Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యం – భక్తిరసం-6

[ప్రఖ్యాత రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2023లో పిహెచ్‌డి డిగ్రీ పొందిన సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ ను ధారావాహికగా అందిస్తున్నాము.]

అధ్యాయం 2 – రెండవ భాగం

2.1.12 శే. వెం. రాఘవయ్యంగారు

వీరు తాము రచించిన “కావ్యాత్మ” అనే గ్రంథంలో అలంకార శాస్త్రంలోని ప్రాచీన నవీన మతములను వివరించారు. భరతుడితో మొదలుపెట్టి దండి, ఉద్భటుడు, రుద్రటుడు వంటి ప్రాచీనుల ప్రతిపాదనలను వివరించారు. అలాగే ఆనందవర్ధన అభినవగుప్తులతో మొదలుపెట్టి మమ్మటుడు, భోజుడు, జగన్నాథుడు, హేమచంద్రాదులు, విశ్వనాథుడు, విద్యాధర విద్యానాథులు – ఇలా నవీనమతములలో ప్రసిద్ధ ఆలంకారికులందరి గురించీ చెప్పారు. వీరిలో చాలామంది నూతన ప్రతిపాదనలు చేసినవారు కాకున్నా వారి గ్రంథాలలోని విషయాలను రాఘవయ్యంగారు చర్చించారు, కానీ మధుసూదనసరస్వతి, రూపగోస్వామి వంటి వారిని మాత్రం పేర్కొనలేదు. దానిని బట్టి రాఘవయ్యంగారు భక్తిరస సిద్ధాంతానికి ప్రాముఖ్యం ఇవ్వలేదని భావించవలసి వస్తుంది.

వీరు రచించిన మరొక గ్రంథం అలంకారమంజరి. ఈ గ్రంథం కావ్యప్రకాశానికి అనువాదమని చెప్పినప్పటికీ తెలుగులో చెప్పిన లక్షణముల నుండి, వివిధ రసములకు రాఘవయ్యంగారు ఇచ్చిన ఉదాహరణల నుండి వారి అభిప్రాయాలను గ్రహించే అవకాశం ఉంది.

అలంకారమంజరిలో వీరు నవరసములను పేర్కొన్నారు. తొమ్మిది స్థాయిభావములనూ పేర్కొన్నారు. శృంగార రసానికి స్థాయిభావమైన రతిని గురించి వీరు – “ఆలుమగల కొండొరులపై నంటియుండు వలపునాబడు మనమునందలి మక్కువనే ‘రతి’ యందురు” – అని చెప్పారు (పుట 71). అలాగే శాంతరసానికి స్థాయిభావమైన శమమును గురించి – “మహాత్ముల నుడుల చెవియొగ్గి విని వారు చెప్పిన తెరఁగునఁ జరించుటవలన మనకుఁ గట్టెదురఁ గానవచ్చునవి యెల్ల నిలుకడలేనివని మానసమున పుట్టినట్టి గట్టినమ్మకమునే ‘శమ’మందురు” అని చెప్పారు (పుట 72).

శృంగారానికి సంబంధించిన వివిధ భేదాలను చెప్తున్నపుడు ఇచ్చిన ఉదాహరణ పద్యాలన్నీ స్త్రీపురుషులను ఆధారం చేసుకున్నవిగానే ఉన్నాయి. గోపికా కృష్ణులతో ఇచ్చిన ఉదాహరణలు ఒకటి రెండు ఉన్నాయి. అయితే, ఆ పద్యాలు కూడా గోపికలను భక్తురాండ్రగా కృష్ణుని భగవంతునిగా చిత్రించకుండా శృంగార నాయికా నాయకులుగానే చూపాయి. ఉదా:

ఆటనేరుపు మెచ్చెడు వ్యాజమునను
సరస నిలిచిన గోపికా చతుర యొకతె
ప్రతిఫలించిన కృష్ణునిఁ బడయు కతన
ముద్దుగొనె సాటిచెలి చెక్కుటద్దములను (పుట 83)

ఇక శాంతమునకు వీరు ఇచ్చిన ఉదాహరణ ఈ క్రింది విధంగా ఉంది.

