Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూలాల లోతుల్లోంచి.. వెలుగులోకి

[శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారు రచించిన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ కోవెల సంతోష్ కుమార్.]

తెలుగు, తెలుంగు, తెనుగు, ఆంధ్రము అన్న అంశాలపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు మూలాల అన్వేషణ కోసం చాలా మంది సాహిత్య కారులు, చరిత్ర కారులు సంవత్సరాల తరబడి పరిశోధనలు చేస్తూ వచ్చారు. సాహిత్యంలో, శాసనాల్లో, మన ప్రాచీన గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలన్నింటిలోనూ పరిశోధన విస్తృతంగా కొనసాగుతూ వచ్చింది. అయితే.. తెలంగాణ ప్రత్యేక ఉద్యమం నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ అస్తిత్వ సంఘర్షణలు తీవ్రమైన క్రమంలో రెండు ప్రాంతాల నుంచి ఈ మూలాల తవ్వకాలు తీవ్రంగా జరిగాయి. అంతకు ముందు విశాలాంధ్ర నేపథ్యంలో కానీ, అంతకు ముందు బ్రిటిషర్లు, నిజాంల కాలంలో కానీ పరిశోధనలు మరో రూపంలో జరిగాయి. నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో పరిశోధనలకు పెద్దగా ఆస్కారం ఉండింది కాదు. శాసనాలపై కొంత వరకు పరిశోధనలు చేసిన దూపాటి వెంకట రమణాచార్యులు తెలంగాణేతర ప్రాంతం నుంచి వచ్చి కృషి చేసిన వారే. నల్లగొండ నుంచి బీఎన్ శాస్త్రిగారు విస్తృతంగా శాసనాల పరిశోధనలు చేశారు. మరోవైపు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండిపోయిన ఆంధ్ర ప్రాంతాన్ని విముక్తం చేసుకోవడం కోసం ఆంధ్ర ప్రాంతంలో అస్తిత్వ ఉద్యమం తీవ్రం కావడం.. ఆ భావోద్వేగం లోనుంచి ఆంధ్ర ప్రాంతంలో పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. తదనంతర కాలంలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడటం.. ఆ తరువాత మూడేండ్లకు విశాలాంధ్ర ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ వేరు కాదు.. అందరూ ఒకటేనన్న సద్భావనను పాదుకొల్పడానికి ప్రయత్నం జరిగింది. ఇందుకోసం చరిత్ర రచనల్లో, పరిశోధనల్లో రాజకీయ చరిత్రను, భాషా చరిత్రకు ఆంధ్ర పదాన్ని విస్తృతంగా వినియోగించారు. తెలుగు ప్రత్యామ్నాయంగా ఆంధ్ర పదాన్ని వినియోగిస్తూ వచ్చారు. అయితే ఆంధ్రుల చరిత్రలో కానీ, సంస్కృతికి సంబంధించిన రచనల్లో తెలుగు, తెలుంగు, త్రిలింగ పదాల ప్రస్తావన చాలా ఉన్నప్పటికీ, ‘తెలుగు’ భాషా పద వ్యుత్పత్తికి ఆయా పదాలకు సంబంధం ఉన్నట్టుగా చెప్పడానికి ఆ రచనల్లో ఇష్టపడలేదు. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది పరిశోధకులు, మహానుభావులు తెలంగాణలోని అచ్చమైన తెలుగును, ఇక్కడి శాసనాల అధ్యయనాన్ని ఇష్టపడ్డప్పటికీ, రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యపు పోకడల క్రమంలో తెలంగాణ ప్రాంతంలోని భాషకు, అస్తిత్వానికి సరైన ప్రాధాన్యం లభించలేదు. కొమర్రాజు లక్ష్మణరావు గారి లాంటి వారు తెలంగాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి భాషను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే.. అచ్చమైన తెలుగు పదాలు అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలోనే మనకు వినిపిస్తాయని, ఇందుకు కారణం అక్కడ రాజభాషగా తెలుగుకు తగిన గౌరవం దక్కకపోవడం వల్ల ప్రజలు కాపాడుకున్న భాష అని వారు వ్యాఖ్యానించారు. దూపాటి వెంకటరమణాచార్యులు వంటి వారు ఇక్కడికి వచ్చి అనేక శాసనాలను పరిశోధించారు.

