Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-11

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 4 – మొదటి భాగం

తెలుగు కవులు – భక్తి

అధ్యాయంలో భక్తిని గూర్చి రససంఖ్యను గూర్చి తెలుగు కవుల చెప్పిన అభిప్రాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించి ఆయా వివరాలను అందిస్తున్నాను. ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే, కవుల అభిప్రాయాలు విమర్శకుల అభిప్రాయాల వలె సూటిగాను వాచ్యంగాను దొరకక పోవచ్చు. కాబట్టి వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెప్పిన వివిధ విషయాల నుంచి వారి అభిప్రాయాలను గ్రహించే ప్రయత్నం చేశాను.

కవుల అభిప్రాయాలను అర్థం చేసుకునేందుకు రెండు మూడు పద్ధతులను అవలంబించడం జరిగింది.

1) కవులు వారివారి కావ్యాలలో భక్తిరసము అన్న మాటను వాడినపుడు దానిని ఏ అర్థంలో వాడారు అన్న విషయాన్ని పరిశీలించడం. 2) అలాగే భక్తిని గూర్చి ప్రస్తావించినపుడూ, భక్తిని కావ్యంలో నిర్వహించినపుడూ దానికి వారు ఇచ్చిన ప్రాముఖ్యం ఏమిటి, స్థాయి ఏమిటి అన్న విషయాలను పరిశీలించడం. 3) ఆయా కవులను, కావ్యాలను అధ్యయనం చేసిన సాహితీవేత్తలు, పరిశోధకులు దానిని ఎలా పరిగణించారు – భావంగానా రసంగానా – అన్న అంశాలను తెలిపే వివరాలేమైనా లభిస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవడం.

అయితే ఈ మూడు పద్ధతులనూ ఉపయోగించి కూడా భక్తిరసం పట్ల కవి అభిప్రాయాన్ని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కవి అభిప్రాయం కావ్యంలో కనబడకపోవడానికి చాలా కారణాలుంటాయి. కవి యొక్క స్థల కాలాదులు, సామాజిక రాజకీయ పరిస్థితులు, వాటి నేపథ్యం నుంచి అతడు ఎంచుకున్న కావ్యవస్తువు భక్తిని జోడించడానికి అనువైనది కాకపోవడం, ఒకవేళ భక్తిప్రధానమైన కావ్యాన్నే రచించినా దానిని రసభరితంగా నిర్మించగల ప్రతిభ కవికి లేకపోవడం వంటి అనేక కారణాలు ఉండే అవకాశం ఉంది. ఈ పరిమితులని అధిగమించడం కోసం వీలయినంతవరకూ ప్రసిద్ధులూ ప్రతిభావంతులూ అయిన కవులు రచించిన కావ్యాలను మాత్రమే పరిశీలనకు తీసుకోవడం జరిగింది.

ఇంకొక విషయమేమిటంటే, ఇంతకు ముందరి అధ్యాయంలో విమర్శకుల అభిప్రాయాలను పరిశీలించినపుడు కొందరు విమర్శకులు కొన్ని సందర్భాలలో భక్తిరసము అనే పదాన్ని శాస్త్రార్థాన్ని దృష్టిలో పెట్టుకుని కాక తమ అనుభవం దృష్ట్యా “భావతీవ్రతను” సూచిస్తూ వాడి ఉండవచ్చునని అనుకున్నాము. ఆయినప్పటికీ శాస్త్రార్థం తెలిసిన వారు అనుభవంలో నుంచి చెప్పిన మాట కనుక దానికి విలువ ఉంటుందనుకున్నాం. ఇక కవుల విషయానికి వస్తే వీరు భక్తిరసము అనే మాటను శాస్త్రం మీద కన్నా అనుభవం మీద ఆధారపడి వాడే అవకాశం మరింత ఎక్కువ. అయితే ఒకవేళ అనుభవం నుండే అటువంటి పదప్రయోగం చేసి ఉండినప్పటికీ ఆ అభిప్రాయం కూడా విలువైనదే. కావ్యంలో రస నిర్వహణ చేసేది కవే కాబట్టి, అతని అనుభవమూ అభిప్రాయమూ కావ్యంపై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఆ అభిప్రాయాన్ని పరిగణించడం అవసరం. ఈ అవగాహనతో కొందరు ప్రసిద్ధ కవుల అభిప్రాయాలను ఈ అధ్యాయంలో పరిశీలించడం జరుగుతోంది.

