Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలి మంచు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్ గారి ‘తెలి మంచు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వివేక్, తనూజ సివిల్ ఇంజనీర్లు. ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ చాలా పెద్దది అవడం వలన వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి పరిచయం లేదు. ఇరువైపులా పెద్దలు మాట్లాడుకుని వాళ్ళ పెళ్ళి నిశ్చయించారు. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది.

వివేక్ తండ్రి పెద్ద బిజినెస్ మాగ్నెట్. అతనికి రోజుకు ఇరవైనాలుగు గంటలు సరిపోవు. తల్లి ఎప్పుడూ సాంఘిక సేవ అంటూ తిరుగుతుంది. ఆవిడ కూడా ఇంట్లో కనిపించడం అరుదు!! కనుక వివేక్ చిన్నప్పటి నుంచి ఆయా చేతుల్లో, నౌకర్ల చేతుల్లో ఇంట్లో బంధింపబడి పెరిగాడు. అతనికి తల్లిదండ్రుల ప్రేమ, అనురాగం మాత్రమే కాక లోకజ్ఞానం కూడా కొదవ అయ్యాయి. కాన్వెంట్ స్కూల్, కాలేజీలో చదివినా అక్కడ కూడా మార్కుల వేట, రాంకుల పోటీలో మునిగి తేలాడు గాని, లోకజ్ఞానం అబ్బలేదు. ఒక మాటలో చెప్పాలంటే వివేక్, ఇంజనీర్ అయ్యేవరకూ, ఒక రోబోలా పెరిగాడు.

తనూజ ఈ రోజులలో ఉండే సగటు యువతి. మంచి తెలివయ్యింది. చదువుతో బాటు సంస్కారం, వినయ విధేయతలు కూడా నేర్పారు ఆమె తల్లిదండ్రులు. తనూజకి ఆధునిక భావాలూ ఉన్నా, ఎప్పుడూ ఏ విషయంలోనూ హద్దులు దాటలేదు.

పెళ్ళి రోజు ఒక పెద్ద హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు అయ్యింది. ఫస్ట్ నైట్ అక్కడే ఏర్పాటు చేసారు.

రిసెప్షన్‌కి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళేసరికి దాదాపు పన్నెండు అయ్యింది.

ఎన్నో తియ్యని ఊహలతో, తన భర్త వివేక్‌తో రూమ్లోకి అడుగు పెట్టింది తనూజ. వివేక్ తనూజని చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో వివేక్‌లో ఒక పెళ్ళి కొడుకుకు ఉండాల్సిన ఉత్సాహం కనపడలేదు తనూజకి. ‘బహుశా పెళ్ళి, ఆ తరువాత రిసెప్షన్ బడలిక వల్ల అలా ఉన్నాడేమో’ అనుకుంది. రూమ్ అత్యంత మనోహరంగా అలంకరించబడి ఉంది. మత్తెక్కించే సువాసనలు వెదజల్లుతూ, అంగుళం కూడా కాళీ లేకుండా, రూమ్ మొత్తం అలంకరించిన ఎన్నో జాతుల పూవులు, నోరూరించే రకరకాల స్వీట్లు, రెచ్చగొట్టే శిల్పాలు, పెయింటింగ్స్‌తో గది అలంకరింపబడి ఉంది. మూల కూచుని, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ముని కూడా, ఆ రూమ్ లోకి ప్రవేశిస్తే శృంగార ఆస్వాదనకి అర్రులు చాస్తాడు. కానీ వివేక్‌లో ఎటువంటి ఉత్సాహం కానీ, ఉద్వేగం కానీ లేవు. వివేక్ కొంచెం నిస్తేజంగా కనిపించేసరికి తనూజ తనే చొరవ తీసుకోవాలని నిర్ణయించింది.

