[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[1989 డిసెంబరు నెల పదిహేనవ తేదీ రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో మతకలహాలు చెలరేగుతాయి. ఉద్రిక్తతలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటూ నగరాన్ని అల్లకల్లోలం చేస్తారు. స్వామి ఉంటున్న ప్రాంతంలో గొడవలు మరీ ఎక్కువ కావడంతో, ప్రాణభయంతో వారు ఆ ఇల్లు విడిచి, కొంచెం దూరంలోని అక్క ఇంటికి వెళ్తారు. తర్వాత కారణలు అన్వేషిస్తే, పదవి కోసం జరిపించిన మారణకాండ అని స్వామికి అర్థం అవుతుంది. పాతబస్తీ లోని తమ ఇంటిని అమ్మేయాలని స్వామివాళ్ళు నిర్ణయించుకుంటారు. రోజులు గడుస్తాయి. స్వామి, కొత్త ఉద్యోగంలో మొదటి జీతం అందుకుంటాడు. జీతం నగదు రూపంలో కవర్‍లో పెట్టి అందిస్తూ ఖాదర్ స్వామిని అభినందిస్తాడు. కృతజ్ఞతలు చెప్తాడు స్వామి. ఇంటికి వెళ్ళి ఆ కవర్‌ని భార్యకిస్తాడు. ఆమె లెక్కబెట్టి మురిసిపోతుంది. మర్నాడు సాయంత్రం ఖాదర్‌తో కలిసి హోటల్‍కి వెడతాడు స్వామి. అక్కడ కబాబ్‍లు తింటూ, ఉద్యోగానికి సంబంధించిన ఎన్నో సందేహాలు ఖాదర్‍ని అడిగి తీర్చుకుంటాడు స్వామి. లంచాలెందుకు, ఎలా తీసుకుంటారో, ఎవరెవరికి ఎంత వాటాలుంటాయో ఖాదర్ చెప్తుంటే విస్తుపోతాడు స్వామి. ఆఫీసు రహస్యాలు తెలుస్తాయి స్వామికి. – ఇక చదవండి.]
అధ్యాయం-7: హమ్‌తో చమన్ చోఢ్ చలే
నానా ప్రయత్నాలు చేసి నగరం నడిబొడ్డున ఆబిడ్స్‌లోని ఒక ప్రముఖ ఇంగ్లీష్ కాన్వెంటు స్కూలులో సమతకు ఆరవ తరగతి అడ్మిషన్ ఇప్పించాడు స్వామి. అది బ్రిటిష్ కాలం నాటి స్కూలు. ఆ భవనం వాస్తుశైలి పూర్తిగా ఇండో యూరోపియన్ వాస్తుశైలిలో అట్టహాసంగా ఉంది. సువిశాలమైన ఆటమైదానం కూడా ఉంది. మొదటిసారి ఆ స్కూలు ప్రాంగణం చూడగానే సమత తన ఉత్సాహపు పరవళ్లను ఆపుకోలేక తన సహజరీతిలో జింక పిల్లలా గంతులు వేసింది.
పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్న పరవాలేదు కాని అత్యున్నత ప్రమాణాలు ఉన్న స్కూళ్లలో చదివించాలని ఒకప్పుడు వారు బంగారు కలలు కన్నారు. ఇప్పుడు ఒక కల సాకారమయ్యింది. ఆ తర్వాత స్కూలుకు దగ్గరగా, కాలినడక దూరంలో ఇల్లు కిరాయికు తీసుకోవాలని ఇద్దరూ అనుకుని గన్‌ఫౌండ్రీ ఏరియాలో మూడు గదుల ఇల్లు తీసుకున్నారు. స్మాల్ ఈజ్ బ్యూటీ అన్నట్లు చిన్నదే అయినా చూడముచ్చటగా ఉంది. పాప స్కూలుకు వెళ్లటానికి ఐదు నిమిషాల నడక. ఈ కొత్త స్కూలు దూరంగా లేకపోవటంతో దానికి కూడా ప్రాణం సుఖంగా ఉంది. ఆ కొత్త లోకాల్టీలో దానికి అతి త్వరలో పెద్ద స్నేహితుల గుంపు దొరికింది. అది ఇంట్ల ఉండేది తక్కువ బయట దోస్తులతో ఆడుకునేది ఎక్కువ. వారికి ఎల్.బిస్టేడియం దగ్గరే కావున దానిని అక్కడి జిమ్నాస్టిక్స్, అథెలిటిక్స్‌లో జాయిన్ చేయించాడు. ప్రతి సాయంత్రం, ఆదివారాలు అది అక్కడికి వెళ్లి శ్రద్దగా ప్రాక్టీసు చేసేది. దానితో దాని సోషల్ మొబిలిటీ ఇంకా ఎక్కువ అయ్యింది. అందరిలో ఈజీగా కలిసిపోవటం, ఎవరితోనైనా ఈజీగా మాట్లాడటం అలవాటు అయ్యింది.
తమ్ముళ్లిద్దరూ నగరంలో చెరో మూలలో కిరాయి ఇండ్లల్లో చేరారు. అమ్మ చిన్న తమ్ముడి దగ్గరే ఉండసాగింది. పాత ఇల్లు అమ్మిపెట్టే బాధ్యతను అక్కడే పాతనగరంలో ఉన్న అక్కాబావలు తీసుకున్నరు.
