మాకు అందిచ్చారు”.

“అయితే” అన్నారు వాళ్లు కోరస్‌గా.

“మా దగ్గర మూడు దశల కార్యక్రమం ఉంది ఒకటి ప్రెస్‌మీట్‌, రేపు కాక ఎల్లుండి. అన్ని దినపత్రికలలో మీ ‘స్కాం’ ఇవతలికి వస్తది. రెండు దినపత్రికలలో వచ్చిన తెల్లారే ప్రభుత్వాన్ని అంటే డైరక్టుగా ముఖ్యమంత్రిని కలవటం. మూడు: అక్కడ సరైన ప్రతిస్పందన రాకపోతే హైకోర్టుకు వెళ్లి ‘స్టే’ అని ముగించాడు.

క్రింద పునాదులు కదులుతున్నట్లు గమనించిన ఆ పాత, వృద్ద నాయకుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి:

“చూడుండ్రి భై మనమంతా అన్నదమ్ములం. ‘ఖాలీ పీలి’ మనలో మనకు తక్‌రార్‌లు ఎందుకు? దాంతో ఏం వచ్చేది లేదు పొయ్యేది లేదు. కాని మీకు ఇరవై ఇవ్వటం జరిగేపని కాదు. బేరం తెగిపోకుండా బేరం చెయ్యాలె” అని చిన్నతమ్ముళ్లకు హితవు చెప్తున్నట్లు ఆ పెద్దన్న హితవు చెప్పాడు మనసు లోలోపల పండ్లు పటపట నూరుకుంట.

“సరే అన్నా. రెండు కట్‌ చేసి పద్దెనిమిది చేస్కో” అన్నాడు కొత్త తమ్ముడు.

“బిల్కుల్‌ నా ముమ్‌కిన్‌, అసాధ్యం అని ప్రపోజల్‌ను వీటో చేసాడు పెద్దన్న.

తాడు తెగకుండా అటు ఇటూ గుంజి గుంజి చివరికి ఉభయ పక్షాలు పన్నెండుకు వచ్చారు. అందులో ఏడు మూడు వందల గజాలు మిగిలిన ఐదు రెండు వందల గజాల ప్లాట్లు.

చివరికి ముగ్గురు క్రొత్త తమ్ముళ్లు ‘చచ్చినోని పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు’ వొప్పుకుని రాయబారం సఫలమైనందుకు చేతులు కలిపి “అయిబలయి”లు చేసుకుని తెగ సంబరపడ్డారు.

అదీ సంగతి అని రహస్యం కక్కేసిన లావా కొంచెం చల్లబడింది.

స్వామికి మనస్సు కలుక్కుమన్నది. తనకు మాట మాత్రం చెప్పకుండా వ్యవహారం నడిపినందుకు. కాని తన అసంతృప్తిని తెలియనీయకుండా:

“ఈ సంగతులు నీకెట్లా తెలిసినాయి భవానీ” అని ఆమె మీద కుండెడు సానుభూతి కురిపిస్తూ దయగా అడిగాడు.

అప్పుడు గొంతు చాలా చిన్నగా తగ్గించి చెవిలో రహస్యం చెప్పినట్లు “నాపేరు ఎవరితో చెప్పవద్దు సార్‌ రంగా..” అని ఆగిపోయింది. అర్దాంతరంగా

రంగా-భవానీల గట్టి దోస్తానా గురించి స్వామికి చాలాకాలం నుంచి చాలా బాగా తెలుసు.

“సరే మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు” అని నిస్సహాయంగానే అడిగాడు.

“వాళ్లతో మాట్లాడి మహిళా విభాగం అధ్యక్షురాలిగా నాకు కూడా ఒక ప్లాటు ఇప్పించాలె సార్‌” అని దీనంగా కుంతి కృష్ణుడిని అడిగినట్లు మొర పెట్టుకుంది.

“ప్రయత్నిస్తా” అన్నాడు.

“ప్రయత్నం కాదు సార్‌. మీరు గట్టిగా అడగాలె. పోనీ మహిళా విభాగం కోటా క్రింద కాకపోయినా, మీ అందరి మధ్య నేనొక్క దాన్నే ఆడపిల్లను కావున ‘ఆడపడుచు’ కట్నం క్రిందనైనా ఇప్పించండి” అని ఏ సెంటిమెంట్లూ నమ్మని స్వామి సెంటిమెంటుపై సెంటిమెంటల్‌గా దెబ్బ కొట్టాలని ఆమె ప్రయత్నించింది.