అయితే 1969 లో తెలంగాణ తొలి దశ ఉద్యమం రావడం, తరువాత 1972లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం రావటం, ఆ తరువాత 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం రావటంతో రెండు ప్రాంతాల మధ్యన ఇంటిగ్రిటీ లేమితో నానాటికీ అంతరాలు తీవ్రంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆధిపత్య ధోరణులు, తిరస్కార ధోరణులు సమాంతరంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంపై పెచ్చు మీరాయి. తెలంగాణ అనే ప్రాంతానికి సంబంధించిన భాషను కానీ, జాతీయ అస్తిత్వాన్ని గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితి. డార్విన్ సూత్రం మనుగడ కోసం పోరాటం అన్నట్టు తెలంగాణ శోధకులు, వారి శోధన తీవ్రమైన పోరాటంతోనే తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. నాడు ముడుంబై వేంకట రాఘవాచార్యులు నిజామాంధ్రమున తెలుగు కవులు పూజ్యము అన్నా.. వావిలికొలను సుబ్బారావు పోతన ఒంటిమిట్టవాడని తేల్చేసినా, పాల్కురికి సోమనాథుడిని కర్ణాటకలో ఎక్కడో ఉన్న హాల్కురికి వాడని చెప్పటానికి ప్రయత్నించినా, మల్లినాథ సూరిని, కాకునూరి అప్పకవిని.. ఇక్కడి నుంచి ఎక్కడికో ఎత్తుకుపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ పోరాటం ద్వారానే నిలుపుకోవాల్సి వచ్చింది.

నిజామాంధ్రమున తెలుగు కవులు పూజ్యము అని ముడుంబై వేంకట రాఘవాచార్యుల వారు సురవరం ప్రతాపరెడ్డి గారి గోలుకొండ పత్రికలోనే తీవ్రమైన ప్రకటన చేయడంతో తెలంగాణ ప్రాంతంలో చాలా అసంతృప్తిని కలిగించింది. దీంతో సురవరం ప్రతాపరెడ్డిగారు తన పత్రికలోనే తెలంగాణ లోని కవులందరికీ పిలుపునిచ్చి గోలుకొండ కవుల సంచిక ను వెలువరించారు. ఇందులో 354 మంది కవులు కవితలు వెలువరించారు. ఆ తరువాత 1953లో అలంపురంలో ఆంధ్ర సారస్వత పరిషత్ సమావేశాలు తెలంగాణ ప్రాంత కవుల ప్రతిభకు దర్పణం పట్టాయి. ఇవన్నీ తెలంగాణ, ఆంధ్ర అస్తిత్వ సంఘర్షణల ఫలితాలే.

ఈ నేపథ్యంలోనే తెలుగు భాష ను ఆంధ్ర అన్న పదానికి పర్యాయ పదం అని పేర్కొనడం ప్రారంభించారు. అందులో భాగంగానే నేను తెలుగు లోనే భారతం రాస్తున్నానని ప్రకటించిన నన్నయ నుంచి 20 శతాబ్దపు అర్ధభాగం దాకా వచ్చిన పురాణేతిహాస చరిత్రలన్నింటికీ కూడా తెలుగు పేరు కాకుండా ఆంధ్ర అన్న పేరుతోనే శీర్షికలు వెలువడ్డాయి.

దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణకు ఏవైనా చారిత్రక మూలాలు ఉన్నాయా? తెలంగాణకు, ఇక్కడ మాట్లాడే తెలుగుకు ఆంధ్ర ప్రాంతం కంటే భిన్నమైన అస్తిత్వం ఏదైనా ఉన్నదా? అన్న అంశాలపై చర్చ మొదలైంది. కానీ, తెలంగాణ వచ్చిన తరువాత ఏ అస్తిత్వం కోల్పోయామని, ఏ చారిత్రక మూలాలను కనపడకుండా చేశారని ఉద్యమకాలంలో ఆవేదన చెందారో.. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారు ఆ అస్తిత్వం ఏమిటి? ఆ చారిత్రక మూలాలు ఏమిటన్న దానిపై సీరియస్ గా పరిశోధన చేసినట్టు కనిపించదు. అయితే కేంద్ర ప్రభుత్వం తమిళం, తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించిన సందర్భంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడాన్ని ఒక తమిళుడు అడ్డుకుంటూ అక్కడి హైకోర్టులో కేసు వేస్తే.. ఆ హోదా రాకుండా పోయింది. తెలుగువారు నన్నయను ఆదికవి అంటారు. నన్నయ కేవలం వెయ్యి సంవత్సరాల క్రితం వాడే కాబట్టి తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వకూడదని డిమాండ్ చేసి ఆపించారు. అప్పుడు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని పండితులు పెద్దగా దృష్టి సారించలేదు. తెలంగాణ ప్రభుత్వంలో సాంస్కృతిక వ్యవహారాల సంచాలకులుగా ఉండిన డా.మామిడి హరికృష్ణ తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడంపై చాలా కృషి చేశారు. 11వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించిన పరిశీలన జరుగుతూ ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో నన్నయ కంటే 900 ఏండ్లకు ముందు కవి పంపన రాసిన విక్రమార్జున విజయాన్ని సంపాదించి సాధికారికంగా తెలుగు సాహిత్య చరిత్రను వెలుగులోకి తెచ్చారు. దీనితో పాటు పంపడి కంటే మరో రెండు వందల ఏండ్లు ముందుకు వెళ్లి మొత్తం 11 శతాబ్దాల తెలుగు సాహిత్య చరిత్రను పరిశోధించి సాధించారు. హాలుడి తొలి గాథా సంకలనం గాథా సప్తశతి, చెన్నమల్లుని సీసాలలోని తొలి సీస పద్యం, పాల్కురికి సోమన తొలి శతకమైన వృషాధిప శతకం, మల్లీయ రేచన రాసిన తొలి లక్షణ గ్రంథం కవి జనాశ్రయం, తొలి ద్విపద రామాయణం అయిన గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం, కందుకూరి రుద్రకవి రాసిన తొలి యక్షగానం సుగ్రీవ విజయం, మారన రాసిన తొలి పురాణం మార్కండేయ పురాణం, ఏకామ్రనాథుడు రాసిన తొలి చరిత్ర గ్రంథం ప్రతాపరుద్ర చరిత్రం, తొలి ద్వ్యర్థి కావ్యం అయిన వేములవాడ భీమకవి రాసిన రాఘవ పాండవీయం, తొలి త్ర్యర్థి కావ్యం ఏలకూచి బాలసరస్వతి రాసిన యాదవ, రాఘవ పాండవీయం వంటి అనేక ప్రక్రియల్లోని సాహిత్యాన్ని సాధికారికంగా చూపించి.. తెలుగుకు ప్రాచీన హోదా తీసుకొని రాగలిగారు. అయితే ప్రాచీన భాష హోదా వచ్చిన వెంటనే.. దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం మాత్రం నెల్లూరులో పెట్టేలా చూసుకున్నారు.

ఈ క్రమంలో సీనియర్ సంపాదకులు, వరిష్ట పాత్రికేయులు కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ, తెలుగు మూలాలమీద సాధికారిక పరిశోధన ప్రారంభించారు. సుమారు రెండున్నర సంవత్సరాలు ఈ పరిశోధన సాగింది. చివరకు ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పేరుతో వెలుగు చూసింది. ఒక జర్నలిస్టు సీరియస్ పరిశోధకుడుగా మారితే దాని ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి నిదర్శనం ఈ గ్రంథం. ముందే చెప్పుకున్నట్టు తెలంగాణ చరిత్ర మూలాలపై అన్వేషణ ఇవాళ్టిదైతే కాదు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తెలుగు, తెలంగాణ, ఆంధ్రము, ఆంధ్రభాష అన్న అస్తిత్వాల ఘర్షణల నేపథ్యంలో మొదలైన రచయిత పరిశోధన తెలంగాణ సాకారమైన ఇన్నాళ్లకు అక్షర రూపంలోకి వచ్చింది.

ఈ పుస్తకం ఇప్పుడెందుకు? ఇప్పుడే ఎందుకు? అన్న ప్రశ్న మిగతా అన్ని సందర్భాల్లో వచ్చినట్టే ఈ గ్రంథం విషయంలోనూ వచ్చింది. రెండు రాష్ట్రాలు చక్కగా ఉన్నాయి. సామరస్యంగా అందరం కలిసి మెలిసి ఉంటున్న తరుణంలో ఈ రచన అవసరమా? మళ్లీ విభేదాలు సృష్టించే అవకాశాలున్నాయి కదా.. అనే విమర్శలు రావచ్చు.. కానీ రచయిత మాత్రం ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా, చాలా జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా ఈ రచన చేశారు. తెలంగాణ ప్రాంత అస్తిత్వ మూలాల అన్వేషణ అత్యంత ఆవశ్యకమైంది. ఇది ఎవరినీ నిందించడానికో.. లేక ఎవరి అస్తిత్వాన్నో ప్రశ్నించడానికి ఉద్దేశించింది కాదు. మన ప్రాంత మూలాలను కనుగొనే ఒకానొక ప్రయత్నమే. దశాబ్దాలుగా మన ప్రాంత అస్తిత్వంపై పూర్తిగా కప్పి ఉంచిన పొరలను తొలగించడానికి చేసిన ప్రయత్నమే ఈ తెలంగాణ చరిత్ర మూలాలు గ్రంథం.