4.1. కవుల అభిప్రాయాలు

4.1.1 నన్నయ

నన్నయ గారు భారత రచనలో భక్తి అన్న పదాన్ని పలుసందర్భాలలో వాడినా దానిని ప్రత్యేకించి భావము అని కానీ రసము అని కానీ చెప్పడం కనబడదు. కాబట్టి నన్నయగారు భక్తికి రసత్వం ఉందని భావించారో లేదో సూటిగా తెలుసుకునే అవకాశం లేదు. నన్నయ గారు భక్తికి ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి, వారు తన రచనలో భక్తిని రసముగా పోషించే ప్రయత్నమేమయినా చేశారా అని పరిశీలించడం ద్వారా పరోక్షంగా వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

నన్నయగారి రచన మీద విస్తృతంగా విమర్శా వ్యాసాలు, గ్రంథాలు వచ్చాయి. వాటిని పరిశీలిస్తే కొందరు సాహితీవేత్తలు శాంతరసాన్ని, మరికొందరు ధర్మవీరాన్ని నన్నయగారి భారతంలో ప్రధానరసంగా భావించారని అర్థమవుతుంది.

విశ్వనాథ సత్యనారాయణ గారు భారత రచనలో నన్నయ భగవద్భక్తికి కాక కథకు ప్రాముఖ్యమిచ్చాడంటారు. శిశుపాలవధ సందర్భంలో భీష్ముడు శ్రీకృష్ణుని పరమేశ్వరత్వము గురించి చేసిన సుదీర్ఘమైన వర్ణనలను నన్నయగారు తెనిగించకపోవడం వంటి వాటిని తన వ్యాఖ్యకు ఆధారాలుగా చూపుతారు. (నన్నయభారతి ప్రథమ సంపుటము పుట 812). వ్యాసభారతం విష్ణుపారమ్య బోధకమయిన గ్రంథం కాబట్టి శ్రీకృష్ణుని పరమేశ్వర స్థాపనము వీలయిన చోటల్లా చేయబడుతూ ఉంటుందనీ, నన్నయగారి దృష్టి అది కాదు కనుక మూలకథలో ఉన్న అద్భుతత్వము, విష్ణుమాహాత్మ్యము వంటి వాటిని నన్నయగారు పరిహరించారని అంటారు.

అయితే నన్నయగారు శిశుపాలవధ ఘట్టంలో శ్రీకృష్ణుని పరమేశ్వర స్థాపనమునూ, భక్తినీ పూర్తిగా పరిహరించారని చెప్పలేము. భీష్ముని మాటల్లో అవి వ్యక్తం చేయబడ్డాయి. “సర్వాత్ముడు సర్వభూతేశ్వరుడు సర్వవంద్యుడు” అంటూ కృష్ణుని పరమేశ్వరత్వాన్ని తెలియచెప్పే భీష్ముని మాటలు, కృష్ణుని చక్రాయుధం శిశుపాలుని శిరసును ఖండించగా అతని దేహం నుండి వెల్వడిన తేజం “అంబరంబెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చె విస్మయోత్ఫుల్ల విశాల నేత్రులయి భూపతులెల్లరు జూచుచుండగన్” అని చెప్పిన పద్యం వంటివి భక్తిభావకారకములే. ఆ భావం రసత్వాన్ని అందుకునేలా నిర్వహింపబడి ఉండకపోవచ్చు కానీ అసలే లేదని అనలేము. అయితే ఈ రసావేశము లేకపోవడమనేది నన్నయ రచనలోనే ఉన్న ఒక లక్షణంగా కనిపిస్తుంది. అది భక్తికే కాక అన్ని రసాలకు వర్తిస్తుంది. నన్నయ రచన రసప్రధానమైన మార్గంలో కాక కథాకథన ప్రధానమైన మార్గంలో సాగుతుందన్నది విమర్శకుల అభిప్రాయం.