వివేక్‌ని చెయ్యి పట్టుకుని నడిపించుకుని మంచం దగ్గరకు తీసుకెళ్ళింది. వివేక్ మంచం మీద కూర్చోగానే, తనూజ అతనిని తమకంగా అల్లుకుంది. వివేక్, తనూజ చర్యకి అడ్డు చెప్పలేదుగాని తనూజ ఊహించిన విధంగా స్పందించలేదు. తనూజ కంగుతింది. అయినా సంబాళించుకుంది.

“ఏమిటి వివేక్ అలా ఉన్నావు!? ఈ రోజు మన ఫస్ట్ నైట్. అంటే జీవితాంతం షేర్ చేసుకోవాల్సిన ఒక ముఖ్య అంశానికి స్వీట్ బిగినింగ్.” అంది తనూజ గోముగా, తన చేతి వేళ్ళను వివేక్ జుట్టులో కదుపుతూ.

“ఏమీ లేదే!? మామూలుగానే ఉన్నానే” అన్నాడు వివేక్.

“మామూలుగా ఉండకూడదనే నా ఆశ” అంది తనూజ, వివేక్ ఒడిలో కూర్చుని, అతనిని ఓరగా చూస్తూ. కానీ వివేక్ లో పెద్దగా రియాక్షన్ గాని, చలనం కానీ లేవు!!

తనూజకి కోపం, ఆశ్చర్యం కలిగాయి. వివేక్ ఏమి తెలియని చిన్న పిల్లాడు కాదే!? అయినా మగపిల్లలు, పుట్టిన వెంటనే లేడీ డాక్టర్ వైపు, నర్స్ వైపు అదోలా చూసే రోజులు ఇవి అని జోక్ చేస్తుంటారు. మరి వివేక్ బాగా చదువుకున్నాడు. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతని వింత ప్రవర్తనకి కారణం ఏమిటి!? తనూజకి ఏమీ పాలుపోలేదు!

వివేక్‌కి చిన్నతనం నుంచి పేరెంట్స్‌కి భౌతికంగా దగ్గరగా ఉన్నా, మానసికంగా దూరంగా ఉన్నాడని వింది. దాని ప్రభావం మనుషుల మీద వేరే రకంగా ఉంటుందని తెలుసు. నేర ప్రవర్తన, అభద్రతా భావం కలిగి ఉంటారని సైకాలజిస్ట్స్ అంటూ ఉంటారు. ‘కానీ.. కానీ.. ఆ విషయంలో కూడా తేడా ఉంటుందా!? అంటే తను జీవితం గురించి కన్న కలలన్నీ కల్లలేనా!? ఇక తన అందం అంతా అడవి కాచిన వెన్నెలేనా!? జన్మ అంతా ముద్దు ముచ్చట లేకుండా మోడులా గడపాల్సిందేనా?’ అనుకుంది తనూజ. ఒక్కసారిగా తనూజకి విపరీతమైన నీరసం అవహించేసింది.

తన అత్తకి, తల్లికి విషయం మరుసటి రోజు ఉదయమే చెప్పాలని నిర్ణయించుకుంది.

కాని ఆ సమయంలో తన చిన్నతనంలో చదువుకున్నఒక ఇంగ్లీష్ సామెత తనూజకి గుర్తుకు వచ్చింది.

“ఏ విషయంలోనైనా ప్రయత్నం చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలం అవడం మంచిది.”

ఆ క్షణమే తనూజకి వెయ్యి ఏనుగల బలం వచ్చినట్లయ్యింది.

‘నేను వివేక్‌లో మార్పు తీసుకు రాగలను. తీసుకు వస్తాను. నేను నారీశక్తికి ఉదాహరణగా నిలుస్తాను. అసలు భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తిని వాళ్ళిద్దరి మధ్య అడుగు పెట్టనివ్వకూడదు. అప్పుడే ఆ సమస్య చక్కగా దూదిపింజలా విడిపోతుంది. ఈ విషయం వేరే ఎవ్వరికీ చెప్పకూడదు. వివేక్‌తో తప్ప వేరే ఎవ్వరితో నాకేమిటి సంబంధం?’ అనుకుంది తనూజ.

