[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘తెలుగు నుడిగాలింపులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
“తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును
దానివలనఁ గొంత గానఁబడెయెఁ
గొంత తాన కలిగె నంతయు నేకమై
తెనుగు బాస నాఁగ వినుతికెక్కె”
ఇది కేతన వ్రాసిన ఆంధ్ర భాషాభూషణము పొత్తానికి ఆయన చెప్పుకున్న కుదురుమట్టు (ఉపోద్ఘాతం)లో ఒక పద్యం!
“తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును” అని కేతన అనగానే కొందరు సంస్కృత ఎలమితో పొంగి పోయారు. కానీ, కొందరు తెలుగు ఎలమి కలవారు నేటికీ ఎదలో కుంగిపోతున్నారు. ఈ పద్యంలోని చేవని తెలుసుకోవాలంటే కేతన నాటి నుండి నేటివరకూ జరిగిన తెలుగు నుడిగాలింపు లన్నింటినీ ఎంచి చూడాల్సి ఉంటుంది.
క్రీ.శ.1300 లలో కేతన ఆంధ్రభాషాభూషణం వ్రాసేటప్పటికి ఇండో యురోపియన్ నుడికుదురు అనీ, ద్రవిడియన్ నుడి కుదురనీ (భాషా కుటుంబం) ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పేర్లు ఏవీ ఆనాడు లేవు. అవన్నీ 150 ఏళ్లనాటి కొత్త తలంపుల్లోంచి వచ్చాయి. వాటితో కేతన మాటల్ని ముడిపెట్టి చూడకూడదు. తెలుగుని “ద్రావిడ కూటముకు చెందిన నుడి” అని ఈ నూటయాబది యేళ్ల నుండే అంటున్నారు.
ద్రావిడ ఇంట పుట్టినా, తెలుగు నుడికి ఒక వ్రాయి(వర్ణమాల), వ్రాత (లిపి), ఒక నిలుపు (స్థిరత్వము), ఒక పోడిమి (విధానము, లక్షణము) ఇవన్నీ సంస్కృత నుడిలోంచే వచ్చాయి. కన్నతల్లి కాకపోయినా దాదిలాగా తెలుగును సంస్కృతమే సాకింది. అలా సంస్కృతం ఒడిలోనే ఎక్కువగా పెరగటాన తెలుగు సంస్కృత నుడుల మధ్య కట్టు మరింత పెరిగింది.
తెలుగు ఒక్కటే కాదు, ఆనాటి ‘భారతనాడు’లోని నుడులన్నీ సంస్కృతాన్ని అంతో ఇంతో వెన్నంటే నడిచాయి. అందుకని “తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును” అనగానే పొంగు కుంగుల పనిలేదు. ఆయన చెప్పిందాన్ని సంస్కృతం- తెలుగు తల్లి-బిడ్డలనే తీరులో కాకుండా తెలుగు పెరుగుదలలో సంస్కృతం పెద్దమ్మలాంటిదిగా గుర్తించాలి.
చిలుకూరి నారాయణరావుగారు తమ ఆంధ్రభాషాచరిత్రలో తెలుగు ప్రాకృతం నుంచి పుట్టిందని చెప్పారు. సంస్కృత ఎలమి వలన కలిగిన ఈ తలంపు తరువాతి నుడిగాలింపుల్లో నిలవలేదు. తెలుగు నేరుగా సంస్కృతం నుంచీ గానీ, ప్రాకృతం నుంచీ గానీ పుట్టిన నుడి కాదని తరువాతి గాలింపులు తేల్చాయి.
