[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[రిటైరైన తర్వాత స్వేచ్చగా తనకు నచ్చినట్లు ముఖ్యంగా ‘ముసాఫిర్’లా ఘమక్కడ్‌లా జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు స్వామి. అందుకు అనుగుణంగా, ఉద్యమ సహచరుడు సతీష్‌తో కలసి స్కూటర్‌పై దండకారణ్య యాత్ర చేసి వస్తాడు. హైదరాబాద్ తిరిగి రాగానే ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా పది రోజులలో ఆ యాత్రానుభవాలను గ్రంధస్తం చేసి, ‘చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర’ అనే పేరుతో పుస్తకం ప్రచురిస్తాడు. తెలంగాణాలో విద్యార్థులు, యువకుల ఆత్మహత్యల పరంపర ప్రారంభమవుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేసరికి, ఉద్యమం తీవ్రమవుతుంది. విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలను అంగీకరించడు స్వామి. శ్రీకృష్ణ కమీషన్ వస్తుంది, వెళ్తుంది. ఆత్యహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఉద్యోగ విరమణ కాగానే, ఉద్యమ సంస్థలలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తాడు స్వామి. ఉద్యమం స్వార్థపరుల చేతుల్లోకి పోతుంది. ప్రత్యేక రాష్ట్రం వైతాళికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌గారు జూన్ 2011లో నిర్యాణం చెందారు. స్వామి సదాశివ గారితో తరచూ సమావేశమవుతూ, ఎన్నో విషయాలు అవగతం చేసుకుంటాడు. తెలంగాణాలో బ్రహ్మాండంగా సాంస్కృతిక విప్లవం జరుగుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-31: ఆళ్వారుస్వామి అడుగుజాడలలో..
చంద్రయ్య ప్రభుత్వ శాఖలో ఒక అధికారి. స్వామి రాసిన పుస్తకాలు చదివి వీరాభిమానిగా మారాడు. అతని స్వగ్రామం నక్రేకల్ దగ్గరున్న ‘చెరువు మాచారం’. కాకతాళీయంగా అది స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, గ్రంథాలయోద్యమ కార్యకర్త అయిన వట్టికోట ఆళ్వారుస్వామి పుట్టినూరు.
ఆనాటి అందరి కవులు, రచయితల కన్నా చాలా భిన్నమైన ఆదర్శవంతమైన జీవితం వట్టికోటది. అందరూ ఆదర్శాలకే, సాహిత్యానికే పరిమితమైతే అతను మాత్రం అక్షరసృష్టికే పరిమితంగాక కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఆచరణలో కూడా సామాజిక కార్యకర్తగా కొనసాగినాడు. సికింద్రాబాదులో నివసిస్తూ దుకాణ గుమస్తాల సంఘాన్ని, పిండిగిర్ని, రిక్షా కార్మికుల సంఘాలను నిర్మించి వారి బాగోగుల కోసం కృషి చేసేవాడు. నైజాం రాజ్యంలో ప్రజల చైతన్యాన్ని సాహిత్యం ద్వారా మేల్కొల్పాలని గ్రంథాలయోద్యమంలో చురుకైన కార్యకర్తగా పాల్గొన్నాడు. బట్టసంచులలో అభ్యుదయ సాహిత్యాన్ని నింపుకుని రెండు భుజాలకు ఆ సంచుల్ని వ్రేలాడదీసుకుని గ్రామ గ్రామాన తిరిగి అక్షరాస్యులతో పుస్తకాలు కొనిపించి చదివించి నైజాం రాచరికానికి వ్యతిరేకంగా వారిని దేశభక్తులుగా తయారు చేసేవాడు.
చంద్రయ్యకు స్వామి చెప్పేవరకూ ‘వట్టికోట’ తన ఊరి వాడే అన్న సంగతి కూడా తెలియదు. స్వామి సలహాతో అర్జెంటుగా ప్రజల మనిషి, గంగు నవలలు కొని చదివి ఒక రోజు స్వామిని చాలా ఉత్సాహంతో కలిసాడు. అతను అప్పటికే తెలంగాణా ఉద్యోగుల సమాఖ్యలో చురుకుగా పనిచేస్తున్నాడు.
“సార్ నేను నా స్వంత ఖర్చులతో మా చెరువు మాదారం ఊర్లో ఆళ్వారుస్వామి సభ ఏర్పాటు చేస్తా. ఆయన సమకాలికులెవరూ ఇప్పుడు మా ఊర్లె లేకున్నా ఇప్పటి తరానికి ఆయన గొప్పతనం తెల్వాలి. ఆ సభకు మీరు ముఖ్య అతిథిగా రావాలె” అని ఒక్కతీరుగ, పట్టుబట్టి చెప్పిండు.
“మంచి ఆలోచన చంద్రయ్యా. కాని వ్యక్తిగా నేనొక్కడ్నే వస్తే బాగుండదు. మన తెలంగాణా ఉద్యోగుల సమాఖ్య తరఫునా, తెలంగాణా రచయితల సంస్థ తరఫునా ఆ సభ ఏర్పాటు చేస్తే బాగుంటది. ఆ సంస్థల బాధ్యులను కూడా పిలవాలె. అప్పుడే నీ కృషి, శ్రమ తెలంగాణా ఉద్యమానికి ఉపయోగపడతది” అని స్వామి సలహా ఇచ్చాడు.
ఆ సలహా చంద్రయ్యకు కూడా నచ్చి ఆర్థిక భారమంతా తనొక్కడే నెత్తిమీద వేసుకుని ఒక సాయంత్రం సభ ఏర్పాటు చేసాడు. ఉద్యోగుల సమాఖ్య ముగ్గురు నాయకులు, రచయితల సంస్థ నుండి సిద్ధార్థరెడ్డి, వేణూ, ప్రముఖ గాయకుడు దళపతి వచ్చారు. ఆ సభకు మొత్తం గ్రామం తరలి వచ్చింది. ఆ చల్లని సాయంకాలం అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొన్నది.
“సార్ ముఖ్య అతిథిగా మీరు సభ ప్రారంభానికి ముందు ప్రారంభోపన్యాసం ఇవ్వాలె” అని చంద్రయ్య విజ్ఞప్తి చేసిండు.
“వద్దు చంద్రయ్యా ముఖ్య అతిథి ఆఖర్లో కూడా మాట్లాడొచ్చు. ముందు రచయితల సంస్థ అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి మాట్లాడితే బాగుంటది” అని స్వామి పెద్ద మనసుతో అన్నాడు. సిద్దార్థరెడ్డికి అప్పటికి రచయితల సంస్థలో స్థానభ్రంశం కాలేదు.
కాలేజీ ఉపన్యాసకుడైన సిద్దార్థరెడ్డి క్లాసురూములో ఇచ్చే ఉపన్యాసం నలభై నిముషాలే అయినా రెండు క్లాసులు కలిపి ఒక గంటపైన్నే ఉపన్యసించాడు. మాటల కోసం కాక పాటల కోసం వచ్చిన ఆ గ్రామ ప్రజలు అసహనంతో “పాట, పాట” అని అరవసాగారు. పాపం ఆయన కించిత్తు కోపంగానే తన గంగాఝరీ ప్రవాహాన్ని బలవంతంగా ముగించాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు టీచర్లు తలచుకుంటే ఉపన్యాసాలకు కొదువా?
అప్పుడు దళపతి రంగప్రవేశం చేసి పాటల మద్యలో మాటలను మిళాయించి ఉచిత వినోద ప్రదర్శన మరోగంట కొనసాగించాడు. ఆ హరికథా భాగవతార్ మైకు వదలని మైకోవస్కీలా ఉండగానే..
స్వామి పక్కనే కూచున్న వేణుకు విసుగొచ్చి స్వామి చెవిలో చిన్నగా “ఉన్న టైం అంతా వీళ్లిద్దరే తినేస్తే మరి మనం అంత దూరం నుండి ఎందుకొచ్చినట్లు స్వామీ?” అని గొణిగాడు.
అట్ల గొణిగిన వేణు తన వంతు రాగానే సోయి మరిచి “ఈ మట్టిలో ఈ గాలిలో ఈ నేలలో ఈ ధూళిలో ఆళ్వారుస్వామి ఆత్మ సంచరిస్తుంది” అని వీరావేశంతో ఢమఢమల ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఆ జడివాన వెలిసే సరికి వచ్చిన జనాలకు ‘ఆకళ్లు, అసహనాలు’ మొదలైనాయి. పల్లెటూరి ప్రజలకు ఈ నగర మేధావుల గంభీరోపన్యాసాలతో కడుపులో పేగులు గుర్రు గుర్రుమని అరవసాగాయి.
సభికుల అవస్థ గమనించిన స్వామి తన ఉపన్యాసాన్ని ఉపసంహరించుకుంటా అని బలవంతంగా చంద్రయ్యను వప్పించాడు. అతను అసంతృప్తితో సభను ముగించాడు. ప్రసంగించవలసిన ముఖ్య అతిథి వేదికపై ఉన్నా ప్రసంగించే అవకాశం దొరకలేదు అని రవ్వంత పశ్చాత్తాపం కూడా సిద్ధార్థరెడ్డి తెలుపలేదు. అది ఆయన నాయకత్వ తీరు. ప్రజాస్వామ్య పద్ధతి.
వక్తలలో ఎవరూ కూడా వట్టికోట ఆళ్వారుస్వామికి సరిఐన న్యాయం చేయలేక పోయారు. ఆయన అడుగు జాడలలో మనం ఎలా నడుచుకోవాలో ఎవరూ చెప్పలేకపోయారు.
‘వట్టికోట’ చేపట్టిన గ్రంథాలయోద్యమ వారసత్వాన్ని ఈ తెలంగాణా ఉద్యమ సందర్భంలో కూడా కొనసాగించాలని, తిరుగు ప్రయాణంలో స్వామి దృఢంగా నిర్ణయం తీసుకున్నాడు.