‘‘తెలంగాణకు ఆది నుంచి సొంత అస్తిత్వం ఉన్నది. సొంత చరిత్ర ఉన్నది. తెలుగు అన్న బావనే తెలింగ, తిలింగ, త్రిలింగ, తెలుంగు నుంచి వచ్చిందని అనేక చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రాంతం లేక జాతి ఆలంబనగా భాషలు ఎదిగాయని ఏ భాషను చూసినా అర్థమవుతుంది. కర్ణాటులు మాట్లాడిన భాష కన్నడం అయింది. తమిళులు మాట్లాడిన భాష తమిళం అయింది. మర్హాటులు మాట్లాడిన భాష మరాఠా అయింది. అలాగే గుజరాతీ, ఒరియా, బెంగాలీ’’ (పే.38).

తెలంగాణ మూలాల అన్వేషణ ప్రారంభించినప్పుడు అనివార్యంగా ఆంధ్ర శబ్ద విచారణ కూడా చేయాల్సి ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ జాతి వేరు కాదని అందరూ ఒకటేనన్న అభిప్రాయం చాలామందిలో ఉన్న మాట వాస్తవం. నిజానికి మనం చరిత్ర కూడా అలాగే చదువుకున్నాం. కానీ, ఈ రెండూ కూడా 1956 కు ముందు ఎప్పుడూ కూడా ఒకటిగా లేవు. ఒకసారి చరిత్రను మనం పరిశీలిస్తే.. కాకతీయ సామ్రాజ్యంలో మొత్తం తెలుగు ప్రాంతాలన్నీ ఒకటిగా ఉన్నాయి తప్ప మరెప్పుడూ లేవు. తెలుగు వారికి సంబంధించి అతి పెద్ద సామ్రాజ్యం ఓరుగల్లు రాజధానిగా వెలసిన కాకతీయ సామ్రాజ్యమే పెద్దది. మనం పాటల్లో, సినిమాల్లో, వీరగాధల్లో ఇతర రాజ్యాల గురించి చెప్పుకుంటాం కానీ అవి చిన్న చిన్న భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. రెడ్డిరాజ్యం కూడా చిన్నదే. విజయనగర సామ్రాజ్యం కూడా కాకతీయుల వారసత్వంగానే హంపీ ప్రాంతంలో స్థాపించబడిందే తప్ప మరొకటి కాదు. కృష్ణదేవరాయలు కూడా తుళు భాష మాతృభాషగా కలిగిన కన్నడ రాజు. దేశభాషలందు తెలుగు లెస్స అన్నటంతోపాటు ఆముక్తమాల్యద రాయటం ద్వారా ఆయన తెలుగు వారికి సన్నిహితుడయ్యారు.

‘ఐతరేయ బ్రాహ్మణంలో అంధక లేక ఆంధ్రక ప్రస్తావన ఉన్నది కాబట్టి అది అతి ప్రాచీనమైనది కాబట్టి తెలుగు జాతికంతటికీ అదే వర్తిస్తుందని చెప్తూ చరిత్ర రచన సాగింది. అస్మక మహా జనపదం ప్రస్తావన కూడా చాలా ప్రాచీనమైనది. రామాయణ, మహాభారత కాలాల్లో, రచనల్లో ఈ మహా జనపదం ప్రస్తావన ఉన్ది. గోదావరి తీరంలో వర్ధిల్లిన అస్మకుల చరిత్రను ఆధునిక చరిత్ర రచయితలు ఎందుకో విస్మరించారు’ (పే.39).

అస్మక రాజ్యం గోదావరి తీరమే కాదు.. దక్కను భూభాగం అంతా కూడా అస్మక రాజ్యమే. ‘‘మహాభారత ఇతిహాస కాలంలో పదహారు మహాజనపదాలు ఉన్నాయని, అందులో అస్సక, లేక అస్మక, లేక అశ్విక మహాజనపదం ఉన్నదని మహాభారతంలో ప్రస్తావన ఉన్నది. గోదావరి, మంజీరా నదుల మధ్యన విస్తరించి ఉన్న ప్రాంతమే ఈ అస్మక మహాజనపదమని, దీనికి పోతలి లేక పౌధన, లేక బహుధాన్య (బోధన్) రాజధానిగా ఉండేదని చరిత్ర రచనల్లో ప్రస్తావించారు. బౌద్ధ జైన సారస్వతాల్లోనూ పౌధన లేక పోతలి ప్రస్తావన ఉన్నది (పరమాత్త జోతిక-581)’’ పే.40.

మహాభారతంలో రాజసూయ యాగం సందర్భంలో సహదేవుడు దక్షిణ భారత దేశాలను జయించాడు. అందులో ఆంధ్రుల పేరుతో పాటు తలవానులను కూడా జయించారు. ఈ తలవానులు తెలింగులని రచయిత స్పష్టంగా పేర్కొన్నారు. తలవర అంటే రక్షకుడు, యోధుడు, పాలకుడు అనే అర్థాలు ఉన్నాయి. గోండుల భాషలో కూడా ఈ పదం వాడుకలో ఉన్నది. ఈ గ్రంథ రచయిత గోండుల మూలాల మీద కూడా లోతుగా పరిశోధన చేశారు.

