Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెగిన గాలిపటం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అడప రాజు గారి ‘తెగిన గాలిపటం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్పట్టెక్కనె తెల్లారింది.. లోకమంత ఎలుగుతో నిండుతున్నది. కానీ.. లచ్చన్న ఇంట్లో మాత్రం సీకటి నిండుకున్నది. కారణం లచ్చన్న కొడుకు ‘సాయన్న’.

లచ్చన్నకు ఒక్కగానొక్క కొడుకు సాయన్న. సాయన్న పుట్టంగానే తల్లి సచ్చిపోయింది. తల్లీ దండ్రి తనే అయిపెంచిండు కొడుకును. సాయన్న మీద ఎన్నో ఆశలు బెట్టుకున్నడు.. ఎన్నెన్నో కలలు గన్నడు.

కానీ.. కలగన్నదేదీ జీవితం కాదనీ.. తెల్సుకోలేకబోయిండు. పాణానికి పాణంగ బెంచిండు గానీ.. జీవితంల ఎట్ల నడ్సుకోవాల్నో జెప్పలేదు.

ప్రతీదీ.. ‘పెద్దోడౌతుంటే వాడే తెల్సుకుంటడులే’ అని ఒదిలేసిండు. సిన్నపుడూ.., వాన తుంపరల్లో ఎగురుతూ, ఇసుకలో గూళ్ళు కడుతూ, పిల్లల్తో ఆడుకుంటుంటే సూసి ఆనందించిండు.. బడికి పోతుంటే మురిసిపోయిండు. కానీ..

తనకు జెప్పకుండ బడెగ్గొట్టి దోస్తులతో కలిసి శెరెంబడి, శెలుకలెంబడి ఈతపండ్ల కోసం, రేగుపండ్ల కోసం తిరుగడం, ఊరిపెద్ద రామచంద్రయ్య మామిడి తోటలో దొంగతనంగా దూరడం మాత్రం కనిపెట్టలేకపోయిండు.

సాయన్న వల్ల తోటి పిల్లలు సెడిపోతున్నారని ఆ పోరగాండ్ల అవ్వ, అయ్యలు లచ్చన్న దగ్గర ఎంత మొత్తుకున్నా.. “సిన్న పిల్లలు ఆళ్ళకేం దెల్సు, పెద్దోళ్ళోతుంటే ఆళ్ళే తెల్సుకుంటరు” అని సర్దిజెప్పెటోడు.

అట్ల క్రమశిక్షణ లేకుండ పెరుగుతూ.. సినిమాలూ, షికార్లంటూ తిరుగుడు మొదలుబెట్టిండు. తెగిన గాలిపటం లెక్క తయారయిండు. విచక్షణ లేకుండ ప్రవర్తించడం మొదలుబెట్టిండు.

సదువు సంక నాకిపోయింది. ఊళ్ళోని జల్సారాయుళ్ళలో ఒకడిగా కల్సిపోయిండు. కాంట్రాక్టర్ కానూరుకనుయ్య సెయ్యి కింద పనిజేసే పనికిమాలినోళ్ళలో ఒక్కడిగ జేరిపోయిండు.

సదువుకొని తన పేరు నిలబెడుతడనుకున్నడు కానీ దారి తప్పుతున్నడని తెల్సింది లచ్చన్నకు. ఈడుకొచ్చిండు.. ఏదైనా కీడు జరుగుతుందేమోనని గ్రహించిన లచ్చన్న మంచి కుంటుంబంల అమ్మాయిని జూసి పెళ్ళిజేసిండు.

సహజంగానే జల్సారాయుడైన సాయన్న పెండ్లై ఇంతకట్నం అచ్చే సరికి, తన జెల్సాలు ఇంకా ఎక్కువైనయి. అదువరకు సాటుమాటుగ తిరిగే టోడు ఇప్పుడు దర్జాగ తిరుగుడు మొదలుబెట్టిండు.

