[హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ, చివరి భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. క్రిందటి వారం ఎపిసోడ్ ఇక్కడ చదవచ్చు.]
[ఇల్లు ఎప్పుడు కొంటావని తల్లి స్వామిని పోరుతూ ఉంటుంది. తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, వాయిదా వేస్తూంటాడు స్వామి. భార్య కలిసి బాగా ఆలోచించి, పాత ఇల్లైనా సరే, ఏదో ఒకటి కొనేయాలని నిశ్చయించుకుంటాడు. కొద్ది రోజుల్లోనే మొహిదీపట్నం ప్రాంతంలో కొత్తగా కట్టిన ఇల్లు ఒకటి బేరానికి వస్తుంది. కుటుంబ సభ్యులందరికీ నచ్చటంతో ఆ ఇల్లు కొనాలని అనుకుంటాడు స్వామి. కానీ తన దగ్గరున్న పూర్తిగా సరిపోదు. అప్పుడు పెద్దక్క లక్ష రూపాయలు అప్పుగా ఇస్తుంది. ఇల్లు కొనేసి గృహప్రవేశం చేస్తాడు. చుట్టాలని, మిత్రులని ఆహ్వానిస్తాడు. మిత్రుల పాటల, కవితలతో ఆ రోజు ఉత్సాహంగా గడిచిపోతుంది. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన ఘటన దేశవ్యాప్తంగా కల్లోలాలకు దారితీస్తుంది. మసీదు కూలిన తర్వాత పది రోజులకి ఇంటికొచ్చిన మిత్రుడు గోవిందు, మసీదుని కూల్చినప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఆ ఘటన జరుగుతుందని ఊహించలేకపోయానని అంటూ, అక్కడ జరిగినదంతా స్వామికి, ఆంజల్యకి వివరిస్తాడు. హిందూ ముస్లిం కలసిమెలసి తిరిగిన తన చిన్నప్పటి జీవితాన్ని గురించి వివరించి, వెళ్ళిపోతాడు గోవిందు. 1993 మార్చి పన్నెండవ తేదీన బొంబాయి నగరంలో బాంబు పేలుళ్ళు జరిగి చాలామంది చనిపోతారు. ఆరని జ్వాలలా ఇది కొనసాగుతూనే ఉంటుందని స్వామి అంచనా వేస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-11: గంగా మేరా మా కా నామ్
“ఓరే పెద్ద నానీ, నా జీవితం పురికొసకు వచ్చిందిరా. ఇప్పుడు నా వయస్సు ఎనభై, ఎనభై రెండు వరకు ఉండొచ్చు కదా” అంది అమ్మ.
“అదేందే అమ్మా పురికొసకు, చివరికి అని ఇటువంటి అశుభం మాటలు పొద్దుపొద్దున మాట్లాడొద్దు. ఎంత ఎక్కువైతే అంత కాలం ఎక్కువగనే బ్రతకాలి. మళ్లీ మళ్లీ ఈ భూమ్మీదికి రాం కదా” అన్నాడు స్వామి.
కాసేపాగి “అయినా ఎనభై దాటిన్నని ఎందుకనుకుంటున్నవు. మీ కాలంల బర్త్‌సర్టిఫికేట్లు లేవు కదా” అన్నాడు.
“నా లెక్క నాకుంది రా. చెప్త విను. కూర్చో. నేను నెలల పిల్లగ ఉన్నప్పుడు పాత వాలాద్రి కొట్టుకు పోయి పట్నం మొత్తం మునిగి పోయింది. నీళ్లు మా రైన్ బజార్లకు కూడా వచ్చినయ్. ఆఖరికి మా మనసాలలకు కూడా వచ్చినయ్. అప్పుడు మా అమ్మ నన్ను సంకనేసుకుని తంతెలు ఎక్కి ఇంటి మిద్దెమీదికి ఉరికిందట.” ఎప్పుడూ చెప్పిన సంగతే మళ్లీ కొత్తగా చెప్తున్నట్లు చెప్పింది అమ్మ.
“ఇగ ఇప్పుడు లెక్క చెప్పు నా కెన్నెండ్లో” అన్నది.
పాత వాలాద్రి అంటే పురానాపూల్. నగరంలో కుతుబ్‌షాహీ నవాబులు హుస్సేన్‌సాగర్ తర్వాత నిర్మించింది ఈ పురానాపూల్. దాని వెనక అందమైన యువరాజు ప్రేమకథ కూడా ఉంది. దాదాపు నాలుగు వందలేళ్ల పాతది అది. 1908 ముచికుందా నది (మూసీ) వరదలల్ల అది తునాతునకలై కొట్టుకపోయి ఆ జలసర్పం చేసిన విధ్వంసానికి పాతపట్నం అంతా అతలాకుతలమై పోయింది. ఆ లెక్క ప్రకారం అమ్మకిపుడు దాదాపు ఎనభై రెండేండ్లు. ఆమె కాకిలెక్కకు స్వామి ఆశ్చర్యపోయాడు.
“నిజమేనమ్మా నీ వయసు ఇప్పుడు దాదాపు నువ్వు చెప్పినంత కరెక్టే. ఏం? ఏమైనా బర్త్‌డే చేసుకుందామని ప్లాను వేస్తున్నవా” అన్నడు మజాక్ చేస్తూ.
“ఆఁ నా మొకం బర్త్‌డే, నా బొక్కల బర్త్‌డే. ‘ముసలితనానికి కుసుమగుడాల’న్నట్లు ఇప్పుడు నా మొకానికి అదొక్కటే తక్కువ” అన్నది.
పాతకాలం మనుషులు స్వామి చిన్నతనంల ప్రతి మాటకు ముందు ఒక సామెతను వాడేవారు. అది సంభాషణకు సరిగ్గా అతికినట్లుండేది.
అక్కడే వున్న సమత బర్త్‌డే అన్న మాట చెవిల పడంగనే “అమ్మమ్మా నీ బర్త్‌డే నాడు కేక్ కట్ చేసి చికెన్ బిర్యానీ పార్టీ చేసుకుందాం” అన్నది సంబురంగ.