స్వామి మనోచక్షువులకు అప్పుడామె చాలా లేకిగా, అసహ్యంగా కక్కుర్తి మనిషిలా కనిపించింది.

“సరే నేను ప్రయత్నిస్తా అన్నాను కదా” అని తప్పుకున్నాడు. ఆ చతురనారి సెలవు తీసుకుని అక్కడ నుండి నిష్క్రమించింది.

తుఫాను వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఏర్పడే నిశ్శబ్దం ఆ గదిలో ఆవరించింది. స్వామి కుర్చీకి జారగిలబడి నిష్క్రమించిన ఆమె పూర్వాశ్రమ ఆలోచనలలో మునిగిపోయాడు.

అసలు ఆ భవానీ కథాక్రమంబెట్టిదనిన:

అందరూ ఆమెను “భవానీ”అనే పిలుస్తారు. ఎక్కడొ నల్లగొండ జిల్లాలో ఆమెదొక చిన్న పల్లెటూరు. పిన్న వయసులనే ఆమె పెద్ద పెద్ద పంచరంగుల కలలను కనులు తెరచుకునే పగటి పూట కనటం ప్రారంభించింది. ఆ కలలన్నీ డబ్బూ, కీర్తి, సమాజంలో స్థాయి, పై అంతస్తు చుట్టూ గూడు విడిచిన గువ్వపిట్టలా పరిభ్రమించేవి. అయితే వాటిని సాధించటానికి ‘జ్ఞానమార్గమూ’, ‘కర్మమార్గమూ’ కాక అడ్డదారులలో అందలమెక్కటం ఒక్కటే సులభమార్గం అని గ్రహించి ఆ అడ్డమైన దారులకు తన రంగూ, పొంగూ, ఒడ్డు, పొడుగు, పైలా పచ్చీసు వయస్సే తన పెట్టుబడులని ఆమెకు త్వరలోనే సులభంగా జ్ఞానోదయం కల్గింది. ఈ ‘చార్‌దిన్‌ కీ చాందినీ’ ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని నిర్ణయించుకుంది.

ఒకప్పుడు సర్కారు వారు మారు మూల కుగ్రామాలలో ‘ఏకోపాధ్యాయ తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలలను’ విస్తృతంగా స్థాపించారు. ఆ ఉపాధ్యాయులంతా ఇంటర్‌ పాస్‌ అయిన అన్‌ట్రేయిన్డ్‌ సిబ్బంది. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా వారి నియామకం జరిగేది. అందులో కూడా స్త్రీ అభ్యర్థులకు 33% రిజర్వేషన్‌ కావున భవానీ ఆమె భర్తా ఇద్దరూ సింగిల్‌ స్కూలు టీచర్లుగా వేరు వేరు కుగ్రామాలలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు.

పంతులమ్మగా ఆమె ఉద్యోగం కూడా చాలా సులువైనదే. అఆలు, ఎబిసిడీలు, పదో తరగతి ఎక్కం వరకూ ఎక్కాలు చెపుతూనే ఆ పగటి పూట తన భవిష్యత్‌ చిత్రపటాన్ని రంగు రంగుల కుంచెలతో అలంకరిస్తూ ఉండేది.

స్వభావాల్లో భార్యాభర్తలిద్దరూ తూర్పు పడమరలు. అతనొక మజ్జు మనిషి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే బాపతు. మనిషి మందమే. ఆలోచనలూ పనులూ కూడా మందమే. అతనికి ఆ ఇంటర్‌ పాస్‌ఐ సింగిల్‌ స్కూలు టీచర్‌ కావటమే ఎవరెస్టు శిఖరం ఎక్కి విజయం సాధించినంత పని అయ్యింది. వాళ్లకు ఇద్దరు చిన్న పిల్లలు.