చూస్తుండగానే ఆంజల్యకు నెలలు నిండాయి. తొమ్మిదో నెల వచ్చేసింది. పొద్దులన్న మాట. సహాయానికి ఆంజల్య అమ్మకూడా వచ్చింది. ఆఫీసులో ట్రెయినింగు కూడా దాదాపు చివరికి వచ్చింది. స్టాఫ్ అందరి వద్దా కూచుని అకౌంట్స్ తనిఖీ చేయటం, ఆ లావాదేవీల లెక్కలను మదింపుచేయటం, అసెస్‌మెంటు ఆర్డర్లు రాయటం, కొత్త డీలర్ల పూర్వపరాలను విచారణ చేసి వారిని అమ్మకం పన్ను చట్టం ప్రకారం రిజిస్టర్ చేసి ప్రత్యేక కోడ్ నంబర్లు కేటాయించటం, మార్కెట్‌లకు వెళ్లి వారి వారి అకౌంట్స్‌లను హఠాత్తుగా తనిఖీ చేసి దొంగ లెక్కలను ఇవతలికి లాగటం, అవసరం అనుకుంటే వారి ‘స్టాక్’లను మొత్తం ఫిజికల్ వెరిఫికేషన్ చేసి కొనుగోలు, అమ్మకం మధ్యగల తేడాలను బేరిజు వేయటం నేర్చుకుంటున్నాడు. ఒకసారి మార్కెట్టుకు తనిఖీలకు వెళ్తే చాలా పొద్దుపోయి రాత్రి అయ్యేది. మధ్యలో పని ఆపే వీలుండదు. స్వామికి మొదట్లో కష్టం అనిపించినా ‘మజ్బూరీ కా నామ్ మహాత్మాగాంధీ’ అన్నట్లు. రాను రాను అలవాటు ఐపోయింది. అయితే ఆ పబ్లిక్ రిలేషన్స్, వ్యాపారులు చూపించే భయభక్తులు, గౌరవాలను చూస్తున్న స్వామికి కొంచెం ఆనందంగా కూడా ఉండేది.
ఈ డిపార్ట్‌మెంటులో పని భారం చాలా ఎక్కువ. ఈ బాధ్యతలన్నీ సరిపోవన్నట్లు నెలలో రెండు మూడు సార్లు రాత్రి డ్యూటీలు కూడా ఉండేవి. అది లారీ చెకింగ్ డ్యూటీ. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న దొంగ సరుకులను పట్టుకోవటం. వారి వే బిల్లులు, పర్చేస్ బిల్లులు వాటి నంబర్లను ఆ రాత్రిపూట టార్చిలైట్లు వెలుగుల్లో తనిఖీ చేసి దొంగ బిల్లులకు నోటీసులు రాయటం. పంజాబు, ఢిల్లీ, హర్యానా లాంటి రాష్ట్రాల నుండి వచ్చే లారీలు పూర్తిగా దొంగసరుకు. వారి వద్ద ఎటువంటి బిల్లులు, డాక్యుమెంట్లు ఉండవు. అటువంటి లారీలను సేల్స్ టాక్స్ కోడ్ బాషలో పూర్తిగా ‘నంగా’ అంటే టోటల్లీ నేక్డ్ అన్న మాట. అటువంటప్పుడు నోటీసు ఇచ్చి మొత్తం లారీని జప్తు చేసి ఆఫీసు ప్రాంగణంలో ఆ రాత్రి నిలిపి అటెండరును కాపలా పెట్టేవారు. ఆ లారీ డ్రైవర్లందరూ సర్దార్జీలు. భారీ శరీరాలతో మాట కూడా మర్యాద మన్నన లేకుండా ఉండేవి. వారితో వ్యవహారం కత్తిమీద సాము లాంటిది. ఒక వేళ టార్చీలైటు వేసి, ఎర్రజండా ఊపి, గట్టిగా విజిల్ వేసినా ఆ సర్దార్జీలు నిర్లక్ష్యంగా లెక్క చేయకుండా ఇంకా స్పీడుగా లారీ ఆపకుండా ముందుకు దూసుకెళ్లేవారు. అటువంటి క్రిటికల్ టైంలో స్వామి తన జీపులో సిబ్బందితో సహా ఆ లారీని వెంబడించి గట్టిగా ఎర్రజండా ఊపుతూ, విజిల్ ఇంకా గట్టిగా ఊదుతూ చివరికి ఆ లారీకి అడ్డంగా తిరిగి దానిని ఆపేవాడు. అది ప్రాణాలతో చెలగాటం. ఆ రాత్రి డ్యూటీలకు చాకుల్లాంటి సిబ్బందిని ఎంచుకునేవాడు. రాత్రంతా డ్యూటీ చేసి మళ్లీ ప్రొద్దునే ఆఫీసుకు అటెండ్ కావాలి.
లారీ ఓనర్లు, వ్యాపారుల యజమానులు వచ్చి టాక్సులు, జుర్మానాలు చెల్లించి లారీలను తీసుకపోయేవారు. అప్పుడు కూడా అన్నీ టాక్సులు చెల్లించాకా ‘అమ్యామ్యాలు’ చేతులు మారేవి. దానికి డిపార్ట్‌మెంటులో ఐ.టీ. అని ముద్దు పేరు. అదేం పేరని కొత్తలో స్వామి ఒక సారి తెల్లముఖం వేసి ఒకరిని అడిగాడు. వాడు చిన్నగా చెవి దగ్గర చేరి “ఇండివిజ్యువల్ ట్యాక్స్ సార్” అని ఉపదేశించాడు. కాసుల గల గలల లావాదేవీలుండే కొన్ని ప్రభుత్వ శాఖలలో కొన్ని కోడ్ పదాలు ఉంటాయి. ఇతరులకు అవి అర్థం కావు. అట్లనే స్వామి పని చేసే శాఖలో వాటి చెలామణీ విస్తృతంగా ఉండేది. ఒకప్పుడు పాతనగరం పత్తర్‌గట్టీలో బట్టల దుకాణం వ్యాపారస్తులు వచ్చిన గిరాకీల ముందు అర్థం కాకుండా వారిలో వారు ప్రత్యేకమైన ‘క’ భాషలో ధరవరలు మాట్లాడుకునేవారు.
తాము గొడ్డు కష్టం చేసి, మేధోశ్రమ చేసి ఏలినవారి ఖజానాకు అన్ని శాఖల కన్నా ఎక్కువ నిధులను సమకూరుస్తున్నప్పుడు తాము కొంత అదనపు ప్రతిఫలాన్ని ఆశిస్తే తప్పేమిటనీ క్రింది నుండి పై స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు తమకు తాము తమ ఆత్మలకు, అంతరంగాలకు స్వయం సంజాయిషీలు ఇచ్చుకోవటం గమనించాడు స్వామి. ఇది చాణ్యుకుడి కాలం నుండి నడుస్తున్న పద్దతి.
