Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-25

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 7 – మూడవ భాగం

భక్తి – రసప్రతిపత్తి

7. తిన్నడు

బోయపల్లెలోని నాయకుడికి తిన్నడు పుట్టడం, ఆటలాడడం, విలువిద్యనభ్యసించడం, ఒకరోజు వేటలో అలసిపోయి పొగడచెట్టుక్రింద నిద్రిస్తున్నపుడు కలలో శివుడు కనిపించడం, ఈ దగ్గరలో వటవృక్షం క్రింద పార్వతీవల్లభుడు ఉన్నాడు సేవించమని చెప్పడం, అప్పుడే ఒక అడవిపంది వచ్చి తిన్నడిని పరుగులు పెట్టించి ఆ శివలింగం వద్దకు చేర్చడం, ఆ శివలింగాన్ని చూసి పులకించిపోయిన తిన్నడు మావూరికి రమ్మంటూ ఎన్నో ఆశలు చూపిస్తూ బ్రతిమలాడడం, నువు రాకపోతే నేను కూడా వెళ్ళనంటూ అక్కడే ఉండిపోయి శివునికి తనకి తోచిన రీతిలో ఎంగిలి నీళ్ళతో అభిషేకాలు చేస్తూ, మాంసాల వంటివి నైవేద్యంగా పెడుతూ పూజించడం, శివుడు ఆనందంగా పరమాదరంగా ఆ సేవలన్నిటినీ స్వీకరించడం – ఇటువంటి సన్నివేశాలు ఉంటాయి ఈ కథలో. ఇవన్నీ అయ్యాక, చివరి సన్నివేశంలో మరొక భక్తుడైన శివగోచరుడనే బ్రాహ్మణుడికి తిన్నని భక్తి ఎంతటిదో చూపుతానంటాడు శివుడు. తిన్నడు రాగానే కంటి నుంచి నీరు కారుస్తాడు. అది చూసి కలవరపడిన తిన్నడు తనకి తెలిసిన చికిత్సలన్నీ చేస్తాడు. అవేవీ పని చేయకపోగా శివుని కన్ను నుంచి రక్తం కారడం మొదలవడంతో, తిన్నడు తన కన్నే తీసి శివుడికి పెడతాడు. ఆ తర్వాత రెండో కంటి నుంచి కూడా శివుడు కన్నీరు కారిస్తే, రెండో కన్నునూ తీసేందుకు సిద్ధమవుతాడు. చెప్పుకాలును శివుని కంటి దగ్గర గుర్తుగా పెట్టుకుని, తిన్నడు బాణంతో తన రెండవకన్నును తీసుకోబోతున్నపుడు దయ పెల్లుబుకగా శివుడు “నిలువు, నిలువు” అని అరుస్తూ ప్రత్యక్షమవుతాడు. అటుపైన తిన్ననికీ, శివగోచరునికీ కూడా సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడు.

ఈ కథ మొదట్లోనే తిన్నని తల్లి తండ్రులను పరిచయం చేసేటపుడే, తండ్రి నాథనాథుడు శివుడే ఎఱుకల రాజై వచ్చినట్లుగాను, తల్లి తందె గౌరీదేవియే చెంచువనితగా మారినట్లుగాను ఉన్నారన్న వర్ణన ఉంటుంది. ఆ తర్వాత తిన్నని జననం గురించి చెప్పే పద్యాలన్నీ భగవద్రతిని ఉద్దీపింపచేసే విధంగా నడుస్తాయి.

తిన్నడు కడుపులో ఉండగా తందెకు కొండల దగ్గర పారే నదీ సైకత స్థలాలలో ఉన్న శివుడిని చూడాలనిపించేదట. పుక్కిట బట్టిన నీటితో చంద్రశేఖరుడిని అభిషేకించాలనిపించేదట. రుచిగల పందిమాంసాన్ని దొప్పల్లో పెట్టి శంకరుడికి అర్పించాలనిపించేదట. నల్లకలువల లాంటి కళ్ళతో నీలకంఠుడిని పూజించాలనిపించేదట. ఇక పిల్లవాడు పుట్టడమే శివభక్తిని వెంట తెచ్చుకున్నట్లుగా పుట్టాడట. పసిబిడ్డ కళ్ళుమూసుకుని ఉండటాన్ని జ్ఞానప్రసూనాంబా వల్లభుడి చరణాలను ధ్యానించడంగా, కాళ్ళు విదల్చడాన్ని మోహబంధాలను తన్నడంగా అభివర్ణిస్తాడు ధూర్జటి.