ఆ మాటకొస్తే, తెలుగు తమిళ కన్నడ మళయాళం తుళు లాంటి నుడులన్నీ ఒక తల్లి బిడ్డలే నన్న ఎరుక మనకు ఏనాటి నుండో ఉంది. ద్రవిడ అనే ఒక నుడికుదురు (భాషాజాతి)కు చెందినవారని మహాభారతం, మనున్మృతిలలో మన గురించి ఉంది. తెలుగుని పంచద్రావిడుల్లో ఒకటన్నారు. కుమారిలభట్టు ‘ఆంధ్ర ద్రావిడ భాష’ అన్నాడు. ఆనాటి వాళ్లలో కొందరు తెలుగుని ఆర్యనుడులకు దగ్గరదిగానూ, తమిళాన్ని ద్రమిళాన్ని వేరుగానూ చూసినవాళ్లూ ఉన్నారు. రామానుజాచార్యని ‘ద్రవిడశిరోమణి’ అనటం అలాంటిదే!
కాల్డ్వెల్ వ్రాసిన ‘కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్’ పొత్తము వచ్చాక, ద్రావిడ అనే మాట గురించిన కొత్త తలంపులు పెరిగాయి. అంతకుముందు సంస్కృత వ్రాయితలు ‘ద్రావిడ’ అనే మాటను చాలాసార్లు తమిళానికి మారుపేరుగా వాడేవారు. కాల్డ్వెల్ దానిని మొత్తం నుడికూటమి పేరుగా వాడి, ద్రావిడ నుడులన్నిటినీ ఒకదానితో ఒకటి పోల్చి వాటి నుడికట్టుమట్టుల్ని (వ్యాకరణాల్ని) గాలించాడు. సంస్కృతం నుంచే ఈ నుడులన్నీ పుట్టాయన్న అప్పటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ, సంస్కృతంలోకి కూడా ఎన్నో మాటలు ద్రావిడ నుడుల నుంచి వెళ్లి చేరాయని చూపించాడు.
తెలుగు, సంస్కృతం వేర్వేరు నుడికుదురులకు చెందినవే. అందుకే సాజంగా పుట్టిన అచ్చతెలుగుమాటలతో పాటు సంస్కృత, ప్రాకృతాల నుంచి వచ్చిన తత్సమాలు, తద్భవాలు కూడా కలిసి ఉన్నాయి. ఈ తేడాలే తెలుగు నేరుగా సంస్కృతం నుంచి పుట్టలేదని చాటుతుంది! ద్రావిడ నుడికూటము లోనిదే అయినప్పటికీ తెలుగు తన సొంత ద్రావిడ అక్కచెళ్లెల్లతో పాటుగా కాకుండా సంస్కృతం అక్కచెల్లెళ్లతో ఎక్కువగా కలిసి పెరిగింది. ఇది కనిపెట్టే కేతనగారు “సంస్కృతం వలన కొంత, తనకు తానుగా పొందినది కొంత, అంతా కలిసి ఒక్కటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగునుడి లాగా వాసి కెక్కింది” అని పైన పద్యంలో నొక్కి చెప్పాడు.
తరువాతి నుడిగాలింపుల్లో తెలుగుకు ద్రావిడ నుడికూటములో పెద్ద చోటు ఉందని మరింత తెల్లమయ్యింది. స్టెన్కొనో అనే నుడివేత్త తమిళమే తొలిద్రావిడ నుడి సొబగులను ఎక్కువగా నిలుపుకుందనటాన్ని ఒప్పుకోలేదు. తమిళంలో కనిపించని కొన్ని తొలి ద్రావిడ సొబగులు తెలుగులో ఉన్నాయని చూపించాడు. తెలుగు, తమిళాల మధ్య ఉన్న లోతైన తేడాలనూ ఎత్తిచూపాడు. ద్రావిడ అనే పెద్ద చెట్టులో తమిళం, మళయాళం, కన్నడం ఒక కొమ్మనుండి పెరిగితే, తెలుగు వేరే కొమ్మగా పెరిగిందనే తలంపును బలపరిచాడాయన. ఆచార్య పి. ఎస్. సుబ్రహ్మణ్యంగారు ద్రావిడభాషా కుటుంబం అనే విరివివ్రాతలో ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు.