ఆ విధంబుగా పన్నులు వసూలు చేసే సిబ్బంది బృందం అందరు కాకున్న ఎక్కువ మంది సంపన్నులుగా ఎట్లా మారుతున్నారో గమనించాడు స్వామి. ఆ సంపన్నులలో ఒకానొక ఒకరు శ్రీశ్రీశ్రీ కోదండ పాణి గారు. ఆయన సకల కళావల్లభుడు కూడానూ! ముత్యాల ముగ్గు సీన్మాలలోని రావుగోపాల రావుకు ఆయన అసలైన నఖల్. అనగా ప్రతి రూపం అన్నమాట. ఆయన లీలావిలాసాలన్నీ మరొకసారి మరోచోట.
***
ఒకరోజు ప్రొద్దున్నే నిద్ర లేచే సరికి ఆంజల్య పిడుగు లాంటి వార్త చెప్పింది. ద్రిగ్బాంతితో స్వామి నిద్రమబ్బు పూర్తిగా తొలిగిపోయింది.
“నిజమా” అన్నాడు కండ్లు పెద్దగా చేసి.
“ఔను నిన్న రాత్రి శ్రీ పెరంబుదూర్‌లో ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ. టెర్రరిస్టులు మానవబాంబు పేల్చి హత్య చేసారట. పాపం ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా..” ఆంజల్య చెప్పలేక పోయింది.
స్వామికి ఆయన అందమైన రూపం, సదా మందస్మిత వదనం జ్ఞాపకం వచ్చింది. అయ్యో అయ్యో అని మనసు మూగగా రోదిస్తుంది. స్థాణువయ్యి అట్లనే మంచంపై కూచున్నాడు. ఇందిరమ్మ హత్య కూడా జ్ఞాపకం వచ్చింది. ఏడేళ్ల వ్యవధిలో ఇద్దరు దేశ ప్రధాన మంత్రుల హత్య. ఇద్దరూ ఉగ్రవాదుల చేతులలోనే. గాంధీజీ హత్య తర్వాత అంతటి సంచలనాన్ని మళ్లీ కల్గించిన హత్యలు ఈ రెండు హత్యలే.
గాంధీజీ ఒక మతదురహంకారి చేతిలో ప్రాణాలు వదిలితే మరొక మత దురహంకారి చేతిలో ఇందిరమ్మ ప్రాణాలు వదిలింది. ఇప్పుడు మళ్లీ ఒక ఉగ్రవాదం రాజీవ్‌ను పొట్టన పెట్టుకుంది. చరిత్ర చర్విత చర్వణం.
దేశాన్ని ఆధునీకరించాలని కంప్యూటర్లను ప్రవేశపెట్టిన రాజీవుడు, అవినీతిని ఒక క్యాన్సర్ పుండుగా వర్ణించి దానికి వ్యతిరేకంగా యుద్దం చేయాలని పిలుపునిచ్చిన రాజీవుడు, నూతన ఆర్థిక విధానాలతో సరళీకరణను పరిచయం చేసిన రాజీవుడు, ఎగుమతులు, దిగుమతుల వ్యాపార వాణిజ్యాలపై ఆంక్షలను, అడ్డంకులను తొలగించి ప్రపంచీకరణకు ద్వారాలు తెరిచిన కమలలోచన, మందస్మిత వదన, యువ రాజీవుడు. కలలో కూడా ఎప్పుడు రాజకీయ జీవితాన్ని ఊహించని ఆ లోహవిహంగ చోదకుడు అమ్మ అకస్మాత్తు మరణంతో దేశ భారాన్ని, ముళ్లకిరీటాన్ని నెత్తిన ధరించి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక చారిత్రక దశలో ఇప్పుడు శ్రీపెరంబుదూరు పచ్చిక మైదానంలో ఒక ఎర్రని మాంసం ముద్దగా…. స్వామి ఆలోచించలేక పోతున్నాడు.
ఆంజల్య టీ.వి. ఆన్ చేసింది. హైద్రాబాద్ దూరదర్శన్‌లో తెలుగు వార్తలు, ప్రముఖుల సంతాప సందేశాలు, రాజీవ్ జీవిత విశేషాలు ప్రసారమవుతున్నాయి. అప్పుడప్పుడూ విషాద సంగీత నేపథ్యంలో శ్రీ పెరంబుదూరు మైదాన మారణహోమ దృశ్యాలు చూడలేక పోతున్నాడు స్వామి.
మళ్లీ హైదరాబాద్ నగరమంతటా ముందు జాగ్రలతో కర్ఫ్యూ విధించబడిరది. నిన్న రాత్రి హత్యావార్త విన్న గంటా రెండు గంటలలో కొందరు కాంగ్రెసు కార్యకర్తలు, తెలుగుదేశం వ్యతిరేకులు, సంఘ విద్రోహక శక్తులు నగరంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్మాహాళ్లు, ఆస్తులు, ఇళ్లపై దాడులు చేసి విధ్వంసాలకు పూనుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారంలో లేకున్నా జాతీయస్థాయి కాంగ్రేసు వ్యతిరేక యునైటెడ్ ఫ్రంట్‌కు ఆయన ఛైర్మన్‌గా ఉండటమే కాంగ్రెసు కార్యకర్తల ఆగ్రహానికి, విధ్వంసానికి కారణమయ్యింది.
రాజీవ్ చనిపోయిన రెండు నెలలకు ఆంజల్య పండంటి కొడుకును కన్నది. వారిద్దరి జీవితాలలో కొత్త వెన్నల ప్రవేశించింది. కష్టాల కడలి ఈది, దాటి తీరం చేరుకున్నాక సరికొత్త సూర్యోదయాన్ని చూసిన ఆనందానుభూతి వారిద్దరికీ కలిగింది. అమ్మ సంతోషానికి అంతులేదు. అక్కలు, తమ్ముళ్లు, బంధు మిత్రులు అందరూ సంతోషించారు.
స్వామీ ఆంజల్య తమలో తాము సంప్రదించుకుని ‘రాజా’ అని పేరు పెట్టుకున్నరు.
