[శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట రచించిన ‘తెలుగు నేల తెలుగు మరువనేల’ అనే గేయం పాఠకులకు అందిస్తున్నాము.]
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
నీ కన్న తల్లి పిలుస్తుంది
కదులు సోదరా
నువ్వు కదులు సోదరీ..//2//
నీ కన్న తల్లి కన్న మిన్న
ఏమి లేదురా,.. ఏమి లేదు సోదరీ
నీ మాతృభాష
మరణం అంచునున్నది ఓ చెల్లి
గుండె పగిలి తల్లడిల్లె
మన తెలుగు తల్లి,..//2//
వందేమాతరం
తెలుగే మనకున్న బలం
వందేమాతరం
తెలుగే మన మూలధనం
//వందేమాతరం//
//నీ కన్న తల్లి//
మన తల్లిపాలు
మనము తాగి పెరగలేదా
మన మిన్నీినాళ్ళు తెలుగు
చదివి ఎదగలేదా
మరి, పాలడబ్బ పాలతో
మనకెందుకు ఓనమాలు
పరాయి భాష మోజులో
మనకెందుకు మురిపాలు
తల్లి భాష అనాథైతే
తనయులుండి ఎందుకనీ
సొంత భాష చేదనే
చేవ చచ్చి బ్రతకనీ
పేగు బంధము మరిచిన
జాతి ఏది నిలవదనీ
అడుగుతుంది
నిన్ను నన్ను మన అందరి తల్లీ
వందేమాతరం
తెలుగే మన జీవజలం
వందేమాతరం
తెలుగే మన ఆత్మఫలం
//వందేమాతరం//
//నీ కన్నతల్లి//
మన తరతరాల చరితకు
నిప్పు మనమే పెడదమా
మన యుగయుగాల స్మృతులకు
ముప్పు మనమే తెద్దమా
మరి, లక్ష లేండ్ల సంస్కృతిని
మనమే బొంద పెడదమా
మన అక్షరాలకు శిక్ష లేసి
శిలువ మనమే వేద్దమా
మన ఇంటి జాడ నీడను ఎవడు
ఎట్ల మార్చెననీ మన యువత
భవిత భరోసా
ఎవడు నేల కూల్చెననీ
తెలుగు వెలుగు జిలుగుకు
తెగులు ఎట్ల పుడుతదనీ కదలమంది నిన్ను నన్ను
మన తెలుగు నేల తల్లి
//వందేమాతరం//
//నీ కన్న తల్లి//
మన జగతి ప్రగతి పథములో
సకల జనుల చేర్చుదాం
మన చెలిమి బలిమి పలుకులలో
పలుకుబడులు పలుకుదాం
మన బతుకు
బండి రథమును అమ్మనుడిగా నడుపుదాం
ఆటపాట ఊటలతో తెలుగు సేవకులవ్వుదాం
చేయి చేయి ఒక్కటైతే వెళ్ళిపోయే ఆంగ్ల దశ
నువ్వు నేను ఏకమైతే తెల్లబోదా తెల్లబాష
ఈ నిజము మరచి నిదురపోము
తెలుగు తనము మరువబోము
తెలుగోడి వాడి వేడి
గాడి తప్పనియ్యబోము
వందేమాతరం
తెలుగే మా నవతరం వందేమాతరం
తెలుగే మా యువతరం
//నీ కన్నతల్లి//
అక్షరం ప్రభాకర్‌గా ప్రసిద్ధులైన వీరి అసలు పేరు నాగెల్లి ప్రభాకర్. లక్ష్మమ్మ, హనుమంతులు తల్లిదండ్రులు. ఒకప్పటి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా (మరియు మండలం) లోని అమనగల్ గ్రామంలో 6 జూలై 1976 నాడు జన్మించారు. వృత్తి: తెలుగు భాషోపాధ్యాయులు. వీరి ప్రవృత్తి: పుస్తక పఠనం, ప్రకృతి పర్యావరణం పరిరక్షణ సామాజిక గేయాలు, బాలల గేయాలు రచన. ప్రభాకర్ గారి జీవిత భాగస్వామి పేరు రోజా బాయి. కుమారులు త్రిలోక్, త్రివర్ణ్.
ప్రభాకర్ గారి ప్రచురించిన రచనలు:
1. ఆ పది జిల్లాలు ఆపద జిల్లాలు (దీర్ఘ కవిత సంపుటి), 2. కన్నీళ్ల పంటలు (దీర్ఘ కవిత సంపుటి), 3. అక్షరం సాక్షిగా.. (కవితా సంపుటి) 4. అక్షరాభ్యాసం (తెలుగువాచకం) 5. అక్షరామృతం (గేయరూప కవిత్వం, తెలుగు హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలలో ప్రచురితం), 6.అక్షరామృత్ (గేయ రూప కవిత్వం, హిందీ), 7. అక్షరామృతం (సాంగ్ ఫార్మేట్ పోయెమ్స్, ఇంగ్లీష్), 8. అక్షర తపస్వి, 9. అక్షర భారతం (వ్యాస సంపుటి), 10. అక్షర కోకిల (పర్యావరణ పరిరక్షణ సామాజిక చైతన్య గీతాలు), 11. అక్షర స్వరం (గేయ రూప కవిత్వం).
~
రాబోయే పుస్తకాలు
12. అక్షర జీవనది, 13. అక్షరాభిషేకం, 14. అక్షరామృతం (3, 4, 5 వాల్యూమ్స్), 15. అక్షర లక్షణ సారం (సులభ వ్యాకరణం) 16. అక్షర మొలకలు (పదవిన్యాసాలు), 17. అక్షరాంజలి, 18. అక్షర వీక్షణం,19 అక్షర యానం