స్టెన్కొనో తరువాత ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి వంటి తెలుగు నుడివేత్తలు ఈ గాలింపును మరింత ముందుకు తీసుకెళ్లారు. తమిళ కొమ్మను దక్షిణ ద్రావిడ కొమ్మగానూ, తెలుగు కొమ్మను మధ్య ద్రావిడ కొమ్మగానూ గుర్తించారు. తెలుగు మాటలను, ముఖ్యంగా పనిని తెలియచేసే మాటలను (క్రియాపదాలను), ఇతర ద్రావిడ నుడుల్లోని మాటలతో పోల్చి చూశారు. వేల ఏళ్ల క్రితం ఉన్న తొలిద్రావిడ నుడి నుంచి నేటి తెలుగు ఎలా ఎదిగిందో కనిపెట్టేందుకు పూనికపట్టారు.
ఒక మాటని పలికేందుకు నోరుచేసే చప్పుడు లేదా అలికిడి (ధ్వని) తొలిద్రావిడ నుడి నుండి వేల యేళ్లుగా ఇప్పటి తెలుగు మాటగా (శబ్దంగా) ఎలా మార్పులు చెందుతూ వచ్చిందో (ధ్వని పరిణామం) తొలిగా చెప్పినవారిలో బర్రో అనే నుడివేత్త, అలాగే, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి వంటి నుడివేత్తలు ఎన్నదగినవారు! తొలిద్రావిడ నుడి నుంచి ఇప్పటి తెలుగు వరకు జరిగిన ఈ అలికిడి మార్పుల్ని (ధ్వని పరిణామం) గాలించి చూపిన వారు ఎందరో ఉన్నారు.
కేతన రాసిన ఆంధ్రభాషాభూషణముతో మొదలైన తెలుగు నుడిగాలింపు ఒక గొప్ప కదలిక. తెలుగు నుడి గురించి కొత్తగా తలచే ఈ కదలిక కేతనతోనే మొదలైందని చెప్పవచ్చు. తరువాతి కాలంలో తెలుగు ఎలమి కలిగినవారు అచ్చతెలుగు మాటలను ఏరి కూర్చి కబ్బాలు, పొత్తాలు వ్రాసినదీ ఈ నుడిగాలింపు కోసమే! మరుగునపడుతున్న తెలుగు మాటలను వెలికి తీసి మళ్లీ ఊపిరి పోయాలన్నదే వారి కోరిక.
ఇప్పటికాలంలో ఈ నుడి మెలకువ కొద్దికొద్దిగా పెరుగుతోంది. మన తెలుగును కాపు కాయాలంటే మరుగునపడిన తెలుగు మాటలను గాలించి వెలికి తీయాలన్న యావ పెరగాలి. ఒక్కొక్కరుగా ఈ పనిలోకి వస్తున్నారు ఇప్పుడిప్పుడే. అచ్చతెలుగు నుడులను కనిపెట్టి, అవి సంస్కృత నుడులకంటే తమ త్రోవన ఎలా ఎదిగాయో చెప్పడం ఇప్పుడు మన ముందున్న పని.
ఈ పని నుడివేత్తలే చెయ్యాలని లేదు. వ్రాయితలూ ఇందులో తమ వంతు చేయగలరు. వీలైనంత మేర సంస్కృత నుడుల వాడకాన్ని తగ్గించి, మన జనం నోళ్లలో ఇంకా బతికున్న తెలుగు మాటలను వ్రాతలోకి తెస్తే, ఆ మాటలకు మళ్లీ మెరుపు వస్తుంది.
వ్రాయితలందరికీ మొక్కి చెప్పగల మాట ఒక్కటే.. తెలుగున వ్రాయండి అని! తెలుగున వ్రాయటం అంటే సంస్కృతం మాటలు లేకుండా, అచ్చంగా తెలుగునే వ్రాయటం అని! తప్పదనుకున్నప్పుడే సంస్కృత నుడిని వాడండి. ఇదొక్కటే తెలుగు నుడికి మనం చేయగల గొప్ప మేలు.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
