Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-26

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 7 – 4వ భాగం

భక్తి – రసప్రతిపత్తి

7.3 ముగింపు

“తెలుగుసాహిత్యం-భక్తిరసం” అనే నా ఈ పరిశోధన ద్వారా తెలుగుసాహిత్యంలోని విమర్శకుల అభిప్రాయాలనూ సృజనాత్మక కావ్యాలనూ కూడా విస్తారంగా పరిశీలించిన మీదట, విశ్లేషించిన మీదట, తెలుగుసాహిత్యంలో భక్తికి రసప్రతిపత్తి ఇవ్వవలసి ఉంటుందన్న విషయం నిశ్చయమయింది. అలాగే, భక్తిని రసముగా పరిగణించి తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు భక్తిరసపోషణకు సంబంధించి, ఇతివృత్తపరంగానూ శిల్పపరంగానూ కూడా మరెన్నో సూక్ష్మమైన అంశాలను కనుగొనే అవకాశము, తద్వారా భక్తిరసపోషణకు, భక్తిరసాస్వాదనకు మరింత తోడ్పాటునందించే అవకాశము ఉంటాయని అర్థమయింది. నా పరిశోధనలో ప్రధానంగా సాధించిన ఈ ఫలితాన్ని పేర్కొనడంతో పాటు, శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో భక్తిరసము ఎలా పోషింపబడిందన్న విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో వివరించాను.

నా పరిశోధన ద్వారా ధృఢపర్చుకున్న “భక్తి శృంగారాది రసములలో అంతర్భవించని ఒక విభిన్న రసము” అన్న ప్రతిపాదనను తెలుగు సాహితీలోకం స్వీకరిస్తుందనీ, ఇకపై భక్తి కూడా కావ్యరసంగా పరిగణించబడుతుందనీ, భక్తిరసపోషణకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలను భవిష్యత్ పరిశోధనలు వెలికి తెస్తాయనీ ఆశిస్తున్నాను.

ఉపసంహారము

భక్తిని కావ్యరసముగా పరిగణించవచ్చునా లేదా అన్న చర్చ తొలుత సంస్కృతాలంకారిక గ్రంథాలలో కనబడుతుంది. సంస్కృతంలో చివరిగా భక్తి రసప్రతిపత్తి గురించి కొంత వివరంగా చర్చించిన జగన్నాథ పండితరాయలు రససంఖ్యను తొమ్మిదిగా పరిగణించడమే సమంజసమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అది సంస్కృత సాహిత్యాన్ని ఆధారం చేసుకుని జరిగిన చర్చ.

తర్వాతి కాలంలో కొన్ని ఆధునిక భారతీయ భాషలలోను ఈ విషయంపై చర్చలు జరిగినాయి. ముఖ్యంగా హిందీ మరాఠీ భాషలవారు వారి వారి సాహిత్యాలకు సంబంధించి భక్తిని ఎలా పరిగణించాలన్న విషయాన్ని విస్తృతంగా చర్చించారు.

అటువంటి కృషి తెలుగులో ఇప్పటివరకూ జరగలేదు. అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి భక్తిని ఎలా పరిగణించాలి? రసముగానా? భావముగానా? అన్న విషయంలో స్పష్టమైన ప్రతిపాదనను తెలుగు సాహితీవేత్తలు ఎవరూ చేయలేదు.

“భక్తిరసం” అనే మాటని ఎందరో తెలుగు కవులు, విమర్శకులు ప్రాచీనకాలం నుంచి ఈనాటి వరకూ కూడా విరివిగా వాడటం కనిపిస్తుంది. విశ్వవిద్యాలయాలలోను, సదస్సులలోను సమర్పించబడిన కొన్ని సిద్ధాంత గ్రంథాలలోనూ పరిశోధన పత్రాలలోనూ కూడా భక్తిని రసంగా పరిగణించడం జరుగుతోంది. అయితే మరలా రససంఖ్యను గురించి చెప్పేటపుడు మాత్రం భక్తిని లెక్కించకుండా తొమ్మిది అని చెప్పడమే కొనసాగుతోంది.

ఈ వైరుధ్యాన్ని అధిగమించి, తెలుగుసాహిత్యానికి సంబంధించి భక్తిరసం విషయంలో ఒక స్పష్టమైన ప్రతిపాదనను చేయాలన్న ఉద్దేశంతో ఈ పరిశోధన ఆరంభమయింది.

