Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-24

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 7 – రెండవ భాగం

భక్తి – రసప్రతిపత్తి

3. అగస్త్యుడు

అగస్త్యుని గురించి చెప్పే భాగంలో కూడా పెద్దగా కథ ఏమీ ఉండదు కానీ చాలా చాలా అందమైన పద్యాలున్నాయి. కాశీని వదిలి భార్య లోపాముద్రతో కలిసి దక్షిణాదికి ప్రయాణించిన అగస్త్యుడు దారిలోని క్షేత్రాలను సందర్శిస్తూ శ్రీకాళహస్తిని చేరుకుంటాడు. శ్రీకాళహస్తిలో నది లేకపోవడం లోటుగా భావించి, తపస్సు చేసి, శివుని శిరసులోని గంగను శ్రీకాళహస్తికి దింపుతాడు. అదే సువర్ణముఖీ నది.

శ్రీకాళహస్తిని చూసినప్పటి అగస్త్యుని ఆనందాన్ని వర్ణించే పద్యాలూ, శ్రీకాళహస్తి గొప్పదనాన్ని చెప్పే పద్యాలూ ఈ కథలో ఎన్నో ఉన్నాయి. అన్నీ భక్తిరసాత్మకాలే అయినా ఒకటి రెండు ఉదాహరణలు చూపుతున్నాను.

క.
డగ్గఱి పెనఁగొను దురితపుఁ
బగ్గములఁ ద్రెంచివైచి ప్రమదాశ్రుతతుల్
దృగ్గోళంబులఁ దొరఁగఁగ
డగ్గుత్తికతోడఁ దనదు దయితయుఁ దానున్ (1-111)

శా.
కాంచెన్ వంచితపాంచభౌతిక సుఖాకారాంగమున్, జిన్నటీ
సంచారాంచిత రంగమున్, మునిమనస్సమ్యక్పరిష్వంగమున్
బంచాస్త్రానుమరుద్భుజంగము, కృపాపాణింధమాపాంగమున్
బ్రాంచన్ముక్తికళత్రసంగము, ఫణారాజన్మహాలింగమున్ (1-112)

“పెనవేసుకున్న పాపములనే త్రాళ్ళను త్రెంచివేసి, ఆనందబాష్పాలు కన్నుల నుండి జాలువారుతుండగా, గద్గద స్వరంతో” తన భార్యతో కలిసి శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని దర్శించిన అగస్త్యుడిని మొదటిపద్యం చూపిస్తోంది.

అగస్త్యుడు చూసిన శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని రెండో పద్యం వివరిస్తోంది. “పాంచభౌతిక సుఖాలకు అతీతమైన దేహము కలది, జ్ఞానమనే నటి యొక్క సంచారానికి చక్కని రంగభూమి వంటిది, మునుల హృదయముల సాంగత్యము కలది, మన్మథుని ప్రాణములనే వాయువులకు సర్పము వంటిది, దయను ప్రసరింపచేసే కడకన్నుల చూపులు కలది, మోక్షమనే భార్య కలయిక కలది, పాము పడగలచే ప్రకాశిస్తున్నదీ అయిన గొప్ప శివలింగం” శ్రీకాళహస్తీశ్వర లింగం.

శివుడి పెళ్ళికి అందరూ ఉత్తరానికి వెళ్ళడంతో బరువు ఎక్కువై ఉత్తరం కుంగుతుంది. దక్షిణం పైకి లేస్తుంది. దానిని సరిచేయడం కోసం అగస్త్యుడిని శివుడు దక్షిణానికి వెళ్ళమని చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది. కథారంభంలో శివుడు పలికే వాక్యమే భగవద్రతిని అంకురింపచేసేలా ఉంటుంది. ఊరికే దక్షిణానికి వెళ్ళు అని ఆజ్ఞాపించినట్లుగా కాకుండా, “ఇది మాన్ప నీవైన నేనైనఁ గాని సమర్థులం” కాబట్టి నువు దక్షిణానికి వెళ్ళమని చెప్తాడు శివుడు అగస్త్యునితో. శివుడంతటివాడు భక్తుడిని తనతో సమానంగా చూడడాన్ని, ఒక స్నేహితునిలా మాట్లాడడాన్ని గమనిస్తే, ఆయనపై కథలోని అగస్త్యునికే కాదు, కథ చదువుతున్న పాఠకునికీ ఇష్టం కలిగి తీరుతుంది. కనుకనే అగస్త్యుడు దక్షిణాదికి వచ్చి శ్రీశైలాన్ని, సిద్ధవటాన్ని దర్శించుకుని, శ్రీకాళహస్తిలోకి ప్రవేశించే సమయానికి పాఠకుడికీ అగస్త్యుడు పొందే ఆనందంతో తాదాత్మ్యం కలుగుతుంది. శ్రీకాళహస్తిని చూడడంతోనే కళ్ళ నుండి ఆనందబాష్పాలు జాలువారడం, గొంతు గద్గదమవడంతో మొదలయిన వర్ణన ఆ తర్వాత చాలా వివరంగా సాగుతుంది.