‘పవర్‌ టవర్‌’ భవానీ జిల్లా విద్యాశాఖాధికారులతో రాసుక, పూసుక తిరగటం మొదలయ్యి, ప్రజా సంబంధాలలో ఆరితేరి జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఇద్దరి బదిలీలను సాధించుకుంది. ఏడేడు లోకాలను జయించే దిగ్విజయ యాత్రలో అది ఆమెకు తొలి మజిలీ. పిల్లల ఆలనా పాలనా పోషణా తన రాచకార్యాలకు అడ్డు అని భావించి వారిని అమ్మమ్మ వద్దకు తరలించి బంధాలు, బాధ్యతల నుండి విడుదల పొందింది. మందం మనిషి ప్లస్‌ పాదరసం ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ఐనారు.

ఆ రోజులలో నల్లగొండ పట్టణంలో విజయమిత్ర సాహిత్య, సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో విస్తృతంగా సాహిత్య సమావేశాలు, సభలు, కవిత్వ పఠనాలు జరుగుతుండేవి. నాటికి సూత్రధారి పాత్రధారి అన్నీ వేణు. ఒకటి, రెండు సభలు హాజరైనాక ‘కరిస్మా’ పెంచుకోవటానికి దగ్గరి దారులలో ‘అక్షరమార్గం’ కూడా ఒకటని అన్ని స్థాయిలలో వున్న ప్రముఖులతో పబ్లిక్‌ రిలేషన్స్‌ పెంచుకోవచ్చని గ్రహించి వేణుతో పరిచయం పెంచుకొని ‘విజయమిత్ర’లో చేరిపోయింది.

స్త్రీలను గౌరవించే వేణు ఆమె ఎదుగుదలకు చేయూతను అందించాడు. అనతికాలంలోనే ఆమె తన ‘జబ్బబలం’తో పుంఖాను పుంఖాలుగా తెల్లకాగితాలను నల్ల కాగితాలుగా ఖరాబు చేస్తూ కవిత్వాలను రాయటం ప్రారంభించింది. రాత్రికి ఒక కవిత తెల్లారితే మరో కవిత ఆమె దినచర్యగా మారి వేణు ఇంటికి రాకపోకలు మొదలుపెట్టింది. తొలి దశలో ఎవరైనా ఇట్లాంటి అపరిపక్వ కవితలు రాస్తారు కావున వేణు ఆమెను ప్రోత్సాహ పరచాలన్న సదుద్దేశ్యంతో “ఆహా ఓహో, బ్రహ్మండం” అన్నాడు. అనటమే కాక అనేక చోట్ల వేదికలను ఎక్కించాడు. ఆమె తన కల కూజిత కోయిల కంఠంతో ఆ చిట్టి పొట్టి కవితలను పఠించేది. సాదాసీదా శ్రోతలందరూ “కవయిత్రీ కవయిత్రీ” అని పొగడుతూ వుంటే ఆమె “అహం” చల్లారుతుండేది.

కాని ఆమెకు ఆకాశమే సరిహద్దు. తన మహాప్రస్థానంలో కవిత్వం ఒక మొదటి మెట్టు మాత్రమే. ఆమె ‘ఆంబిషన్‌’ వేణు గమనించలేకపోయాడు.

ఒక సెలవురోజు వేణు ఇంటిమీదికి హమ్లా చేసింది. కవిత్వాలు అనబడే కాగితాల కట్టతో.

ఆ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ గారు ఇంటరమ్మ రాసిన కవిత్వాలు ఇంటర్‌ లెవల్లో కాక ఆరవతరగతి, ఏడవతరగతి పిల్లలు రాసే వచన కవితల స్థాయిలో ఉండటం చూసి ఖిన్నుడై తొలి దశలో రాసిన కవిత్వాలన్నీ ‘బారా ఖూన్‌గా’ భావించి ఓపికగా అన్నింటినీ సరిదిద్ది, తిరగరాసి బోలెడన్ని సలహాలతో ఆమెకు తిరిగి ఇచ్చేశాడు.

“సార్‌ ఇవన్నీ ఒక పుస్తకంగా వేద్దామనుకుంటున్న” అని ముంత దాచకుండా చల్లకోసం వచ్చిన సంగతి చల్లగా చెప్పింది.

సరే పాపం ఆడపిల్ల ‘అచ్చు ముచ్చట’ పడుతుందని భావించి:

‘పుస్తకం ఇపుడే వద్దమ్మా ముందు కొన్ని పత్రికలలోనైనా ప్రింట్‌ అయ్యాక నలుగురిలో కొంచెం పేరు వచ్చాక అప్పుడు పుస్తకం వేసే బాగుంటదని’ సలహా చెప్పాడు.