***
దుబాయి నుండి వచ్చిన ఒక పాతనగర నివాసి ఇల్లు కొనటానికి ముందుకు వచ్చాడు. అతను గీచి గీచి బేరమాడి చివరికి మూడు లక్షలకు ఒప్పుకున్నడు. అక్కాబావ ఈ సంగతి అందరికీ చెప్పి మంచి బేరమని ఒప్పించారు. అతను ఒకేసారి మొత్తం సొమ్మును నగదు రూపంలో చెల్లించాడు. రాతకోతలన్నీ పూర్తయ్యి సులభంగానే ఇల్లు రిజిస్ట్రేషన్ అతని పేర అయ్యింది.
అందరికీ మనస్సులో ఒక మూల బాధగానే అనిపించింది.
ఇల్లు. ఇల్లంటే కొన్ని ఇటుకలు మరికొంత సిమెంటా? నాలుగు గోడలు దాని మీద ఒక కప్పు, గోడలకు కొన్ని తలుపులూ మరికొన్ని కిటీకీలా? అదేమన్న ఒక సత్రమా? ఒక రాత్రో లేక కొన్ని రోజులో బస చేసి మళ్లీ ఖాళీ చేసి చేతులూపుకుంటూ తిరిగి వెళ్లిపోవటానికి. “హర్ ఘర్ ఖుచ్ కహాతా హై”. వినే హృదయం ఉంటే ప్రతి ఇల్లు ఒక కథ వినిపిస్తుంది. ప్రతి ఇంటి రామాయణం వేరు, వేరుగా విభిన్నంగా విచిత్రంగా ఉంటాయి. జ్ఞాపకాల ఖజానాలు ఆ మట్టి పొరలలో దాక్కుని ఉంటాయి. అక్కడి గాలి కూడా మూగ కథలు విన్పిస్తుంటాయి. చావు పుట్టుకలు, సుఖదుఃఖాలు, కొట్లాటలు, విడిపోవడాలు, తిరిగి కలయికలు, వచ్చి పోయే బంధుమిత్రులు, వారు వెదజల్లిన నవ్వుల పువ్వుల కేరింతల జ్ఞాపకాలు. జ్ఞాపకాల రంగురంగుల హరివిల్లులు. అనుభూతులు, అనుభవాలు, అదంతా అవన్నీ కలగలిపితే ఎన్నడూ వీడని ఒక బొడ్డుపేగు అనుబంధం. పురా జ్ఞాపకాల సమాహారం. సమిష్ఠి స్మృతులూ, జ్ఞాపకాలు. ఆ నేలలో నడయాడి మాయమైన మనుషుల కథలు, కన్నీళ్లు అన్నీ కలిపి గుది గుచ్చితే ఒకానొక చరిత్ర.
బాపు కన్న కలలకు ప్రతిరూపం ఆ ఇల్లు. స్వామి ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ ఇల్లును ఒక కాయస్తుల కుటుంబం నుండి పన్నెండు వందల రూపాయలకు కొన్నారు. ఆ ఇల్లు ఉత్తర భారత వాస్తు శిల్ప శైలితో ఉండేది. ధర్వాజాలు, వాటిపై నగిషీలు, కట్టెలతో చేసిన పెద్ద కటకటాల జాలీలు, మొత్తం ఇంటి మధ్యన సిమెంటు, బండలతో ఒక పెద్ద ప్రాంగణం, దాని పక్కనే మంచి నీటి బావి, ప్రధాన ద్వారం నుండి లోపలికి అడుగుపెట్టగానే కుడివైపు దివాన్ ఖానా ఉండేది. మొదటి రోజు గృహప్రవేశం చేసిన రోజు తాము ఎద్దులు లాగే ఒక గూడుబండిలో అలియాబాద్‌లోని కురుమగూడెం నుండి ఈ కొత్తింటికి రావటం స్వామికి నిన్నగాక మొన్నటి జ్ఞాపకం లాగే ఉంది. వెనక బండ్లల్లో సామానులు వచ్చాయి.
1956లో అమ్మాబాపుకు ఆ పన్నెండు వందలు సర్ధటం గొప్ప భారమయ్యింది. పైస కానరాని కటపిట కాలం అది. బాపు సర్కారీ స్కూలు టీచర్‌గా చాలా చిన్న జీతగాడు. అమ్మ తన వొంటి మీద బంగారం అంతా వొలిచి ఇస్తే దాన్ని గుల్జార్ హౌజ్ మార్వాడీలకు అమ్మగా కనాకష్టంగా 600లు వచ్చాయట. మిగతా ఆరువందల కోసం అదే ఇల్లును వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి ఆ ఇల్లు స్వంతం చేసుకున్నాడు. ఆ అప్పు దాని మీద వడ్డీలు కట్టటానికి ఆయన ప్రతి సాయంత్రం ముస్లిం పిల్లల ఇళ్లల్లకు వెళ్లి తెలుగు ట్యూషన్లు చెప్పేవాడు. అప్పటికి ఆయనకు సైకిలు కొనే తాహత్ లేదు. కాలినడకే గతి స్కూలుకు, ట్యూషన్లకు. ఆ రోజులలో అందరికి కాలినడకే శరణ్యం. దానిని ముద్దుగా బారా నంబరు బస్సు అనేవారు.
మళ్లీ చాలా కాలానికి స్వామి చిన్నక్క పెళ్లి కుదిరింది. బాపు ఆర్థికస్థితి ఎప్పుడూ ‘టన్‌టన్ గోపాలానే’. ఆయన ఇంట్లో స్వయంగా తయారు చేసుకునే జర్దాపాన్ తప్ప మరే వ్యవసనమూ లేదు. ఆయనకు తెల్లటి చందమామ లాంటి గట్టి గడ్డపెరుగు చాలా ఇష్టం. కాని ఆ అదృష్టం లేక పల్చటి మజ్జిగ నీళ్లతోనే సంతృప్తి చెందేవాడు.