నన్నయ రచనలో ప్రధానంగా సంయమనం గోచరిస్తుందనీ, కథాగమనానికి భంగం కలిగించే రసావేశము వర్ణనాబాహుళ్యము ఉండవనీ, నన్నయ పాత్రలు రసావేశముతో మాట్లాడవనీ దేవులపల్లి రామానుజరావుగారు అంటారు (మార్గదర్శి నన్నయభట్టు పుట 34). మరొక ప్రసిద్ధ విమర్శకులు పాటిబండ మాధవశర్మగారు నన్నయ రసపోషణలో దక్షుడే అయినా కథను ఆస్వాద్యం చేసేంత వరకే రసపోషణ చేయాలన్న నియమం పెట్టుకున్నాడేమోననిపిస్తుందనీ, వ్యాసుడు నిరూపించిన పరమార్థాన్ని తెలుగులోకి తేవడమే తప్ప రసానికి దీప్తి కలిగించడం నన్నయ ప్రధాన లక్ష్యం కాదనిపిస్తుందనీ అంటారు (ఆంధ్ర మహాభారత పీఠికలు పుట 118). విశ్వనాథ కూడా “నన్నయగారు రసమును శబ్దసంయోజన శక్తి నుండి కలిగింతురు. విస్తరించి భావములను చెప్పుట చేతఁ జేయరు” అన్న మాటను మరొక సందర్భంలో అంటారు.

కాబట్టి శిశుపాలవధ వంటి ఘట్టాలలో భక్తికి రసపుష్టిని కలిగించలేదు కనుక నన్నయగారు భక్తిని రసముగా పరిగణించలేదని కానీ, భక్తికి తగిన ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదని కానీ చెప్పడం కుదరదు. శృంగారాది రసములనే గంభీరంగా నిర్వహించిన కవి వాటికన్నా ఉదాత్తమయిన భక్తిని మరింత గంభీరంగా నిర్వహించడం సహజం.

4.1.2 తిక్కన

తిక్కన రసపోషణని అధ్యయనం చేసిన ఎల్లూరి శివారెడ్డిగారు రసభారతి అనే తమ రచనలో “దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక..” పద్యాన్ని వివరిస్తూ ఇలా అంటారు. “తిక్కన విక్రమ రసమని అన్నాడు. మహాభారతంలో తిక్కన రసపదాన్ని చాలామార్లు భావాలకు జోడించి ప్రయోగిస్తాడు. కవిబ్రహ్మ నవనాట్యేరసాః స్మృతాః అను కోవకు చెందినవాడు కాడు. అనంతావై రసాః అను దృక్పథం గలవాడు. అనుభవదశలో ప్రతిభావం రసస్థితిని పొందుతుంది అని ఆయన విశ్వాసం” (తిక్కన రసభారతి, ఎల్లూరి శివారెడ్డి, పుట 12).

శివారెడ్డి గారి ఈ పరిశీలనను బట్టి తిక్కన రసములు అనంతములన్న అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడని అనుకుంటే ఆయన భక్తిరసానికి కూడా అనుకూలుడేనని భావించవలసి ఉంటుంది. నిజానికి తిక్కన భక్తిరసము అనే మాటను సూటిగా వాడడమూ మనకు ఆంధ్ర మహాభారతంలో కనిపిస్తుంది.

క.
వేదవ్యాస మునీశ్వరు పాదంబులు దలఁచి మ్రొక్కి భక్తిరసైకా
స్వాదన సుకరానందోత్పాదన దివ్యమతి నగుచుదగనెఱిఁగింతున్
(భీష్మపర్వము 1-69)

పద్యాలలోనే కాదు వచనంలోనూ భక్తిరసము అనే మాటను వాడారు తిక్కన గారు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నపుడు శివుని దర్శించిన సందర్భంలో శివుడు వాళ్ళతో మీ కోరిక ఏమిటో చెప్పమన్నపుడు “బ్రీత చేతస్కులగుచు నుత్థితులై లలాటంబుల నంజలి పుటంబులు ఘటించి నిలిచి వాసుదేవార్జునులు దమ చిత్తంబులు భక్తి రసంబున జొత్తిల్లుచుండ” శివుని ప్రస్తుతించడాన్ని చెప్తారు (ద్రోణ పర్వం 2-363).