లలిత మలయానిల హలాహలముల యందుఁ
కలికి కుంతల భోగి భోగముల యందు
శ్వపచు నింటను నాయింట సైత మిపుడు
పరమపురుషుని భక్తియే పాదుకొనియె (పుట 117)

అన్నీ సమంగా తోచే తత్త్వజ్ఞాన స్థితిని ఇక్కడ చెప్పారు. అయితే దానికి భక్తినీ జోడించారు. జోడించడం కాదు, నిజానికి భక్తినే ప్రధానంగా చెప్పారు. ఈ పద్యాన్ని వివరిస్తూ రాఘవయ్యంగారు “.. నిచటఁ బలుకు వానికిఁ బరమపురుషుని భక్తి పాదుకొనుటచే నుత్తమాధమ తారతమ్యము నశించెనని సహృదయులకు గోచరించును” అన్నారు (పుట 118). శాంతమునకు ఉదాహరణ ఇవ్వవలసిన సందర్భంలో భక్తిని చూపడడం ఇక్కడ గమనించవలసిన విషయం.

ఇపుడు ముఖ్యంగా చెప్పుకోవలసిన దేవవిషయరతి గురించి ఈ గ్రంథంలో ఏమి ఉందో చూద్దాము. “విభావాదులచే సూచింపబడిఁ రత్యాదులెపుడు చిదానంద చమత్కార రూపమునఁ బరిణమించునో యప్పుడవి రసములని పేరొందును; స్వకార్య కారణములచే సూచింపఁబడి దేవాదివిషయ రత్యాదులు చిదానంద రూపము నెపుడు పొందునో యప్పుడవి భావములనబడును. చమత్కారముతోఁ గూడియుంటయు వీడియుంటయే రసభావములకు గల భేదమై చెలంగును” అని చెప్తారు రాఘవయ్యంగారు (పుట 118).

ఇది చర్చకు అవకాశమిచ్చే విషయం. చమత్కారంతో కూడి ఉండటం, వీడి ఉండటం, రసభావాలకు ఉన్న వ్యత్యాసం అన్నారు. అయితే దేవవిషయక రతిలో చమత్కారం ఉండదనీ, కనుక అది భావమనీ; కాంతా విషయక రతిలోనే చమత్కారం ఉంటుందనీ, అందువల్ల అది రసమనీ చెప్పడం ఎలా కుదురుతుంది? చమత్కారం రెండిటిలోనూ ఉండవచ్చు. రెండింటిలోనూ లేకపోవచ్చు. ఈ విషయాన్ని చెప్పాక వీరు దేవవిషయరతికి ఉదాహరణ ఇచ్చారు.

కంఠమూలంబునందుంట కాలకూట
మైన నో మహాదేవ! నా కమృతమౌను
నెత్తినిడుకొన్న నమృతమ్ము నీదు మేని
కన్న వేరౌట నామదిఁ గరఁచకుండె (పుట 119)

ఈ పద్యాన్ని దేవవిషయక రతికి ఉదాహరణగా ఇచ్చి ఆతర్వాత “ఇంక వ్యభిచారి భావములచే వెలుంగునది యెట్లన” అంటూ ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.

వలపుపసలను వెదజల్లు సొలపుఁ గనుకొ
లంకులం జిరునవ్వు దొలంకఁజేయు
సొగసుకత్తియ ముద్దులమొగము దలచి
సుధను మదిలోనఁదలపోయ వృధయగాదె? (పుట 119)

ఇక్కడ మొదటిపద్యం విభావాదులతో పోషింపబడలేదు కనుక భావమనీ, రెండవ పద్యం విభావాదులచే పోషింపబడింది కనుక రసమనీ వారు చెప్పవచ్చు. కానీ విభావాదులచే పోషింపబడకపోవడం అనే లక్షణాన్ని దేవవిషయకరతికి ఆపాదించి, అందువలన అది భావం అవుతుందనడం సమంజసమెలా అవుతుంది?