అప్పుడు మళ్లీ అక్క పెళ్లి కోసం ఇల్లు తనఖా పెట్టారు. అప్పు తీర్చకపోతే ఇల్లు జప్తు చేసుకుంటారన్న భయంతో అమ్మ కుమిలికుమిలి ఏడ్చింది. స్వామికి అమ్మ దుఃఖం హమేషా అతని మనస్సులో గడ్డ కట్టి నిలిచి పోయింది. ఆ పెళ్లి అప్పు తీర్చి మళ్లీ ఇల్లు విడిపించే వరకూ అమ్మ ప్రతిరోజూ జొన్న రొట్టెలు తప్ప తెల్ల బియ్యపు అన్నం వండకపోయేది. పండగలప్పుడు మాత్రమే వొండేది. అందరికీ సరిపడా వొంటి మీద బట్టలు, పడుకోడానికి పక్క బట్టలు లేక పోయేది. అందరికీ కలిపి ఒకటే సబ్బు, ఒకటే తువ్వాలు, ఒకటే దువ్వెన. దానికొన్ని పండ్లు ఊడిపోయి ఉండేవి. టూత్‌పేస్టులు, పండ్లపొడులు జాన్తానై. కాలిన కట్టె బొగ్గులే గతి. ఇస్త్రీ చేసిన దుస్తులు అపురూపం. నిప్పులేసిన చెంబు ఇస్త్రీ సర్వ సాధారణం. ఇక చెప్పుల సంగతి. అవి హవాయి చెప్పులు రబ్బర్లు తెగిపోతే పిన్నీసు పెట్టి ఆర్నెల్లు నడిపేవాడు. బట్టలు ఉతకటం కోసం 501 బార్ సబ్బుఅతి తక్కువ ధరకు దొరికేది. తాగే మంచి నీళ్లు వీధి అవతలి సర్కారీ నల్లా నుండి తెచ్చుకునేది.
అయితే మాత్రం ఏం? ఆ దివాన్ ఖానా ప్రక్కన ఒక పెద్ద మల్లెపూల చెట్టు ఉండేది. సువాసనగల ఆ తెల్లని మల్లెపూలు ఆకుపచ్చని ఆకుల మధ్య తెలుపు నక్షత్రాల్లా మెరిపిస్తూ గుమ్ముగుమ్మని సదా గుభాళిస్తుండేవి. పున్నమి వెన్నెల రోజులలో చంద్రుడు వారి పేదరికాన్ని చూసి దయతో చల్లని వెండి వెన్నెల ఆ ఇంటిపై వెదజల్లేవాడు. చంద్రునికి తోడుగా ఆ పేద పెంకుటిల్లు కప్పుపై చల్లని నీడ ఇచ్చే అతిపురాతన వృద్ద వృక్షం. ఆ వేపచెట్టు చల్లగాలులు నిరంతరం ఆ ఇంటి ప్రాంగణంపై ప్రసరించేవి. చల్లని బావి నీళ్లు 360 రోజులూ ఆ ఇంటిల్లిపాదినీ చల్లని తల్లిలా ఆదరించేది. అట్లా వాళ్లు చాలా ధనికుల్లా కూడా బ్రతికేవారు.
“మేడంటే మేడా కాదు, గూడంటే గూడుకాదు. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది” అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి సీన్మాపాట ఎప్పుడు విన్నా స్వామికి తన ఇల్లే జ్ఞాపకం వచ్చేది.
ఆ ఇల్లంటే స్వామికి అతని పెద్ద తమ్ముడికి గొప్ప గౌరవం. 1975-76 అత్యవసర పరిస్థితి రోజులలో ప్రముఖ మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ రహస్య జీవితంలో అక్కడ ఆశ్రయం పొందేవారు. అమ్మ వారందరికీ అన్నాలు వండి వడ్డించేది. అట్లా చరిత్ర నిర్మాణంలో ఆ ఇల్లు కూడా తనవంతు పాత్ర పోషించిందని ఆ అన్నదమ్ములకు ఒక గర్వం.
తన కలలగూడు లాంటి ఆ పెంకుటింట్లోనే బాపు కాలం చేసాడు. సమత పుట్టింది ఆ ఇంట్లోనే. స్వామి కొడుకు కడుపుల పడిరది ఆ ఇంట్లోనే. ఇద్దరు తమ్ముళ్ల పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టారు.
అటువంటి ఇల్లు వదలటం వారందరికీ దుఃఖం కలిగించింది. అదొక జ్ఞాపకాల పొదరిల్లులా వాళ్ల మనసులలో హమేషా నిలిచిపోయింది.
“ఖుష్ రహా అహెలె చమన్
హమ్ తో చమన్ చోడ్ చలే”
(మై చుప్ రహుఁగీ, సీన్మా 1962)
***
ఇల్లు అమ్మి డబ్బులు అందిన తర్వాత ఒక ఆదివారం అక్కాబావ వాళ్లందర్నీ శాలిబండ ఇంటికి భోజనాలకని ఆహ్వానించారు.
స్వామి కుటుంబం, ఇద్దరు తమ్ముళ్లు వారి భార్యా పిల్లలందరూ అమ్మతో సహా వచ్చారు. ఆ ఇంటి ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల నీడల క్రింద చాపలు, శత్రంజీలు పరిచి అందరూ గుండ్రంగా నేలమీదే కూచుని ఘనమైన మధ్యాహ్నపు భోజనాలు ముచ్చట్లు చెప్పుకుంటూ ఆరగించారు.
అది కేవలం విందు మాత్రమే కాదని భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిన మీటింగు అని కూడా అందరికీ తెలుసు. అందరూ అక్కడే సుఖాసీనులయిన తర్వాత అమ్మ పురుసత్‌గా పాన్ నములుతూ “నాదొక ఆలోచన” అన్నది.
“చెప్పమ్మా” అని ముగ్గురు కొడుకులు ఒకేసారి ఆత్రుతగా అన్నారు.
“ఏం లేదురా. ఇంత కాలం నేను నా స్వంత ఇంట్లో సుఖంగా ఉన్న. ఇగ ఇప్పుడు నేను చిన్నోడి దగ్గర కిరాయి ఇంట్ల ఉంటున్న. ఇప్పుడు డెబ్బై దాటిన కదా. మా కాలంల అరవై దాటితే చాలు ‘ఇక అస్తో –బిస్తో’ అనేవారు. ఇక నేను ఎంత కాలం బ్రతుకుతనో నాకే నమ్మకం లేదు. అయితే నేను కిరాయి ఇండ్లల్ల మాత్రం చచ్చిపోను. నా స్వంత ఇంట్లనే నా ప్రాణం పోవాలి” అన్నది.