కాని ఆ లేడికి లేచిందే పరుగన్నట్లు ‘తాళలేను, ఇగ ఒపలేను’ మాదిరిగా “ముందుకొన్ని సెలెక్టు చేయండి సార్‌ కనీసం డి.టి.పి. చేయిద్దాం” అని పట్టుబట్టింది.

ఇక తప్పదని అనుకుని ఒక ఇరవై ఇరవై అయిదు కవితా ఖండికలను సెలెక్టు చేసాడు.

అవన్నీ ‘బుడ్డగోచీ’ సైజు కవితలు. పేజీకి ఒకటి చొప్పున ఇరవై అయిదు పేజీల కవితలు. ఆ పుస్తకం చాలా సన్నగా, బక్కగా ఉండటం చూసి ఆమెకు తృప్తి కలగక సారు తిరగరాసిన మరో పదింటిని వాటికి జత కలిపింది.

వారం తిరక్కముందే ఆ చిరుపొత్తాన్ని సారు వారి సమక్షంలో సమర్పించి సార్‌ మీరు దీనికి పీఠిక రాయాలి అన్నది. ‘మజ్బూరి’తో కాదనలేక సరే అని అన్యమనస్కంగా అన్నాడు.

కనీసం నాల్గు పేజీలన్న మీ పీఠిక ఉండాలి సార్‌ అని గోముగా వేడుకుంది.

చారానా ముర్గీకో బారానా మసాలా అన్నట్లు. “ఆహా, ఓహో, విచిత్రం, బ్రహ్మండం అన్న విశేషణాలతో నాలుగు పేజీల ప్రశంసావాక్యాలు రాసాడు ఆ ‘సభా సామ్రాట్‌’.

తర్వాత మరో మూడు పేజీలు తన ముందు మాటతో నింపింది. తన చేతి చమురు వదలకుండా పుస్తకం రావాలని ఆలోచించి ఒక ‘బకరా’ను పట్టుకుంది. పాపం ఆ శాల్తి బోషాణంలో కాసులు మూలుగుతున్నాయి కాని కీర్తి ప్రతిష్ఠలు లేవు అని చాలాకాలం నుండి బాధపడుతున్నాడు. ఆ కీర్తి కండూతిరాయుడ్ని కలిసి గ్రంధం నీకే అంకితం అని, పుస్తకావిష్కరణకు నీవే అధ్యక్షుడివనీ ఉబ్బించింది. అన్ని దినపత్రికలలో నీ పేరు, ఫోటో కూడా వస్తదని కూడా ఆశ పెట్టి ఒప్పించి మెప్పించి పైసా ఖర్చు చేయకుండా పుస్తకానికి పురుడు పోయించింది. పుస్తకం అట్ట వెనుక చిరుచిరుదరహాసాలతో తన రంగుల ఫోటో ప్రత్యేక శ్రద్దతో వేయించుకుంది. అట్లా వెయ్యి కాపీలు ముఫత్‌ల ముద్రించబడినాయి.

జన్మించిన తొలిచూరు బిడ్డకు పుస్తకావిష్కరణ అను ‘బారసాల’ ఒక రివాజ్‌గ జరిపించాలి కావున మళ్లీ విజయమిత్ర సంస్థ, వేణు సారు ఆదుకునే ఆపద్బంధువుల్లా కనిపించారు. మళ్లీ షరా మామూలే.

జిల్లా ముఖ్యకేంద్రం నల్లగొండలో సభ పెద్ద ఎత్తున విజయవంతంగా జరిగింది. వేణుకున్న సత్సంబంధాలతో అన్ని తెలుగు పత్రికల జిల్లా ఎడిషన్‌లలో పుస్తకావిష్కరణ వార్తలు, ఫోటోలు ప్రచురింపబడ్డాయి. ‘నల్లగొండ’ నీలాకాశంలో మరో కవయిత్రి నెలవంకలా ఉద్భవించిందని, దినపత్రికలలో వార్తలు వచ్చాయి.