అందుకు గాను, ప్రాథమిక అధ్యయనానంతరం ఒక ఊహాప్రతిపాదనను ఏర్పరచుకోవడం జరిగింది.

భక్తి శృంగారాది రసములలో అంతర్భవించని ఒక విభిన్న రసము” అన్నది ఈ పరిశోధనకు ఏర్పరచుకున్న ఊహాప్రతిపాదన. ఒకే వాక్యంగా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనలో రెండు అంశాలున్నాయి. ఒకటి భక్తికి కూడా రసముగా పరిణతి చెందగల శక్తి ఉన్నది అన్న ప్రతిపాదన. రెండవది, కొందరు ఆలంకారికులు పేర్కొన్నట్లుగా భక్తి శృంగార రసంలో కానీ శాంతరసంలో కానీ అంతర్భవించదు అన్న ప్రతిపాదన. ఆ రెండు అంశాలనూ పరీక్షించడం ద్వారా ఊహాప్రతిపాదనలోని సత్యాసత్యాలను నిర్ధారించుకోవడం ఈ పరిశోధనకు లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది.

ఆ లక్ష్యసాధనకు అనుగుణంగా సాగిన కృషి ఈ సిద్ధాంతగ్రంథంలో ఏడు అధ్యాయాలుగా విభజించబడింది. ఆ ఏడు అధ్యాయాలలోని విషయాలను ఇక్కడ క్లుప్తంగా తెలియచేస్తున్నాను.

మొదటి అధ్యాయంలో సంస్కృతాలంకారికుల అభిప్రాయాలను పరిశీలించడం జరిగింది. భక్తిరసాన్ని గురించిన చర్చ మొదట సంస్కృతంలో మొదలయింది కనుక నా అధ్యయనాన్ని కూడా సంస్కృతాలంకార గ్రంథాలతో ప్రారంభించడం జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనువాదాలపై ఆధారపడి భరతుని నుండి అల్లరాజు వరకు ముప్పై తొమ్మిది మంది ఆలంకారికుల అభిప్రాయాలను ఈ అధ్యాయంలో పరిశీలించడం జరిగింది.

రెండవ అధ్యాయంలో సంస్కృత గ్రంథాలకు కేవల అనువాదాలుగా వ్రాయబడినవి కాకుండా, కొంత స్వతంత్రత కనబరచిన తెలుగు గ్రంథాలు పరిశీలించబడినాయి. విన్నకోట పెద్దనతో మొదలు పెట్టి పదిహేడు మంది తెలుగు ఆలంకారికుల అభిప్రాయాలను ఈ అధ్యాయంలో పరిశీలించడం జరిగింది.

మూడవ అధ్యాయంలో కందుకూరి వీరేశలింగం గారితో మొదలుపెట్టి దాదాపుగా ప్రసిద్ధ తెలుగు విమర్శకులందరి అభిప్రాయాలనూ సేకరించడమూ పరిశీలించడమూ జరిగింది. విమర్శకులు ప్రత్యేకంగా ప్రచురించిన వ్యాసాలు, పీఠికలు, పుస్తకాలతో పాటు “భాగవత వైజయింతిక” వంటి వ్యాససంకలనాల నుండి కూడా అభిప్రాయాలను సేకరించి పరిశీలించడం జరిగింది.

నాలుగవ అధ్యాయంలో ఆదికవి నన్నయ్య నుంచి 18వ శతాబ్దానికి చెందిన కంకంటి పాపరాజుగారి వరకూ తెలుగు కవులలో ప్రసిద్ధులైన వారి అభిప్రాయాలు లభ్యమైన మేరకు పరిశీలించబడినాయి. తెలుగు కావ్యాలలో కవులు భక్తిని ఎలా నిర్వహించారు, ఏ రకమైన ప్రాముఖ్యాన్ని ఇచ్చారు అన్న విషయాలు గమనించబడినాయి. అధునిక కవిత్వాన్ని ప్రత్యేకించి పరిశీలించకపోయినా, యాదృచ్ఛికంగా లభించిన ప్రసిద్ధ కవుల అభిప్రాయాలను అవగాహనలోకి తీసుకోవడం జరిగింది.

