Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-21

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 6 – మూడవ భాగం

6.1.5. అలంకారాలు

అలంకారాలలో శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఉన్నాయి. శృంగారాది రసములకు సంబంధించి అలంకారశాస్త్రాలలో శబ్దాలంకారాల పైనా అర్థాలంకారాల పైనా కూడా కొన్ని సూచనలున్నాయి. భక్తిరసానికి పొసగే అలంకారాల గురించి ఆలంకారికుల వ్యాఖ్యలేమీ లభించలేదు. ఆధునిక విమర్శకులు భక్తిరసము గురించి, భక్తిప్రధానమైన రచనల గురించి మాట్లాడిన సందర్భాలలో శబ్దాలంకారాల విషయమే ఎక్కువగా ప్రస్తావించారు. కనుక మొదట శబ్దాలంకారాలను పరిశీలిస్తాను.

6.1.5.1 శబ్దాలంకారాలు

6.1.5.1.1 అనుప్రాసము

శృంగారరసము అంగి అయినపుడు అనుప్రాసమును నిబంధించకూడదు అనేది అలంకారశాస్త్ర నియమం. అయితే భక్తిరస పోషణలో కవులు అనుప్రాసమును ఎక్కువగా వాడడమూ, అలా వాడడం భక్తిరస పోషణకు అవసరమని విమర్శకులు అంగీకరించడమూ కూడా కనిపిస్తుంది. భక్తికవిత్వంలో శబ్దాలంకారాల గురించి సాహితీవేత్తలు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను చూద్దాం.

భాగవతము-రసపోషణము అనేవ్యాసంలో శ్రీ సేపూరి లక్ష్మీ నరసయ్య గారు “భక్తునకు సంగీతమునకు నవినాభావ సంబంధము కలదు. కావున భక్తకవి తన కవితను వృత్త్యనుప్రాసములతో నంత్య నియమములతో యమకములతో సంగీతమున కనుకూలముగా వ్రాయుట సహజము” అని చెప్పి అందుకే పోతన శబ్దాలంకారమును పోషించాడంటారు. దాశరథీ శతకకర్త కూడా అలాగే చేశాడంటారు (భాగవత వైజయంతిక).

“పోతన్న ఆత్మీయత” అనే వ్యాసంలో చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు అనుప్రాసలు చాలామంది కవుల కంటె పోతన ఎక్కువగా వాడడం సత్యమేనంటారు. “అంత్యానుప్రాసల విషయానికి వస్తే భక్తికవిత్వంలో అర్థాలంకారాలతో పాటుగా శబ్దాలంకారాలు కూడా చోటు చేసుకుంటాయి” అంటూ భక్తికవిత్వానికీ శబ్దాలంకారాలకీ ఉన్న సంబంధాన్ని వివరిస్తారు.

“భక్తి విన్యాసమునకు గానము లేక సంగీతము ప్రధానము – ఈ రహస్యమును గుర్తించియే పోతన, తాళ లయానుకూలములై గీతి విన్యాసమునకు నిలుచు ననుప్రాస పద బంధముతో చాల పద్యములు రచించి యున్నాడు – ఈ సందర్భమును బట్టియే, భాగవతము ననుప్రాసగు పద్యములన్నియు భక్తి రస భావోద్దీపకములై యున్నవి గాని కేవలాలంకారిక శాస్త్ర లక్షణములకు లక్ష్యములై యుండలేదు” అన్నది నిడుదవోలు వెంకటరావు గారి వ్యాఖ్య (పోతన పుట 111).

భాగవతానికి వ్రాసిన ముందు మాటలో రాయదుర్గము నరసయ్య శాస్త్రిగారు పోతన శబ్దాలంకారాల గురించి చెప్తూ పోతన ఉపయోగించినటువంటి అనుప్రాసలు అంతకు పూర్వం ఎవరూ ఎక్కువగా వాడలేదనీ, కవిత్రయంలో ఎర్రన మాత్రమే కొంత వరకు ప్రయోగించాడనీ, నాచన సోముని హరివంశంలోను భాస్కర రామాయణంలోను కొంత కనిపిస్తాయనీ, వారే ఈ విషయంలో పోతనకు మార్గదర్శకులని అనిపిస్తుందనీ అంటారు. (ఆంధ్ర భాగవతము, వావిళ్ళ వారి ప్రచురణ 1934, పుట 16). ఇక్కడ పోతనకు అనుప్రాసల విషయంలో మార్గదర్శకులయి ఉంటారని చెప్పబడిన ఎర్రన సోమనలు కూడా భక్తిప్రధాన రచనలే చేసినవారు. కనుక నరసయ్య శాస్త్రిగారి ఈ పరిశీలన పరోక్షంగా భక్తిప్రధానమయిన కవిత్వానికీ అనుప్రాసలకూ మధ్య ఉన్న సంబంధాన్నే చెప్తున్నదని అనుకోవచ్చు.