ఒక సందర్భంలో దేవవిషయక రతిని కూడా విభావాలతో పోషించవచ్చు. మరొక సందర్భంలో కాంతావిషయకరతిని కూడా పోషించకపోవచ్చు. కాంతా విషయక రతి కూడా విభావానుభావాలతో పోషింపబడకపోతే భావమేనన్న విషయం ఆలంకారికులు చెప్పి ఉన్నదే. కనుక ఆ విషయం ఆధారంగా దేవవిషయకరతిని భావం అని చెప్పడం సబబు కాదు.

2.1.13 మరింగంటి శ్రీరంగాచార్య

కొల్లూరి రాజశేఖర పండితుని అలంకారమకరందమును మరింగంటి శ్రీరంగాచార్య గారు పరిష్కరించి వ్యాఖ్యాన సహితంగా ప్రకటించారు. ఇది అలంకారములను వివరించిన గ్రంథం. ఇందులో రసవత్ ప్రేయో ఊర్జస్వి సమాహిత అలంకారాలు, వాటికి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.

రసము ప్రధానముగాక అంగముగా వర్ణించబడినపుడు రసవదాలంకారమని, ఒక భావము మరొక భావమునకు అంగముగా నిబద్ధమైనపుడు ప్రేయోలంకారమని, రసాభాస భావాభాసములు రసానికిగాని భావానికి గాని అంగములుగా నిబంధించబడితే ఊర్జస్వి అని, భావశాంతి భావాంగమైనపుడు సమాహితాలంకారమని లక్షణాలు చెప్పి ఉదాహరణలు ఇచ్చారు (పుట 151).

ఇక్కడ ప్రేయోలంకారమునకు చెప్పిన లక్షణంలో కాని లక్ష్యంలో కానీ భక్తితో సంబంధమేమీ చూపబడలేదు. ప్రేయోలంకారానికి ఇచ్చిన ఉదాహరణలు రాజైన రామేశునకు సంబంధించినవి.

2.1.14 శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

వీరు కవిశిరోభూషణము లేదా అహోబలపండితీయము అనబడే సంస్కృత గ్రంథాన్ని ఆంధ్రతాత్పర్య సహితంగా ప్రచురించారు. ఇందులో నవరసములను పేర్కొని ఆతర్వాత రత్యాది స్థాయిభావములు తొమ్మిదింటినీ చెప్పారు. ఆ తర్వాత వత్సల, స్నేహ, భక్తిరసములను పేర్కొని అవి రతిలో అంతర్భూతములేనన్నారు. ఇక్కడ వీరు ‘ఆలోచించగా వత్సల స్నేహ భక్తి రసములు ఉన్నాయి’ అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే మళ్ళీ అవి రతిలో అంతర్భాగాలేననడం (పుట 68) చూస్తే, అనుభవానికి భక్త్యాదుల రసత్వం తెలుస్తున్నప్పటికీ పూర్వాలంకారికులను అనుసరించాలన్న ఉద్దేశంతోనే వాటిని రతిలో అంతర్భాగాలన్నారని అనిపిస్తుంది. అందుకే బహుశా ఈ అభిప్రాయాన్ని చెప్పాక మమ్మటుడు కూడా ఇదే చెప్పాడంటూ కావ్యప్రకాశంలోని కారికను ఉదాహరించారు.

2.1.15 చర్ల గణపతి శాస్త్రి

చర్ల గణపతి శాస్త్రి గారు సాహిత్యసౌందర్య దర్శనము అనే గ్రంథాన్ని రచించారు. దానికి సమగ్రాలంకార శాస్త్రం అన్న ఉపశీర్షిక ఇచ్చారు. వీరు ఈ గ్రంథంలో వివిధ విషయములను సూత్రములుగా చెప్పారు. అంటే లక్షణములను, లక్ష్యములను సూత్రములుగా, ఉదాహరణలుగా ఇచ్చారు.