ఈ రకంగా కథలో ప్రతీవాక్యమూ భగవద్రతిని ఉద్దీపింప చేసే తీరులో సాగుతుంది. ఆ తర్వాత తిన్నడి ఆటపాటలు, విలువిద్యాభ్యాసం, శబరుల ఆచారాల వంటి కొన్ని విషయాల తర్వాత తిన్నడికి కలలో స్వామి కనబడి “మొగలేటి ఒడ్డున వటవృక్షం క్రింద భక్తులపాలిటి పెన్నిధి అయిన శైలసుతాపతి ఉన్నాడు, కొలుచుకో” అని చెప్పడంతో మళ్ళీ భక్తిధార మొదలవుతుంది.

తే.
కాంచి రోమాంచకంచుకోదంచితాంగుఁ
డగుచు నానంద భాష్పంబు లతిశయిల్ల
నమ్మహాలింగమునకు సాష్టాంగనతులు
సేసి ముకుళితహస్తుఁడై చేరఁబోయి (3-64)

ఇది మొదటిసారి కాళహస్తీశ్వరుని చూసినప్పటి తిన్నడిని వర్ణించే పద్యం. శరీరం పులకించడం, ఆనందబాష్పాలతో కళ్ళు నిండడం, సాష్టాంగ నమస్కారాలు చేయడం, చేతులు జోడించి దగ్గరికి వెళ్ళడం వంటి సాత్త్వికభావాలు, అనుభావాలు ఇందులో వర్ణించబడినాయి. ఆ తర్వాత శివుడ్ని తనతో రమ్మని తిన్నడు బ్రతిమలాడడం, శివుడు వస్తేనే తాను కూడా పల్లెకు తిరిగి వస్తానని లేదా “ఏవంక నభవుఁ డుండిన నావంకనె తోడునీడయై వసియింతున్” అనడం మొదలైనవన్నీ సంచారిభావాలు.

శా.
నాకుం జుట్టముఁ దల్లిదండ్రులు జెలుల్నాథుండు నీ దైవమే
మీకిచ్చోఁ బనిలేదు కస్తిపడఁగా మీపల్లెకుం బొండు, కా
రాకూరంబులు చేసినం గదలి నే రానిచ్చటం బ్రాణముల్
పోకార్తుం దుది నాదువేలుపునకై బొంక న్నిజం బింతయున్ (3-82)

“నాకు తల్లిదండ్రులు, చుట్టము, స్నేహితులు, స్వామి అన్నీ ఈ దైవమే. మీకిక్కడ పనిలేదు. బాధపడవలసిన అవసరం లేదు. పల్లెకు వెళ్ళండి. బలవంతపెట్టినా నేనిక్కడినుంచి కదిలి రాను. ఇక్కడే నా ఈ స్వామి కోసమే ప్రాణాలు ఇచ్చేస్తాను. ఇది అబద్ధం కాదు” అని కచ్చితంగా చెప్పే తిన్నడి ధృఢభక్తిని తెలిపే పద్యం ఇది. ఔత్సుక్యము, ధృతి వంటి సంచారిభావాలు ఇక్కడ కనిపిస్తాయి.

ఆపైన శివుడితో తిన్నడు చేసే సంభాషణలు, సేవలు, తాను తెచ్చి పెట్టినవన్నీ తినమని శివుడిని అడగడం, చివర్లో శివుని కంటి నుండి నీరు కారడం చూసి కంగారు పడడం, బాధపడడం, చికిత్స చేసేందుకు ప్రయత్నించడం, చికిత్స ఏమిటో తెలిసిపోయిందని సంతోషించడం – ఈ సన్నివేశాలన్నీ విషాదము, వితర్కము, హర్షము మొదలైన సంచారిభావాలతో నిండి ఉండి భక్తిరసానికి పుష్టినిస్తాయి.