నూతన కవయిత్రి భవానీ ఆ దినపత్రికల కటింగులతో, ఆవిష్కరణ ఫోటోలతో ఒక చక్కటి ఆల్బమ్‌ తయారు చేసుకుంది. అల్బం మరియు కవితల పుస్తకం తాను భవిష్యత్తులో ‘ఆకాశానికి వేయబోయే నిచ్చెనలా’ ఉపయోగపడతాయని ఆమెకు స్పష్టమైన దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది.

“మన మంచితనం ఏ చెడుకూ మంచి చేయకూడదు. అట్లాగే ఏ మంచికి హాని చేయకూడదు” అన్న సత్యాన్ని విస్మరించిన వేణు ఆమెను కవయిత్రిగా లోకానికి పరిచయం చేయటానికి సహకరించాడు.

తర్వాత కాలంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పుంజుకుంది. తెలంగాణా సాధనకు ఒక రాజకీయ పార్టీనే గాక, రచయితల సంస్థ, ఉద్యోగుల సమాఖ్య, మేధావుల వేదిక లాంటి అనేక సంస్థలు ఆవిర్భవించాయి. అదే కాలంలో ఉద్యమాన్ని, పార్టీని, ఆ ప్రజా సంఘాలను ఉపయోగించుకుని వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకునే అవకాశవాదులు వాటిల్లో దూరటం ప్రారంభించారు.

వేణు సహాయ సహకారాలతో భవానీ కవయిత్రిగా మాత్రమే మిగిలిపోకుండా అన్ని తెలంగాణా ఉద్యమ సంస్థలలోనూ ప్రవేశించింది. చక్రం తిప్పటం మొదలుపెట్టింది. అయితే ఎదగటానికి “జిల్లా” ఇరుకిరుకుగా ఉంటుందని కోటలో పాగా వేయటానికి ప్లాను వేసింది. హైద్రాబాద్‌ నగరమొక్కటే తనకు సరైన వేదికని భావించింది. మొదటి మెట్టుగా ఉద్యోగ సమాఖ్యలో చేరి అనతికాలంలోనే మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా మారింది. ఆ హోదాతో ఒక విజిటింగ్‌ కార్డు ప్రింట్‌ చేయించుకుని దానిని ‘ట్రంప్‌కార్డు’గా ఉపయోగించుకుని తన ప్రజా సంబంధాల కళాకౌశలంతో హయాత్‌నగర్‌ సమీపంలో ఉన్న గ్రామానికి తమిద్దరి బదిలీలను చేయించుకుంది. కాని నివాసం మాత్రం హైద్రాబాదు నగరం.

చిటికెన వేలు. అందిస్తే చాలు అంతటా అల్లుకపోయే చాకచక్యం ఆమెకుంది.

హైద్రాబాద్‌ రాగానే ఆమె కవిత్వానికి వీడ్కోలు పలికింది. టాటా చెప్పింది. ఇక మరే కవిత్వమూ గిలకలేదు. ఎక్కడికి వెళ్లినా చంకబ్యాగులో పది కవిత్వ పుస్తకాలను పట్టుకెళ్లి అందరికీ ప్రసాదంలా పంచిపెట్టి ఆల్బం ఫోటోలు చూపించి చివరికి అందరి చేతా ప్రతి సభలోనూ “భవానీ కవయిత్రీ గారూ, భవానీ రచయిత్రీ గారూ” అనిపించుకుంటూ తనకు లేని ‘అదనపు విలువ’ను తనకు తానే నిర్మించుకుంది ఆ ఏకోపాధ్యాయ పాఠశాల పంతులమ్మ.

‘జై భవానీ’

మిగిలిన ఆమె లీలా విలాసాలు, వైకుంఠపాళీ ఆటలో నిచ్చెన ఎక్కే ప్రయత్నాలు, రాజకీయ చదరంగంలో పాచికలాటలు ఉత్తరోత్తరా తేటతెల్లంగా వెల్లడి అయినాయి.

***

భవానీ వెళ్లిపోయిన తర్వాత ఆ తెల్లారి స్వామి పాండురంగంకు ఫోన్‌ చేసి “మనిద్దరమే ఒకసారి కలుసుకోవాలి” అన్నాడు.

“తప్పకుండా అన్నా. ఈ సాయంత్రం తాజ్‌మహల్‌ హోటల్‌కు రానా” అన్నాడు.

సాయంత్రం ఆరింటికి అన్నాడు స్వామి.