రససంఖ్య విషయానికి వస్తే, వీరు శృంగారాది అష్టరసములను శాంతమును కలిపి నవరసములను రసములుగా పేర్కొన్నారు. శాంతానికి నిర్వేదాన్ని స్థాయిగా చెప్పారు.

మధుసూదన సరస్వతి వంటి వారు భక్తి అనేది వేరు రసముగా పరిగణించారని చెప్పి, “అది గురుదేవాది విషయక రతి అగుటచే రతిస్థాయి భావమందె అంతర్భవించును” అన్నారు. అంటే మమ్మటుని వ్యాఖ్యనే వీరు కూడా చెప్పారు కానీ మధుసూదన సరస్వతి ఇంద్రాది దేవతా విషయక రతి భావమే అయినా మోక్షానందాన్నిచ్చే పరమాత్మపై రతి రసమేనని చెప్పిన విషయాన్ని వీరు పట్టించుకోలేదు.

భక్తిరసం గురించి చర్చిస్తున్న సందర్భంలోనే కొందరిచే భిన్నరసములుగా చెప్పబడిన స్నేహము, వాత్సల్యము, లౌల్యములను కూడా పేర్కొని అవి ఇతర స్థాయిభావములలో అంతర్భవిస్తాయని చెప్పారు. ఇక్కడ వారు “అవి భిన్న రసములుగావు. కొందరు స్థాయిభావములనే రసములని యనిరి. అది సరికాదు” అన్నారు (పుట 206).

అంటే వీరు భక్తిని రసముగా పరిగణించడం లేదు కానీ స్థాయిభావంగా పరిగణిస్తున్నారు. ఇది ఇతర ఆలంకారికులు చెప్పినదానికి భిన్నంగా ఉంది. భక్తిని రసముగా ఒప్పుకోని ఇతర ఆలంకారికులు దానిని సంచారిభావమన్నారు కాని స్థాయిభావమని అనలేదు. భక్తి రసము కాదు కానీ స్థాయిభావమని అనడంలో సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది.

అంతేకాదు వీరే మరలా స్థాయిభావములను వివరిస్తున్నపుడు ఇచ్చిన సూత్రములో “స్త్రీపురుషులకుఁ బరస్పరము ఆలంబనమైన చిత్తవృత్తి విశేషమైన ప్రేమ రతియను స్థాయిభావమనఁబడును. గురు దేవతా పుత్రాదులు ఆలంబనముగాఁ గల ప్రేమము వ్యభిచారి అనఁ బడును” అని చెప్పారు (పుట 209).

ఇక శాంతరసానికి వీరిచ్చిన ఉదాహరణలను ఆ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను గమనించవలసి ఉన్నది. శాంత రసానికి ఉదాహరణగా రెండు పద్యాలను ఇచ్చారు వీరు.

కనబడి నీటిలోని బుడగంబలె వెంటనె రమ్యమైన యౌ
వనము నశించు నిప్పటికి వచ్చిన దుర్లభ మర్త్య జన్మమున్
గనియును నాత్మ సద్గతిని గోరి యెవండు భజింపఁడీశు ద
న్మనుజుని జీవితమ్ము పతితమ్ము హతమ్ము మృతమ్ము సుమ్మికన్ (పుట 216)

మలయ మారుతముల హలాహల విషాల
ప్రమద ముంగురులను పాము పడగలందు
స్వపచునందును మది మహాజ్ఞానియందు
నాస్థితి సమమై పరమాత్మునందు నిలిచె (పుట 217)

ఇక్కడ గణపతిశాస్త్రిగారు శాంతరసమునకు ఉదాహరణలుగా పైన చూపిన రెండు పద్యాలనూ చెప్పవచ్చును కాని ఈ క్రింది పద్యాన్ని చెప్పరాదంటారు.