అయిదవ అధ్యాయంలో శాస్త్రాలను ఆధారం చేసుకుని ఊహాప్రతిపాదన పరీక్షించబడింది. రసస్వరూపం, రసనిర్ణాయక తత్త్వాలు, చిత్తవృత్తులు, రసాల పరస్పర సంబంధం, రసవిఘ్నాలు, రసాభాస వంటి విషయాల గురించి అలంకార శాస్త్రాలలో ఇచ్చిన నిర్వచనాలు, నియమాల ఆధారంగా భక్తిని ప్రత్యేకరసంగా పరిగణించడం సబబా కాదా అన్న విషయం చర్చించబడింది. ఒక భావాన్ని స్థాయిభావంగా పరిగణించడానికి, ఒక స్థాయిభావాన్ని రసంగా పరిపుష్టం చేయడానికి శాస్త్రాలలో చెప్పిన అంశాలు భగవద్రతికి, భక్తికి వర్తిస్తాయా లేదా అన్న విషయాన్ని విశ్లేషించడం జరిగింది. అలాగే ఒక రసము యొక్క లక్షణాల గురించి, రసాల మధ్య పరస్పర సంబంధాల గురించి అలంకార శాస్త్రాలు చెప్పిన నియమాల ఆధారంగా భక్తిని శృంగారంలో కానీ, శాంతంలో కానీ అంతర్భవింప చేయడం సమంజసమేనా అన్న విషయం పరీక్షించబడింది. అలంకార శాస్త్రంలోని నిర్వచనాలను ప్రధానంగా పరిగణిస్తూనే, అవసరమైన చోట వేదాంతం, ఆధునిక మానసిక శాస్త్రం వంటి ఇతర శాస్త్రాల సహాయం తీసుకోవడం జరిగింది. ఈవిధంగా భిన్నకోణాల నుంచి పరీక్షించిన తర్వాత ఊహాప్రతిపాదనను అంగీకరించవచ్చునన్న నిర్ధారణకు రావడం జరిగింది.

ఆరవ అధ్యాయంలో విమర్శకులచే పరిశోధకులచే భక్తిరసపూరితాలుగా పరిగణించబడిన, ఆదరించబడిన, భాగవతం, శ్రీకాళహస్తి మాహాత్మ్యం, పాండురంగ మాహాత్మ్యం, ఆముక్తమాల్యద వంటి కావ్యాలను తీసుకుని వాటిలో కవులు భక్తిరసపోషణను ఎలా నిర్వహించారో పరిశీలించడం జరిగింది. భక్తికి రసపుష్టిని కలిగించేందుకు తెలుగు కవులు ఎటువంటి ఇతివృత్తాలను ఎన్నుకున్నారు, ఏ విధమైన సన్నివేశాలను కల్పించారు, పాత్రలను ఎలా తీర్చిదిద్దారు, ఎటువంటి శైలిని ఉపయోగించారు, అలంకారాలను ఎలా ప్రయోగించారు, రససామగ్రిని ఎలా వాడుకున్నారు అన్న అంశాలను గమనించడం జరిగింది. తెలుగు కవులు భగవద్రతి అనే భావానికి రసపుష్టిని కలిగేలా కావ్యాలను నిర్వహించారన్న విషయాన్ని, ఆ నిర్వహణ శృంగార శాంతరసాల నిర్వహణ కన్నా విభిన్నంగా ఉందన్న విషయాన్ని నిర్ధారించుకోవడం జరిగింది.

చివరి అధ్యాయంలో పరిశోధనా ఫలితం ప్రకటించబడింది. “భక్తి శృంగారాది రసములలో అంతర్భవించని ఒక విభిన్న రసము” అన్న ఊహాప్రతిపాదనను సత్యంగా స్వీకరించవచ్చునన్న విషయం ప్రతిపాదించబడింది. అందుకు ఉపబలకంగా శ్రీకాళహస్తి మాహాత్మ్యం కావ్యంలోని భక్తిరసావిష్కరణను వివరించడం జరిగింది.

ఈ విధంగా ఏడు అధ్యాయాలుగా విభజించబడిన ఈ సిద్ధాంతగ్రంథంలో ఊహాప్రతిపాదనను పరీక్షించే క్రమంలో వెలికి వచ్చిన మరికొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ సంక్షిప్తంగా పేర్కొంటున్నాను.