అనుకున్నట్లు ఇద్దరూ కలిసి ఒక మూలలో కుచున్నారు.

“నాకు చెప్పకుండా, కనీసం సలహానైనా తీసుకోకుండా టిఎన్‌జీవోస్‌ వారిని కలిసి ప్లాట్లు ఎందుకు తీసుకున్నారు పాండు”. అని నెమ్మదిగానే అడిగాడు.

“సారీ అన్నా. మీరు తప్పకుండా వొద్దంటారని మాకు తెలిసే భయపడి చెప్పలేదు. తీసుకున్న తర్వాత చెప్పొచ్చు అని చారి, రెడ్డిలు కూడా అన్నారు.”

స్వామి చాలా సేపు మౌనంగా కూచుని కాఫీ చప్పరించసాగాడు.

“అన్నా మేమంతా చిన్న చిన్న ఉర్లల్ల నుండి వచ్చాం. ఈ మహానగరంల మాకు ఒక గజం జాగాలేదు. స్వంత ఇండ్లూ లేవు. ఒక ప్లాటు ఉంటే ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చని ఆశపడ్డాం”.

స్వామి తన మౌనాన్ని అట్లనే కొనసాగించాడు.

అప్పుడు పాండురంగం నసుగుతూ “అన్నా నువ్వేమనుకోకపోతే ఒక ప్లాటు మీకు ఇవ్వమంటారా” అన్నాడు.

“ఎన్ని గజాల ప్లాటూ” అని నోరువిప్పాడు స్వామి.

“ఐదు వందల గజాలు అయిపోయినవన్నా మూడువందల గజాలు ఒకటి అడ్జస్టు చేస్తా” అన్నాడు.

“అంత చిన్న ప్లాటు నాకు సరిపోదు”

“పోనీ మూడువందల గజాల ప్లాటు రెండూ పక్క పక్కనే ఇస్తాం. అప్పుడు మా అందరి కన్నా నీ భూమే పెద్దదవుతుంది”.

“అది కూడా నాకు సరిపోదు” అన్నాడు.

అప్పుడు పాండురంగం తికమకగా ముఖం పెట్టి “నాకు అర్థం కాలేదన్నా” అన్నాడు.

“నాకు పది జిల్లాల ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇస్తే, వస్తే అప్పుడు సరిపోతది” అని చిరునవ్వు నవ్వాడు నక్సల్‌బరీ తరానికి చెందిన స్వామి.

ఇప్పటి అవకాశవాద యువతరానికి చెందిన పాండురంగం ముఖం చిన్నబుచ్చుకున్నాడు.

“చూడు పాండు నాకొక చిన్న ఇల్లు ఉంది. నా ప్రాణానికి అదే నాకు ఫలక్‌నుమా ప్యాలెస్‌తో సమానం” ‘సింపుల్‌ లీవింగ్‌, హై థింకింగ్‌’ అన్నదే నా ఫిలాసఫీ.

తల దించుకుని వింటున్నాడు పాండురంగం.

“అన్నట్లు మరో మాట.”

“ఏందన్నా?”

“నా కోసం ఎక్కడో అక్కడ ఇప్పటికే ఏదో అతి చిన్న స్థలం ఉండే ఉంటుంది”

‘అదేందన్న” అని అయోమయం జగన్నాధంలా ముఖం పెట్టాడు ఆ తమ్ముడు.

“పురానాపూల్‌ స్మశానంలో ఆరు గజాల స్థలం ఉంటుంది కదా” అన్నాడు స్వామి.

సిగ్గుతో చితికిపోయాడు పాపం ఆ మానవుడు.

అతడ్ని ఓదార్చి మళ్లీ మాటలలో పెట్టాలని “పాండు నాకు ఆకలవుతుంది. ఏమైనా తినిపిస్తవా” అన్నాడు.

“అయ్యో అప్పుడే ముందే చెప్పొద్దా అన్నా” అని ఆలూ సమోసాలకు ఆర్డర్‌ ఇచ్చాడు. తర్వాత మళ్లీ రెండు కాఫీలు అని సర్వర్‌కు చెప్పాడు.

తిన్న తర్వాత కాఫీలు తాగుతున్నపుడు

“సరే పాండూ అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం. పాపం ఆ భవానీకి కూడా ఒక ప్లాటు ఇవ్వకపోయారా?” అన్నాడు.