చెలఁగి గంగా పులిన మధిష్టించి కనులు
మూసికొని విషయంబులు పోవ, నెపుడు
లోఁదమము తఱిమి మధురలోన చిత్తు
నందు నవఘనాబ్ద రుచిన్ లయంబు గాంతు (పుట 217)

ఎందుకంటే ఇక్కడ గంగానది, విషయములు మొదలైన ఆలంబనములతో, కనులు మూసుకొనడం వంటి అనుభావాలతో నిర్వేదం ప్రతీతమవుతున్నా, అది శ్రీకృష్ణునిపై రతిలో గుణీభూతమవుతున్నది కనుక ఇక్కడ శాంతరసాన్ని చెప్పలేమని, ఇక్కడ భగవద్భక్తికే ప్రాధాన్యమనీ అంటారు గణపతి శాస్త్రిగారు. ఈ పద్యాలలో ఉన్నది ఏ రసము అన్న విషయాన్ని ప్రక్కకు పెడితే, మొదటి రెండు పద్యాలూ రసానుభూతికి ఉదాహరణలనీ మూడవది భావం మాత్రమేననీ వ్యాఖ్యానించడమే చర్చించవలసిన విషయం. ఎందుకంటే ఈ వ్యాఖ్యకు ఆధారమేమీ చూపబడలేదు. మొదటి రెండు పద్యాలనూ “రసము”గాను, మూడవపద్యాన్ని “భావము” గాను ఎందుకు పరిగణించాలన్న విషయానికి ఒప్పించగల వివరణ లేదు.

నిర్వేదమనే వ్యభిచారిభావానికి సూత్రాన్నీ ఉదాహరణనూ ఇస్తున్నపుడు కూడా వీరు నిత్యానిత్య వివేక జన్యము కాని నిర్వేదానికి శాంతరస వ్యవహారం ఉండదనీ అపుడది వ్యభిచారి అవుతుందనీ సూచిస్తూ అక్కడ “దేవాది విషయిక రతికి ఉదాహరణ” అంటూ ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.

ధనమున్ గోరను గోర ధర్మమును తత్తద్భోగముల్ గోర నే
మును గావించిన కర్మకుందగు ఫలమ్మొక్కండ యౌఁ గాక పా
వనమౌ నీ పదపద్మముల్ గొలుచు సద్భక్తిన్ ప్రసాదించుటే
నిను జన్మాంతర మందు నైనను మదిన్ నేఁ గోరు కోర్కెల్ ప్రభూ (పుట 244)

ఈ పద్యంలో “భగవంతుని యందు అత్యంతానురాగము వ్యక్తమగుచున్నది” కాబట్టి ఇందులో కనబడే నిర్వేదాన్ని సంచారిభావంగా పేర్కొన్నారు.

నిజానికి భక్తికి సంబంధించిన పద్యాన్ని శాంత రసానికి ఉదాహరణగా ఇవ్వరాదనడం జగన్నాథ పండితరాయలననుసరించి చెప్పిన అంశం. పండితరాయల ప్రకారం భక్తిని శాంతంలో అంతర్భవింపచేయకూడదు. అయితే, పండితరాయలు భక్తి యొక్క రసపరిణతిని కొంతవరకు సమర్థించి భరతుడిని అతిక్రమించకూడదన్న కారణంతో మాత్రమే చివరికి ఆ చర్చను వదిలేశాడు. కాబట్టి అక్కడ భక్తికి సంబంధించిన పద్యాన్ని శాంతానికి ఉదాహరణగా ఇవ్వరాదనడం, భక్తి విషయంలో నిర్వేదం సంచారి భావమవుతుందనడం వంటి విషయాలు స్పష్టంగానే ఉంటాయి. కానీ ఈ గ్రంథంలో భక్తిరసాన్ని సమర్థించలేదు. భావంగానే పేర్కొన్నారు. అటువంటపుడు శాంతరసానికి స్థాయిభావమైన నిర్వేదాన్ని సంచారిగా చేసుకోగలిగిన భక్తికి రసప్రతిపత్తిని నిరాకరించడం సబబేనా అన్న ప్రశ్న వస్తుంది.