అలాగే తిన్నడు కరుకుట్లు పెట్టి శివుడు అవి తినడం లేదని ఏడవసాగినపుడు, శివుడు అతని ఏడుపు ఆపి, “తినియెద లేలె”మ్మనడం, శివలింగం ఉన్న ప్రాంతమంతా అపరిశుభ్రం కావడాన్ని చూసి బాధపడి శివగోచరుడు చేసే నిందాస్తుతి, “చెంచొకడు శ్రుతివ్యవహారేతర పద్ధతిలో మహాభక్తితో కొలిస్తే దయపుట్టి అతని పూజను స్వీకరించాను” అంటూ శివుడు అతనికి నచ్చచెప్పడం, తిన్నడి భక్తిని శివగోచరుడికి చూపించాలనుకోవడం, తిన్నడికి పరీక్ష పెట్టి అతను రెండవ కన్ను తీసుకోబోయినపు, ఆగాగమంటూ శివుడు ప్రత్యక్షమవడం – మొదలైన సన్నివేశాలలో దుఃఖం, సంతోషం, జుగుప్స, విస్మయం, కరుణ వంటి మరెన్నో సంచారిభావాలు భక్తిరసానికి పోషకాలుగా నిర్వహించబడినాయి.

8. నత్కీరుడు

ఒకసారి మధురానగరంలో తీవ్ర దుర్భిక్షం వస్తుంది. అపుడు ఆ నగరం విడిచి పోవాలనుకుంటున్న హరద్విజుడనే బ్రాహ్మణునికి శివుడు ప్రసన్నుడై, ఒక పద్యం వ్రాసి ఇచ్చి, దానిని రాజసభలో వినిపించి రాజు ఇచ్చే కానుకలు తెచ్చుకోమని పంపుతాడు. అతడు వెళ్ళి ఆ పద్యం చదవగా, సభలో ఉన్న నత్కీరుడు తప్పుపడతాడు. స్త్రీ శిరోజాలకు సహజగంధం ఉండటం కవిసమయం కాదు కనుక పద్యంలో అలా వ్రాయడాన్ని దోషంగా చెప్తాడు. అపుడు బ్రాహ్మణుని తరపున మాట్లాడటానికి శివుడే స్వయంగా సభకు వస్తాడు. పార్వతీదేవికి అలాగే ఉంటుంది అంటాడు. అయినా నత్కీరుడు ఒప్పుకోడు. అపుడు అతనికి తానెవరో తెలియచేయడం కోసం శివుడు మూడో కన్ను చూపుతాడు. అప్పటికీ ఒప్పుకోకుండా నత్కీరుడు నువు తలచుట్టూ కళ్ళు చూపించినా తప్పు తప్పేనంటాడు. అపుడు శివుడు అతనిని కుష్టవ్యాధిగ్రస్తుడయేలా శపించడం, అతడు అనుగ్రహించమని వేడుకుంటే, కైలాస దర్శనం చేయమని పరిహారం చెప్పడం, అలా చేయలేక అవస్థ పడుతున్న నత్కీరుడిని సుబ్రహ్మణ్యుడు రక్షించి, శివుడు కైలాస దర్శనం అన్నాడే కానీ ఉత్తర కైలాసమనలేదు కనుక దక్షిణ కైలాసాన్ని, అంటే శ్రీకాళహస్తిని దర్శించవచ్చునన్న ఆలోచన చేసి నత్కీరుడిని శ్రీకాళహస్తికి చేర్చడం, అపుడు నత్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని, శాపవిముక్తుడవడం, ఆపైన శ్రీకాళహస్తీశ్వరునిపై నూరుపద్యాలు చెప్పి ఆయన్ని ప్రసన్నుడిని చేసుకోవడం, సాయుజ్యాన్ని పొందడం – ఇదీ నత్కీరుని కథ.