నగరంలో కిరాయలకు ఉండేవాళ్లు ఎవరైనా చనిపోతే దయలేని ఇంటి యజమానులు శవాన్ని ఇంట్లోకి తీసుకురావద్దని గుమ్మం బయట అవతల వీధిలో పెట్టాలని గొడవలు చేయటం అందరికీ తెలిసిన సంగతే. ఆ సంగతి దృష్టిలో పెట్టుకునే అమ్మ స్వంత ఇల్లు కావాలని అడగటం.
“అమ్మా ఆ మూడు లక్షలు ఏ మూలకు. సిటీలో ఆ పైసలకు పాత ఇల్లు కూడా రాదు కదా” అన్నడు స్వామి. అవును అన్నరు ఇద్దరు తమ్ముళ్లు కూడా.
అక్కాబావ మౌనంగా వింటున్నరు.
“అట్లయితే ఆ మూడు లక్షలకూ ఏమీ రాదు కదా. మీరు ముగ్గురూ పంచుకోవాలి. ముగ్గురు అక్కలకు కూడా తృణమో ఫణమో తల్లిదండ్రుల ఆస్తి దక్కాలి కదా. మరి నా రోగం, నొప్పుల ఖర్చుల కోసం నేనూ కొంత తీసుకోవాలి కదా. ఇట్లా ఆ మూడు లక్షలు పంచిపెట్టే పలారమైతే ఎవరికి మాత్రం ఏం లాభం? అని తార్కికంగా మాట్లాడింది.
అవునవును అంటూ అందరూ తలలూపారు.
కొంత సేపయినాక అక్క “నాదొక ఆలోచన” అన్నది. అందరూ ఆమె వైపు చూసారు.
“అమ్మ ఆలోచనలన్నీ సరిఐనవే. అమ్మ తన శేష జీవితం స్వంత ఇంట్లో గటపటమే ఉత్తమం. ఆమెకూ, మనందరికి కూడా గౌరవం. ఆ చిన్న మొత్తాన్ని ప్రస్తుతం మనందరం పంచుకోవటం అర్థం లేని వ్యవహారం. మీ ముగ్గురిలో ఎవరైనా ఒకరు ఆ మొత్తం డబ్బులు తీసుకుని, దానికి మీ స్వంత డబ్బులు జమచేసి లేదా అప్పోసప్పో చేసైనా ఒక ఇల్లు కొనాలి. ఇల్లు రిజిస్ట్రేషన్ మీ పేరుతోనే చేసుకోండి. అమ్మ అక్కడే ఆ కొత్త ఇంట్లో తృప్తిగా ఉంటది. మిగిలిన ఇద్దరికీ, మా ముగ్గురు అక్కచెల్లెళ్లకూ ఇల్లు కొనుకున్నవారు వారి వీలు వెంబడి మా వాటా డబ్బులు మాకు ఇవ్వవచ్చు. తొందరేమీ లేదు. మధ్యలో ఎవరూ అడగవద్దు” అని ముగించింది.
‘మంచి సలహా’ అన్నట్లు అమ్మ, బావ తలలూపి తమ అంగీకారాన్ని తెలిపారు. ఇద్దరు తమ్ముళ్లూ వారి భార్యల వంక చూసి కాసేపయినాక “అన్నయ్యనే ఆ బాధ్యత తీసుకోవాలి. మాకైతే ఇప్పుడు వీలు కాదు” అన్నారు.
పెద్దకొడుకుగా స్వామికి ఆ బాధ్యత తప్పలేదు. సరే అన్నాడు. అందరూ సంతోషించారు.
అధ్యాయం-8: మండల్ ఔర్ కమండల్
దేశాన్ని త్వరత్వరగా కమ్ముకుంటున్న కాలమేఘాలను గమనించి పాతనగరంలో ఇల్లు అమ్మి తామందరూ కొత్త పట్నానికి తరలి వెళ్లటం అన్నది సరిఐన నిర్ణయమేనని స్వామి కుటుంబ సభ్యులందరూ అనుకున్నారు.
రాజీవ్‌గాంధీ కన్నా ముందు జనతాపార్టీ తరపున బిజేపీ మద్దతుతో వి.పి.సింగ్ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన తన మంత్రి వర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవిలాల్‌ను తొలగించగానే దేవీలాల్ తన బలనిరూపణ కోసం ఢిల్లీలో అతిపెద్ద కిసాన్ ర్యాలీ నిర్వహించాడు. దాని నుండి దేశ ప్రజల దృష్టి మళ్లించటానికి వి.పి.సింగ్ మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేసాడు. అనగా బాగా వెనుకబడిన కులాల వారికి విద్య, ఉద్యోగ అవకాశాలలో 27% రిజర్వేషన్లు కల్పించటం.
అసలు ఈ ఆలోచన ప్రముఖ సోషలిస్టు, గాంధేయవాదిఐన రాంమనోహర్ లోహియాది. బి.సి.లు జనాభాలో 60% కావున రిజర్వేషన్లు ఉండాలన్నడు. 1979 జనతా హయాంలో మొరార్జీ మండల్ కమీషన్ నియమించాడు. ఆయన తన రిపోర్టు ఇచ్చినా ఏ పార్టీ ప్రభుత్వాలు కూడా దానిని పట్టించుకోలేదు. వాటి అమలు కోసం అప్పుడు కాన్షీరాం ఉద్యమించాడు.
దీని వలన వెనుకబడిన బి.సి. కులాలు, మధ్యతరగతి, చదువుకున్న వారు తమకు దూరమవుతారన్న భయంతో బీజేపీ, విపిసింగు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించగా ప్రభుత్వం పతనమై మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు దేశ ప్రజల దృష్టిని ‘మండల్ కమిషన్’ నుండి మరలించటానికి బీజేపీ తన చిరకాల డిమాండ్లు ‘అయోధ్యలో రామమందిరం నిర్మాణాని’కి మళ్లీ అద్వానీ ఆధ్వర్యంలో ‘రామరథ యాత్ర’ ప్రారంభించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలని బీజేపీ వ్యూహం.