తలవానులు తెలంగాణులేననటానికి చాలా మంది చరిత్ర పరిశోధకులు అనేక ఆధారాలు చూపించారు గోదావరి నదికి తెలివాహ అన్న పేరు కూడా ఉన్నది. మహాభారతం భీష్మ పర్వంలో 9వ అధ్యాయంలో భీష్ముడు వర్ణించిన దక్షిణ భారత దేశ ప్రాంతాలలో కూడా తలవానులు ఉన్నారు. ‘ద్రవిడులు, కైరళులు, ప్రాచ్యులు, మూషికులు, వనవాసికులు, కరనాటులు, మహిషకులు, తలవానులు, విదర్భులు, కకులు, తంగనులు, పరతంగనులు ఉన్నట్టుగా వివరిస్తారు. (పే.42). అయితే ఇదే మహాభారతం నీలకంఠ చతుర్థర వ్యాఖ్యానం భారత బావ దీపికలో అయితే.. ‘దక్షిణాపథే ఆంధ్ర తిలింగ కలింగ దేశా: సహ్య మలయ ప్రదేశా:చ అని ఉన్నది. అయితే ఇది ప్రక్షిప్తం అనే అభిప్రాయం ఉన్నది. ఈయనే రామాయణ వ్యాఖ్యానంలోనూ తిలింగ శబ్దం వాడారు. ఇందుకు కారణం అంతకు ముందు గీతాప్రెస్ వారి మహాభారతంలో కానీ, పూణే భండార్కర్ ఎడిషన్ లో కానీ ఇది కనిపించదు. అయితే తలవానులు అన్న మాట కూడా ఉన్నది.

తెలుగు సాహిత్యంలో కవులు కూడా ఆంధ్ర, త్రిలింగ భావనలను పరస్పరాలంబనగా ఉపయోగించారే తప్ప త్రిలింగ భావనను విస్మరించలేదంటారు రచయిత (పే.50). ఇందుకు కారణం ఏమిటంటే.. నన్నయ దగ్గరి నుంచి ప్రతి రాజు, కవి కూడా తెలుగు నే ప్రకటించారు. పదో శతాబ్దంలో రాజశేఖరుడు తన కావ్య మీమాంసలో ఆంధ్ర ద్రావిడ, తిలింగీ, మాగధీ, శౌరసేనీ, పైశాచీ వంటి భాషలన్నీ పరిగణించబడ్డాయని పేర్కొన్నాడు. తరువాత భోజరాజు తన శృంగార ప్రకాశం లో తైలంగ దేశం నుంచి పుట్టిన భాష అని అన్నాడు. ఇక్కడ తైలంగ, తెలుగు దేశం అని ప్రాంతము, భాష రెండూ స్పష్టంగా గుర్తించబడ్డాయి. తరువాత వచ్చిన క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో కూడా తైలంగ భాష కవిత్వంలో మాధుర్యం ప్రత్యేకమైనదంటూ ఒక స్వతంత్ర, సాహిత్య భాషగా కొనియాడాడు. 12వ శతాబ్దంలో హేమచంద్రుడు తన దేశీనామమాలాలలో తైలంగదేశీయా: శబ్దా: (తైలంగ దేశానికి చెందిన పదాలు) అని స్పష్టంగా పేర్కొన్నాడు.

