Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-1

[డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

1వ అధ్యాయం – ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం:

1.1 1857 తిరుగుబాటు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామమా?

సృష్టి ప్రారంభం నుండి పరిశీలించినట్లయితే ఒక జాతి మరొక జాతిని, ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని జయించి సామ్రాజ్యాలు స్థాపించటం జరిగింది. అంటే బలవంతులు బలహీనులను బానిసలుగా చేయటం ప్రపంచ చరిత్రలో కనిపిస్తుంది. అయితే మానవుడు స్వతంత్రంగా జీవించాలని తపన పడతాడు. మనిషి సమాజంలో తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకొని పురొభివృద్ధి చెందటానికి ప్రయత్నిస్తాడు. స్వాతంత్ర్యం తన జన్మహక్కని జీవమున్న ప్రతి జీవి ఆశిస్తుంది. ఇది సృష్ఠి ధర్మము. స్వేచ్ఛలేని స్వర్గం కంటే నరకమే మేలని మిల్టన్‌ మహాయుడు చెప్పడంలో పరమార్థమిదే.

“ఎచ్చట మనస్సు నిర్భయంగా ఉండగలదో ఎచ్చట మనిషి ఆత్మవిశ్వాసంతో తలయెత్తుకు తిరగగలడో, ఎచ్చట జ్ఞానానికి ఎటువంటి ఆటంకములేదో అదే స్వేచ్ఛ” అంటూ రవీంద్రుడు చక్కగా అభివర్ణించాడు. ఒక సామాజిక వ్యవస్థ తనదైన నిర్మితంకాదు. మనవ నిర్మితం మానవుల కాంక్ష – అభీష్టాల మేరకు దాన్ని మార్చడానికి వీలున్నదనే దృక్పథమే ఉద్యమాలను సాగిస్తున్నది. ఏ జాతీ తన చరిత్రలోని ఉజ్వల ఘట్టాలను విస్మరించజాలదు. అట్లు విస్వరించజాలని ఘట్టాలలో 1857 స్వరాజ్య సంగ్రామం మొదటిది. అది 1857లో జరిగింది. కేవలం “సిపాయిల పితూరి” అని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు, వారి కొమ్ముకాసే విదేశీ చరిత్రకారులు ప్రచారం చేశారు. కాని అది ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామమని అర్ధశతాబ్ది తరువాత వీరసావర్కర్‌ అనే పాతికేళ్ల దేశభక్తుడు తన ప్రసిద్ధ గ్రంథంలో లోకానికి చాటాడు. The Indian War of Independence 1857. సంఘర్షణ ఉధృతంగా సాగుతూ బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గజగజ వణికిస్తున్న రొజుల్లోనే.. జగద్విఖ్యాతి ఆంగ్ల రాజనీతిజ్ఞుడు డిస్రేలి (1857 జులై 27న) కామన్స్‌ సభలో ప్రసంగిస్తూ.. అది Military Mutiny (సైనిక తిరుగుబాటు) కాదు.. National Revolt (జాతీయ విప్లవం) అని ఘంటాపథంగా చాటాడు. “అది స్వదేశాభిమానం బోత్తిగా లేని, స్వార్ధ పూరితమైన సిపాయిల తిరుగుబాటు. దానికి దేశముల నాయకత్వము కాదు. ప్రజల మద్దుతూ లేదు” అని సర్‌జాన్‌ సీలే లాంటి వారన్నారు.

“The So Called First National War or Independence of 1857 is neither first nor national, nor a war of Independence. మొదటిది జాతీయ స్వతంత్ర యుద్ధం అని చెప్పబడింది. మొదటిది కాదు. జాతీయమూ కాదు. స్వాతంత్య్ర యుద్ధమూ కాదు అని మూడు ముక్కల్లో కోట్టి పారేశాడు. “The Holy War is Against the English, I have forbidden it against the Hindus” పవిత్ర యుద్ధం ఆంగ్లేయుల మీద హిందువులకు వ్యతిరేకంగా దానిని సాగించటానికి వీల్లేదు. స్వధర్మాన్ని, స్వరాజ్యమును సంరక్షించుకోటానికి మాత్రమే ఈ సంగ్రామం ప్రారంభమైనది. అందుకే ఇది స్వతంత్ర మహాసంగ్రామం అని బహదూర్‌షా కరాఖండిగా ప్రకటించాడు.