పరిశోధనలో వెలువడిన ముఖ్యాంశాలు

భవిష్యత్తులో జరుగవలసిన కృషి

ఇంతకాలమూ భక్తిని రసముగా పరిగణించక పోవడం వలన భక్తిరసనిర్వహణకు సంబంధించిన ఎన్నో సూక్ష్మమైన అంశాలను గురించిన పరిశీలన జరగలేదు. ఉదాహరణకి స్వభావోక్తి, వ్యాజస్తుతి అలంకారాలు మిగిలిన రసముల కన్నా భక్తిలో విశిష్టంగా కనబడతాయన్న ఒక పరిశీలనను ఈ సిద్ధాంతగ్రంథంలో పేర్కొనడం జరిగింది. భక్తిని రసముగా పరిగణించి అధ్యయనం చేసినపుడు ఇటువంటి సూక్ష్మాంశాలను మరిన్నింటిని భవిష్యత్ పరిశోధనలలో వెలికి తెచ్చే అవకాశం ఉంది.

విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఈ సిద్ధాంతగ్రంథంలో కావ్యాధారిత విశ్లేషణకు ప్రాచీన కావ్యాలను మాత్రమే గ్రహించడం జరిగింది. భావిపరిశోధకులు వచన కవిత, కథ, నవల వంటి ఆధునిక ప్రక్రియలలో కూడా భక్తిరసపోషణను అధ్యయనం చేయవచ్చు.

భక్తిని రసముగా అంగీకరించడం వలన భావిపరిశోధనలలో భక్తిరసనిర్వహణకు అనుకూలించే, ప్రతికూలించే అంశాలను గురించి మరిన్ని కొత్త విశ్లేషణలు, ప్రతిపాదనలు, వివరణలు వచ్చే అవకాశం ఉంది.

అలా భక్తిరసమును గూర్చి మరిన్ని వివరణలు ప్రతిపాదనలు వచ్చినపుడు కొన్ని అస్పష్టతలు, అపోహలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ భక్తిరసం విషయంలో ఉన్న అస్పష్టత వలన సాహిత్యానికి కొంత నష్టం జరిగినట్లు కూడా కనబడుతున్నది. భక్తిరసం అంటే ఏమిటి, అది ఎలా పోషించబడుతుంది అన్న విషయంపై సిద్ధాంత పరమైన చర్చలు జరగనందు వలన అయోమయాలతోను, అశ్లీలతలతోను నిండిన కొన్ని రచనలు భక్తిసాహిత్యంగా చలామణీ కావడమూ; అది విజ్ఞులైన పాఠకులలో ఆవేదనకీ, సాధారణ పాఠకులలో మరింత అస్పష్టతకీ కారణమవడమూ జరుగుతోంది.

అలాగే ఆధునిక సాహిత్యంలో భక్తిప్రధానమైన రచనలు తగ్గిపోవడానికి కూడా కొన్ని అపోహలు కారణంగా కనిపిస్తున్నాయి. భక్తిరచనలలో హేతుబద్ధత ఉండదన్న అభిప్రాయము, ఇప్పటి పాఠకులు వాటిని ఆదరించరన్న సందేహము కొందరు ఆధునిక రచయితలలో ఉన్నట్లుగా కనబడుతోంది. అయితే పోతన పద్యాలను ఆస్వాదిస్తున్న సాహితీప్రియులు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు. ఈనాటి సమాజంలోని పాఠకులు కూడా ప్రాచీన కావ్యాలలోని, శతకాలలోని భక్తిరసాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆధునిక సాహిత్యంలో భక్తిరస ప్రధాన రచనలు తగ్గడానికి కాలాన్నీ, కాలంతో పాటు మారిన అభిరుచినీ కారణాలుగా చెప్పలేమనిపిస్తుంది.

ఇటువంటి అపోహలను, అస్పష్టతలను తొలగించే విధంగాను, పాఠకులలో భక్తిరసాస్వాదన శక్తినీ, రచయితలలో భక్తిరసావిష్కరణ శక్తినీ పెంచే విధంగాను భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు భక్తిరసంపై జరుగుతాయనీ జరగాలనీ ఆశిస్తున్నాను.

(సమాప్తం)

Exit mobile version