పెండ్లై ఏడుగడువకుండనే ఓ ఆడపిల్లకు తండ్రైయిండు. ముద్దొస్తున్న బుజ్జిమనుమరాలును జూసి, సనిపోయిన తన భార్య సరవ్వే మల్ల పుట్టిందని మురిసిపోయిండు లచ్చన్న.

ఇగ బిడ్డపుట్టినంకనన్న కొడుకు మారుతడేమోనని ఎదురుసూసిండు లచ్చన్న. కొడుకు సెయ్యి దాటిపోయిండనీ.. తెల్సినా.. మారుతడని ఎదురుసూసుడు మొదలుబెట్టిండు.

కానీ.. లచ్చన్న ఒక్క లెక్క ఆలోసిస్తాంటే అవుతల ఇంకోలాగ జరుగుతోంది. లచ్చన్నకు తెల్వకుండనే సం॥నికి ఒక ఎకరం తాకట్టు బెట్టి మరీ తాగుడు మొదలుబెట్టిండు సాయన్న.

మరో ఏడు గడిసిందో లేదో మళ్ళీ ఆడ బిడ్డకు తండ్రియిండు.. అప్పటిదాక నోరుదెర్వని సాయన్న భార్య.. “ఇగ పిల్లలుచాలు పిల్లలు పుట్టకుండ ఆపరేషన్ జేసుకుందం” అన్నది.

“అట్ల కుదరదు ఇంకోసారి సూద్దం. కొడుకు పుట్టేదాక నోరు తెర్వకు” అన్నడు. కానీ.. మూడోసారి ముద్దుగా ఆడబిడ్డ పుట్టింది.

ఇగ అప్పుడు.. పోరగాండ్లను సాదలేక భార్యను సాధించుడు మొదలుబెట్టిండు ఎర్రోని లెక్క.. భార్యను కొట్టబోయినప్పుడు, తండ్రి అడ్డమొచ్చినా, ఆయన మీదే సెయ్యి జేసుకునే దాకపోయింది సాయన్న ఎర్రితనం.

“నువ్వు ఈ ఇంట్ల అడుగుపెట్టినంకనే అన్ని అపశకునాలు జర్గుతున్నాయి” అంటూ సాధించడం ఎక్కువ జేసిండు.

“నువ్వు అచ్చినంక ఒక పని అయితలేదు. కాంటాక్టర్ కనుకయ్య కింద సబ్ కాంటాక్టర్‌గా పనులు తీసుకొని జేత్తే ఒక్కపైస లాభం కాదు గదా.. ఉన్న నాలుగెకరాలు తాకట్టు బెట్టాల్సి అచ్చింది” అంటూ బెదిరిపోయే మాటలతో బెదరగొట్టిండు.

ఇంటెనుక శాయబాన్లుండి ఇదంతా ఇంటున్న లచ్చన్న గుండెల్లో రాయి బడ్డట్టు అయింది.

సివరికి ఆ రోజు లోల్లి ముదిరి భార్యను పుట్టింటికి ఎల్లగొట్టబోతే నడుమబడి ఇద్దర్ని సముదాయించి శాంతపరిచిండు.

కోడలు లేంది జూసి.., “తోడుగ ఉంటనని జెప్పి పెండ్లి జేసుకొని, ఇప్పుడు ద్రోహంజేసి ఇంటికి పంపిత్తననడం మగతనం అనిపించుకోదురా” అంటూ గట్టిగానే మందలించిండు.

“బయటేదో తాగుతానవని తెల్సినా ఊకున్నా. అదేరా… అదే… ఆ ఊకునుడే కొంప ముంచిందిరా. నేనెంత తప్పుజేసిన్నో ఇప్పుడర్థమైతందిరా మర్వన్న తల్లి అత్తే నిన్ను గెల్వనీయదని పెండ్లికూడా జేసుకోకుండ పెంచితే నువ్ జేసేది గిదా…!?” అంటూ కండ్లనీళ్ళు దీసుకుంటూ శాయబాన్లకుపోయి మంచంల కూలబడ్డాడు.