1857లో బ్రిటిష్‌ ప్రభుత్వంపై భారతీయులు లేవదీసి సాగించిన తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అని పేర్కొనవచ్చు. 1858 జున్‌ 7న బ్రిటిష్‌ పార్లమెంట్‌లో డ్రమ్మాండ్‌ ఈ సమరాన్ని ఈ విధంగా వర్ణించాడు. “భారతదేశ ప్రజలు బ్రిటిష్‌ ప్రభుత్వం మీద అసంతృప్తి చెంది ఉన్నారు, ఆ అసంతృప్తి ఎంతటిదంటే అరడజను విప్లవాలకు కావసినంత”. 1857లో జరిగినది కేవలము ఒక సైనిక తిరుగుబాటు కాదు. ఆంగ్ల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక మహా సమరమిది. కాశ్మీరు నుండి కన్యాకుమారి దాక యావత్‌ దేశమంతా జరిగిన ఒక మహా సంగ్రామం. లక్షలాది మంది సిపాయిలు తెల్లవారి కుత్తుకలు ఖండించటానికి తమ కత్తులు తీసిన సంగ్రామం.

నానాసాహిబ్‌ పేష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, కుమార్‌ సింగ్‌, బేగం హజ్రత్‌ మహాల్‌, మౌల్వీ అహ్మదుల్లాషా, వజీద్‌ ఆలీషా వంటి ఆనాటి వీరులు మాతృభూమి స్వతంత్ర్యం కోసం రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఎదురొడ్డి సలిపిన పోరాటమిది. తాంత్యాతోపే, టిక్కాసింగ్‌, ఖాన్‌ బహద్ధూర్‌ఖాన్‌, మాన్‌ సింగ్‌ వంటి సేనానులు బ్రిటిష్‌ వారిని ముప్పుతిప్పలు పెట్టిన జాతీయ సంగ్రామమిది. ఒకటిన్నర సంవత్సరం పాటు జరిగిన ఈ యుద్ధంలో సుమారు రెండు లక్షల మంది సైనికులు, నూరు లక్షలమంది సామాన్య ప్రజలు చనిపోయరు. భారత స్వతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఇన్ని లక్షల మంది బలిదానమయిన సందర్భము ఇది మాత్రమే. కాబట్టి 1857 తిరుగుబాటు ముమ్మాటికి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామమే. దీనిని 1857 తిరుగుబాటు లేదా ‘సిపాయిల పితూరి’ అని బ్రిటిష్‌ వారు పేర్కొనగా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమని భారతీయులు వర్ణించారు.

1.2. 1857 తిరుగుబాటుకు గల మూల కారణాలు:

భారతదేశంపై విజయం సాధించడంలో బ్రిటిష్‌ వారనుసరించిన చివరి విధానం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని లార్డ్‌ డల్హౌసీ ఎలాంటి మినహాయింపు లేకుండా వర్తింపజేశాడు. ఈ సిద్ధాంతం ప్రకారం రక్షిత రాజ్యపాలకుడు సహజమైన వారసుడు లేకుండా మరణించినప్పుడు అతని రాజ్యాన్ని దత్తు చేసుకున్న వారసుడికి స్వాధీనం చేయకుండా బ్రిటిష్‌ ఇండియాకు స్వాధీనం చేయవలసి ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి 1848లో సతారాను 1850లో నాగపూర్‌, ఝాన్సీలను బ్రిటిష్‌ ఇండియాకు స్వాధీనం చేయడమైనది. పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్‌ పీష్వాకిచ్చే ఫించెన్‌ను తిరస్కరించడమైనది. ఆంగ్లేయులు కర్ణాటక నవాబుకు చెల్లిస్తూ వచ్చిన ఫించన్‌ను కర్ణాటక నవాబు మరణించిన తరువాత అతని బంధువులకు చెల్లించలేదు. అవధ్‌ చివరి నవాబైన వజీద్‌ ఆలీషాను 1856లో దుష్పరిపాలన అనే సాకుతో తప్పనిసరిగా పదవి నుండి తొలగించి అవధ్‌ను బ్రిటిష్‌ ఇండియాలో విలీనం చేయడమైనది. ఆ తరువాత జరిగిన క్రమంలో భారతీయ సిపాయిలను హీనంగా చూడడం, తక్కువ జీతాలు ఇవ్వడం వలన వారిలో చాలాకాలంగా అసంతృప్తి ప్రబలుతూ వచ్చింది.