దీనిని చదివినపుడు ఇక్కడ భక్తిరసమనే మాటను తిక్కన గారు యథాలాపంగా వాడలేదని అనిపిస్తుంది. రసమా భావమా అన్న విషయానికి పెద్ద ప్రాముఖ్యాన్ని ఇవ్వకుండా ఏ పదం వాడితే ఏమిటిలే అనుకుని వాడి ఉంటే జొత్తిల్లుచుండ అన్న క్రియాపదం వచ్చి ఉండేది కాదు. భక్తిభావమున జొత్తిల్లుచుండ అనడం పొసగదు. ఇక్కడ భక్తిరసము అన్నపుడు తిక్కనగారు శృంగారాదుల విషయంలో వాడే “రసము” అన్న పారిభాషిక పదాన్నే ఉద్దేశిస్తున్నారని అనుకోవడానికి ఈ “జొత్తిల్లు” అనే క్రియాపదం తోడ్పడుతుంది. ఎందుకంటే శృంగారాది రసములను ప్రస్తావిస్తున్నపుడు కూడా ఈ క్రియాపదాన్నే తిక్కన గారు వాడారు. ఈ క్రింది వచనం అందుకు ఉదాహరణ.

ఉద్యోగపర్వంలో విశ్వరూప సందర్శన ఘట్టంలోని వచనం “..దుర్నిరీక్ష్యంబగు దత్తేజోరూపంబు గనుంగొనం గొలది గాక సకల జనంబులు నయనంబులు మొగిడ్చి యద్భుత భయానక రసంబుల జొత్తిల్లు చిత్తంబుల తోడం గదలకుండ..” అంటూ సాగుతుంది. ద్రోణపర్వం చివర్లో “..అయ్యర్జనుండు దండప్రణామ పూర్వకంబుగా భక్తిరసాయత్తంబగు చిత్తంబునం జంద్రధరు నెలకొలిపి సాంద్రానందంబనుభవించి..” అంటూ సాగే వచనంలో కూడా భక్తిరసము అనే మాటను తిక్కన గారు వాడడం మనకు కనిపిస్తుంది.

ప్రతి పదాన్నీ ఆచితూచి వాడడానికి ప్రసిద్ధుడైన తిక్కన భక్తిని రసముగా భావించకపోయి ఉంటే భక్తిరసము అనే మాటను ఇక్కడ వాడి ఉండేవాడు కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇవి యతిప్రాసల నిబంధనలకు లోబడి మాటలు వాడవలసిన పద్యములైనా కావు, వచనాలు.

అలాగే శాంతిపర్వంలో కనిపించే “అశ్వమేధ సహస్రంబు లాచరించి పడయరాని మహోన్నత పదము నస్మదీయ భక్తి రసైక పరాయణుండు వడయ నేర్చు సుకరముగ బ్రహ్మపుత్ర” అన్న తేటగీతి పద్యము, ఆ తర్వాత అశ్వమేధపర్వంలో కనిపించే “దేవమతుఁడను విప్రుండు దేవ ముని వరేణ్యుడగు నారదుని నొక్క పుణ్యభూమిఁ గాంచి వినతుఁడై యాతని కరుణ వడసి భక్తిరసము వొంగార..” అన్న మరొక తేటగీతి పద్యము – ఈ రెండు చోట్ల కూడా భక్తిరసము అన్న మాటను కవిబ్రహ్మ భక్తిని రసముగా పరిగణించడం వల్లనే వాడారని అనిపిస్తుంది.

4.1.3 ఎర్రన

ఎర్రన గారు భారత రచనలో భక్తిరసము అన్న పదాన్ని వాడలేదు కానీ హరివంశంలోను నృసింహ పురాణంలోను భక్తిని రసముగా పేర్కొనడం కనిపిస్తుంది. ఉత్తర హరివంశంలో నారదుడు కృష్ణుని కీర్తించే సందర్భంలో ఈ క్రింది తేటగీతి కనిపిస్తుంది.

తే.
పిదపఁ జేతిదండియ యటువెట్టి కేలు
మొగిచి భక్తిరసం బాత్మ ముంచికొనగ
నఖిల వేదాంత విద్యారహస్య భావుఁ
గోరి కీర్తించెఁ బ్రభువు నన్నారదుండు (3-33)

అలాగే నృసింహపురాణంలో, చతుర్థాశ్వాసంలో ప్రహ్లాదుని గురించి చెప్పే సందర్భంలోను, పంచమాశ్వాసాన్ని ముగిస్తూ వ్రాసిన వచనంలోను కూడా భక్తిరసము అన్న మాట కనబడుతుంది.