“కేకు లేదు బీకు లేదు నోర్మూయి” అని దాన్ని కసిరి, “ఏం లేదురా నాదొక కోరిక” అంది.
‘ఏందంది’ అన్నట్లు ఆమె వైపు చూసాడు.
“ఏం లేదురా కాశీ చూడాలనుంది. ఒక్క సారైనా ఆ గంగలో మునిగి తేలి ఆ కాశీ విశ్వనాథుడ్ని, ఆ కాశీ విశాలాక్ష్షిని ఈ పాపపు కండ్లతో చూడాలనుంది”.
‘మరి నీ చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వరస్వామికి ఆయన్ని వదిలి కాశీకి పోతే కోపమొస్తదేమో?” అని మళ్లీ హాస్యమాడాడు.
“అగ్గో నీకు దేవుడు మీదా నమ్మకం లేదు. దయ్యం మీదా నమ్మకం లేదుగాని ఇట్లాంటి పరాశికం మాటలు మాట్లడుతవు”.
అమ్మ కోరిక తీర్చాలని నిర్ణయించుకుని “తప్పకుండా పోదాం అమ్మా” అని చేయిమీద చేయివేసి వాగ్ధానం చేసాడు. ఆంజల్యకు చెప్పగానే “అందరం కల్సిపోదాం. అమ్మమ్మతో కల్సి ఒక్కసారైనా ఏ యాత్రకు పోకపోతిమి” అన్నది.
ఆ మాటకు కూడా సరే అని ఆమెకూ ప్రామిస్ చేసాడు. కాని విటమిన్ ఎం. సమస్య. ఎట్లా అని ఆలోచించి వడ్డీకైనా అప్పు పుట్టించాలని ప్రయత్నాలు చేసాడు. చివరికి స్వల్ప వడ్డీకి అప్పు దొరికింది.
దసరా సెలవులు వచ్చాయి. దానికి అటుఇటుగా శనీ ఆదివారాలు కాక మరో నాలుగు రోజులు సెలవులు పెడితే పది, పన్నెండు రోజులు కలిసి వచ్చాయి.
మూడేళ్ల రాజాకు మొదటి రైలు ప్రయాణం. పిల్లల కన్న అమ్మకే ఎక్కువ సంతోషమయ్యింది. మనవడే ఆమె లోకం. లాలిపాటలు, జోల పాటలు అన్నీ రాగయుక్తంగా పాడి వాడికి వినిపించేది. వాడిని ఆమె కమ్మని రాగం ఆకర్శించేది. ఆ పదాలు అర్థం కాకున్నా.
వారణాసి రైలు స్టేషన్‌లో అడుగుపెట్టగానే స్వామి ఒక అలౌకిక ఆనందానికి గురైనాడు. అది ఆధ్యాత్మిక ఆనందానుభూతి కాదు గాని ఒక రకమైన అనుభూతి. మొత్తం భారతదేశంలోనే అతి పురాతనమైన అతి ప్రాచీనమైన మూడు వేల సంవత్సరాల చరిత్ర, సాంస్కృతిక నాగరికత కల్గిన ఒక ఆధ్యాత్మిక నగరం. పవిత్ర గంగానది తీరంలో వెలిసిన మొట్టమొదటి నగరం. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న త్రివేణీ సంగమం. గంగా, యమున సరస్వతిల అతి పవిత్ర ప్రయాగ సంగమ స్థలం. మహాకవి కాళీదాసు తన రచనలలో వైనవైనాలుగా వర్ణించి కీర్తించిన కాశీనగరం. ఆ కాశీనగరం చుట్టూ తిరిగిన బౌద్ధజాతక కథలు. కూతవేటు దూరంలో ‘సారనాథ్’. బోధగయలో రావి వృక్షం క్రింద జ్ఞానోదయం కల్గిన బుద్దుడు మొదటిసారి తన ఐదుగురు శిష్యులకూ ‘ధర్మపథం’ ఉపదేశించిన స్థలం పవిత్ర సారనాథ్. వేదవిద్యలకూ, సంస్కృత భాషకూ, సంగీత, సాహిత్య నృత్య రీతులకు పుట్టినిల్లుగా పరిఢవిల్లిన ఈ గంగా తీరమైదాన పవిత్రనగరం. షట్‌చక్రవర్తులలో ఒకరైన సత్యహరిశ్చంద్రుడు రాజ్యపరిపాలన సాగించిందీ ఇక్కడే. చివరికి ఈ గంగా తీరం ఒడ్డున స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేసిందీ ఇక్కడే. ‘సత్యమేవ జయతే’. ఇచ్చోటనే కదా ఈ గంగాఘాట్ ఒడ్డున కవి తులసీదాస్ ‘రామచరిత మానస్’ లిఖించి రామాయణాన్ని ప్రజల చెంతకు ప్రజల భాషలో తీసుక పోయిందీ. ఇక్కడే కదా, కథక్ నృత్య పితామహుడు బిర్జూ మహారాజ్ తన నృత్యాలయాన్ని నెలకొల్పిందీ, పండిత్ ఉదయ శంకర్, పండిత్ రవిశంకర్‌లు తమ తమ నృత్య, సంగీత రీతుల్ని అభ్యసిస్తూ ఈ నేలమీద నడయాడింది. ఇక్కడే కదా, ఇక్కడే ఈ కాశీ విశ్వనాథుడి సమక్షంలోనే మాతా అన్నపూర్ణేశ్వరీ పాదపద్మాల చెంతనే ఆలయ ప్రాంగణాన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయీని ప్రతి సుప్రభాతం వేళ్లలో విన్పించిందీ ఇక్కడే కదా..
మొత్తానికి ‘కాశీపట్నం చూడర బాబూ’ అన్నట్లయింది స్వామి పరిస్థితి. రైలుస్టేషనులో ఆ నేలమీద పాదం మోపగానే ఒక విధమైన ‘ట్రాన్స్’లోకి వెళ్లిపోయాడు. పురాస్మృతుల మధురజ్ఞాపకాల ఒడిలో అతను మైకం కమ్మిన వాడిలా తేలియాడసాగాడు.