యూరోపియన్‌ సైనికులకిచ్చే జీతాలతో పోలిస్తే భారతీయుల సైనికులకు ఇచ్చే జీతం చాలా తక్కువ. భారతీయ సిపాయిల కిచ్చే పదోన్నతి అవకాశాలు చాలా పరిమితం. ఈ విషయాలపై అసంతృప్తి చెందిన భారతీయ సైనికులు 1857 కు ముందు 13 ఏండ్ల కాలంలో నాలుగు పర్యాయాలు తిరుగుబాటు చేశారు. అవుధ్‌ సంస్థానాన్ని స్వాధీనం పరుచుకొని భూమిశిస్తు విపరీతంగా పెంచడం, సైన్యాన్ని రద్దు చేయడం మొదలైన చర్యలు భారతీయ ప్రజలకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయి. లార్డ్‌ కానింగ్‌ చేసిన చర్యల వల్ల విదేశాల్లో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చట్టం చేయడం జరిగింది. దీనివల్ల బ్రాహ్మణ, రాజపుత్ర సైనికులు సముద్రయానం వల్ల తమ జాతిని కోల్పోతామేమోనని తీవ్ర మనస్తాపానానికి గురయ్యారు. అంతేకాకుండా ఆవుకొవ్వు, పందికొవ్వు పూసిన తూటాలను ప్రయోగించమనడం, హిందూ, ముస్లిం సిపాయిలకు కంటగింపయింది. సతీ సహగమన నిషేధం, బాల్య వివాహాలు రద్దు చేయడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, పాశ్చాత్య విద్యను అభివృద్ధిపరచడం, రైళ్ళను, తంతితపాలాను ప్రవేశపెట్టడం, 1856లో చేసిన చట్టం ద్వారా క్రైస్తవ మతం తీసుకొన్న వారికి పౌర హక్కుల రక్షణ కల్పించడం, హిందూ సంఘాన్ని క్రైస్తవ మత ప్రచారకులు తమ మత మార్పిడికి అనుకూలంగా మార్చుకొనే విధానము, పురోహితులు, పండితులు, మౌల్వీలు జీవనాధారం కోల్పోవడం మొదలైన అంశాలన్నీ సనాతన సంప్రదాయవాదుల కోపానికి కారణమయ్యాయి.

1857 మే 10న మీరట్‌లో మొదలై అదే ప్రదేశానికి పరిమితం కాకుండా ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలకు పాకింది. సిపాయిల పితూరీగా ప్రారంభమైన ఈ తిరుగుబాటు ఒక విప్లవ సమరంగా మారిపోయింది. అయోధ్య, రోహిల్‌ఖండ్‌, బుందేల్‌ఖండ్‌, మధ్యభారత బీహార్‌, ఢిల్లీ, తూర్పు పంజాబ్‌ తిరుగుబాటు పరిధిలోకి వచ్చాయి. అదే విధంగా రాజస్థాన్‌, మహారాష్ట్ర, హైదరాబాద్‌, బెంగాల్‌లో స్థానిక తిరుగుబాట్లు చెలరేగాయి. ఉత్తరమధ్య భారతంలో ప్రతీచోట సిపాయిల తిరుగుబాట్లను ప్రజలే ఆయుధాలు ధరించి తిరగబడ్డారు. రైతాంగం, చేతివృత్తివారు మూకుమ్మడిగా తిరుగుబాట్లో చేరారు. హిందూ-ముస్లిం ఐక్యత సహకారస్ఫూర్తి కనిపిస్తుంది. మొత్తం దేశమంతా తిరుగుబాట్లో పాల్గొన్నప్పటికి మొదటిసారిగా బ్రిటిష్‌వారిపై సంఘటిత వ్యతిరేకత పెల్లుబికింది.

