Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెల్ల ముఖం – నల్ల సంస్కారం

[శ్రీమతి అక్షర రాసిన ‘తెల్ల ముఖం – నల్ల సంస్కారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

అవి రైలు బండిలో ఫాస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, ఏ.సి., కాదు కదా, దగ్గర దూరాలకు జనరల్ బోగీలో ప్రయాణం చేసుకు పోయే రోజులు.

నేనూ మా ఆవిడ సుమతి గుంటూరు నుంచి తిరుపతికి ప్రయాణం అయ్యాము. ఎంతో దూరం కానందున మేమిద్దరం రెండు మూడేళ్ళకి ఒకసారయినా తిరుపతికి వెళ్ళి వచ్చేవారం. ఆ ధైర్యం తోనే బయల్దేరాము ఆ రోజు కూడా. బండిలో అనుకోని రద్దీ చూసి గ్రహించాము ఏకాదశి వల్లనేమో అని.

చేసేది లేక, కాసేపటికి రద్దీలో సర్దుకుని కూర్చోటానికి చోటు దొరక్క పోతుందా అన్న మొండి ధైర్యంతో సుమతిని ముందు ఎక్కించి నేను కూడా బోగీ లోకి దూరాను. మెల్ల మెల్లగా ముందుకు వెళ్తూ రెండు పక్కలకి చూస్తూ కనీసం సుమతికి చోటు దొరక్కపోతుందా అన్న ఆశతో.

ఆడవారన్న గౌరవంతోనో సానుభూతి తోనో అనుకోండి, ఎలాగో సుమతికి చోటు చిక్కి కూర్చుంది. ‘అమ్మయ్య’ అనుకుని ఇక నా కోసం అని చూశాను. నేను ఆనుకున్న బెర్త్ ఇటు చివర ఒక పెద్ద మనిషి ఇద్దరికీ సరిపడే చోటులో ఒక్కరే పక్కన సంచీ కూడా పెట్టుకుని ఆక్రమించి కూర్చొన్నాడు. అటూ ఇటూ చూస్తే ఎవరు పక్కకి జరగమంటారో అన్నట్లు పేపర్ లోకి మొహం దూర్చి కూర్చొన్నాడు. ఒక అరగంట ఎలాగో నిల్చున్నాను. ఆ తరువాత నా తరం కాలేదు. సుమతి నా వేపు చూస్తూ కళ్ల తోనే సానుభూతి పలుకుతోంది. బోగీలో మిగతా నిలుచున్నవారు కూడా ఎక్కడో అక్కడ సర్దుకున్నారు. వాతావరణం అంత వేడిగా లేకపోయినా నిలుచున్న అలసట వల్ల, ఈ పెద్ద మనిషి మీద కోపం వల్ల కొంత నేను చెమటలు కారుతున్నాను. ఇక నేను నిగ్రహించుకోలేక పక్క ఆయన భుజం పై చేయి వేసి, కొద్దిగా పక్కకు జరిగి చోటు ఇవ్వమని అర్థించాను. కాసేపు ఆయన తనని కాదననట్టు పట్టించుకోలేదు. నా ఓరిమి ఇక జవాబు చెపుతోంది. ఈసారి కొంచెం కరకుగానే అడిగాను కొద్దిగా జరిగి నన్ను కూర్చొనివ్వమని.

“ఏమయ్యా అప్పటి నుంచి జోరీగల్లా నా చెవిదగ్గర చెరీ చోటు ఇవ్వమని ఒకటే గొడవ! చోటు ఉంటే ఇవ్వనా?” దబాయిస్తూ అడిగాడు.

“చోటు లేదా? మీ పక్కన సీటు మీద పెట్టుకున్న బ్యాగు కింద పెట్టుకుంటే ఇంకో మనిషికి చోటు వస్తుంది.” అంటూ ఆయన్ని తోసి కూర్చోటానికి ప్రయత్నించా. దానితో మా ఇద్దరి మధ్య రభస పెరిగి పెద్దదయింది.

“ఏమిటయ్యా అఘాయిత్యం?”

“ఓహో నాది అఘాయిత్యమా? ఇంతవరకు మీరు చేసింది ఏమిటటా?”

“ఛ ఛ! అలగా జనంతో ప్రయాణం చెయ్యాలంటే ఇదే చికాకు. ఏం చేస్తాం మా వాడిని టికెట్ కొనమంటే ఇలా జనరల్ బోగీలో తగలేశాడు.” అంటూ విసుక్కుంటుంటే నాకు తిక్క రేగి “ఎవరయ్య అలగా జనం? మావాడు కూడా తెలీక అలగా జనం మధ్య నన్ను తగలేశాడు” అంటూ ఎక్కడో ఉన్న నా కొడుకుని విసుక్కున్నా.