ఆంధ్రా సత్రానికి వెళ్లే దారిలో పెద్ద రోడ్డు మీదనే వారందరూ రిక్షాలు దిగి ఆ ఇరుకిరుకు గల్లీలలో కాలినడకన నడుస్తుంటే కుడిఎడమల రోడ్డు మీద గరంగరంగా అప్పుడే కడాయిలో నుండి ఇవతలికి తీసిన తేనెరంగు బంగారు వన్నె జిలేబీలు, వాటికి జతగా పెద్దపెద్ద సైజున్న ఆలు సమోసాలు, పూరీ ఆలూబాజీ దుకాణాలు, చిక్కటి మీగడ పెరుగుతో చేసిన లస్సీ గ్లాసులు, రైళ్లు, బస్సులు ఎక్కీదిగి ఆకలి అలసటతో వున్న యాత్రికులకు కనుసైగలు చేస్తూ రారమ్మని అవన్నీ పిలుస్తున్నాయి. వాటిని చూసిన పిల్లలు ఆకలాకలి అని అరుస్తున్నందున అందరికీ ఉదయపు నాస్తాగా వాటన్నింటినీ పొట్లాలు కట్టించుకుని సత్రపు గదులలో దిగారు. దంతధావనాలు ముగించి ముందు ఆవురావురుమని వాటిని ఆరగించిన పిమ్మట పవిత్ర గంగానదీ స్నానాలకు బయలుదేరారు.
వీధులలో ఇష్టారాజ్యంగ తిరుగుతున్న గోమాతలు. ఆ ఇరుకిరుకు గల్లీ తడితడి మురికి బండల మీద అక్కడక్కడా ఆ పవిత్ర గోవులు పెట్టిన తాజా పెండ ముద్దలు. ఆ ఇరుకుమురికి గల్లీసందులలో ఇరువైపులా అతిపురాతన గృహాలు. పూల సజ్జలలో పువ్వులు నింపుకుని హడావుడిగా విశ్వనాథుడి ఆలయ దర్శనానికి బయలుదేరిన భక్త సమూహాలు, సైకిళ్ల మీదున్న గంటలను గణగణమోగిస్తూ ‘బాజు హఠో, బాజూహఠో’ అని అరుస్తూ యాత్రికుల మధ్యన సైకిళ్లపై దూసుకపోతున్న స్థానిక సైకిల్ వాలాలు. అక్కడక్కడా హిప్పీలు. హరేరామ హరేకృష్ణ చొక్కాలు, పంచెలు కట్టుకున్న తెల్లతోలు విదేశీయులు. సాధువులు, సన్యాసులు, సర్వసంగపరిత్యాగులు ఆ పురా వీధులలో గుబురు గుబురు గడ్డాలు మీసాలతో జటాజుటధారులై దర్శనమిచ్చారు.
స్వామికి తమ గురువైన శ్రీపతి గారు రాసిన ‘బెనారస్ చిత్రాలు’ కథ జ్ఞాపకం వచ్చింది.
కొంచెం చడావు రోడ్డు మీద నడిచి ఒక గట్టు ఎక్కగానే పవిత్ర గంగా నది కొంచెం దూరాన దర్శనమిచ్చింది. అందరూ సంతోషం పట్టలేక ఒకేసారి ‘హో’ అని అరిచారు. అమ్మ రెండు చేతులు తలమీద జోడించి అక్కడి నుండే తన మొదటి దండాన్ని సమర్పించింది. విశాలమైన రాతి చప్టాల మెట్లు క్రిందికి దిగితే వరుసగా గంగా ఘాట్‌లు. పిల్లలూ ఆంజల్య ఉత్సాహం పట్టలేక గబగబా దిగసాగారు. స్వామి అమ్మచేతిని పట్టుకుని భద్రంగా మెట్లు దింపాడు. ఇంట్లో చాతకాకుండా, అపసోపాలు పడే ఆమె కాశీలో కాలుపెట్టగానే కొత్త ఉత్సాహంతో శక్తిని పుంజుకుంది.
గంగామాత చిరుచిరు అలలతో ఆ ఉదయం గంభీరంగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఒకళ్ల చేతులు మరొకళ్లు పట్టుకుని అందరూ ఒకేసారి ప్రవాహంలో కాళ్లు పెట్టగానే హిమాలయాల్లోని గోముఖ్, గంగోత్రి, రిషికేష్, హరిద్వారాన్ని దాటి మైదాన తీరాలలోకి ప్రవేశించి, త్రివేణీ సంగమంలో తన చెల్లెళ్లు యమునా సరస్వతిలకు వీడ్కోలు పలికి కాశీకి వచ్చి కొత్తగా కాశీ విశ్వేశ్వరుడి పాదాల చెంత పునీతమైన ఆ గంగా జలాలు వారి పాదాలను మంచుముద్దలా తాకి ఆ తర్వాత ఒళ్లంతా జల్లుమనిపించి వారందరినీ పలకరించి పులకరింపచేసింది. పిల్లల్దిరూ కెవ్వు కెవ్వున కేరింతలు కొట్టారు. కాళ్లూ చేతులు తపతపా నీళ్లపై కొడుతూ ఆడుకోసాగారు.
పిల్లల జలకాలాటలు. తీరాన ఆంజల్య వారిద్దరికి జాగ్రత్తగా స్నానాలు చేయించి పొడిబట్టలు వేసి నాలుగు మెట్లపైన కూచోబెట్టి అక్కడ్నుంచి కదలవద్దని హెచ్చరించి తనూ స్నానానికి దిగింది. ముందు ఇద్దరూ కలిసి అమ్మ చేతులు పట్టుకుని జాగ్రత్తగా దింపి తల తడిచేటట్టు స్నానం చేయించారు. ఇంతలో ఇద్దరు తెలుగు పురోహితులు వేదమంత్రాలు చదువుతూ వారి వద్దకు చేరి “పూజలు చేయించుకుంటారా, పిండతర్పణలు పెట్టుకుంటారా అని అడగగా వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. అమ్మ మళ్లీ ఆ నదీమాతకు దండం పెట్టుకుంది. దంపతులిద్దరూ ‘సరిగంగ’ స్నానాలు చేసారు.