1.3 తెల్లవారి దోపిడీ-సిపాయిల అగచాట్లు

ఇంగ్లీషువాడు మహాగొప్పవాడు. అతడు పుట్టడమే ఒకానొక అద్భుత శక్తితో పుట్టి ప్రపంచానికి తానే ప్రభువుననుకొంటాడు. తనకేదైనా కావలసి వస్తే అది తనకు కావాలని చస్తే అనుకోడు. అది ఎవరికి దగ్గరౌతూ ఉన్నదో వారిని జయించి దానిని వశపరచుకోవడం అతని నైతిక విధి, పవిత్ర కర్తవ్యం అని అతడి బుద్ధికి స్ఫురిస్తుంది. చేసేది మంచా, చెడా అని అతడు చూడడు. దేశభక్తి సూత్రంతో పోరాడుతాడు. వ్యాపార సూత్రంతో దోచుకుంటాడు. సామ్రాజ్య సూత్రంతో బానిస చేస్తాడు. పౌరుష సూత్రంతో దౌర్జన్యం చేస్తాడు. విధేయత సూత్రంతో రాజును కొలుస్తాడు. రిపబ్లికన్‌ సూత్రంతో అదే రాజు తల తీస్తాడు. The Man of Destiny గ్రంథంలో జార్జి బెర్నాండ్‌షా గొప్పగా చిత్రించిన ఆంగ్లేయుడి నైజానికి లార్డ్‌ డల్హౌసీ నిలువెత్తు ఉదాహరణ.

ఆంగ్లేయులు దుర్మార్గులు, దురాక్రమణదారులు. 1757 ప్లాసీ యుద్ధం తరువాత నుండి వర్తకం కొరకు మన దేశంలో అడుగుపెట్టి ప్రజలను, పాలకులను వంచించి దేశాన్ని థల వారిగా దొంగదారిన కబళించి సమాజంలోని అన్ని వర్గాల వారిని నానా అగచాట్లకు, అవమానాలకు గురిచేసిన సంగతి యథార్థమే. బ్రిటిష్‌వారు మనదేశంలో అడుగుపెట్టే నాటికి ఏ గ్రామానికి ఆ గ్రామం వ్యవసాయంతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండేది. పట్టణాలు సిరిసంపదలతో తులతూగుతూ ఉండేది. దొరల దేశాలకు కావలసినంత తిండి, బట్ట, విలాస వస్తువులు, రత్నాభరణాలను ఎగుమతి చేయగల ఉచ్చస్థితిలో మనదేశం ఉంది. కసాయి తెల్లవారి కొద్ది థాబ్ధాల పాలనలోనే దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వివిధ రంగాలవారు చితికిపోయి పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచంలోకెల్లా సంపన్న దేశాన్ని ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాల సరసకు అతి తక్కువ వ్యవధిలో జయప్రదంగా దిగజార్చారు. ఉదాహరణకు దొరల ముందు భారతీయులు ఎలా మెలగాలన్న దానిపై ఆగ్రా మెజిస్ట్రేట్‌ చేసిన ఉత్తర్వులు చూడండి. “చెప్పుకొనే హోదా ఏమైనప్పటికి ఈ దేశస్థుడు ప్రతీవాడు ఇంగ్లీషు జంటిల్‌మెన్‌లందరికి వీధిలో కనబడగానే సలాం చేసి తీరాలి. ఆ సమయంలో సదరు దేశీయుడు గుఱ్ఱంమీద బండిలోనే ఉంటే దిగి యూరోపియన్లు తనను దాటి వెళ్లేంతవరకు గౌరవ పూర్వకంగా ఒదిగి నిలబడాలి. అలా చేయని వారు కఠినంగా శిక్షింపబడుదురు.” ఈ విధంగా యావత్‌ దేశాన్ని కబళించే ప్రయత్నంలో చెయ్యని మోసం లేదు.