క.
అప్పుడు నెందును జెందక
చిప్పిలుభక్తిరసలీలఁ జిత్తము దనువున్
దొప్పందోఁగఁగ బాలుం
డెప్పటిక్రియ నుండె జగదధీశ్వరచింతన్ (4-183)

“అని రోమహర్షణుఁడు వినిపించుటయు సంయమిప్రవరులు భక్తిరసావేశంబున
నానందామృత ధారల మునింగి యహోబలనాథు నిచ్చలు దలంచుచు యథేచ్ఛం జనిరి” (5-195)

ఎర్రన కృతులలోని రసపోషణను లోతుగా పరిశీలించిన ఆచార్య ఎస్.గంగప్ప గారు ఈ ఆధారాలను చూపుతూ “ఎర్రన భక్తిని రసంగా పరిగణించినట్లు స్పష్టం” అంటారు (ఎర్రన రసపోషణ పుట 60). ఎర్రన భక్తిరసాన్ని ఎలా నిర్వహించాడో వారు తమ గ్రంథంలో చర్చించారు.

నృసింహపురాణంలోని వైకుంఠవర్ణనలో అష్టరసప్రసక్తి ఉంది కనుక ఆరుద్ర ఎర్రనను అష్టరసవాదిగా పేర్కొన్నారు (సమగ్ర ఆంధ్ర సాహిత్యము 1, పుట 1035). అయితే వేలూరి శివరామశాస్త్రిగారు నృసింహపురాణానికి వ్రాసిన పీఠికలో అది దుర్బలమైన ప్రమాణమంటూ దానిని ఖండించారు.

4.1.4 నన్నెచోడుడు

నన్నెచోడుడు భక్తిరసము గురించి సూటిగా ప్రస్తావించినట్లు కనబడదు. కుమార సంభవం పీఠికలో “పరిపూర్ణంబై దశప్రాణంబుల సప్రాణంబై నవరసభావభరితంబై షట్త్రింశదలంకారాలంకృతంబై రమణీయంబైన దివ్యకథారంబమున కభిముఖుండనై” అన్న మాట ఒకటి కనిపిస్తుంది. దానిని బట్టి అతడు కుమారసంభవ కావ్యాన్ని నవరసభావభరితమని అనుకున్నాడని మాత్రం అర్థమవుతుంది.

విమర్శకుల అభిప్రాయం ప్రకారం కుమారసంభవములో శృంగారం అంగి, వీరాదులు అంగరసాలు.

అయితే భక్తి కూడా ఒక రసమన్న అభిప్రాయాన్ని, కావ్యంలో భక్తిరసాన్ని పోషించాలన్న ఉద్దేశాన్ని, నన్నెచోడుడు ప్రత్యేకంగా వ్యక్తపరచినట్లు కనబడకపోయినా శివభక్తికి ప్రాధాన్యాన్ని ఇచ్చాడని మాత్రం చెప్పవచ్చు. “గురువున కిష్టదైవమునకుం బతికిం గృతి చెప్పి పుణ్యమున్/వరమున్ దేజముం బడయవచ్చు” నన్న ఉద్దేశంతో ఒక “దివ్యకథ”ను చెప్పబూనుకున్నాడని కుమారసంభవం పీఠికలోని నన్నెచోడుని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

4.1.5 పాల్కురికి సోమన

పాల్కురికి సోమన శివభక్తి విశిష్టతను చెప్తూ వ్రాసిన గ్రంథం అనుభవసారం. అందులో సోమన భక్తిరసము అన్నమాటను ప్రత్యేకంగా వాడకపోయినా భక్తిని కావ్యసంబంధంగా కాక లౌకికంగా చూసినప్పుడు కూడా అది నవరసాత్మకమన్న అభిప్రాయాన్ని చెప్పడం కనిపిస్తుంది.

సీ.
లింగార్చన క్రియా సంగతి శృంగార
రసమును నద్భుతరసముఁ దోఁప
ననయంబు జంగమార్చన సేయుచో శాంత
రసము భయానకరసముఁ దోఁప
సంసార సంపదల్ చర్చించుచో హాస్య
రసమునుబీభత్స రసము దోఁప
దుష్టేంద్రియంబులఁ దూలించుచో రౌద్ర
రసమును నతివీర రసముఁ దోఁప

ఆ.
నెల్ల జీవరాశి యెడలను గారుణ్య
రసముఁ దోఁప భక్తి రమణఁ బరఁగు
నవరసైక రసికుఁ డవివేక దూరుండు
భక్తుఁ డొక్కరుండె ప్రస్తుతింప
(అనుభవసారము: 61)

ఈ పద్యం లౌకికమైన భక్తిని గూర్చి చెప్తున్నదే అయినప్పటికీ, దీనిని ఆధారం చేసుకుని కావ్యంలో భక్తిని నిర్వహించినపుడు కూడా దానికి నవరసాలను అంగములుగా చేసుకోగల స్థితి ఉన్నదని సోమన భావించినట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివభక్త గోష్టిని వినే భక్తుడి ద్వారా గోచరమయ్యే అనుభావాల వంటి విషయాలను కూడా సోమన చెప్పాడు.