క.
కాంచి వధూయుతుఁడై పులకాంచితదేహమునఁ బ్రణతుఁడై ధ్యానించెన్
గించిన్ముకుళిత నయనయుగాంచలుఁడై మౌని దర్శనానందముతోన్

సీ.
అర్చించె శివుని సహస్రనామంబుల వివిధ వాక్ప్రౌడి గావించె నుతులు
సేసెఁ బెక్కులు ప్రదక్షిణములు జపియించె బంచాక్షరంబు సప్రణవముగను
ధ్యాననిష్టాబుద్ధి మౌనముద్ర వహించె,నానందపరవశుండయ్యెఁ బిదపఁ
దలఁగి పోఁజాలక నిలిచి చూచుచు నుండెఁ దలయూఁచి వెరఁగందెఁ దనకుఁదానె

పులకించే దేహంతో నమస్కరించడం, అర్ధనిమీలిత నయనాలతో ధ్యానించడం, సహస్రనామాలతో శివుని అర్చించడం, స్తుతించడం, ప్రదక్షిణాలు చేయడం, పంచాక్షరిని ప్రణవసహితంగా జపించడం, ఆనంద పారవశ్యంతో మౌనంగా అయిపోవడం, అక్కడినుంచి కదలలేక పోవడం, ఆశ్చర్యంతో తల పంకిస్తూ నిలబడిపోవడం – ఇలా అనుభావాలన్నీ వివరంగా చెప్పబడతాయి.

ఇంకా దుర్గాంబ కొండ నెక్కడం, ఆమె పాదాలకు మ్రొక్కడం, ఆ దివ్యరూపాన్ని చూసి పరవశించడం, గణపతినీ, భైరవుడినీ దర్శించుకోవడం వంటి చర్యలన్నీ వివరించబడతాయి. ఈశ్వరుని హృదయపీఠాసనాసీనుడిని చేసి “ధైర్యంబునన్” తపసు మొదలుపెట్టాక వివిధ ఋతువులలో అగస్త్యుని తపస్సు ఎలా సాగిందో చెప్పే చక్కని వర్ణనలు; ఆతపస్సు చూసి భయపడి దేవతలు శివుడిని ఆశ్రయించడం; శివుడు దరహాసం చేసి భయపడనవసరం లేదనీ అగస్త్యుని తపస్సు ఆకాశగంగ కోసమనీ చెప్పే సన్నివేశం; అగస్త్యుని తపస్సు ఫలితంగా భూమి పైకి వచ్చిన సువర్ణముఖీ నది యోగి వలె, శివుని వలె ఉందని చెప్పే పోలికలు; అలాగే కాళహస్తిలోని మునులు; శ్రీకాళహస్తి మహిమను గురించి అగస్త్యునితో వారి సంభాషణలు ఉద్దీపన విభావాలు.

ఈ కథలో భగవద్రతికి సంబంధించిన అనుభావాలను ఒకచోట కాదు అనేక పద్యాలలో మళ్ళీ మళ్ళీ చెప్తారు. కథ మొదట్లో శ్రీకాళహస్తిని దర్శిచుకోవడం ఉంటుంది. తపస్సు చేయడం, సువర్ణముఖీ నదిని తేవడం అయ్యాక మరలా కథ చివర్లో కూడా అగస్త్యుడూ లోపాముద్రా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించి పరవశించే సన్నివేశం ఉంటుంది.

