[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 6 – రెండవ భాగం
6.1.3 పాత్రచిత్రణ
భక్తికావ్యాలలో ప్రధానంగా ఉండే పాత్రలు రెండు. ఒకటి భగవంతుడు, రెండవది భక్తుడు. మొదటిది భగవద్రతికి ఆలంబనం, రెండవది భగవద్రతికి ఆశ్రయం.
భగవంతుని చిత్రణ:
ఈ రెండింటిలో మొదట భగవంతుని విషయాన్ని తీసుకుంటే అక్కడ స్వభావ చిత్రణకీ, రూప చిత్రణకీ కూడా ప్రాముఖ్యం కనబడుతుంది. ఇంతకు ముందరి విభాగాలలో చెప్పుకున్నట్లుగా భగవంతుని కరుణ, నిర్మలత, సమర్థత, భక్తపరాధీనత మొదలైన అంశాలను సన్నివేశాల ద్వారాను, సంభాషణల ద్వారాను కూడా ప్రముఖంగా చిత్రించడం ద్వారా కవులు భగవద్రతికి పుష్టిని కలిగిస్తారు. లోకులందరూ మనల్ని వదిలేసినా భగవంతుడు వదిలిపెట్టడు అనే భరోసా, ఏ పాండిత్యాలూ ఐశ్వర్యాలూ లేకపోయినా ప్రేమ ఒక్కటి ఉంటే చాలు ఆయన్ని పొందవచ్చునన్న దిలాసా భగవద్రతిని అతిశయింప చేస్తాయి. భగవంతుని యొక్క ఆ తత్త్వాన్ని వ్యక్తంచేస్తున్న రెండు రమ్యమైన పద్యాలను భాగవతం నుండి చూపుతున్నాను.
శా.
బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగా బోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా
కే లల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్ (10.1-921)
క.
దళమైనఁ బుష్పమైనను
ఫలమైనను సలిలమైనఁ బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్ (10.2-1010)
వీటిలో మొదటి పద్యం గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్న కృష్ణుడు “భయంలేదు, అందరూ దీనిక్రిందికి రండి” అని గోపకులను పిలిచే సన్నివేశం లోనిది. రెండవది కుచేలుడు తన దగ్గరికి వచ్చినపుడు “ఆకో, పువ్వో, పండో, నీరో ఏదయినా సరే, ప్రేమతో ఏమిచ్చినా నేను సంతోషిస్తాను” అని చెప్పే సన్నివేశం లోనిది.
అలాగే శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో కూడా శివభక్తురాళ్ళయిన వారకన్యలు శ్రీకాళహస్తీశ్వరుని చూడాలని తపిస్తారు. వారి కోరిక తెలుసుకున్న కొందరు దొంగలు జంగమ రూపంలో వచ్చి శ్రీకాళహస్తికి తాము తీసుకువెళ్తామని చెప్తే, నమ్మి ప్రయాణమవుతారు. మార్గమధ్యంలో అక్కచెల్లెళ్ళిద్దరినీ హతమార్చి వారి దగ్గర ఉన్న ధనాన్నీ నగలనూ దోచుకోవాలన్నది ఆ దొంగల పథకం. కానీ శివుడు ఆ పన్నాగాన్ని పారనివ్వడు. దారిపొడవునా రకరకాల రూపాలతో భక్తురాండ్రిద్దరినీ కాచుకుంటాడు. దుర్మార్గులతో కలిసి వెళ్తున్నప్పటికీ వాళ్ళకి ఏ ప్రమాదమూ జరగకుండా, ప్రయాణం చక్కగా జరిగేలా చూస్తాడు. ఈ కథలో శివుడు తానే స్వయంగా వెంట ఉండి అమాయకులైన భక్తురాండ్రను కాళహస్తి దాకా తీసుకువెళ్ళడం భక్తిరసపుష్టికి ఎంతగానో దోహదం చేసే విషయం.
ఇలా భగవంతునికి భక్తులపై ఉండే అవ్యాజమైన కరుణ; వారికొరకు ఆయన పడే ఆరాటం; ఏం చేసైనా సరే తన భక్తులను కాపాడుకునే ఆయన సమర్థత; వాళ్ళ ప్రేమకు లొంగిపోయే, దాసుడయిపోయే తత్త్వం వంటివన్నీ భగవంతుని స్వభావ చిత్రణలో కనిపిస్తాయి.