“వట్టి మాటలు కట్టిపెట్టి
గట్టిమేల్ తలపెట్టవోయ్”
-గురజాడ
***
‘ఒకే ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అన్న కవితాత్మక వాక్యం స్వామిని కదిలించి ఆచరణ వైపుకు నడిపించింది. తెలంగాణా ఉద్యమ సాహిత్యాన్ని ఇటు తెలంగాణాలోనే కాక ఆంధ్రా ప్రాంతంలో కూడా చదివి ఆలోచించే పాఠకుల వద్దకు తీసికెళ్లాలని, వారితో కొనిపించాలని ముఖాముఖి సంభాషణల ద్వారా వారిని ఒప్పించి, ఉద్యమానికి సానుభూతి సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
తను రాసిన పది పన్నెండు పుస్తకాలు తెలంగాణా ఉద్యమానికి సంబంధించినవే. మరికొందరు కవి మిత్రులు తాము ప్రచురించిన కవితల పుస్తకాలను కూడా పుస్తక ప్రదర్శన స్టాల్‌లో పెట్టమన్నారు. కవిత్వ పుస్తకాలకు సగటు, సాధారణ పాఠకుల డిమాండ్ ఉండదు. పైగా వాటి నిర్వహణ తలకు మించిన భారం కావున కేవలం తన పుస్తకాలతోనే మొదటి ప్రయోగం చేద్దామని నిర్ణయించుకున్నాడు. హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనతోనే ఆ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.
స్టాల్‌పై భాగంలో “సలాం హైదరాబాద్” అన్న బ్యానర్ కట్టాడు. అది సందర్శకులను ఆకర్శించింది.. దిన పత్రికలన్నీ ‘ఒక రచయిత తన సాహిత్యాన్ని తనే విక్రయిస్తున్నాడు’ అని వార్తలు రాసాయి. దాంతో సందర్శకులు చాలా మంది స్టాల్ అడ్రసు వెతుక్కుంటూ వచ్చారు. వారందరూ కొనటమే గాక రచయితతో ముఖాముఖిగా సంభాషించి కొన్న పుస్తకాలపై ఆటోగ్రాపులు తీసుకుని స్నేహం పెంచుకున్నారు. వారి ప్రేమాభిమానాల ముందు ఏ అవార్డు కూడా సరి తూగదని స్వామి సంతోషించాడు.
హైదరాబాద్ తర్వాత వెంటనే విజయవాడలో జరిగిన పుస్తక ప్రదర్శనకు కూడా వెళ్లాడు. ఉద్దేశపూర్వకంగానే అక్కడ కూడా ‘సలాం హైద్రాబాద్’ అన్న బ్యానర్ పెట్టాడు. ఆ ప్లాన్ క్లిక్ అయ్యింది. చాలామంది స్టాల్ దగ్గరికి వచ్చి వాదనలకు దిగారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి ఓకే కాని హైద్రాబాద్ మాత్రం ఉమ్మడి రాజధానిగా ఉండాలని వారి వాదన.
దాని అభివృద్ధిలో మేం కూడా శ్రమించాం కదా అని వారి బాధ. స్వామి ఒక వైపు సాహిత్యం విక్రయిస్తూనే ఓపికగా వారిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. సమైక్యవాదులు కూడా ఆ పుస్తకాలను ఇష్టంగానే కొనుక్కున్నారు. నిజనిజాలేమిమిటో తెలుసుకుందామని.
ఒక రోజు స్టాల్ దగ్గరికి ‘సాహితీ మిత్రులు’ విశ్వం, ఖాదర్ మొహియుద్దీన్, అరుణ పప్పు మరికొంత మంది వచ్చారు. రాగానే “మీ మొండి ధైర్యానికి మా ప్రశంసలు” అన్నాడు విశ్వం.
“ఏమో సార్. దేహశుద్ది జరుగుతదని భయంగా ఉంది” అని స్వామి నవ్వుతూ అన్నాడు.
విశ్వం గారు చాలా సీరియస్‌గా “చూడు స్వామీ, వ్యక్తిగతంగా నేనైతే సమైక్యవాదినే కాని మీమీద ఈగ వాలకుండా మిమ్మల్ని కాపాడే నైతిక బాధ్యత మా అందరిది” అని విశాలమైన మనసుతో తన ప్రజాస్వామ్య మనస్తత్వాన్ని తెలియచేసాడు.
ఆ భరోసా స్వామి కొండంత అండగా ధైర్యం లభించింది. ఆ వారం రోజులూ కొంత మంది వీర సమైక్యవాదులు వచ్చి “తెలంగాణా వస్తే మీకు తాగటానికి నీళ్లు ఉండవు. కరెంటు ఉండదు. మళ్లీ రజాకార్ల పాలన వస్తది, నక్సలైట్లు చెలరేగిపోతారు. మీలో మీరు కొట్టుక చస్తారు” అని నానా శాపనార్థాలు పెట్టారు. ఆ తిట్లు అన్ని దీవెనలుగా భావించి స్వామి తొణకక బెణకక చిర్నవ్వులతోనే పుస్తకాలు అమ్మాడు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు.
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు పుస్తకాలు కొని చదివిన వారు స్నేహితులై కొంతమంది స్వామిని ‘లంచ్’కు వాళ్ల ఇంటికి ఆహ్వానించారు. మరికొంత మంది టిఫిన్ బాక్సులలో ఏవేవో స్వీట్లు, హాట్లు తెచ్చి తమ ప్రేమను చూపించేవారు.
హైద్రాబాద్, విజయవాడలే కాక ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, తిరుపతి, ఒంగోలు పుస్తక ప్రదర్శనలలో కూడా వన్‌మ్యాన్ ఆర్మీలా చాలాసార్లు పాల్గొన్నాడు.
మరువలేని మధుర జ్ఞాపకాలు స్వామికి పుస్తక ప్రదర్శనల ద్వారా లభించాయి. తన స్టాల్‌ను దర్శించిన వారికి వారు కొన్నా కొనకపోయిన తన పుస్తకాల గురించి కుప్లంగా పరిచయం చేసేవాడు. అదొక సేల్స్‌మాన్ స్కిల్స్. చాలా మంది సందర్శకులు కొనక పోయినా తెలంగాణా వాదమేమిటో స్వామి చెప్పటం ద్వారా వారికి తెలిసేది. కొంతమంది రచయిత మీద గౌరవంతో కొనేవారు. మీరు ఈ పుస్తకాలు చదివిన తర్వాత మీ అభిప్రాయమేమిటో నాకు ఫోన్ చేసి చెప్పమని స్వామి అనేవాడు. అదులో కొంతమంది చదివి తమ అభిప్రాయాలను, అనుమానాలను ఫోను చేసి చెప్పేవారు.
పుస్తక ప్రదర్శనలలోనే గాక, ఎక్కడ తెలంగాణా సభ జరిగినా తన పుస్తకాల సంచులను మోసుకుంటూ స్వామి అక్కడకు వెళ్లి తన పుస్తకాలను ప్రదర్శనకు పెట్టేవాడు. చాలా మంది దగ్గరకు వచ్చి “ఇప్పటికే మీ రచనలను కొని కొన్ని చదివాం సార్” అని కొనని పుస్తకాలు ఇష్టంగా కొనేవారు. ప్రతి ఒక్కరూ కొన్న పుస్తకంపై ఆటోగ్రాఫ్ తీసుకునేవారు. అందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వటం కష్టమే అయినా వారి మనసుల నొప్పించకుండా ఓపికగా ఇచ్చేవాడు.
ఒక గజిటెడ్ ఆఫీసర్‌గా రిటైర్ అయినా ఎటువంటి బేషజాలకు పోకుండా, ‘ఫాల్స్ ప్రిస్టేజీ’కి గురికాకుండా ఒక సాహిత్య ప్రేమికుడిగా స్వామి ఈ బాధ్యత చేపట్టటం వెనుక వట్టికోట ఆళ్వారు స్వామి, గ్రంథాలయోద్యమం, అణాగ్రంధమాల లాంటి సంస్థలే గాక తను విద్యార్థిగా యువకుడిగా ఉన్నప్పుడు, వామపక్ష పార్టీలలో పని చేస్తున్నప్పుడు పార్టీ ఇచ్చిన పిలుపు ‘సాహిత్య వారోత్సవాల’లో చురుకుగా పాల్గొనేవాడు. ఇతర కార్యకర్తలతో కలిసి సైకిల్ క్యారియర్ల వెనుక పుస్తకాల సంచులను కట్టుకుని ఫ్యాక్టరీలు, ఆఫీసులు, బస్తీలు తిరిగి పార్టీ సాహిత్యాన్ని, అభ్యుదయ పుస్తకాలను అమ్మేవాడు. ఆ అనుభవాలు స్వామికి మళ్లీ తెలంగాణా ఉద్యమంలో ఉపయోగపడినాయి.
ఒకసారి హైదరాబాద్ ఎన్.టి.ఆర్. స్టేడియంలో పుస్తక ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఒక మధ్యాహ్నం ఎర్రటి ఎండలో స్టాల్ లోపలికి ఒక నడీడు మనిషి చెమటలు కక్కుతూ ప్రవేశించాడు. అతని ముఖం సింగరేణి నల్ల బంగారంలా చెమటలతో తడిసి మిలమిలా మెరుస్తుంది. నల్లని వాడు తెల్లని నయనమ్ముల వాడిలా ఇస్త్రీ చేయని ముడుతల బట్టలు, మట్టిగొట్టుకున్న మురికి పాదాలకు ఇప్పుడో అప్పుడో తెగేటట్టున్న రబ్బరు హవాయీ చెప్పులు వేసుకున్నాడు. అక్షరం ముక్కంటే ఏమిటో తెలియని నిరక్షరాస్యుడిలా స్వామి కళ్లకు కనిపించాడు.
నడినెత్తిన సూర్యుడిని మోసుకుంటూ వచ్చిన ఆ నల్లనయ్యకు రివాజుగా తన దగ్గరున్న మంచి నీళ్ల సీసా అందించాడు. అతను కృతజ్ఞతగా కొంచెం సిగ్గుపడుతూ రెండు గుటకలు త్రాగి పుస్తకాల దొంతర్ల వైపు నడిచాడు. ఇండెక్సులే గాక ముందు మాటలు కూడా విహంగవీక్షణం చేస్తున్నాడు. ప్రతి పుస్తకాన్ని పరీక్షగా, ఓపికగా చూస్తున్నాడు. చివరికి అన్ని పుస్తకాలను చేతుల్లోకి అపురూపంగా తీసుకుని స్వామి దగ్గరికి వచ్చి బిల్లు రాయమన్నాడు.
స్వామికి చాలా సంతోషమయ్యి “ఏ ఊరు, ఏం పేరు, ఏం పని?” అని ప్రశ్నల పరంపర సంధించాడు.
“నా పేరు మత్తయ్య. మతం పుచ్చుకున్న మాల మనిషిని. మంగళగిరిలో తాపీ మేస్త్రీని” అని క్లుప్తంగా తన ప్రవర వినిపించాడు.
స్వామికి ఆశ్చర్యం వేసింది.