భారతజాతి ఆ కాలంలో ఎటువంటి అవమానకర పరిస్థితులలో ఎంత హీనంగా బతకవలసి వచ్చిందో వేరే చెప్పనక్కరలేదు. తెల్లదొరల ఇళ్ళలో పనిచేసే పనివారి పరిస్థితి ఇంకా దయనీయం. అమానుషమైన చావుదెబ్బలు, తిట్లు, రోజువారీ రివాజులు తమపై అధికారి తమను నిలువుగా చీల్చినా చెప్పుకోవడానికి దిక్కులేదు. “హోటల్లో, రైళ్లలో తెల్లవారి సరసన మనం కూర్చోడానికి వీల్లేదు. అసలు వారు ఎక్కిన పెట్టెలోనే ఎక్కడానికి వీలులేదు. పొరపాటున ఎక్కితే కదిలే రైళ్లోంచి గార్డులచే తోయించేవారు. రైళ్లోంచి తాము ఈ దేశపు పౌరులను తన్ని, తరిమివేసేవారమని ఘనముగా తమ తమ డైరీల్లో రాసుకొన్నారు. తుపాకీ గొట్టం గురిపెట్టి గౌరవనీయులైన పెద్దమనుషుల చేతనే  నీచాతినీచమైన పనులు చేయించుకొనేవారు. కుక్కలకి, భారతీయులకి హోటల్లో చోటు లేదు” అని బోర్డులు తగిలించేవారు. తెల్లవాడు వ్యాహ్యాళికి వెళ్లే గార్డెన్‌లోని స్వదేశీయులు వెళ్లరాదు. ఎవరైనా పెద్ద మనుషులు ఒకవేళ వెళ్లినా స్వదేశ దుస్తులతో వెళ్లరాదు. తోటి మనుషులమీద, భారతీయుల మీద ఆ కరుణామయుల కరుణ ఎంత భయంకరంగా ఉండేది. విఖ్యాత ఆంగ్ల చరిత్రకారుడు Sir John Kaye మాటల్లో చదవండి “Under a guard of Rifles and Carabineers, the Eighty-five were then brought forward, clad in their regimental uniforms soldiers still; and then the sentence was read aloud, which was to convert soldiers into felons. Their accoutrements were taken from them, and their uniforms were stripped from their backs. Then the armourers and the smiths came forward with their shackles and their tools, and soon in the presence of that great concourse of their old comrades, the Eighty-five stood, with the outward symbols of their dire disgrace fastened upon them.. Lifting up their hands and lifting up their voices, the prisoners implored the General to have mercy upon them.. There was not a Sepoy present who did not feel the rising indignation in his throat.”

(రైఫిళ్లు, పొట్టి తుపాకుల దళాలు కాపుకాస్తుండగా ఎనభై ఐదుగురినీ ముందుకు తెచ్చారు. అప్పటికి వారు ఇంకా సోల్జర్లే. రెజిమెంటు యూనిఫాం వేసుకుని ఉన్నారు. వారికి విధించిన శిక్షను అప్పుడు బిగ్గరగా చదివి వారికి వినిపించాడు. సైనికులు కాస్తా నేరస్థులు అయిపోయారు. వారినుంచి సైనిక చిహ్నాలు లాగేశారు. వొంటి మీది యూనిఫాంలను విప్పించారు. బేడీలను, కొక్కేలను, పనిముట్లను పట్టుకుని కమ్మరి పనివాళ్లు వచ్చారు. సహచరుల మహా సమూహం సమక్షంలో తమ కాళ్లకూ చేతులకూ అవమాన చిహ్నాల బంధనాలు పడుతుండగా చేతులెత్తి ఆ ఎనభై ఐదుగురూ గొంతెత్తి దయ చూపమంటూ జనరల్‌ను కడుదీనంగా వేడుకున్నారు.. అప్పుడక్కడ ఉన్నవారిలో గొంతు నిండా క్రోధం రగలని సిపాయి ఒక్కడూ లేడు.)