విభిన్న సంస్కృతాలంకారికులు చెప్పిన విషయాలన్నిటినీ కలిపి ఒకచోట చెప్తున్నపుడు ఆలంకారికులు చూడవలసినంత సమగ్రదృష్టితో చూడలేదనీ, మరిముఖ్యంగా భక్తిని గురించి ఆలోచించవలసినంత లోతుగా ఆలోచించలేదనీ ఇటువంటి వైరుధ్యాలను గమనించినపుడు అర్థమవుతుంది.

2.1.16 నండూరి రామకృష్ణమాచార్య

రామకృష్ణమాచార్య గారు కావ్యాలోకము అనే తమ గ్రంథంలో కావ్య ప్రయోజనాలు, హేతువులు, భేదాలు, ఆలంకారికులు చెప్పిన వివిధ సిద్ధాంతాలు, అలంకారాలు, ఛందస్సు మొదలైన విషయాలనన్నిటినీ వివరించారు. రససిద్ధాంతం అనే అధ్యాయంలో రససంఖ్యను గురించి చర్చించారు.

రససంఖ్యను గురించిన చర్చ “అనంతా వై రసాః” అన్న మాటతోనే మొదలుపెట్టారు. “రసములు అనంతములు. యథార్థమునకు ప్రతి భావమును రసమే. ప్రతిరసమును ప్రాథమికదశలో భావమే” అన్నారు (పుట 63). బీజము ఎలా క్రమంగా మహావృక్షమవుతుందో అలాగే భావము రసముగా పరిణతి చెందుతుందన్నారు. భావహీనమైన రసము గాని, రసవర్జితమైన భావము కానీ ఉండదన్న నాట్యశాస్త్రంలోని వ్యాఖ్యనూ పేర్కొన్నారు.

ఇదంతా చెప్పాక, అయినా అన్ని భావాలకూ నిలదొక్కుకుని రసముగా పరిణమించే శక్తి ఉండదనీ, అందుచేతనే అనంతాలైన రసాలలో కొన్నిటికే ప్రాముఖ్యం లభించిందనీ అంటూ భరతుడి నుంచి భానుదత్తుడి వరకూ వచ్చిన వివిధ ప్రతిపాదనలను తెలియచేశారు. రూపగోస్వామి, మధుసూదన సరస్వతి భక్తిని రసముగా పేర్కొన్న విషయాన్ని కూడా తెలియచేశారు.

ఇలా రెండు మాటలూ చెప్పడంలో – రసములు అనంతములు అంటూనే మళ్ళీ అన్ని భావాలకూ రసములుగా పరిణమించే శక్తి లేదనడంలో – కొంత వైరుధ్యమూ అస్పష్టతా ఉన్నాయని అనిపిస్తుంది. కానీ చివరికి తాను చేసిన వ్యాఖ్యలో రామకృష్ణమాచార్య గారు ఆ అస్పష్టతను తొలగించారు.

ఆలంకారికుల వాదములన్నీ సమీక్షించిన పిమ్మట సారాంశముగా తీసుకోవలసిన విషయం అంటూ తన అభిప్రాయాన్ని స్పష్ట్తంగా చెప్పారు. “రసములనంతములైనను, అందు కొన్ని రసభావములు మాత్రమే స్థాయిభావములుగ నిలబడి రసప్రతీతి కల్పించును. అన్ని భావములకు రససిద్ది లేదు. కాని, యే భావమైనను, కవి సామర్థ్యము వలన రససిద్ది గాంచవచ్చును. ఇది సహృదయ హృదయైకవేద్యము” అన్నారు (పుట 64). కవి సమర్థుడైనచో ఏ భావమునకైనను రససిద్ధి కలుగవచ్చుననీ ‘న భావో రసవర్జితః’ అన్న మాట సత్యమనీ చెప్తూ చర్చ ముగించారు.