అక్కడ అగస్త్యుడూ, లోపాముద్రా విభూతిని రుద్రాక్షలను ధరించి, అత్యంత శాంతరూపులై, భక్తితో శ్రీకాళహస్తీశ్వర దివ్యలింగం దగ్గర నిలబడి, తాపసజనులందరూ ఓహో అని ప్రశంసిస్తుండగా, పంచేద్రియాలదారులలో తిరిగే మనసును శివుని మార్గంలో వెళ్ళమని బోధిస్తూ, ప్రాపంచిక సౌఖ్యాలను వదిలేసి పరమపరవశులవుతూ శివుని ధ్యానిస్తారు. శివుని స్తుతిస్తూ అగస్త్యుడు “దేహముప్పొంగగా” చక్కని దండకం చెప్తాడు. ఆనందమనే పాలసముద్రంలో ఓలలాడుతూ, నుదుటికి చేతులు జోడించి నమస్కరిస్తూ, లోపాముద్రతో కలిసి ఈశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తాడు. పదేపదే నమస్కరిస్తాడు. “కన్గొనల బాష్పోదకములు సోనలుగా కురుస్తుండగా” జ్ఞానప్రసూనాంబికను దర్శిస్తాడు. ఈ విధంగా కథ ఆసాంతమూ భక్తిరసానికి చెందిన అనుభావాలను పదేపదే చెప్తూ, భక్తిరసపోషకంగా నడుస్తుంది.

4. బ్రహ్మ

బ్రహ్మ తన పత్ని అయిన సరస్వతితో కలిసి సమయాసమయాలు పాటించకుండా యథేచ్ఛగా విహరించడం వలన వారికి ముప్పైవేలమంది రాక్షసులు సంతానంగా కలుగుతారు. ఆ రాక్షసులు వింధ్యపర్వత ప్రాంతంలో స్థిరపడి జనులందరినీ దారుణంగా హింసిస్తున్నపుడు భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకోవడం, అపుడు ఆయన తన కోపం నుండి పుట్టిన మరొక పుత్రుడిని, ఉగ్రుడనే వాడిని ఆ ముప్పైవేలమందినీ సంహరించమంటూ పంపడం, ఉగ్రుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తోబుట్టువులందరినీ సంహరించి వచ్చాక, పుత్రశోకంతో మండిపడుతూ బ్రహ్మ అతడి వైపు చూడటం వలన ఉగ్రుడు కూడా భస్మమవడం జరుగుతాయి. అపుడు బ్రహ్మ పుత్రహత్యాదోషాన్ని పోగొట్టుకోవడానికీ, మంచి పుత్రుడిని పొందడానికీ పార్వతీపతిని ప్రార్థించడమే మార్గమనుకుని శ్రీకాళహస్తికి చేరుకుంటాడు. శ్రీకాళహస్తిక్షేత్ర దర్శన మాత్రంతో పాపాన్ని పోగొట్టుకుంటాడు. శ్రీకాళహస్తీశ్వరుడతనికి పుత్రుడిని ప్రసాదించి, ఆ పుత్రుడికి ఋభుడనే పేరుపెట్టి, బ్రహ్మోపదేశం చేస్తాడు. ఇది స్థూలంగా కథ.

ఈ కథలో బ్రహ్మదేవుడు పార్వతీపతిని సేవించాలని నిశ్చయించుకుని కాళహస్తికి చేరడంతో కథలో భగవద్రతి ప్రవేశిస్తుంది. బ్రహ్మదేవుడు సరస్వతితో కలిసి హంసల రథంలో శ్రీకాళహస్తి చేరి సువర్ణముఖిలో స్నానంచేసి శ్రీకాళహస్తీశ్వరుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకుంటాడు. పద్మాసనంలో కూర్చుని, హృదయకమలంలో పరమేశ్వరుని చరణకమలాలను నిలుపుకుని, పంచేంద్రియ సుఖాలను వదిలి పెట్టి, కందమూలాలు తింటూ కొన్నాళ్ళు, నీరు మాత్రమే త్రాగుతూ కొన్నాళ్ళు, గాలిమాత్రమే పీలుస్తూ కొన్నాళ్ళు ఉపవాస నిష్ఠతో ఉంటూ శివుడ్ని సేవిస్తాడు. భయంకరమైన గాలులలో వర్షంలో చలిలో గుండె ధైర్యం చెదరనీయకుండా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తాడు.