భక్తిరస ప్రధానమయిన రచనలలో అనుప్రాస ప్రయోగానికి సంబంధించి ప్రత్యేకంగా ఉదాహరణలు ఇవ్వవలసిన అవసరం లేదనిపిస్తుంది. పోతన భాగవతంలోనయితే గ్రంథారంభంలోనే ఎదురయే “శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికాహార” వంటి పద్యాలు, షష్ట్యాంతాలలోని “హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సంహారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనోహారికి” వంటి పద్యాలు, ఆపైన గ్రంథమంతా పరచుకున్న “ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు” వంటి అనేక పద్యాలు తెలుగువారి నోటిపై అలవోకగా కదలాడేవే. కనుక ఒక చిన్న పద్యాన్ని మాత్రం ఇక్కడ చూపుతున్నాను. యశోద కృష్ణుని ఱోటికి కట్టే సన్నివేశం.

క.
ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియ వా
గ్జాలుం బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్ (10.1-379)

కావ్యాలలోనే కాదు, “సిద్ధసంకల్ప అవికల్ప శేషతల్ప-నిష్కలంక నిరాతంక నిరుపమాంక” వంటి అనుప్రాసలు భక్తిశతకాలలోనూ, “పాలితకింకర భవనాశంకర శంకర పురహర నమోనమో, హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో” వంటి ప్రయోగాలు ఆధునిక గేయాలలోనూ కూడా విరివిగా కనబడతాయన్నది సత్యం.

కాబట్టి ఆలంకారికులు శృంగారరసానికి ప్రతికూలమని చెప్పిన అనుప్రాస భక్తిరసానికి అత్యంత అనుకూలమయినపుడు, శృంగారాన్నీ భక్తినీ ఒకే రసముగా పరిగణించడం గాని, భక్తిని శృంగారంలో అంతర్భవింపజేయడం గాని కుదరవన్నది స్పష్టం.

శబ్దాలంకారాలను గురించి చెప్తూన్న సందర్భంలోనే మరొక పరిశీలనను కూడా చెప్పాలనుకుంటున్నాను. అది పదాల పునరుక్తికి సంబంధించిన పరిశీలన.

6.1.5.1.2 పదాల పునరుక్తి

పదాల పునరుక్తిని, అంటే ఒకే పదాన్ని ఒకే అర్థంలో మళ్ళీ మళ్ళీ వాడడాన్ని అలంకారశాస్త్రగ్రంథాలు దోషంగా చెప్పాయి. అయితే ఆ దోషానికి వీప్స, అభీక్ష్ణము, క్రియాసమభిహారము వంటి మినహాయింపులను ఇచ్చాయి. అటువంటి సందర్భాలలో “అర్థవిశేషములున్నందున పునరుక్తి దోషం కాదు” అన్నాయి.

అయితే లక్షణ గ్రంథాలు దీనిని కావ్యాలన్నిటికీ సంబంధించిన సామాన్య లక్షణంగా చెప్పినప్పటికీ ఈ రకమైన ప్రయోగాలు భక్తిప్రధానమైన రచనలలో ఎక్కువగా కనిపిస్తాయనిపిస్తోంది. పోతన భాగవతంలోని “కమలాక్షు నర్చించు కరములు కరములు” వంటి పద్యాలలో కనబడేది ఒక విధమైన పునరుక్తి. ఈ పద్యాలలో పునరుక్తమయిన పదాల అర్థం ఒకటే అయినా తాత్పర్యంలో భేదం ఉంది. ఇటువంటి పునరుక్తి పాండురంగమాహాత్మ్యం, భీమఖండం వంటి ఇతర భక్తికావ్యాలలో కూడా కనిపిస్తుంది.