ఆ ఉదయపు నీరెండలో వారందరూ ఆ ఘాట్ మెట్లపైన కూచుని నదిని అటు చివర నుండి ఇటు చివరి వరకూ కనుచూపు మేరా చూస్తున్నారు. వరుణ అస్సీ అని రెండు నదుల కలయిక అక్కడ జరిగినందున ఆ పురాతన నగరానికి ‘వారణాసి’ అని పేరొచ్చింది. స్వామికి తన పదేళ్ల వయస్పుడు చూసిన ‘జిస్ దేశ్ మే గంగా బహతీహై’ సీన్మా గ్యాపకం వచ్చింది. టైటిల్ సాంగ్ కొంత ఈ నదిలోనే ఇక్కడి ఒక చిన్న పడవలో రాజ్‌కపూర్ తీసాడు. ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారత దేశపు జీవనాడి ఐన గంగానదిని ప్రత్యక్షంగా కనులారా చూస్తున్నడు. అట్ల చిన్నప్పటి ‘ఖ్వాయిష్’ ఇప్పుడు పూర్తి అయినది.
అమ్మ కోసం స్వామి ఆంజల్యలు ఆమెను తీసుకుని దేవాలయంలోకి వెళ్లారు. అమ్మ విశ్వనాథుడిని, విశాలాక్షిని తనవితీరా సందర్శించుకుంది. కాశీకి ముక్తిప్రదాయిని అని కూడా పేరు. గంగానదిలో మునిగి బలవన్మరణం పొందిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది శవాలను దహనం; ఖననం చేయకుండా పడవలలో తీసుకెళ్లి నదిలో జారవిడవటం స్వామికి తెలుసు.
కాశీలో కొన్ని షాపింగులు కూడా జరిగాయి. “బనారస్ పట్టుచీరెలకు ప్రసిద్ధి”. ఆంజల్య పట్టుచీరల దుకాణాలు చూద్దామని అన్నది.
“అబ్బా ఇక్కడెందుకు. ఇవే పట్టుచీరెలు మన కోఠీ ఆంధ్రా బ్యాంకు ముందు నీలకంఠం నర్సింహులు బట్టల దుకాణంలో దొరుకవా? అక్కడ కొందాంలే” అని స్వామి దాటవేసే ప్రయత్నం చేసాడు. డబ్బులే కాదు ఆ దుకాణాలకు పోతే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. బోర్ కొడ్తది అని స్వామి లోపలి బాధ.
“ఏందీ ఇంత దూరం బనారస్‌కు వచ్చి ఒక్క పట్టుచీరైనా కొనకపోతే నలుగురూ నవ్వరా” అని ఆంజల్య దబాయించింది.
“పోనీ కొనరాదురా. కాశీకి గుర్తుగా ఉంటది. పండుగలకు, ప్రవోజనాలకు కట్టుకుంటది” అని అమ్మ సపోర్టు చేసింది.
అక్కడి గల్లీలల్ల ప్రతి ఇల్లూ ఒక పట్టుచీరెల దుకాణమే.
మొత్తానికి ఆంజల్య కోరిక నెరవేరింది.
ఒకరోజు సాయంత్రం దీపాలు వెలిగించే యాళ్లకు వాళ్లందరూ దశాశ్వమేథ్ ఘాట్‌లో జరిగే గంగాహారతి పూజ చూడటానికి వెళ్లారు. అప్పటికే వందల సంఖ్యలో భక్తులు, యాత్రికులు అక్కడ జమ అయ్యి ఆ హారతులు పూజలు చూడటానికి మెట్లమీద సిద్ధంగా కూచున్నారు. గంగ ప్రవాహంలో వదలటానికి అందరి చేతులలో పూల సజ్జలలో పువ్వులు వాటి మధ్య ప్రమిదలో వత్తులు. నలుమూలలా ఎక్కడ చూసినా భక్తజన సందోహ కోలాహలం. చీకటి పడగానే పెద్దపెద్ద చప్పుళ్లతో మేళ తాళాలు. వాటికి అనుగుణంగా గంగానదీ మాతను కీర్తిస్తూ హిందీ భజన గీతాలు రికార్డులు వినవస్తున్నాయి. భక్తులు కూడా ఆ భజన గీతాలకు పరవశంతో తమ గొంతులు కలుపుతున్నారు. కాసేపయినాక బలంగా, పటిష్టంగా ఉన్న బ్రహ్మణ యువ పూజారులు పసుపు, ఎరుపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలను తమ నడుములకు కాసెపోసి గట్టిగా గోచీల్లాగ బిగించి కట్టుకుని ఎత్తైన వేదికమీదికి నడుచుకుంటు వచ్చారు. వారి నడుముల పై భాగమంతా అనాచ్చాదితమే. సుమారు పదిమంది ఉన్నారు. వారు తమ బలమైన బాహువులతో తళతళా మెరుస్తున్న పొడుగుపొడుగు ఇత్తడి దీపపు సెమ్మెలను పట్టుకున్నారు. వాటిలోపల అమర్చిన కర్పూరం ముద్దలతో అది కాగడాల్లా భగభగమని జ్వాలాముఖిల్లా వెలుగుతున్నాయి. చాలాసేపు ఆ పూజా హారతులు, కీర్తనలు, భజనలు జరిగాయి. ఆ కార్యక్రమం ముగియగానే భక్తులందరూ లేచి నదీ ప్రవాహం పాదాల చెంత చేరి తమతమ పూల సజ్జలలోని దీపాల వత్తులను వెలిగించి నదిలో జాగ్రత్తగా వదిలి దండాలు పెట్టుతున్నారు. ఆ చీకటి రాత్రి గంగానది అలల ప్రవాహంలో వందలు, వేల పూలదీపాలు మిలమిలా మెరుస్తూ, తూగుతూ, ఊగుతూ పెళ్లి నడకలతో వయ్యారంగా ముందుకు కదలటం చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. గంగా మాత మెడలోని వజ్రాల హారంలా ఆ దీపాలు ‘చమక్ చమక్’మంటూ మెరుస్తూ ఉన్నాయి. మనసులు పరవశం చెందాయి.