ఈ కథలో నత్కీరుడు చిదంబరం, జంబుకేశ్వరం, అరుణాచలం మొదలైన శివక్షేత్రాలనెన్నిటినో దర్శిస్తాడు. గంగానదినీ, వారణాసినీ దర్శిస్తాడు. ఆ క్షేత్రాలనన్నిటినీ వర్ణించిన పద్యాలు భగవద్రతికి ఉద్దీపకములు. శివుడు శపించగానే నత్కీరుడు ఆయన పాదములపై బడి “స్వామీ తప్పు చేశాను, ఉద్యత్కృపాధామా శాపవిమోచనము చెప్పు” అని అడగడం, కైలాస దర్శనం ఎలా చేస్తానో అన్న దిగులుతో “కరుణాసాగరా! భక్తవత్సలా! శివా! గౌరీశా!” అంటూ ప్రార్థించడం, “తీరని భక్తితో హృదయమావిర్భూత మోదంబునన్ నవ్వం దీఁగయుఁబోలెఁ జూడ్కులొదవ, ఉత్కంఠతతో” చెవ్వందీశ్వరుని దర్శించడం, అలాగే శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అతనిపై కరుణ చూపి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేలా చేయడం మొదలైన సన్నివేశాలన్నిటిలో గ్లాని, శ్రమము, చింత, దుఃఖము, హర్షము, కరుణ వంటి ఎన్నో సంచారీభావాలతో భక్తిరసపోషణ చేయబడింది.

కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమైనపుడు “నత్కీరుం డుమాజానికిన్ బ్రత్యగ్జోతికి మ్రొక్కి మ్రొక్కి, ప్రమద ప్రాయాంతరంగంబుతోన్ నిటలంబున నంజలి పుటఘటనం బొనరించి, ప్రమద గద్గదగళ మస్ఫుట వర్ణ స్తుతి భాషా ర్భటియును రోమోద్గమంబు పైపైఁ బఱఁగన్” మోక్షమిమ్మని ప్రార్థిస్తాడు. ఇందులో భక్తిరసానికి అనుభావాలైన గద్గదగళం వంటివి చెప్పబడ్డాయి. కనుక ఈకథలోని భక్తిరసపోషణ స్పష్టంగానే తెలుస్తున్నది.

అయితే అనుభావాదుల విషయమలా ఉంచితే, ఔచిత్యం రసానికి ప్రధానం కనుక, అసలు ఈ కథలో ఔచిత్యమే లేదన్న నరసింహశాస్త్రిగారి విమర్శ గురించీ, శివుడు నత్కీరుడిని శపించడం సబబుకాదన్న విశ్వనాథ వారి అభిప్రాయం గురించీ కూడా చర్చించవలసి ఉంది. (నత్కీరుడి కథపై వీరి అభిప్రాయాలు అయిదవ అధ్యాయంలో వివరించబడినాయి.)

కథలో శివుడు శపించాక, తప్పు తెలుసుకున్న నత్కీరుడు పశ్చాత్తాప పడుతూ రెండు ప్రశ్నలు వేసుకుంటాడు. “ఈ కవితాభిమానము వహించితినేటికి?” అని, “దేవునితోడ నేల చార్వాకమొనర్చితిన్?” అని. ఈ కథ ఎంత ఔచితీవంతంగా ఉందో ఎంత భక్తిరసానుకూలంగా ఉందో అర్థమవాలంటే ఈ రెండు కీలక వాక్యాలనూ శ్రద్ధగా చూడాలి.

చార్వాకం “ప్రత్యక్షమే ప్రమాణం” అంటుంది. కనబడనిదంతా లేదు అనడం చార్వాకం. ఆ వాదనను భగవంతుడు కనబడనంతసేపూ చేస్తే చేయవచ్చునేమోకానీ ఆయన ప్రత్యక్షమై ఎదురుగా నిలుచున్నాక ఆయనతోనే చేయడంలో అర్థం లేదు. శివుడు మూడోకన్ను చూపేవరకూ ఒక కవిగా నత్కీరుడు అలా వాదించడం సబబేనని అనుకున్నా, శివుడు మూడోకన్ను చూపాక, పద్యం వ్రాసినవాడు శివుడేనని అర్థమయాక, ఇక ఆ వాదన సరికాదు. ఎందుకంటే పద్యం వ్రాసిన కవికి (శివుడికి) తాను వ్రాసినది (పార్వతీదేవి శిరోజాల సహజగంధం) ప్రత్యక్షమే.