“ఆ కిలాడీ నీ దగ్గరికి వచ్చి మొత్తుకుంటదని నాకు తెలుసన్నా”.

“ఎంతైనా మన మహిళా విభాగానికి అధ్యక్షురాలు కదా?”

“ఏం అధ్యక్షురాలన్నా? ఇన్నేండ్ల నుండి అది పట్టుమని పదిమంది మహిళా ఉద్యోగులను మన సంఘంలో చేర్పించిందా?” అన్నాడు కోపంగా.

“అయ్యో ఆ సంగతి నా దృష్టికి రాలేదు”

“ఎందుకు చేర్పించలేదో తెలుసా? ‘రెండు కొప్పులు ఒక కప్పు క్రింద ఇమడవు’ అన్న సామెత నిజమే. పదిమందిని మన సమాఖ్యలో చేర్పిస్తే అండ్ల నుండి ఎవరో ఒకరు ముందుకొచ్చి తనకు పోటీగా మారుతారని దాని భయం.”

స్వామి ఆశ్చర్యంగా వింటున్నాడు. “ఏ ఒక్కరినీ చేర్పించకున్న, సిగ్గూ ఎగ్గూ లేకుండా విజటింగ్‌ కార్డు కొట్టించుకుని తన పరపతి, పబ్లిక్‌ రిలేషన్స్‌ పెంచుకోవటమే గాక మన చారితో పాటు పైరవీలకు, పెత్తనాలకూ ప్రతి చోటికీ పోతుంది. నా చెవిలో నస పెట్టి పెట్టి మనోడే నాతో ఆమెను మహిళా విభాగం అధ్యక్ష పదవిలో నియమించుకున్నాడు. ఇప్పుడామె వాని నెత్తిమీదికి ఎక్కి కూచుంది. పెద్ద తంపులమారిగా తయారయ్యింది. ఇక్కడి సంగతులు అక్కడా అక్కడి సంగతులు ఇక్కడా చెప్పి మా ముగ్గురి మధ్య లేని పోని మనస్పర్థలు సృష్టిస్తుంది.”

“మరి ఈ సంగతులన్నీ నాకు ముందే ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పలేదు?”

“ఏం చెప్పాలన్నా! మన ఇజ్జత్‌ మనమే తీసుకున్నట్లయితదని నోర్మూసుకుని పనిచేస్తున్న” అన్నాడు బాధపడుకుంట.

స్వామి కూడా నిజంగానే బాధపడ్డాడు.

“సరే అన్న. ఇగ అసలు సంగతి చెప్తా విను. దాని హర్కతులు చూసి దానికి ఒక సెంటు జాగా కూడా ఇవ్వొద్దని నేను ముందే నిర్ణయించుకున్న. కాని మనోడు చెవిల జోర్రీగోలె నన్ను సతాయిస్తుంటే వాని మాట కూడా వినాలన్న మంచి మనసుతో ఆఖరికి ఒక మూడువందల గజాల ప్లాటు ఇద్దామని ఒప్పుకున్న.

దాంతో మనోడు సంకలు ఎగేసుకుంట దానింటికి పోయి గుడ్‌న్యూస్‌ అంటూ సంగతి చెప్పిండట. అది మాత్రం భీష్మించుకుని ఇంత పెద్ద కవయిత్రిని, మహిళా విభాగం అధ్యక్షురాలిని మూడువందల గజాల ప్లాటుతో నన్నవమానిస్తారా అని ఉల్టా పల్టా వాయించిందట. దానికి మా ముగ్గురితో సమానంగా ఐదువందల గజాల ప్లాటు కావాలట. ఇప్పుడైతే దానికి ఒక గజం ముక్కా ఇవ్వను” అని ముగించాడు.

“అనవసరంగా ఇంకా కిరికిరీలు సృష్టిస్తదేమో” అని స్వామి తన అనుమానం వ్యక్తపరిచాడు.

“దాని ముఖం. అది మన సంఘంలో ఉంటే ఎంత? పోతే ఎంత? గుడ్డి కన్ను తెరిచినా ఒకటే, మూసినా ఒకటే” అని ఆమెను ఈసడించుకున్నాడు పాండురంగం.