ఇది కాకుండా మరొక విధమైన పునరుక్తి భక్తికావ్యాలలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందులో ఒకే శబ్దం వెంట వెంటనే కాకుండా కొంత వ్యవధితో పద్యంలో మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఒక పదం అన్నిచోట్లా ఒకే అర్థంలో వాడబడుతుంది. అయితే కవి ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడాడని పాఠకులకు అర్థమవుతుంది. ఆ ప్రయోజనం స్పష్టంగా నిర్వచించబడినా బడకకపోయినా, సహృదయులు దానిని గుర్తిస్తారు. ఈ రకమైన పునరుక్తి శ్రీనాథుని భీమఖండంలో బాగా కనబడుతుంది. కాశీఖండంలోను కొంత కనబడుతుంది. ఎర్రన నృసింహపురాణంలో కూడా ఎక్కువగానే కనబడుతుంది.

క.
విష్ణుమయము వేదంబులు
విష్ణుమయము సర్గ మఖిల విజ్ఞానములున్
విష్ణుమయము జగమంతయు
విష్ణుమయము విష్ణుఁడొకఁడవేద్యుఁడు బుద్ధిన్ (నృసింహపురాణం 5-59)

సీ.
కలడు మేదిని యందుఁగలఁ డుదకంబులఁ గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానునియందుఁ గలఁడు సోమునియందుఁ గలఁడంబరమునఁ గలఁడు దిశలఁ
గలఁడు చరంబులఁ గలఁడచరంబులఁ గలఁడు బాహ్యంబునఁ గలఁడు లోనఁ
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ గలఁడు ధర్మంబులఁ గలఁడు క్రియలఁ
తే.
గలఁడు కలవానియందును గలఁడు లేని
వానియందును గలఁడెల్ల వానియందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు
(నృసింహపురాణం 5-78)

ఈ రెండు పద్యాలూ నృసింహపురాణంలో ప్రహ్లాదుడు విష్ణువు గురించి చెప్పే పద్యాలు. పై పద్యం వంటి పద్యం పోతనగారి భాగవతంలో కూడా ఉంది.

మ.
కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్ (7-274)

ఈ రకమైన పునరుక్తి భాగవతంలోని ఇతర పద్యాలలో, తెనాలి రామలింగని పాండురంగ మాహాత్మ్యంలో, ధూర్జటి శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో, శ్రీనాథుని కాశీఖండంలో, హరవిలాసంలో అన్నింటిలోనూ కనిపిస్తుంది. శ్రీనాథుని భీమఖండంలోనయితే మొదటి ఆశ్వాసం నుండి చివరి ఆశ్వాసం వరకూ చాలా పద్యాలు ఇటువంటి పునరుక్తితో కనిపిస్తాయి.

ఉ.
ఏదెసఁజూచినన్ విబుధు లేదెసఁజూచిన మౌనిమండలం
బేదెసఁజూచినన్ హరిదధీశ్వరవర్గము వాసవాది యం
దేదెసఁజూచిన న్నవమహేశ్వరమూర్తులు శ్రీనికుంభకుం
భోదరతండుభృంగిరిటి హూహుకహాహులు దక్షవాటికన్ (1-103)

సీ.
దక్షవాటీ మాహా స్థానంబులోలేని యమరు లేస్థానంబు నందులేరు
దక్షవాటీ మాహా స్థానంబులోలేని యర్థ మేస్థానంబు నందులేదు
దక్షవాటీ మాహా స్థానంబులోలేని యమృత మేస్థానంబు నందులేదు
దక్షవాటీ మాహా స్థానంబులోలేని యజ్ఞ మేస్థానంబు నందులేదు

తే.
దక్షవాటిక సకల తీర్థముల కిరవు, దక్షవాటిక సకల విద్యలకు గరిడి
దక్షవాటిక విభవంబు తానకంబు దక్షవాటిక శివుని యంతఃపురంబు (6-105)

ఈ పరిశీలనల వలన కవులు భక్తికవిత్వానికి సంబంధించిన భావాలను – అంటే భక్తుని సాధన, ప్రేమ, ఆనందం, అలాగే భగవంతుని కరుణ, మహిమ వంటి వాటిని – చెప్పేటపుడు పునరుక్తిని భావోత్కర్షకు దోహదం చేసే సాధనంగా భావించినట్లు, భక్తికవిత్వంలో తరచుగా ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. ఇది భక్తికవిత్వానికే ప్రత్యేకమైన లక్షణంగా గోచరిస్తున్నది. భక్తికవిత్వంలో అనుప్రాసకు ఉన్న ప్రాముఖ్యం, అలాగే ధృతి వంటి భావాల ప్రాధాన్యం వంటివి బహుశా పునరుక్తిని కవులు తరచుగా ప్రయోగించడానికి కారణాలు కావచ్చు.