ఇక భగవంతుని రూపచిత్రణ కూడా భక్తిప్రధాన కావ్యాలలో కనబడే ఒక ప్రధాన అంశం. భగవంతుని దరహాసవీక్షణాలను మధ్యమధ్య పాఠకునికి స్ఫురింప చేయడం భక్తిరసపోషణలో చాలా ముఖ్యం. అందుకే, భగవంతుని నవ్వునీ, కరుణతో నిండిన ఆయన చూపునీ పదే పదే ప్రస్తావించడం భక్తికావ్యాలలో కనిపిస్తుంటుంది.
భక్తుని చిత్రణ:
భక్తుని విషయానికి వస్తే, భక్తిరసపోషణలో భక్తుని స్వభావ చిత్రణకే కానీ రూపచిత్రణకు ప్రాముఖ్యం లేదు. భక్తుని సాత్త్వికమైన స్వభావాన్ని, అతని ఆనందాన్ని, భగవంతుడి పట్ల అతనికి ఉన్న ప్రేమనీ శ్రద్ధనీ చిత్రించడమే భక్తిరసకావ్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
భాగవతంలో “తన యందు నఖిల భూతము లందు నొకభంగి సమహితత్వంబున జరుగువాఁడు” వంటి పద్యాలు పరమ భక్తుడైన ప్రహ్లాదుని స్వభావాన్ని చిత్రిస్తాయి. ప్రహ్లాదుడు ప్రాణులన్నిటినీ తనతో సమానంగా చూస్తాడు; సత్పురుషులెదురైతే సేవకుడిలా మ్రొక్కుతాడు; పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకుంటాడు; దీనులను ఆదరిస్తాడు; స్నేహితులని సోదరులుగా చూస్తాడు; గురువులను దైవంగా భావిస్తాడు; ఆటలలో కూడా అబద్ధాలు ఆడడు; చక్కటి మర్యాద గల వాడు. ఏమన్నా త్రాగుతున్నపుడు, తింటున్నపుడు, మాట్లాడుతున్నపుడు, నవ్వుతున్నపుడు, వినోదిస్తున్నపుడు, నిద్రపోతున్నపుడు, ఎప్పుడూ అన్ని సమయాలలోనూ శ్రీహరి ధ్యానంలోనే నిమగ్నమైన మనసుతో ఈ ప్రపంచాన్ని మరచిపోయి ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఆనందంతో గంతులు వేస్తాడు, పాడతాడు. మరొకపుడు నిర్లిప్తంగా ఉంటాడు. జడునిలా కనపడతాడు.
ఈ విధంగా ప్రహ్లాదుని చిత్రణ భాగవతంలో వివరంగా కనబడుతుంది. మరొక రెండు పాత్రచిత్రణలను కూడా ఇక్కడ క్లుప్తంగా చూపుతున్నాను. మొదటిది భాగవతంలోని అంబరీషుని పాత్రచిత్రణ. రెండవది పాండురంగ మాహాత్మ్యం లోని పుండరీకుని పాత్రచిత్రణ.
సీ.
చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద
పలుకులు హరిగుణపఠనమంద;
కరములు విష్ణుమందిర మార్జనములంద
శ్రవములు హరికథాశ్రవణమంద;
చూపులు గోవింద రూపవీక్షణమంద
శిరము కేశవ నమస్కృతుల యంద;
పదము లీశ్వరగేహపరిసర్పణములంద
కామంబు చక్రికైంకర్యమంద;
తే.
సంగ మచ్యుతజన తనుసంగమంద;
ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమలమంద;
రసనఁ దులసీదళములంద; రతులు పుణ్య
సంగతుల యంద యా రాజచంద్రమునకు (9-82)
భాగవతంలోని ఈ పద్యం అంబరీషుని మనసు ఎప్పుడూ హరి పాదాల మీదే ఉంటుందనీ, మాటలు హరి గుణసంకీర్తనములలో, చేతులు వైష్ణవాలయాలను శుభ్రపరచడంలో, చెవులు విష్ణుకథలను వినడంలో, చూపులు గోవిందుని రూపాలను దర్శించడంలో, తల కేశవునికి నమస్కరించడంలో మాత్రమే నిమగ్నమయి ఉంటాయనీ చెప్తోంది.
సీ.
చలిచీమనేనియుఁ జాఁద్రొక్క శంకించుఁ
బలుకఁ డెన్నడు మృషాభాషణములు
కలుషవర్తనులున్న పొలముపొంతఁ జనండు
కలిమికుబ్బడు లేమిఁ గలగ డాత్మఁ
దలయెత్తి చూడఁ డెవ్వలనఁ బరస్త్రీల
ధైర్యంబు విడఁ డెట్టి దర్దఱుటల
నొరులసంపదకునై యుపతపింపఁడు
లోన నిందింపఁ డెంతటి నీచునైన
తే.