మ.
కడువేడ్కన్ శివభక్త గోష్ఠి వినుచోఁ గంపించుచున్ మగ్నుండై
యొడలెల్లం జెవులై ప్రసన్న ముఖుఁడై యుద్యత్ప్రమోదాత్ముఁడై
యడరంగా బ్రమదాశ్రుధార లవి నేత్రా పాంగసంజాతమై
తొడరన్ ముత్పులకాంకితాంగుఁడయి భక్తుండున్నఁ గా కొప్పునే
(అనుభవసారము: 84)

అనుభవసారాన్ని ముగిస్తూ చెప్పిన చివరి పద్యంలో కూడా “నవరసాంచిత భక్తి నానాప్రయుక్తి నలిఁ బాల్కుఱికి సోమనాథుండు సెప్పె ప్రవిమలంబై యనుభవసార మనఁగ భ్రాజిల్లు” అంటూ భక్తిని నవరసాలతో కూడినదిగా ప్రస్తావించడం కనిపిస్తుంది.

ఇక వృషాధిప శతకం, బసవపురాణం వంటి గ్రంథాలలోనయితే సోమన నేరుగా “భక్తిరసము” అనే పదమును ఉపయోగించడం కూడా కనిపిస్తుంది. వృషాధిప శతకంలోని ఒక పద్యంలో “భక్తిరసాభిషిక్త!” అనీ మరొక పద్యంలో “తాత్త్వికాంకుర పదపద్మ భక్తిరసగుంభ!” అనీ సంబోధించడం కనిపిస్తుంది.

బసవపురాణంలో భక్తిరసంబు, భక్తిరసాభిషిక్తుల, భక్తిరసవార్ధి వంటి పదములు కనబడతాయి. ఇక్కడ సోమన ఆలంకారిక పరిభాషను దృష్టిలో పెట్టుకుని ఆ మాటను వాడాడని మనం చెప్పలేకపోయినా, అనుభవం నుంచి వాడాడని చెప్పడానికి అవకాశం ఉంది.

4.1.6 నాచన సోముడు

నాచన సోమన రచించిన ఉత్తర హరివంశం భక్తి ప్రధానమైన రచనయే. “నాచన సోమన భక్తితత్త్వం” అనే గ్రంథంలో గోవిందస్వామినాయుడు గారు ఈ విషయాన్ని విపులంగా చర్చించారు. అందులో వారు సోమన గూర్చి “తాను స్వయంగా ఆయా ఘట్టాలలో ఆయా వేల్పుల పట్ల భక్తిభావాన్ని ప్రదర్శించడమేగాక తాను సృజించిన పాత్రల ముఖంగా కూడా భక్తిభావాన్ని ప్రదర్శింపజేసి భక్తిపట్ల తనకున్న మక్కువను ఋజువు చేసుకున్నాడు” అంటారు (పుట 89).

ఈ వాక్యంలో వారు “భక్తిభావాన్ని” ప్రదర్శించడం, ప్రదర్శింపజేయడం అన్నారు కానీ భక్తిరసమును పోషించడం అనలేదని గమనించవచ్చు.

నిజమే, ఉత్తరహరివంశంలో భక్తి రసత్వ స్థాయిని అందుకుందని చెప్పడం సాధ్యం కాదేమో. సాహితీవేత్తలెవరూ ఆ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కనబడదు. కానీ భక్తికి ప్రాధాన్యం ఉందన్న విషయం మాత్రం వాస్తవం.

గోవిందస్వామి నాయుడు గారు నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం అనే ఆరు మార్గాలు సోమన కావ్యంలో కనిపిస్తాయంటూ తన గ్రంథంలో వాటిని ఉదాహరణలతో వివరించారు. వివిధ పాత్రల ద్వారా భక్తి ఎలా ప్రదర్శింపబడిందన్న విషయాన్నీ చూపారు.