అయితే ఈ విషయాన్ని నిర్ధారణగా చెప్పడానికి మరింత విస్తృతమైన పరిశీలన చేయవలసి ఉంది. భక్తికావ్యాలనే కాక ఇతర కావ్యాలన్నిటినీ కూడా పరిశీలించవలసి ఉంది. అది ఈ సిద్ధాంతగ్రంథ పరిధికి మించినది కనుక ఈ విషయాన్ని ప్రతిపాదనగా కాక ఒక పరిశీలనగా మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను. ఆధునిక కవిత్వంలో కూడా భక్తిరచనలలో పునరుక్తిని ఎక్కువగా ప్రయోగించినట్లు కనబడుతుంది. “భావకవిత్వము-భక్తిరసము” అన్న వ్యాసంలో ఆధునిక కవిత్వానికి సంబంధించిన ఉదాహరణలను గమనించవచ్చు.

6.1.5.2 అర్థాలంకారాలు

వీర రౌద్ర అద్భుత బీభత్స కరుణ రసాలలో ఉపమా రూపకాలంకారాలు, శృంగార రసంలో రూపక దీపకాలంకారాలు ప్రయోగించాలని నాట్యశాస్త్రంలో కనిపించే నియమం (పోణంగి వారి అనువాదం పుట 458). అయితే నాట్యశాస్త్రంలో పేర్కొన్నదే మూడు అర్థాలంకారాలను. కానీ ఆ తర్వాతికాలంలో అర్థాలంకారముల సంఖ్య చాలా పెరిగింది. వాటిలో ఏఏ అలంకారాలు శృంగార శాంత రసములకు బాగా పొసగుతాయి అన్న అధ్యయనమూ, అవి మళ్ళీ భక్తిరసమునకు కూడా సరిపోతాయా లేదా అన్న పరిశీలనా – ఇవన్నీ ఈ సిద్ధాంతగ్రంథ పరిధికి మించినవి. ప్రత్యేకంగా పరిశోధించవలసినవి. కనుక అర్థాలంకారాలను ఆధారం చేసుకుని శృంగారశాంతాలకు భక్తికీ మధ్య ఉన్న సామ్యాలను, భేదాలను ఇక్కడ చర్చించడం లేదు.

అయితే స్థూలపరిశీలనకే దృష్టికి వస్తున్న రెండు అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను. ఒకటి వ్యాజస్తుతి అలంకారం గురించి. రెండవది స్వభావోక్తి అలంకారం గురించి.

6.1.5.2.1 వ్యాజస్తుతి

భక్తిరసానికి సంబంధించినంతవరకూ వ్యాజస్తుతి చాలా ముఖ్యమైన అలంకారం. కావ్యాలలో, శతకాలలో, చాటుపద్యాలలో, కీర్తనలలో, చివరికి ఈనాటి చలనచిత్ర గీతాలలో కూడా భక్తిని వ్యక్తం చేయడానికి కవులు వ్యాజస్తుతి అలంకారాన్ని ఎంచుకోవడం కనిపిస్తుంది.

శా.
వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్
లోలం బట్టి విరూపిఁ జేసెను; బలిన్ లోభంబుతోఁగట్టి యీ
త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్; ధర్మజ్ఞుఁడే మాధవుం?
డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపఁగా నేటికిన్ (10.1-1463)

భాగవతంలోని ఈ పద్యం గోపికలు చేస్తున్న నిందాస్తుతి. వాలినీ, శూర్పణఖనీ బలినీ శిక్షించడం అధర్మమంటూ ఆక్షేపిస్తున్న ఈ పద్యం నిందలా కనిపిస్తోంది. కానీ ఆ నింద వెనుక తమమధ్య తిరిగిన బాలకృష్ణుడే రామునిగా వామనునిగా అవతరించినవాడన్న గ్రహింపు ఉంది. ఆతడే విష్ణువన్న స్తుతి ఉంది.