“ఇవన్నీ మీ కోసమేనా?” అనుమానంతో ప్రశ్నించాడు స్వామి.
“నేనిది వరకే మీ ‘సలాం హైద్రాబాద్’ నవల చదివాను. అప్పట్నుండీ మీ అజ్ఞాత అభిమానిని” అన్నాడు మత్తయ్య చిర్నవ్వుతో.
ఆశ్చర్యపోయిన స్వామి “ఆ నవల మీకెక్కడ దొరికింది” అని ప్రశ్నించాడు.
“గుంటూరు విశాలాంధ్రలో” అన్నాడు మత్తయ్య.
“మీరు మేస్త్రీ కదా! పుస్తకాలు చదివే టైం మీకు ఉంటుందా” ప్రశ్నించాడు.
“మనసుంటే మార్గముండదా?” అన్నాడతను.
“ఎవరెవరి పుస్తకాలు చదివారు?”
“చలం, బుచ్చిబాబు, రాచకొండ, కొడవటిగంటి..”
ఆ జవాబుతో దిమ్మతిరిగిపోయింది స్వామికి. ఎందుకంటే రెండురోజుల క్రితమే ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చి “తెలంగాణా ఉద్యమం పాటల క్యాసెట్” ఉందా అని అడిగాడు.
“అవి నా దగ్గర లేవు కాని సలాం హైద్రాబాద్, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల చరిత్ర, ఇంకా కొన్ని మంచి పుస్తకాలున్నాయి” అని వాటి గురించి చెప్పబోతుంటే..
“సారీ, మాకు అవి చదివేంత టైం ఉండదు” అని హడావుడిగా పాటల క్యాసెట్ల కోసం వెదుకుతూ పరిగెత్తాడు ఆ ఆచార్యుల వారు.
“The real education exists out of university campus” అన్న థామస్ హాబ్స్ కొటేషన్ జ్ఞాపకం వచ్చింది స్వామికి. కొంతమంది లెక్చరర్లు, ప్రొఫెసర్లు స్వామికి దోస్తులు. వారు పుస్తకాలు చదవరు, కొనరు. వారి డ్రాయింగు రూములో విలువైన అలంకరణ వస్తువులుంటాయి. కాని పుస్తకాలు, పుస్తకాల అలమారాలు ఉండవు. ఉద్యోగాలు వచ్చినంక వారు చదువుకున్న చదువుల్నే మరిచిపోతారు. ఎప్పుడో రాసుకున్న పాత నోట్సుల ఆధారంగా పిల్లలకు పాఠాలు వల్లిస్తారు. యం.ఫిల్., పి.హెచ్.డి.లు చేసింది ఉద్యోగాల కోసం మాత్రమే. తమలో ‘శోధన’ లేని వారే పరిశోధనలు చేస్తారు అని వడ్డెర చండీదాస్ తన నవలలో ఒక పాత్ర ద్వారా చెప్పిస్తారు. అది కొంత వరకు నిజమేనేమో!
అటువంటి సూడో మేధావుల కన్న మేస్త్రీ మత్తయ్య చాలా ఉన్నతంగా కనిపించాడు స్వామి కళ్లకు.
ఆ తర్వాత కొద్ది రోజులకు ‘పుస్తక ప్రదర్శనల్లో నా అనుభవాలు’ అన్న వ్యాసం రాసి ఒక ప్రముఖ దినపత్రిక సాహిత్య పేజీకి పంపాడు. ఆ దినపత్రికలో అది వెంటనే ప్రచురింపబడింది. ఆ సంపాదకుడు దాని శీర్షిక ‘మంగళగిరి తాపీ మేస్త్రీ నన్ను ధన్యుణ్ణి చేసాడు’ అని పెట్టి ఆ వ్యాసం విలువ పెంచాడు.
మరొక విశేషం మరో సంవత్సరం ‘హైద్రాబాద్ పుస్తకాల నుమాయిష్’లనే జరిగింది. ఒక సాయంత్రం బాగా జన సమ్మర్ధం ఉన్నపుడు ఒక ముసలమ్మ తడబడుతున్న అడుగులతో నడుస్తూ స్టాల్ దగ్గరికి వచ్చింది. ఆమె రూపాన్ని చూస్తే బాగా విద్యాధికురాలు అని తెలుస్తుంది. స్వామి లేచి నిలబడి తన కుర్చీలో ఆమెను కూచోబెట్టాడు.
“ఉత్తగ నిన్నుచూస్తందుకే వచ్చిన నాయినా” అని ఆమె అన్నది.
ఆ మాటలు అర్థం కాని స్వామి అయోమయంగా ముఖం పెట్టాడు. అది గమనించిన ఆమె నోరారా నిండుగ నవ్వుకుంట “నీ పుస్తకాలన్నీ ఇది వరకే చదివిన” ఇప్పుడు నిన్ను చూద్దామని వచ్చిన” అన్నదామె.
మాటల ద్వారా తెలిసిందేమిటంటే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గుండవరపు హనుమంతరావు పెద్ద కూతురు ఆమె. చిక్కడపల్లిలో వారిల్లు. ఆ రోజులలో ఆనాటి సాహిత్య కారులందరికీ ఆ ఇల్లు ఒక విడిది. ఒక సత్రం లాంటిది. దాశరథి, కాళోజీ, వట్టికోట, బిరుదురాజు రామరాజు లాంటి మహామహులందరూ వారింట్లో వచ్చిపోయే అతిథులే. అట్లా ఆమెకు సాహిత్య సంస్కారం సువర్ణానికి సుగంధంలా అబ్బింది. ఆర్‌టిసిలో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఎ.ఐ.టి.యు.సి. కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసేది. పెద్ద కూతురిగా ఇంటి బాధ్యతలలో నిండా మునిగిపోయి అవివాహితగానే మిగిలిపోయింది. శేషజీవితం సంధ్యాసమయంలో ప్రవేశించినపుడు ‘బౌద్దమతం’ స్వీకరించింది.
ఆమె పేరు గుండవరపు శాంతమ్మగారు. ఆమె తన నిర్యాణం తర్వాత తన పార్థీవ దేహాన్ని గాంధీ దవాఖానా సికింద్రాబాద్‌కు దానం చేసింది.
స్వామికి ఆ అనుభవం ఒక అమూల్యమైన జ్ఞాపకం. పుస్తకాల బేహారిగా అవతారం ఎత్తినందుకు దొరికిన కానుకలు మరెన్నో.
***
స్వామి కౌమార దశలో ‘రజనీకాంత్’ అనే పిల్లల నవల చదివి అందులోని సాహసకృత్యాలకు బాగా ప్రభావితుడైనాడు. స్వేచ్ఛకోసం అన్వేషిస్తూ పిల్లలు చేసిన సాహసాలే ఆ నవల. దాని రచయిత గొల్లపూడి మారుతీరావు. తర్వాత కాలంలో ఆయన నవలలు, కథలు ఎన్ని చదివినా రజనీకాంత్ మాత్రం స్వామికి ఇష్టమైన పుస్తకం.
వైజాగ్‌లో స్వామి పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నప్పుడు మారుతీరావు తీరికగా నడుచుకుంటూ రావటం కనిపించింది. స్వామి ఆయనకు ఎదురుగా వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించి “సార్ నేను టీనేజ్‌లో మీ పుస్తకాలు చదివి చెడిపోయాను” అన్నాడు. ఆ హాఠాత్ వ్యాఖ్యానానికి ఆయన విస్తుబోయి “అదెలా?” అని నాటకీయంగా తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు.
“నా పదిహేనేళ్ల వయస్సులో మీ రజనీకాంత్ నవల చదివి నేను ఇంటినుండి పారిపోయి బెజవాడ వెళ్లాను అన్నాడు” స్వామి.
“నిజమా, అసలు నేను ఆ నవల రాసినట్లు నాకిపుడు గుర్తే లేదు” అని తన విస్మయాన్ని ప్రకటించాడు. అప్పుడు స్వామి ఆ నవల ఇతివృత్తాన్ని క్లుప్తంగా వివరిస్తే అప్పుడాయనకు జ్ఞాపకం వచ్చింది.
“రండి సార్! నా స్టాల్ చూద్దురుగాని” అంటూ సగౌరవంగా ఆయన చేయని పట్టుకుని తన దుకాణంలోకి తీసుక పోయాడు. ఆయన్ని తన కుర్చీలో కూచుండబెట్టి తన రచనలన్నిటినీ చూపెట్టాడు.
“నా రచనలు చదివి చెడిపోయిన నువ్వు ఇంతగా బాగుపడటం నాకు సంతోషంగా ఉందయ్యా” అని చమత్కారంగా ఒక చెణుకు విసిరాడు.
అప్పటికే ఆయన సీన్మాలలో గద్దముక్కు పంతులుగానూ, ఆడవాళ్లను రేపులు చేసే విలన్‌గానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించినందున అనేక మంది అభిమానులు ఆయన చుట్టూ గుమికూడి ఆటోగ్రాఫులు అడగసాగారు.
ఆయన వారందర్నీ ముద్దుగా విసుక్కుంటూ “ఉండడయ్యా ఈయన చిన్నపుడు నేను రాసి మరిచిపోయిన పుస్తకాలను ఇపుడు మళ్లీ నాకే గుర్తు చేస్తున్నాడూ” అన్నాడు.
చివరికి అభిమానుల తాకిడికి తట్టుకోలేక రేపొద్దున్న వీలుంటే కాఫీ పుచ్చుకోడానికి మా ఇంటికి రండి అని విజిటింగు కార్డు ఇచ్చి నిష్క్రమించాడు. రచనలు చేసే విషయంలో ఆయన రాక్షసుడు. ఉదయం రంగులు పూసుకుని ఎన్ని వేషాలు వేసినా రాత్రుళ్లు మాత్రం లోకమంతా నిద్రావస్తలో తూగుతున్న వేళ్లలో అలుపు సొలుపు లేని రచనా వ్యాసాంగం చేస్తుంటాడు. ఆ గ్రద్ద ముక్కు పంతులుగారిది నిద్రవిషయంలో మాత్రం కోడి నిద్రే.
ఆ తెల్లారి సముద్ర తీరాన ఉన్న ఆయన బంగళాకు చేరుకున్నాడు స్వామి. సప్తపదులు పూర్తి చేసుకున్న తన అభిమాన రచయిత మేడ మీది ఎండ పొడకు కూచుని మోకాళ్ల నొప్పుల ఉపశమనం కోసం మహానారాయణ తైలంతో మర్ధన చేసుకుంటున్నాడు.