బ్రహ్మదేవుని ఈ చర్యలన్నీ భగవద్రతికి అనుభావాలు. పాపాన్ని పోగొట్టుకోవడానికీ, సత్పుత్రుడిని పొందడానికీ శివుడ్ని పూజించడమే మార్గమని నిశ్చయించుకోవడంలోను, భయంకర పరిస్థితులలో కూడా గుండెదిటవుతో శివునికై తపస్సు చేయడంలోను మతి, ధృతి వంటి సంచారిభావాలు కనిపిస్తాయి. ఇక ఆయన తపస్సుకు సువర్ణముఖీ జలాలు, యాగాగ్నులు, అడవిలోని నెమళ్ళు, పాములు కూడా సహకరించాయని చెప్పడం ఉద్దీపన. ఇక్కడ ఒక పద్యంలో బ్రహ్మదేవుని ఆశ్రమ వాతావరణాన్ని వర్ణించడం ద్వారా, “అజుని ఆశ్రమము శాంతరస రూపమయ్యెనపుడు” అనడం ద్వారా స్ఫురింపజేసే శాంతరసం భక్తికి పోషకమవుతుంది.

బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి శివుడు “కరుణాధారలు నేత్రకోణములవంకం జింద నానంద బంధురమై మానస ముబ్బఁగాఁ” ప్రత్యక్షమవుతాడు. ‘నీకేమి చేయను?’ అని అడుగుతాడు. అప్పుడు “భక్తి భాషానాథుండు ధరిత్రిఁ జాఁగిల నమస్కారంబు లర్పించుచున్, నానారీతుల సన్నుతించి నిటలన్యస్తాంజలిత్వంబునన్ మేనం గంపము రోమహర్షణము సమ్మిశ్రంబుగా నిట్లనున్” అంటూ బ్రహ్మదేవుడు శివునితో అన్న మాటలు చెప్తాడు కవి. “కంటికి కనిపిస్తున్న నీ రూపంలోని ఒక అంశాన్నయినా పూర్తిగా చూడటం అసాధ్యం. ఇక దృష్టికి అందని నీ చిదాకృతిని నేనెలా స్తుతించగలను? మౌనంగా ఉండటమే ధన్యత్వమని నా బుద్ధికి తోస్తోంది” అంటాడు బ్రహ్మ శివుడితో (2-77). నిన్ను వర్ణించడం అసాధ్యం అన్నమాటను భక్తులు పరమేశ్వరునితో చెప్పడం సాధారణమే. అయితే, ఇక్కడ ఆ మాట చెప్తున్నది సాక్షాత్తూ “భాషానాథుడు”. అదీ విశేషం. మామూలు భక్తులకే కాదు, భాషకు నాథుడైన బ్రహ్మకు కూడా ఈశ్వరుడిని వర్ణించి చెప్పడం అసాధ్యం! ఇలాంటి భావాలు భక్తిరసానికి గొప్ప పోషకాలు. అందుకే ఇటువంటి భావాలు భక్తికావ్యాలన్నిటిలోనూ కనిపిస్తుంటాయి. భాగవతంలో పోతనగారు “భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన” అంటారు కదా!

ఈ కథలో చివరికి పుత్రుడు కలిగాక బ్రహ్మ ఆనంద పరవశుడై ముక్తికాంతానాథుడైన గౌరీశుడిని నిర్మలమైన బుద్ధితో స్తుతిస్తే, ఆయన “అఖండ దయామండిత కటాక్షవీక్షణంబులతో” ప్రత్యక్షమై, బ్రహ్మ పుత్రుడికి ఋభువు అని పేరు పెట్టి బ్రహ్మోపదేశం చేస్తాడు.

ఈ సన్నివేశాలలో శివుని వైపు నుంచి చెప్పిన కంటి కొసల నుండి కరుణాధారలు చిందడం, మనసు పొంగడం వంటి అనుభావాలు; అలాగే బ్రహ్మదేవుని వైపు నుంచి చెప్పిన సాష్టాంగ నమస్కారం చేయడం, శరీరం రోమాంచితమవడం, వణకడం, జోడించిన చేతులు నుదుటికి చేర్చి స్తుతించడం వంటి అనుభావాలు భక్తిరసాన్ని చక్కగా పోషిస్తున్నాయి.

