[కొండూరు వేంకటేశ్వర శర్మ గారు రచించిన ‘తీరం చేరిన తీరు’ అనే కవితని అందిస్తున్నాము.]
ఏదోలా ఉన్నావేంటి?
భారమైన బాధలేంటి?
అందరితో పోటీ ఏంటి?
నీ దారి నీదేనంటీ!
తీరం చేరని అల
తన తీరు మారుస్తుందా?
కలలుగన్న తన ఆశను
తరిమేస్తుందా?
తన తోటి అలలు
ముందుకు పరిగెడుతున్నా
తన వేగం తక్కువని
తన పయనం ఆపుతుందా?
గమనంలో తడబడితే
గమ్యం చేరేదెట్టా?
నీ గమ్యం నీకే నంటా
నీ గమనం నీదే నంటా
కల్లోలమైన కడలి
అలలతో అలరించదా?
బడబాగ్నిని దాచుకున్నా
అందంగా అనిపించదా?
కష్టాలెన్ని ఎదురైనా
కలత చెంది కృంగాలా?
కలకాలం ఉండవంటూ
కనబడనీయక సాగాలా
నీ పయనం నీ వెంటే
నీ తీరం చేరే దాకా!
గడిచిందంతా గతమే
గమ్యం చేరేశాక!