ఆయన్ని చూస్తుంటే స్వామికి సముద్రం ప్రక్కనే మరో సముద్రాన్ని చూస్తున్న అనుభూతి కలిగింది.
ఆయనొక కబుర్ల కార్ఖానా. ఆ కబురు ఈ కబురు చెప్పి “స్వామీ హీరోషిమాపై వేసిన అణుబాంబు నిక్ నేం ఏమిటో నీకు తెలుసా? అని ప్రశ్నించాడు.
స్వామి తెల్లముఖం వేసాడు. ‘లిటిల్ బాయ్’ అని చెప్పి అణుబాంబు తయారీ దాని విస్పోటనా ఫలితాలు ఎట్లుంటయో ఒక సైంటిస్టులా పూసగుచ్చి చెప్పినట్లు చెప్పాడు.
నోరు వెళ్లబెట్టుకుని వినటం స్వామి వంతు అయ్యింది. ఆయన తండ్రి ఈయన్ని ఒక సైంటిస్ట్‌గా చూడాలని ఆంధ్రా యూనివర్సిటీలో బి.యస్సీ హానర్స్‌లో చేర్పించాడట. కాని ఈయన చదువును నిర్లక్ష్యం చేసి నాటకాలు, సాహిత్యం వెంటపడ్డాడట. చివరికి తండ్రిని సంతోష పెట్టటానికి ఫైనల్ ఇయర్‌లో అన్ని బ్యాక్‌లాగ్ పేపర్లతో సహా పరీక్షలు రాసి బియస్సీ హానర్స్ గ్రాడ్యుయేట్ అనిపించుకున్నాడట.
వైజాగు సూర్యుడు చురచురమని నెత్తిమీదికి ఎక్కి నాట్యం చేస్తున్నప్పుడు ఆ జ్ఞాన సముద్రానికో నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు స్వామి.
***
జిల్లాలలో ఏ పుస్తక ప్రదర్శనకు వెళ్లినా సత్రం భోజనం మఠం నిద్ర స్వామికి అలవాటే. అదంతా వారం పదిరోజులు ప్రయాస. పాఠకులను, అభిమానులను కలుసుకునే ఆనందం ముందు వనవాసాలు, ఉపవాసాలు ఏ మాత్రం కష్టం అనిపించకపోయేది. ఖమ్మం పుస్తక ప్రదర్శనలో ప్రతిరోజూ ఒక పాతికేళ్ల యువకుడు రెగ్యులర్‌గా వచ్చేవాడు. సాహిత్యం గురించి పుస్తకాల గురించి మాట్లాడేవాడు. విస్తృతంగా తెలుగు సాహిత్యం చదివిన జ్ఞానం అతనికి ఉందని స్వామి గ్రహించాడు.
“మీరు ప్రతిరోజు లంచ్ ఎక్కడ చేస్తున్నారూ?” అని అడిగాడు.
“లంచ్ టైంకే బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితుంది కాబట్టి నో లంచ్. మార్నింగ్ బ్రేక్ పాస్ట్ దండిగా తిని అరటిపండ్లు, బిస్కట్లు నీళ్ల సీసాలతో ఇక్కడికి వస్తాను” అన్నాడు స్వామి.
“సార్ నేను పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. మా కాలేజీ మధ్యాహ్నం ఒంటి గంటకు. నేను కాలేజీకి వెళ్లే ముందు ప్రతి రోజూ మీకు లంచ్ బాక్సు పట్టుకొస్తా” అన్నాడు ఆ యువకుడు.
ఆ యువకుడి పేరు కమల్. వాళ్లిద్దరి దోస్తానా అట్లా ప్రారంభమయ్యింది. కమల్ పుణ్యమా అని స్వామి కడుపు ప్రతిరోజూ చల్లబడేది. “నాభి చల్లగుంటే నవాబును గూడ సవాల్” చేయొచ్చని నైజాం జమానా సామెత.
ఒకరోజు సాయంత్రం కాలేజీ నుండి తిరిగొస్తూ ఒక పెద్దాయనను వెంటబెట్టుకుని వచ్చాడు. వయస్సు డెబ్బై దాకా ఉండొచ్చు. పక్షవాతం వచ్చి కోలుకుంటున్నట్లు కనబడినాడు. అడ్డపంచె కట్టుకుని తెల్లని గడ్డంతో పల్లెటూరు పెద్దమనిషిలా కనబడుతున్నాడు.
ఆయన కష్టంగా నడుచుకుంటూ వచ్చి స్వామి చూపించిన కుర్చీలో కూచున్నాడు.
“సార్ ఈయనెవరో మీరు గుర్తు పట్టిండ్రా” నవ్వుతూ అడిగాడు కమల్.
తెలవదన్నట్లు తల అడ్డంగా ఊపాడు స్వామి.
“మీరు సంసార చక్రం అన్న నవల చదివారా?”
“ఎందుకు చదవలేదూ? చావా శివకోటి గారు రాసిన పుస్తకమే కదా?” అన్నాడు స్వామి.
“ఆ శివకోటిగారే ఈ శివకోటిగారు” అని బాంబు పేల్చాడు కమల్. స్వామి సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరై ఆయన రెండు చేతులూ పట్టుకుని రచనలు చేసిన ఆ హస్తాలను తన కండ్లకద్దుకున్నాడు. ఆయన తొలితరం ఖమ్మం రచయితల్లో ఒకరు. కవిరాజ మూర్తి, హీరాలాల్ మోరియా, కౌముది లాంటి రచయితలకు సమకాలికుడు.
ప్రతి సాయంత్రం కమల్ చావా శివకోటిగారిని స్వామి స్టాల్ దగ్గరికి తీసుకొచ్చేవాడు. వారిద్దరిది ‘తాతా-మనవడి’ సంబంధం.
ఇరవై సంవత్సరాల వయసున్నప్పుడే ఆయన దేశదిమ్మరిలా దేశమంతా సంచరించాడు. హిమాలయాలకు వెళ్లాడు. తిరిగి వచ్చాక ఏ ఉద్యోగం చేయలేదు. వ్యవసాయం ఉన్నా చేయలేదు. సారా కాంట్రాక్టర్ బహానాతో భద్రాచలం అడవులన్నీ తెగిన గాలిపటంలా తిరిగి కోయలు, కొండరెడ్లతో స్నేహాలు చేసాడు. ఆ అనుభవాలతో రాసిందే ‘సంసార చక్రం’ అన్న నవల.
రుషికాని వాడు కావ్యం రాయలేడన్నట్లు, శరత్ చంద్ర చటర్జీలా దేశదిమ్మరి కాని వాడు మంచి రచనలు చేయలేడు అని శివకోటిగారు స్వామికి చెప్పేవాడు. అగ్నిపునీత సీత లాగ ప్రతి రచన జీవితానుభవాల కొలిమిలో కాలి, కాగి మేలిమి బంగారంలా ఇవతలికి రావాలని చెప్పేవాడు.
ఖమ్మం పుస్తక ప్రదర్శన మైదానంలో ప్రతి సాయంత్రం వేదికపై కవి సమ్మేళనాలు, సాహిత్య ఉపన్యాసాలు జరిగేవి. స్థానిక కవులు, రచయితలే గాక హైద్రాబాద్ నుండి కూడా కొంతమంది వచ్చి ప్రసంగించేవారు.
ఒక రోజు శివకోటిగారు స్వామితో మాట్లాడుతూ “స్వామి ఆ వేదికమీద అంతమంది ఉన్నారు కదా! వారెవరికీ ఈ పట్టణంలో ‘చావా శివకోటి’ అనే సీనియర్ రచయిత ఉన్నడన్న సంగతే తెలవదు. ఒకరిద్దరికి తెలిసినా వారు నా రచనలేవీ చదవక పోవచ్చు. నేనే కాదు ఈ రోజుల్లో ఏ రచయితకైనా పబ్లిసిటీ కావాలంటే, రావాలంటే పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవాలి. ప్రతి సభకు సమావేశానికి వెళ్లి పరిచయాలు పెంచుకోవాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది” అని బాధగా చెప్పాడు.
“నిజమే సార్. మీరన్నట్లే పరిస్థితి ఉంది. కాని వడ్డెర చండీదాస్, డాక్టర్ కేశవరెడ్డి, కాశీబట్ల వేణు గోపాల్, రంగనాయకమ్మ లాంటి వారు గుంపులకు దూరంగా ప్రచారాలకు దూరంగా ఉంటూనే కలకాలం నిలిచిపోయే రచనలు చేసారు. నాకైతే వాళ్లే ఆదర్శం. అవార్డులు, రివార్డులు, పట్టు శాలువాలు, సన్మానాలు నాకు కూడా ఇష్టం ఉండదు. సాహిత్య రచన అంటే నా దృష్టిలో ఒక జిమ్మేదారి, ఒక బాధ్యత మాత్రమే” అన్నాడు స్వామి.
శివకోటి గారు నిర్వేదంగా నవ్వుతూ “అన్ని రచనలు అందరు రచయితలు కాలగర్భంలో కనుమరుగైపోతారు స్వామి. నెహ్రు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాసినట్లు ఈ దేశంలో చివరికి మిగిలేది రామాయణం, మహాభారతం, వాల్మీకి, వ్యాసులిద్దరే” అన్నాడు.
“మై పల్ దో పల్ కా షాయర్ హుఁ
పల్ దో పల్ మెరీ కహానీ హైఁ”
అమితాబచన్ పాట స్వామి మదిలో మెదిలింది.
అధ్యాయం-32: టర్నింగ్ పాయింట్
2011-2012 వచ్చేసరికి యావత్ తెలంగాణా ఉద్యమాల ఊపుతో దద్దరిల్లి పోతుంది. తెలంగాణా జేఏసీ ఉద్యమ పతాకగా ముందుకు సాగుతుంది. తెలంగాణా సాధన సంస్థ పార్టీ దాని అధ్యక్షుడు తాత్కాలికంగా స్తబ్దతకు గురైనా జేఏసీ మాత్రం ఎత్తిన జండా దించకుండా రాజీ లేని, పట్టు విడుపులు లేని పోరాటం రకరకాల వ్యూహాలతో ఎత్తుగడలతో కొనసాగిస్తుంది.
ప్రముఖ ఉర్దూకవి ఫైజ్ అహమ్మద్ పైజ్ ‘హమ్ దేఖేఁగే’ అన్న కవితలో “మేం పీడిత తాడిత ప్రజలం ఎప్పడైతే మేల్కొంటామో, కలిసికట్టుగా కదులుతామో అప్పుడు మీ కీర్తికిరీటాలు గాలిలో ఎగురుతాయి. మీ సింహాసనాలూ, మీ విగ్రహాలు ముక్కలు ముక్కలుగా విరిగి నేలకూలుతాయి” అంటాడు.