అప్పుడు సాయన్నకు తనుజేస్తున్న తప్పేందో మెల్లెగా అర్థమైంది.. విషయం తన సెయ్యిదాటిందని తెలిసిన సాయన్న… ఇంకా ఎక్కువగా తాగుడు మొదలు బెట్టిండు.

ఇగ ఇంట్ల భార్యతో గొడవలు షరా మామూలై పోయినయి. కాంట్రాక్టర్ కానూరు కనకయ్యకు బాకీబడ్డ పైసలు ఇయ్యక పోయేసరికి ఇద్దరి మధ్య తేడాలచ్చినయి. అప్పులోల్ల బాధలు రోజురోజుకు కొండలై కూర్చున్నయి. ఏం జేయ్యలేక సాయన్న ఉన్న భూమి అమ్మజెప్పిండు..!

ఇంట్ల పరిస్థితి ఎంత దిగజారిందో తెల్సుకున్న లచ్చన్న మంచబట్టిండు. భూమి అమ్మినంక అప్పులు దీరినా… సాయన్న తాగుడుకు అచ్చే ఆమ్‌దాన్ లేక పూట గడువకుంటైంది. ఇంట్ల పిల్లలు పెరిగి పెద్దోళ్ళోతున్నరు.. భార్య కూలికి పోతే తప్ప ఇంట్ల ఎల్లని పరిస్థితి. పైసల్లేక సివరికి అడ్డువ సగ్గువ దొరికే గుడంబా తాగుడు మొదలుబెట్టిందు. అది జూసిన లచ్చన్న పాణం పోయినంతపనైంది.

ఒకప్పుడు ఇంటెనుకాల పెరట్లో వేపసెట్లకింద నులక మంచంలో తాత ఎదపై కూసోని బోలెడన్ని కథలు విన్న ముద్దోచ్చే పిల్లలు, ఇపుడు సిక్కులు బడ్డ సింపిరిజుత్తుతో, మురికి నిండిన బట్టల్తో, బిక్కమోహాల్తో ఉండాల్సి అచ్చింది. ఎప్పుడూ పదిమంది అచ్చిపోయే కొంప ఇపుడు పాడుబడ్డ బంజెరుదొడ్డి లెక్క పాడుబడ్డది. ఇల్లు చెదలు బట్టినట్లైయింది. ఇంట్లో మనుషులు చెరపురుగులై కూసున్నట్టున్నది.

ఏ పండుగొచ్చినా కొత్త బట్టల్తో తిరిగే ఆడపిల్లలు నేడు “ఎందుకమ్మా మనకే ఈ కష్టాలు కన్నీళ్ళు” అంటూ తమ చూపుల్తోనే ప్రశ్నిస్తున్నరు.

ఆ పిల్లల్ని సూడలేక ఓ రాత్రి జీవిడిసిండు లచ్చన్న..!

ఊరంతా వాళ్ళను జూసి తల్లడిల్లిండ్లు. తలోపైసా ఏసుకుని కాటికి జేర్చి కావల్సిన కార్యాలు జరిపిండ్లు. పది రోజుల్దాక ఊరి జనం సాయన్నకు సాయమైండ్లు. ఆ తర్వాత ఓ నెలరోజులు మంచిగానే ఉన్నడు సాయన్న..

కాని పుర్రల పుట్టిన బుద్ది ఏడబోతది కాటికి పోయేదాక పోదుకదా పొద్దంతా కూలిజేసి అలిసోచ్చే భార్యను సుఖంగా నిద్ర పోనిచ్చెటోడుకాదు తిడుతూ.. అరుస్తూ.. ఎపుడో తెల్లారగట్ల పండుకునేటోడు.

అట్లా తాగుడుకు బానిసైన సాయన్నకు ఓ రోజు.. కడుపులో ఇపరీతమైన నొప్పి అచ్చింది. ఊళ్ళె ఆర్.ఎం.పి. డాక్టరచ్చి జూచి.. “పట్నం పోవాల్సిందే” అన్నడు.