ఈ విషయాన్ని సాహిత్యం పరంగా చూస్తే, కవికి అనుభవంలో ఉన్న విషయం, కవికి “ప్రత్యక్షము” అయిన విషయం తన అనుభవంలో లేనపుడు, తనకి “ప్రత్యక్షము” కానపుడు, పాఠకుడు తానూ ఆ కవి యొక్క స్థితికి చేరి ఆవిషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ కవి వ్రాసినది తప్పు అనరాదు. భక్తి పరంగా చూస్తే, సాధకుడి స్థితిలో ఉన్న భక్తుడు ప్రయత్నించి ఎప్పటికైనా సిద్ధస్థితికి ఎదగాలి. తానే శివుడైపోవాలి. నత్కీరుడిని అలా ఎదగనివ్వడానికే, ఎదగనిచ్చి సాయుజ్యమివ్వడానికే శివుడు దిగివచ్చాడు. యాదవరాజు కథలో ఎలాగయితే అసలు శివుడు వచ్చినది యాదవరాజు కోసమనీ, దాసి ఆయన్ని శివునితో కలిపేందుకు ఉపయోగపడిన సాధనం మాత్రమేననీ చెప్పుకున్నామో, అలాగే ఈ కథలో కూడా నిజంగా శివుడు అనుగ్రహించి సాయుజ్యమిచ్చిన ప్రధాన భక్తుడు నత్కీరుడు. హరద్విజుడు ఆ క్రమంలో ప్రవేశపెట్టబడిన ఒకానొక పాత్ర మాత్రమే. కాబట్టి అటు కవితావిమర్శకుడిగా చూసినా ఇటు భక్తుడిగా చూసినా నత్కీరుడు ఆ విధంగా వాదించడం దోషమే. ఆ విషయాన్ని నత్కీరుడు గ్రహించాడు కనుకనే పశ్చాత్తాపపడ్డాడు.

అతను మరొక మాట కూడా అనుకున్నాడు. “ఈ కవితాభిమానము వహించితినేటికి?” అని. ఈవాక్యాన్ని కూడా రెండు విధాలుగాను పరిశీలించవచ్చు. మొదట కవితావిమర్శకుడిగా ఆలోచిస్తే, కావ్యంలోని విషయం వాస్తవమయినా లేక కవి భావన మాత్రమే అయినా దానిని ముందుగా విమర్శకుడు సహృదయంతో, అంటే కావ్యరచయితకు సమానమైన హృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే పాండిత్యం మీద తనకు ఉన్న అభిమానాన్ని వదిలిపెట్టాలి. అపుడు మాత్రమే సద్విమర్శ చేయగలుగుతాడు. ఇక భక్తుడిగా చూస్తే ఈ వాక్యానికి మరింత లోతు ఉంది. “అభిమాన దంభాదికం త్యాజ్యం” అన్నది భక్తిసూత్రం (నారద భక్తిసూత్రాలు 64). భక్త్యానందాన్ని అందుకోవాలంటే అభిమానం దంభం వంటి వాటిని వదిలేయాలి. శివుడి స్థితికి ఎదగాలంటే, శివుడిలో కలిసిపోవాలంటే మొదట అభిమానాన్ని త్యజించాలి.

లోకంలోని తెలివితేటలయినా, తర్కాలయినా, పాండిత్యమైనా, చివరికి ధర్మాధర్మాలయినా భగవంతుని చేరేవరకే. ఆయన్ని చేరాక ఇక వాటి అవసరమూ ఉండదు, అప్పటికీ వాటినే పట్టుకోవాలనుకోవడంలో ఆనందమూ ఉండదు. నత్కీరుని వంటి భక్తుల కథలు చెప్పే రహస్యం ఇదే. ఈ సూత్రాన్ని పట్టించుకోకపోతే, భాగవతంలోని గోపికావస్త్రాపహరణ ఘట్టం అశ్లీలంగా తోస్తుంది. నత్కీరుని కథలో అనౌచిత్యం ఉందనిపిస్తుంది.

సాధారణంగా విజ్ఞులైనవారు కొంత ప్రయత్నంతో, సాధనతో కామక్రోధాదుల వంటి లక్షణాలను వదుల్చుకోగలుగుతారు. అయితే నిజమైన ఆనందాన్ని పొందడానికి, మోక్షానందాన్ని అందుకోవడానికి అది చాలదు. బ్రహ్మానందాన్ని పొందాలంటే చెడ్డ బరువులనే కాదు మంచి బరువులనీ వదిలేయగలగాలి. ఆ విషయాన్ని నత్కీరుడికి తెలియచేసిన ఈ కథని చదువుతున్నపుడు, సహృదయుడైన పాఠకుడు తాదాత్మ్యం చెందుతాడు. ఎల్లవేళలా ఆ ఆనందంలోనే ఉండే స్థితికి తాను చేరకపోయినా తాత్కాలికంగానైనా దానిని అనుభవిస్తాడు. అదే బ్రహ్మానంద సహోదరమయిన కావ్యానందం. ఈ కథలో అందే భక్తిరసానందం.