5. చెలఁది పురుగు

ఇది చాలా చిన్న కథ. దేవశిల్పి విశ్వకర్మ కుమారుడైన ఊర్ణనాభుడు బ్రహ్మ శాపం వలన ఒక సాలెపురుగుగా పుడతాడు. ఆ సాలెపురుగు కొండమీద ఉన్న శివలింగానికి ఎంతో శ్రమపడి తన దారాలతో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించడం, ఆ పురుగును పరీక్షించదలచిన శివుడు అక్కడ ఉన్న ఒక దీపపు సెగతో ఆ ఆలయమంతా కాలిపోయేలా చేయడం, బాధతో కోపంతో చెలఁది పురుగు ఆ దీపాన్ని మ్రింగబోగా శివుడు ప్రత్యక్షమవడం, సాలెపురుగు తనకు కైవల్యాన్ని ప్రసాదించమని అడగగా శివుడు దానిని తనలో ఐక్యం చేసుకోవడం కథ.

పాఠకుని ఊహకు పెద్దగా అవకాశం లేని వశిష్ఠుని కథలో, అగస్త్యుని కథలో చక్కని భావాలతో, ఊహలతో కూడిన పద్యాలను ఎక్కువగా వ్రాయడం ద్వారా భక్తిరస పోషణ చేసిన ధూర్జటి, ఈ కథలో ఒకటి రెండు పద్యాలతోనే పాఠకుని మనసులో ఎన్నో ఊహలు తీగలువారేలా, తద్వారా భగవద్రతి స్థాయిని పొందేలా చూశాడు.

సాలెపురుగు పూర్వజన్మ నుండి తెచ్చుకున్న శివభక్తితో, శిల్పకళా నైపుణ్యంతో ఆలయాన్ని ఎలా నిర్మించిందో ఒకే ఒక సీసపద్యంలో చెప్తాడు. ప్రాకారాలు, గోపురాలు, కొలువుకూటాలు, నర్తనమందిరాలు, ఆయతన వీధులు, పందిళ్ళు, భోగమంటపాలు, గర్భగృహము, కళ్యాణమంటపము మొదలైనవన్నీ నిర్మించిందనీ, వినాయకుడు, కుమారస్వామి, చండీశుడు, విష్ణువు, మాతృకా దేవతలు, దక్షిణామూర్తి, వటుకభైరవుడు మొదలైన వారందరికీ దేవాలయాలు అత్యంత నిష్ఠతో కట్టిందనీ చెప్తాడు. కేవలం జాబితానే ఏకరువు పెట్టినప్పటికీ, గొప్ప ఊహలూ వర్ణనలూ ఏమీ లేనప్పటికీ, ఈ పద్యం పాఠకుడికి ఒక చక్కని శివాలయంలో నడయాడిన అనుభూతినిస్తుంది.

ఆ తరువాతి పద్యంలో, ఆ కట్టడాలన్నీ ప్రభాత వేళలో మంచు బిందువులు పడడం వలన ముత్యాలతో కట్టిన వాటిలా, సూర్యకాంతి పడడం వలన రత్నాలతో కట్టిన వాటిలా కనిపిస్తున్నాయన్న ఒకే ఒక వర్ణన ఉంటుంది, అంతే. కానీ ఆ ఒక్క వర్ణననూ, ముందరి పద్యంలో ఇచ్చిన జాబితానూ ఆధారం చేసుకుని పాఠకుడు తన ఊహాబలమే హద్దుగా ఆ ఆలయ సౌందర్యాన్ని ఎంతయినా ఊహించుకోగలుగుతాడు.