కాని పాండురంగం అంచనా తప్పని ‘కాలం – తర్వాత కాలంలో’ నిరూపించింది.

***

కాల వాహిని అలల వాలున కాల చక్రం పరిభ్రమిస్తుండగానే 2009వ సంవత్సరం వచ్చింది.

ఆ సంవత్సరం స్వామి వ్యక్తిగత జీవితంలోనూ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలోనూ అనేక కీలకమైన మార్పులు సంభవించాయి.

దోసిలిలో పట్టుకున్న నీళ్లు వ్రేళ్ల సందుల్లో నుండి జర్రున జారిపోయినట్లు స్వామి ఉద్యోగ జీవితం ముగింపుకు వచ్చింది. ఇంకో రెండు రోజుల్లో రిటైర్‌మెంటు అనగా మేనేజరు ఆఫీసులోని కొంతమంది సిబ్బంది అతని గదిలోకి వచ్చి:

“సార్‌ రేపు లేదు ఎల్లుండి మీ రిటైర్‌మెంటు దినం. మేమంతా మీకు చిరు సన్మానం టీ పార్టీ ఇద్దామనుకుంటున్నాం” అని సీతామహాలక్ష్మి ప్రపోజల్‌ పెట్టింది.

అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని స్వామి ముందే ప్రిపేర్‌ అయ్యి ఉన్నాడు.

ముందు అందర్నీ తన ఎదుట ఉన్న కుర్చీలలో కూచొమ్మన్నాడు. వాళ్లంతా కూర్చున్న తర్వాత:

“ఇనేళ్ల నుండి మీరు నన్ను గమనిస్తునే ఉన్నారు. నా స్వభావం ఏమిటో కూడా మీకు తెలుసు”.

“అందుకే కదా మేం సందేహిస్తూనే మీ దగ్గరికి వచ్చాం అన్నది” శారద.

“ఒక్కరం రావటానికి భయపడే ఇంతమందిమి కల్సి గుంపుగా వచ్చాం” అన్నది పద్మావతి.

“మిమ్మల్ని బాధపెట్టాలని కాదు కాని ఈ పద్దతులు, రిటైర్‌మెంటు డే పేరుతో పూలదండలు, శాలువాలు, సన్మానాలు నాకు చాలా మొగమాటంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా అందులో నాకు సంతోషం ఏమీ అనిపించదు. మీరందరూ మంచి మనసుతో నాకు ‘బెస్ట్‌ విషెస్‌’ చెబితే చాలు.”

“మీరిట్ల అంటరని మాకు ముందే తెలుసుసార్‌” అన్నాడు మధు.

“ఒక మాట నిజంగా చెపుతున్న. నా ఇన్నేళ్ల సర్వీసులో నేను సంతోషంగా ఉద్యోగం చేసింది ఈ ఒక్క మేనేజర్‌ ఆఫీసులోనే. ఇక్కడే చాలా ప్రశాంతంగా గడిచింది. దానికి కారణం మీలో ప్రతి ఒక్కరూ. పైన మన అధికారి గారు. అందుకే మీ అందరి సహకారానికి నా కృతజ్ఞతలు. మీ మంచితనాన్ని నేనెప్పుడు మరవను.”

అందరూ శుభాకాంక్షలు తెలిపి బాధగా వీడ్కోలు తీసుకున్నారు.

ఆ తెల్లారి బాసు కూడా అడిగారు. చాలా వినయంగా సిబ్బందికి చెప్పిన సంగతే ఆయనకూ చెప్పాడు. చివరికి ‘గుడ్‌లక్‌’ అని లేచి నిలబడి ఆయన షేక్‌హాండ్‌ ఇచ్చాడు.

రిటైర్‌మెంటు దినం నాడు ఆఫీసు సమయం ముగిసే పది నిముషాల ముందే ఎవరికీ కనబడకుండా నిశ్శబ్దంగా గది నుండి ఇవతలబడి లిఫ్ట్‌లో కాకుండా మూడు అంతస్తుల మెట్లు దిగి రోడ్డు మీదికి వచ్చి గట్టిగా గాలి పీల్చి ‘విశాల ప్రపంచంలోకి స్వేచ్ఛగా ప్రవేశించాడు’.

Live alone, leave alone మాట స్వామికి ఇష్టమైన మాట..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version