Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెల్ల కాగితం

[వి. భాగ్యలక్ష్మి గారు రచించిన ‘తెల్ల కాగితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఏదో తెలియని ప్రశాంతత నాతో నేను ఉంటే..
ఒక్కరమే ఉంటే ఒంటరితనం కాదు
అది ఏకాంతం కూడా..
నాతో నేను కోరుకునే ఏకాంతం..
అన్నీ భావనలు అందరితో పంచుకోలేం..
కొన్ని మనలో మనమే మోయాలి..
నాకు నా ఏకాంతానికి నడుమ ఓ తెల్ల కాగితం..
అవి రాయాలి అనుకుంటే పెన్ను కదలకపోవచ్చు..
కానీ పంచుకోవాలి అనుకుంటే పుస్తకాలూ సరిపోకపోవచ్చు..
పంచుకునే ఓపిక నాకు ఉన్నా
వినే ఓపిక ఈ కాగితానికి ఉండాలిగా..
ఏంటో త్వరగా నిండిపోయింది..
కానీ పేజీ తిప్పడం లో నేను అలసిపోను..
మనుషుల మనసులు కదిలించే మాటలు రాయాలంటే..
ముందు అవి నా మనసును కదిలించనవై ఉండాలి..
ఆ మాటలు పంచుకోడానికి ఎంచుకున్న నేస్తమే ఈ తెల్ల కాగితం
నా అనుభవాలు కొన్ని తప్పులు అయ్యుండచ్చు..
కొన్ని పిచ్చి గీతలు అయ్యుండొచ్చు..
మరికొన్ని కొట్టివేతలు కూడా ఉండొచ్చు..
కాని అన్నీ విని, ఈసారి అయిన సరిగా రాయి
అని ఇంకా నాకు చోటు ఇచ్చిన నా నేస్తం ఈ తెల్ల కాగితం..
కొట్టివేతలు రాసిన మాటల్లో అయినా..
జీవితం లోని అనుభవాల్లో అయినా
చెరగని ముద్ర వేస్తాయి..
కానీ గతం లోని కొట్టివేతలు వదిలి,
రాబోయే అందమనై అనుభవాలతో
మిగిలిన జీవిత పుస్తకాన్ని నింపమని
ఇంకా నాకు చోటు ఇచ్చిన నా నేస్తం
ఈ తెల్ల కాగితం..

Exit mobile version