అలా కట్టిన ఆ ఆలయంలో గాలికి తెగిపోయే, జారిపోయే దారాలను మళ్ళీ మళ్ళీ సరిచేస్తూ జీవితమంతా అదే పనిగా ఆ సాలెపురుగు గడుపుతోందన్నపుడు, ఆ పురుగు పడే శ్రమ ఎలాంటిదో, అది చేస్తున్న తపము ఎంతటిదో ఎటువంటి పాఠకుడికైనా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. తద్వారా ఆ శ్రమకు మూలమైన సాలెపురుగు భక్తి కూడా పాఠకుని మనసుకు అందుతుంది. ఇక ఆ పురుగును పరీక్షించదలచిన శివుడు అది ప్రాణం తీసుకోబోగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ప్రత్యక్షమవుతాడు. “దేవోత్తంసుడు, భక్తవత్సలుడు, గౌరీవామాంగుడు అయిన శంకరుడు దయ అతిశయిల్లగా ఆ పురుగును అరచేత పట్టుకుని నీకేమి కావాలో అడుగు అంటాడు” అని చెప్తాడు కవి ఇక్కడ (2-118). అప్పుడు చెలదిపురుగు “ప్రమథపతికిఁ బ్రణామంబులు పెక్కు సేసి సంభ్రమ కలిత హృదయమగుచు భక్తి గడలు కొనంగన్”

శా.
దేవా! నిన్ను నుతింపలే నధమబుద్ధిన్ వేదశాస్త్రంబులున్
రావేపాటియు వచ్చినన్ శ్రుతులు శాస్త్రంబు ల్నినుం జెప్పగా
లేవాద్యంతము లన్నఁ దద్విధులకున్ లెక్కింపఁగా శక్యమే,
సేవాధర్మము మేలుగాకనుచు నీ శ్రీపాదముల్గొలిచితిన్

అని చెప్పి, కైవల్యాన్ని కోరుకుంటుంది. సంభ్రమాన్ని పొందడం, పలుమార్లు నమస్కరించడం వంటి అనుభావాలు ఇక్కడ కనబడతాయి.

మోక్షానందం కొందరి సొత్తు మాత్రమే కాదనీ, భగవద్రతి ఉంటే ఒక చిన్న పురుగు కూడా కైవల్యాన్ని పొందగలదనీ చెప్పే ఈ కథలోనే భక్తికి రసస్థాయినివ్వగల బలం ఉంది. “దేవా, నేను అధమబుద్దిని, నిన్ను స్తుతించలేను, నాకు వేదశాస్త్రాలు రావు, అందుకే నీకు సేవ చేయడమే మేలు అనుకుని నీ పాదాలను కొలుచుకున్నాను” అని సాలెపురుగుతో చెప్పించడం ద్వారా, దానిని చూసి దేవతలు, మునులు, యోగులు, వేదశాస్త్రవిదులు తమ పూజలను, తపస్సులను, పుట్టుకలను, ప్రయత్నాలను తిట్టుకున్నారనీ, సిగ్గుపడ్డారనీ చెప్పడం ద్వారా కవి ఆభావాన్ని అతిశయింప చేశాడు.

దేవతలు, మునీశ్వరులు, రాక్షసులు, మానవులు చేసే స్తుతులతో ధృవమండలవీధి నిండిపోగా శివుడు దిక్కులను క్రమ్మేసిన తన కాంతిలో ఆ సాలెపురుగును “భక్తిలోలత”తో “గ్రక్కున” కలుపుకుంటాడు. చివరి పద్యంలోని “దిక్కులు ముంచుకొన్న తన తేజములోపల నూర్ణనాభమున్ గ్రక్కునఁ గూర్చెఁ దన్మయముగా శివలింగము భక్తిలోలతన్” అన్న వాక్యం అత్యంత భక్తిరసాత్మకం. భక్తిలోలతన్, గ్రక్కున గూర్చెఁ వంటి మాటలు భక్తులపై శివునికి ఉండే అవ్యాజమైన ప్రేమను బలంగా తెలియచేసే పదాలు.

6. కాళహస్తులు

పూర్వజన్మ నుంచీ భక్తిని కొనితెచ్చుకున్న ఒక ఏనుగు, ఒక పాము కాళహస్తీశ్వరుని సేవ కోసం పోటీ పడే కథ ఇది. ఒకరోజు పాము పాతాళ లోకం నుంచి తెచ్చిన విలువైన మణులతో ఈశ్వరుని అర్చించి వెళ్ళగానే ఏనుగు వస్తుంది. దానికి ఆ పూజ నచ్చదు. ఆమణులన్నిటినీ తీసేసి, తాను తొండంతో తెచ్చిన సువర్ణముఖీ జలాలతో శివుడిని అభిషేకించి, మారేడు కొమ్మలతో, తామరపూలతో కలువ పూలతో అలంకరిస్తుంది.