పైజ్ అహమ్మద్ ఫైజ్ స్వాతంత్య్రం రాకముందు ప్రొగ్రెసివ్ రైటర్స్ యూనియన్ సభ్యుడు. అభిమానులు ముచ్చటగా ఇతనిని ‘ఫైర్ అహమ్మద్ ఫైర్’ అని పిలుచుకునేవారు.
అతని కవితా చరణాలు 2011 మార్చి నెలలో జరిగిన ‘టాంక్‌బండ్ మిలియన్ మార్చ్’లో ఆచరణలో నిజం అయినాయి. పోలీసులు డేగ కళ్లతో, ముళ్ల కంచెలతో తెలంగాణా అంతటా దిగ్బంధనం చేసినా ప్రజలు లక్షల సంఖ్యలో పోలీసుల కళ్లు కప్పి టాంక్‌బండ్ చేరుకుని కదం తొక్కారు.
ప్రముఖ తెలంగాణా కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన కవితలో “టాంకుబండ్ మీద విగ్రహాలన్నీ మీవి, క్రింద శవాలన్నీ మావి” అన్న మాటలు అక్షర సత్యమే. ఆ విగ్రహాలలో అత్యధిక భాగం ఆంధ్ర ప్రముఖులవే. గుమికూడిన ప్రజలు ఎంతో కోపం ఉద్రేకంతో ఉన్నా గురజాడ, కందుకూరి, శ్రీశ్రీ, గుర్రం జాషువా, త్రిపుర్నేని విగ్రహాలను మట్టుకోకుండా కొన్నింటిని మాత్రం నేలమట్టం చేసి వలసవాద పెత్తనంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ విగ్రహాల విధ్వంసం ద్వారా తెలంగాణా ఉద్యమం జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్శించింది.
సంప్రదాయిక నిరసనలు కాకుండా ఈ ఉద్యమం కొత్త పద్దతులను ప్రవేశపెట్టింది. బ్రహ్మనాయుడి ‘చాపకూడు’ సిద్దాంతాన్ని గుర్తు చేసేలా రోడ్లపై ‘వంటా వార్పు’ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఒక హైద్రాబాద్‌లోనే కాక జిల్లాలలో, గ్రామాలలో ప్రజలు సామూహికంగా వంటా-వార్పులు మొదలు పెట్టి మతం, లింగ, కుల బేధాలకు భిన్నంగా తమ ఐక్యతను చాటి చెప్పారు. ఉద్యమం ఒక ‘విరాట్ స్వరూపంగా’ రూపు దిద్దుకుంది.
సెప్టెంబరు నెలలో జరిగిన ‘సకల జనుల సమ్మె’ కొత్త చరిత్రను సృష్టించింది. ఆర్.టి.సి. కార్మికులు, ఉద్యోగులు “బస్ కా పైయ్యా నహీఁ చలేగా” అని నినదించి బస్సులు బందు పెట్టటంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించి పోయింది. ఆంధ్రా నుండి వస్తున్న బస్సులను నక్రేకల్‌లో ఆపిన ఉద్యమ నాయకుడు డాక్టరు చెరుకు సుధాకర్‌ను పి.డి. చట్టం క్రింద అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు.
సెప్టెంబరు 2012 నెలలో నెక్లెస్ రోడ్డులో ‘సాగర హారం’ కార్యక్రమానికి జేఏసీ పిలుపు నివ్వగా మళ్లీ లక్షలాది మంది ప్రజలు అక్కడ జమ అయినారు. పోలీసులు లాఠీచార్జీలు, బాష్పవాయువులు ప్రయోగించినా జన సముద్రాలను అదుపు చేయలేక చివరికి వాటర్ క్యానన్లను రంగంలోకి దించారు. ఆ నాటి ‘సాగరహారం’ 1969 ఉద్యమాన్ని జ్ఞాపకం చేసింది.
***
జీవన యానంలో స్వామి అప్పటికే అరవై మజిలీలను దాటివేసాడు. చూస్తూ ఉండగానే కాలం వ్రేళ్లసందులో నుండి సన్నని ఇసుకలా ఎప్పుడు జారిపోయిందో తనకే తెలియదు. ‘దిల్ ఔర్ దిమాక్’ రెండూ ఇంకా యవ్వనంగానే ఉన్నా సర్దుకపోయే మనస్తత్వం లేకపోవటమే అతని బలమూ, బలహీనత కూడా.
యువకులూ, విద్యార్థుల ఆత్మహత్యలు ఒక సామూహిక ఉన్మాదం లాగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ పార్లమెంటు ఎదుట చెట్టుకు ఉరివేసుకున్న యాదిరెడ్డి కలలలో తరచుగా కనబడుతున్నాడు. మరొక విద్యార్థి వరంగల్‌లో వేగంగా వస్తున్న రైలుకెదురుగా ‘జై తెలంగాణా’ నినాదాలు ఇస్తూ పరిగెత్తుకు వెళ్లి రైలును ఢీకొట్టి బలిదానం చేసాడు. రాత్రిపూట కలల్లో ఆ రైలింజను తన మీదికే దూసుక వస్తున్నట్లు భయపడి లేచి కూచుంటున్నాడు. సదాశివ సారు కూడా కలల్లో కనబడి “నీ మనస్తత్వానికి నువ్వు సంస్థలలో అందులోని మనుషులతో ఇమడలేవు స్వామీ” అని హెచ్చరిస్తున్నడు.
కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అదే ‘సిల్కు రూట్’ యాత్ర.
***
పాఠ్యపుస్తకాలు, టీచర్ల క్లాసులు రుచించనందున స్కూలు ఎగ్గొట్టి లైబ్రరీలలో కూచోవటం టీనేజీలో స్వామికి అలవాటయ్యింది. అక్కడ అతనికి చెంఫీుజ్‌ఖాన్‌తో పరిచయం జరిగింది. తెన్నేటి సూరి రాసిన నవల అది. ఆ నవల చదివేటప్పుడే కాదు, లైబ్రరీ నుండి ఇంటికి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నపుడు కూడా తను గోబీ ఇసుక ఎడారులలో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, గాలికంటె వేగంగా పరిగెడుతున్న గుర్రాలు, వాటి డెక్కల చప్పుడు వింటున్నట్లు, సంచార గుడారాలు ‘యూర్త’లలో, ‘బుర్టీ’తో కలిసి కాపురం చేస్తున్నట్లు, డేగిసాలలో కళపెళా ఉడుకుతున్న లేత గొర్రెమాంసం ముక్కలను గుప్పెడు గుప్పెడు ఊదుకుంటూ తింటున్నట్లు, పులియ బెట్టిన గుర్రపు పాల సారాయిని కడుపు నిండా త్రాగుతున్నట్లు, తార్తారు, కిర్గీజ్, తాజిక్, ఉబ్జెక్ తండాల శత్రుగుంపుల్ని తన తల్వారులతో చీల్చి చెండాడుతున్నట్లు, యుద్దంలో ఓడిపోయిన వారి అందగత్తెలైన స్త్రీలను తన మంగోలు తండాల గుడారాలకు ఎత్తుకొస్తున్నట్లు, చమూగా, కరాచర్, యుసుకై భగత్తూర్, షామాన్‌లు తనను అనుసరిస్తున్నట్లు కలలు కనేవాడు.
టెమూజిన్ (చంఫీుజ్‌ఖాన్ అసలు పేరు) తనను పూర్తిగా ఆవాహన చేసుకున్నాడు. ఆ రోజుల్లోనే ఏదో ఒక రోజు గోబీ ఎడారిని చూడాలని, అందులో సంచారిగా తిరగాలని నిర్ణయించుకున్నాడు. ఆ కల జీవితాంతం తనను వెంటాడింది. “హమ్ అప్నే మర్జికే మాలిక్ హై” అనుకునే స్వామి కల అరవై సంవత్సరాలు దాటిన తర్వాత సాకారమయ్యింది.
కాలేజీలో ఉన్నపుడు నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, గింప్సస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలే కాక రాహుల్ సాంకృత్యాయన్, సంజీవదేవ్ పుస్తకాలు తనను ప్రభావితం చేసాయి. ‘పంచి బనూ ఉడ్‌తే ఫిరూఁ నీలిగగన్‌మే’ లా, సైబీరియా వలస పక్షుల్లా దేశదేశాల సరిహద్దులను దాటి ‘ఆవారా బాదల్’ లా దేశదిమ్మరిలా సంచరించాలని బలమైన కాంక్ష జీవితాంతం వెంటాడి వేధించింది.
వామపక్ష భావాల పుణ్యమా అని రష్యన్, చైనీస్ అనువాద నవలలు పరిచయమైనాయి. చెంఫీుజ్ ఐత్ మాతోవ్ ‘తల్లి భూదేవి’, ‘జమీల్యా’, ‘తొలి ఉపాధ్యాయుడు’ నవలల ప్రభావంతో గడ్డి భూముల మైదానాలలో స్టెప్పీస్‌లలో తిరగాలని, అర్ధరాత్రుళ్లు పోప్లార్ చెట్ల సందుల్లో నుండి వీచే తుఫాను గాలుల శబ్దాలు వినాలని, తీన్‌షాన్ మంచు కొండలు కరిగి ప్రవహించే హిమశీతల మంచు సరస్సులు తిలకించాలని కలలు కనేవాడు. ఎడ్గార్ స్నో ‘రెడ్‌స్టార్ ఒవర్ చైనా’ చదివినాక చైర్మన్ మావో ఒకటిరెండు సార్లు కలల్లో కనబడినాడు. విప్లవ కేంద్రం ‘ఎనాన్’ని చూడాలని కూడా ఒక కోరిక.
ఒక ముక్కలో తనేమిటో తాను చెప్పవలసి వస్తే స్వామి చటుక్కున ‘I am Product of books’ అంటాడు. పుస్తకాలు సృష్టించిన మనిషి అతను. అందులోని అక్షరాలు తీర్చిదిద్దిన మనిషి అతను. చదివిన అక్షరాల, వెంబడి ప్రయాణించి దేశదేశాల సరిహద్దులు దాటే మూసాఫిర్ అతను.