“బొత్తిగా మంచీ మార్యాద లేకుండా పోతోంది జనాలకి..” ఇలా ఒకటేమిటి దారంతా సన్నుకుంటూనే ఉన్నాడు.

నేను దురుసుగా జవాబు చెప్పటానికి నోరు తెరిచేసరికి ‘ఇక చాలు గొడవ పెంచుకోవద్ద’న్నట్టు కళ్ల తోనే అభ్యర్థించింది సుమతి. అంతటితో తగ్గి పక్కకి చూసేసరికి తోటి ప్రయాణికులు మా మధ్య గోడవంతా వినోదంగా చూడటం గమనించి, ఆయన ఏం వాక్కున్నా వాక్కున్నాడులే అన్నట్టు కళ్ళు చెవులూ మూసుకుని కూర్చున్నా. రేణిగుంటలో బండి ఆగింది. కిందకి దిగి కాఫీ చుక్క తాగి రావాలనిపించింది. కానీ ఇంకేమైనా ఉందా? ‘ఇంత కష్టపడి సంపాదించుకున్న సీటు మళ్ళీ దొరుకుతుందా’ అని మనసులోనే ఆ ఏడుకొండలవాడిని త్వరగా తిరుమలకి చేర్చమని ప్రార్థిస్తూ కూర్చొన్నా.

పూర్వం ఎన్ని సార్లో తిరుపతి వచ్చి వెళ్లాము. ఎన్నడూ ఇటువంటి పాడు అనుభవం కలుగలేదు. ఈరోజు ఎవరి ముఖం చూసి లేచానో కానీ ఇటువంటి చెత్త మనుషులతో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చింది. నా మొర ఆలకించినట్టు తిరుమల ప్లాట్‌ఫామ్‌పై ఆగింది మా బండి.

ఒక్క క్షణం కూడా ఆ మనిషిని సహించలేను అని ప్రకటిస్తునట్లు దిగ్గున లేచి వెళ్ళి కిందకి దిగి మా బ్యాగుని, సుమతిని కిందకి దించాను. కొంచెం స్తిమిత పడి, హోటల్ కి వెళ్ళి ఆకలి దప్పిక చికాకు వదిలించుకుందామనేంతలో “సుమతీ.. నువ్వేనా ఎన్నాళకి ఎన్నాళకి.. ఎక్కడనుంచే?” అన్న పలకరింపు విని అటు చూసేసరికీ లేడీస్ బోగీ నుంచి చేతి సంచి పట్టుకుని రొప్పుకుంటూ మా దగ్గరకు వస్తున్న ఆవిడను చూసి గుర్తు పట్టి మా సుమతి కూడా “ఏమండీ ఎప్పుడూ మా చిన్ననాటి స్నిహితురాలి గురించి చెపుతూ ఉంటాను కమల అనీ, తినే” అంటూ నాకు పరిచయం చేసింది మొహం చేటంత చేసుకుని. ఒకరికి ఒకరు నమస్కారం చెప్పుకున్నాక “నువ్వేమిటీ ఒక్కర్తివీ ఎక్కడ నుంచి వస్తున్నావు?” అని వాకబు చేసింది తన చిన్ననాటి నేస్తాన్ని.

“ఒక్కర్తిని ఏం ఖర్మే? ఇదిగో చెట్టు అంత మొగుడుండగా” అంటూ చూపించిన వ్యక్తిని చూసి తెల్ల మొహం వేశాము నేనూ సుమతీ.

“ఈరోజు ఎక్కువ రద్దీగా ఉంటం వల్ల మా వారు నన్ను లేడీస్ బోగీలో దూర్చి తాను ఈ పక్క దాంట్లోకి ఎక్కారు” అని మాతో చెప్పి, “ఏమండీ.. ఇదిగో మిమ్మల్నే. తిను నా చిన్న నాటి నేస్తం. ఒకటో క్లాసు నుంచి ఒక దగ్గరే కలిసి చదువుకున్నాము, మా పెళ్ళిళ్ళు అయ్యేదాకా. ఆ తరవాత ఒకరి ఆచూకీ ఒకరికి తెలీక విడిపోయి ఇన్నేళ్ళకి ఇలా కలిసాము. అంతా ఆ ఏడుకొండలవాడి దయ..” ఏదేదో చెప్పుకుపోతున్నారు ఆ కమలగారు వాళ్ళాయనతో.

జరిగిన దాంట్లో మా తప్పు ఏం లేకపోయినా మా మొహాలు ఎక్కడ దాచుకోవాలో తెలీక నేను సుమతి అవస్థ పడుతున్నాము.