మరునాడు పొద్దున పాము వచ్చి, “విలువైన మణులను తొలగించి ఈ ముళ్ళకంపలూ తీగలూ పెట్టిన మూర్ఖుడెవడు?” అని బాధపడి, ఏనుగు పెట్టినవాటిని తీసేసి మరలా తాను మణులతో పూజిస్తుంది. ఆ తర్వాత ఏనుగు వచ్చి, శివుని మీద రాళ్ళూ రప్పలూ పెట్టడమేమిటని బాధపడి, మణులను తొలగించి పూలూ బిల్వదళాలతో పూజిస్తుంది. ఈ విధంగా రెండు మూడు రోజులు గడిచాక తమ పూజను ఎవరో పాడు చేస్తున్నందుకు రెండు ప్రాణులూ బాధపడి, రాత్రంతా నిద్రలేకుండా గడిపి, విషయమేమిటో తేల్చుకోవడానికి సిద్ధపడి శివుని దగ్గరకు వస్తాయి.

ముందుగా వచ్చిన పాము బిల్వదళాలలో దాగి ఉండి, ఏనుగు వచ్చి తొండంతో నిర్మాల్యాన్ని తొలగించబోయినపుడు తొండం ద్వారా దాని కుంభస్థలాన్ని చేరి యమయాతన పెడుతుంది. మరణం తప్పదని అర్థమయిన ఏనుగు చనిపోయే ముందు శత్రువునీ చంపాలనుకుని వేగంగా వెళ్ళి కొండని ఢీకొంటుంది. కుంభస్థలం చితికి ఏనుగూ పామూ కూడా మరణిస్తాయి. ఈశ్వరుడు ప్రత్యక్షమై వారిద్దరికీ సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడు.

ఈ కథలో ఏనుగూ సర్పమూ చేసిన పూజలనూ, వారి భక్తినీ వివరంగా చెప్తాడు ధూర్జటి. మొగలేటిలోకి దిగీ; కానలు కొలనులు కలయ తిరిగీ; మారేడు కొమ్మలు, తామరపూలు, కలువపూలు తేవడం; తొండంతో తెచ్చిన నీటితో శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేయడం ఏనుగు చేసే సేవలుగా వర్ణిస్తారు. అలాగే తాను పెట్టిన మణులను ఎవరో తీసివేయడం చూసి “ఎవరో నా పూజంతా చెదరగొట్టి ఈ కొమ్మలూ తామరతూడులు తెచ్చి పెడితే శంకరుడు ఊరుకున్నాడు కదా, దైవం కూడా పగవారిలో కలిసిపోయాడు కదా!” అని దుఃఖించడం, శివుడ్ని సాధించడం, చివరికి మనసు చిక్కబట్టుకుని శివార్చన చేయాలనుకోవడం, శివలింగంపైనున్న దుమ్ముని భుస్సున ఊదడం, రత్నాలతో పూజించడం పామును గూర్చిన వర్ణనలు.

ఈ రకమైన అనుభావాలతోను; అసూయ, చింత, ఉగ్రత వంటి సంచారిభావాలతోను భక్తిరసపోషణ జరుగుతుంది ఈ కథలో. శివుడిని పూజించాలనే కోరిక, తమ పూజను ఎవరో భగ్నం చేస్తున్నారన్న కోపం, దానిని శివుడు అంగీకరించి ఊరుకుంటున్నాడన్న బాధ, అసూయ, “వాడో నేనో తేల్చుకుంటాను” అనుకునే ఉగ్రత – ఈ సంచారిభావాలన్నీ సర్పము వైపు నుంచీ ఏనుగు వైపు నుంచీ కూడా చక్కగా వర్ణించబడినాయి.