“ముజే ఏక్ జగా ఆరాం నహీఁ
రుఖ్ జానా మేరా కామ్ నహీఁ
మై దేశ్ విదేశీ బంజారా”
ఇబ్న్ బటూటా, మ్కారోపోలో, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్, అనేక మంది బౌద్ధ భిక్షువులు, సూఫీ సాధువులు, హిందూ సన్యాసులు, సంత్‌ల వారసత్వ గుణగణాలు స్వామిలో కూడా నిక్షిప్తమై ఉన్నందున సంచార కాంక్ష అతని కాళ్లను నేలమీద నిలబడనీయలేదు. కాళ్లల్లో చక్రాలున్నాయేమో!
రెండు వేల సంవత్సరాల క్రిందటి అతి ప్రాచీన ‘సిల్కురూట్’ రహదారి, విలియం డార్లింపుల్, విక్రమ్ సేత్ రచనల ద్వారా ఇటీవలి కాలంలో మళ్లీ స్వామిని ఆకర్షించటంతో రిటైర్‌మెంటు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ బంగారు సమయం రానే వచ్చింది. సకల సంకెళ్లు పుటుక్కుమని తెగిపోయాయి.
ఒకరోజు పొద్దుపొద్దుగాల్నే చాయ్ తాగినంక విశాలంగా ఉన్న డైనింగ్ టేబుల్ మీది వస్తువులన్నింటినీ తీసేసి ‘సాఫ్’ చేసుకుని ప్రపంచ పటం, ఆసియా ఖండం పటం, లోన్లీ ప్లానెట్ వారి సెంట్రల్ ఏసియా ట్రావెల్ గైడ్ బుక్ ఆ టేబుల్ పై సర్దుకుని ఆ మ్యాపులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నాడు తన దగ్గరున్న ‘భూతద్దంతో’.
సంగతేందో పసిగట్టిన రాజా కిచెన్‌లో పనిచేసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో రహస్యంగా “డాడీ ఏదో వరల్డ్ టూరు ప్లాను చేస్తున్నట్లున్నాడు. ఈసారి దేశంలో మాత్రం కాదు” అని గుసగుసగా సమాచారం చేరవేసాడు. అప్పుడు వాడు ఇంజనీరింగు మొదటి సంవత్సరములో ఉన్నాడు.
ఆంజల్య ఉత్త చేతులతో రాకుండ సెకండ్ రౌండు ‘చా’ కప్పుతో వచ్చి పక్క కుర్చీలో కూచుని..
“ఎందో పెద్ద ప్లాను వేస్తున్నట్లున్నావు? ఇటు కాశ్మీర్ టు కన్యాకుమారి, అటు ద్వారకా టు పూరీ జగన్నాథ్ విసుగొచ్చిందా?” అని ప్రశ్నించింది.
“నా చిరకాల కోరిక సిల్కురూటు, నీకు తెలుసుకదా. పదహారేండ్లప్పట్నుండే ఆ కోరిక వెంటాడి వేధిస్తుంది. అరవై దాటిన. ‘వజీఫా’ (రిటైర్‌మెంటు) కూడా తీసుకున్న. ఇగ ఇప్పుడు పించన్‌ధార్‌ని (పెన్షనర్). అల్లా మియాకు ప్రియం కాకముందే ఇదే మంచి సమయం” అన్నాడు స్వామి.
“ఔనౌను. నిజమే. లేకపోతే నీ ఆత్మ నువ్వు పోయిన తర్వాత ఆ దేశాలలోనే చక్కర్లు కొడుతుంటది.” అన్నది ఆంజల్య. అప్పుడప్పుడూ వారిద్దరికీ తమ మృత్యువుపై తామే జోకులేసుకోవటం అలవాటే.
“ఏడేడు జన్మల క్రిందట అంటే ముందు ఐదు జన్మల క్రింద మధ్య ఆసియా దేశాలలో ఆరవ జన్మలో రష్యాలో ఏడవ జన్మలో చైనాలో జన్మించి ఈ జన్మలో ఈ దేశంలో పుట్టాను. అందుకే నా ఆత్మ ఇప్పటికీ ఆ దేశాలలో తిరగాలని తపిస్తుంది” అన్నాడు స్వామి.
“నేను వొద్దన్నా నువ్వు ఊరుకోవు. మానుకోవు. మరి నీ ప్లానింగ్ సంగతులన్నీ వివరంగా చెప్పు”.
“అసలు సిల్కురూట్ యాత్ర కాబూల్ నుండి ప్రారంబిద్దామనుకున్నా. కాని తాలిబన్ల గడబిడ ఉంది కదా ఈ టైంలో అప్ఘానిస్తాన్ వీసా కూడా దొరకదు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంటు నుండి యాత్ర శురూ చేస్తాను. తాష్కెంటు వరకూ విమాన ప్రయాణం. అక్కడి నుండి చైనా రాజధాని బీజింగు వరకూ సిల్కురూటు భూమార్గ ప్రయాణం. అంటే బస్సులు, రైళ్లల్లో. బీజింగు నుండి ఇండియాకు మళ్లీ గాలిమోటారు ప్రయాణం.”
“ఎన్ని దేశాలు? ఎన్ని రోజులు? అందాజాగ బడ్జెట్ ఎంత?”
“అన్ని మధ్య ఆసియా దేశాలే. ఉజ్బెకిస్తాన్, కిర్గీజ్‌స్థాన్, కజకిస్థాన్. ఒకప్పుడు ఇవన్నీ సోవియట్ యూనియన్లో రిపబ్లిక్కులు. 1990 తర్వాత ఇప్పుడు స్వతంత్ర దేశాలు. ఆఖరికి చైనా. యాత్ర ముగింపు బీజింగులో. ఈ మధ్యాసియా దేశాలన్నీ రాహుల్‌జీ రెండుసార్లు పర్యటించి ‘మధ్య ఆసియాకా ఇతిహాస్’ అన్న పెద్ద పుస్తకం రాశాడు. ఇగ నువ్వు భయపడనంటే ఇది ఎన్ని రోజుల యాత్ర అనేది కూడా చెపుతా” అని ఆగాడు స్వామి.
“నిండా మునిగిన వాళ్లకు ఇంకా చలేమిటి?” అన్నది ఆంజల్య.
“సుమారు రెండు నెలలు అంటే. అరవై రోజులు. మొదటి మూడు దేశాలు ఒక నెల. చైనా పెద్ద దేశం కాబట్టి మరో నెల. ముందే అడ్వాన్సుగా రైళ్ల బుక్కింగులు, బస చేయటానికి హోటల్ బుక్కింగులు లాంటివి ఏమీ ఉండవు. అవన్నీ రొటీన్ టూరిస్టులు చేసే ప్లానింగులు. నేను ట్రావెలర్‌ను కావున రాజ్‌కపూర్ 420లో చెప్పినట్లు
‘మంజిల్ కహాఁ కహాఁ రుఖ్‌నా హై ఊపర్ వాలా జానే’. మార్గం మధ్యలో ఎవరైనా దయతలిస్తే గ్రామాలలో రైతుల ఇళ్లల్లో బస చేయాలని నా కోరిక.”
“తథాస్తు” అన్నది ఆంజల్య. ఆమె గట్టి పిండం కాబట్టి సరిపోయింది. మరొకరైతే ఆ మాటలు విని ‘బేహోష్’ అయిపోయేవారు. కాశీకి పోవటం అంటే కాటికి పోయినట్లే అని పాత కాలం సామెత. ఈ దుస్సహాస ప్రయాణం కూడా అట్లాంటిదే. అరవై దాటిన స్వామికి ఆరోగ్య సమస్యలేం లేవు. ఎక్కడ ఏం తిన్నా, ఎట్లాంటి తిండి తిన్నా ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ బాపతు. ఆ విషయంలో కూడా ఆమెకు ఫికర్ లేదు. తనకేమన్నా అయితే కొడుకును జాగ్రత్తగా ఆమె చూసుకుంటుందన్న భరోసా స్వామికి సంపూర్ణంగా ఉంది.
సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్క కాదని సంజీవ్ దేవ్ చెప్పనే చెప్పాడు. కావున ‘సాహసం సేయరా డింభకా’.
“కాని ఒకటే సమస్య ఉంది ఆంజల్యా” అని స్వామి ఆగాడు.
“ఏందదీ” అన్నది ఆమె.
“ఎంత సింపుల్‌గా యాత్ర చేసినా మూడు, నాలుగు లక్షల వరకు ఖర్చు అయ్యేటట్లు ఉంది” అన్నాడు జంకుతూ.
“ఏం పరవాలేదు. నీ రిటైర్‌మెంటు బెనిఫిట్సూ, ప్రావిడెంటు ఫండు డబ్బులు ఉన్నాయి కదా. కావాలంటే అవన్నీ ఖర్చు చేయి. నీ చిరకాల కోర్కె తీర్చుకోవటం ముఖ్యం” అన్నది చాలా సిన్సియర్‌గా.
“అయ్యో ఉన్న పైసలు అయిపోతే ఎట్లా? రాజా చదువు ఇంకా ఉంది కదా” అని దిగులు పడ్డాడు.
“అంత అవసరమైతే నా ఒంటిమీద ఎంతోకొంత బంగారం ఉంది కదా. దానికి మంగళం పాడుదాం. ఆ తర్వాత బ్యాంకు లోను. వాడే తీర్చుకుంటాడు. ఇక నువ్వు యాత్ర కోసం తయ్యార్ కా!” అని అభయహస్తం చూపించింది.
నాలుగు దేశాల వీసాలకోసం ఢిల్లీకి రైలులో పోతున్నపుడు నాగపూర్ దాటిన తర్వాత సెల్లు గొల్లుమన్నది. ఆంజల్య ఫోను.
“యాది సదాశివగారు ఇక లేరని.”
ఆయన పాదాలకు ఆఖరి నమస్కారానికి నోచుకోనందుకు మనసు మూగగా రోదించింది.
“హర్ ములాఖాత్ కా అంజామ్
జుదాయీ క్యోం హోతీ హై?”
కొంత ప్రయాస తర్వాత అన్ని దేశాల వీసాలు దొరికినాయి. స్వామి దృష్టిలో యాత్రకు ప్రిపరేషన్ అంటే మధ్య ఆసియా దేశాల చరిత్ర, రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు చదవటం, ఇంటర్‌నెట్‌లో కొంత సమాచారం సేకరించటం. ఆబిడ్స్ హుస్సేన్ బుక్ షాపులో సెంట్రల్ ఏసియాకు సంబంధించిన మంచి బుక్కు అదృష్టం కొద్ది దొరికింది. చైనా చరిత్ర, విప్లవం, నాలిక మీదనే నడయాడుతుంది. అయినా చైనా గురించి లోన్లీ ప్లానెట్ గైడ్ బుక్ లేటెస్ట్ ఎడిషన్ కొన్నాడు. ముందస్తు అధ్యయనం లేకుండా దేశాలను, ప్రాంతాలను సందర్శించటం అంటే ‘తిప్పుడు తిరపతికి వెళ్లాడు, వచ్చాడు’లా ఉంటది.