ఆ దీపశిఖల సౌందర్యాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్న స్వామి మనస్సులో పరిపరివిధాల భావాలు, ఆలోచనలు కమ్ముకుంటున్నాయి. అతనికి హఠాత్తుగా తను చిన్నప్పుడు విన్న దేశభక్తి గీతం అతని పెదాల మీద నర్తించింది.
“గంగా మేరా మా కా నామ్
బాప్ కా నామ్ హిమాలా”
(తుమ్ సే అచ్చా కౌన్ హై 1969)
అవును. ఔనౌను, ఆ కవి అన్నది అక్షర సత్యం. నూటికి నూరు పాళ్లూ నిజం నిజం. హిమాలయాలు మనకు తండ్రి. గంగా, యమునలు మన తల్లులు. ఆ తల్లితండ్రులకు పుట్టిన పిల్లలమే మనం భారతీయులం. నదులంటే మనకు అన్నం పెట్టే అన్నపూర్ణలు. అమ్మలు. తల్లులు. మతం, దేవుడూ దేవతలతో సంబంధం లేకుండా అటువంటి పాలధారలను, పంచధారలను పంచి ఇచ్చి పెంచి పోషించిన ఆ తల్లులందరినీ పూజించవలసిందే. కీర్తించవలసిందే. గౌరవించవలసిందే. ప్రపంచమంతటా నదీ నాగరికతలు వెల్లివిరిసినవే. ఈజిప్టులోని నైలునది నాగరికత, ఇరాక్‌లో ట్రైగ్రిస్ నది, మెసపటేమియా నాగరికత, సిరియాలో యూఫ్రటిస్‌నది బాబిలోనియా నాగరికత, యూరపులో టైబర్ నదీ తీరాన పుట్టిన రోమన్ నాగరికత, చైనాలో హోయాంగ్ హోనదీ నాగరికత. ప్రసిద్ద నగరాలకు, నాగరికతలకు పుట్టినిళ్లు నదులే కదా కావున మనమందరం కులమూ మతమూ, భాషా ప్రాంతీయ తత్వాలు లేకుండా ఆ మాతృమూర్తులను ఆరాధించవలసిందే. కీర్తించవలసిందే. గ్రీకులు సింధూ నది పదం పలకరాకనే ఇండస్, ఇండికా అన్నారు. అందులో నుండి హిందూ, ఇండియా జన్మించింది. ఆరవ శతాబ్దంలో వచ్చిన ముస్లింలు ‘సింధూనదిని దాటేటప్పుడు’ సింధూ అన్న పదం పలకరాక ‘హిందూ’ అన్నందుకే ఈ దేశం హిందూదేశంగా మారింది.
తల్లిదండ్రులు మనకు పేర్లు పెట్టినట్టు సింధూనదీ మాత మనకు హిందూ దేశమని పేరు ప్రసాదించింది. అందుకే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ మతమంటే అది ఒక మతం కాదు అదొక భారతీయ జీవన విధానం, ఉమ్మడి సంస్కృతి అన్నాడు. ఒక్క వాక్యంలో కవి శైలేంద్ర “హమ్, ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై” అన్నడు.
ఆ పాట విన్న నాస్తికుడైన నెహ్రు కూడా శబ్బాష్ శైలేంద్రా అని మెచ్చుకున్నడు.
ఈ మహామహా ఉత్తుంగ శిఖర పర్వతాలు, ఈ నిరంతరం జలజలా ప్రవహించే జీవనదీనదాలు, సుజలాం సుఫలాం సస్యశామలాంలా ఉండే ఈ భూములు ఈ నింగీ ఈ నేలా ఈ దేశ వాసులు అన్నీ అన్నీ అంతా కలిపి చూస్తే అదొక జంబూ ద్వీపం భరత ఖండే అన్న భారతదేశం అవుతుంది. మేరా భారత్ మహాన్ అవుతుంది.
స్వామి మనసు ఇంకా ఇంకా వెనక్కి వెళ్లి పురాజన్మల పురా స్మృతులలోకి జారుకున్నది. ఐదు వేల సంవత్సరాల క్రితం సైబీరియా నుండి బయలుదేరిన కొన్ని ఆర్య గణాలు తమ పశుపాలన పశుపోషణ కోసం కావలసిన నదులు, పచ్చగడ్డి మైదానాల అన్వేషణలో దేశ దిమ్మరులుగా సంచరిస్తూ, సంచలిస్తూ మధ్య ఆసియా (ఉత్తర కురు భూమి)లోని వంక్షునది (అమూదర్యా) చేరి ఆ పిమ్మట కపిల్ (కాబూల్), గాంధార దేశం (కాందహార్) నుండి పామీరు పీఠభూలోని అత్యున్నత శిఖరమైన మేరు పర్వతాన్ని (హిందూఖుష్ పర్వతాలు) అధిరోహించి ఖైబర్ కనుమలను దాటి పురుషపురం (పెషావర్) మజిలీలో విశ్రాంతి పొంది, సిందూ నదిని దాటి ఒక మానవ వలసల ప్రవాహంలా గంగా, యమున తీరాలకు చేరుకుని ఆ ఆకుపచ్చమైదానాలను చూసి ఎగిరి ఆనందంతో గంతులు వేసి, సోమరసం తనవితీరా తాగి అశ్వమాంసం, ఎద్దు మాంసం కడుపారా భుజించి పరవశించి ఆడామగా నృత్యాలు చేసి సొక్కి సోలి వాలి పోయారు. తమ గోకులానికి కావలసినంత పచ్చగడ్డి భూములు దొరికాయని సంబరపడ్డ ఆ సంచార తండాల గణాలు ముందు గోపాలకులుగా ఉండి తర్వాత వ్యవసాయంలోకి ప్రవేశించి స్థిరనివాసాలకు కావాల్సిన నగరాలను ఏర్పరచుకుని తర్వాత చాలా కాలానికి ఆ గోపాలకులు భూపాలురైనారు. రాజులు, ఇతర రాజుల్ని, రాజ్యాల్ని జయించి చక్రవర్తులు అయినారు. రాజ్యాలు, సామ్రాజ్యాలుగా మారినాయి.