రచయిత తన పరిశోధనలో అనేక మంది కవుల కావ్యాలలో ప్రస్తావించిన అంశాలను సాధికారికంగా పేర్కొన్నారు. త్రిలింగ శబ్దపు మూలాలు ఏయే శాసనాల్లో ఏయే రూపాల్లో అభివ్యక్తమైందో వివరించారు. వివిధ పండితులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆధారాలతో వ్యవహరించారు. ఇందులో ఒకటి ఇక్కడ ఉదహరిస్తాను. ‘‘ తెనుగు వ్యుత్పత్తి అర్థాన్ని గురించి పండితుల్లో అనేక ఊహాపోహలున్నాయి. ఇక ఆంధ్ర, తెలుగు అనేవి ఆంధ్రజాతిలో జీర్ణించుకుపోయిన రెండు ముఖ్య తెగలని తెలుస్తుంది. అయితే తెలుగు తెగ ఆంధ్రజాతిలో సమైక్యమైనపుడు ఇతర తెగల భాషలవలె తెలుగు భాష సయితం వ్యక్తిత్వం కోల్పోయి ఉండవలసింది. ఆ విధంగా జరుగలేదు. అందుకు కారణం ఊహించడం కష్టం కాదు. వైదిక వాఙ్మయంలో ఆంధ్రులు సాహసోపేతులయిన సంచారక జాతి అని సూచిస్తున్నది. తెలుంగులు తీరమైదాన ప్రాంతాల్లో కళింగులకు పొరుగున వ్యవసాయాది వృత్తులు అవలంబించిన స్థిర నివాసులు. కళింగ పదానికి వరి ధాన్యం తినేవారనే అర్థం కూడా ఉంది. తెలుగులు వారి సోదరులే! అందువల్ల తెలుంగుల భాషాసంస్కృతులు ఆంధ్రుల భాష సంస్కృతుల కంటె కొంత పరిణతి చెంది ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆంధ్రులు సైనికంగా విజయం సాధించినప్పటికీ, పరాజితులైన తెలుంగుల భాషను అనుసరించక తప్పలేదు. అదే కారణంగా తెలుంగులు ఆంధ్రజాతిలో జీర్ణమైపోయినప్పటికీ తెలుగు భాష వ్యక్తిత్వం నిలబడింది. విజితుల సంస్కృతి విజేతలను నిర్జించిన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు. రాజకీయాధికారం నెరపుతున్నది ఆంధ్రలయినందున వారు వాడుతున్న తెలుగు భాషకే ఆంధ్ర భాష అని వ్యవహారం ఏర్పడింది.’’ బీఎస్ఎల్ హనుమంతరావు తన ఆంధ్రుల చరిత్రలో చేసిన సూత్రీకరణను రచయిత ప్రస్తావించారు. (పే.56) ఈయన కంటే ముందే ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందుశేఖరం కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అంశాలను ఉల్లేఖించారు. చరిత్రకారుడు కే వెంకటనారాయణ రావు ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహంలో పేర్కొన్న అంశాలను వివరిస్తూ.. ఆంధ్రులు, తెలుంగులు వేరుగా ఉండి.. తరువాత సమైక్యమైపోయిన అంశాలను సాధికారికంగా నిరూపించారు.

తెలుగు, తెనుగు తెలుంగు అన్న మాటల మూలార్థం తెలుసుకోవడంలో తెలంగాణ చరిత్రకారులు పూర్తిగా అసఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. మహా పండితులైన వారు కూడా ఈ విషయంలో పురోగతి సాధించలేకపోయారేమోననిపిస్తుంది. కాకతీయుల మీద పరిశోధన చేసిన పివి పరబ్రహ్మశాస్త్రిగారు కానీ, సురవరం ప్రతాపరెడ్డి కానీ.. ఆంధ్రుల ప్రస్తావనే చేశారు కానీ, తెలుగు శబ్దం వ్యుత్పత్తి ఏమిటన్నది స్పష్టంగా తేల్చలేకపోయారు. ఇక మరికొందరు చరిత్రకారులు త్రిలింగ శబ్దము ప్రాచీనము కాదని తేల్చేశారు. శైవం ముమ్మరంగా వ్యాపించిన తరువాత ఈ పదం స్థిరమైందన్నారు. తెలుగు, త్రిలింగ, తికళింగ వంటి పదాలు తెలుగు వ్యుత్పత్తికి సంబంధించినవి కాదని తెలిపారు. దేశ నామంగా కానీ, జాతి వాచకంగా కానీ ఆంధ్రము కాకుండా తెలుగు జాతి వేరే లేదని సూచించారు. సీపీ బ్రౌన్ కూడా ఇలాంటి సూత్రీకరణే చేశారు.

‘తెలుగు భాషపై మరికొంత విస్తృతంగా పనిచేసిన ఒక్క చార్లెస్ సిపీ బ్రౌన్ మాత్రం ఇది ఆధునిక కవుల కల్పన అని అర్థం లేని వాదన అని, తైలింగ, తెలింగ పదాలను ముస్లింలు ఉపయోగించారని, తెలుగు పదానికి తెలిసిన మూలాలేవీ లేవని వాదించారు. తెలుగు, తెలింగ భావనలపై బ్రౌన్ వ్యతిరేకత విస్మయం కలిగిస్తుంది. తెలింగ పదం తమిళ పదమని, దానిని ముస్లింలు స్వీకరించి ఉపయోగంలోకి తెచ్చారని, ఆ పదం తెలుగు ప్రజలకు అసలు తెలియదని ఒక పెద్ద అబద్ధాన్ని అలవోకగా రాశారు. ఇప్పటికీ బ్రౌణ్య నిఘంటువులో తెలింగ పదానికి ఇదే వివరణ కనిపిస్తుంది. బ్రౌన్ తన తిరస్కరణకు ఎలాంటి సహేతుకమైన ఆధారాలు, హేతువులు చూపలేదు’’ (పే.54).

తెలుగు పద వ్యుత్పత్తిని మొదటి నుంచి కూడా పండితులు, చరిత్రకారులు తిరస్కార భావంతోనే చూస్తూ వచ్చారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి?