ఈ ‘మండల్ మందిర్’ సమస్య ఉద్రిక్తతలకు దారితీసి దేశ ప్రజలను నిట్టనిలువునా రెండుగా చీల్చింది. ఈ సమస్యను ‘మండల్ – కమండల్’ సమస్యగా కూడా కొందరు చమత్కరించారు. ఎందుకంటే ఈ రామరథ యాత్రలో పెద్ద ఎత్తున సాధువులు, సన్యాసులు కషాయ దుస్తులు ధరించి చేతులతో కమండలాలు పట్టుకుని, పొడుగు పొడుగు గడ్డాలు మీసాలతో ఊరేగింపులలో పాల్గొన్నారు.
మండల్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రకులాలలోని పేద వర్గాల వారు ఢిల్లీ లాంటి నగరాలలో ఆత్మాహుతి చేసుకుని, హింసాపూరిత ఉద్యమాలను నడిపారు. ఢిల్లీలో వాహనదారులు హింసాఘటనలకు భయపడి OBC (Other backward caste) అని స్టిక్కర్లు అంటించుకుని తిరగాల్సిన పరిస్థితులు దాపురించాయి.
వీటన్నింటి మధ్య ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగానే రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ సానుభూతి పవనాలతో కాంగ్రేసు పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి విజయం సాధించింది. ఊహించని విధంగా పి.వి.నరసింహారావు దేశ ప్రధానమంత్రి ఐనారు. అది తెలుగువారందరికీ గర్వకారణం. ఒక్క తెలుగు వారు మాత్రమే కాక దక్షిణాపథం నుండి ఒకరు తొలిసారి ప్రధాని ఐన కారణంగా దక్షిణ దేశ రాష్ట్రాల ప్రజలందరూ సంతోషించారు.
వామపక్ష, లౌకిక భావాలు కల్గిన స్వామిని దేశ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అతనిలోని ‘అంతరంగ స్వామి’ అప్పుడప్పుడు మేల్కొంటున్నాడు.
***
శ్రీమాన్ కోదండపాణిగారు సకల కళావల్లభుడనీ రసిక ప్రియుడనీ ప్రతి మనిషి తినీ తాగి, తొంగి పడుకోకుండా కూసింత కళా హృదయంతో బ్రతకాలని ముత్యాల ముగ్గు రాజగోపాలరావుగారి ఫిలాసఫీని అతని కన్న ముందునుండే ఆచరిస్తున్న మగానుభావుడు.
స్వామిని ప్రతి ఉదయం కాఫీకి ఆహ్వానించి తన ఎదురుగా ఒక గంట కూచోబెట్టుకుని హస్కు కొట్టటం అయన అలవాటు. ఇరానీ చాయ్ ఇష్టపడే స్వామికి ఆ కాఫీ నచ్చదూ, ఆయన ఊదే సిగరెట్ పొగలూ నచ్చవు. కాని మజ్బూరీ, బలవంతాన ఆ రెండిటినీ భరించాలి. ఎందుకంటే శిక్షణాకాలం పూర్తయిన తర్వాత “సక్సస్‌ఫుల్లీ ట్రేనింగ్ కంప్లీటెడ్” అని సర్టిఫికెట్ ఆయనే ఇవ్వాలి కనుక.
ప్రతి రోజూ స్వామి ఎదురుగా ఉన్నప్పుడే కావాలని లేడీ స్టెనోను డిక్టేషన్ కోసం పిలిచేవాడు. ఆమె కాస్తా బొద్దుమనిషి. ఆమెకు సీట్ ఆఫర్ చేసేవాడు కాదు. అతని టేబుల్‌పై ఆమె తన షార్ట్‌హాండ్ నోట్‌బుక్ పెట్టి వొంగి అతను చెప్పే డిక్టేషన్ తీసుకోవాలి. చాలా నెమ్మదిగా ఆలోచిస్తున్నట్లు నటిస్తూ చాలా సేపు డిక్టేట్ చేసేవాడు. ఆ సమయంలో అతని చూపులు ఆమె ఎద పొంగులపై వాలుతుండేవి. ఇటు స్వామి అటు ఆమె గమనిస్తున్నారన్న సంగతి తనకు తెలిసి కూడా తెంపరితనంతో అట్లా చేసేవాడు. వంగి రాయటం వలన పాపం ఆమె పైట చాలాసార్లు క్రిందికి జారుతుండేది. మళ్లీ మళ్లీ సర్దుకునేది. పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణసంకటం అన్నమాట.
ఒకసారి ఆమె వెళ్లిన తర్వాత “మీకొక సంగతి తెలుసా స్వామీ” అని సోది మొదలు పెట్టాడు. “ఆమె భర్త మిలిటరీలో ఒక జవాను. ఎక్కడో సరిహద్దులలో ఉండి యాడాదికో రెండు యాడాదులకో ఇంటికి వస్తాడు. పాపం ఈమెకు ప్రతిరోజు ఉపవాసమే. సరిఐన వయస్సులో సరిగ్గా కోరికలు తీరకపోతే లేడీసు బాడీసు బాగా చిక్కిపోతాయి. లేదా ఇట్లా బొద్దుగా ఐనా మారుతాయి” అని తన విచారాన్ని కడుంగడు ప్రకటించాడు.
అప్పుడప్పుడూ బంగారు వన్నెగల ఒక మాయలేడి ఆయన చాంబర్‌లోకి వచ్చి దర్జాగా ఎదుటి కుర్చీలో కూచుని ఆయనతో సరస సంభాషణలూ, ధ్వందార్థాల చమత్కారాలు చెణికి వెళ్లిపోయేది. ఆమె రాష్ట్రానికే అతిపెద్ద అయిన హెడ్డాఫీసులో ఒక మూలన చెక్క టేబుల్ ముందున్న ఓ చెక్క కుర్చీలో కూచునే చిన్న చీమలాంటి చిరుక్లర్కు అని తెలిసింది. స్వామి కూడా ఒక ట్రేనీ ఆఫీసర్ అని తెలిసి ఉండి దర్జాగా హోయలు ఒలుకుతూ అతని పక్క కుర్చీలనే బలిసిన చిలకలా కూలబడేది. స్వామికి ఒళ్లు మండిపోయేది.