***

వివేక్, తనూజ వాళ్ళ ఫ్లాట్‌లో కాపురం పెట్టారు. ఆ రోజు డ్యూటీ నుంచి ఇద్దరూ ఆలస్యంగా ఇంటికి వచ్చారు. వివేక్ బెడ్ రూమ్‌లో కుర్చీలో కూర్చుని సెల్ చూసుకుంటున్నాడు. తనూజకి ఒక కొంటె ఐడియా వచ్చింది. తను వేసుకున్న బట్టలు, లుంగగా చుట్టి, వివేక్ మొహాన్న కొట్టి, అతను చూస్తుండగా వాష్‌రూమ్ లోకి పరిగెత్తింది. వివేక్‌లో మొదటసారిగా చలనం వచ్చింది. అతను కొన్ని క్షణాలసేపు వాష్‌రూమ్ వైపు, తన మొహాన్న కొట్టిన బట్టల వైపు చూడసాగాడు. అతను ఏదో ఆలోచనలో పడ్డాడు.. అదంతా తనూజ వాష్‌రూమ్ కీ హోల్ లోంచి చూస్తూనే ఉంది!!

తనూజ ఏమీ ఎరగనట్టు స్నానం చేసేసి, వాష్‌రూమ్ లోంచి బయటకి వచ్చి, వివేక్ ముందే దుస్తులు మార్చుకుంది. వివేక్ తల దించుకుని ఏదో ఆలోచిస్తూ కూచున్నాడు. తనూజ నవ్వుకుంది. ఆ తరువాత వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది తనూజ.

***

నాలుగు రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం, వివేక్ హాలులో కూచుని, లాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. తనూజ వాష్‌రూమ్ లోంచి గట్టిగా అరిచింది.

“వివేక్. నేను టవల్ తీసుకోవడం మరిచిపోయాను. కొంచెం తెచ్చివ్వు.”

“టవల్ బెడ్ రూమ్ లోనే ఉంటుంది కదా. తీసుకో” అన్నాడు వివేక్ తను కూడా గట్టిగా.

“మహానుభావా, ఆ మాత్రం నాకు తెలియక కాదు. నేను టవల్ ఉదయం బాల్కనీలో ఆరేసాను. కొంచెం తెచ్చి పెట్టు ప్లీజ్” అంది తనూజ బతిమాలుతున్న ధోరణిలో.

వివేక్ టవల్ అందిస్తుంటే, వాష్‌రూమ్ డోర్ సగం తెరిచి, టవల్ అందుకుంది తనూజ. అప్పుడు తెల్లగా, పాల రాయిలా, మెరిసిపోతున్న తనూజ దేహంలో కొంత భాగం కనిపించింది వివేక్‌కి. టవల్ అందించి అలాగే చూస్తూ ఉండిపోయాడు వివేక్.

“బాబూ నువ్వు కాస్త వెళితే, నేను తలుపు వేసుకుని, ఒళ్ళు తుడుచుకుని బయటకు వస్తాను” అంది తనూజ కిలకిలా నవ్వుతూ. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వివేక్ వాష్‌రూమ్ డోర్ సందులో పెట్టిన చెయ్య తీసేసాడు.

ఆ రోజు బెడ్ రూమ్‌లో “వివేక్ బాగా చలిగా ఉంది ఏ.సీ. తగ్గించు” అంటూ వివేక్‌ని గట్టిగా కౌగలించుకు పడుకుంది తనూజ. వివేక్ పెళ్ళి అయ్యాక మొదటిసారిగా తనూజ స్పర్సని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అంతకు ముందు ఎన్నోసార్లు, తనూజ తన బిగి కౌగిలిలో, వివేక్‌ని బంధించినా, అతనిలో ఏమీ చలనం ఉండేది కాదు. అయితే అభ్యంతరపెట్టేవాడు కాదు. కానీ ఇప్పుడు తను కూడా తనూజ నడుం మీద చేతులు వేసాడు.