ఈ క్రమంలోనే రచయిత కట్టా శేఖర్ రెడ్డి స్పష్టంగా తెలుగు వ్యుత్పత్తిపై సాధికారిక ఆధారాలను చూపారు. ఆరుద్ర సమగ్రాంధ్ర చరిత్రలో ప్రస్తావించిన గోండుల వంశోత్పత్తిని ఇక్కడ ప్రస్తావించారు. ‘గోండులలో టేకం, మార్గం, పూసం, తెలింగ పేర్లతో నాలుగు జాతుల వారు ఉన్నట్టు, తెలింగం అన్న దేవత తెలుగు జాతి మూల పురుషుడని ఊహించవచ్చునని ఆయన రాశారు. దీనిపై కూడా లోతులోకి వెళ్లలేదు. కనీసం ఇది స్థానిక చరిత్ర, తెలంగాణ ఆత్మకు దగ్గరైన సూత్రీకరణ’(పే.62) అని రచయిత అంటారు.

ఆ తరువాత త్రిలింగ, త్రికలింగ, తెలింగ, తైలంగ పదాల మూలాల్లోకి రచయిత శోధించుకుంటూ వెళ్లారు. ఇందులో ఏయే సమయాల్లో ఎలా ఈ పదాల వినియోగం జరిగిందో స్పష్టంగా వివరించుకుంటూ వచ్చారు. గాంగయదేవ విక్రమాదిత్యుడు, లక్ష్మీ కృష్ణదేవుడు, యశకర్ణ దేవుడు, గజ కర్ణ దేవుడు లాంటి వారు తమను తాము త్రికళింగ దేశాధిపతులుగా పిలిపించుకున్నారు. (పే.66).

మెగస్తనీస్ ఇండికాలో కూడా త్రికళింగ ప్రస్తావన ఉన్నది. ఇదే త్రిలింగమని భావించిన చరిత్రకారులు ఉన్నారు. అంతే కాదు..

చాలా మంది విదేశీ చరిత్రకారులు తిలింగ శబ్దాన్ని ఏయే విధంగా వాడారో చూడండి.

  1. ‘‘ultra Ganges sunt gens Telingae…” PLINY the Elder (Naturalis Historia VI.22 క్రీ.శ. 77–79) గంగకు ఆవలి భాగంలో టెలింగే అనే ప్రజలు నివసిస్తున్నారు.
  2. ‘‘Τριλιγγων / Τηλιγγοι’’ (PTOLEMY (Claudius Ptolemaeus) Geographia, Book VII, Chapter 1 క్రీ.శ. 150) త్రిలింగ ప్రజల నివాస ప్రాంతం.
  3. تيلنجة من بلاد الهند ولهم لسان خاص (అల్-బెరూనీ (Al-Biruni) Kitab al-Hind Vol I (Trans. Edward Sachau) క్రీ.శ. 11) “తీలంగ (Tilinga) భారతదేశంలోని ఒక ప్రాంతం; వారికి ప్రత్యేకమైన భాష ఉంది.
  4. Wa-min bilādi al-Hind: Tilanj, wa-Kanbāya, wa-Malibār… అల్-ఇద్రిసి (Al-Idrīsī) ((Nuzhat al-Mushtāq fi Ikhtirāq al-Āfāq) క్రీ.శ. 1154) “భారతదేశం లోని ప్రాం తాలలో టిలంజ్ (Tilanj), కంబాయా, మలబార్ మొదలైనవి ఉన్నాయి.”

అలాగే అరబిక్ చరిత్రకారులు ఫిరిష్తా, అల్ మసూదీ, ఇబ్న్ ఖుర్దాద్ బిహ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం గురించి రాసిన అంశాలను శేఖర్ రెడ్డి తన గ్రంథంలో విస్తృతంగా చర్చించారు.

తారానాథుని ‘టిబెటన్ హిస్టరీ ఆఫ్ ద ప్రాపగేషన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా’ గ్రంథంలో తెలుగు దేశాన్ని పదే పదే త్రిలింగ దేశంగా అభివర్ణించినట్టు లార్డ్ కాల్డ్ వెల్ రాశారు. కళింగ త్రిలింగలో భాగమని, కళింగపుర దాని రాజధాని గా ఉన్నదని కూడా కాల్డ్ వెల్ పేర్కొన్నాడు.