మిన్నకయ చూడఁ డాకలి గొన్న కడుపు
సర్వభూతదయోదయోత్సవ మొనర్చు
నిగమఘంటా పథైకాధ్వనీన బుద్ధి
బ్రహ్మవిద్యానవద్యుండు బ్రాహ్మణుండు (2-6)
పాండురంగమాహాత్మ్యంలోని ఈ పద్యం పుండరీకుడు చలిచీమని తొక్కడానికి కూడా సంకోచిస్తాడనీ, మోసపు మాటలు మాట్లాడడనీ చెప్పడంతో మొదలుపెట్టి అతని సద్గుణాలన్నిటినీ వరుసగా పేర్కొంటోంది.
భక్తుల పాత్రచిత్రణలో ప్రముఖంగా కనిపించే లక్షణం వారి ధృతి, భగవంతుని పట్ల వారికి గల అచంచల విశ్వాసం. “తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు” అనే స్థైర్యంతో నిండిన భక్తుల మాటలనీ, దేనికీ భయపడని వారి తత్త్వాన్నీ చూపించడం భక్తిరసపోషణలో ఒక బలమైన అంశం. “కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం” అంటూ భగవంతుని గురించి గొప్ప ధృతితో చెప్తారు భక్తులు.
ఈ విధమైన పాత్రచిత్రణలు – మరణానికి కూడా భయపడని భక్తుల స్థైర్యం, భగవంతుడే తమ బలం అని నమ్మే వారి అచంచల విశ్వాసం వంటివి – భక్తికావ్యాలలో భగవద్రతి అనే స్థాయిభావానికి పుష్టినిస్తాయి.
భక్తుల పాత్రచిత్రణలో స్వభావ వర్ణనే కనిపిస్తుంది కానీ, రూపవర్ణన కనిపించదని చెప్పుకున్నాము. శృంగారరసంతో పోల్చి చూసినపుడు ఇది ఒక ముఖ్యమైన భేదంగా కనిపిస్తుంది. శృంగార రసపోషణకు కథానాయిక వర్ణన తప్పనిసరిగా చేయడమూ, అది ఎంత గొప్పగా ఉంటే శృంగార రస పోషణ అంత బాగుందని అనుకోవడమూ ఉంది.
శృంగార రస పోషణలో నాయికల అవయవ వర్ణనకి ప్రాముఖ్యం ఉంది. దాన్ని గురించి చెప్తూ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు “సహృదయ రంజకముగా, మితముగా హద్దు మీఱక యవయవ వర్ణనము గూడ నుండినఁ గాని శృంగారమే లేదను నాలంకారిక మతము విశ్వసింపదగినదనియే నా యభిప్రాయము” అంటారు. నాయికల యౌవన సౌందర్యము లేక శృంగార మెట్లు వర్ణింపబడును? అని ప్రశ్నిస్తారు. (వ్యాసరత్నావళి ద్వితీయభాగము – పుట 68). అయితే భక్తిరస పోషణలో ఆశ్రయ విభావమైన భక్తుడి లేదా భక్తురాలి సౌందర్యమూ ముఖ్యం కాదు, దాని వర్ణనా ముఖ్యం కాదు. కనుకనే భక్తికావ్యాలలో సాధారణంగా భక్తుల రూపవర్ణన కనబడదు. ఒకవేళ అరుదుగా ఎక్కడైనా ఉన్నా (ఉదా: పాండురంగ మాహాత్మ్యంలో రాధ వర్ణన) అది భక్తిరసపోషణకు ఆవశ్యకమూ అనివార్యమూ అయిన వర్ణనగా తోచదు.
6.1.4 శైలి
భక్తికావ్యాలలో కవులు ప్రయోగించే శైలి ఓజో మాధుర్య సమన్వితంగా ఉంటుంది. ఆలంకారికులు నవరసములలో కొన్నిటికి మాధుర్యగుణ ప్రధానమైన రచననూ, మరికొన్నింటికి ఓజోగుణభూయిష్ఠమైన రచననూ చెప్పారు. కానీ భక్తిరసపూరితమైన కావ్యాలలో రెండుగుణాలకూ సమానప్రాధాన్యం కనబడుతుంది.
ఉ.