బడ్జెట్ టూరు కావున లోహవిహంగాన్ని ఎక్కేది ఢిల్లీలో. వీడ్కోలు చెప్పటానికి నాంపల్లి రైలు స్టేషన్‌కు ఆంజల్య, రాజా ఇద్దరే వచ్చారు. వాళ్లు టాటాలు చెబుతూ కనుమరుగవుతుంటే దేశం కాని దేశాలలో బాష తెలియని దేశాలలో, ఒంటరిగా, అనామకంగా, ఎటువంటి ఠికానా, ఆశ్రయం లేకుండా రెండు నెలలు తిరగబోయే తనకు ఏమైనా జరిగితే, నా సమాచారం ఇంటికైనా చేరుతుందా అని స్వామికి మనసులో రవ్వంత జంకు ఏర్పడింది. ఎందుకొచ్చిన రొస్టు, ఎందుకొచ్చిన యాతన అనిపించింది. మరుక్షణం రెండువేల సంవత్సరాల క్రితం చైనాలో బౌద్దమత ప్రచార నిమిత్తమై మనదేశం నుండి ఒంటరిగా, కాలినడకన బయలుదేరి గోబీ ఇసుక ఎడారులలో అనామకంగా రాలిపోయిన బౌద్ధభిక్షువులు జ్ఞాపకం వచ్చారు. ఎంతో కొంత ఆ రక్తం తనలోనూ ఉందని గర్వించాడు.
తన జీవితంతో తానే ప్రయోగాలు చేసుకునే చల్ అకేలా ముసాఫిర్ స్వామి.
***
ఢిల్లీ ప్రొద్దున్నే చేరుకున్నడు. కరోల్ బాగ్‌లో తక్కువ రకం లాడ్జీలో సింగిల్ రూము తీసుకున్నడు. అర్ధరాత్రికి తాష్కెంటు ఫ్లైటు. కాలక్షేపం కోసం ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఢిల్లీ విలేఖరిగా పనిచేస్తున్న ఒక మిత్రుడికి ఫోను చేసాడు. ఢిల్లీ ఎందుకొచ్చారు అని అతనడిగితే ఉన్నదున్నట్లు చెప్పాడు. యాత్రలో ఏదో విశేషం, గమనించిన అతను ఉండబట్టలేక హోటల్ రూంకు పరిగెత్తుకొచ్చి ప్రశ్నల పరంపరను సంధించాడు. ఆ తెల్లారి తను పనిచేస్తున్న దినపత్రికలో “సలాం హైద్రాబాద్ నవలా రచయిత సిల్కురూటులో రెండు నెలల ఒంటరి ప్రయాణం” అని కథనం రాసాడు. అది మెయిన్ ఎడిషన్‌లో అచ్చయి దోస్తులకు, అభిమానులకు తెలిసిపోయింది.
స్వామి ఢిల్లీ నివాసిఐన రచయిత, ట్రావెలర్ దాసరి అమరేంద్రకు తన యాత్ర గురించి చెప్పగానే ఆ సాయంత్రం హోటల్ రూంకు వచ్చాడు. యాత్ర సంగతులన్నీ విన్న అతను ఏం ఇబ్బందులు, అవసరాలు వచ్చినా తనకు ఫోను చేయాలని చెప్పాడు. ఆ ధైర్య వచనాలు స్వామికి సంతోషం కలిగించాయి.
అర్ధరాత్రి విమానం ఎక్కి మాతృదేశానికి వీడ్కోలు పలికాడు.
***
యాభై అయిదు రోజుల యాత్ర ముగించుకుని ఇంటికి రాగానే రాసుకున్న నోట్సుల ఆధారంగా ‘సిల్కు రూట్‌లో సాహస యాత్ర’ రచన ప్రారంభించాడు. అది అపురూప యాత్రా గ్రంథం కావున ఖర్చులకు బెదరక బోలెడన్ని కలర్ ఫోటోలు ముద్రించాడు. పుస్తకం క్వాలిటీలో ఎక్కడా రాజీపడలేదు. ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్‌లో దానిని కళాత్మకంగా అందంగా ముద్రించాడు. ఆర్నెల్లలో వేయి కాపీలు అమ్మగా రెండవ ముద్రణకు వెళ్లింది. వందలాది మంది అభిమానులను సంపాదించుకోవటమే గాక విభిన్నమైన యాత్రా రచయితగా పేరొచ్చింది.
ఆ పుస్తకం ముగింపులో స్వామి ఇట్లా రాసుకున్నాడు.
నా 55 రోజుల సిల్కురూట్ యాత్ర ముగిసింది. బుఖారాలోని లాబీహౌజ్ మదర్సాలతో మొదలయిన నా యాత్ర ఈ బీజింగ్‌లోని కన్‌ప్యూషియస్ విశ్వవిద్యాలయం వద్ద ముగిసింది. ఐదువేల సంవత్సరాల ప్రాచీన నాగరికత గల భారతదేశం నుండి బయలుదేరిన నేను దానికి సమకాలీనమైన, దానిలాగే ఘనమైన ఐదువేల సంవత్సరాల నాగరికత కల్గిన చైనాకు చేరటంతో నా సుదీర్ఘయాత్ర ముగిసింది. ప్రాచీన తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల వారసత్వానికి ప్రతినిధినైన నేను ఒక విశ్వవిద్యాలయంతో ప్రారంభించి మరో విశ్వవిద్యాలయం వద్ద నా యాత్ర ముగించటం కాకతాళీయమే ఐనా దీనిని Quest for Knowledge అనవచ్చునా?
ఆ నిర్జన, నిశ్చల, ప్రశాంత సాయంకాలం బీజింగ్‌లోని ఓ పురాతన వృక్షం క్రింద ఉన్న చలువరాతి మీద ఒక్కణ్ణే కూచున్నాను. ప్రపంచంలోనే అతి పురాతనమైన ‘ఆసియా’ నాగరికతలు జ్ఞాపకం వచ్చాయి. ఏడు వేల సంవత్సరాల క్రిందటి బాబిలోనియా, మెసపటోమియా, నాగరికతలతో పాటు ఐదువేల సంవత్సరాల నాటి మన హరప్పా, మోహెంజోదారో, లోథాల్ నాగరికతలు, దీనికి సమకాలీనమైన చైనా నాగరికత జ్ఞాపకం వచ్చింది. తర్వాత కాలాలలో యావత్ ప్రపంచానికే ‘విజ్ఞానభిక్ష’ పెట్టి నాగరికతల్ని ప్రసాదించిన ‘ఆసియా’ గొప్పతనాన్ని మననం చేసుకున్నాను.
ఉజ్బెకిస్థాన్‌లో 876 కి.మీ., కిర్గిజ్‌స్థాన్‌లో 4,736 కి.మీ., చైనాలో 9,000 కి.మీ., మొత్తం యాత్రలో 14,612 కి.మీ. పర్యటించాను. ఇదీ నా 55 రోజుల సిల్కురూటు యాత్ర.
ఒక కల నెరవేరింది. ఒక తపన, ఒక తృష్ణ, ఒక జ్వాల చల్లారింది. మళ్లీ కలలు కనడం ప్రారంభమైనాయి. ఈసారి పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ల మీదుగా ఇరాన్, ఇరాక్‌లను చుట్టుముడుతూ బాబిలోనియన్, నుమేరియన్, నాగరికతలను చేరుకుని పురాణపురుషుడు ‘జిల్గామేష్’ నడయాడిన నేలలో సంచరించాలని!
‘స్వప్న సంచారిని’ నేను.
అధ్యాయం-33: తీరం చేరిన నావ
2012 మార్చి నెలలో ఆరు తెలంగాణా శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణా సాధన సంస్థ పార్టీ ఐదు స్థానాలను భారీ మెజార్టీతో గెలిచింది. ఆరవ సీటును ఒక ఇండిపెండెంటు అభ్యర్థి తెలంగాణ జేఏసీ మద్దతుతో గెలవటంతో తెలంగాణావాదం బల నిరూపణ జరిగింది.
నిజానికి తె.సా.సం. పార్టీ ఎన్నికలు, ఉపన్నికలు, ఢిల్లీలో లాబీయింగుల మీద చూపిన శ్రద్ధ సమరశీల ఉద్యమ నిర్మాణం మీద చూపలేదు. ఆ ఉద్యమ నిర్మాణం, నిర్వహణా బాధ్యత అంతా కార్యక్షేత్రంలో తెలంగాణా జేఏసీ తలకెత్తుకుంది. రాజకీయ నాయకులందరూ తమ స్వప్రయోజనాల కోసం తె.సా.సం, దాని అధ్యక్షుడు, కొడుకూ, కూతురు, బంధువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ప్రజలు మాత్రం జేఏసీని నమ్ముకుని దానికి మద్దతుగా నిలిచారు. ఉద్యమంలో ఆ వైరుధ్యం స్పష్టంగా బయటపడింది.
టి.ఎస్.ఎస్. అధ్యక్షుని ఉడత ఊపులకు, బెదిరింపులకు కేంద్రం ఏ మాత్రం భయపడటం లేదు. ఆయన 2012లో చాలా సార్లు డెడ్‌లైను పెట్టాడు. కాని ప్రత్యక్ష కార్యాచరణకు దిగక ఎండమావులను నమ్ముకుని ఎక్కువ కెక్కువగా ఢిల్లీలోనే మకాం వేస్తున్నాడు. తెలంగాణా ప్రజలకు ఆయనపై నమ్మకం సడలసాగింది. “ఢిల్లీలో లాబీయింగులు కాదు గల్లీలల్ల రాళ్లుపట్టుకుంటే తెలంగాణా వస్తది” అని భావించసాగారు.