ఈ మానవ జాతి పరిణామ క్రమమంతా నదీనదాల పుణ్యఫలితమే కదా! ఏ దేవుడూ, ఏ మతమూ పుట్టక పూర్వమే ఈ నదులు జన్మించాయి.
దేవుడూ, మతంతో సంబంధం లేని ఇతర దేశాల వారు నదులను పూజించకున్నా పర్యావరణ స్పృహతో జాగ్రత్తగా కాపాడుకుంటారు. మనం మాత్రం నదులను దేవతలుగా పూజిస్తూనే నానా ఆచారాలు సంప్రదాయాల పేరుతో కలుషితం చేస్తుంటాం. బొందితో కైలాసమని శవాలను నదులలోకి విసిరేస్తుంటాం.
ఇదీ మన వాళ్ల వైరుధ్యం అనుకున్నడు చింతనాపరుడైన స్వామి.
***
ఇంకోరోజు సారనాథ్‌ను చూడటానికి వెళ్లారు. గయలో బోధివృక్షం చత్రచ్ఛాయలలో జ్ఞానోదయం పొందిన బుద్దుడు తొలిసారి ప్రప్రథమంగా తన ఐదుగురు శిష్యులకు ధర్మ చక్రపరివర్తన సూత్రాలను వివరించి జ్ఞానబోధ చేసిన స్థలమే ఈ సారనాథ్.
స్వామికి బుద్దుడన్నా, బుద్ధుడి బోధనలన్నా ఇష్టం. వర్ణవ్యవస్థను సృష్టించి, శారీరక శ్రమకు చెందిన ఉత్పత్తి కులాలను నీచంగా వెలివేసిన బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటే బౌద్ధ ధర్మం. అది ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అని ప్రచారం చేసింది.
8వ శతాబ్దంలో శంకరాచార్యుల ‘అద్వైతం’ వచ్చే వరకు సుమారు వెయ్యి సంవత్సరాలు ఉత్తర దక్షిణ పశ్చిమ భారత దేశంలో బౌద్ధ జైన మతాలే ప్రాముఖ్యంగా నిలిచి ప్రజలను ప్రభావితం చేసాయి.
భారతదేశం బౌద్ధ మతాన్ని దేశం నుండి తరిమేసి తనను తాను ఆత్మహత్య చేసుకుందని ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మాటలు జ్ఞాపకం వచ్చాయి స్వామికి. ఆయన తనను తానెప్పుడూ తత్వవేత్తను అని చెప్పుకోలేదు. చాలా సింపుల్‌గా “ఐయామ్ ఏ టీచర్” అన్నాడు.
బ్రాహ్మణవాదం చాలా క్రూరంగ బౌద్ధమతాన్ని దేశం నుండి తరిమేసినా అది అనతి కాలంలో ఆసియా దేశాలన్నింటా వ్యాపించి ఈ నాటికి ఆసియా ఖండానికి ఒక దీపస్తంభంగా వెలుగుతుంది.
సారనాథ్ జ్ఞాపికగా పాలరాతి బుద్దుడి బొమ్మ కొనుక్కున్నారు స్వామి – ఆంజల్య. అది చాలా అపురూపంగా వాళ్ల డ్రాయింగ్ రూంలో నిరంతరం ‘శాంతి’ని వెదజల్లుతుంది.
ఆఖరి రోజు ‘బనారస్ హిందూ యూనివర్సిటీ’ చూడటానికి వెళ్లారు. జాతీయోద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమ చైతన్యం కోసం పండిత్ మదన్ మోహన్ మాలవీయ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. దేశమంతా తిరిగి రాజులు, నవాబుల సంస్థానాల నుండి చందాలు సేకరించి అభివృద్ధి చేసాడు. ఇతను ఆ రోజులలో జాతీయవాదే కాని రాజకీయాలలో మితవాది. అందుకే ఆ విశ్వవిద్యాలయానికి ‘హిందూ’ అన్న పదం జోడించాడు. తొలి ముస్లిం సంఘ సంస్కర్త సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ ‘అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ’ స్థాపించినప్పుడు తను మాత్రం ‘బనారస్ హిందూ యూనివర్సిటీ’ ఎందుకని అనొద్దని ఆయన వాదన. ఎంత మితవాది ఐనా భిన్న రాజకీయ దృక్పథాలు, సిద్ధాంతాలను విశ్వసించే ఆచార్యులను ఆయన అక్కడ నియమించాడు. ఆచార్యులలో, విద్యార్థులలో కాంగ్రెసు, సోషలిస్టు, హిందూ మహాసభ, కమ్యూనిస్టులు అక్కడ ఉండేవారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన చండ్రరాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిలు ఒకప్పుడు ఇక్కడ చదువుకున్నవారే. ఒకప్పటి నలందా, తక్షశిల విద్యాలయాలకు ప్రతి రూపమే ఈ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం.
ఆ విశ్వవిద్యాలయం ఆకుపచ్చని అరణ్యం మధ్యలో, పొడవైన అశోకవనం వృక్షాల మధ్య ముదురు ఎరుపు జేగురు రంగు కల్గిన భవనాలతో చూడముచ్చటగా ఉంది. ప్రతి ఫాకల్టీకి ప్రత్యేకంగా ఒక భవనం. అక్కడ ఒక తెలుగు డిపార్ట్‌మెంటు ఉందని తెల్సినా సమయాభావం వలన అక్కడికి వెళ్ళలేకపోయాడు.