ఉ.
ప్రాఁతలు మీఁదగప్పినఁ గృపామతి నోర్చితి నీచుపొత్తునన్
బ్రాఁతి మెసంగితీవు మనుభక్తుఁడు కుంటెనఁ బంపఁ బోతి మై
పూఁత యొనర్చుకొంటి శవభూతిఁ గపాలమునం భుజించితీ
రోఁతలు పెక్కులుండ నిట రోయుదువే యిఁక భక్తవత్సలా
(శ్రీకాళహస్తి మాహాత్మ్యం 3-100)

కన్నప్ప మాంసం ముక్కలు నైవేద్యంగా పెట్టి తనకు తోచినట్లు పూజ చేసి వెళ్ళాక, అక్కడికి వచ్చిన బ్రాహ్మణుడు తాను చక్కగా అలికి ముగ్గులు పెట్టి వెళ్ళిన స్థలమంతా అలా అపరిశుభ్రంగా తయారవడం చూసి బాధపడి, ఇదంతా ఎందుకిలా అయింది? ఎవరు చేశారిలా? నువ్వెలా ఊరుకున్నావు? అంటూ శివుడిని ప్రశ్నించి, అవున్లే భక్తుల కోసం ఎలాంటి పనయినా చేస్తావు నువ్వు. బూదిపూత కపాలభోజనం అలవాటయిన నీకు ఈ ఎంగిలి మాత్రం రోతగా ఎలా ఉంటుందిలే? అంటూ శివుడిని నిందించే పద్యం ఇది. “భక్తుల కోసం ఎలాంటి రోత పనినయినా సహించే భక్తవత్సలుడివి” అన్న నిందాస్తుతి.

మ.
కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్‌ మెచ్చి యిచ్చింది ద
బ్బర కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో
శరణన్న బగవానితమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్ల యి
త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా దేవకీనందనా (దేవకీనందన శతకం 100)

“ఇంతకు ముందు గజేంద్రుడు, ద్రౌపది వంటి భక్తుల్ని రక్షించావన్న మాటలన్నీ అబద్ధాలు, ఇప్పుడు నన్ను కాచుకుంటేనే అవన్నీ నిజాలని ఒప్పుకుంటాను” అని బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఈ పద్యం శతకసాహిత్యంలోది.

శతకాలలో ఎక్కడో ఒకటి రెండు పద్యాలు కాక మొత్తం శతకమంతా వ్యాజస్తుతిగానే రచింపబడిన సింహాద్రి నారసింహ శతకం, ఆంధ్రనాయక శతకం వంటివి కూడా తెలుగుసాహిత్యంలో ఉన్నాయి. ఈ క్రింది పద్యం ఆంధ్రనాయక శతకంలోని ప్రసిద్ధ పద్యం.

సీ.
ఆలు నిర్వాహకురాలు భూదేవి యై- యఖిలభారకుఁ డనునాఖ్యఁ దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై- కామితార్థదుఁ డన్న ఘనతఁ దెచ్చెఁ
గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై- బహుకుటుంబకుఁడన్న బలిమి దెచ్చెఁ
గలుషవిధ్వంసిని గంగ కుమారి యై- బతితపావనుఁ డన్న ప్రతిభఁ దెచ్చె
తే.
నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని-మొదటినుండియు నీవు దామోదరుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

ఇక చాటుపద్యాలలో “సిరిగలవానికి చెల్లును, తరణుల పదియారువేల దగ పెండ్లాడన్; తిరిపెమున కిద్ద రాండ్రా! పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్” అన్న శ్రీనాథుని వ్యాజస్తుతి ప్రసిద్ధం. “ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!” అన్న రామదాసు కీర్తనా ప్రసిద్ధమే.

భక్తిరసపోషణలో ఇంత తరచుగా కనబడే ఈ అలంకారం శృంగారరసపోషణలో కనబడదు. రాజసభలో కవులు నిందాస్తుతి పద్యాలు చెప్పడం చూస్తాం. భక్తిలో చూస్తాం. కానీ శృంగారంలో అలాటివి కనబడవు. నిందాస్తుతి శృంగారంలో పొసగదు కనుకనే కవులు దానిని వాడలేదనిపిస్తుంది.

6.1.5.2.2 స్వభావోక్తి

భక్తిప్రధానమైన కావ్యాలలో ఎక్కువగా కనబడే మరొక అలంకారం స్వభావోక్తి. భక్తికావ్యాలలో స్వభావోక్తి అలంకారంతో రచించబడిన భగవంతుని వర్ణనలు భక్తిరసపోషకాలుగా ఉండడం స్థూలపరిశీలనకే గోచరించే విషయం.

