[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]
అధ్యాయం 6 – నాల్గవ భాగం
6.1.5. రససామగ్రి
శాంతరసాన్ని రసముగా అంగీకరించనివారు చెప్పిన అభ్యంతరాలలో ఒకటి దానిని వ్యక్తం చేయడానికి తగినన్ని అనుభావాలు లేవు అన్నది. భక్తిరసం విషయంలో అటువంటి అభ్యంతరాన్ని ఎవరూ వ్యక్తం చేసినట్లు కనబడదు. అయినప్పటికీ భక్తిరసానికి సంబంధించిన అనుభావాలను ఎన్ని విభిన్న రీతులలో నిర్వహించే అవకాశం ఉందన్న విషయంపై అవగాహన కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను.
శా.
ఆనందంబున నర్ధరాత్రములఁ జంద్రాలోకముల్ కాయఁగా
నానాసైకతవేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభుఁ గా
శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదు
న్మేనెల్లంబులకాంకురప్రకరముల్ నిండార మిన్నేటిలోన్
(భీమఖండము 2-91)
శ్రీనాథుని భీమఖండంలోని పద్యమిది. కాశీవిశ్వేశ్వరుడిని తల్చుకుని తానెలా పులకించిపోతాడో అగస్త్యుడు వ్యాసునితో చెప్పే మాటలు.
హర్షించి హర శివ త్ర్యంబకాచలగర్భ భవ యంచు రోమాంచ పటలిఁ దాల్చుఁ
గరతాళకలన శంకర గీతములువాడు లజ్జాభిమానంబు లుజ్జగించి
(భీమఖండము 3- 191)
ఈ పద్యం కూడా భీమఖండంలోనిదే. ఇంతకు ముందరి పద్యం అగస్త్యుని పరవశాన్ని చెప్తుంటే ఈ పద్యం వ్యాసుని ఆనందాన్ని చెప్తుంది.
శా.
ఆనందాశ్రులు గన్నులన్ వెడల, రోమాంచంబుతోఁ, దత్పద
ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్,
నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్.
(భాగవతము1-124)
భాగవతంలో నారదుని పూర్వజన్మ వృత్తాతంలోని పద్యం ఇది. హరిని ధ్యానిస్తూ కూర్చున్నపుడు నారదుని చిత్తంలో హరి సాక్షాత్కరించినప్పటి స్థితిని వర్ణించే పద్యం. కళ్ళవెంట ఆనందాశ్రువులు కారిపోవడం, పులకరింత కలగడం, తనని తానెరుగని స్థితిలోకి వెళ్ళిపోవడం వంటి అనుభావాల వర్ణన ఇక్కడ కనిపిస్తుంది.
శా.
ఆలాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్
(భాగవతము1-217)
ఇది కూడా భాగవతంలోని పద్యమే. భీష్ముని మరణ సమయంలోని పద్యం. ఉత్తరాయణ కాలం రాగానే, ఇక మరణించాలని నిశ్చయించుకున్న భీష్ముడు ఏమి చేశాడో చెప్పే పద్యం. మాటలు మానేసి, మనస్సును ఏకాగ్రం చేసుకొని, కృష్ణుని మొహం మీదనే చూపు నిలిపి, ఆయన కరుణ నిండిన చూపుతో తన బాణాల బాధలన్నీ శమించిపోగా, సంతోషంతో ఆయన్ని కీర్తించాడు అని చెప్పే పద్యం.
చ.
విలిఖితమో! శిలాకృతమొ! విస్మృతి రూపు వహించెనో! యనన్
జలన విదూరుఁడయ్యుఁ దొలుసావి పయోధరధారఁ దోఁగున
య్యిలఁ దలయెత్తు క్రొత్త పులునేపున వే పులకల్ తనూలతన్
మొలవఁగ నున్న నవ్వి యదుముఖ్యుఁడు తాపస ముఖ్యు నిట్లనున్
(పాండురమగమాహాత్మ్యము 2-52)
ఇది కృష్ణుడిని చూసినప్పటి పుండరీకుడిని తెనాలి రామలింగకవి వర్ణించిన పద్యం. ఒక చిత్తరువో, రాతివిగ్రహమో, మఱపు మనిషి రూపం ధరించిందో అన్నట్లుగా కదలిక లేనట్లుగా ఉన్న పుండరీకుడి శరీరంపైన తొలకరి వానకు తడిసిన భూమిపై చిరుగడ్డి మొలకలు వచ్చినట్లుగా పులకలు వచ్చాయట.
చ.
పఱచిన దేవకీసుతుఁడు పక్కున నవ్వినఁ గ్రమ్మఱిల్లి మై
దఱచుగ రోమహర్షణ ముదంచిత భక్తిభరాకులత్వ మే
ర్పఱచుచుఁ గేల్మొగిడ్చి పలుఁబల్కుల తళ్కుల సన్నవెన్నెలన్
బఱపుచు ప్రస్తుతించె మునిబంధ విభంజను భక్తరంజనున్
(పాండురమగమాహాత్మ్యము 4-80)
ఇది కూడా కృష్ణుని చూసినప్పటి పుండరీకుని స్థితిని వర్ణించే పద్యమే. శరీరం పులకితమవడం, భక్త్యాతిశయంతో కదలిపోవడం, చేతులు జోడించడం, పెక్కు మాటలతో కృష్ణుని స్తుతించడం వంటి అనుభావాలతో పుండరీకుని స్థితిని వర్ణించాడిక్కడ రామలింగకవి.
తే.