గోవుల వెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్ట భుజంగఫణా లతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద మోపి త
ద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా! (10.1-1043)
భాగవతంలో రాసలీలాఘట్టంలోని పద్యం ఇది. “ఆవుల వెంట సంచరించేదీ; భక్తుల పాపాలన్నిటినీ పోగొట్టగలిగేదీ; లక్ష్మీప్రదమైనదీ; దుష్టుడైన కాళీయుని పడగలమీద నర్తించేది అయిన నీ పాదపద్మాన్ని మా కుచముల మీద మోపి, మాకు మన్మథుని బాణాలవల్ల కలిగే బాధను పరిహరించు” అని గోపికలు కృష్ణుడిని అడుగుతున్న పద్యం. ఇంత మధురమైన భావాన్ని రేఫతో కూడిన పదాలతో, “దుష్ట భుజంగఫణా లతాగ్ర సంభావితమైన” వంటి దీర్ఘసమాసాలతో గోపికలు చెప్పడం – ఇది భక్తిరసపోషణలో కనిపించే ప్రత్యేకత.
ఆలంకారికులు శృంగార శాంతరసాలు రెండిటికీ మాధుర్యమే చెప్పారు కానీ ఓజస్సును చెప్పలేదు. జగన్నాథ పండితరాయలు కరుణాలహరి అనే తన కావ్యంలోని “సురస్రోతస్విన్యాః” అనే పద్యాన్ని శాంతరసానికి ఉదాహరణగా చూపరాదని చెప్తూ, కరుణాలహరి భక్తి ప్రధానకమనీ ఈ పద్యంలో కూడా భక్తే ప్రధానమనీ, పద్యంలో నిర్వేదం కనిపిస్తున్నప్పటికీ అది వాసుదేవునిపై అనన్య ప్రేమ కలిగిన కవీశ్వరుని రతిలో గుణీభూతమవుతుందనీ అంటాడు. అంతేకాదు, “ఈ పద్యములో ఓజస్వి అయిన రచన ఉన్నది. అది శాంతరసానికి ప్రతికూలము. అందువలన కూడా ఇది ఉదాహార్యము కాదు” అని చెప్పడం కూడా కనిపిస్తుంది (నవరసగంగాధరం పుట 109).
అలాగే ఆరుద్ర రచించిన “సహజపాండిత్యులవారి సరదాలు” అన్న వ్యాసంలో పోతన శైలి గురించి గడియారం వేంకట శేషశాస్త్రిగారు “అది సహజధారా విలసితము. ఓజః ప్రసాద గుణోజ్జ్వలితము” అన్నట్లుగా తెలియచేశారు (భాగవత వైజయింతిక పుట 171).
కాబట్టి ఓజస్వి అయిన రచనను ఆలంకారికులు, విమర్శకులు శాంత శృంగార రసాలకు ప్రతికూలంగానూ భక్తిరసానికి అనుకూలంగానూ పరిగణించారని అర్థమవుతున్నది. ఇది మనకు కావ్యాలలో స్పష్టంగా కనబడే అంశమే.
ఛందస్సు పరంగా చూస్తే ఓజోప్రధామైన మత్తేభశార్దూల పద్యాలు శృంగారరస ప్రధానమైన ఘట్టాలలో, కావ్యాలలో తక్కువగానే కనిపిస్తాయి చెప్పవచ్చు. శృంగార రస పోషణలో ఉత్పల చంపక మాలలను వాడినంతగా మత్తేభశార్దూలాలను కవులు వాడినట్లు కనిపించదు. కానీ తద్భిన్నంగా భక్తిరసపోషణలో మాత్రం మత్తేభశార్దూలాలను చాలా ఎక్కువగా వాడడం కనిపిస్తుంది. భాగవతంలో భక్తిరసపూరితాలుగా పేరుపడ్డ ఎన్నో పద్యాలు మత్తేభ శార్దూల పద్యాలే. భక్తిరసం బాగా పండిన సప్తమ అష్టమ దశమ స్కంధాలలో పోతనగారు మత్తేభ శార్దూలాలనే ఎక్కువగా రచించారు. మరొక విషయమేమిటంటే, భక్తికావ్యాలలో స్వభావరీత్యా ప్రసన్న మాధుర్యమైన లక్షణం ఉన్న ఉత్పలచంపక మాలలను వ్రాసినపుడు కూడా వాటి సహజగతిని కొంత మార్చడం ద్వారా కవులు ఓజస్సును నింపడం కనిపిస్తుంది.