తెలుగు వ్యుత్పత్తికి సంబంధించిన అనేకానేక శాసనాలను కూడా శేఖర్ రెడ్డి తన గ్రంథంలో ప్రస్తావించారు. పురాణాలలో ఉన్న ప్రస్తావనలు వెలికి తీశారు. వాయు పురాణంలో ‘కర్ణాటాశ్చైవ త్రైలింగ గూర్జరారాష్ట్ర వాసిన: ద్రవిడ ద్రావిడా: పంచ వింధ్య దక్షిణ వాసిన:’ అన్న శ్లోకాన్ని ఉదహరించారు. పద్మపురాణం రెండో ప్రకరణంలోని భూమి కాండలో ఉన్న తైలంగ దేశ ప్రస్తావనను పేర్కొన్నారు. బ్రహ్మాండ పురాణం, మత్స్యపురాణం, మార్కండేయ పురాణాల్లోని వివరాలను తెలిపారు. తరువాత మనకు లభించిన శాసనాల్లో తెలుగు వ్యుత్పత్తి కనిపించిన అతి ప్రాచీనమైనది క్రీస్తుశకం 498 లో తూర్పు గంగావంశ కళింగ అధిపతి ఇంద్రవర్మ వేయించిన దానశాసనంగా నిర్ధారించారు. అందులో తిరిలింగ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తికి భూమిని దానం చేసిన వివరాలు ఉన్నాయి. తరువాత విష్ణుకుండిన రాజు రెండో విక్రమేంద్ర వర్మ 555లో వేసిన చీకుళ్ల శాసనం, తరువాత కల్యాణీ చాళుక్యుడు రెండో తైలపుడు 973లో వేసిన శాసనాల్లోనూ తిలింగ శబ్దాలు ఉన్నాయి. రెండో తైలపుడు తనను తాను త్రిలింగ భూపతిగా పేర్కొన్నాడు. ఇదే విధంగా చాళుక్య రాజు అయిన రెండో పులకేశి, ఒకటో అమోఘ వర్షుడు, మూడో కృష్ణుడు కూడా తాము త్రిలింగ దేశాధిపతులమని చెప్పుకున్నట్టు కర్ణాటక, మహారాష్ట్ర శాసనాలు చెప్తున్నాయి. వీటిని మరింత పరిశోధించాల్సి ఉన్నది. గుజరాత్ ను పాలించిన బ్రిటిష్ అధికారి అలెగ్జాండర్ కిన్ లోక్ ఫోర్స్ తాను రచించిన రసమాల అనే గ్రంథంలో భారప్పను తెలింగాణ స్థితిపతిగా చెప్పుకున్నట్టు వివరించారు. చోళరాజు రాజరాజు 1022లో కళింగులు, తెలింగులు, ఒడ్డాలను ఓడించినట్టు తరువాలంగాడు ఫలకాల్లో లభించిన పత్రంలో ఉన్నది. అనంతపురం జిల్లా మడకశిర, కొత్త శివరంలలో లభించిన పలు శాసనాల్లో చోళ సైన్యాధిపతి అరయ్యన్ రాజరాజన్ కళింగులు ఒడ్డాలు, తెలుంగులపై ఎలా పోరాడారో రాసి ఉన్నది. తమిళ, కన్నడ, మరాఠీ, రాజస్థానీ శాసనాల్లోనూ ఆయా భాషల ప్రాచీన వాఙ్మయాల్లోనూ తెలింగ, తెలుంగ, తెలుంగు, తెలుగు శబ్దాలను వాడారని శేఖర్ రెడ్డి తన గ్రంథంలో స్పష్టంగా వివరించారు.

వేదోపనిషత్ ఇతిహాసాల కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకానేక శాసనాలు, సాహిత్యం, చారిత్రక పరిశోధనలన్నింటిలో తెలుగు మూలాలను అన్వేషించడంలో శేఖర్ రెడ్డి విస్తారమైన పరిశోధన చేశారు. తెలుగులు ఎవరు? తెలంగాణ్యులు ఎవరు? తెలుగు ఎక్కడిది? అన్న మౌళిక ప్రశ్నలకు సాధికారిక రిసోర్స్ గా రూపుదిద్దుకున్న పుస్తకం ‘తెలంగాణ చరిత్ర మూలాలు’. తెలంగాణ చరిత్రను, ప్రాచీనతను అధ్యయనం చేయడానికి ప్రాథమిక గ్రంథంగా ఉపకరణమవుతుందనటంలో సందేహం లేదు.

***

తెలంగాణ చరిత్ర మూలాలు
రచన: కట్టాశేఖర్ రెడ్డి
ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు
ధర: ₹ 300/-
ప్రతులకు:
తెలంగాణ ప్రచురణలు,
1వ అంతస్తు, ఇంటి నంబర్ 1-1-80/15
ఆర్టీసీ క్రాస్ రోడ్స్,
ముషీరాబాద్,
హైదరాబాద్ 500020,
ఫోన్ నం. 8639972150

 

~
కట్టా శేఖర్ రెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-katta-sekhar-reddy/

Exit mobile version