సిపాయిలలో అలజడి మొదలైంది. కంపెనీ కోసం పోరాడేది మనం. యుద్ధంలో చనిపోయేది మనం. యుద్ధంలో క్షతగాత్రులైతే కంపెనీ ఆదుకోదు. ఇంత యుద్ధం చేసి ఇన్ని తుపాకులు పేల్చేది ఎవరి మీద? మన ప్రజలు, మనరాజుల మీదనే. దానికి ప్రతిఫలం ఏమిటి? ఆంగ్లేయులకు అధికారం, భారతీయ సిపాయిలకు ‘కోర్టుమార్షల్‌’, సీతారామ్‌ అనే సిపాయి తన ఆత్మకథలో ఇలా వ్రాశాడు. “యూరోపియన్‌ అధికారికి 16 రూపాయలు లంచమివ్వని కారణంగా పెరేడ్‌లో ప్రతిరోజు కొట్టేవాడు”. ప్రతిరోజు మనసును గాయపరచే తిట్లు చివాట్లు ఎంత కాలం ఈ దౌర్జన్యాలను భరించాలి. సిపాయిలందరిలో ఆవేదన మొదలైంది.

ఈ రకమైన భావావేశంతో యువ సిపాయిలు లోలోన దహించుకుపోతుండగా నిప్పుకు గాలి తోడైనట్టు ఎక్కడికి పోయినా ఎవరిని కలిసినా వారిని సాధారణ పౌరులు, సామాన్య గృహిణులు మాటల ఈటెలతో పొడవసాగారు. ఆఖరికి మీరట్‌లోని పడుపుగత్తెలు కూడా మీ వాళ్లని అలా ఖైదు చేస్తే మిన్నకున్నారేమి, మీకు మగతనం లేదా అని సిపాయిలను ఉడికించారు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి అని సిపాయిలు గుంపులు గుంపులుగా గుసగుసలాడుకున్నారు. ఎలా కదలాలి, కదిలి ఏమి చేయాలని తలపోస్తూ ఉద్వేగంతో, ఆందోళనలతో పరిపరి విధాల యోచిస్తుండగా తెల్లవారింది. భయానక బీభత్సానికి, భీషణ సంగ్రామానికి, చరిత్రను మలుపు తిప్పే మహా విప్లవానికి తెర తొలగింది. అది చరిత్రలో మరపురాని రోజు. 1857 మే 10.

1.4 తిరుగుబాటు విఫలమవడానికి గల కారణాలు:

1857 తిరుగుబాటు విఫలం కావటానికి అనేక కారణాలున్నాయి. పోరాటవాదులలో క్రమపద్ధతిగాని, ఐకమత్యంగాని లేకుండా పోయింది. వివిధ స్థలాలలో తిరుగుబాటు ప్రారంభమయింది. కాని అందరినీ ఒకే తాటిమీద నడిపించగల నాయకత్వం లేకపోయింది. రాణీ లక్ష్మీబాయి ఝాన్సీలోనూ, నానా సాహెబ్‌ కాన్ఫూరులోనూ పోరాటం సాగించారు. కాని వారందరూ కలసికట్టుగా పోరాటం సాగించలేదు. వీరందరి ప్రయత్నాలను సమన్వయపరచటం గాని, ఒకే దిశగా ఉపయోగించడం కానీ జరగలేదు. వివిధ కారణాలు వేరు వేరు కోరికలతో ఉండటం వలన, వారి లక్ష్యంతో ఏకాభిప్రాయం కొరవడింది.