ఉదాహరణకు తెనాలి రామలింగకవి కావ్యంలో మత్తేభశార్దూలాల కన్నా ఉత్పల చంపక మాలలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కావ్యాన్ని తెరచి పద్యాలను పరిశీలిస్తే, భక్తిరసపూరితమైన ఘట్టాలలోని ఉత్పలమాలలు వాటి సహజమైన నడకకన్నా భిన్నంగా నడిచాయని అర్థమవుతుంది. అంటే పద్యపు నడకలో భగణాలు కాక జగణ సగణాలు స్ఫురించడం, పద్యాలు మాధుర్యంతో పాటు ఓజస్సునూ సంతరించుకోవడం కనిపిస్తుంది. ఇక్కడ రెండు పద్యాలను ఉదాహరణగా చూపుతున్నాను.
ఉ.
ఓ గజరాజగామిని! మహోగ్రపు నోములు నోచుచున్న య
య్యోగివరేణ్యు నేమమున నుల్లము వెన్నవలెం గరంగె హృ
ద్రాగ సమగ్ర గోపవనితాజనతా పరిరంభ సంభ్రమో
ద్యోగ కళాప్రవర్తికి జతుర్ముఖ వంచిత ధూర్తకీర్తికిన్ (2-30)
ఉ.
ఆ యదుభర్త నాహలధరానుజు నానవనీతచోరు నేఁ
బాయని భక్తితోఁ గొలుతుఁ బ్రత్యహమున్ గృహదైవతంబుగా
నో యరవిందకోరకసహోదరచారుపయోధరాఢ్య! ని
శ్శ్రేయసకాంక్షఁ దక్కొరులు చేరి భజింతు రనంగ నేటికిన్ (2-81)
ఈ రెండు పద్యాలూ శివుడు పార్వతితో చెప్పే పద్యాలే. మొదటి పద్యంలో ‘పుండరీకుని మహోగ్రపు నోములకు విష్ణువు మనసు వెన్నలా కరిగిపోయింది’ అన్న మాటా, రెండో పద్యంలో ‘ఆ నవనీతచోరుడ్ని నేనే పాయని భక్తితో కొలుస్తాను, ఇక మిగతావాళ్ళు భజించకేమి!’ అన్న మాటా ఎంతటి భక్తిరసపోషకాలో స్పష్టం. ఈ పద్యాలు ఉత్పలమాల యొక్క సహజమైన నడకకు భిన్నంగా రచించబడినాయన్నదీ స్పష్టం.
ఈ గ్రంథానికి అనుబంధంగా ఉన్న భక్తిశతకములు-ఛందఃశిల్పము అన్న వ్యాసంలో ఈ విషయాన్ని గురించిన మరిన్ని వివరాలు ఉదాహరణలు చూడవచ్చు.
ఇవన్నీ ఛందస్సు పరంగా చూసినపుడు కనిపించే అంశాలు. అలాగే పద్యంలో కవి ఉపయోగించే అక్షరాల పరంగా చూసినపుడు కూడా భక్తిరసపోషణలో ప్రత్యేకత కనబడుతుంది.
శకార షకారాలు, ట వర్గానికి చెందిన అక్షరాలు (ట ఠ డ ఢ), రేఫ సంయుక్తాలైన వర్ణాలు శృంగార రసానికి విరోధులని, శృంగారరస సంబంధమైన రచనలలో వాటిని వాడకూడదనీ అలంకారశాస్త్ర సూచన (ధ్వన్యాలోకం పుట 540). అయితే భక్తిసాహిత్యంలోని శబ్దాలను పరిశీలించినపుడు, శృంగారరసానికి నిషిద్ధమని చెప్పిన ఈ శబ్దాలను పరిహరించడానికి బదులుగా కవులు భక్తికవిత్వంలో వాటిని మరింత విరివిగా వాడడం కనిపిస్తుంది. భక్తిరసం అనగానే సాహితీప్రియులకు ఏ పద్యం చప్పున స్ఫురిస్తుందో, ఏ పద్యాన్ని ఉదాహరిస్తూ జి.వి.ఎస్ “ఈ పద్యం విని పరవశించే తెలుగువారికి భక్తి రసం కాదంటే లక్షణ శాస్త్రం మీద గౌరవ ముంటుందని నేననుకోను” అన్నారు. ఆ “నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ జల్లెడువాఁడు” పద్యంలో ఎక్కువగా వినిపించేది డకారమే.
శృంగారరసానికి అనుకూలం కాదని చెప్పిన శకార షకారాలు, టఠడఢలు, రేఫ సంయుక్తాలైన వర్ణాలు – వీటన్నిటినీ భక్తకవులు ప్రాసాక్షరాలుగా కూడా వాడారు. అన్ని రకాల ఛందస్సులలోనూ వాడారు. భక్తిరసానికి సంబంధించిన అన్ని సందర్భాలలోను అంటే వర్ణనలలో, సంభాషణలలో, ఆలోచనలలో అన్నిటిలోనూ వాడారు.