2.1.17 మొవ్వ దాశరథి సూరి

వీరు తమ కావ్యకళ అనే గ్రంథంలో నవరసములను పేర్కొని ఒక్కొక్క రసమునకు ఒక్కొక్క భాగము కేటాయించి ఆ రసమునకు సంబంధించిన విభావానుభావ సంచారిభావాలను అర్థం చేసే విధంగా లక్ష్యాలను రచించారు. శాంతరసమును వివరించే భాగానికి వీరుంచిన శీర్షిక దైవదర్శనము. ఇది ఉత్తమపురుషలో నడిచే కథనం. కొంత గద్యం కొంత పద్యం.

శాస్త్ర పఠనార్ధం తాను నాలుగు సంవత్సరాల పాటు రేయింబవళ్ళు కష్టపడటం, ఆపైన శరీరం రోగార్తమై బాధనొందడం, వైద్యులు చెప్పిన మందులన్నీ తెప్పించి సేవించినా ఆరోగ్యం బాగుపడకుండా రెండేళ్ళు బాధపడడం – ఇలా మొదలు పెడతాడు కథకుడు తన కథని (పుట 145). ఏమి చేయాలో అర్థం కాకపోవడం, తనను కాపాడేవారెవ్వరో అని బాధపడడం, లౌకిక విషయ చర్చలపై క్రమంగా విముఖత కలగడం, శాస్త్రాలన్నీ అభ్యసించి ఏదో లోకాలన్నీ తలక్రిందులు చేద్దామనుకున్న మనసుకు మెల్లగా సర్వమూ శూన్యంగా దోచడం వంటివి ఆ తర్వాతి పరిణామాలు.

అప్పుడు అలా ఆహారము మాని మనోవ్యధతో కుమిలి పోతున్న కథకుడిని అతడి తండ్రి “ఎందుకీ దైన్యం, మనకుఁ దోడయి నిత్యము బ్రోవ వేణుగోపాలుఁడు లేఁడె, నీకొక విపత్తు జనింప నతడు సైచునే” అని ఓదారుస్తాడు (పుట 146). కాలం బాగాలేక రోగము వచ్చిందనీ ఆపదలు ఎల్లకాలం ఇల్లు కట్టుకుని ఉండవనీ చెప్తాడు. భగవత్ప్రార్థనతో రోగములను నయం చేసుకున్న మయూరుని వంటివారి కథలు చెప్పి “భగవత్ప్రసాదలబ్ధంబైన నీ వాక్కు జగన్నాథు నుతికి వినియోగింపు” అని బోధిస్తాడు (పుట 147). ఇలవేలుపయిన వేంకటగిరినాథుని ఒకసారి సేవించిరమ్మని సూచిస్తాడు.

ఆమాటలు అపుడు అంతగా నచ్చక పోయినా తండ్రి మాట కాదనలేక కథకుడు బయల్దేరడం, తిరుపతి చేరడం, తిరుమల కొండనెక్కడం, ఆ వాతావరణం అంతా చక్కగా వివరిస్తారు. అక్కడినుంచి రచన భక్తి ప్రధానంగా సాగుతుంది.

తిరుమల కొండ ఎక్కుతున్నపుడు లక్షలాది యాత్రికుల ప్రయాణాన్ని ప్రార్థనను వర్ణిస్తూ

ఏడుకొండలవాడ! కాపాడువాడ!
నిలువుదోపుల వాడ! నాణెములవాడ!
వడ్డికాసుల వాడ! బ్రోవవెయటన్న
నులివునకు నగేంద్ర మెదురు పలుకుచుండె (పుట 151).