సీ.
కడుపున దిండుగాఁ గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును
జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి
ఆ.
సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె (భాగవతము 10.1-498)

“పొట్టమీదకు దట్టీలా కట్టిన అంగవస్త్రంలో పిల్లనగ్రోవిని ముడిచాడు. కొమ్ముబూరనీ, పశువుల్ని తోలే బెత్తంకఱ్ఱనీ ఎడమ చంకలో ఇరికించి జారిపోకుండా పట్టుకున్నాడు. మీగడ పెరుగు కలిపిన చద్దన్నం ముద్దని ఎడమ చేతిలో పెట్టుకుని, నంజుకోవడానికి తెచ్చుకున్న ఊరగాయ ముక్కల్ని వేళ్ళ మధ్యలో ఇరికించుకుని, సావాసగాళ్ళ మధ్య కూర్చుని చిరునవ్వులు రువ్వుతూ వాళ్ళతో పరిహాసాలు ఆడుతూ చద్ది తిన్నాడు” అంటూ బాలకృష్ణుడి రూపాన్ని యథాతథంగా కళ్ళముందు నిలిపే ప్రసిద్ధ పద్యం ఇది.

భాగవతంలో ఇటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఒకే కృష్ణుడి రూపాన్ని కేవలం స్వభావోక్తి మాత్రమే ప్రయోగించి పోతన గారు ఎన్ని పద్యాలలో ఎంత భక్తిరసాత్మకంగా వర్ణించారో అర్థమయేందుకు మరికొన్ని ఉదాహరణలు చూపుతున్నాను.

కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో
స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ
బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ
దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్. (10.1-502)

చెవులదాకా వేళ్ళాడుతున్న జులపాల జుట్టు, మెడలో హారాలు, చేతిలో బంగారంలా మెరిసే బెత్తంకఱ్ఱ, తలలో నెమలి పింఛాల మాల ఉన్న కృష్ణుడు అర చేతిలో అన్నం ముద్ద పట్టుకుని లేగదూడలను వెదకడానికి ఉత్సాహంగా అడవిలోకి వెళ్ళాడు అంటూ కృష్ణుని రూపాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తున్న మరొక పద్యం ఇది.

శ్రవణోదంచితకర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే? (10.1-772)

చెవిలో కొండగోగి పువ్వు పెట్టుకుని, పసిడి వన్నె వస్త్రం కట్టుకుని, తలలో నెమలిపింఛం పెట్టుకుని, మెడలో పద్మాల దండ వేసుకుని పిల్లనగ్రోవి ఊదుతూ ఆలమందల వెంట తిరుగుతున్న మాధవుడు ఎంత బాగున్నాడో చూశావా! అంటూ గోపికలు ఒకరితోనొకరు చెప్పుకుంటున్న పద్యం ఇది.

కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్ (10.1-638)

“నడుముకున్న దట్టీగుడ్డని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తలవెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చరచాడు. రెండుకాళ్ళు బిగించి చెట్టు కొమ్మ మీదనుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు” అంటూ కృష్ణుడు కాళింది లోకి దూకడాన్ని వర్ణిస్తున్న ఈ పద్యంలో ‘గోపాలసింహంబు’ అన్న ఒక్క మాట తప్ప మిగిలినదంతా ఏ పోలికలూ అతిశయోక్తులూ వక్రోక్తులూ లేని సూటి మాటలే.

పాండురంగ మాహాత్మ్యంలో కూడా కృష్ణుడి రూపాన్ని స్వభావోక్తితో వర్ణించిన అందమైన పద్యాలు ఉన్నాయి. రెండింటిని ఉదాహరణగా చూపుతున్నాను.

ఆవునదల్చు పచ్చవెదురంఘ్రి యుగాంతర వీథి నూఁది య
గ్రావనిఁ దేజరిల్లు కటిహస్త సమన్వితుఁ గొస్తుభాంకు నొం
దీవిభు నింద్రనీల నిభదేహుఁ గనుగొని హర్షవర్షధా
రావిల మానసుండగుచు నమ్ముని కృత్యవిమూఢబుద్ధియై (2-51)

ఇందులో ఉన్న కృష్ణుడి వర్ణనా సహజమైనదే. ఆవులని అదల్చే పచ్చటి వెదురు కర్రని రెండు కాళ్ళ మధ్యా పట్టుకుని రెండు చేతులూ నడుము మీద పెట్టుకున్న లక్ష్మీవల్లభుడు పుండరీకుని ఎదురుట నిలబడ్డాడన్న వర్ణన. ఇంద్రనీలనిభ దేహుడన్న మాట ఒక్కటే కాస్త ప్రత్యేకంగా వాడిన మాట.