“కటకట! మోసపోయితిమి; కాంతల పాటియు బుద్ధి లేదు” వంటి టకార ప్రాసతో కూడిన పద్యాలు, “పాఠీనాకృతిఁ దోయరాశినడుమన్ భాసిల్లి మున్నాఢ్యుఁడై” వంటి ఠకార ప్రాసతో కూడిన పద్యాలు, డకార ప్రాసతోను డకారాలతో నిండిన పద్యాలు పోతన భాగవతంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
శకార షకారాలూ అంతే. “శేషశాయికి మ్రొక్కు శిరము శిరము” వంటి పరిచితములైన పద్యపాదాలలోనే కాదు భాగవతంలోని ఎన్నో భక్తిరసపూరితమైన పద్యాలలో శకారషకారాలు విరివిగా కనిపిస్తాయి. దశమస్కంధంలోని ఈ క్రింది పద్యాన్ని గమనిస్తే శృంగార రసానికి ప్రతికూలమని చెప్పిన అన్ని అక్షరాలనూ భక్తిరసపోషకాలైన పద్యాలలో కవులు నిస్సంకోచంగా వాడారని అర్థమవుతుంది.
సీ.
శంపాలతికతోడి జలదంబు కైవడి-
మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ-
వేణుచిహ్నంబుల వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబులవాని-
శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ
వనపుష్పమాలికావ్రాత కంఠమువాని-
నళినకోమల చరణములవానిఁ
ఆ.
గరుణ గడలుకొనిన కడగంటివాని గో
పాలబాలుభంగిఁ బరగువాని
నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష! (10.1-548)
ఇది భాగవతం దశమస్కంథంలో బ్రహ్మదేవుడు బాలకృష్ణుడిని కీర్తించిన పద్యం. కృష్ణుడి రూపాన్ని స్వభావోక్తితో వర్ణించిన ఈ పద్యంలో 7 డకారాలున్నాయి. 3 టకారాలు, 3 శకారాలు, 2 షకారాలు ఉన్నాయి, ఒక ఠకారమూ ఉంది. అంతేకాదు ష ట కలిసిన సంయుక్తాక్షరం ష్టి కూడా ఉంది. ఇలా శృంగార రసానికి ప్రతికూలమని చెప్పిన అక్షరాలన్నీ ఉన్నప్పటికీ ఈ పద్యం భక్తిరసాత్మకంగానే ఉంది. కేవలం భావం వల్లనే కాదు, శబ్దాల వల్ల కూడా అందం ఇనుమడించింది. శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ, వనపుష్పమాలికావ్రాత కంఠమువాని వంటి శకార, షకార, టకార, ఠకారాలను పోతన అనాలోచితంగా వాడాడని అనుకోలేము. అవి పద్యానికి అందాన్ని తెస్తాయనీ, భక్తిరసానుకూలంగా ఉన్నాయనీ భావించే కవి వాడాడని అనిపిస్తున్నది.
పోతన మాత్రమే కాదు ఇతర కవులు కూడా భక్తిరచనలలో ఈ విధంగానే వాడారు. ధూర్జటి అయితే “డగ్గఱి యెవ్వఁడో కటకటా శివలింగము మీఁది రత్నముల్ గగ్గులకాటఁ గప్పి ములుకంపలు తీవలు వెట్టె” అంటూ పద్యం మొదలు పెట్టడమే డకారంతో మొదలుపెడతాడు.
ధూర్జటి డకారంతో పద్యం మొదలు పెట్టడం ఇక్కడొక చోట మాత్రమే కనబడే విషయం కాదు. “డాఁగియున్న పాము డాయకపోయెగా” వంటి ఇతర పద్యాలూ ఉన్నాయి. పాముకు ఏనుగుకు సాయుజ్యమిచ్చే పద్యమూ డకారంతోనే మొదలవుతుంది.
శా.
