Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తీర్పు

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘తీర్పు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ఆత్మ సాక్షిగా అతనిని
నిజాన్ని వెల్లడించమనండి!
రవ్వంత మేలును చేస్తూ
కొండంత కీడును కలిగిస్తున్న
నిజ చర్యల గురించి
ఆ కొంటెవాణ్ణి
నిక్కచ్చిగా వెల్వరించమనండి!

యథేఛ్ఛగా
ప్రమాదకరంగా
లజ్జాకరంగా
ఆ ఆతతాయి ప్రవర్తిస్తున్నది
వాస్తవమో కాదో
అతని చేతనే చెప్పించాలి!

ఆధిపత్యాన్ని చాటేందుకు
అనువైన జాతిని
అభిమతానికి తగ్గ మతాన్ని
అభిప్రాయానికి అర్హుడైన దేవుణ్ణి
అభిరుచికి అనుగుణమైన కులాన్ని
దర్పానికి సరిపడ ధ్వజాన్ని
ఇష్టానికి యుక్తమైన ఇజాన్నీ
స్థాపించుకుని
సమరస భావనను పోనాడుతూ
శత్రుత్వాన్ని పోషిస్తూ
సరిహద్దులను ఏర్పర్చుకున్న
తానూ, తన వంటి వారూ
దురాచారులమేనని
నిందితులమేననీ
అతని చేతనే ఒప్పించాలి!

దేవతలు, ఋషులు
దైవదూతలు, ప్రవక్తలూ
సంతోషంగా సంచరించిన
స్వర్గ తుల్యమైన నేలపై
యుద్దాలను
రక్త పాతాలనూ పుట్టిస్తూ,
మరణాలను
క్షతగాత్రులను
ఆర్తులను, శరణార్థులనూ సృజిస్తున్న
ఆ రణ పిపాసి
ఆ రక్త పిశాచి
శిక్షార్హుడేనన్న సత్యాన్ని
అతని నోటనే రప్పించాలి!

వానర దశ నాటి
వాలము తొలగిందే కానీ
మర్కట శీలమతనిని
వదలనేలేదింకా!

నైతికంగా ఎదగని వ్యక్తి
ఆధునికత వ్యర్థమేననిపించదూ?
అతని యాంత్రిక అభివృద్ధి
శాస్త్ర జ్ఞాన లబ్ధి
ఆవిష్కరణల సిధ్ధీ
వృథాయేననిపించవూ?

తన సుఖం కోసం
తన మనుగడ కోసం
ఎంతకైనా తెగిస్తూ
దేనినైనా ధ్వంసం చేస్తూ
ఎందరినైనా వేధిస్తూ
భావి తరానికి
చింతలను, చీకట్లనూ మిగిలిస్తూ
దుందుడుకుగా చరిస్తున్న అతనిని
ద్వేషిస్తే తప్పేమిటి?
దూషిస్తే నేరమేమిటి?

ప్రకృతి తత్త్వముల ఆసరాతో
బ్రతుకుతూ
వాటి సత్త్వములనే హరిస్తున్న
పంచజనుడు
తిన్న ఇంటి వాసాలను లెక్కించే
కృతఘ్నుడు కాడా?
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న
మూర్ఖుడు కాడా?

అతనిని
మహా స్వార్థపరుడని
నిర్దయుడని
సహజ సంపదల హారకుడని
మారకుడని
రానున్న యుగాంతానికి
కానున్న కారకుడునీ
ఆధునిక వేష భాషలలోని
అభినవ భస్మాసురుడనీ
నిర్ణయించడం
అనృతమౌతుందా?
అపనింద అవుతుందా?

జీవ ధాత్రిని పరిరక్షించే
సహజ శక్తులలో
ఏ ఒక్కటీ ఏ మాత్రమూ
అతని సృజన నైపుణ్యానికి
ఉదాహరణం కాకున్నా
అతని వల్లనే కదా
పచ్చదనాలు పాడెక్కుతున్నవి
వాతావరణం వేడెక్కుతున్నది
చెరువులు పూడ్చబడుతున్నవి
చెట్లు కూల్చబడుతున్నవి!
అతని కారణంగానే కదా
జీవ నదులకు కల్మషాల కాటులు
సాగరాలకు కాలుష్యాల పోటులు
ఓజోన్ పొరకు తూటులు
పర ప్రాణుల ఉనికిపై వ్రేటులు
కొండల గుండెలలో బీటలు
కాల చక్ర గతులకు చేటులు
అతి వృష్టి అనావృష్టి రాటులు
భూకంపాల పాటులు
సునామీల ధాటులు
విపత్తుకు విస్తరిస్తున్న బాటలూ!
అతని వలన సాటివారికేమైనా
ప్రయోజనమా,
ప్రమోదమా అని పరిశీలిస్తే
అబ్బే
అదీ శూన్యమే కదా!
సజాతీయులతోనూ అతనికి
దూరమే కదా!
వైరమే సదా!

ఇలా
పోగాలాన్ని చేరదీస్తున్న
పోకిరీ మనిషికి
పొంగిపోదగిన
విశేషాలేముంటాయి?
విర్ర వీగ తగిన
విజయాలేముంటాయి?

అక్కడక్కడా ఇంకా
మిగిలివున్న సజ్జనుల
మంచి కూడా మరుగుపడేలా
చెలరేగుతున్న ఆ చెనటి
నింద్యనీయుడే!
దండనీయుడే!

Exit mobile version