సీ.
అవచూడ బర్హిబర్హమున నొండొంటి సి
క్ఖములంటు చలిదిచిక్కము దలిర్పఁ
బంటకార్వెలిదమ్మిజంట గెంటసమాడు
వెడఁదకన్నుల కాంతి వెల్లి వొడువ
మెఱుగు జెక్కుల మీద మిట్టించి మొసలి వా
గడ మద్దికాయల కళుకులమర
వక్షస్స్థలమున శ్రీవత్స కౌస్తుభ వైజ
యంతులిందిర తోడి వంతువడయ
తే.
నిమ్ననాభియు త్రివళివర్ణిత జఠరము
కరకలిత చిత్రభస్త్ర శంఖములు నమర
మన్మనస్సీమ నేప్రొద్దు మలయుచున్న
ధూర్తబాలుఁడు నామ్రోలఁ దోఁచుచొక్కొ? (4-64)

తలలో నెమలిపింఛము, చలిదిచిక్కము, తళుకు చెక్కిళ్ళ మీద ప్రకాశిస్తున్న మకరకుండలాల కాంతులు, వక్షస్థలం మీద లక్ష్మీ దేవితో పోటీ పడుతూ ఉన్న శ్రీవత్స కౌస్తుభ వైజయంతులు, లోతయిన నాభి, పొట్ట మీద మూడు మడతలు. చేతుల్లో రంగురంగుల తోలుసంచి, శంఖము – ఇవన్నీ ఉన్న కృష్ణుని రూపవర్ణన ఇది. కనుల విషయంలో తెల్లతామరలను మించినవంటూ చెప్పిన ఒక్క పోలిక తప్ప మిగిలిన పద్యమంతా బాలకృష్ణుని రూపాన్ని ఉన్నదున్నట్లుగా వివరిస్తోంది.

భాగవతంలోని అలంకారాల గురించి పరిశోధించి “పోతన మహాభాగవతం-అలంకారవైభవం” అన్న సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించిన గోదావరి వెంకట మురళీమోహన్ గారు పోతన భాగవతంలో ఎనభై స్వభావోక్తి అలంకారాలు ప్రధానంగా కనబడతాయనీ, అందులోనూ శ్రీకృష్ణుని వర్ణించినవే అధికమనీ అంటారు (పుట 142). అలాగే పోతన తన కృతిలో అతితక్కువ సంఖ్యలో అతిశయోక్తులను ప్రయోగించాడనీ, వర్ణనలలో స్వభావోక్తులు, ఉపమలు, రూపకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చాడని తెలియచేస్తారు (పుట 159). అయితే పోతన స్వభావోక్తులను ఎక్కువగా వాడడానికీ, అతిశయోక్తులను తక్కువగా వాడడానికీ గల కారణాన్ని వారు పోతన వ్యక్తిత్వానికి ఆపాదిస్తూ, “దీనికి కారణం పోతన ప్రకృతి ప్రేమికుడు, పరమ భక్తాగ్రగణ్యుడు” అన్నారు. కానీ దీనిని భక్తిరసపోషణకు సంబంధించిన విషయంగా చూడాలని, భగవంతుడు ఆలంబన విభావం కావడం వల్లనే స్వభావోక్తులు ఎక్కువగా పొసగడమూ, అతిశయోక్తులు పొసగకపోవమూ జరుగుతుందనీ నేను భావిస్తున్నాను.

వ్యాజస్తుతి, స్వభావోక్తి, అతిశయోక్తి అలంకారాలకు సంబంధించి భక్తిరసానికి ఉన్న ఈ విశిష్టతను మరింత సూక్ష్మంగా పరిశీలించవలసి ఉన్నప్పటికీ, అర్థాలంకారాలను ప్రయోగించడంలో కూడా శృంగార రసానికీ భక్తికీ భేదం ఉందన్న విషయం మాత్రం ఈ స్థూలపరిశీలనతోనే తెలుస్తోంది. ఈ దృష్టితో అర్థాలంకారాలను లోతుగా పరిశీలిస్తే మరికొన్ని వ్యత్యాసాలు కనిపించే అవకాశం ఉన్నదనిపిస్తోంది.

(సశేషం)

Exit mobile version