9. వారకన్యలు

ఈ కథలో మధురానగరంలోని మాణిక్యవల్లి అనే వేశ్యకు ఇద్దరు కుమార్తెలు కలుగుతారు. వారి జననం గురించి చెప్తున్నపుడు కవి వారు పుట్టటమే “శివభక్తి శరీరం దాల్చిందా” అన్నట్లుగా పుట్టారని చెప్తాడు. అలా పుట్టిన వాళ్ళు ఇద్దరూ శివభక్తితోనే పెరుగుతారు. తల్లి చేసే బోధలను చెవినపెట్టరు. భాగవతంలో ప్రహ్లాదుడు హరిభక్తి తప్ప మరేదీ తనకు రుచించదని తండ్రితో చెప్పినట్లే వీరు కూడా శివుడిని తప్ప మరెవరినీ కోరలేమని తల్లితో చెప్తారు. “శివునపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై నాసపడునె! ముక్తివల్లభు ననురక్తిఁ గూడఁ దలంచు కాయంబు గూడునె కాముకులను!” వంటి ప్రశ్నలు అడుగుతారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవాలని తపిస్తారు. ఆ విషయం తెలుసుకున్న కొందరు దొంగలు జంగమ రూపంలో వచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళని తమతో శ్రీకాళహస్తికి బయల్దేరదీస్తారు. అక్కచెల్లెళ్ళిద్దరినీ చంపేసి వారి ధనాన్ని అపహరించాలన్నది దొంగల పథకం. అయితే దొంగలు అటువంటి ప్రయత్నం చేసినపుడల్లా శివుడు రకరకాల రూపాలతో వచ్చి భక్తురాండ్రిద్దరినీ రక్షిస్తుంటాడు. అడవిదారిలో దొంగలు అక్కచెల్లెళ్ళను చంపబోయినపుడు మాయాజంగమరూపంతో వచ్చి వారిని రక్షించి జాగ్రత్తగా కాళహస్తికి చేరుస్తాడు. వాళ్ళు కాళహస్తీశ్వరుని దర్శించుకున్నాక సాయుజ్యమూ ఇస్తాడు.

ఈ కథలో శివుడు తన దర్శనం చేసుకోవాలని బయల్దేరిన భక్తురాళ్ళకు తానే తోడుగా ఉండి, వారిని శ్రీకాళహస్తికి తీసుకువెళ్ళడం అన్న కథాంశమే భక్తిరసపుష్టికి ఎంతో దోహదం చేసే విషయం కాగా; ఇక వర్ణనలు, సంభాషణలు వంటి అంశాలలో కవి చూపిన నేర్పు ఈ కథను మరింత భక్తిరసాత్మకం చేసింది.

ఈ ఆశ్వాసంలో ఒకచోట చీకటి పడడాన్నీ, చంద్రుడు ఉదయించడాన్నీ కవి వర్ణించిన తీరు ఈ క్రింది విధంగా ఉంటుంది. శివజ్ఞానం లేని మనసును భయవిచారాలనే చీకట్లు క్రమ్మినట్లుగా, బ్రహ్మాండమంతా చీకటి నిండిందట. ఎడమభాగంలో ఉన్న పార్వతీదేవి యొక్క నల్లని కాంతి, కంఠంలోని హాలాహలము యొక్క నలుపు, ఆకాశమంతా వ్యాపించిన కేశముల నలుపు, తలపైన ఉన్న గంగానదిలోని నాచు యొక్క నలుపు, హస్తమున దాల్చిన జింక కన్నుల నలుపు, ఆభరణంగా ధరించిన శేషుని పడగల నలుపు, వస్త్రంగా కట్టుకున్న ఏనుగు చర్మపు నలుపు, చేతిలో పట్టుకున్న శూలము యొక్క నలుపు, ఈ నలుపులన్నిటితో కూడి తెల్లని శివుడు వచ్చినట్లుగా చంద్రోదయమయిందట.