పట్నంల డాక్టర్ జూసి “సాంబయ్య లివర్ బాగా పాడైంది. మళ్ళా మందు తాగుదె మాత్రం బతుకుడు కస్టం” అన్నడు. సాయన్నకు మందలింపుగా మంచి ఇషయాలు జెప్పిండు. మందులు రాసిచ్చిండు. “ఎంతైతయి సారూ” అని దీనంగా అడిగింది సాయన్న భార్య.

“మూడు నాలుగువేలు అయితయి కావచ్చు” అన్నడు డాక్టరు. డాక్టరు మాటలు ఇన్న సాయన్న భార్య కండ్లు వలవల వడుస్తునే ఉన్నాయి.

సేతిల సిల్ల గవ్వలేదు. కండ్లు తుడ్సుకుందమని కిందికి వంగి కొంగు తీయబోయింది. తాళి బొట్టు కనబడ్డది.

కండ్ల నీళ్ళు తుడుసుకునుడు ఆపి… తనకు తనే ధైర్యం జెప్పుకుని డాక్టర్ ఇచ్చిన సిట్టి పట్టుకొని బయటికొచ్చి అవుసలొల్ల దుకాణం కాడికి పోయి.., తాళిబొట్టు అమ్మి పైసలుదెచ్చి మందులు గొన్నది.

డాక్టరు మాటలు విన్నట్టు నటించిన సాయన్న నాలుగురోజులు మందుల వాడంగనే పాణం బాగయ్యేసరికి మళ్ళా పాణం గుడంబ మీదికి కొట్టుకున్నది.

మళ్ళీ షరా మామూలే.. తాగుడు మొదలుబెట్టిండు. ఇంట్ల ఎల్లుత లేదని బడికి పోయె పెద్ద బిడ్డను బడి మాన్పించి కూలీకి దీసుకబోవుడు మొదలుబెట్టింది సాయన్న భార్య.

ఆ కూలీ డబ్బులను కూడా భార్య పిల్లల్ని కొట్టి మరీ తీసుకుపోయి తాగడం మొదలుబెట్టిండు సాయన్న. వద్దని కాళ్ళుబట్టుకున్నది. ఇనలే, కడుపుల దన్నిండు.. “నువ్ సత్తవని డాక్టర్లు జెప్పిండ్లు తాగొద్దురా” అన్నది. ఇనలే.. “నీ యవ్వ నిన్నే సంపుతా” అన్నడు కాని.. తాగుడైతె మానలె.

ఓ రోజు పొద్దుగాల్నే “అమ్మా” అంటూ పెరట్ల నుండే అరిసింది పెద్ద బిడ్డ. పోయి సూసేసరికి తెల్సింది బిడ్డ రజస్వల అయిందని.. కండ్లల్ల కన్నీళ్లు కండ్లల్లన దిప్పుకొని “ఏం కాదు పద” అని ఇంట్లకు దీసుకచ్చింది. ఏం జేయ్యాల్నో, ఎవ్వల్ని పిలువాల్నో దెలువక బిడ్డను సాపల కూసుండ బెట్టి, తను తలకాయ బట్టుకొని కూసున్నది.

అవ్వయ్య, అత్తమామ లేరు. అన్నలత్తమన్నా వదినలు రానివ్వరు.

ఏజెత్తు అని ఎడుసుడు మొదలు పెట్టింది.. ఇంతల్లనే మూడు బాటలకాడ సాయన్న గుడంబ దాగి నొప్పితో కొట్టుకుంటూ సచ్చిందనే వార్త జెపిండ్లు ఊరోల్లు. అది విన్న సాయన్న భార్యకు సల్ల చెమటలు బెట్టినయి. గోడకొరిగింది. జనం గూడేసరికే జీవిడిసింది.. ఎన్నని తట్టుకుంటది ఆ గుండె.. తల్లడిల్లి తల్లడిల్లి తనువు చాలించింది.

Exit mobile version