తన పూజను పాడు చేస్తున్న దుర్మార్గులెవరో మర్నాడు ఎలాగైనా కనిపెట్టాలని ఎవరికి వారు నిర్ణయించుకుని వెళ్ళాక పాముకు భార్యలతో జలక్రీడలు లేవు, భోజనం లేదు, సంగీతాన్ని ఆస్వాదించడం లేదు, “నిద్ర వోయెడు సుఖమెల్ల నేలఁ గలిపి” ఆ రాత్రి శివరాత్రిగా జాగరం చేస్తుందది. అటు ఏనుగు కూడా ఆడ ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఆనందించడం, తొండంతో నీళ్ళు చల్లుకుని తాపం తీర్చుకోవడం, సరసులో దిగి తామరతూళ్ళు నమిలి ఆకలి తీర్చుకోవడం, సింహాలు గర్జిస్తే భయపడడం – ఇవేవీ లేకుండా మర్నాడు ఏం చేయాలన్న ఆలోచనతో ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తాడు అని ఎదురుచూపుతో ఆ రోజంతా గడుపుతుంది.

అనుభావాలు, సంచారిభావాలే కాక ఈ కథలోని అలంకారాలు వర్ణనలు కూడా చాలా భక్తిరసాత్మకంగా ఉంటాయి. వ్యాజస్తుతి భక్తిరసపోషణకు దోహదం చేసే ఒక ముఖ్యమైన అలంకారం. ఈ కథలో మూడు నాలుగు వ్యాజస్తుతి పద్యాలున్నాయి. అటు సర్పము, ఇటు ఏనుగు కూడా శివుడు అవతలివారి పూజను అంగీకరించినందుకు నిష్టూరాలాడతాయి.

ఉ.
కంటక మెట్లునాక సుముఖత్వము నొందితి వయ్య పార్వతీ
కంటకితాంగ బాహులతికాయుగ సంగతిఁ బోలె దుఃఖకృ
త్కంటక బిల్వికాకమల కాండము లెత్తిన మోచిమోచి ము
క్కంటి! యెఱుంగవే నొసలి కంటి మహత్త్వము నీకుఁ గల్గుటన్

“ఈ ముళ్ళకొమ్మలు పెడితే ఎలా ఊరుకున్నావు? పులకించిన పార్వతీదేవి చేతులనుకున్నావా? నీకు మూడోకన్ను ఉందని మర్చిపోయావా?” అని పాము సాధిస్తుంది.

ఉ.
అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వరేకులే?
బచ్చనిరాలు బిల్వనవపత్రములే? యరుణాశ్మభంగముల్
విచ్చిన యెఱ్ఱదామరలె? విశ్వపతీ! విరసోపలంబు లె
ట్లచ్చుదలయ్యె? నీకు నవి యందునె గంధ మృదుత్వ శైత్యముల్?

“ఈ నీలం రాళ్ళు నల్లకలువలా! పచ్చరాళ్ళు మారేడుదళాలా! ఎర్రనిరాళ్ళు ఎర్రతామరలా! ఇవెలా నచ్చాయి నీకు? వీటికేమయినా సువాసనా, మెత్తదనమా, చల్లదనమా?” అని ఏనుగు నిలదీస్తుంది. “అవునులే, నువు ఉండేది కొండమీద, నీ భార్య కొండలరాజు కూతురు. నీ విల్లు ఒక కొండ, నీకు ఈ రాళ్ళే నచ్చుతాయిలే” అని నిష్ఠూరమాడుతుంది.

చంద్రోదయవర్ణనకి సంబంధించిన ధూర్జటి ప్రసిద్ధ పద్యం “ఉదయగ్రావము పానవట్ట మభిషేకోదప్రవాహంబు వార్ధి” కూడా ఈ కథలోనే ఉంటుంది. తూరుపుకొండ పానవట్టంగా, సముద్రం శివుని అభిషేకించిన జలంలా, ఆవరించిన చీకటి ధూపపు పొగగా, వెన్నెల దీపపుకాంతిగా, నక్షత్రాలు పూజాకుసుమాలుగా, తూర్పున ఉదయిస్తున్న చంద్రుడు తమస్సును దూరం చేసే శివుడిలా కనిపించారు కవికి. భక్తిరసార్ద్రమయిన కవి హృదయంలో నుంచి వచ్చే ఇటువంటి వర్ణనలు పాఠకుల హృదయాలలోకి ఎటువంటి విఘ్నాలూ లేకుండా సూటిగా చేరతాయి. అక్కడ భక్తిరసానందం పొంగేలా చేస్తాయి.

(సశేషం)

Exit mobile version