గాంధీజీ చేపట్టిన ‘దండి యాత్ర’ ప్రభావంతో జేఏసీ సెప్టెంబరు 30న తెలంగాణా మార్చ్‌కు సమరశంఖం పూరించింది. ఆ సందర్భంలో ఆంధ్రుల ఆస్తులపై దాడులు, హింస, విధ్వంసం చెలరేగే అనుమానంతో ప్రభుత్వం గనేష్ నిమజ్జనం, బయోడైవర్సీటీ సమావేశాలను సాకుగా చూపి ముందు అనుమతి నిరాకరించింది. “ఓర్పు ఉంటే ఓరుగల్లునైనా గెలవవచ్చు” అన్న సామెత స్ఫూర్తిగా జేఏసీ, తెలంగాణా మంత్రులను కూడా కలుపుకుని లిఖితపూర్వకంగా ఏలిన వారికి ఒక హామీ పత్రం సమర్పించింది. ఎటువంటి హింస, విధ్వంసం జరపకుండా నెక్లెస్‌రోడ్డుపై గాంధేయ మార్గంలో యాత్ర నిర్వహిస్తామని!
మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఆరు వరకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాని ఆ కార్యక్రమాన్ని విఫలం చేసే కుట్ర బుద్ధితో రైళ్లు, బస్సులను రద్దు చేసి, రాజధానికి వచ్చే రహదారులన్నింటినీ మూయటం, విశృంఖలంగా అరెస్టులు కొనసాగించింది. అయినా పోలీసుల కళ్లుకప్పి సుమారు రెండు లక్షల మంది నెక్లెసురోడ్డులో జమ అయినారు.
దిగ్బంధం చేయబడిన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు పోలీసులకు మధ్య రణరంగం జరిగింది. అక్కడ పెద్దఎత్తున అరెస్టులు జరిగాయి. నెక్లెస్‌రోడ్డులో రాత్రి ఏడు తర్వాత కూడా ప్రజలు అక్కడే బైఠాయించినందున లాఠీచార్జీలు, భాష్పవాయువులు, వాటర్ క్యానన్లను పోలీసులు ప్రయోగించారు. రాత్రి పన్నెండు వరకు అక్కడ ప్రజలకు, పోలీసులకు మధ్య సంకులసమరం జరిగింది. అర్ధరాత్రి భోరున కురిసిన వర్షంతో ‘తెలంగాణా మార్చ్’ ముగిసింది. ఆ తెల్లారి పోలీసులు టీజేఏసీ అధ్యక్షుడు కల్యాణ్ రాంరెడ్డితో సహా చాలా మందిపై కేసులు పెట్టారు. మీడియా మాఫియా, మెడికల్ మాఫియా, ఎడ్యుకేషనల్ పమాఫియా, సినీఫీల్డ్ మాఫియాలన్నీ ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో ఉన్నాయని అందరికీ తెలిసిన సంగతే. వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలంటే సహాయ నిరాకరణ, బహిష్కరణ ఒక్కటే మార్గం. స్వాతంత్య్రోద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలా!
ఆకృతి సంస్థ అధ్యక్షురాలు మమత త్వరలోనే ఆంధ్రా సీనిమాల బహిష్కరణ ఉద్యమం చేపట్టబోతున్నానని, తెలంగాణాలో అన్ని సీన్మాహాళ్లు మూతబడతాయని తెలంగాణా ప్రజలెవరూ ఆంధ్రా సీన్మాలను చూడవద్దని గంభీరమైన ప్రకటన వీరలెవల్లో చేసింది. అది చాలా మంచి ఆలోచన అని ప్రజలందరూ భావించారు. సీన్మాల బహిష్కరణకు మద్దతు తెలపాలని అనుకున్నారు. కాని తెరవెనుక ఏం డీలింగులు, మతలబులు జరిగాయో ఏమో కాని మళ్లీ ఆ ప్రసక్తి ఆమె ఎక్కడా చేయలేదు. బ్రతుకమ్మ ఆటలకే పరిమితమయ్యింది.
ప్రజలకు ‘జ్ఞాపకశక్తి చాలా తక్కువనీ’ రాజకీయ నాయకులు అనుకుంటారు. అదే వారి ధైర్యం.
జూన్ 2013లో జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. అది ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం. మిలియన్ మార్చ్, సాగరహారం తర్వాత చలో అసెంబ్లీ సంచలన సమరశీల కార్యక్రమం కావున ప్రభుత్వం పెద్ద ఎత్తున విఫల ప్రయత్నాలు చేసింది. అరెస్టులు, నిర్బంధాలు షరా మామూలే.
“జుకానే వాలా హైతో
సారీ దునియాభీ జుక్తీహై” అని ఒక సామెత.
ఎట్టకేలకు చివరాఖరికి కాంగ్రేసు వర్కింట్ కమిటీ ఏకగ్రీవంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం చేయడంతో జగన్నాథ రథ చక్రాలలో కదలిక వచ్చింది.
కడుపు మండిన సమైక్యవాదులు, అన్ని పార్టీల వాళ్లు ఆంధ్రా రాయలసీమలో ఉద్యమాన్ని ఉదృతం చేసారు. ఏమీ తెలియని అమాయక ప్రజలు ఆ ఊరేగింపులలో పాల్గొని ‘బేగానీ షాదీమే అబ్దుల్లా దివానాలు’ అయినారు.
అక్టోబరు నెలలో సి.డబ్ల్యు.సి. తీర్మానానికి కేంద్ర క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక దశలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను ఏర్పడబోయే తెలంగాణా నూతన రాష్ట్రంలో కలపాలని నిర్ణయించారు. కాని తెలంగాణాలో తీవ్రమైన నిరసనలు, బంద్ జరిగేసరికి ఆ ఆలోచన మానుకున్నారు.
అనేక నాటకీయ పరిణామాల తర్వాత 2014 ఫిబ్రవరిలో లోకసభలో తెలంగాణా బిల్లును కేంద్ర హోం మినిస్టర్ ప్రవేశపెట్టారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు దానిని ఆపటానికి పెద్ద ఎత్తున గొడవలు సృష్టించారు. లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర ఎం.పి. తన స్థాయి మరిచి ఒక వీధి రౌడి మాదిరిగా పార్లమెంటు సభ్యులపై పెప్పర్ స్ప్రే ఉపయోగించగా ఆ గందరగోళంలో అతనితో సహా మరికొంతమంది తెలంగాణా సభ్యులు తీవ్రంగా గాయపడినారు.
ఆ తర్వాత 18 ఫిబ్రవరి 2014 నాడు లోకసభలో, 20 తేదీన రాజ్యసభలో తెలంగాణా బిల్లు పాస్ అయ్యింది. బిల్లుకు తెలుగుదేశం, మజ్లిస్, కమ్యూనిస్టుల మార్క్సిస్టు పార్టీ మాత్రం మద్దతు తెలుపలేదు.
జూన్ రెండు 2014 నాడు అధికార పూర్వకంగా తెలంగాణా రాష్ట్రం 28వ రాష్ట్రంగా అవతరించబోతుంది. ఆనాడు ఒక సుదీర్ఘమైన కల సాకారం అయ్యింది.
టి.వి. చానెల్స్‌లో లోకసభలో బిల్లు పాస్ అయ్యిందన్న వార్త వినగానే సంతోషం, దుఃఖమూ ఆపుకోలేని ఆంజల్యా, స్వామి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపాన్ని చేరుకున్నారు. 1952, 1969 ఉద్యమంలో అమరులైన వారికే గాక వర్తమాన ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్న 1200 మంది విద్యార్థులకూ, యువకులకు స్థూపం వద్ద ఎర్రెర్రని గులాబీలు సమర్పించి నివాళులు అర్పించారు.
ప్రజలు జై తెలంగాణా నినాదాలు చేసుకుంట అక్కడికి గుంపులు గుంపులుగా చేరసాగారు. సంతోషం పట్టలేక ఒకర్నొకరు కావలించుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ మిఠాయిలు తినిపించుకుంటున్నారు.
ఆంజల్యను ఇంటికి పంపిన స్వామి ఒక్కడే చార్మినార్ వైపు వెళ్లాడు. పద్దెనిమిది ఏండ్ల సిటీ కాలేజీ విద్యార్థిగా 1969లో తన తెలంగాణా ఉద్యమ ప్రస్థానం అక్కడ్నుండే మొదలయ్యింది కదా!
***
జెఫ్రీ ఆత్మ ‘చార్’మీనార్ల చుట్టూ పరిభ్రమించి ఆకాశం అవతలి వైపు మాయమైనాక స్వామి ఇక్బాల్ హోటల్ల అట్లనే కూర్చున్నాడు. మగ్రీబ్ నమాజుల వేళ సాయంసంధ్య చీకట్లు అంతటా మెల్లమెల్లగా పరచుకుంటున్నాయి. ఆకాశం చుక్కల చీర కట్టుకోవటానికి సిద్ధమవుతుంది. ఆ అసుర సంధ్యలో అతనికి హఠాత్తుగా ‘ఉమ్రావ్ జాన్’ సీన్మా పాటలోని ఒక చరణం జ్ఞాపకం వచ్చింది.
“తమామ్ ఉమ్ర్ కా హిసాబ్
మాంగ్ తీ హై జిందగీ”
ప్రయాణం ముగిసింది. జీవితం పురికొసకు వచ్చేసింది. ఇప్పుడిక జీవితం పద్దుల పుస్తకంలో లెక్కలు చూసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. లాభనష్టాల బేరీజులను అంచనా కట్టాలి. జీవితకాలం గెలుపోటములను సమీక్షించుకోవాలి.
యవ్వనారంభంలో మరో ప్రపంచం అనే పెద్ద కలను మోసుకుంటూ ప్రయాణం ప్రారంభించాడు. కాని అది ఎండమావుల అన్వేషణ అని తేలిపోయింది. స్వప్నం భగ్నమయ్యింది. పడవ మునిగి పోయింది. మార్గం మధ్యలో మరో చిన్న కల. దానిని భుజాన వేసుకుని మళ్లీ దశాబ్దాల ప్రయాణం. ఆ ఒక్క కల మాత్రం ఇప్పుడు నెరవేరింది.
అర్ధశతాబ్దం పైగా పయనించిన నావ, అనేక ఆటుపోట్లకు గురై, అనేక మజిలీలను దాటి పయనించిన నావ చిట్టచివరికి తీరం చేరుకున్నది.
“హమ్ లాయేహైఁ తుఫాన్‌సే కిస్తీ నికాల్‌కే
ఇస్ దేశ్‌కో రఖ్‌నా మేరే బచోఁ సంభాల్‌కే”.
(జాగృతి సీన్మా 1954)
పెను తుఫానులను తప్పించి ఈ నావను తీరానికి చేర్చినాం.
రాబోయే తరాలు దీనిని సురక్షితంగా కాపాడు కోవాలి.
(సలాం హైద్రాబాద్ నవలాత్రయం సమాప్తం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.