ఆ సాయంత్రం వారందరూ ‘తులసీ ఘాట్’కు చేరుకున్నారు. ఇక్కడే ఒక చిన్న దేవాలయంలో సంత్ తులసీదాస్ కూచుని ‘రామచరిత మానస్’ అనే రామాయణ గ్రంథాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే సరళమైన హిందీలో రాసాడు.
దూరాన గంగ అవతలి గట్టుపై సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశమంతా సంజకెంజాయ రంగులను పులుముకుని ప్రకాశిస్తుంది. గంగలో పడవలు యాత్రికులను ఎక్కించుకుని అటుఇటు చక్కర్లు కొడుతున్నాయి. ఆ పడవలకు పోటీగా పైన ఆకాశగంగ మీద పక్షులు పల్టీలు కొట్టుతూ ముందుకు సాగుతున్నాయి. మరొక చోట ఒక యాత్రికుడు రావిచెట్టు క్రింది విశాలమైన రాతి చప్టాపై నిరంధిగా వెల్లకిల్లా పడుకుని, చేతుల్ని చాతీపై చాచి “దునియా బనానే వాలే క్యా తేరి మన్ మే సమాయీ” అన్న పాటలో లీనమై గొంతెత్తి పరవశంగా పాడుతున్నాడు. ఘాట్‌లో ఒక మూల చిన్న చిన్న లంగోటీలు మాత్రమే కౌపీనాలుగా ధరించి నగ్న దేహాలకు నువ్వుల నూనె దట్టంగా మర్థించి చెమటలు కారేలా కొంతమంది వస్తాదులు, పహిల్వాన్లు ‘ఉఠక్ బైఠక్’లతో వ్యాయామం చేస్తున్నారు. మరికొంతమంది మహాబల భీములు బరువైన గదలను తమచుట్టూ తామే గిరగిరా చక్రంలా తిప్పతూ అభ్యాసం కొనసాగిస్తున్నారు. స్థానికులైన కొద్దిమంది బాలురు ఎత్తైన ఘాట్ బురుజులపై నుండి క్రిందికి నదిలోకి “జై బోలో హనుమాన్ కీ” అని దుంకి ఈదులాడుతున్నరు. కాషాయధారులైన సాధు, సన్యాసులు గంజాయి దమ్ములు పీల్చుకుంట ఇహలోకాన్ని విస్మరించి చిదానంద స్థితిలో మునిగి తేలుతూ మధ్య మధ్య విరామంలో “భం భం భోలేనాథ్” అని శివుడిని స్మరించుకుంటున్నారు.
అనేకమంది పూర్వపు సంస్థానాధీశులు, చోటామోటా రాజులు ఆ గంగా ఘాట్‌లపై తమతమ పేర్లతో అందమైన భవనాలు వారి విలాసాల కోసం కట్టించుకున్నారు. కాని ఆ రాజుల రోజులు, రాజుల బూజులు గతించిన తర్వాత వారి వారసులు ఇప్పుడు వాటిని విదేశీయాత్రికుల విలాసాల కోసం టూరిజం హోటళ్లుగా మార్పిస్తున్నారు.
సమత, రాజా ఇద్దరు కొంతదూరంలో విశాలమైన రాతి చప్టాల మీద ‘ముట్టించుకునే’ ఆట ఆడుకుంటున్నరు. స్వామి ఆ రోజు ప్రొద్దున, తను ఒకడే వెళ్లి చూసివచ్చిన మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ సంగతులు, విశేషాలు అమ్మకు, ఆంజల్యకు చెపుతున్నడు.
“గంగకు చివరి మూలలో మణి కర్ణికాఘాట్ ఉంది. అది వేదకాలం నాటి అతి పురాతనమైన శ్మశానం. అంటే రుద్రభూమి. రుద్రునికి ఇష్టమైన భూమి. అక్కడి శ్మశానంలో ఒక గుడిని నిర్మించారు. అందులో నిరంతరంగా మూడు వేల సంవత్సరాల నుండి ఆరిపోని ఒక అగ్నిగుండం. అక్కడ అంతా అఘోరాలదే పెత్తనం. ఆ శ్మశానం అజమాయిషీ అంతా వారిదే. ఆ అగ్ని ఆరిపోకుండా ఇరవై నాల్గు గంటలు, మూడువందల అరవై నాలుగు రోజులు కాపలా కాయటమే వారి కర్తవ్యం. వారందరూ ఎటువంటి కేశపోషణ లేకుండా అట్టలు కట్టిన వెంట్రుకలతో శివునికి ప్రతి రూపంలా జఠాజుటధారులై ఉంటారు. దానికి తోడు నల్లటి అంగవస్త్రాలు, అంగారఖాలు ధరించారు. నిరంతర గంజాయి సేవనంతో వారి కన్నులు ఎర్రగా, రుద్రనేత్రాల్లా, శివుని మూడో కన్నులా భగభగ మండుతుంటాయి. ఎక్కువగా మౌనముద్రలో ఉంటారు. ఒక వేళ పెదవి విప్పినా మాట కరుకుగా, కర్కశంగా ఉంటుంది. వారు రాత్రిపూట శవాలను పీక్కుతింటారని, శవ సంభోగాలు చేస్తారని, తద్వారా తాంత్రిక శక్తులు సాధిస్తారని ప్రజలు అనుకుంటారు. యాత్రికులు వారికి భయపడి దూరంగానే ఉంటారు. నిరంతరంగా వెలుగుతున్న ఆ పరమ పవిత్రమైన అగ్నితోనే స్థానిక శవాల అంత్యక్రియలు జరుగుతుంటాయి.