అంటారు. సూర్యాస్తమయాన్ని వర్ణించేటపుడు వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్తున్న భక్తులను జూచి తనకు ఆ భాగ్యం లేదే అన్న సిగ్గుతో సూర్యుడు క్రుంకాడంటారు. “భగవత్ప్రాప్తికి ప్రయత్నించువారికి సాంసారికచ్చిద్రంబుల వలె మసక చీఁకటులు మమ్మావరించె. భగవానుని యకారణకరుణావలోకనంబుల పోల్కి నింతలో మార్గంబు పొడవున నొక్కసారిగా విద్యుద్దీపంబులు భాసించె” (పుట 153) – ఈ విధమైన వర్ణనలు ఉంటాయి.

ఆ తర్వాత తిరుమల చేరడం, అక్కడి వాతావరణం, స్వామిని దర్శించుకోవడం, చక్కటి స్తోత్రాలతో స్తుతించడం వనజనిలయా కళత్రుడు పావన చరిత్రుడు అయిన వేంకట నాథదేవుని “సాంద్రహర్షాంబు పూరముల్ జాలువాఱఁ గాంచి పులకించి వినుతించి కాన్కలుంచి” తిరిగిరావడం – ఈ రకంగా సాగుతుంది కథ(పుట 159). దైవదర్శనంతో రోగబాధ నుంచి విముక్తుడైన కథకుడు జనులపై అవ్యాజమైన కరుణ చూపే ఆ పద్మావతీప్రియుని స్మరిస్తుండడంతో ముగుస్తుంది.

శాంతరసానికి లక్ష్యంగా వీరు చూపిన ఈ కథనాన్ని చూస్తే నిర్వేదము తత్త్వజ్ఞానముల వంటి భావాలతో పాటు వాటి కన్నా ఎక్కువగా భక్తికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం కనిపిస్తుంది. దీనిని గమనించినపుడు, శాంతరస పోషణకు భక్తి అనివార్యమా! భక్తే ప్రధానమా! భక్తితో సంబంధం లేకుండా శాంతరస పోషణ చేసిన కావ్యాలు ఉన్నాయా! అన్న ప్రశ్నలు వస్తాయి.

2.2 సారాంశము

బులుసు వెంకటరమణయ్య గారి ఆంధ్రాలంకారవాఙ్మయచరిత్ర, తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి “రససిద్ధాంతము-ఆంధ్రులవరివస్య” వంటి గ్రంథాల ఆధారంగా తెలుగులో వచ్చిన అలంకార శాస్త్ర గ్రంథాలను గుర్తించడం జరిగింది. కావ్యాలకారసంగ్రహం పీఠికలో సూర్యనారాయణశాస్త్రిగారు కూడా ఆంధ్రభాషలోని అలంకారశాస్త్రగ్రంథాల జాబితా ఇచ్చారు. ఈ మూడు గ్రంథాలలో పేర్కొన్న అలంకారశాస్త్ర గ్రంథాలలో ఛందస్సుకు, అలంకారములకు మాత్రమే పరిమితమయిన వాటిని వదిలి రసవిషయములను చర్చించిన గ్రంథాలన్నింటినీ సేకరించి పరిశీలించడం జరిగింది.

ఆంధ్రగ్రంథాలలో కొత్తగాను, సంస్కృతగ్రంథాల కన్నా అధికంగాను చేర్చిన ప్రతిపాదనలేమీ లేక పోయినప్పటికీ, వీటిలో లక్షణములతో పాటు లక్ష్యములను చూపే పద్యములు కూడా ఉండడం వలన వివిధ రసముల పట్ల ఆలంకారికుల అవగాహనని అర్థం చేసుకునే అవకాశం లభించింది.

ఈ అధ్యాయంలో గమనించిన అంశాలను ఇక్కడ క్లుప్తంగా పేర్కొంటున్నాను.

(సశేషం)

Exit mobile version