అట్లు ప్రత్యక్షమైన పద్మాక్షు నంతరిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి కరటిఘంటికల తాళములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె
(ఆముక్తమాల్యద 4-15)
తనకు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుని చూసి విష్ణుచిత్తుడు పులకించిపోవడం, ఆనందభాష్పాలతో స్తుతించడం ఆముక్తమాల్యదలోని ఈ పద్యంలో కనిపిస్తోంది.
సీ.
ఓయనురోదనం బోంకారమవునుగాఁ గనుగవనీరు మజ్జనముగాఁగ
నిడువాలుఁగన్నులు నీలోత్పలములుగా నెమ్మోము గ్రొత్తనెత్తమ్మిగాఁగఁ
గమ్మని నిట్టూర్పు గాడ్పు ధూమంబుగా దంతకాంతులు దీపతతులుగాఁగ
నధరోష్టమమృతోపహారంబుగాఁ బదాబ్జంబులఁ బడుట దండంబుగాఁగ
తే.
నవధరించెనొ కాక లోకైక విభుఁడు భక్తజనముల ముంగిటి పారిజాత
మేల యేడ్చెదు మానవే చాలుననుచు హస్తమస్తక సంయోగ మాచరించి
(శ్రీకాళహస్తి మాహాత్మ్యము 1-51)
శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో రాజుచేత శిక్షించబడిన దాసిని శివుడు అనుగ్రహించే సన్నివేశంలోది ఈ పద్యం. రాజు శిరోముండనము చేయించగా ఆ శివభక్తురాలు సిగ్గుతో ఇల్లు చేరి కాళహస్తీశ్వరుని స్మరిస్తూ రోదించే సన్నివేశం. ఓ అంటూ ఏడ్చే ఆమె ఏడుపునే ఓంకారంగా, కన్నీటిని అభిషేకంగా, ఆమె వాలుకన్నులనే నల్లకలువలుగా, నిట్టూర్పును ధూపంగా, ఆమె దంతముల కాంతిని దీపాలుగా, పెదవులను పంచామృతంగా, పాదాలపై పడడమే నమస్కారముగా భావించి శివుడు ఆమెను అనుగ్రహించాడన్న వర్ణన.
భగవంతుని స్మరించినపుడు, దర్శించినపుడు భక్తుడు పొందే ఆనందాన్ని కవులు ఎన్ని రకాలుగా వర్ణించారో ఈ పద్యాలు తెలియ చేస్తున్నాయి. భక్తిరసాభివ్యక్తికి కావలసిన సామగ్రి విషయంలో కవులకు ఎటువంటి లోటూ లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
6.2 సారాంశము
విమర్శకులచే పరిశోధకులచే భక్తిరసపూరితాలుగా పరిగణించబడిన, ఆదరించబడిన భాగవతం, శ్రీకాళహస్తి మాహాత్మ్యం, పాండురంగ మాహాత్మ్యం వంటి కావ్యాలను పరిశీలించడం ద్వారా ఈ క్రింది విషయాలను గ్రహించడం జరిగింది.
- గుణములు అలంకారముల విషయంలో అలంకారశాస్త్రాలు శృంగార శాంతరసాలకు చెప్పిన నియమాలు భక్తిరసపోషణకు వర్తించవు.
- శృంగార శాంతరసాలకు ఓజస్వి అయిన రచన ప్రతికూలమని అలంకారశాస్త్రాలు చెప్తుండగా భక్తిరసానికి అది అత్యంత అనుకూలమని తమతమ కావ్యాలలో ఓజోమయమైన ఛందస్సును, అక్షరాలను విరివిగా వాడడం ద్వారా కవులు నిరూపించారు.
- శృంగారరసానికి ప్రతికూలమని చెప్పబడిన శబ్దాలంకారాలు భక్తిరసపోషణకు కీలకమని కవులు చూపారు. విమర్శకులూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
- ఇతివృత్తం ఏదైనా భక్తిరసానికే ప్రత్యేకమైన కొన్ని అంశాలను చేర్చడం ద్వారా పోతనవంటి కవులు ఆయా సన్నివేశాలను భక్తిరసపూరితం చేయగలిగారు.
- అర్థాలంకారాల ప్రయోగంలో, విభావాదుల వర్ణనలో భక్తిరసపోషణకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్న విషయం స్థూలపరిశీలనకు గోచరిస్తున్నది. అలాగే తరచుగా పునరుక్తిని ప్రయోగించడం కూడా భక్తికవిత్వానికి ప్రత్యేకమైన ఒక లక్షణంగా కనిపిస్తున్నది. లోతయిన, విస్తృతమైన పరిశోధనల ద్వారా భక్తిరస విశిష్టతకు సంబంధించి మరిన్ని విషయాలను వెలికితెచ్చే అవకాశమున్నది.
- ఈ పరిశోధనకు ఎన్నుకున్న ఊహాప్రతిపాదనలోని రెండు అంశాల పట్లా – భక్తికి రసపుష్టి ఉన్నదన్న విషయము, దానిని శృంగార శాంత రసాలలో అంతర్భాగంగా చూడలేమన్న విషయము – స్పష్టత వచ్చింది. “భక్తి శృంగారాది రసములలో అంతర్భవించని ఒక విభిన్న రసము” అన్న ప్రతిపాదనను స్వీకరించవచ్చునన్న విషయం నిర్ధారణ అయింది.
(సశేషం)
శ్రీ వల్లీ రాధిక చక్కని కథా రచయిత్రి. లోతైన తాత్వికతకు నిత్య జీవితంలోని సంఘటనల ద్వారా సరళంగా ప్రదర్శిస్తారు. ‘తక్కువేమి మనకూ’, ‘స్వయం ప్రకాశం’, ‘హేలగా… ఆనంద డోలగా..’ వీరి పేరుపొందిన కథల సంపుటాలు.