ఇందులో వీరం అంగి రసమనీ శృంగారాదులు అంగరసాలనీ విమర్శకుల అభిప్రాయం.

4.1.7 శ్రీనాథుడు

శ్రీనాథుడు భీమేశ్వర పురాణం, కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిరచనలు చేశాడు. శ్రీనాథుని రచనలలో భక్తి అన్న మాటను చాలా ఎక్కువగా వాడడం, చాలా సందర్భాలలో భక్తిని వాచ్యంగా చెప్పడం కనిపిస్తుంది. హరవిలాసం నుండి రెండు ఉదాహరణలు చూపుతున్నాను.

అమరాసురులు భక్తి యతిశయిల్ల భవుని పట్టికిఁ బసిఁడి కుంభములఁ బట్టి (6-55)

మించిరి వేలుపుల్నభము మీఁద లలాటము మీద నంజలుల్నించి నమస్కరించిరి వినీతియు భక్తియు నుల్లసిల్లఁగా” (7-90)

కొన్ని సందర్భాలలో “భక్తిభావనా” అన్న మాటను వాడడమూ కనిపిస్తుంది. హరవిలాసంలో “తరుణేందుకళాధర భక్తిభావనా శాశ్వత చిత్తు” (పీఠిక-19), “భవానీభర్గులు భక్తిభావనా వశంవదులై” (చతుర్థాశ్వాసం-91) వంటి ప్రయోగాలు కనిపిస్తాయి.

జొత్తిల్లు అనే క్రియాపదాన్ని కవులు సాధారణంగా రసము అన్న పదంతోనే వాడుతున్నట్లుగా కనిపిస్తుందని ఈ అధ్యాయంలో పైన తిక్కనగారిని గురించిన ప్రస్తావనలో చెప్పుకున్నాం. శ్రీనాథుడు ఒకచోట “అప్పరమభక్తునియందలి భక్తి చిత్తంబునం జొత్తిల్ల” అని వ్రాయడం కనిపిస్తుంది (హరవిలాసం 1-19).

ఇక భీమఖండంలో నయితే “భక్తిరసము” అన్న మాటను ప్రయోగించడమూ కనబడుతుంది.

ఉ.
అప్పుడు సప్తదివ్యమును లంచిత భక్తిరసప్రయుక్తులై
చప్పట తాళముల్మొరయ సంస్తుతి పూర్వముగాఁగ నాడుచున్
ముప్పిరిగొన్న మోదమున మ్రొక్కుచు మైఁ బులకాంకురావళుల్
కుప్పలుగా భజించిరి యకుంఠిత భావన భీమలింగమున్ (4-152)

శ్రీనాథుని రచనలలో భక్తి రసత్వాన్ని అందుకుందా లేదా, పాఠకునికి భక్తి రసానుభవం కలుగుతుందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయములు ఉండే అవకాశం ఉన్నప్పటికీ శ్రీనాథుడు తన కావ్యాలలో భక్తికి ఇచ్చిన ప్రాధాన్యం మాత్రం స్పష్టం.

అయితే శ్రీనాథుని రచనలలో భక్తి రసత్వాన్ని అందుకుందని భావించిన సాహితీ విమర్శకులు ఉన్నారు. “కవిసార్వభౌముడు: కవిసామ్రాట్టు” అనే వ్యాసంలో శ్రీనాథుడు భోజుడు అంగీకరించిన దశరసాలనే కాక భక్తిని కూడా రసంగా సంభావించాడంటారు జి.వి.ఎస్. “భక్తి వాత్సల్యాలు కూడా రసస్థితిని పొందగలిగిన భావాలని నిరూపించడం” శ్రీనాథుడు తెలుగు సాహిత్యానికి చేసిన మేలులలో ఒకటిగా చెప్తారు (కొలమానం పుట 81). వారే “శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని” అనే మరొక వ్యాసంలో శ్రీనాథుడు శాంతాన్ని వెనక్కు నెట్టి భక్తిని ముందుకు తెచ్చాడనీ, శ్రీనాథసాహిత్యవీధిలో శృంగారం భక్తివీరాలను ఇరువైపులా నిలుపుకొని పట్టమహిషిలా పయనిస్తుందనీ అంటారు.

(సశేషం)

Exit mobile version