***

ఆ రోజు తనూజ పుట్టిన రోజు. వివేక్, తనూజ శలవు పెట్టారు. ఉదయాన్నే భార్యాభర్తలు గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నారు. తరువాత హోటల్‌కి వెళ్ళి లంచ్ చేసారు. మాటనీ సినిమా చూసారు. తరువాత పార్క్‌లో కొంత సేపు గడిపి ఇంటికి చేరుకున్నారు.

వివేక్‌లో కొత్త ఉత్సాహం చూసింది తనూజ. అతని మాటలలో, చేతలలో గొప్ప మార్పుని గమనించింది తనూజ. పైకి ఏమీ అనకపోయినా లోలోపల మురిసిపోయింది.

“వివేక్ స్నానం చేసి వస్తాను. నువ్వు కూడా రెడీగా ఉండు”

“పోనీ ఇద్దరం కలిసి చేద్దామా.. టైం కలిసి వస్తుందిగా” అన్నాడు వివేక్ ఉత్సాహంగా, కొంటెగా.

వివేక్ మాటలకి తనూజ మొహం వెయ్యి వాట్ల ఎల్.ఈ.డీ. బల్బ్ లా వెలిగిపోయింది. కానీ అదేమీ బయటకు కనపడనీయకుండా “ఆశ, దోస, అప్పడం, వడ.” అంటూ వాష్‌రూమ్ లోకి దూరి తలుపు వేసుకుంది తనూజ.

పది నిమషాల తరువాత టవల్ చుట్టుకు బయటకు వచ్చిన తనూజ, “వివేక్ నాకు ఈ నైటీ బాగుంటుందా?” అంటూ ఒక నైటీని చూపించింది వివేక్‌కి. వివేక్ ఏమీ మాట్లాడలేదు.

“పోనీ ఇది బాగుందా?” అంటూ ఇంకో నైటీని చూపించింది.

“అయితే ఇది వేసుకోనా” అంటూ ఇంకోదాన్ని చూపించింది. ఆ నైటీలు చూపించే సమయంలో తన టవల్ జారిపోవడం గమనించినా తనూజ పట్టించుకోలేదు. అసలు కావాలనే టవల్‌ని విప్పేసింది!!? తనూజను అలా చూసిన వివేక్ ఒక్కసారిగా తమకంగా భార్యని కౌగలించుకున్నాడు.

వివేక్‌కి బాల్యంలో పేరెంట్స్ మానసికంగా దూరమవ్వడం వలన, కేవలం చదువు యంత్రంలా తయారవ్వడం వలన, అతనికి జీవితంలో మధురిమలు తెలియలేదు. అలాగే ఆరోగ్యకరమైన శృంగారం గురించి కూడా సరి అయిన అవగాహన లేదు. తనూజ క్రమంగా అతనికి దాంపత్యకళ చక్కగా నేర్పింది. వనితలు తలుచుకుంటే ఏదైనా నేర్చుకోవడమే గాదు, నేర్పగలరు కూడా అని నిరూపించింది తనూజ.

శోభనం రోజు శృంగారం పట్టుతేనెలా తీయగా ఉంటే, కొంతకాలం అయిన తరువాత భార్యాభర్తల సరస సల్లాపాలు, శృంగార రసం, వగరు తేనెలా, ఇంకా రుచిగా ఉంటాయి. వివేక్, తనూజ ప్రస్తుతం వగరు తేనె చవి చూస్తున్నారు.

‘తెలి మంచు కురిసింది తలుపు తీయనా ప్రభూ’ అన్న పాట దగ్గరలో ఎక్కడో వినిపిస్తోంది.

“తలుపు తీయనా ప్రభూ!!?? వలపు తలుపు తీయనా ప్రభూ!!??” అంటూ కూనిరాగం అందుకుంటూ వివేక్‌ని చుట్టేసింది తనూజ. వివేక్, తనూజని బిగి కౌగిలిలో బంధించేసాడు. అక్కడ సరస మేఘాలు ముసిరి, వలపు వర్షం కురిసింది.

Exit mobile version