Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘తెలుగింటి అత్తగారు’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక

[‘తెలుగింటి అత్తగారు’ పుస్తకావిష్కరణ సభ నివేదికని అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

5 నవంబరు 2023వ తేదీ ఆదివారం, చెన్నైలోని టి.నగర్, విజయ రాఘవ రోడ్, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియన్ భవనంలో, గోదావరి హాలులో, సహజనటి, శ్రీమతి సూర్యకాంతం గారి శతజయంతి ఉత్సవ సభ, కన్నుల పండువగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆ లెజెండరీ నటీమణి గురించి వ్రాసిన వ్యాసాలతో ‘తెలుగింటి అత్తగారు’ అన్న ఒక వ్యాస సంకలనం ఆ రోజు ఆవిష్కరించబడింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి, శ్రీ వెంకయ్యనాయుడు గారు, సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆ 504 పేజీల ఉద్గ్రంధాన్ని ఆవిష్కరించారు.

శ్రీమతి సూర్యకాంతం గారి కుమారులు శ్రీ డా॥ అనంతపద్మనాభమూర్తి, వారి శ్రీమతి ఈశ్వరీరాణి గారల ఆత్మీయ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.

గౌరవ అతిథులు శ్రీమతి ఎస్. మాల గారు (మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి, మహాకవి శ్రీశీ గారి కుమార్తె) హాజరైనారు. తొలి ప్రతిని, విజయా ప్రొడక్షన్స్ శ్రీ బి. విశ్వనాథరెడ్డి, కలైమామణి శ్రీమతి రాజశ్రీ, కళాజ్యోతి శ్రీమతి జయచిత్ర, కళాప్రభ, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శ్రీమతి ప్రతిభా రమేష్, ఆస్కా అధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి, ప్రముఖ చలన చిత్ర నిర్మాత శ్రీ కాట్రగడ్డ ప్రసాద్, సినీ రచయిత శ్రీ భువనచంద్ర మొదలగువారు స్వీకరించారు. డా॥ తుమ్మపూడి కల్పన సభను నిర్వహించారు.

వ్యాస సంకలనం ‘తెలుగింటి అత్తగారు’కు సంపాదకులుగా ఆమె కుమారులు @డా అనంతపద్మనాభమూర్తి గారు వ్యవహరించారు. పర్యవేక్షణలు ప్రాచార్య ఎల్. బి. శంకరరావు గారు. ఈ పుస్తకాన్ని డా॥ సూర్యకాంతం సినీ ఆర్టిస్ట్స్ ట్రస్ట్, చెన్నై వారు ప్రచురించారు.

వ్యాస రచయితలలో శ్రీ గరిగపాటి, శ్రీ చాగంటి, శ్రీ సామవేదం గార్ల వంటి ఆధ్యాత్మికవేత్తలు, డా. ఎల్. వి. సుబ్బహ్మణ్యం గారి వంటి ప్రభుత్వాధికారులు, శ్రీ ఎల్.బి. శ్రీరామ్, భువనచంద్ర, శ్రీమతి షావుకారు జానకి, శ్రీ సింగీతం, శ్రీ రావి కొండలరావు, శ్రీమతి ‘ఊర్వశి’ శారద, కళాభినేత్రి వాణిశ్రీ, శ్రీ కోట శ్రీనివాసరావు, శ్రీ ఆలీ, శ్రీ తనికెళ్ళ భరణి వంటి సినీ ప్రముఖులు, శ్రీ బి.కె. ఈశ్వర్, శ్రీ చంద్ర ప్రతాప్, శ్రీ వోలేటి లాంటి పాత్రికేయులు, డా. కె.వి. కృష్ణకుమారి, శ్రీమతి శోభారాజు, డా॥ బెల్లంకొండ, శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి,  శ్రీ గుడిమెట్ల చెన్నయ్య లాంటి సాహితీ ప్రముఖులున్నారు. భవదీయుడు, సంచిక రచయిత పాణ్యం దత్తశర్మ సరేసరి!

మొత్తం 108 వ్యాసాలు, 11 పద్య, గేయ సుమాలు ఈ సంకలనాన్ని సుసంపన్నం చేశాయి. అక్కడక్కడ శ్రీమతి సూర్యకాంతం గారి అందమైన ఫోటోలున్నాయి. ఆమెకు నివాళిగా నేను రచించిన పద్య కుసుమత్రయమును కాపీలు తీయించి, వేదిక మీది ప్రముఖులకు, సభికులకు అందజేశాను. పుస్తకం 374 375, 376 పీజీలలో నా వ్యాసం ‘సహజ నటనాయస్కాంతం, శ్రీమతి సూర్యకాంతం’ చోటు చేసుకొందని సవినయంగా తెలియచేస్తున్నాను.

శ్రీ వెంకయ్యనాయుడు గారు తమ ప్రసంగంలో, ఎక్కువగా, తెలుగు భాష, సంస్కృతులు క్షీణించడం పట్ల, దిగజారుతున్న రాజకీయాల పట్ల, తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సూర్యకాంతం గారి నటనా ప్రతిభను కొనియాడారు. ‘నాటు నాటు’ పాటకు అస్కార్ రావడం ‘గొప్ప’ విషయమన్నారు. ఆ పాటకు యువనటులు అద్భుతంగా నృత్యం చేశారన్నారు. దాని ‘సాహిత్యం’ విశిష్టతను చెప్పారు! అట్లే, ఎర్రచంచదనం స్మగ్లర్ పాత్రకు జాతీయ ఉత్తమ నటునిగా పురస్కారం అందుకొన్న తెలుగు మహానటుని గురించి చెప్పి ఉంటే బాగుండేది. సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం; అది సమాజానికి చక్కని సందేశం ఇవ్వాలని నొక్కిచెప్పారు!

ఒకాయన అంత్యప్రాసల కోసం అంత్యప్రాసలు విరివిగా వాడుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. అతి సర్వత్ర వర్జయేత్! పెద్దలందరూ వెళ్లిపోయింతర్వాత, సంకలనం లోని ప్రముఖులు కాని వ్యాస రచయితలకు, వారిని వేదిక మీదికి పిలిచి, పుస్తకాన్ని బహూకరించడం ఒక ప్రహసనంగా మారింది. ‘ప్రముఖ’ రచయితలెవరూ అంతంత వ్యాసాలు రాశారు గాని, సభకు రాలేదు. ఒక దశలో ప్రముఖేతర రచయితలు పుస్తకం స్వీకరించడం కోసం తోసుకోవలసి వచ్చింది. చివర, సూర్యకాంతమ్మ గారి విందు భోజనం ఉందని ప్రకటించారు గాని, ‘బఫె’లో డిన్నర్, బహు తొక్కిడిగా జరిగింది. చాలామంది తినకుండా వెళ్లారు, ఆ ఆత్మీయత భరించలేక!

ఇదంతా అలా ఉచితే, ‘అరుంగళై మామణి’ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ గ్రహీత సూర్యకాంతం గారు ‘నభూతో న భవిష్యతి, నవర్తమానేచ!’. ఆమె వ్యక్తిత్వం, నటనాకౌశలం అనన్య సాధ్యం.

పుస్తకం కోసం, డా॥ అనంతపద్మనాభమూర్తి మొబైల్ నెంబర్: +91-92821 13599 ని సంప్రదించవచ్చు. వెల రూ 750/-

Exit mobile version