ఒక కథ భక్తిరసాత్మకం కావాలంటే భక్తులకు భగవంతుడిపై ఉన్న నిష్కామమైన ప్రేమ, నమ్మకం వంటివన్నీ ప్రస్ఫుటంగా వ్యక్తం కావాలి. అలాగే భగవంతుడికి ఉండే అవ్యాజమైన కరుణా, భక్తుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఆయన స్వభావమూ కూడా అంతే స్పష్టంగా వ్యక్తమవాలి. ఆ రెండూ ఈ కథలో చక్కగా నిర్వహించబడినాయి. తల్లి చేసే ఉపదేశాలకు మారుగా వారకన్యలిద్దరూ ఎంత తీవ్రంగా తమ భక్తిని ప్రకటిస్తూ సమాధానాలు చెప్తారో పైన ప్రస్తావించాను.

చ.
అమృతము గ్రోలు జిహ్వ చవియంచుఁ దలంచునె తేనె? నింటిలో
నమరమహీరుహం బుదయమైన నరుండవనీశు వేఁడునే?
యమిజనభాగ్యరూపమగు నాదిమతత్త్వము గాళహస్తిదై
వము భజియించుమానసము వారవధూ మదసౌఖ్య మెంచునే?

ఇది ఆ సందర్భంలోని మరొక చక్కని పద్యం. పుట్టినప్పటినుంచి సాయుజ్యం పొందేవరకూ ఏమాత్రమూ సడలని వారి ధృఢభక్తి కథ ఆసాంతమూ చక్కగా నిర్వహించబడింది. జంగమ వేషధారులైన దొంగలు తమకేమయినా కీడు చేస్తారేమోనన్న అనుమానాన్ని చెల్లెలు వెలిబుచ్చినపుడు కూడా అక్క నవ్వుతూ “చెప్పడానికీ చూపడానికీ సాధ్యం కాని వాడిని, లోకాలకు తండ్రి అయిన ఆ పరమేశ్వరుని భజిస్తుండగా ఏమి జరిగితే మాత్రం ఏమిటి?” అంటుంది. అలాగే అటు శివుని కరుణను కూడా ఎంతో అందమైన మాటలతో చూపాడు కవి. అడవిలో దొంగలు పారిపోయాక, శివుడు వేశ్యకుమార్తెలను “చూపులఁ గరుణం బొదలఁ గనుంగొని” ఇదేమిటి ఇటువంటి చోట ఉన్నారని అడుగుతాడు. “మాయమ్మలార! కరుణాతోయనిధిం గాళహస్తి తుహినాంశుధరున్ శ్రేయోనిధి నారాధన సేయం గొనిపోయెదము ప్రచింత యుడుగుఁడీ” అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని తీసుకువెళ్తాడు.

ఈ విధంగా ఈ కథలో ధృతి, ఔత్సుక్యం, ముదము, కరుణ, విస్మయం, ఉత్సాహం వంటి సంచారిభావాలు వారకన్యల మాటల ద్వారా, చేష్టల ద్వారా, శివుని లీలల ద్వారా, పలుకుల ద్వారా చక్కగా నిర్వహించబడినాయి. కుంభకోణం, చిదంబరం వంటి క్షేత్రాల దర్శనం, వాలి పూజించిన శివలింగం, అతని కథ, ఆ కథను వివరించి చెప్పిన పురాణజ్ఞులు మొదలయినవన్నీ ఉద్దీపన విభావాలుగా కూర్చబడ్డాయి. అలాగే వారకన్యలు కాళహస్తీశ్వరాలయంలోకి ప్రవేశించిన సన్నివేశంలో “నారులమైపులకంబు లేర్పడెన్”, “లలనామణి తనులతికాకలిత ప్రస్వేదవారి కణములు పొడమెన్”, “కంపంబు వొడమెఁ” అంటూ భక్తికి సంబంధించిన అనుభావాలూ చెప్పబడ్డాయి. వర్ణనాదులు సైతం భగవద్రతి రసపుష్టిని సంతరించుకునేలా తీర్చిదిద్దబడినాయి.

ఈ విధంగా శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని కథలన్నిటినీ పరిశీలించినపుడు ఈ కావ్యంలో భక్తిరసం చాలా నేర్పుగాను ఉత్కృష్టంగాను నిర్వహించబడినదన్న విషయం అర్థమవుతుంది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version