ఈ ఉద్యమం పద్ధతి ప్రకారం కొనసాగలేదు. 1857 మే 31 న ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం కాకుండా అంతకంటే ముందు మే 10వ తేదీన ప్రారంభమయ్యింది. ఈ తిరుగుబాటులో దేశం మొత్తం పాల్గొనలేదు. ఉత్తరదేశంలో కూడా కొన్నిచోట్ల ఈ తిరుగుబాటు జరుగలేదు. ఇంగ్లీష్‌ సైన్యంలోని భారతీయులలో అధికభాగం (సిక్కులు, రాజపుత్రులు, గూర్కాలు) బ్రిటీష్‌ ప్రభుత్వంపై విశ్వాసం చూపి వారికి అనుకూలురుగా యుద్ధం చేసారు. ఆయుధాలు, ఆహార పదార్థాలు ఇంగ్లీష్‌ వారికి సమృద్ధిగా ఉండేవి. యుద్ధ సమయంలో టెలిగ్రాఫిక్‌ సౌకర్యాన్ని చక్కగా వినియోగించారు. ఇంగ్లీషు జనరల్స్‌ అయిన లారెన్స్‌, హావలాక్‌, నికల్సన్‌, ఎడ్వర్డ్స్‌ మొదలగువారు యుద్ధ శిక్షణలో ఆరితేరినవారు. తిరుగుబాటు నాయకులు సాహసవంతులైనప్పటికీ వారిలో సరైన యుద్ధ శిక్షణ కొరవడింది.

1.5 1857 తిరుగుబాటు పర్యవసానాలు:

ఈ తిరుగుబాటు కారణంగా బ్రిటిష్‌ వలస పాలనలో పెక్కు పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన అంతమైంది. భారతదేశ పరిపాలనను బ్రిటిష్‌ రాణి చేపట్టింది. బోర్డాఫ్‌ కంట్రోల్‌నూ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ను రద్దు చేయడమైంది. వాటి స్థానంలో 1858 ఉత్తమ భారత ప్రభుత్వ చట్టం ద్వారా సెక్రటరీ ఆఫ్‌ ది స్టేట్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. గవర్నర్‌ జనరల్స్‌ను బ్రిటష్‌‌ సామ్రాజ్యానికి చెందిన వైస్రాయ్‌లుగా పేర్కొనడమైంది. భారతీయ సైన్యం క్షుణ్ణంగా పునర్య్వవస్థీకరింపబడింది. యూరోపియన్‌ దళాలను పెంచి ఆయుధ భండాగారాన్ని వారికే అప్పగించడమైంది. నిర్ణయాత్మకమైన ఆక్రమణ, విలీనం విధానాన్ని వదలిపెట్టారు. భవిష్యత్తులో సంస్థానాలకు ఆక్రమించుకోవడం జరుగదని దత్తపుత్రులను కూడా వారసులుగా అంగీకరించడం జరుగుతుందని భారతీయ ప్రభువులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు పూర్తి మత స్వాతంత్ర్యం ఇచ్చారు. ప్రజల మత, సామాజిక జీవనంలో జోక్యం చేసుకోవడాన్ని నిలిపివేసారు. ఉన్నత పదవులనలంకరించడానికి అందరూ అర్హులే అని ప్రకటించారు గాని ఆ హామీని ఆచరణలో పెట్టలేదు. తిరుగుబాటు తర్వాత బ్రిటీష్‌‌వారు ‘విభజించి పాలించు’ అనే సూత్రాన్ని తమ పాలనలో ఆచరణలో పెట్టారు. తిరుగుబాటుకు ముస్లింల కుట్రే కారణమని 1857 నుండి 1885 వరకూ ఉద్యోగాలివ్వడం మొదలైన అంశాలలో హిందువులకే ప్రాముఖ్యం ఇచ్చి ముస్లింలను దూరంగా ఉంచారు.

భారతదేశపు రాజులలో ఐక్యత లేకపోవడంతో తిరుగుబాటు సఫలం కాలేదు. విదేశీ పాలకులకు భారతజాతి యావత్తు తలవంచి బానిసత్వంతో మగ్గారు. ఈ విధంగా మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో విజయాన్ని సాధించలేకపోయారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైనా నిరుత్సాహపడని భారతీయులు పట్టుదలతో స్వాతంత్ర్యోద్యమం సాగించి చివరకు విజయం సాధించారు. 1857లో సంగ్రామ సారధుల గురించి రెండవ అధ్యాయంలో వివరించడం జరిగినది.

1.6 భారతదేశములో 1857 తిరుగుబాటు కాలక్రమణిక

(సశేషం)

Exit mobile version