డాయం బిల్చుచు వారినిద్దఱ నఖండ జ్ఞానరూపంబునున్
వ్యాయామంబు నదృశ్య వస్తువు నమాయాకారముం బుష్కర
ప్రాయంబున్ విమలంబునైన తన సర్వవ్యాపకజ్యోతిలో
సాయుజ్యం బొనఁగూర్చె దేవతల కాశ్చర్యంబు సంధిల్లఁగన్
(శ్రీకాళహస్తి మాహాత్మ్యం 2-154)
పరమేశ్వరుడు ఏనుగును, పామును దగ్గరకు తీసుకుని అఖండ జ్ఞానస్వరూపము విమలము అయిన తన సర్వవ్యాపకజ్యోతిలో చేర్చుకుని వారికి సాయుజ్యమిచ్చాడని చెప్పే ఈ పద్యంలో “డాయం బిల్చుచు” అన్న మాట డకారం కోసం మాత్రమే చెప్పుకోవలసినది కాదు. భక్తిరసానికి సంబంధించినంతవరకూ పద్యం మొత్తం ఒక ఎత్తు, ఆ మాట ఒక్కటీ ఒక ఎత్తు. శివుని ప్రేమను కరుణను సూటిగా పాఠకుని మనసుకు అందజేస్తున్న మాట అది. భక్తిరసపోషణకు కీలకమయిన ఆ మాటను ధూర్జటి డకారంతో మొదలుపెట్టాడన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ “డాయం బిల్చుచు” అనే మాటకు బదులు “దాయం బిల్చుచు” అని కూడా అనచ్చు. అదే అర్థం వస్తుంది. ఛందస్సుకూ ఇబ్బంది లేదు. కానీ ధూర్జటి ఇక్కడ సౌమ్యమైన దకారం వాడకుండా డకారం వాడాడు, అదికూడా యతిస్థానంలో.
శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో టకార డకారాలతో ఉన్న పద్యాలు, శ ష లతో కూడిన పద్యాలూ చాలానే ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఇక్కడ వివరించడం లేదు. రెండు పద్యాల గురించి మాత్రం చెప్తాను. ఈ రెండు కన్నప్ప కథలోని పద్యాలు. శివుడు తిన్నని భక్తిని బ్రాహ్మణుడికి చూపే సన్నివేశంలోనివి.
క.
ఠవఠవ పడ నేటికి మది, శివగోచర! నీకు నన్నుఁ జెంచొకఁడు శ్రుతి
వ్యవహారేతర మతమునఁ దవిలి మహాభక్తిఁగొలువ దయపుట్టుటయున్
తే.
ఆ కిరాతుని పూజ నంగీకరించినాఁడఁ దద్భక్తి నీవును నేఁడు చూతు
గాని నా వెన్కదిక్కునఁ గానకుండ నడఁగియుండుము తడయక యతఁడు వచ్చు
(శ్రీకాళహస్తి మాహాత్మ్యం 3-103, 104)
శివభక్తుడైన బ్రాహ్మణుడు తాను చక్కగా పూజ చేసి వెళ్ళాక, ఎవరో వచ్చి ఆ ప్రదేశాన్నంతా అపరిశుభ్రంగా మార్చారని బాధపడుతున్నపుడు శివుడు అతనితో చెప్పే మాటలు ఇవి. “మనస్తాపం చెందుతావెందుకు? ఒక కిరాతుడు నన్ను మహాభక్తితో కొలిస్తే, దయపుట్టడం వలన అతని పూజను స్వీకరించాను. అతని భక్తిని నువు కూడా చూతువుగాని, నా వెనుక నిలబడు, ఇపుడతను వస్తాడు” అంటూ శివుడు చెప్పే ఈ మాటలు ఠవఠవ తో ప్రారంబించాడు ధూర్జటి. మొదటిపాదంలోనే రెండుఠకారాలు ఒక టకారం ఒక డకారం వాడాడు. కలత, వేదన, వెత వంటి ఎన్నో పదాలు ఉండగా ఠవఠవ అనే పదాన్ని ఎంచుకున్నాడు.
అమాయకమయిన ప్రేమతో నిండిన కన్నప్ప భక్తి, దానిని అంతే ప్రేమతో అందుకునే శివుని కరుణ, ఆ భక్తిని మరొక భక్తుడికి చూపాలనుకునే ఆయన బులబాటం, బోళాతనం, ఈర్ష్యకు లోను కాకుండా ఆ కిరాతుని భక్తి ఎటువంటిదో చూసి ఆనందించాలనుకునే బ్రాహ్మణభక్తుని కుతూహలం – ఇన్ని భక్తిరసపోషకాలయిన అంశాలతో కూడుకున్న ఈపద్యాలలో, పాఠకుని మనసును భక్తిరసానందంతో నింపే ఈ పద్యాలలో ధూర్జటి పెట్టిన టకరాలు ఠకరాలు డకారాలు చూస్తే కవుల దృష్టిలో భక్తిరసపోషణకు శృంగారరసపోషణకు సంబంధమే లేదని అర్థమవుతుంది.