ఆ కమలగారు మాత్రం చాలా ఉత్సాహంగా “ఏమే సుమతి మనం ఎంచక్కా ఒక దగ్గరే కాటేజ్ తీసుకుని ఉందామా? బోలెడన్ని కబుర్లు చెప్పుకోవాలి మరి. అప్రయత్నంగానే అందరం తిరుమల స్టేషన్ వెలుపలికి దారి తీశాము. కమలగారి భర్త వేపు చూడటానికి కూడా మనస్కరించక నేను కావాలని మెల్లగా అడుగులు వేస్తున్నాను. పరిస్థితి ఎదురు తిరిగే సరికి తన చిన్నప్పటి నేస్తాన్ని చూసిన ఉత్సాహం చప్పగా చల్లారి పోయి సుమతికి ఎలా స్పందించాలో తెలీక ఇబ్బంది పడిపోతున్నది. ఆ దైవ దర్శనానికి ముందు ఈ బెడద నుంచి తప్పించమని ఆ ఏడుకొండల వాడిని ప్రార్థించడం తప్ప చేసేదేం లేకపోయింది మాకు. ‘తండ్రీ మా తప్పు ఏదీ లేకుండానే ఇంత ఇబ్బందికరమైన స్థితిలో ఇరికించావు, ఇందులో నుంచి పైకి లాగమ’ని దణ్ణం పెట్టుకుంటూ కాటేజ్ కోసమని నడుస్తున్నాము. ఒక దగ్గర వద్దని మేము అనుకున్నా, కమలగారి ప్రోద్బలం వల్ల పక్క పక్కనే కాటేజెస్ దొరికాయి. ఇక ఈసారి యాత్ర అంతా ఇలా ఇబ్బంది పడకతప్పదని, ఎలాయితే అలా అవుతుందని రాజీకి వచ్చేశాము నేను సుమతి.

ఈ ఆలోచనలకి స్వస్తి చెప్పి దైవ దర్శనంపై మనసు లగ్నపరిచి, దానికి తయారవుతున్నాము. బయటకు వెళ్ళి వేడి నీళ్ళు తెచ్చుకొని స్నానానికి తయారవుతుండగా తలుపు చప్పుడు అయితే ఎవరై ఉంటారా అని తలుపు తెరిస్తే ఎదురుగా కమలగారిని తన భర్తతో పాటూ చూసి ఖంగుతిన్నాను. నా ముఖంలో కంగారు గమనించి, “ఏం లేదండీ, బండిలో మీ మధ్య జరిగిన ఘర్షణకి క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాము. లోపలికి రమ్మంటారా” అని అడుగుతుంటే ఉలిక్కిపడి పక్కకి తొలగి వారికి చోటు ఇచ్చాను.

లోపలికి వస్తూనే కమల గారు సుమతి రెండు చేతులూ పట్టుకుని “మా వారిని పరిచయం చేసిన వెంటనే మీ ముఖాలలో వచ్చిన మార్పు చూసి మీ మధ్య ఏదో జరిగిందని ఊహించాను. మావారి మనస్తత్వం తెలిసిన దాన్ని కావటాన, కాటేజ్ చేరుకున్నాక నొక్కి నొక్కి అడిగితే, బండిలో జరిగింది చెప్పారు. నన్ను చూడంగానే నీలో కనిపించిన ఉత్సాహం, మావారిని చూసి చప్పగా మారిపోయిన మీ ప్రవర్తన చూసి మీరు ఎంత బాధపడి ఉంటారో గ్రహించాను. అందుకే క్షమాపణ చెప్పుకోవటానికి మావారి అహం అడ్డు వస్తున్నా ఆయన్ని లాక్కువచ్చాను. ఏమండీ కనీసం ఒకసారి ‘సారీ’ చెప్పండి” అంటూ వాళ్ళాయనని గొడవ పెడితే తప్పనిసరి అయి ఒక ‘సారీ’ అన్న పదం మా మొహాన్న పడేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.

పాపం కన్నీళ పర్యంతం అయిన ఆవిడ, సుమతితో “ఏమిటోనే మావారి కారణంగా ఎంతో సరదాగా గడపవలసిన ఈ యాత్ర ఇలా ఇబ్బందికరంగా చేయవలసి వస్తోంది.” అంటూ బాధపడిపోతుంటే సుమతి “చ.. ఛ. ఈ మాత్రానికే కన్నీళ్ళు పెట్టుకున్నావేమిటే? అయినా ‘సారీ’ చెప్పారుగా, ఇక బాధపడకు” అంటూ ఓదార్చింది తన చిన్నపటి నేస్తాన్ని.

అమ్మయ్య! పరిస్థితి కొంతైనా మెరుగుపడింది, కనీసం చిన్నప్పటి నేస్తాలయినా మనసు విప్పి మాట్లాడుకోగలరు కదా అని తృప్తిపడ్డాను. ‘పాపం ఆ కమలగారు ఇన్నేళ్ళ నుంచి ఎలా వేగుతున్నారో ఇంతటి అహంభావితో!!’ అనుకుంటూ దేముడిని స్మరించి. స్నానానికని లోపలికి వెళ్ళాను.

Exit mobile version