ఇంకో మూల చివరలో హరిశ్చంద్రఘాట్. అది కూడా పితృవనమే (శ్మశానం). హరిశ్చంద్రుడు కాటికాపరిగా పని చేసిందీ శ్మశానంలోనే. అతని భార్య తారామతి కొడుకు రోహితాశ్వుని మృత శరీరాన్ని తీసుకొచ్చింది ఈ శ్మశానానికే. చివరికి హారిశ్చంద్రుడు చాలా కాలం తర్వాత తన భార్య, కొడుకును గుర్తించిందీ ఇక్కడే. హరిశ్చంద్రుడు ఇక్ష్వాకుల వంశానికి చెందిన రాజు. ఇప్పటికీ ఈ స్మశానానికి స్థానికుల శవాలు వస్తూనే ఉన్నాయి. స్వామి అక్కడ చాలా సేపు శవాలను, అంత్యక్రియలను చూస్తూ గడిపాడు.
“జగము సత్రము
చావు స్వగృహయానము”
అన్న కవితను నెమరు వేసుకున్నడు. మనిషి పుట్టినప్పటి నుండి మృత్యువు నీడలా అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. దొంగదెబ్బ తీయటానికి కాచుకుని ఉంటుంది. కాని మనిషి తనకు తెలియకుండానే అనేకసార్లు వెంట్రుకవాసిలో తప్పించుకుంటాడు. కాని చివరికి మృత్యువుదే పైచేయి అవుతుంది. ‘జాతస్య మరణం దృవం’. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అనేది ప్రకృతి సూత్రం.
స్వామి చెప్పటం ముగించిన తర్వాత ముగ్గురూ కాసేపు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు.
“ఒరే నానీ ఒక మాటరా”
“చెప్పమ్మా” అన్నాడు.
“ఆంజల్యా నువ్వు కూడా వినమ్మా”
“వింటున్న అమ్మమ్మా”
“అప్పుడు నువ్వు పార్టీలో పని చేస్తున్నావు కాబట్టి మీ బాపుకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు, నిమజ్జనం, దినవారాలు ఏమీ చేయకపోతివి. ఆఖరికి నెత్తిమీది వెంట్రుకలు కూడా తీయకపోతివి. మరి ఇప్పుడు నేను పోయిన తర్వాత కూడా అట్లనే చేస్తవా?”
స్వామికి గతమంతా గుర్తుకొచ్చింది. అమ్మకు ఇప్పటికీ ఆ బాధ ఉండనే ఉంది. ఇప్పుడు ఆమె ప్రస్తావనలోని అంతరార్థం, అనుమానం తేటతెల్లంగా తెలుస్తునే ఉంది.
ఆంజల్య కూడా స్వామివైపే చూసింది ‘ఏమంటావు’ అన్నట్లు.
పురోహిత వర్గం చేసే తంతులు, సాంప్రదాయాల మీద వ్యతిరేకతతో, కోపంతో తను అప్పుడు యౌవనం వేడితో విపరీతంగా నిర్ణయాలు తీసుకుని అందర్నీ బాధపెట్టాడు అన్నది మళ్లీ జ్ఞాపకం వచ్చింది. తమ పెళ్లి విశయంలో కూడా ఆ ధోరణి పునరావృత్తమయ్యింది. కాని ఇప్పుడు పెళ్లి, చావులు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఉమ్మడి విశయాలనీ, వ్యక్తిగతం కాదని తెలిసి వచ్చింది.
కొంచెం ఆత్మావలోకనం అయిన తర్వాత “అమ్మా” అన్నాడు.
“చెప్పరా” అన్నది ఆత్రుతగా
“ఇప్పుడు నేను పార్టీలో లేను, పార్టీ సభ్యుణ్ణి కూడా కాదు. అందరి లాగే సాధారణ జీవితం గడుపుతున్నాను. అప్పుడంటే నేను అందరికీ ఆదర్శంగా ఉండాలనే తపనతో అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న. అప్పుడు ఆ తత్వం కరెక్టే కాని ఇప్పుడు మాత్రం కాదు.”
“మరి”
“నువ్వు ఇప్పుడు కోరుకుంటున్న ప్రకారమే సాంప్రదాయికంగా, శాస్త్రప్రకారం నీకు అన్నీ చేస్తాను. కేశఖండన కూడా చేయించుకుంటాను. నాకు మాత్రం వాటిలో నమ్మకం ఉండనీ లేకపోనీ, నీ కోసం” అన్నాడు.
“ఏదీ నా చేతిలో చేయి వేసి వాగ్దానం చేయి” అన్నది చిన్న పిల్లలా. వార్ధక్యం మరో రెండవ బాల్యం అనుకుంటూ చేతిలో చేయి వేసి “తప్పకుండా అమ్మా” అని వాగ్ధానం చేసాడు.
‘మనిషిలో వస్తున్న మార్పు’కు ఆంజల్య అతన్ని కొత్తగా వింతగా చూసింది.
వారందరూ వారం రోజుల కాశీ యాత్ర సంతోషంగా ముగించుకుని తెల్లారి గృహోన్ముఖులయ్యారు.
(మళ్ళీ కలుద్దాం)
పరవస్తు లోకేశ్వర్ 10 జూన్ 1951 నాడు హైదరాబాద్ పాత నగరంలో జన్మించారు. కథా నవలా రచయిత, అనువాదకులు. ట్రావెల్ రైటర్. యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
సలాం హైదరాబాద్, సిల్కురూట్‌లో సాహస యాత్ర, ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాద కథలు), ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర, ఆనాటి జ్ఞాపకాలు, తెలంగాణ సంభాషణ, ప్రపంచ పాదయాత్రికుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు, ఎవరిది ఈ హైద్రాబాద్?, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు, కల్లోల కలల కాలం వంటి పుస్తకాలు వెలువరించారు. ‘సలాం హైద్రాబాద్’ కు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం లభించింది.
హైదరాబాద్ నగరం గురించి శ్రీ పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలాత్రయంలో మొదటిది చివరిది ‘సలాం హైద్రాబాద్’. రెండవది ‘కల్లోల కలల కాలం’. మూడవ భాగం ‘తీరం చేరిన నావ’ సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది.
