[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘తెలుగు భాష ఘనత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దివి నుండి భువికి తరలివచ్చిన
అందాల రాశి అమ్మభాష
జనని సంస్కృతంబు భాషలకన్న
తల్లి ఒడిన ఒదిగిన
చిన్నారి మొలక తెలుగు
కవుల చేతి ఒడుపున
అందాలు చిందిన చక్కని భాష
నన్నయ్య ఘంటాన పురుడు పోసుకుని
తిక్కన్న రచనలో నటనలు నేర్చిన జాణ
ఎర్రన కలములో శంఖనాదంచేసి
శ్రీనాధ కవి సార్వభౌముని
సీస పద్యాల శృగారమును పండించి
పోతన్న రచనలో భక్తి భావమొలికించి
ప్రబంధకవుల అష్టాదశవర్ణనల
ప్రౌఢతనాన సాటి లేదనిపించి
ప్రాచీన కావ్యాల పట్టం గట్టించుకుని
రాజాశ్రయాల రాణివైనావు
రాగరంజితమైన అలంకారాలతో
ఆధునికయుగ కవుల మనస్సుదోచావు
పలువిధ కవితా ప్రక్రియలతో
పండితపామరులనలరింప చేసి
సహృదయహృదయాల నధిష్టించావు
అజంతములతో అందాలొలుకుచూ
‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ గా పేర్గాంచి
‘సుందరం తెలుంగ’ని తమిళకవుల
ప్రశంసలనందుకున్న భాష
అంతులేని అందాలను నింపుకుని
భాషాసౌందర్యాన్ని మాధుర్యాన్ని
మరుగున పడనీయకుండా
తరతరాలవారికి తెలుగుభాష
ఘనతను చాటుదాం
తెలుగుకవుల కీర్తిని
కలకాలం నిలుపుకుందాం.