మరొక్క ఉదాహరణ తెనాలి రామలింగకవి కావ్యంలోనుండి ఇస్తున్నాను. ఈ క్రింది పద్యాలు పాండురంగ మాహాత్మ్యం లోనివి. పాండురంగ మాహాత్మ్యంలో ఎన్నో అందమైన భక్తిరసపూరితాలైన పద్యాలు ఇటువంటివి ఉన్నప్పటికీ గ్రంథ విస్తరణ భీతితో మూడు పద్యాలను మాత్రమే చూపుతున్నాను.
తే.
పుండరీకేక్షణుండు శిఖండిబర్హ
మండితశిఖండకుఁడు నతాఖండలుండు
పుండరీకుని మానసాంభోజపీఠి
మిండతుమ్మెదయై యుండు నిండుకొలువు (2-11)
పాండురంగమాహాత్మ్యంలోని ఈ తేటగీతి ఒక సీసపద్యం తర్వాత వస్తుంది. విష్ణువు వైకుంఠంలో విహారం, పాలకడలిలో నివాసం వంటివన్నీ వదిలిపెట్టేశాడంటుంది ఆ సీసపద్యం. ఎందుకో ఈ తేటగీతి చెప్తుంది. అవన్నీ వదిలేసి, నెమలిపింఛములతో అలంకరించుకున్న శిరసు కలవాడు, ఇంద్రునిచే పూజించబడేవాడూ అయిన పుండరీకాక్షుడు పుండరీకుని మనసనే పద్మంలో గండుతుమ్మెదలా కొలువున్నాడట. ఇంత అందమైన సున్నితమైన భావాన్ని చెప్పే ఈ చిన్న తేటగీతిపద్యంలో 12 డకారాలే కాదు ఒక ఠకారమూ ఉంది.
క.
నొడువుల పడఁతుక మగనికిఁ
బొడచూపని తనదురూపు పొడగనిపించెన్
జడనిధిశయనుడు కొంగున
ముడిచిన మణి గాదె భక్తముఖ్యులకెల్లన్ (2-48)
భక్తులు కొంగున కట్టుకున్న మణి వంటివాడు విష్ణువు. కనుకనే బ్రహ్మదేవునికి కూడా చూపని తన రూపాన్ని భక్తుడైన పుండరీకునికి చూపాడని చెప్పే ఈ పద్యమూ డకార ప్రాధాన్యానికి ఉదాహరణే.
ఇక తరువాతి పద్యం దుశ్శకున దోషాలను పోగొట్టే కుండలతీర్థాన్ని గురించి శివుడు పార్వత్యాదులకు చెప్తున్న పద్యం. ఇందులో శ్శ అనే అక్షరాన్ని ప్రాసాక్షరంగా చేయడంతో పాటు శకార షకారాలనీ డకారాన్నీ కూడా ఎక్కువగానే వాడారన్న విషయాన్ని గమనించవచ్చు.
ఉ.
దోశ్శమితారి శౌరి తనతొడ్వినకుండలముల్ నిజక్షమాం
తశ్శిలలోన దాఁపఁ బ్రమదా! యొకతీర్థము కుండలాఖ్యమై
దుశ్శకునాదిసంజనితదోషశతంబు నుతంబుసేయు నం
భశ్శుచితన్ బ్రసిద్ధమగుఁ బన్నగశాయికి నీశుదిక్కునన్ (2- 123)
ప్రాచీనకవుల కావ్యాలలోనే కాదు, శతకసాహిత్యంలోనూ, ఆధునిక కవుల వచన కవితలలోనూ పాటలలోనూ కూడా ఈరకమైన ప్రయోగాలను గమనించవచ్చు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలను భావకవిత్వము-భక్తిరసము అనే వ్యాసంలో చూడవచ్చు.
భక్తిరసపోషణలో మాధుర్యమనే గుణం ఉన్నప్పటికీ దానిని శృంగార శాంత రసముల వలె సుకుమారంగా కాక ఓజస్వి అయిన రచనతో కవులు తీర్చిదిద్దుతారు.
మ.
ఖరదంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయున్ రక్త కే
సరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ
నరసింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు
ర్భర సంసారదవాగ్నికిన్ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే. (7-355)
భాగవత సప్తమస్కంధంలో ప్రహ్లాదుని నోట వినిపించే ఇటువంటి పద్యాన్ని ఒక శృంగారనాయిక నోట ఊహించలేము. భక్తిరసపోషకమైన ఇటువంటి పద్యాన్ని శృంగారరస పోషణలో కానీ శాంతరస పోషణలో కానీ ఏ కవీ వ్రాసే అవకాశం లేదు.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.