‘గ్రంథసాంగుడు’ మాత్రం ఆ మాయలేడి దర్శనం కాగానే పలకరింపులు, పులకరింపులతో పొంగి ప్రవహించేవాడు.
ఒకరోజు ఆమెను “మరి నన్నెప్పుడు మీ ఇంటికి భోజనానికి పిలుస్తావూ” అని దీర్గం తీస్తూ మురిపాలొలికిస్తూ అడిగాడు.
“ఏం – మీ ఆవిడ – మీకు – రోజూ – భోజనం పెట్టటం లేదా” అని ఆ జాణ శ్లేషార్ధాలతో కొశ్నించి కులుకుల పలుకులు ఒలికించింది.
“పెడితే నిన్నెందుకు బ్రతిమిలాడుతాను” అని తనూ దీర్ఘం తీసి పండు కోతిలా కిచకిచా కులికాడు ఆ వన్నెకాడు.
“అబ్బో మీకేం మీకు భోజనాలు పెట్టటానికి బోలెడన్ని ఇళ్లున్నాయిగా” అని ఆ మధురవాణి ఆయన్ని ఇంకా పుర్రెక్కించింది. ఆ ఇద్దరి తొడ సంబంధం ఆ ఆఫీసులో అందరికీ తెలుసు.
చాలా మంది సేల్స్‌టాక్సు ఆడిటర్లు ఆఫీసులకు వస్తుపోతూ ఉంటారు. అందులో ఒకడు మార్వాడీ జాతికి చెందిన కేజ్రీవాల్. వాడి ముక్కు బాగా కాలిన నూనెలో ఇంకా బాగా గోలించిన పకోడి ముద్దలా ఎర్రగా బుసబుస పొంగి ఉంటుంది. దేవుడు నిద్ర మత్తులో పొరపాటున నాలుగు ముక్కుల్ని కలిపి ఒకే ముక్కును ముద్దగా చేసినట్టు ఉంటుంది. గరుత్మంతుడికి కూడా ఆ ముక్కును చూస్తే ఫక్కున నవ్వు వస్తుంది. వాడు భాన పొట్టతో భారీ కాయంతో ఉండి అన్ని ఆఫీసుల చుట్టూ చేతిలో ఒక డొక్కు భ్రీఫ్‌కేసు పట్టుకుని గోతికాడి గుంటనక్కలా తిరుగుతూ ఉంటాడు. తప్పులు చేసే దొంగ మార్వాడీ వ్యాపారులకు దొంగ లెక్కలు తయారు చేయటమే వాడి పని. ఆ గ్రద్ద ముక్కు గరుత్మంతుడికి ఈ కోదండంకూ ఎటువంటి వైరమూ లేని జిగ్రీదోస్తానా. ఏల అనగా అటెండరు భూమయ్య, ఖాదర్ భాయి మొదలగు సన్నిహిత వర్గాల రహస్య బోగట్టా ప్రకారం ఆ కేజ్రీవాలం ఆడిట్ ఆఫీసులో చాలా లేత ప్రాయంబులోనే కడుంగడు అనుభవాలు గడించి ఆరితేరిన ఒక ‘మిడత’ ఉన్నదట. ఆ ఆఫీసులోనే అందరూ వెళ్లి పోయాక సాయెంసంజ చీకట్లు అలుముకున్న వేళ ఈ ఇద్దరూ తోడు దొంగలు కలిసి ఆ మసకమసక చీకట్లలో జాయింటుగా ఆ మిడతతో మందులు చిందులు పొందులు సాగిస్తారట!
పాపం ఆ గ్రంథసాంగుడికి తెలియని ఒక రహస్యం స్వామికి తెలిసిందన్న సంగతి అతనికి తెలియదు. ఆ ఆఫీసు సిబ్బంది అంతా కలిసి ఆయనకు ఏకగ్రీవంగా ‘డీఎంకే గాడు’ అని బిరుదు ఇచ్చారు. తమకు రావాల్సిన వాటాలలో బొక్క కొట్టి కేజ్రీవాలం దళారీతనంతో వాడొక్కడే తెగతిని పందిలా బలుస్తున్నాడని వాళ్ల కోపం. (డి.ఎం.కె. అంటే దొంగ ముండా కొడుకు అని అర్థం).
బాసుగారికి మేలమాడటం కూడా బాగా వచ్చు. రసిక ప్రియుడే గాక హాస్య ప్రియుడు కూడానూ. ఒక రోజు ఏం స్వామి “ఏమైనా లీటర్ మీటర్ వ్యవహారం ఉన్నదా” అని పృచ్చించాడు.
స్వామి అయోమయంగా ఆయన్ని చూసాడు.
“అదే స్వామీజీ సాయంత్రం కాగానే ఏమైనా తీర్థప్రసాదాలు స్వీకరించటం లేక పుచ్చుకోవటం ఉందా లేదా అని సందేహ నివృత్తమై అడుగుతున్నా” అని పౌరాణిక నాటకాల భాషలో అడిగాడు.
“అయ్యో అయ్యో అబ్బే అట్లాంటిదేమీ లేదు అని తత్తరపడుతూ తప్పు చేసిన వాడిలా పశ్చాత్తాపంతో ముఖం పెట్టాడు.
“మరి ఈ డిపార్ట్‌మెంటుకు ఏల ఏతెంచినారు స్వామీ. తినరు – తాగరు – తిరుగరు. పిల్లలకు చెప్పిన పాఠాలే మళ్లీ చెప్పుకుంట ఆ లెక్చరర్‌గానే ఉంటే బాగుండేది కదా మీకూ మరియు మాకు కూడా” అని నొక్కి వక్కాణించాడు.
ఏడవలేక నవ్వు ముఖం పెట్టినాడు ఆ ‘బకరా’ కాని లోలోపల Wealth Accumulates Men Decay అనుకున్నడు.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.
